Varahamahapuranam-1    Chapters   

ఏకోన త్రింశత్యధిక శతతమోధ్యాయః - నూటయిరువది తొమ్మిదవ అధ్యాయము

సూత ఉవాచ - సూతు డిట్లు పలికెను

ఏవం దీక్షాం తతః శ్రుత్వా వాక్యం నారాయణోన్ముఖాత్‌,

విశుద్ధ మనసా భూమిః పున ర్విష్ణు మథాబ్రవీత్‌. 1

ఇట్లు భూదేవి దీక్షను నారాయణుని ముఖము నుండి విని పవిత్రమైన మనస్సు కలదియై మరల విష్ణువుతో నిట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి పలికెను.

అహో దీక్షణమాహాత్మ్యం యస్య వై వ్యుష్టి రుత్తమా,

శ్రుత్వా వయం మహాభాగ జాతా స్మ విమలా విభో. 2

దీక్ష మహిమ ఎంత గొప్పది! దాని సమృద్ధి ఎంత మేలైనది! దీనిని విన్న మేము పవిత్రుల మైతిమి.

అహో దేవస్య మాహాత్మ్యం లోకనాథస్య తత్త్వతః,

యేన సా కారిణీ దీక్షా చాతుర్వర్ణ్య సుఖావహా. 3

ఆహా! లోకముల ప్రభువగు ఈ దేవుని మాహాత్మ్యము ఎంతగొప్పది! ఆ మహిమ నాలుగు వర్ణముల వారికి సుఖము కలిగించెడి దీక్షను నిర్మించినది.

ఏవం మే పరమం గుహ్యం యదీశ హృది వర్తతే,

తవ భక్తసుఖార్థాయ తత్‌ త్వం మే వక్తు మర్హసి. 4

ఇట్లే, పరమేశా! నీ హృదయమున నేదేని పరమరహస్య మున్న యెడల నీ భక్తుల సుఖము కొరకు దానిని నాకు చెప్పవలయును.

దేవ పూర్వాపరాధా స్తే ద్వాత్రింశ త్పరికీర్తితాః,

ఏవం కృత్వాపరాధాని మనుజా అల్పచేతసః. 5

కర్మణా కేన శుద్ధ్యన్తి అపరాధస్య కారిణః,

తన్మమాచక్ష్వ తత్త్వేన మమ ప్రీత్యా చ మాధవ. 6

దేవా! నీవు మునుపు ముప్పది రెండు దోషములను గూర్చి చెప్పియుంటివి. బుద్ధి తక్కువ మనుజులు ఈ అపరాధములు చేసి ఏ పనితో పరిశుద్ధు లగుదురు? నాయందలి ప్రీతితో దానిని నాకు దయతో చెప్పుము.

తతో భూమ్యా వచః శ్రుత్వా హృషీకేశో మహాయశాః,

దివ్యం ధ్యానం సమాధాయ ప్రత్యువాచ వసుంధరామ్‌. 7

అంత గొప్పకీర్తిగల శ్రీ మన్నారాయణుడు మిక్కిలి శ్రేష్ఠమగు ధ్యానమును తాల్చి భూమి కిట్లు బదులు పలికెను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శుద్ధా భాగవతా భూత్వా మమ కర్మపరాయణాః,

యే తు భుఞ్జన్తి రాజాన్నం లోభేన చ భ##యేన చ. 8

ఆపద్గతాని భుఞ్జీత రాజాన్నం తు వసుంధరే,

దశవర్షసహస్రాణి పచ్యన్తే నరకే నరాః. 9

ఏ దోషములు నెరుగని నా భక్తులు, నా పూజల యందు ఆసక్తి కలవారు, లోభము చేతనో, భయము వలననో లేక ఆపదలు వచ్చినపుడో రాజులు అన్నము తిన్నచో పదివేల యేండ్లు నరకమున మ్రగ్గిపోవుదురు.

భగవద్వచనం శ్రుత్వా కమ్పితా చ వసుంధరా,

దినాని సప్త దశ చ భయం తీవ్రం ప్రజాయతే. 10

భగవంతుని ఆ మాట విని వసుంధర వణకి పోయెను పదునేడు దినములు ఆమెకు తీవ్రమైన భయము కలిగెను.

తతో దీనమనా భూత్వా సా మహీ సంశితవ్రతా,

ఉవాచ మధురం వాక్యం సర్వలోక సుఖావహమ్‌. 11

ఆమె దిగులొందిన మనస్సుతో అన్ని లోకములకు సుఖము కలిగించు తీయని పలు కిట్లు పలికెను.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవ యన్మే చ హృది వర్తతే,

కోను దోషో హి రాజ్ఞాం తు తన్మే త్వం వక్తు మర్హసి. 12

దేవా! నా హృదయమున నున్న దానిని వినుము. రాజుల తప్పేమి? దీనిని నాకు నీవు తెలుపదగును.

తతో భూమ్యా వచః శ్రుత్వా సర్వధర్మవిదాం వరః,

ప్రాహ నారాయణో వాక్యం ధర్మకామాం వసున్ధరామ్‌. 13

అంత భూదేవి పలుకు విని సర్వధర్మముల నెరిగినవారిలో మిన్నయగు నారాయణుడు ధర్మమును విన గోరుచున్న భూదేవితో ఇట్లు పలికెను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీశరాహదేవు డిట్లనెను.

శృణు సుందరి తత్త్వేన గుహ్య మేత దనిన్దితే,

రాజాన్నం తు న భోక్తవ్యం శుభై ర్భాగవతైః సదా. 14

సుందరీ! శ్రద్ధతో వినుము. ఇది రహస్యము. దోషములు లేని భాగవతులు ఎన్నిటికిని రాజుల కూడు తినరాదు.

యద్యపి చ మమాంశేన రాజా లోకే ప్రవర్తతే,

రజస స్తమస శ్చాపి కుర్వన్‌ కర్మ సుదారుణమ్‌. 15

రాజు లోకమున నా అంశముతో మెలగువాడే అయినను రజస్సు, తమస్సు అను గుణములతో మిక్కిలి దారుణమగు కర్మములు చేయువాడగును.

గర్హితాని వరారోహే రాజాన్నాని న సంశయః,

ధర్మసంధారణార్థాయ న తు మే రోచతే భువి. 16

అందువలన ఓ వరారోహా! రాజాన్నములు నింద్యములగు చున్నవి. సంశయము లేదు. ధర్మము నిలుపు విషయమున అది నాకు రుచింపదు.

తతోన్యత్‌ సంప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

యథా రాజ్ఞాం తు భోజ్యం వై శుద్ధై ర్భాగవతైః శుభైః. 17

వసుంధరా! రాజుల అన్నము పవిత్రులగు భాగవతులు తినదగినదియు కలదు. దానిని గురించి వివరించి చెప్పెదను వినుము.

స్థాపయిత్వా తు మాందేవి విధిదృష్ణేన కర్మణా,

ధనధాన్య సమృద్ధాని దత్వా భాగవతై రపి. 18

సిద్ధై ర్భాగవతై శ్చాన్నం మమ ప్రాపణశేషణమ్‌,

భుఞ్జాన స్తువ వరారోహే న స పాపేన లిప్యతే. 19

విధి చూపిన కర్మముతో నన్ను నెలకొల్పి భగవద్భక్తులైన రాజులు ధనధాన్యములతో సమృద్ధములైన పదార్థముల నొసగినచో సిద్ధులైన భాగవతులు నాకు నివేదింపగా మిగిలిన ఆ అన్నమును తిన్నను వారికి పాపము అంటదు.

ఏవం విష్ణువచః శ్రుత్వా ధరణీ సంశితవ్రతా,

వారాహరూపిణం దేవం ప్రత్యువాచ వరాననా. 20

మేలైన వ్రతములు గల భూదేవి విష్ణువు వచనము విని ఆ వరాహరూప దేవునితో మరల ఇట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి పలికెను.

రాజాన్నం తు తతో భుక్త్వా శుద్ధో భాగవతః శుచిః,

కర్మణా కేన శుద్ధ్యేత తన్మే బ్రూహి జనార్దన. 21

శుద్ధుడగు భాగవతుడు రాజు అన్నమును తిని ఏ కర్మముతో పరిశుద్ధు డగునో, జనార్దనా! అది నాకు చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు పలికెను.

శృణు తత్త్వేన మే దేవి యన్మాం త్వం భీరు భాషసే,

తరన్తి పురుషా యేన రాజాన్న ముపభుఞ్జకాః. 22

దేవీ! భీరూ! రాజు నన్నమును తిన్నవారు ఎట్లు తరింతురో అని నీవడుగుచున్నదానికి సమాధానము చెప్పెదను. వినుము.

ఏకం చాన్ద్రాయణం కృత్వా తప్తకృచ్ఛ్రం చ పుష్కలమ్‌,

కుర్యాత్‌ సాన్తపనం చైకం శీఘ్రం ముచ్యేత కిల్బిషాత్‌. 23

ఒక చాంద్రాయణము, ఒకనిండైన తప్తకృచ్ఛ్రము, ఒక సాంతపనము అనువానిని చేసినచో ఆ పాపమునుండి వెనువెంటనే ముక్తు లగుదురు. (చాంద్రాయణము - చంద్రుని క్షీణతను బట్టి కృష్ణపక్షమున ఒక్కొక్క ముద్దను తగ్గించును, శుక్లపక్షమున ఒక్కొక్క ముద్దను పెంచుచు ఆహారము తినుచు చేసెడి వ్రతము. తప్తకృచ్ఛ్రము, వేడినీరు, పాలు, నెయ్యి మూడురోజులు నియమముతో పుచ్చుకొనుట, వేడి గాలి పీల్చుట అనువ్రతము. సాంతపనము, మూడు దినములు పళ్ళు మాత్రమే తినుట, మూడు దినములు రాత్రులందే భుజించుట, తరువాత మూడు దినములు అడుగుకొనకుండ లభించిన దానిని మాత్రమే ఆహారముగా కొనుట, అటుపై మూడు దినములుపవాసముండుటగా చేయు వ్రతము.)

రాజ్ఞా మన్నాని వై భుక్త్వా ఇమం కర్మ సమారభేత్‌,

న తసై#్యనా పరాధోస్మి వసుధే వై వచో మమ. 24

ఒకవేళ రాజుల అన్నమును తిన్నను ఈ కర్మమును ఆచరింపవలయును. అట్టి వాని అపరాధమును నేను పరిగణింపను. ఇదిగో ఇది నా మాట.

ఏవ మేవ న భోక్తవ్యం రాజాన్నం తు కదాచన,

మ మాత్ర ప్రియకామాయ యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌. 25

నాకు ప్రియమాచరింపగోరువాడును, పరమగతిని కోరువాడును, ఎన్నటకిని రాజు నన్నమును తినరాదు.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్చాస్త్రే ఊనత్రింశదధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటయిరువది తొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters