Varahamahapuranam-1    Chapters   

సప్తదశోధ్యాయః - పదునేడవ అధ్యాయము

ధరణ్యువాచ - ధరణి పలికెను.

యేతే మణౌ సరాదేవ ఉత్పన్నా నరపుఙ్గవాః,

తేషాం వరో భగవతా దత్త స్త్రేతాయుగేకిల. 1

రాజానో భవితారో వై కథం తేషాం సముద్భవః,

కిఞ్చ చక్రు ర్హి తే కర్మ పృథఙ్‌ నామాని శంస మే. 2

ప్రభూ! త్రేతాయుగమున ఆమణివలన పుట్టిన నరవరులున్నారే, వారికి భగవంతుడు, మీరు రాజులగుదురని వరమొసగెనుగదా! వారి జన్మమెట్టిది? వారేమి కావించిరి? వారిపేరులేమి? నాకు తెలియజెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

సుప్రభో మణిజో యస్తు రాజానామ మహామనాః,

తస్యోత్పత్తిం వరారోహే శృణు త్వం భూతధారిణి. 3

మణివలన పుట్టిన సుప్రభుడు మహామనుడను రాజాయెను. భూతధాత్రీ! ఆతని పుట్టుకను గూర్చి చెప్పెదను - వినుము.

ఆసీద్రాజా మహాబాహు రాదౌ కృతయుగే పురా,

శ్రుతకీర్తి రితి ఖ్యాత సై#్తలోక్యే బలవత్తరః. 4

తొల్లి మొదటి కృతయుగమున శ్రుతకీర్తియని కీర్తిగన్న మహాబాహువగురాజుండెను. ఆతడు ముల్లోకములలో గొప్పబలము కలవాడు.

తస్య పుత్రత్వ మాపేదే సుప్రభో మణిజో ధరే,

ప్రజాపాలేతి వైనామ్నా శ్రుతకీర్తి ర్మహాబలః. 5

మణివలన పుట్టిన సుప్రభుడు ఆ రాజునకు పుత్రుడాయెను. గొప్పకీర్తియు, మిక్కుటమగుబలమును గల ఆతని పేరు ప్రజాపాలుడు.

స ఏకస్మిన్‌ దినే ప్రాయాద్‌ గహనం శ్వాపదాకులమ్‌,

తత్రాపశ్యదృషే ర్ధన్యం మహదాశ్రమ మణ్డలమ్‌. 6

అతడొకనాడు క్రూరమృగములతో నిండిన ఘోరాటవి కరిగెను. అందు పవిత్రమగు ఋష్యాశ్రమమును గాంచెను.

తస్మిన్‌ మహాతపానామ ఋషిః పరమధార్మికః,

తపస్తేపే నిరాహారో జపన్‌ బ్రహ్మ సనాతనమ్‌. 7

ఆ ఆశ్రమమున పరమధార్మికుడగు మహాతపుడను ఋషి అన్నపానములు వదలి సనాతనమగు బ్రహ్మమును జపించుచు తపమొనర్చుచుండెను.

తత్రాసౌ పార్థివః శ్రీమాన్‌ ప్రవేశాయ మతిం తదా,

చకార చావిశద్రాజా ప్రజాపాలో మహాతపాః. 8

శుభసంపదలు గల ఈ రాజు ఆ ఆశ్రమమును ప్రవేశింపగోరెను. మహాతపస్సుగల ఆప్రజాపాలుడందు ప్రవేశించెను.

తస్మిన్‌ వరాశ్రమపదే వనవృక్షజాత్యా

ధరాప్రశస్తోర్జిత మార్గజుష్టాః,

లతాగృహా ఇన్దురివ ప్రకాశినో

నాయాసజ్ఞా యత్ర యాతా హి భృఙ్గాః. 9

ఉత్తమమగు ఆ ఆశ్రమమునందు శ్రేష్ఠమగు వృక్షజాతులు భూమియందలి ప్రశస్తములగు మార్గములను క్రమ్మియుండినవి. లతాగృహములు చంద్రునివలె ప్రకాశించుచున్నవి. అందు ప్రవేశించిన తుమ్మెదలు ఆయాసము నెరుగకున్నవి.

సురక్త పద్మోదర కోమలాగ్ర

నఖఙ్గుళీభిః ప్రసృతైః సురాణామ్‌,

వరాఙ్గనాభిః పదపఙ్గ్కి ముచ్చై

ర్విహాయ భూమిం త్వపి వృత్రశత్రోః. 10

ఆఆశ్రమ స్థానమున దేవకాంతల పాదపంక్తులు కానవచ్చుచున్నవి. ఆదేవకాంతల కాలిగోళ్లు మంచి ఎరుపువన్నె తిరిగిన పద్మముల లోపలికాంతులవంటి కాంతులతో విరాజిల్లుచున్నవి. వారు ఈ ఆశ్రమము నందలి ప్రీతితో దేవభూమినికూడ వదలివచ్చిరి.

క్వచిత్సమీపే తమతీవ హృష్టై

ర్నానాద్విజైః షట్చరణౖశ్చ మత్తైః,

వాసద్భి రుచ్చై ర్వివిధ ప్రమాణాః

శాఖాః సుపుష్పాః సమయోగయుక్తాః. 11

మరియు ఆ ఆశ్రమపరిసరములలో వేరువేరు ప్రమాణములుగలవియు, మంచి పూవులు గలవియు ఎత్తైనవియునగు వృక్షములు గలవు. వానిపై పెక్కువిధములగు పక్షులు, మత్తెక్కిన తుమ్మెదలు ఆనందమునిండిన హృదయములతో అలరారుచున్నవి.

కదమ్బ నీపార్జున శీలశాల

లతా గృహస్థై ర్మధురస్వరేణ,

జుష్టా విహఙ్గైః సుజన ప్రయోగా

నిరాకులా కార్యధృతి ర్యథా స్థైః. 12

కడిమి, మంకెన, అర్జునము, శీలము, సాలము మొదలగు చెట్లయందు, పూపొదరిండ్లయందను ఉన్న పక్షులకమ్మని రావములతో నిండినదై సుజనులు ప్రయోగించినదియు, ఎట్టి చిక్కులు లేనిదియునగు కార్యభారము కలదియో యన్నట్లు విరాజిల్లెను.

మఖాగ్నిధూమై రుదితాగ్ని హోమై

స్తత స్సమన్తాద్‌ గృహమేధిభిర్ద్విజైః,

సింహై రివాధర్మకరీ విదారితః

సుతీక్షదంష్టై ర్వరమత్తకేసరైః. 13

అందు గృహస్థులగు బ్రాహ్మణులు చేయుచున్న యజ్ఞములనుండి వెలువడుచున్న ధూమములు, అగ్నిహోత్రములు వాడికోరలు, మేలైనజూలుగల సింహములవలె అధర్మమను ఏనుగును చీల్చి చెండాడుచున్నవి.

ఏవం స రాజా వివిధా నుపాయాన్‌

వరాశ్రమే ప్రేక్షమాణో వివేశ

తస్మిన్‌ప్రవిష్టేతు స తీవ్రతేజా,

మహాతపాః పుణ్యకృతాం ప్రధానః

దృష్టో యథా భాను రనన్తభానుః,

కౌశ్యాసనే బ్రహ్మవిదాం ప్రధానః. 14

ఇట్లరాజు ఆ శ్రేష్ఠమగు ఆశ్రమమున పెక్కువింతలను చూచుచు ప్రవేశించెను. అట్లు ప్రవేశించుచునే అందు తీవ్రమగుతేజస్సుతో అలరారుచున్నవాడును, అంతులేని కిరణములు గల సూర్యుని వలె వెలుగొందుచున్నవాడును, పుణ్యాత్ములలో ముఖ్యుడును, బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడును దర్భాసనమున కూర్చున్నవాడును అగు మహాతపోమహర్షిని గాంచెను.

దృష్ట్వా సరాజా విజయే మృగాణాం

మతిం విసస్మార మునేః ప్రసఙ్గాత్‌,

చకార ధర్మం ప్రతి మానసం స

అనుత్తమం చా ప్రతిమం మునిం సః. 15

ఆ మహర్షిని చూచినంతనే ఆరాజు మృగములను వశపరచుకొనుట యనుపనిని మరచి పోయెను. ముని ప్రసంగమువలన ఆతనిమానసము ధర్మముపై నిలిచిపోయెను. సర్వశ్రేష్ఠుడు, సాటిలేనివాడునగు ఆయునిని గాంచిన ఆరాజు అట్టి మనస్థితిని పొందెను.

స ముని స్తన్నృపం దృష్ట్వా ప్రజాపాల మకల్మషమ్‌,

అభ్యాగత క్రియాం చక్రే ఆసనస్వాగతాదిభిః. 16

ఆ మునియు ఎట్టిదోషము నెరుగని ప్రజాపాలమహారాజును గాంచి, ఆసనమొసగుట, స్వాగతము పలుకుట మొదలగు సత్కారములతో ఆతనికి అతిథి మర్యాదలు సలిపెను.

తతః కృతాసనో రాజా ప్రణమ్య ఋషిపుఙ్గవమ్‌,

పప్రచ్ఛ వసుధే ప్రశ్న మిమం పరమదుర్లభమ్‌. 17

అంత నారాజు ఆ ఋషివరునకు ప్రణమిల్లి ఆసనమున కూర్చుండి పరమదుర్లభగు ప్రశ్న నిట్లడిగెను.

భగవన్‌ దుఃఖసంసారమగ్నైః పుంభి ర్జిగీషుభిః,

యత్కార్యం తన్మమాచక్ష్వ ప్రణతే శంసితవ్రత. 18

స్వామీ! దుఃఖములతో నిండిన సంసారమున మునిగినవారు, దానిని గెలువగోరువారునగు పురుషులు చేయదగినదేమో నాకు తెలియజేయుము. నీకు మ్రొక్కుదును.

మహాతపా ఉవాచ - మహాతపోముని యిట్లు పలికెను.

సంసారార్ణవమజ్జమాన మనుజైః పోతః స్థిరోతిధ్రువః,

కార్యః పూజన హోమదానవివిధైర్యజ్ఞైః సమంధ్యాయనైః,

కీలైః కీలితమోక్షభిః సురభ##టై రూర్ధ్వే మహారజ్జుభిః

ప్రాణాద్యై రధునా కురుష్వ నృపతే పోతం త్రిలోకేశ్వరమ్‌. 19

సంసారమను సముద్రమున మునుగుచున్న నరులు చెదరనిదియు, మిక్కిలి గట్టిది యునగు ఒక తెప్పను చేసికొన వలయును. పూజలు, హోమములు, దానములు, యజ్ఞములు, ధ్యానములు దానికి కీలలు. చక్కగా నాటుకొన్న మోక్షముగల దేవభటులు ప్రాణములు మొదలగు త్రాళ్లతో అట్టినరులను పైకిలాగుదురు. రాజా! నీవు త్రిలోకప్రభువునే ఇపుడు తెప్పగా చేసికొనుము.

నారాయణం నరకహరం సురేశం

భక్త్యా నమస్కుర్వతి యో నృపేశ,

స వీతశోకః పరమం విశోకం

ప్రాప్నోతి విష్ణోః పద మవ్యయం తత్‌. 20

నరకమును రూపుమాపువాడు, దేవదేవుడు అగు నారాయణునకు నమస్కరించువాడు సంసారదుఃఖమును బోనాడి పరమము, దుఃఖవాసన యైనలేనిదియునగు శ్రీమహావిష్ణువు యొక్క అవ్యయపదమునందుకొనును. (అవ్యయము-ఎట్టికాలమునందును, ఏదశయందును చెడనిది)

నృప ఉవాచ - రాజిట్లనెను.

భగవన్‌ సర్మధర్మజ్ఞ కథం విష్ణుః సనాతనః,

పూజ్యతే మోక్షమిచ్ఛద్భిః పురుషై ర్వద తత్త్వతః. 21

సర్వధర్మములు చక్కగా నెఱిగిన మహానుభావా! సనాతనుడైన విష్ణువును మోక్షము పొందగోరుపురుషులు ఎట్లు పూజింతురు? దీని కలరూపు ఎరిగింపుము.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు పలికెను.

శృణు రాజన్‌ మహాప్రాజ్ఞ యథా విష్ణుః ప్రసీదతి,

పురుషాణాం తథాస్త్రీణాం సర్వయోగీశ్వరో హరిః. 22

బుద్ధిశాలీ! సర్వయోగీశ్వరుడగుహరి శ్రీమహావిష్ణువు పురుషులకును, మరియు స్త్రీలకును ఎట్లు ప్రసన్నుడగునో చెప్పెదను. వినుము.

సర్వేదేవాః సపితరో బ్రహ్మాద్యాశ్చాణ్డమధ్యగాః,

విష్ణోః సకాశా దుత్పన్నా ఇతీయం వైదికీ శ్రుతిః. 23

పితృదేవతలతో పాటు దేవతలందరును, బ్రహ్మమొదలగు వారును, బ్రహ్మాండమునడుమనున్న ఎల్లవారును విష్ణువువలననే పుట్టిరి. ఇది వేదమున వినవచ్చు సత్యము.

అగ్నిస్తథాశ్వినౌ గౌరీ గజవక్త్ర భుజఙ్గమాః,

కార్తికేయ స్తథాదిత్యా మాతరో దుర్గయాసహ. 24

దిశో ధనపతి ర్విష్ణు ర్యమో రుద్రః శశీ తథా,

పితరశ్చేతి సంభూతాః ప్రాధాన్యేన జగత్పతేః. 25

అగ్ని, అశ్వినీదేవతలు, గౌరి, వినాయకుడు, ఆదిశేషుడు, కుమారుడు, ఆదిత్యులు, దుర్గాదేవితోపాటు సప్తమాతృకలు, దిక్కులు, కుబేరుడు, లోకపాలకుడగు విష్ణువు, యముడు, రుద్రుడు, చంద్రుడు, పితృదేవతలు - ఈ అందరు జగన్నాయకుడగు శ్రీమహావిష్ణువునుండి పుట్టినవారే.

హిరణ్యగర్భస్యతనౌ సర్వఏవ సముద్భవాః,

పృథక్‌ పృథక్‌ తతో గర్వం వహమానాః సమన్తతః. 26

ఇట్లు హిరణ్యగర్భుని దేహమున పుట్టిన ఈ అందరును అటుపై పెచ్చుపెరిగిన గర్వము గలవారైరి.

అహం యోగ్యస్త్వహం యాజ్య ఇతి తేషాం స్వనోమహాన్‌,

శ్రూయతే దేవసమితౌ క్షుబ్ధసాగర సన్నిభః. 27

'నేను యోగ్యుడను, నన్ను పూజింపవలయును' -అను పెనురొద దేవతల గుంపులో అల్లకల్లోలమగు సముద్రపు ఘోషవలె వినవచ్చినది.

తేషాం వివదమానానాం వహ్ని రుత్థాయ పార్థివ,

ఉవాచ మాం యజస్వేతి ధ్యాయధ్వం మామితిబ్రువన్‌. 28

ప్రాజాపత్య మిదంనూనం శరీరం మద్వినా కృతమ్‌,

వినాశ ముపపద్యేత యతో నాహం తతో మహాన్‌. 29

అట్లు వివాదము చేయుచున్న వారిలోనుండి అగ్ని పైకిలేచి నన్ను పూజింపుడు, నన్ను ధ్యానింపుడు. ఇదిగో ప్రజాపతి నిర్మించినదైన దేహము నానుండి వేరై నేను లేనికారణమున నశించును. కావున నేనే గొప్పవాడను' - అనిపలికెను.

ఏవ ముక్త్వా శరీరం తు త్యక్త్వా వహ్ని ర్వినిర్య¸°,

నిర్గతేపి తతస్తస్మింస్తచ్ఛరీరం న శీర్యతే. 30

ఇట్లు పలికి అగ్నిదేవుడు శరీరమును వదలి వెలికి వచ్చెను. అట్లతడు వెలువడినను ఆ శరీరము చెడిపోకుండెను.

తతోశ్వినౌ మూర్తిమాన్తౌ ప్రాణాపానౌ శరీరగౌ,

ఆవాం ప్రధానా విత్యేవ మూచతు ర్యాజ్యసత్తమౌ. 31

అంత ప్రాణము, అపానము అనుస్వరూపములతో దేహమున నుండు అశ్వినీదేవతలు దేహమున మేమే ప్రధానులము. కావున పూజ్యులలో మేమే గొప్పవారమని పలికిరి.

ఏవ ముక్త్వా శరీరం తు విహాయ క్వచిదాస్థితౌ,

తయో రపి క్షయం కృత్వా క్షీణం తత్పురమాస్థితమ్‌. 32

ఇట్లు పలికి వారిరువురు శరీరమును విడచి మరియొకచోట నిలిచిరి. వారిరువురు లేకపోయినను దేహము ఏలోపములేనిదై చక్కగా నుండెను.

తతో వాగబ్రవీ ద్గౌరీ ప్రాధాన్యం మయి సంస్థితమ్‌,

సాప్యేవముక్త్వా క్షేత్రాత్తు నిశ్చక్రామ బహిః శుభా. 33

తయా వినాపి తతేక్షత్రం వాగూనం వ్యవతిష్ఠత.

పిదప వాగ్రూపిణియగు గౌరి - ప్రాధాన్యము నాయందు కలదు! అని పలికి క్షేత్రమునుండి (దేహమునుండి) వెలుపలి కరుదెంచెను. అయినను దేహము పలుకొక్కటిమాత్రములేనిదై భద్రముగనే యుండెను.

తతో గణపతి ర్వాక్యమాకాశాఖ్యోబ్రవీత్తదా, 34

నమయా రహితం కిఞ్చి చ్ఛరీరం స్థాయి దూరతః.

కాలాన్తరేత్యేవముక్త్వా సోపి నిష్ర్కమ్య దేహతః, 35

పృథగ్భూత స్తథాప్యేత చ్ఛరీరం నాప్యనీనశత్‌,

వినాకాశాఖ్యతత్త్వేన తథాపి న విశీర్యతే. 36

అంత ఆకాశమను పేరుగల గణపతి యిట్లు పలికెను - నేను లేని దేహ మేకొంచెము కొలదికాలమైనను నిలువ జాలదు ఇట్లని యాతడును దేహమునుండి వేరయ్యెను. అయినను, ఆకాశమను తత్త్వము లేకున్నను శరీరము చెడకుండెను.

సుషిరైస్తు విహీనంతు దృష్ట్వా క్షేత్రం వ్యవస్థితమ్‌,

శరీరధాతవః సర్వే తేబ్రూయ ర్వాక్య మేవ హి. 37

రంధ్రము లేవియు లేక చక్కగా నెలకొని యున్న దేహమును చూచి శరీరమునందలి ధాతువులన్నియు నిట్లు పలికినవి.

అస్మాభి ర్వ్యతిరిక్తస్య నశరీరస్య ధారణమ్‌,

భవతీత్యేవ ముక్త్వా తే జహుః సర్వే శరీరిణః. 38

మాకంటె వేరుగా శరీరమునకు నిలుకడలేదు. అని పలికి అవియన్నియు దేహమును వదలెను.

తై ర్వ్యపేత మపి క్షేత్రం పురుషేణ ప్రపాల్యతే,

తం దృష్ట్వా త్వబ్రవీత్‌ న్కన్దః సోహంకారః ప్రకీర్తితః. 39

అవి వదలినను క్షేత్రమును పురుషుడు భద్రముగనే యుంచెను. అది కాంచి 'అహంకార| మని పేరుగన్న కుమారస్వామి యిట్లు పలికెను.

మయా వినా శరీరస్య సంభూతి రపి నేష్యతే,

ఏవ ముక్త్వా శరీరాత్తు స వ్యపేతః పృథక్‌ స్థితః. 40

నేను లేనిచో శరీరమునకు నిలుకడయే లేదు - అని పలికి శరీరమునుండి వెలువడి వేరుగా నిలిచెను.

తేనాక్షతేన తత్‌క్షేత్రం వినా ముక్తవదాస్థితమ్‌,

చెడనిరూపుగల ఆ అహంకారము వదలిపోయినను దేహము, ముక్తునివలె చెడక నిలిచెను.

తం దృష్ట్వా కుపితోభానుః స ఆదిత్యః ప్రకీర్తితః. 41

మయా వినా కథం క్షేత్ర మిమం క్షణ మపీష్యతే,

ఏవ ముక్త్వాథ యాతః స తచ్ఛరీరం న శీర్యతే.

ఆదిత్యుడని ప్రసిద్ధిగల సూర్యున కదిచూచినంత కోపము పెల్లుబికి వచ్చెను. నేను లేనిదే యీ దేహము క్షణమైనను నిలువదు - అనిపలికి శరీరమును వదలి పోయెను. అయినను దానికి ఇనుమంతయు చెరుపు కలుగలేదు.

తతఃకామాది రుత్థాయ గణో మాతృవిసంజ్ఞితః,

న మయా వ్యతిరిక్తస్య శరీరస్య వ్యవస్థితిః. 42

పిదప మాతృగణమను పేరుగల కామము మొదలగునది లేచి నేను లేనిచో శరీరమునకు ఉనికియే లేదని పలికెను.

ఏవముక్తః స యాతస్తు శరీరం తన్న శీర్యతే. 43

ఇట్లని అది దేహమును వదలి వెలికివచ్చెను. కాని దేహము చెడిపోకుండెను.

తతో మాయా బ్రవీత్కోపా త్సా చ దుర్గా ప్రకీర్తితా,

న మయాస్య వినా భూతి రిత్యు క్త్వా స్తర్దధే పునః. 44

అంత దుర్గయని పేరొందిన మాయ, నేను లేనిదే దీనికి అస్తిత్వము లేదని పలికి అదృశ్యమయ్యెను.

తతో దిశః సముత్తస్థు రూచు శ్చేదం వచో మహత్‌,

నాస్మాభీ రహితం కార్యం భవతీతి న సంశయః,

చతస్ర ఆగతాః కాష్ఠా స్తాః ప్రయాతాః క్షణా త్తదా. 45

పిదప నాలుగుదిక్కులును పైకి లేచినవి. మేములేనిదే ఏపనియు జరుగదు. సందియము లేదు. ఇట్లు పలుకుచు ఆ నాలుగుదిక్కులును ఒక్కక్షణమున లేచిపోయినవి.

తతో ధనపతి ర్వాయు ర్మధ్యత స్త్యక్త సంభవః,

శరీరస్యేతి సోప్యేవ ముక్త్వా మూర్ధానగోభవత్‌. 46

అపుడు ధనపతియగు వాయువు నేను దేహము నడుమ లేకున్నచో దీనికి స్థితియే లేదనుచు తలనుండి వెలుపలికి వచ్చెను.

తతో విష్ణో ర్మనోబ్రూయా న్నాయం దేహో మయావినా,

క్షణమప్యుత్సహేత్‌ స్థాతు మిత్యుక్త్వాన్తర్ధధే పునః. 47

ఆ వెనుక విష్ణు స్వరూపమగు మనస్సు నేను లేనిదే యీ దేహము క్షణమైనను నిలువజాలదని పలికి అదృశ్యమాయెను.

తతోధర్మోబ్రవీత్‌ సర్వమిదం పాలితవానహమ్‌,

ఇదానీ మప్యుపగతే కథ మేత ద్భవిష్యతి. 48

ఏవముక్త్వా గతో ధర్మ స్తచ్ఛరీరం న శీర్యతే.

అంత ధర్ముడు నేనే అంతటిని పాలించితిని. ఇప్పుడు నేను వెలువడినచో ఇది యెట్లు బ్రతుకును? అని పలికి వెలువడి పోయెను. అయినను శరీరము చెడలేదు.

తతోబ్రవీన్మహాదేవః అవ్యక్తో భూతభావనః. 49

మహత్సంజ్ఞో మయా హీనం శరీరం నోభ##వేద్‌ యథా,

ఏవముక్త్వా గతఃశమ్భు స్తచ్ఛరీరం నశీర్యతే. 50

అటుపై అవ్యక్తము, మహత్తు అనుపేర్లుగల భూతములకు నిర్దేశకుడు అయిన మహాదేవుడు 'నేను లేనిచో శరీరము ఉండదు' అని పలికి వెడలిపోయెను. అయినను శరీరము చెరుపునందకుండెను.

తద్ధృష్ట్వా పితర శ్చోచు స్తన్మాత్రం యావదస్మభిః,

ప్రగతై రేభి రేతచ్చ శరీరం శీర్యతే ధ్రువమ్‌, 51

ఏవముక్త్యాతు తద్దేహం త్యక్త్వాన్తర్ధానమాగతాః.

అదిచూచి తన్మాత్రలని పేరొందిన పితృదేవతలు మేము వదలిపోయినచో దేహము తప్పక రూపుమాయునని పలికి ఆ దేహము వదలి వెడలిపోయిరి.

(తన్మాత్రలనగా అయిదు ఇంద్రియముల గుణములు - శబ్దస్పర్శరూపరసగంధములు)

అగ్నిః ప్రాణః అపానశ్చ ఆకాశం చైవధాతవః,

క్షేత్రం తద్వదహంకారో భానుః కామాదయో మయా,

కాష్ఠా వాయు ర్విష్ణుధర్మౌ శంభుశ్చైవేన్ధ్రి యార్థకాః. 52

ఏతై ర్ముక్తంతు తత్‌క్షేత్రం ముక్తావివతు సంస్థితమ్‌,

అగ్ని, ప్రాణము, అపానము, ఆకాశము, ధాతువులు, అహంకారము, సూర్యుడు, కామాదులు, మాయ, దిక్కులు, వాయువు, విష్ణువు, ధర్మము, శంభువు, తన్మాత్రలు - అనునవి యన్నియు వదలిపోయినను దేహము ముక్తియందున్నదో యన్నట్లు నిలిచియుండెను.

సోమేన పాల్యమానం తు పురుషేణన్దురూపిణా. 53

పురుషుడుగా ప్రసిద్ధికెక్కిన చంద్రస్వరూపుడు రక్షించుచుండగా దేహము చెడకుండెను.

ఏవం వ్యవస్థితే సోమే షోడశాత్మ న్యథాక్షరే,

ప్రాగ్వత్తత్ర గుణోపేతం క్షేత్ర ముత్థాయ బభ్రమ. 54

పదునారింటి లక్షణములుగల అక్షరమగు సోముడు నెలకొనియుండగా దేహము మునుపటివలె అన్నిగుణములతో కూడినదై లేచి తిరుగసాగెను. (పదునారు-అగ్ని మొదలగునవి పదునైదు+సోమస్వరూపుడగు పురుషుడు).

ప్రాగవస్థం శరీరన్తు దృష్ట్వా సర్వజ్ఞ పాలితమ్‌,

తాఃక్షేత్ర దేవతాః సర్వా వైలక్షం భావ మాస్థితాః. 55

సర్వజ్ఞుడు పాలించుచుండగా మునుపటిస్థితిలోనున్న శరీరమును గాంచి ఆయాక్షేత్రదేవతలు వెలతెలబోయిరి.

తమేవం తుష్టుపుః సర్వాస్తం దేవం పరమేశ్వరమ్‌,

స్వస్థాన మీయిషుః సర్వా స్తదా నృపతిసత్తమ. 56

ఆ క్షేత్రదేవతలందరు తమతమనెలవులు పొందగోరి అందరును పరమేశ్వరుడగు ఆ దేవుని స్తుతించిరి.

త్వమగ్ని స్త్వం తథా ప్రాణ స్త్వమపానః సరస్వతీ,

త్వమాకాశం ధనాధ్యక్ష స్త్వం శరీరస్య ధాతవః. 57

అహంకారో భవాన్‌ దేవ త్వమాదిత్యోష్టకో గణః,

త్వంమాయా పృథివీ దుర్గా త్వందిశస్త్వం మరుత్పతిః. 58

త్వం విష్ణు స్త్వం తథా ధర్మ స్త్వం జిష్ణుస్త్వం పరాజితః,

అక్షరార్థ స్వరూపేణ పరమేశ్వరసంజ్ఞితః. 59

ప్రభూ! నీవే అగ్నివి, ప్రాణము, అపానము, సరస్వతి, ఆకాశము, వాయువు, శరీరము నందలిధాతువులు, అహంకారము, ఆదిత్యుడు, మాతృగణము, మాయ, దుర్గ, దిక్కులు, దేవతల ప్రభువు, విష్ణువు, ధర్మము, జిష్ణువు, ఓటమి యెఱుగనివాడు ఇవియన్నియు నీవే. అక్షర శబ్దమునకు అర్థమైన స్వరూపముతో నుండు పరమేశ్వరుడవు నీవే.

అస్మాభి రపయాతై స్తు కథ మేత ద్భవిష్యతి,

ఏవమత్ర శరీరంతు త్యక్తమస్మాభిరేవచ. 60

తత్‌ పరం భవతా దేవ తదవస్థం ప్రపాల్యతే,

స్థనభజ్గో న నః కార్యః స్వయం సృష్ట్వా ప్రజాపతే. 61

మేము వదలిపోగా ఇది యెట్లు నిలిచినదనగా ఇట్లు మేము వదలిన యీదేహమును నీవే సంరక్షించుచున్నావు కనుక నిలిచినది. మాకు స్థానమును చెరుపవలదు. ఓ ప్రజాపతీ! నీవే స్వయముగా మమ్ములను సృజించితివి కదా!

ఏవం స్తుత స్తతో దేవ స్తేషాం తోషం పరం య¸°,

ఉవాచ చైతాన్‌ క్రీడార్థం భవన్తోత్పాదితా మయా. 62

ఇట్లు వారు స్తుతింపగా ఆ ప్రభువు పరమానందమందెను. మరియు ఇట్లుపలికెను - మిమ్ములనందరిని కేవలము లీలకై నేను సృజించితిని.

కృతకృత్యస్య మే కింను భవద్భి ర్విప్రయోజనమ్‌,

తథాపి దద్మి నో రూపే ద్వేద్వే ప్రత్యేకశోధునా. 63

కార్యమునెరవేరిన నాకు మీతో పనియేమి! అయినను మీకు ఒక్కొక్కిరికి రెండేసి రూపము లొసగుదును.

భూతకార్యే ష్వమూర్తేన దేవలోకే తు మూర్తినా,

తిష్ఠధ్వ మపి కాలాన్తే లయం త్వావిశత ద్రుతమ్‌. 64

భూత కార్యముల యందు ఆకారములేని స్థితితో, దేవలోకమున ఆకారముతో నిలుపుడు. పిదప కాలము ముగిసిన వెనుక లయము పొందుడు.

(భూత కార్యము లనగా భూలోకమున ప్రాణుల విషయము నందు - అని భావము)

శరీరాణి పునర్నైవం కర్తవ్యోహమితి క్వచిత్‌,

మూర్తీనాంచ తథా తుభ్యం దద్మి నామాని వోధునా. 65

మీకెన్నటికిని నేను దేహములను ఏర్పరుపరాదు. మీ మూర్తులకు ఇప్పుడు పేరు పెట్టెదను.

అగ్ని ర్వైశ్వానరో నామ ప్రాణాపానౌ తథాశ్వినౌ,

భవిష్యతి తథాగౌరీ హిమశూలసుతా తథా. 66

అగ్నికి వైశ్వానరుడని పేరు. అశ్వులకు ప్రాణాపానములని పేరు. గౌరి హైమవతి యగును.

పృథివ్యాదిగణ స్త్వేష గజవక్త్రో భవిష్యతి,

శరీరధాతవ శ్చేమే నానాభూతాని ఏవ తు,

అహంకార స్తథా స్కన్ధః కార్తికేయో భవిష్యతి. 67

పృథివి మొదలగు అయిదు భూతముల సముదాయము వినాయకుడగును. శరీరధాతువులు, అనేక భూతములు. అహంకారము అను వానికి స్కందుడను పేరు ఏర్పడును. ఆతడే కార్తికేయుడు.

భానుశ్చాదిత్యరూపోసౌ మూర్తామూర్తే చ చక్షుషీ,

కామాద్యోయం గణోభూయో మాతృరూపో భవిష్యతి. 68

భానుడు ఆదిత్యరూపుడు. మూర్తము, అమూర్తము కన్నులు కామాదుల సముదాయమే మాతృగణము.

శరీరమాయా దుర్గైషా కారణాన్తే భవిష్యతి,

దశకన్యా భవిష్యన్తి కాష్ఠా స్త్వేతాస్తు వారుణాః. 69

శరీరమున మాయయను పేరుగల యీమెకు దుర్గ అనిపేరు. ఒక కారణమువలన ఈమె మరల ఏర్పడును. పది దిక్కులు వరుణుని కన్యలుగా జనింతురు.

అయం వాయు ర్ధనేశస్తు కారణాన్తే భవిష్యతి,

అయం మనో విష్ణునామా భవిష్యతి నసంశయః. 70

ఈ వాయువు ఒక కారణమున కుబేరుడగును. మనస్సునకు విష్ణువను నామము కలుగును. సంశయములేదు.

ధర్మోపి యమనామా చ భవిష్యతి న సంశయః.

మహత్త త్త్వం చ భగవాన్‌ మహాదేవో భవిష్యతి. 71

ధర్ముడు యముడను పేరొందును. మహత్తత్త్వము భగవానుడగు మహాదేవు డగును.

ఇన్ధ్రియార్థా శ్చ పితరో భవిష్యన్తి న సంశయః,

అయం సోమః స్వయంభూత్వా యామిత్రం సర్వదామరాః 72

ఇంద్రియవిషయములగు శబ్దాదులు పితృదేవతలగును. ఈ సోముడు స్వయముగా సప్తమస్థానము కలవాడగును. (యామిత్ర - ఇది జ్యోతిషసంజ్ఞ - ఏడవస్థానము మిక్కిలి పవిత్రమైనది)

ఏవం వేదాన్తపురుషః ప్రోక్తో నారాయణాత్మకః,

స్వస్థానే దేవతాః సర్వా దేవస్తు విరరామ హ. 73

ఇట్లు నారాయణ స్వరూపుడగు వేదాంతపురుషుని చెప్పితిమి. పిదప దేవతలందరు వారివారి స్థానముల కరిగిరి. దేవుడు అదృశ్యుడాయెను.

ఏవంప్రభావో దేవోసౌ వేదవేద్యో జనార్దనః,

కథితో నృపతే తుభ్యం కి మన్య చ్ఛ్రోతు మిచ్ఛసి. 74

వేదములచే తెలియదగిన జనార్దనుని ప్రభావమిట్టిది. రాజా! నీ వింకేమి వినవలతువు?

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే సప్తదశోధ్యాయః.

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పదునేడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters