Varahamahapuranam-1    Chapters   

అష్టాదశోధ్యాయః - పదునెనిమిదవ అధ్యాయము

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లు పలికెను.

కథ మగ్నేః సముత్పత్తి రశ్వినోర్వా మహామునే,

గౌర్యా గణపతే ర్వాపి నాగానాం వా గుహస్యచ.

మహామునీ అగ్ని, అశ్వులు, గౌరి, గణపతి, నాగులు, కుమారస్వామి అనువారి పుట్టుక యెట్టిది?

ఆదిత్య చన్ధ్ర మాతౄణాం దుర్గాయా వా దిశాం తథా,

ధనదస్య చ విష్ణో ర్వా ధర్మస్య పరమేష్ఠినః. 2

శమ్భో ర్వాపి వితౄణాంచ తథా చన్ధ్రమసో మునే,

శరీర దేవతాః సర్వాః కథం మూర్తిత్వ మాగతాః. 3

ఆదిత్యుడు, చంద్రుడు, మాతృకలు, దుర్గ, దిక్కులు, కుబేరుడు, విష్ణువు, ధర్ముడు, పరమేష్ఠి, శంభువు, పితృదేవతలు, సోముడు - అను వీరి జన్మము లెట్లు సంభవించినవి? శరీరమునందలి యీ దేవతలందరు ఆకారమెట్లు పొందిరి?

కించ తాసాం మునే భోజ్యం కావా సంజ్ఞా తిథి శ్చ కా,

యస్యాం యష్టాస్త్వమీ పుంసాం ఫలం యచ్ఛన్త్యనామయమ్‌,

ఏతన్మే సరహస్యంతు మునే త్వం వక్తు మర్హసి. 4

ఓమునీ! మరియు వారికి ఆహారమేది? పేరేమి? ఏతిథియందు వారి నర్చించినచో చెడనిఫలము మానవులకు లభించును? దీనిని రహస్యములతో పాటు నాకు చెప్పవలయును.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లుచెప్పెను.

యోగసాధ్య స్వరూపేణ ఆత్మా నారాయణాత్మకః,

సర్వజ్ఞః క్రీడత స్తస్య భోగేచ్ఛా చాత్మనాత్మని. 5

నారాయణస్వరూపముగల ఆత్మ యోగముతో సాధింపదగు స్వరూపముతో సర్వజ్ఞమై క్రీడించుచు తాను తనలో భోగమునందు కోరిక పొందెను.

క్షోభితేస్మిన్‌ మహాభూతే ఏతచ్ఛబ్దం తదద్భుతమ్‌,

తమద్య ప్రీతిమత్తోయం వికారం సమరోచయత్‌. 6

అంత నాతడు ఈమహాభూతమగు భూమిని కలచి వైవగా ఒక అద్భుతమగు పదార్థమేర్పడెను. అట్లేర్పడిన ఆపదార్థమును తనకు ప్రీతికరమైన జలముగా నాతడు సంభావించెను.

వికుర్వత స్తస్య తదా మహానగ్నిః సముత్థితః,

కోటిజ్వాలా పరీవారః శబ్దవాన్‌ దహనాత్మకః. 7

ఆజలము, నాతడు త్రచ్చుచుండగా కోటిజ్వాలలతో కూడినదియు, పెనుధ్వని కలదియు, కాల్చివేయునదియునగుగొప్ప అగ్ని పుట్టెను.

అసా వ వ్యతితేజస్వీ వికారం సమరోచయత్‌,

వికుర్వతో బభౌ వహ్నే ర్వాయుః పరమదారుణః. 8

మహాతేజస్సుగల ఆనారాయణుడు దానిని కూడ ఒక వికారముగా భావించెను. మరల దానిని కుదిపి వేయగా ఆవహ్నినుండి పరమదారుణమగు వాయువు ఏర్పడెను.

తస్మాదపి వికార స్థా దాకాశం సమపద్యత,

వికారమునందున్న ఆ వాయువునుండి ఆకాశ##మేర్పడెను.

తచ్ఛబ్దలక్షణం వ్యోమ సచ వాయుః ప్రతాపవాన్‌. 9

తచ్చ తేజో మ్భసా యుక్తం శ్లిష్ట మన్యోన్యత స్తథా,

శబ్దముగురుతుగా గల ఆకాశము, గొప్ప ప్రతాపముగల ఆవాయువు, ఆ జలముతోకూడిన అగ్నియు ఒక దానితో నొకటి పెనవైచుకొనెను.

తేజసా శోషితం తోయం వాయునా ఉగ్రగామినా. 10

బాధితేన తథావ్యోమ్నా మార్గే దత్తేతు తత్షణాత్‌,

పిణ్డీభూతం తథాసర్వం కాఠిన్యం సమపద్యత. 11

అగ్ని నీటిని ఎండించెను. పెనువేగము గల వాయువు ఆకాశమునకు ఒత్తిడి కలిగించెను. అంత దానిలో కొంత దారి ఏర్పడెను. ఆక్షణమున అది అంతయు ముద్దగట్టెను. గట్టితనమేర్పడెను.

సేయం పృథ్వీ మహాభాగ తేషాం వృద్ధతరం భవత్‌,

చతుర్ణాం యోగకాఠిన్యా దేకైకం గుణవృద్ధితః. 12

నాలుగుభూతముల కలయికవలన నేర్పడిన గట్టి తనము వలనను, ఒకదానికంటె మరియొకదాని గుణములు పెరుగుట వలనను భూమి యేర్పడెను. తక్కినభూతములకంటె పెద్దది ఆయెను.

పృథ్వీ పఞ్చగునా జ్ఞేయా తేప్యేతస్యాం వ్యవస్థితాః,

స చ కాఠిన్యకం కుర్వన్‌ బ్రహ్మాణ్డం సమపద్యత. 13

పృథివి యిట్లు అయిదుగుణములు కలదియాయెను. తక్కిన భూతములన్నియు వీనియందు నెలకొనియుండెను. ఆమహావిష్ణువు ఇట్లు గట్టితనము నేర్పరచుచు బ్రహ్మాండమును నిర్మించెను.

తస్మి న్నారాయణో దేవ శ్చతు ర్మూర్తి శ్చతుర్భుజః,

ప్రాజాపత్యేన రూపేణ సిసృక్షు ర్వివిధాః ప్రజాః. 14

ఆ బ్రహ్మాండమునందు నాలుగుమూర్తులుగలవాడును, నాలుగు భుజములు గలవాడును అగు నారాయణుడు ప్రాజాపత్యరూపముతో వేరువేరు ప్రజలను సృజింపగోరెను. నాలుగుమూర్తులు : 1. సంకర్షణ, 2. వాసుదేవ, 3. ప్రద్యుమ్న, 4. అనిరుద్ధ నామకమలు.

చిన్తయన్నధిగచ్ఛేత సృష్టిం లోకపితామహః,

తతోస్య సుమహాన్‌ కోపో జజ్ఞే పరమదారుణః. 15

ఆ లోకపితామహుడట్లు భావన చేయుచు సృష్టి నేర్పరచెను. అంతలో ఆతనికి మిక్కిలి తీవ్రమగు కోపము పుట్టెను.

తస్మాత్కోపా త్సహస్రార్చి రుత్తస్థౌ దహనాత్మకః,

స తం దిధక్షు ర్బ్రహ్మాణం బ్రహ్మణోక్త స్తదా నృప. 16

ఆకోపమువలన వేయిజ్వాలలు గలదియు, కాల్చివేయునదియునగు అగ్ని పైకిలేచెను. అది బ్రహ్మను గాల్చివేయు నుంకింపగా బ్రహ్మయిట్లు పలికెను.

హవ్యం కవ్యం వహస్వేతి తతోసౌ హవ్యవాహనః

బ్రహ్మాణం క్షుధితః ప్రాయాత్‌ కింకరోమి ప్రశాధి మామ్‌,

స బ్రహ్మా ప్రత్యువాచైనం త్రిధా తృప్తి మవాప్స్యసి. 17

''అగ్నీ! నీవు హవ్యమును కవ్యమును మోయు చుండుము''. బ్రహ్మచెప్పినట్లుగా ఆతడు హవ్యవాహనుడాయెను. ఆ అగ్ని ఆకలిపొంది బ్రహ్మకడ కరిగి నా కానతిమ్ము. నేనేమి చేయవలయును? అని యడిగెను. అంతబ్రహ్మ నీవు మూడు విధములుగా తృప్తి పొందుదువని పలికెను.

దత్తాసు దక్షిణా స్వాదౌ తృప్తి ర్భూత్వా యతోమరాన్‌,

నయసే దక్షిణాభాగం దక్షిణాగ్ని స్తతో భవత్‌. 18

యజ్ఞములలో దక్షిణ లొసగగా ఆ దక్షిణల భాగములను దేవతలకు చేర్చుచు తృప్తినొందుము. ఇట్లు నీకు దక్షిణాగ్ని అను పేరేర్పడును.

ఆసమన్తా ద్ధుతం కిఞ్చి ద్యత్త్రిలోకే విభావసో,

త ద్వహస్వ సురార్థాయ తతస్త్వం హవ్యవాహనః. 19

ఓయి విభావసూ! మూడులోకములలో ఎల్లయెడల హోమముచేసిన పదార్థములను దేవతలకడకు కొనిపోవుచుండుము. ఆకారణమున నీవు హవ్యవాహనుడ వగుదువు.

గృహం శరీర మిత్యుక్తం తత్పతి స్త్వం యతోధునా,

అతో వై గర్హపత్య స్త్వం భవ సర్వగతో విభో. 20

శరీరమును గృహమందురు. నీవు దానికి పాలకుడవు. కావున నీకు గార్హపత్యుడను పేరు కలుగును. దీనితో నీవు ఎల్లయెడల నున్న వాడవగుదువు.

విశ్వాన్నరాన్‌ హుతో యేన నయసే సద్గతిం ప్రభో,

అతో వైశ్వానరో నామ తవ వాక్యం భవిష్యతి. 21

విశ్వమునందలి నరులందరు నీకు హోమము లర్పింతురు. వారికి నీవు సద్గతి నొసగుదువు. ఆకారణమున నీకు వైశ్వానరుడను పేరు కలుగును.

ద్రవిణం బల మిత్యుక్తం ధనఞ్చ ద్రవిణం తతః,

దదాతి తద్భవానేవ ద్రవిణోదా స్తతో భవత్‌. 22

ద్రవిణమనగా బలము. ధనమునుకూడ ద్రవిణమందురు. నిన్నర్చించు వారికి నీవు దాని నిత్తువు కనుక నీవు ద్రవిణోదుడవయితివి.

తనుం పాస్యతనుం పాసి యేన త్వం సర్వదా విభో,

తత స్తనూనపా న్నామ తవ వత్స భవిష్యతి. 23

నీవు తనువును (దేహముగల ప్రాణులను) తనువు కాని దానిని (దేహములేనివానిని) రక్షింతువు. కావున నాయనా! నీవు 'తనూనపాత్తు' అను పేరు గలవాడవగుదువు.

భవాన్‌ జాతాని వై వేద అజాతాని చ యేన వై,

అతస్తే నామ భవతు జాతవేదా ఇతి ప్రభో. 24

ఇంతవరకు రూపిందినవియు, ఇంకను రూపొందవలసిన వియు నగు వేదములను ఎరిగినవాడవు కనుక నిన్ను జాతవేదుడందురు.

నారాః సామాన్యతః పుంసో విశేషేణ ద్విజాతయః,

తే శంసన్తి యత స్త్వాం తు నారాశంస స్తతో భవ. 25

సామాన్యముగా పురుషులను 'నారు' లందురు. విశేషించి ద్విజన్ములు నారులు. వారు నిన్ను కొనియాడుదురు కావున నారాశంసుడని నీకు పేరైనది.

అగస్తిరోభ##వేన్నిత్యం నిః శబ్దో నిశ్చయాత్మకః,

అతస్త్వం సర్వగత్వాచ్చ తేనాగ్నిస్త్వం భవిష్యసి. 26

'అగస్సు' అనగా పాపము. వానిని నీవు రూపుమాపుదువు. 'నిస్‌' శబ్దము' 'నిశ్చయముగా' అను నర్థమును తెలుపును. 'అగస్‌+నిస్‌' - అనునది కలియగా 'అగ్ని' అను శబ్దము నీకు అర్థవంతము. అన్నింటియందున్న వాడవు కనుకను నీకు అగ్ని అనుపేరు ఏర్పడును.

ధ్మాప్రపూరణశబ్దోయ ఇధ్మానామప్రకీర్త్యతే,

పూరితస్య గతి ర్యేన తేవేధ్మస్త్వం భవిష్యసి. 27

'ధ్మా' ధాతువునకు నింపుట యని అర్థము. ఇధ్మములను నీకొరకు నింపుదురు గావున నీకు 'ఇద్మ' నామము కలుగుచున్నది.

యాజ్యాన్యేతాని నామాని తవ పుత్ర మహామఖే,

యజన్త స్త్వాం నరాః కామై స్తర్పయిష్యన్త్యసంశయః. 28

కుమారా! నీయీ పేరులన్నియు యజ్ఞమునకు సంబంధించినవి మహాయజ్ఞములందు నరులాయాకోరికలతో నిన్ను అర్చింతురు. నిన్ను తృప్తి పరతురు. నిక్కము.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే అష్టాదశోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున పదునెనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters