Varahamahapuranam-1    Chapters   

అథ ఏకోనవింశోధ్యాయః - పందొమ్మిదవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు పలికెను.

విష్ణో ర్విభూతి మాహాత్మ్యం కథితం తే ప్రసజ్గతః,

తథీనాం శృణు మహాత్మ్యం కథ్యమానం మయా నృప. 1

రాజా! ప్రసంగమునుబట్టి నీకు విష్ణుమాహాత్మ్యమును చెప్పితిని. ఇప్పుడు తిథుల మహిమను చెప్పుచున్నాను. వినుము.

ఇత్థంభూతో మహానగ్ని ర్బ్రహ్మక్రోధ సముద్భవః,

ఉవాచ దేవం బ్రహ్మాణం తిథి ర్మే దీయతాం విభో,

యస్యామహం సమస్తస్య జగతః ఖ్యాతి మాప్నుయామ్‌. 2

బ్రహ్మకోపమువలన పుట్టిన ఆ మహాగ్ని బ్రహ్మతో 'ప్రభూ! నాకొక తిథిని ప్రసాదింపుము. దానియందు నేను సమస్తలోకమున ఖ్యాతి పొందుదును'. అని పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మయిట్లు పలికెను.

దేవానా మథ యక్షాణాం గన్ధర్వాణా ఞ్చ సత్తమ,

ఆదౌ ప్రతిపదా యేన త్వముత్పన్నోసి పావక. 3

త్వత్పదాత్ర్పాతిపదికం సంభవిష్యన్తి దేవతాః,

ఆతస్తే ప్రతిపన్నామ తిథి రేషా భవిష్యతి. 4

ఓయి పాపకా! దేవతలలో, యక్షులలో, గంధర్వులలో, ఉత్తముడవగు నీవు మొదట ప్రతిపత్తున జన్మించితివి. నిన్ననుసరించి తక్కిన దేవతలందరు పట్టుదురు. కావున నీకు తిథి ప్రతిపత్తే యగును. (ప్రతిపత్తు - పాడ్యమి)

తస్యాం తిథౌ హవిష్యేణ ప్రాజాపత్యేన మూర్తినా,

హోష్యన్తి తేషాం ప్రీతాః స్యుః పితరః సర్వదేవతాః. 5

ప్రజాపతి నిర్మించిన హవిస్సులో ఆ తిథినాడు హోమము చేయువారి పితృదేవతలు, ఇతర దేవతలందరు తృప్తులగుదురు.

చతుర్విధాని భూతాని మనుష్యాః పశవోసురాః,

దేవాః సర్వే సగన్ధర్వాః ప్రీతా స్యుస్తర్పితా స్త్వయి. 6

పశువులు, అసురులు, గంధర్వులతోపాటు దేవతలు అనునీనాలుగు విధములైన భూతములు నీయందు ఉంచిన హోమాదులతో తృప్తిపొంది ప్రీతులగుదురు.

యచ్చోపవాసం కుర్వీత త్వద్భక్తః ప్రతిపద్దినే,

క్షీరాశనో వా వర్తేత శృణు తస్య ఫలం మహత్‌,

చతుర్యుగాని షడ్వింశం స్వర్గలోకే మహీయతే. 7

నీభక్తుడు పాడ్యమినాడు ఉపవాసముచేసెనేని, లేదా పాలుమాత్రము త్రావి యుండునేని దానిఫలము మిక్కిలి దొడ్డది. అట్టివాడు ఇరువది యారు మహా యుగములు స్వర్గమున సుఖముగా నుండును. (కొన్ని ప్రతులలో షట్త్రింశత్‌, - ముప్పది యారుమహా యుగముల కాలము - అని యున్నది.)

తేజస్వీ రూపసంపన్నో ద్రవ్యవాఞ్‌ జాయతే నరః, 8

ఇహ జన్మన్యసౌ రాజా ప్రేత్య స్వర్గే మహీయతే.

అట్టివ్రతము చేసినవాడు గొప్పతేజస్సుకలిగి, చక్కని రూపసంపద కలిగి, మహాధనవంతుడై, రాజై యీలోకమున విలసిల్లును. మరణించిన పిదప స్వర్గసుఖములతో అలరారును.

తూష్ణీంబభూవ సోప్యగ్ని ర్బ్రహ్మదత్తాశ్రమం య¸°. 9

అగ్నియు అదివిని యూరకుండెను. బ్రహ్మతన కొసగిన ఆశ్రమమున కరిగెను.

య ఇదం శృణుయా న్నిత్యం ప్రాత రుత్థాయ మానవః,

అగ్నే ర్జన్మ స పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. 10

మానవుడు ప్రతిదినము ఉదయమున లేచిన వెంటనే యీ అగ్నిజన్మమును గూర్చి విన్నచో ఆతడు పాపములనుండి ముక్తి పొందును. ఇందు నందియము లేదు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకోనవింశోధ్యాయః.

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున పందొమ్మిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters