Varahamahapuranam-1    Chapters   

ద్వా త్రింశో7ధ్యాయః - ముప్పదిరెండవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు అనెను.

అథోత్పత్తిం ప్రవక్ష్యామి ధర్మస్య మహతో నృప,

మహాత్మ్యం చ తిథిం చైవ తన్నిబోధ నరాధిప. 1

రాజా! నీకిపుడు గొప్పదియగు ధర్మము ఎట్లు పుట్టెనో, దాని మహిమ యెట్టిదో, దానికి సంబంధించిన తిథి యేమో వివరించెదను శ్రద్ధగా వినుము.

పూర్వం బ్రహ్మావ్యయః శుద్ధః పరాదపరసంజ్ఞితః,

స సిసృక్షుః ప్రజాస్త్వాదౌ పాలనం చ విచిన్తయత్‌. 2

మునుపు అవ్యయుడు, శుద్ధుడు, పరమునకంటె అపరుడను పేరుగలవాడు అగు బ్రహ్మ ప్రజలను సృజింపగోరి మొదట వారి పాలన మార్గమేమా! అని ఆలోచించెను.

తస్య చిన్తయత స్త్వఙ్గాద్‌ దక్షిణా చ్ఛ్వేతకుణ్డలః.

ప్రాదుర్బభూవ పురుషః శ్వేత మాల్యానులేపనః. 3

అట్లు చింతించుచుండగా ఆతనికుడిభాగమునుండి తెల్లని కుండలములు, తెల్లనిమాల్యములు, మైపూతలుగల పురుషుడొకడు పుట్టుకొనివచ్చెను.

తం దృస్ట్వో వాచ భగవాం శ్చతుష్పాదం వృషాకృతిమ్‌,

పాలయేమాః ప్రజాః సాధో త్వం జ్యేష్ఠో జగతో భవ. 4

నాలుగు పాదములతో ఎద్దువంటి ఆకారముగల ఆ పురుషుని గాంచి భగవానుడు 'సాధూ! ఈ ప్రజల నందరిని పాలింపుము. నీవు జగత్తునకు మొదటివాడవు కమ్ము' అని పలికెను.

ఇత్యుక్తః సమవస్థోసౌ చతుష్పాత్‌స్యాత్‌ కృతేయుగే,

త్రేతాయాం త్రిపదశ్చాసౌ ద్విపాదో ద్వాపరేభవత్‌,

కలా వేకేన పాదేన ప్రజాః పాలయతే ప్రభుః. 5

బ్రహ్మయిట్లు పలుకగా ఆతడు చక్కని స్థితిగాంచి కృతయుగమున నాలుగుపాదములతో, త్రేతయందు మూడు పాదములతో, ద్వాపరమున రెండు పాదములతో, కలియందు ఒకపాదముతో నిలిచి ప్రజలను పాలించెను.

షడ్భేదో బ్రహ్మణానాం స త్రిథా క్షత్రే వ్యవస్థితః,

ద్విధా నైశ్యైకధాశూద్రే స్థితః సర్వగతః ప్రభుః. 6

బ్రహ్మణులయందు ఆరుభేదములతో, క్షత్రియులయందు మూడుభావములతో, వైశ్యునియందు రెండుభావములతో, శూద్రుని యందు ఒక్కభావముతో ఆతడు నెలకొని అందరియందున్న వాడై పాలన చేసెను. (బ్రాహ్మణునియందు ఆరుభావములు 1. యజ్ఞముచేయుట. 2. యజ్ఞములుచేయించుట 3. వేదమలు చదువుట 4. చదివించుట 5. దానముచేయుట 6. దానమును పుచ్చుకొనుట. క్షత్రియుని యందు మూడు విధములు 1 యజ్ఞము చేయుట 2. వేదమును చదువుట, 3. దానముచేయుట. వైశ్యుని రెండుతీరులు 1. వ్యవసాయము. 2. వాణిజ్యము, శూద్రునియందు ఒకవిధము వృత్తుల రూపమున పైమూడు వర్గముల వారికి తోడ్పడుట.)

రసాతలేషు సర్వేషు ద్వీపవర్షే స్వయంప్రభుః.

సమస్తలోకముల యందును ద్వీపములయందును అధర్ముడనెడు ప్రభువు పాలన గావించెను.

ద్రవ్యగుణ క్రియా జాతిచతుఃపాదః ప్రకీర్తితః,

సంహితా పదక్రమశ్చైవ త్రిశృఙ్గోసౌ స్మృతో బుధై. 7

తథా ఆద్యన్త ఓంకార ద్విశిరాః సప్తహస్తవాన్‌,

త్రిబద్ధబద్ధో విప్రాణాం ముఖ్యః పాలయతే జగత్‌. 8

ద్రవ్యము, గుణము, క్రియ, జాతి అనునీ నాలుగును ఆతని పాదములు. సంహిత, పదము, క్రమము అనునవి ఈ వృషభరూపపురుషుని మూడు కొమ్ములు. ఓంకారము మొదలుతుది అను రెండును ఈతని రెండు శిరస్సులు. విభక్తులుఏడును ఏడు హస్తములు. ఉదాత్త, అనుదాత్తస్వరితములను మూడు విధములుగా రూపొందిన నాదమయ పురుషుడాతడు. జ్ఞానసంపన్నులలో ముఖ్యుడై జగము నంతటిని పాలించుచుండెను.

సధర్మః పీడితః పూర్వం సోమే నాద్భుతకర్మణా,

తారాం జిఘృక్షతా పత్నీం భ్రాతు రాఙ్గిరసస్య హ. 9

వింతగొలుపు పనులుగల చంద్రుడు మునుపు అంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను తారను చేజిక్కించుకొని ఆ ధర్మపురుషుని నొప్పించెను.

సోపాయాద్‌ భీషితస్తేన బలినా క్రూరకర్మణా,

అరణ్యం గహనం ఘోర మావివేశ తదా ప్రభుః. 10

అప్పుడా ధర్మప్రభువు క్రూరకర్ముడు, బలవంతుడునగు ఆ చంద్రుడు భయపెట్టగా భయంకరము, చొరరానిది అగు అడవికి చొచ్చెను.

తస్మిన్‌ గతే సురాః సర్వే అసురాణాం తు పత్నయః,

జిఘృక్షన్త స్త దౌకాంసి బభ్రము ర్ధర్మవఞ్చితాః,

అసురా అపి తద్వచ్చ సురవేశ్మని బభ్రముః 11

అట్లు ధర్మపురుషుడు అడవులపాలుకాగా దేవతలందరు రాక్షసులపత్నులను పట్టుటకై ధర్మహీనులై వారియిండ్లలో తిరుగజొచ్చిరి. అట్లే రక్కసులు దేవతల యిండ్లలో తిరుగాడిరి.

నిర్మర్యాదే తథా జాతే ధర్మనాశే చ పార్థివ,

దేవాసురా యుయుధిరే సోమదోషేణ కోపితాః,

స్త్రీ హేతో శ్చ మహాభాగ వివిధాయుధ పాణయః. 12

ఇట్లుహద్దులుపోయి ధర్మము నశింపగా సోముడు చేసిన తప్పువలన కోపించిన దేవతలును, రాక్షసులును స్త్రీకారణముగ పెక్కుతీరుల ఆయుధములను చేపట్టి పోరదొడగిరి.

తాన్‌ దృష్ట్వా యుధ్యతో దేవానసురైః సహ కోపితాన్‌,

నారదః ప్రాహ సంగమ్యపిత్రే బ్రహ్మణి హర్షితః. 13

అట్లు రక్కసుల యెడ కోపించి పోరాడుచున్న దేవతలను గావించి సంబరపడి నారదుడీ వార్తను బ్రహ్మకడ కరిగి వివరించెను.

స హంసయాన మారుహ్య సర్వలోకపితామహః,

నివారయామాస తదా కస్యార్థేయుద్ధ మబ్రవీత్‌. 14

అంత సర్వలోకములకు తాతయగు బ్రహ్మ హంస వాహనము నెక్కి అటకువచ్చి ఈ యుద్ధమునకు ప్రయోజనమేమి? అని పలుకుచు వారిని నివారించెను.

సర్వే శశంసుః సోమంతు సతుబుద్ధ్వా స్వకం సుతమ్‌,

పీడనా దపయాతం తు గహనం వన మాశ్రితమ్‌. 15

వారందరు దీనికి కారణము సోముడని చెప్పిరి. ఆతని పీడవలననే తన పుత్రుడగు ధర్ముడు అడవుల పాలాయె నని బ్రహ్మ తెలిసికొనెను.

తతోబ్రహ్మా య¸° తత్ర దేవాసురయుతస్త్వరన్‌,

దదర్శ చ సురైః సార్థం చతుష్పాదం వృషాకృతిమ్‌,

చరన్తం శశిసంకాశం దృష్ట్వా దేవా సువాచ హ. 16

అంత బ్రహ్మ దేవదానవులతో కలసి వడిగా ధర్ముడున్న చోటి కరిగెను. అందు నాలుగుపాదములతో వృషభము రూపుతో చంద్రునివలె విహరించుచున్న ఆధర్ముని దేవతలతో పాటు గాంచి వారితో నిట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ యిట్లు పలికెను.

అయం మే ప్రథమః పుత్రః పీడితః శశినా భృశమ్‌,

పత్నీం జిఘృక్షతా భ్రాతు ర్దర్మసంజ్ఞో మహామునిః. 17

ఈతడు నామొదటికొడుకు ధర్ముడను పేరు గలవాడు. మహాముని. సోదరుని భార్యను పట్టనెంచిన చంద్రుడు ఈతని మిక్కిలి పీడించెను.

ఇదానీం తోషయధ్వం వై సర్వ ఏవ సురాసురాః,

యేన స్థితి ర్వో భవతి సమం దేవాసురా ఇతి. 18

దేవతలారా! అసురులారా! మీరందరు ఇతనిని సంతోషపెట్టుడు. దానివలన మీఉభయులకు సమముగా చక్కని స్థితి కలుగును.

తతఃసర్వే స్తుతిం చక్రు స్తస్య దేవస్య హర్షితాః,

విదిత్వాబ్రహ్మణో వాక్యాత్‌ సంపూర్ణ శశిసంనిభమ్‌. 19

అంత దేవతలందరు బ్రహ్మమాటవలన ఆతని సంగతి నెరిగి నిండుచంద్రుని బోలు ఆతని స్తుతించిరి.

దేవా ఊచుః - దేవతలిట్లు పలికిరి.

నమోస్తు శశిసంకాశ నమస్తే జగతః పతే,

నమోస్తు దేవరూపాయ స్వర్గమార్గప్రదర్శక,

కర్మమార్గ స్వరూపాయ సర్వగాయ నమె నమః. 20

చంద్రునిబోలిన దేవా! జగత్పతీ! దేవరూపా! స్వర్గమునకు దారిచుపువాడా! కర్మమార్గమే స్వరూపమైన వాడా! సర్వమున నుండు స్వామీ! నీకు నమస్కారము.

త్వయేయం పాల్యతే పృథ్వీ త్రైలోక్యంచ త్వయైవ హి,

జన స్తపస్తథా సత్యం త్వయా సర్వంతు పాల్యతే. 21

నీవే యీ భూమినంతటని రక్షించుచున్నావు. ముల్లోకమలును నీరక్షణయందే నిలిచియున్నవి. జనలోకము, తపోలోకము, సత్యలోకము - అదియిది యననేల సర్వమును నీవే పాలించు చున్నావు.

న త్వయా రహితం కిఞ్చి జ్జగత్‌ స్థావరజంగమమ్‌,

విద్యతే తద్విహీనం తు సద్యో నశ్యతి వై జగత్‌. 22

చరాచర ప్రపంచమున నీవు లేనిది కొంచెమేనియు లేదు. నీవు లేనియెడల జగమంతయు అప్పటికప్పుడు నాశనమగును.

త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్త్వస్వరూపవాన్‌,

రాజసానాం రజస్త్వంచ తామసానాం తమోమయః. 23

నీవు సర్వభూతములకు ఆత్మవు. సజ్జనులకు సత్త్య స్వరూపముతో, రజోగుణముగలవారికి రజస్స్వరూపముతో, తమోగుణము మిక్కుటమైన వారికి తమోగుణమయ రూపముతో నీవు కన్పట్టుదువు.

చతుష్సాదో భవాన్‌ దేవ చతుశ్శృఙ్గ స్త్రిలోచనః,

సప్తహస్తి స్త్రి బన్దశ్చ వృషరూప నమోస్తుతే. 24

దేవా! నీకు నాలుగుపాదములు, నాలుగుకొమ్ములు, మూడుకన్నులు, ఏడుచేతులు, మూడుబంధములు. ఇట్టివానితో వృషభరూపమున నున్న దేవా నీకు నమస్కారము.

త్వయా హీనా వయం దేవ సర్వ ఉన్మార్గ వర్తినః,

తన్మార్గం యచ్ఛ మూఢానాం త్వం హి నః పరమాగతిః. 25

నీవులేని మేము పిచ్చిమార్గములను పట్టితిమి. ఆమార్గమును మూఢుల కొసగుము. మాకు నీవే పరమగతివి.

ఏవం స్తుత స్తదా దేవై ర్వృషరూపీ ప్రజాపతిః,

తుష్టః ప్రసన్నమనసా శాన్తచక్షు రపశ్యత. 26

దేవతలందరు ఇట్లు కీర్తింపగా వృషభరూపధర్ముడు తుష్టిచెంది ప్రసన్నమైనమనసుతో శాంతమైన చూపుతో వారిని చూచెను.

దృష్ట మాత్రాస్తు తే దేవాః స్వయం ధర్మేణ చక్షుషా.

క్షణన గత సంమోహాః సమ్యక్‌ సద్ధర్మసంహితాః. 27

ధర్మపురుషుడు తన కంటితో చూచినంత మాత్రమున దేవత లందరు క్షణముతో మోహమును వదలివైచిరి. చక్కని ధర్మముతో కూడినవారైరి.

అసురా అపి తద్వచ్చతతో బ్రహ్మా ఉవాచ తమ్‌,

అద్యప్రభృతి తే ధర్మ తిథి రస్తు త్రయోదశీ. 28

రక్కసులును అట్లే అయిరి. అంత బ్రహ్మ అతనితో ఇట్లు పలికెను. ధర్మా! ఈ దినమునుండి నీకు త్రయోదశి ప్రియమగు తిథి యగుగాక!

యస్తా ముపోష్య పురుషో భవన్తం సముపార్జయేత్‌,

కృత్వా పాపసమాహారం తస్మాన్ముఞ్చతి మానవః. 29

ఆ తిథినాడు ఉపవాసముండి నిన్ను సాధించువాడు. పాపము లన్నియు చేసినవాడైనను వానినుండి విముక్తి పొందును.

యచ్చారణ్యమిదం ధర్మ త్వయా వాప్తంచిరం ప్రభో,

నామ్నా భవిష్యతి హ్యేత ద్ధర్మారణ్య మితిప్రభో. 30-

నీవు బహుకాలము తిరిగిన కారణమున ప్రభూ! ఈ అరణ్యమునకు నీపేరుతో ధర్మారణ్యమను ప్రసిద్ధి కలుగును.

చతుస్త్రి పాద్ద్వ్యేక పాదాశ్చ ప్రభో త్వం

కృతాదిభి ర్లక్ష్యసే యేన లోకైః,

తథాతథా కర్మభూమౌ నభశ్చ

ప్రాయోముక్తః స్వగృహం పాహి విశ్వమ్‌. 31

నాలుగు, మూడు, రెండు ఒకటి అయిన పాదములతో కృత త్రేతాద్వాపకలియుగములందు నీవు లోకులకు గానవత్తువు. అట్లు ఈ కర్మభూమియందును, పైలోకములందును నీవు సాధారణముగా స్వగృహమునందు వలె నిలుచుచు ఈ విశ్వమంతటిని పరిరక్షింపుము.

విశ్వమంతటిని పరిరక్షింపుము.

ఇత్యుక్తమాత్రః ప్రపితామహోధునా

సురాసురాణా మథ పశ్యతాం నృప,

అదృశ్యతా మగమత్‌ స్వాలయాం శ్చ

జగ్ముః సురాః సవృషా వీతశోకాః. 32

ఇట్లువారు పలికినంత బ్రహ్మదేవుడు దేవదానవులు చూచుచుండగా అదృశ్యుడాయెను. ఆ దేవతలును దుఃఖమును వీడి ధర్మసహితులై తమతమ గృహముల కరిగిరి.

ధర్మోత్పత్తిం య ఇమాం శ్రావయీత

తదా శ్రాద్ధేన తర్పయేత పితౄంశ్చ,

త్రయోదశ్యాం పాయసేన స్వశక్త్యా

స స్వర్గగామీ తు సురా నుపేయాత్‌. 33

ఈ ధర్ముని పుట్టుక కథను వినిపింపజేసిన వాడును, శ్రాద్ధకర్మలలో దీనితో పితృదేవతలకు తర్పణము చేయువాడును త్రయోదశి యందు శక్తికొలది పాయసముతో భోజనము పెట్టువాడును స్వర్గమున కరిగి దేవతలతో కలిసియుండును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే ద్వాత్రింశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదిరెండవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters