Varahamahapuranam-1    Chapters   

చతుశ్చత్వారింశో7ధ్యాయః - నలుబది నాల్గవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు పలికెను.

వైశాఖే7 ప్యేవ మేవం తు సంకల్ప్య విధినా నరః,

తద్వత్‌ స్నానాదికం కృత్వా తతో దేవాలయం వ్రజేత్‌. 1

వైశాఖమాసమున కూడ జను డిట్లే సంకల్పించి, మునుపు చెప్పినట్లు స్నానము మొదలగు నది ఆచరించి దేవాలయమున కరుగ వలయును.

తత్రారాధ్య హరింభక్త్యా ఏభిర్మంత్రై ర్విచక్షణః,

జామదగ్న్యాయ పాదౌతు ఉదరం సర్వధారిణ,

మధుసూదనాయేతి కటి మురః శ్రీ వత్సధారిణ. 2

క్షత్రాంతకాయ చ భుజౌ మణికంఠాయ కంఠకమ్‌,

స్వనామ్నా శంఖచక్రౌతు శిరో బ్రహ్మాండధారిణ. 3

అచట భక్తితో హరిని ఈ మంత్రములతో నర్చింప వలయును. 'ఓం నమో జామదగ్న్యాయ' అని పాదములను, 'సర్వధారిణ' అని ఉదరమును, 'మధుసూదనాయ' అని నడుమును, 'శ్రీవత్సధారిణ' అని రొమ్మును, 'క్షత్రాంతకాయ' అని భుజములను, 'మణికంఠాయ' అని కంఠమును, వాని పేరులతో - అనగా 'పాంచజన్యాయ' అని శంఖమును, 'సుదర్శనాయ' అని చక్రమును, 'బ్రహ్మాండ ధారిణ' అని శిరస్సును నమస్కరింపవయును.

ఏవ మభ్యర్చ్య మేధావీ ప్రాగ్వత్‌ తస్వాగ్రతో ఘటమ్‌,

విన్యస్య స్థగితం తద్వద్‌ వస్త్రయుగ్మేన వేష్టితమ్‌. 4

ఇట్లు కొలిచి బుద్ధిశాలి మునుపటి వలెనే జంట బట్టలు చుట్టినదియు, మూసినదియు నగు ఘటమును ఆ దేవుని ముందు నిలుపవలయును.

వైణవేన తుపాత్రేణ తస్మిన్‌ సంస్థాపయే ద్ధరిమ్‌,

జామదగ్న్యేతి విఖ్యాతం నామ్నా క్లేశ వినాశనమ్‌. 5

జమదగ్ని తనయుడని పేరొందిన పరశురాముని, కష్టములు పోకార్చు వానిని వెదురుపాత్రతో నిర్మించి అందు ఉంచవలయును.

దక్షిణ పరశుం హస్తే తస్య దేవస్య కారయేత్‌,

సర్వగంధైశ్చ సంపూజ్య పుషై#్ప ర్నానావిధైః శుభైః. 6

అతని కుడిచేతి యందు గొడ్డలిని ఏర్పరుప వలయును. సుగంధములు గల పెక్కు విధములగు పూవులతో పూజింపవలయును.

తతస్త స్యాగ్రతః కుర్యా జ్జాగరం భక్తిమా న్నరః,

ప్రభాతే విమలే సూర్యే బ్రాహ్మనాయ నివేదయేత్‌,

ఏవం నియమ యుక్తస్య యత్ఫలం తన్నిబోధ మే. 7

పిదప ఆతనిముందు భక్తితో జాగరము చేయవలయును. తెల్లవారిన పిదప (సూర్యోదయమైన తరువాత) ఆ కుంభమును బ్రాహ్మణునకు సమర్పింపవలయును. ఇట్లు నియమముతోకూడి వ్రతము చేయువాడుపొందు ఫలము చెప్పెదను. వినుము.

ఆసీద్‌ రాజా మహాభాగో వీరసేనో మహాబలః,

అపుత్రః సపురా తీవ్రం తప స్తేపే మహౌజసా. 8

పూర్వము వీరసేనుడను మహాబలము గల రాజుండెడి వాడు. అతడు పుత్రులు లేనివాడు. గొప్పశక్తితో తీవ్రమగు తపస్సు చేసెను.

చరత స్తత్తపో ఘోరం యాజ్ఞవల్క్యో మహామునిః,

ఆజగామ మహాయోగీ తం దృష్ట్వా నాతిదూరతః. 9

అట్లు ఘోరమైన తపస్సు చేయుచున్న ఆతనిని అల్లంత దూరమునుండి చూచి యాజ్ఞవల్క్యమహాముని యను మహాయోగి ఆతని కడకు వచ్చెను.

త మాయాంత మథో దృష్ట్వా ఋషిం పరమవర్చసమ్‌,

కృతాఞ్జలి పుటో భూత్వా రాజాభ్యుత్థాన మాకరోత్‌. 10

గొప్ప ముఖవర్చస్సు గల ఆ ఋషి వచ్చుచుండగా చూచి రాజు దోయిలొగ్గి ఆతని కెదురేగెను.

స పూజితో మునిః ప్రాహ కిమర్థం తప్యతే తపః,

రాజన్‌ కథయ ధర్మజ్ఞ కింతే కార్యం వివక్షితమ్‌. 11

ఆతని పూజ లంది ముని రాజా! ధర్మజ్ఞా! దేనికొరకు తపస్సు చేయుచున్నావు? నీవు సంకల్పించిన ఫలమేమి? అని అడిగెను.

రాజోవాచ - రాజిట్లనెను.

అపుత్రో7హం మహాభాగ నాస్తి మే పుత్రసంతతిః,

తేన మే తప ఆస్థాయ కృశ్యతే స్వతను ర్ద్విజ. 12

పుణ్యాత్ముడా! నేను అపుత్రుడను. నాకు పుత్ర సంతానము లేదు. కావున తపస్సు చేత నా దేహమును కష్టపెట్టుచున్నాను.

యాజ్ఞవల్క్యవాచ - యాజ్ఞవల్క్యు డిట్లనెను.

అలం తే తప సానేన మహాక్లేశేన పార్థివ,

అల్పాయాసేన తే పుత్రో భవిష్యతి న సంశయః. 13

రాజా! చాలకష్టమైన ఈ తపస్సు వలదు. నీకు కొంచెము పాటి క్లేశముతో పుత్రుడు లభించును. సంఖయింపకుము.

రాజోవాచ - రాజిట్లనెను.

కథం మే భవితా పుత్రో అల్పాయాసేన వై ద్విజ,

ఏతన్మే కథయ ప్రీతో భగవన్‌ ప్రణతస్య హ. 14

బ్రాహ్మణోత్తమా! తేలిక శ్రమతో నాకు పుత్రుడెట్లు కలుగును? నీకు మ్రొక్కెడను. నాయందు ప్రీతికలవాడవై నాకు దానిని బోధింపుము.

దుర్వాసా ఉవాచ - దుర్వాసుడిట్లు చెప్పెను.

ఏవ ముక్తో ముని స్తేన పార్థివేన యశస్వినా,

ఆచఖ్యౌ ద్వాదశీం చేమాం వైశాఖే సితపక్షజామ్‌. 15

ఆ రాజట్లు పలుకగా ఆ ముని అతనికి వైశాఖమాసమున శుక్ల పక్షమున ద్వాదశినాడు చేయవలసిన ఆ పుజను గూర్చి వివరించెను.

స హి రాజా విధానేన పుత్రకామో విశేషతః,

ఉపోష్య లబ్ధవాన్‌ పుత్రం నలం పరమధార్మికమ్‌,

యో7ద్యాపి కీర్త్యతే లోకే పుణ్యశ్లోకో నరోత్తమః. 16

పుత్రులను కోరిన ఆ రాజు విధానము ననుసరించి ఉపవాసముండి ఆ వ్రతమాచరించి పరమధార్మికుడగు నల మహారాజును పుత్రునిగా పడసెను. ఈనాటికి ఆ నలుని పుణ్యశ్లోకుడని కీర్తించుచున్నారు.

ప్రాసంగికం ఫలం హ్యేతద్‌ గతస్యాస్య మహామునే,

సుపుత్రో జాయతే విత్తవిద్యావాన్‌ కాంతి రుత్తమా. 17

ఓ మహామునీ! ఈ వ్రతము నాచరించువానికి ధనము విద్య, చక్కని ముఖ కాంతిగల మంచి కుమారుడు కలుగును. ఇది ఒక అప్రధానమగు ఫలము.

ఇహ జన్మని కించిత్రం పరలోకే శృణుష్వ మే,

కల్పమేకం బ్రహ్మలోకే వసిత్వాప్సరసాంగణౖః, 18

క్రీడత్యన్తే పునః సృష్టౌ చక్రవర్తీ భ##వేద్ధ్రువమ్‌,

త్రింశత్యబ్ద సహస్రాణి జీవతే నాత్ర సంశయః. 19

ఈ లోకమున ఇట్టి ఫలమందుట ఏమిచిత్రము? పరలోకము మాట వినుము. ఒక కల్పకాలము బ్రహ్మలోకమున అప్సరసల గణములతో విలాసముగా గడపి మరుసృష్టియందు చక్రవర్తియై జనించును. ముప్పదివేల సంవత్సరములు జీవించును. సంశయమిందులేదు.

ఇతి శ్రీవరాహ పురాణ భగవచ్ఛాస్త్రే చతుశ్చత్వారింశో7ధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నలుబది నాల్గవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters