Varahamahapuranam-1    Chapters   

నవపంచాశోధ్యాయః - ఏబది తొమ్మిదవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

అథావిఘ్నకరం రాజన్‌ కథయామి శృణుష్వ మే,

యేన సమ్యక్‌ కృతేనాపి న విఘ్న ముపజాయతే. 1

రాజా! నీకు అవిఘ్నకరమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది చక్కగా చేసినచో విఘ్నము అనునది కలుగదు.

చతుర్థ్యాం ఫాల్గునే మాసి గ్రహీతవ్యం వ్రతం త్విదమ్‌.

నక్తాహారేణ రాజేన్ధ్ర తిలాన్నం సారణం స్మృతమ్‌,

తదే వాగ్నౌచ హోతవ్యం బ్రాహ్మణాయ చ తద్భవేత్‌. 2

రాజా! ఫాల్గునమాసమున చవితినాడు ఈ వ్రతమును చేపట్టవలయును. రాత్రి పూట నువ్వులు కలిపిన భోజనము చేయ వలయును. దానినే హోమముచేసి బ్రాహ్మణునకును ముందు సమర్పింపవలయును.

చాతుర్మాస్యం వ్రతం చైతత్‌ కృత్వా వై పఞ్చయే తథా,

సౌవర్ణం గజవక్త్రం తు కృత్వా విప్రాయ దాపయేత్‌. 3

పాయసైః పంచభిః పాత్రై రుపేతం తు తిలైస్తథా,

ఏవం కృత్వా వ్రతం చైతత్‌ సర్వవిఘ్నై ర్విముచ్యతే. 4

ఈ వ్రతమును కూడ నాలుగుమాసముల కాలము చేయవలయును. అయిదవనెలలో సువర్ణముతో విఘ్నేశ్వరుని ప్రతిమను చేయించి అయిదు పాత్రల యందు నువ్వులతో కూడిన పాయసముతో పాటు దానము చేయవలయును. ఇట్లు ఈ వ్రతమును చేసినవాడు అన్ని విఘ్నములనుండియు విడివడును.

హయమేధస్య విఘ్నేతు సంజాతే సగరః పురా,

ఏతదేవ చరిత్వా తు హయమేధం సమాప్తవాన్‌. 5

మునుపు సగరుడు తన అశ్వమేధ యాగమునకు విఘ్నము కలుగగా దీనినే ఆచరించి ఆ యజ్ఞము సమాప్తి చేసికొనెను.

తథా రుద్రేణ దేవేన త్రిపురం నిఘ్నతా పురా,

ఏత దేవ కృతం తస్మాత్‌ త్రిపురం తేన పాతితమ్‌,

మయా సముద్రం పిబతా ఏత దేవకృతం వ్రతమ్‌. 6

అన్యైరపి మహీపాలై రేతదేవ కృతం పురా,

తపోర్థిభి ర్జానకృతై ర్నిర్విఘ్నూర్థే పరంతప. 7

త్రిపురాసురులను వధించునపుడు రుద్ర దేవుడు దీనినా చరించియే వారి సంహారము గావించెను. నేనును సముద్రమును త్రావునపుడు ఈ వ్రతము నాచరించితిని. మరియు పెక్కండ్రు రాజులు, తాపసులు, జ్ఞానవంతులు విఘ్నములు లేకుండుటకై ఈ వ్రతమును చేసియున్నారు.

శూరాయ ధీరాయ గజాననాయ

లంబోదరా యైక దంష్ట్రాయ చైవ,

ఏవం పూజ్య స్తద్దినే తత్‌ పునశ్చ

హోమం కుర్యాద్‌ విఘ్నవినాశ హేతోః. 8

శూరుడు, ధీరుడు, గజముఖుడు, లంబోదరుడు, ఏక దంతుడు అగు దేవునకు నమస్కారము. అనుచు ఆ దినమున పూజింపవలయును. విఘ్నములు నశించుటకై తిరిగి హోమము నాచరించవలయును.

అనేక కృతమాత్రేణ సర్వవిఘ్నై ర్విముచ్యతే,

వినాయకస్య కృపయా కృతకృత్యో నరో భ##వేత్‌. 9

ఈ వ్రతమునాచరించిన మాత్రమున నరుడు, నెరవేరిన ప్రయోజనములు కలవాడై వినాయకుని కృపచేత సర్వవిఘ్నముల నుండియు ముక్తుడగును.

ఇతి శ్రీ వారాహ పురాణ భగవచ్ఛాస్త్రే నవపంచాశోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది తొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters