Varahamahapuranam-1    Chapters   

షష్టితమోధ్యాయః - అరువదియవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

శాంతి వ్రతం ప్రవక్ష్యామి తవ రాజన్‌ శృణుష్వ తత్‌,

యేన చీర్ణేన శాంతిః స్యాత్‌ సర్వదా గృహమేధినామ్‌. 1

రాజా! ఇంక నీకు శాంతివ్రతమును గూర్చి చెప్పెదను వినుము. అది చేసినచో గృహస్థులకు ఎల్లవేళల శాంతి కలుగును.

పంచమ్యాం శుక్లపక్షస్య కార్తికే మాసి సువ్రత,

అరభేద్‌ వర్షమేకం తు భుంజీయా దవ్లు వర్జితమ్‌. 2

కార్తికమాసము శుక్లపక్షపు పంచమినాడు దీనిని మొదలిడవలయును. ఒక సంవత్సరము పులుపు లేని భోజనము చేయవలయును.

నక్తం దేవం తు సంపూజ్య హరిం శేషోపరి స్థితమ్‌,

అనంతాయేతి పాదౌ తు వాసుకా యేతి వైకటిమ్‌. 3

తక్షకాయేతి జఠర మురః కర్కోటకాయ చ,

పద్మాయ కంఠం సంపూజ్య మహాపద్మాయ దోర్యుగమ్‌. 4

శంఖపాలాయ వక్త్రంతు కుటిలాయేతి వై శిరః,

ఏవం విష్ణుగతం పూజ్య పృథక్త్వేన చ పూజయేత్‌. 5

ఆనాటిరాత్రి శేషునిపై ఉన్న హరిని పూజింపవలయును. 'ఓం నమో అనంతాయ' అని పాదములను, నమో వాసుకయే అని నడుమును, 'సమ స్తక్షకాయ' అని ఉదరమును, 'నమఃకర్కోటకాయ' అని రొమ్మును, నమః పద్మాయ అని కంఠమును, 'నమో మహా పద్మాయ' అని భుజముల జంటను, 'నమః శంఖపాలాయ' అని ముఖమును, 'నమః కుటిలాయ' అని శిరస్సును ఇట్లు విష్ణుగతము గాను, విడిగా నాగులను పూజింపవలయును.

క్షీరేణ స్నపనం కుర్యాత్‌ తా నుద్దిశ్య హరేః పునః,

తదగ్రే హోమయేత్‌ క్షీరం తిలైః సహ విచక్షణః. 6

ఆ సర్పములను, విష్ణువును ఉద్దేశించి పాలతో స్నానము చేయవలయును. వారిముందు పాలతో నువ్వులతో హోమము చేయవలయును.

ఏవం సంవత్సరస్యాన్తే కుర్యాద్‌ బ్రాహ్మణభోజనమ్‌,

నాగం తు కాంచనం కుర్యాద్‌ బ్రాహ్మణాయ నివేదయేత్‌. 7

ఇట్లు ఒక సంవత్సరము ముగిసిన తరువాత బ్రాహ్మణ సంతర్పణము చేయవలయును. బంగారు నాగ ప్రతిమను బ్రాహ్మణు నకు దాన మీయవలయును.

ఏవం యః కురుతే భక్త్యా వ్రతమేతన్నరాధిప,

తస్య శాన్తిర్భవే న్నిత్యం నాగానాం నభయం తథా. 8

ఈ విధముగా ఈ వ్రతమును భక్తితో చేయువానికి శాంతి లభించును. పాములభయము కలుగదు.

ఇతి శ్రీ వారహపురాణ భగవచ్ఛాస్త్రే షష్టితమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువదియవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters