Varahamahapuranam-1    Chapters   

షట్షష్టితమోధ్యాయః - అరువది ఆరవ అధ్యాయము

భద్రాశ్య ఉవాచ - భద్రాశ్వుడిట్లనెను.

ఆశ్చర్యం యది తే కిఞ్చి ద్విదితం దృష్టమేవ చ,

తన్మే కథయ ధర్మజ్ఞ పరం కౌతూహలం మహత్‌. 1

ఓ ధర్మజ్ఞా! నీ వెరిగినది గాని చూచినదిగాని ఆశ్చర్యమేమైన ఉన్నచో నాకు చెప్పుము. నాకు మిక్కిలి వేడుకగా నున్నది.

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

ఆశ్చర్యరూపో భగవా నేష ఏవ సనాతనః,

తస్యాశ్చర్యాణి దృష్టాని బహూని వివిధాని చ. 2

ఈ సనాతనుడగు భగవంతుడే ఆశ్చర్యరూపుడు. ఆతని ఆశ్చర్యము పెక్కు పెక్కువిధములైనవి కానవచ్చుచున్నవి.

శ్వేతద్వీపగతః పూర్వం నారదః కిల పార్థివ,

సోపశ్య చ్ఛంఖ చక్రాబ్జాన్‌ పురుషాం స్తిగ్మ తేజసః. 3

పూర్వమున నారదుడు శ్వేతద్వీపమునకు వెళ్లెనట. అచట శంఖచక్రపద్మములుగలవారు, తీవ్రమగు తేజస్సు కలవారునగు పురుషులను చూచెను.

అయం విష్ణు రయం విష్ణు రేష విష్ణుః సనాతనః,

చిన్తాభూత్తస్య తాన్‌ దృష్ట్వాకో స్మిన్‌ విష్ణు రితి ప్రభుః 4

ఇదిగో విష్ణువు, ఇతడే విష్ణువు, ఇతగు సనాతనుడగు విష్ణువు. ఇట్లని ఇందులో ప్రభువైన విష్ణువెవ్వరు? అని వారిని కాంచిన అతనికి చింతకలిగెను.

ఏవం చిన్తయత స్తస్య చిన్తా కృష్ణం ప్రతి ప్రభో,

ఆరాధయామి చ కథం శంఖచక్రగదాధరమ్‌. 5

యేన వేద్మి పరం దేవం కృష్ణం నారాయణం ప్రభుమ్‌,

ఏవం సంచింత్య దధ్యౌ స తం దేవం పరమేశ్వరమ్‌. 6

ఇట్లు చింతించుచుండగా ఆతనికి కృష్ణుని గూర్చిన విచారము బయలుదేరెను. శంఖచక్ర గదాధరుడైన కృష్ణుని ఎటులు ఆరాధింతును. పరమదైవము, ప్రభువునగు కృష్ణుని ఎట్లు తెలిసి కొందును అనిచింతించి ఆ పరమేశ్వరుడగు దేవుని గూర్చి ధ్యానించెను.

దివ్యం వర్షసహస్రంతు సాగ్రం బ్రహ్మసుతస్తదా,

ధ్యాయతస్తస్య దేవోసౌ పరితోషం జగామ హ. 7

బ్రహ్మకు కుమారుడగునారదుడు వేయిదివ్యవత్సరములు ఏకాగ్రముగా ధ్యానము చేయగా ఆ దేవదేవుడు పరితోషము పొందెను.

ఉవాచ స ప్రసన్నాత్మా వ్రత్యక్షత్వం గతః ప్రభుః,

వరం బ్రహ్మసుత బ్రూహి కింతే దద్మి మహామునే. 8

ప్రసన్నమగు చిత్తముగల ఆ ప్రభువు ప్రత్యక్షమై నారదా! నీకేమి వరమిత్తును? మహామనీ! అడుగుము అని పలికెను.

నారద ఉవాచ - నారదు డిట్లనెను.

సహస్ర మేకం వర్షాణాం ధ్యాతస్త్వం భువనేశ్వర,

త్వత్ర్పాప్తి ర్యేన తద్‌బ్రూహి యది తుష్టోసి మేచ్యుత. 9

భువనేశ్వరా నిన్నునేను వేయినొక్కవత్సరములు ధ్యానించి తిని. నిన్ను పొందుట యెట్లో, నాయెడ తుష్టి నందితివేని, తెలుపుము.

దేవదేవ ఉవాచ - దేవదేవు డిట్లనెను.

పౌరుషం సూక్త మాస్థాయ యే యజన్తి ద్విజాశుమామ్‌,

తే మాం ప్రాప్స్యన్తి సతతం సంహితాధ్యయనేన చ. 10

పురుషసూక్తమును ఆధారము చేసికొని నన్నెవరర్చింతురో వారును, నిరంతరము వేదసంహితల నధ్యయనము చేయువారును నన్ను పొందెదరు.

అలాభే వేదశాస్త్రాణాం పాంచరాత్రోదితేన హి,

మార్గేణ మాం యజన్తే యే తే మాం ప్రాప్స్యన్తి మానవాః,

బ్రాహ్మణక్షత్రియ విశాం పఞ్చరాత్రం విధీయతే. 11

వేదములు శాస్త్రములు పట్టుబడనిచో పాంచరాత్రము చెప్పిన మార్గము తోడను నన్నర్చించువారు నన్ను పొందెదరు. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులకు పాంచరాత్ర విధానము చెప్పబడినది.

శూద్రాదీనాం తు మే క్షేత్ర పదవీగమనం ద్విజ,

మన్నామ విహితం తేషాం నాన్యత్పూజాదికం చరేత్‌. 12

శూద్రులు మొదలగువారికి పుణ్యక్షేత్రముల కరుగుట. నానామమును జపించుటయు విధి. ఇతరములగు పూజలు వారు చేయనక్కర లేదు.

ఏవం మయోక్తం విప్రేన్ధ్ర పురాకల్పే పురాతనమ్‌,

పఞ్చరాత్రం సహస్రాణాం యది కశ్చిద్‌ గ్రహీష్యతి. 13

ఓయి విప్రవరా! పూర్వకల్పమున పురాతనమగు ఈ పంచ రాత్రమును, వేలలో ఒక్కడైనను ఇది గ్రహించునేమో యని, నేను దీనిని చెప్పియుంటిని.

కర్మక్షేయే చ మాం కశ్చిద్యది భక్తో భవిష్యతి,

తస్య చేదం పంచరాత్రం నిత్యం హృది వసిష్యతి. 14

కర్మమునశింపగా ఎవ్వడైన నా భక్తుడుండునేమో అని అట్టివానికొరకు ఈ పంచరాత్రమును చెప్పితిని. ఇది నిత్యము అతని హృదయమున నిలుచును.

ఇతరే రాజసై ర్భావై స్తామసైశ్చ సమావృతాః,

భవిష్యన్తి ద్విజశ్రేష్ఠ మయ్యాసన పరాఙ్ముఖాః. 15

ఇతరులు రాజసతామస భావములు తమ్ము చుట్టుకొనగా నా కడ కూర్చుండుటయందు పెడమొగము కలవారగుదురు.

కృతం త్రేతా ద్వాపరం చ యుగాని త్రీణి నారద,

సత్వస్థా మాం సమేష్యన్తి కలౌ రజస్తమోధికాః. 16

నారదా! కృతము, త్రేత, ద్వాపరము, అనిమూడు యుగములు అందు సత్వమున నిలు ద్రొక్కుకొన్నవారు నన్ను కలియుదురు. కలియందు రజస్తమోగుణములు పెల్లుగా గలవారు అధికులు.

అన్యచ్చ తే వరం దద్మి శృణు నారద సాంప్రతమ్‌,

యదిదం పంచరాత్రం మే శాస్త్రం పరమ దుర్లభమ్‌,

తద్భవాన్‌ వేత్స్యతే సర్వం మత్ర్పసాదా న్న సంశయః. 17

నారదా! విను, నీకు మరియొకవరము కూడ ఇత్తును మిక్కిలి దుర్లభ##మైన ఈ పంచరాత్రమను శాస్త్రమేదికలదో అది నా దయవలన సంపూర్ణముగా తెలియుదువు. సంశయము లేదు.

వేదేన పంచరాత్రేణ భక్త్యా యజ్ఞేన చ ద్విజ,

ప్రాప్యోహం నాన్యథా వత్స వర్షకోట్యయుతై రపి. 18

వేదము, పంచరాత్రము, భక్తి యజ్ఞము అనువానిచేతనే నరునకు నేను అందువాడను. నాయనా! ఇతర విధముగా కోట్ల కోట్ల ఏండ్లకును లభింపను.

ఏవముక్త్వా స భగవాన్‌ నారదం పరమేశ్వరః,

జగామాదర్శనం సద్యో నారదోపి దివం య¸°. 19

పరమేశ్వరుడగు భగవానుడు నారదునితో ఇట్లు పలికి అదృశ్యుడాయెను. నారదుడును స్వర్గమున కరిగెను.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే షట్షష్టి తమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది ఆరవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters