Varahamahapuranam-1    Chapters   

అష్టసప్తతితమోధ్యాయః - డెబ్బది యెనిమిదవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

తథా చతుర్ణాం వక్ష్యామి శైలేంద్రాణాం యథాక్రమమ్‌,

అనువిధ్యాని రమ్యాణి విహంగైః కూజితాని చ. 1

అనేక పక్షి యుక్తాత్మ శృంగాణి సుబహూని చ,

దేవానాం దివ్యనారీభిః సమం క్రీడామయాని చ. 2

కిన్నరోద్గీత ఘుష్టాని శీతమంద సుగన్ధిభిః,

పవనైః సేవ్యమానాని రమణీయ తరాణి చ. 3

ఇప్పుడు నేను క్రమముగా ఆ నాలుగు పర్వత రాజముల సుందరములైన శిఖరములను గూర్చి చెప్పెదను. వినుడు. అందు పిట్టలకూతలు వినసొంపుగా నుండును. పెక్కుపక్షులు జతకట్టి తిరుగు చుండును. దేవతలు దివ్యకాంతలతో పాటుగా క్రీడించు తావులు అందు కలవు. కిన్నరులు గొంతెత్తి గానములు చేయుచుందురు. చల్లనిమెల్లని సువాసన గల గాలులు మిక్కిలి యింపు నింపుచు వీచు చుండును.

చతు ర్దిక్షు విరాజన్తే నామతః శృణుతానఘాః,

పూర్వే చైత్రరథం నామ దక్షిణ గన్ధమాదనమ్‌,

ప్రభావేణ సుతోయాని నవఖండయుతాని చ. 4

అచట నాలుగు దిక్కులకు ప్రవహించు వాగులను గూర్చి చెప్పెదను. పుణ్యాత్ములారా! వినుడు. తూర్పున చైత్రరథము, దక్షిణమున గంధమాదనము అను వాగులు కలవు.

అందు మిక్కిలి రుచి గల నీరు, ఒడ్డు లందు మేల్తరములైన వనములు కలవు.

వనషండాం స్తథాక్రమ్య దేవతా లలనాయుతాః,

యత్ర క్రీడన్తి చోద్దేశే ముదా పరమయా యుతాః. 5

ఆ తోటలను ఆక్రమించి దేవతలు స్త్రీలతో కూడిన వారై ఆ తావులలో మిక్కిలి సంతోషముతో క్రీడించు చుందురు.

అనుబంధాని రమ్యాణి విహగైః కూజితాని చ,

రత్నోపకీర్ణ తీర్థాని మహాపుణ్య జలాని చ. 6

అనేక జల యంత్రైశ్చ నాదితాని మహాన్తి చ,

శాఖాభి ర్లంబమానాభీ రువత్పక్షి కులాలిభిః. 7

కమలోత్పల కహ్లారశోభితాని సరాంసి చ,

చతుర్షు తేషు గిరిషు నానాగణయుతేషు చ. 8

ఆ నాలుగు కొండలయందును మిక్కిలి అందమైన సరస్సులు కలవు. పక్షుల కూతలు, రత్నములు తాపిన రేవులు, అతిపుణ్యమైన జలములు, విననింపైన ధ్వనులు గల పెద్ద పెద్ద జలయంత్రములు, నీటిలోనికివ్రాలు చున్న కొమ్మలపై మనోజ్ఞముగా కూయు పక్షుల గూళ్లు, పద్మములు, కలువలు, ఎర్రకలువలు మున్నగు వానితో ఆ సరస్సులు కలకల లాడు చుండును. ఇంకను పెక్కు గుణములు వాని యందు కలవు.

అరుణోదం తు పూర్వేణ దక్షిణ మానసం స్మృతమ్‌,

అసితోదం పశ్చిమే చ మహాభద్రం తథోత్తరే,

కుముదైః శ్వేతకపిలైః కహ్లారై ర్భూషితాని చ. 9

తూర్పున అరుణోదము, దక్షిణమున మానసము, పడమటి దిక్కున అసితోదము, ఉత్తరమున మహాభద్రము అని ఆ సరస్సుల పేర్లు. అనేక వర్ణముల పద్మములు కలువలు వాని నలంకరించు చుండును.

అరుణోదస్య యే శైలాః ప్రాచ్యావై నామతఃస్మృతాః,

తాన్‌ కీర్త్యమానాం స్తత్వేన శృణుధ్వం గదతో మమ. 10

అరుణోదము నావరించి యున్న కొండలను ప్రాచ్యము లందురు. వానిని గురించి చెప్పెదను. వినుడు.

వికఙ్కో మణిశృంగశ్చ సుపాత్ర శ్చోపలో మహాన్‌,

మహానీలో7థ కుంభశ్చ సుబిన్దు ర్మదన స్తథా. 11

వేణునద్ధః సుమేదాశ్చ నిషధో దేవపర్వతః,

ఇత్యేతే పర్వతవరాః పుణ్యాశ్చ గిరయో7పరే. 12

కంకము, మణిశృంగము, సుపాత్రము, మహోపలము, మహానీలము, కుంభము, సుబిందువు, మదనము, వేణునద్ధము, సుమేదస్సు, నిషధము, దేవపర్వతము అనునవి అచ్చటి మేలైన పర్వతములు. ఇంకను పుణ్యములైన కొండలు కలవు.

పూర్వేణ మందరాత్‌ సిద్ధాః పర్వతాశ్చ మదాయుతాః,

సరసో మానసస్యేహ దక్షిణన మహాచలాః. 13

మందరమునకు తూర్పుగా సిద్ధములు, మదాయుతములు అను పర్వతములు గలవు. మానస సరోవరమునకు దక్షిణముగా పెద్ద కొండలు గలవు.

యే కీర్తితా మయా తుభ్యం నామత స్తాన్‌ నిబోధత,

శైలస్త్రిశిఖర శ్చైవ శిశిరశ్చోచలోత్తమః. 14

కపిశ్చ శతమక్షశ్చ తురగశ్చైవ సానుమాన్‌,

తామ్రహశ్చ విషశ్చైవ తథాశ్వేతోదనో గిరిః. 15

ఏకమూలో మహాశృంగో గజమూలో7పి శావకః,

పఞ్చ శైలశ్చ కైలాసో హిమవా నచలోత్తమః. 16

అచటి కొండలను గూర్చి మీకు చెప్పితిని. వాని పేర్లను చెప్పుదును. వినుడు. త్రిశిఖరము, శిశిరము, కపి, శతమక్షము, తురగము, తామ్రహము, విషము, శ్వేతోదనము, సమూలము, సరళము, రత్నకేతువు, ఏకమూలము, మహాశృంగము, గజమూలము, శాబకము, పంచశైలము, కైలాసము, హిమవంతము - అనునవి.

ఉత్తరా యే మహాశైలా స్తాన్‌ వక్ష్యామి నిబోధత,

కపిలః పింగలో భద్రః సరసశ్చ మహాచలః. 17

కుముదో మధుమాంశ్చైవ గర్జనో మర్కట స్తథా,

కృష్ణశ్చ పాండవశ్చైవ సహస్ర శిరస స్తథా. 18

పారియాత్రశ్చ శైలేన్ద్రః శృంగవా నచలోత్తమః,

ఇత్యేతే పర్వతవరాః శ్రీమన్తః పశ్చిమే స్మృతాః. 19

ఉత్తరమున నున్న మహాపర్వతములను గూర్చి చెప్పితిని. ఇటుపై వినుడు. కపిలము, పింగళము, భద్రము, సరసము, కుముదము, మధుమంతము, గర్జనము, మర్కటము, కృష్ణము, పాండవము, సహస్రశిరము, పారియాత్రము, శృంగవంతము - ఇవి పశ్చిమ దిక్కున నున్న పర్వత రాజములు.

మహాభద్రస్య సరస ఉత్తరేణ ద్విజోత్తమాః,

యే పర్వతాః స్థితా విప్రాస్తాన్‌ వక్ష్యామి నిబోధత. 20

ద్విజవరులారా! మహాభద్ర సరస్సునకు ఉత్తరముగా ఉన్న పర్వతములను గూర్చి పలికెదను. వినుడు.

హంసకూటో మహాశైలో వృషహంసశ్చ పర్వతః,

కపింజలశ్చ శైలేంద్ర ఇంద్రశైలశ్చ సానుమాన్‌. 21

నీలః కనక శృఙ్గ శ్చ శతశృంగశ్చ పర్వతః,

పుష్కరో మేఘ శైలో7థ విరజా శ్చాచలోత్తమః,

జారుచి శ్చైవ శైలేన్ద్ర ఇత్యేతే ఉత్తరాః స్మృతాః. 22

హంసకూటము, వృషహంసము, కపింజలము, ఇంద్రశైలము, నీలము, కనక శృంగము, శతశృంగము, పుష్కరము, మేఘశైలము, విరజము, జారుచి - ఇవి ఉత్తర దిక్కు పర్వతములు.

ఇత్యేతేషాం తు ముఖ్యానా ముత్తరేషు యథాక్రమమ్‌,

స్థలీ రన్తరద్రోణ్యశ్చ సరాంసి చ నిబోధత. 23

ఉత్తరమున నున్న ప్రధాన పర్వతములు, పీఠభూములు, హ్రదములు, సరస్సులు - ఇవి. వీనిని గురించి చక్కగా తెలిసికొనుడు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టసప్తతితమో7ధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బది యెనిమిదవఅధ్యాయము.

Varahamahapuranam-1    Chapters