Varahamahapuranam-1    Chapters   

చతురశీతి తమోధ్యాయః - ఎనుబది నాల్గవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లుచెప్పెను.

ఉత్తరాణాం చ వర్షాణాం దక్షిణానాం చ సర్వశః,

ఆచక్షతే యథాన్యాయం యేచ పర్వతవాసినః,

తచ్ఛ్రుణుధ్వం మయా విప్రాః కీర్త్యమానం సమాహితాః 1

విప్రులారా! ఉత్తరదేశములయు, దక్షిణదేశములయు పర్వతములందు నివసించువారి వివరములను చెప్పుచున్నాను. చెదరని మనస్సులతో వినుడు.

దక్షిణన తు శ్వేతస్య నీలస్య చోత్తరేణ చ,

వాయవ్యాం రమ్యకం నామ జాయన్తే తత్ర మానవాః,

మతి ప్రధానా విమలా జరాదౌర్గన్ధ్య వర్జితాః. 2

శ్వేత పర్వతమునకు దక్షిణముగా, నీలమునకు ఉత్తరముగా, వాయవ్యదిశలో రమ్యకమను దేశము కలదు. అందు బుద్ధివిశేషము కలవారు, స్వచ్ఛజీవనము కలవారు, ముసలితనమును దుర్వాసన లేనివారు అయిన జనులు ఉందురు.

తత్రాపి సుమహాన్‌ వృక్షో న్యగ్రోధో రోహితః స్మృతః,

తత్ఫలాద్‌ రసపానాద్ధి దశవర్షసహస్రిణః,

ఆయుషా సర్వమనుజా జాయన్తే దేవరూపిణః. 3

అందును ఒక పెద్ద రావిచెట్టు 'రోహితము' అనునది కలదు. దానిపండువలనను, దాని రసమును త్రావుటవలనను అందలి మనుజులందరు దేవరూపులై పదివేలసంవత్సరములు ఆయువు కలవారగుదురు.

ఉత్తరేణ చ శ్వేతస్య త్రిశృంగస్య చ దక్షిణ,

వర్షం హిరణ్మయం నామ తత్ర హైరణ్వతీ నదీ,

యక్షా వసన్తి తత్రైవ బలినః కామరూపిణః. 4

శ్వేతపర్వతమునకు ఉత్తరముగా, త్రిశృంగమునకు దక్షిణముగా హిరణ్మయము అను దేశము కలదు. అచట హైరణ్వతి అనునది కలదు. ఆ దేశమున బలవంతులు, కామరూపులు అగు యక్షులు నివసింతురు.

ఏకాదశసహస్రాణి సమానాం తేన జీవతే,

శతా న్యన్యాని జీవన్తే వర్షాణాం దశపఞ్చచ. 5

అందలిజనులు పదునొకండు వేలయేండ్లు జీవింతురు. మరియు వందలకొలదిగా ఇతరులు పదునైదువేలయేండ్లు బ్రదుకుదురు.

లకుచాః క్షుద్రసా వృక్షా స్తస్మిన్‌ దేశే వ్యవస్థితాః,

తత్ఫల ప్రాశమానా హి తేన జీవన్తి మానవాః. 6

ఆ దేశమున చిన్నవియగు గజనిమ్మ వృక్షము లుండును. ఆ పండ్లను తినుచు అచటి మానవులు జీవింతురు.

తథా త్రిశృంగే చ మణికాంచన సర్వరత్న శిఖరాను

క్రమేణ తస్య చోత్తరశృంగా ద్దక్షిణసముద్రాన్తే

చోత్తరకురవః. వస్త్రాణ్యా భరణాని చ వృక్షేష్వేవ జాయన్తే.

క్షీరవృక్షాః క్షీరాసవాః సన్తి. మణి భూమిః సువర్ణవాలుకా.

తస్మిన్‌ స్వర్గచ్యుతాశ్చ పురుషా వసన్తి త్రయోదశవర్ష

సహస్రాయుషః. వ.1

అట్లే త్రిశృంగపర్వతమును మణికాంచనము, రత్నశిఖరము అనువాని వరుసలో దాని ఉత్తరశృంగము మొదలుకొని దక్షిణ సముద్రము తుదివరకు ఉన్నవి ఉత్తరకురు భూములు. అందలి జనులకు వస్త్రములు, ఆభరణములును చెట్టులందే కలుగును. అవి పాలను, రసములను ఇచ్చు వృక్షములు. అది యంతయు మణులునిండినభూమి. ఇసుక సువర్ణమయము. అందు స్వర్గము నుండి జారినమనుష్యులు పదుమూడువేల యేండ్ల ఆయువు కలవారు నివసింతురు.

తసై#్యవద్వీపస్య పశ్చిమేన చతుర్యోజనసహస్ర

మతిక్రమ్య దేవలోకాత్‌ చంద్రద్వీపో భవతి, యోజన

సహస్ర పరిమండలః. తస్య మధ్యే చంద్రకాంత

సూర్యకాంతనామానౌ గిరివరౌ. తయోశ్చ మధ్యే

చంద్రావతీ నామ మహానదీ అనేకవృక్షఫలానేకనదీ

సమాకులా. ఏతత్కురువర్షం చ. వ.2

ఆ ద్వీపమునకు పడమరగా దేవలోకమునుండి నాలుగువేల యోజనములు దాటినపిమ్మట చంద్రద్వీపము కలదు. వేయిఆమడల వైశాల్యము కలది. దానిమధ్య చంద్రకాంత సూర్యకాంతము లను గొప్ప పర్వతములు కలవు. వానిమధ్య చంద్రావతి అను మహానది పెక్కుపండ్లచెట్లతో పెక్కునదులతో కూడినది కలదు. దీనినే కురుదేశము లందురు.

తస్యోత్తరపార్శ్వే సముద్రోర్మిమాలాఢ్యం

పంచయోజన సహస్ర మతిక్రమ్య దేవలోకాత్‌ సూర్యద్వీపో

భవతి యోజనసహస్ర పరిమండలః. తస్య మధ్యే గిరవరః

శత యోజనవిస్తీర్ణ స్తావదుచ్ఛ్రితః. తస్మాత్‌

సూర్యావర్తనామా నదీ నిర్గతా. తత్ర చ సూర్య

స్యాధిష్ఠితమ్‌. తత్ర సూర్యదైవత్యా స్తద్వర్ణాశ్చ ప్రజా

దశవర్షసహస్రాయుషః. వ.3

దాని ఉత్తరపార్శ్వమున సముద్రపు అలల మాలలతో గొప్పదియు, దేవలోకమునుండి అయిదువేల యోజనముల దూరమున నున్నదియు అగు సూర్యద్వీపము వేయి ఆమడల వైశాల్యముతో కలదు. దానిమధ్య నూరుయోజనముల విస్తీర్ణము, ఎత్తుగల గొప్ప పర్వతమున్నది. అది సూర్యదేవుని నివాసభూమి. అందు సూర్యుడు దైవముగా గలవారు, ఆ వన్నెకలవారు పదివేల సంవత్సరముల ఆయువు కలవారు అగుజను లుందురు.

తస్య చ ద్వీపస్య పశ్చిమేన చతుర్యోజన సహస్రమతి

క్రమ్య సముద్రం దశయోజన సహస్రం పరిమండల

త్వేన ద్వీపో రుద్రాకరో నామ. తత్ర చ భద్రాసనం నామ

వాయో రనేక రత్నశోభితమ్‌. తత్ర విగ్రహవాన్‌ వాయు

స్తిష్ఠతి. తపనీయవర్ణాశ్చ ప్రజాః పంచవర్ష సహస్రాయుషః.

ఆ ద్వీపమునకు పడమరగా నాలుగువేల యోజనములు దాటి పదివేల ఆమడల వైశాల్యము గల రుద్రాకరము అను ద్వీపము కలదు. అందు వాయుదేవుని భద్రాసనము పెక్కురత్నములతో విరాజిల్లునది కలదు. అందు వాయుదేవుడు రూపముతాల్చి నివసించును. బంగారువన్నె కల అచటి ప్రజలు అయిదువేల ఏండ్ల ఆయువు కలవారు.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే చతురశీతితమో7ధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఎనుబదినాల్గవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters