Varahamahapuranam-1    Chapters   

నవతితమోధ్యాయః - తొంబదియవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు చాన్యం వరారోహే తస్యా దేవ్యా మహావిధిమ్‌,

యా సాత్రిశక్తి రుద్దిష్టా శివేన పరమేష్ఠినా. 1

వరారోహా! మరియొక విషయము వినుము. శివుడు పరమేష్ఠియు నిర్దేశించిన ఆ త్రిశక్తికి సంబంధించిన మహా విధిని గూర్చి చెప్పెదను.

తత్ర సృష్టిః పురాప్రోక్తా శ్వేతవర్ణా స్వరూపిణీ,

ఏకాక్షరేతి విఖ్యాతా సర్వాక్షరమయీ శుభా. 2

అందు సృష్టిని గూర్చి యింతకు ముందు తెలిపితిని. ఆమె తెల్లని వన్నె కలది. చక్కని తనదగు రూపము కలది. ఒక అక్షరమే ఆమెస్వరూపము. అయినను సర్వాక్షరములు ఆయమ స్వరూపమే.

వాగీశేతి సమాఖ్యాతా క్వచిద్‌ దేవీ సరస్వతీ,

సైవ విద్యేశ్వరీ దేవీ సైవ క్వాప్యమితాక్షరా,

సైవ జ్ఞానవిధిః క్వాపి సైవ దేవీ విభావరీ. 3

ఆమెను వాగీశ అందురు. కొండకచో సరస్వతీ దేవి. ఆమెయే విద్యలకు ఈశ్వరి. ఆమెయే ఒకప్పుడు అమితాక్షర. జ్ఞానవిధి. ఆమెను ఒక్కొక్కప్పుడు విభావరి అనియు అందురు.

యాని సౌమ్యాని నామాని యాని జ్ఞానోద్భవాని చ,

తాని తస్యా విశాలాక్షి ద్రష్టవ్యాని వరాననే. 4

ఓ విశాలాక్షీ! వరాననా! సౌమ్యములు, జ్ఞానమునుండి పుట్టినవి యగు నామము లన్నియు ఆ తల్లి నామములుగా చూడదగును.

యా వైష్ణవీ విశాలాక్షీ రక్తవర్ణా సురూపిణీ,

అపరా సా సమాఖ్యాతా రౌద్రీ చైవ పరాపరా. 5

ఏతా స్త్రయోపి సిద్ధ్యన్తే యో రుద్రం వేత్తి తత్త్వతః.

సర్వగేయం వరారోహే ఏకైవ త్రివిధా స్మృతా. 6

విష్ణువు వలన ఏర్పడినది, రక్తవర్ణ. సురూపిణి యగు నామెయు, రుద్రునివలన రూపుగొన్న మరియొక పరాశక్తియు ఈమువ్వురును తత్త్వమునకు ఒక్కరే. రుద్రుని చక్కగా తెలిసి కొన్నవారికి ఈమువ్వురు సిద్ధింతురు. అంతట నుండు ఈ మువ్వురి స్వరూపము ఒక్కటియే.

ఏషా సృష్టి ర్వరారోహే కథితా తే పురాతనీ,

తయా సర్వ మిదం వ్యాప్తం జగత్‌ స్థావరజంగమమ్‌. 7

వరారోహా! నీకు మున్ను నేను చెప్పిన ఆ పురాతని సృస్టి మాత ఉన్నదే ఆమెయే ఈ స్థావరజంగమాత్మకమైన జగత్తు నంతటిని వ్యాపించియున్నది.

యా సాదౌ వర్ధితా సృష్టి ర్బ్రహ్మణోవ్యక్తజన్మనః,

తయా తుల్యాం స్తుతిం చక్రే తస్యా దేద్యాః పితామహః. 8

మొదట అవ్యక్తమునుండి జన్మమునుపొందిన బ్రహ్మవలన వృద్ధిపొందిన ఆ సృష్టిమాతకు తగిన విధముగా పితామహుడు ఆ దేవి నిట్లు స్తుతించెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను.

జయస్వ సత్యసంభూతే ధ్రువే దేవి వరాక్షరే,

సర్వగే సర్వజనని సర్వభూతమహేశ్వరి. 9

దేవీ! సత్యమువలన పుట్టినదానా! స్థిరమైన దానా! శ్రేష్ఠమైన వర్ణములే స్వరూపమైన ఓ సర్వజననీ! సర్వగా! సర్వభూతములకు మహేశ్వరివైన నీవు జయము గొనుము.

సర్వజ్ఞే త్వం వరారోహే సర్వసిద్ధి ప్రదాయిని,

సిద్ధి బుద్ధి కరీ దేవి ప్రసూతిః పరమేశ్వరి. 10

నీవు అన్నియు నెరిగినదానవు. అన్ని సిద్ధులను అనుగ్రహించు దానవు. సిద్ధిని బుద్ధిని కలుగజేయుదానవు. ననివి. పరమేశ్వరివి.

త్వం స్వాహా త్వం స్వధా దేవి త్వముత్పత్తిర్వరాననే,

త్వమోంకారస్థితా దేవి వేదోత్పత్తి స్త్వమేవ చ. 11

నీవే స్వాహాకారమవు. నీవే స్వధాకారమవు. నీవు ఉత్పత్తి స్వరూపిణివి. నీవు ఓంకారమునిలయమైన దానవు. నీవే వేదముల ఉత్పత్తికి కారణమైన దానవు.

(స్వాహా - దేవతలకు సంబంధించిన నమస్కారము. స్వధా పితృదేవతలకు సంబంధించిన నమస్కారము.)

దేవానాం దానవానాం చ యక్షగంధర్వరక్షసామ్‌,

పశూనాం వీరుధాం చాపి త్వముత్పత్తి ర్వారాననే. 12

దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, రక్షస్సులు. పశువులు, పంటలు అనునవి నీనుండియే పుట్టుచున్నవి.

విద్యా విద్యేశ్వరీ సిద్ధా ప్రసిద్ధా త్వం సరేశ్వరి,

సర్వజ్ఞా త్వం వరారోహే సర్వసిద్ధి ప్రదాయినీ. 13

నీవు విద్యవు, విద్యలకు ఈశ్వరివి. సిద్ధవు, ప్రసిద్ధవు, నీవు దేవతలకు ఈశ్వరివి. అన్నియు నెరిగినదానవు. అన్ని సిద్ధులను అనుగ్రహించుదానవు.

సర్వగా గతసందేహా సర్వశత్రునిబర్హిణీ,

సర్వ విద్యేశ్వరీ దేవీ నమస్తే స్వస్తికారిణి. 14

శుభములుకలుగజేయు ఓ దేవీ! నీవు అంతట నుండుదానవు. ఏ సందేహము లేనిదానవు. శత్రువులందరిని పరిమార్చుదానవు. సర్వవిద్యలకు పాలకురాలవు. నీకు నమస్సు.

ఋతుస్నాతాం స్త్రియం గచ్ఛేద్‌ యస్త్వాం స్తుత్వా వరాననే,

తస్యావశ్యం భ##వేత్‌ సృష్టి స్త్వత్ర్పసాదాత్‌ ప్రజేశ్వరి,

స్వరూపా విజయా భద్రా సర్వశత్రు ప్రమోహిని. 15

నిన్ను స్తుతించి ఋతుస్నాత అయిన భార్యను పొందువానికి నీ అనుగ్రహమువలన తప్పక సంతానము కలుగును. నీవు ప్రజేశ్వరివి, పరమాత్మ స్వరూపిణివి. విజయరూపము, భద్రరూపము కలదానవు. శత్రువులందరిని - లోపలిశత్రువుల నన్నింటిని రూపు మాపుదానవు. (లోపలిశత్రువులు - 1. కామము 2. క్రోధము, 3. లోభము 4. మోహము 5. మదము 6. మాత్సర్యము అనునవి.)

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే నవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదియవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters