Varahamahapuranam-1    Chapters   

పఞ్చనవతితమోధ్యాయః - తొంబదియైదవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవుడు చెప్పెను.

యా సా నీలగిరిం యాతా తపసే ధృతమానసా,

రౌద్రీ తమోద్భవా శక్తి స్తస్యాః శృణు ధరే వ్రతమ్‌. 1

భూదేవీ! నీలగిరికి తపస్సునకై చెదరని మనసుతో అరిగిన, తమోగుణము వలన ఏర్పడిన రౌద్రియనుశక్తి పట్టిన వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము.

తపః కృత్వా చిరం కాలం పాలయా మ్యఖిలం జగత్‌,

ఏవ ముద్దిశ్య పఞ్చాగ్నిం సాధయామాస భామినీ. 2

నేను చిరకాలము తపమోనరించి సమస్తమైన జగత్తును పాలింతును. అని సంకల్పించి ఆ కాంత అయి దగ్నులను ఏర్పరచుకొనెను. (పంచాగ్నులు : నాలుగు వైపుల నాలుగు అగ్నులు పైని సూర్యాగ్ని).

తస్యాః కాలాన్తరే దేవ్యా స్తపన్త్యా స్తప ఉత్తమమ్‌,

రురు ర్నామ మహాతేజా బ్రహ్మదత్త వరోసురః. 3

సముద్రమధ్యే రత్నాఢ్యం పురమస్తి మహావనమ్‌,

తత్ర రాజా సదైత్యేన్ధ్రః సర్వదేవభయంకరః. 4

అనేక శత సాహస్ర కోటికోటి శతోత్తరైః,

అసురై రన్వితః శ్రీమాన్‌ ద్వితీయో నముచి ర్యథా. 5

అట్లు మహాతీవ్రమగు తపస్సు చేయుచున్న కాలములో బ్రహ్మ ఒసగిన వరములు కలవాడు, గొప్పముఖ కాంతికలవాడు, రురువనువాడు సముద్రమునడుమ రత్నములతో నిండిన గొప్ప తోటలుగల పట్టణమున రాజైయుండెను. అతడు దేవతలందరికి భయంకరుడు. కొన్ని వందలకోట్ల రక్కసు లతనికి బంటులు. రెండవ నముచియో అన్నట్లు మహాసంపదతో విరాజిల్లుచుండెను.

కాలేన మహతా చాసౌ లోకపాలపేరాణ్యథ,

జిగీషుః సైన్య సంవీతో దేవై ర్భయ మరోచయత్‌. 6

పెద్దకాలము గడువగా అతడు లోకపాలురపురముల నన్నింటిని గెలువగోరినవాడై సేనలను సిద్ధము చేసికొని దేవతలకు భయము పుట్టించెను.

ఉత్తిష్ఠత స్తస్య మహాసురస్య

సముద్రతోయం వవృధేతి మాత్రమ్‌,

అనేకనక్రగ్రహమీనజుష్ట -

మా ప్లావయత్‌ పర్వతసానుదేశాన్‌. 7

ఆ మహారాక్షసుడు పైకి లేచుచుండగా సముద్రపు నీరు పెద్ద ఎత్తున పొంగిపోయెను. పెక్కు మొసళ్ళు, గ్రహములు, పెను చేపలు నిండిన ఆ జలము కొండచరియ భూములను ముంచి యెత్తెను.

అంతస్థితానేక సురారి సంఘం

విచిత్ర చర్మాయుధ చిత్ర శోభమ్‌,

భీమం బలం బలినం చారుయోధం

వినిర్య¸° సింధుజలాద్‌ విశాలమ్‌. 8

సముద్రపు నీటిలో ఉన్న పెక్కు రక్కసి మూకలు, విచిత్రములగు డాళ్లు, ఆయుధములు కలవై, భయము గొలుపుచు పెద్దయెత్తున సముద్రపు నీటినుండి వెలువడి వచ్చెను.

తత్ర ద్విపా దైత్యవరై రుపేతా సమానఘణ్టా సుసమూహ యుక్తాః,

వినిర్యయుః స్వాకృతిభీషణాని సమంత ముచ్చైః ఖలు దర్శయన్తః. 9

గొప్ప రాక్షసులతోకూడి, తమ ఆకారమునకు తగిన గంటలతో, భయము గొలుపు పెద్దపెద్ద దేహములతో కూడిన ఏనుగులు పైకి వచ్చినవి.

అశ్వాస్తథా కాఞ్చనపీడనద్ధా రోహీత మత్స్యైః సమతాం జలాన్తః,

వ్యవస్థితా స్తే సమమేవ తూర్ణం వినిర్యయు ర్లక్షశః కోటిశశ్చ. 10

చక్కని బంగారు నగలు కలిగి ఆ నీటిలోని రోహితములనెడు పెను చేపలవంటి గుఱ్ఱములు లక్షలకొలది. కోట్లకొలది పైకి లేచి వచ్చినవి.

రథా రవిస్యందనతుల్యవేగాః సుచక్రదణ్డాక్ష త్రివేణుయుక్తాః,

సుశస్త్రయన్త్రాః పరిపీడితాఙ్గా శ్చలత్పతాకా స్వ్వరితం విశఙ్కాః. 11

సూర్యునిరథముతో సమానమగు వేగముకలవి చక్కని చక్రములు, దండములు, ఇరుసు, మూడుబొంగులు కలవి, గొప్ప ఆయుధ యంత్రములు కలవి, కదలాడు పతాకలు కలవి, ఎదురులేని వేగము కలవి, నలుగగొట్టిన ప్రాణుల అంగములు కలవియగు రథములును వెలికి వచ్చినవి.

తథైవ యోధాః స్థగితేతరేతరా

స్తితీర్షవః ప్రవరా స్తూర్ణ పాణయః,

రణ రణ లబ్ధజయాః ప్రహారిణో

విరేజు రుచ్చై రసురానుగా భృశమ్‌. 12

అట్లే ఒకరినొకరు ఒరసికొనుచున్నవారు. ఉత్సాహముతో ముందువారిని దాటిపోవగోరువారు, శ్రేష్ఠులు, ఊగులాడు చేతులు కలవారు, ప్రతియుద్ధమందును జయము గొనువారు, పోటు గాండ్రు అగు యోధులు ఈరాక్షసరాజు వెంట పెద్దగా ప్రకాశించుచు వచ్చిరి.

దేవేషు చైవ భ##గ్నేషు వినిర్గత్య జలాత్‌ తతః,

చతురంగబలోపేతః ప్రాయా దిన్ధ్రపురం ప్రతి. 13

దేవతలందరు చెల్లాచెదురుకాగా ఆసేన చతురంగబలముతో కూడినదై నీటినుండి వెలువడి ఇంద్రుని పురముపైకి దండెత్తెను.

యుయోధ చ సురైః సార్ధం రురు ర్దైత్యపతి స్తథా,

ముద్గరై ర్ముసలైః శూలైః శ##రై ర్దణ్డాయుధై స్తథా,

జఘ్నర్దైత్యాః సురాన్‌ సంఖ్యే సురాశ్చైవ తథాసురాన్‌. 14

రాక్షసరాజగురురువు దేవతలతో తలపడి ముద్గరములతో, రోకండ్లతో, ఈటెలతో, అమ్ములతో, దుడ్డు కర్రలతో పోరొనర్చి వారిని చావగొట్టెను. దేవతలును అట్లే రాక్షసులను కొట్టిరి.

ఏవం క్షణ మథో యుద్ధం తదా దేవాః సవాసవాః,

అసురై ర్నిర్జితాః సద్యో దుద్రువు ర్విముఖా భృశమ్‌. 15

ఇట్లు కొంతకాలము పోరొనర్చి దేవతలు ఇంద్రునితో పాటుగా రక్కసులకోడి ఒక్క పెట్టున పెడమొగము పెట్టి పారిరి.

దేవేషు చైవభ##గ్నేషు విద్రుతేషు విశేషతః,

అసురః సర్వదేవానా మన్వధావత వీర్యవాన్‌. 16

ఇట్లు దేవతలు విరిగి చెల్లాచెదురు కాగా గొప్ప బలశాలియగు ఆ రక్కసుడు దేవతలను తరిమికొట్టెను.

తతో దేవగణాః సర్వే ద్రవన్తో భయవిహ్వలాః,

నీలం గిరివరం జగ్ము ర్యత్ర దేవీ వ్యవస్థితా. 17

అంత దేవతలమూకలు భయముతో గుండె చెదరిన వారై ఆదేవి నెలకొనియున్న నీలపర్వతమునకు పరువెత్తుకొనిపోయిరి.

రౌద్రీ తపోరతా దేవీ తామసీ శక్తి రుత్తమా,

సంహారకారిణీ దేవీ కాలరాత్రీతి తాం విదుః. 18

ఆమె రుద్రశక్తి. తపస్సున ఆసక్తి కలది. తమోగుణము వలన ఏర్పడినది. ఉత్తమ సంహారకారిణి. దేవి. కాళరాత్రి యని ఆమెను వారెరుగుదురు.

సా దృష్ట్వా తాన్‌ తదా దేవాన్‌ భయత్రస్తాన్‌ విచేతసః,

మాభైష్టేత్యుచ్చకై ర్దేవీ తానువాచ సురోత్తమాన్‌. 19

అట్లు భయముతో గుండెచెదరిన ఆ దేవతలందరను చూచి భయపడకుడని ఆ దేవి పెద్దగా పలికెను.

దేవ్యువాచ - దేవి పలికెను.

కిమియం వ్యాకులా దేవా గతి ర్వ ఉపలక్ష్యతే,

కథయధ్వం ద్రుతం దేవాః సర్వథా భయకారణమ్‌. 20

దేవులారా! ఇదియేమి? మీస్థితి మిక్కిలి బెదరినట్లున్నది. వెంటనే చెప్పుడు. మీ భయమునకు కారణమేమి?

దేవా ఊచుః - దేవతలిట్లనిరి.

అయ మాయాతి దైత్యేన్ద్రో రురు ర్భీమపరాక్రమః,

ఏతస్య భీతాన్‌ రక్షస్వ త్వం దేవాన్‌ పరమేశ్వరి. 21

అమ్మా! అడుగో వచ్చిపడుచున్నాడు రాక్షసరాజు రురుడు. భయంకరమగు పరాక్రమము కలవాడు. వీనివలన భయమందిన దేవతలందరను, పరమేశ్వరీ! కాపాడుము.

ఏవముక్తా తదా దేవై ర్దేవీ భీమపరాక్రమా,

జహాస పరయా ప్రీత్యా దేవానాం పురతః శుభా. 22

దేవత లిట్లు పలుకగా భీమపరాక్రమము గల ఆదేవి మిక్కిలి ప్రీతితో దేవతలమెదుట పెద్దగా నవ్చెను.

తస్యా హసన్త్యా వక్త్రాత్‌ తు బహ్వ్యో దేవ్యో వినిర్యయుః.

యాభి ర్విశ్వ మిదం వ్యాప్తం వికృతాభి రనేకశః. 23

అట్లు నవ్వుచున్న ఆమెమోమునుండి పెక్కుదేవీ రూపములు వెలువడినవి. వికృతాకారముగల వారిచేత విశ్వమంతయు నిండి పోయినది.

పాశాంకుశధరాః సర్వాః సర్వాః పీనపయోధరాః,

సర్వాః శూలధరా భీమాః సర్వా శ్చాపధరాః శుభాః. 24

అందరు పాశములను అంకుశములను తాల్చినవారు. బలసిన పాలిండ్లుకలవారు. శూలములు చేపట్టినవారు. విండ్లు ధరించిన వారు.

తాః సర్వాః కోటిశో దేవ్య స్తాం దేవీం వేష్ట్య సంస్థితాః,

యుయుధు ర్దానవైః సార్ధం బద్దతూణా మహాబలాః,

క్షణన దానవబలం తత్సర్వం నిహతం తు తైః 25

కోట్లకొలదిగా ఉన్న ఆ దేవీరూపకాంత లందరు ఆ దేవిని క్రమ్ముకొని నిలిచి అంబులపొదులు తాల్చి మహాబలలై దానవులతో యుద్ధమొనరించిరి. ఆ దేవీబలములచేత క్షణకాలములో దానవసేన యంతయు నశించినది.

దేవాశ్చ సర్వే సంయత్తా యుయుధు ర్దానవం బలమ్‌,

ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా స్తథాశ్వినౌ,

సర్వే శస్త్రాణి సంగృహ్య యుయుధు ర్దానవం బలమ్‌. 26

దేవతలందరు సన్నద్ధులై దానవబలముతో పోరిరి. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవులు, అశ్వినులు - అందరు ఆయుధము లను గొని రక్కసుల మూకలతో పోరాడిరి.

కాళరాత్ర్యా బలం యచ్చ యచ్చ దేవబలం మహత్‌,

తత్సర్వం దానవబల మనయద్‌ యమ సాదనమ్‌. 27

కాళరాత్రిబలము, దేవతలబలము అంతయు కలిసి దానవ బలమును యమునింటి కంపెను.

ఏక ఏవ మహాదైత్యో రురు స్తస్థౌ మహామృధే,

స చ మాయాం మహా రౌద్రీం రౌరవీం విససర్జ హ. 28

మహాదైత్యుడు రురువొక్కడే యుద్ధభూమిలో ఉండెను. వాడును మహారౌద్రియగు రురుశక్తిని ఆ దేవిసేనపై వదలెను.

సా మాయా వవృధే భీమా సర్వదేవ ప్రమోహినీ,

తయా తు మోహితా దేవాః సద్యో నిద్రాంతు భేజిరే. 29

ఆ మాయ దేవతలందరిని మోహ పెట్టుచు భయంకరముగా వృద్ధి పొందెను. దానితో మోహితులగు దేవతలందరు వెనువెంటనే నిద్రను పొందిరి.

దేవీ చ త్రిశిఖే నాజౌ తం దైత్యం సమతాడయత్‌,

తయా తు తాడితాన్తస్య దైత్యస్య శుభలోచనే,

చర్మముణ్డ ఉభే సమ్యక్‌ పృథగ్భూతే బభూవతుః. 30

దేవి మూడు మొనల శూలముతో ఆ రాక్షసుని కొట్టెను. ఓ శుభలోచనా! అట్లు దెబ్బతిన్న ఆ దైత్యుని చర్మము, మొండెము వేరువేరుగా పడిపోయెను.

రురోస్తు దానవేన్ధ్రస్య చర్మముండే క్షణాద్‌ యతః,

అపహృత్యాహరద్‌ దేవీ చాముణ్డా తేన సాభవత్‌. 31

దానవరాజగు రురుని చర్మముండములను దేవి క్షణములో అపహరించి వైచెను. అందుచేత ఆమె చాముండ ఆయెను.

సర్వభూతమహారౌద్రీ యా దేవీ పరమేశ్వరీ,

సంహారిణీ తు యా చైవ కాళరాత్రిః ప్రకీర్తితా. 32

ఆ పరమేశ్వరి, సర్వభూతములకు మహారౌద్రి, సంహారిణి కాళరాత్రి అనికొనయాడబడినది.

తస్యా హ్యనుచరా దేవ్యో యా హ్యసంఖ్యాతకోటయః,

తాస్తాం దేవీం మహాభాగాం పరివార్య వ్యవస్థితాః. 33

ఆమె వెంటనుండి ఆ లెక్కిడరాని కోట్ల దేవీగణములు ఆమె చుట్టును నిలిచిరి.

యాచయామాసు రవ్యగ్రా స్తా స్తాం దేవీం బుభుక్షితాః,

బుభుక్షితా వయం దేవి దేహి నో భోజనం శుభే. 34

వారందరు ఆకలికొన్నవారై ఒక్కపెట్టున, అమ్మా! ఆకలికొన్నవారము. మాకు భోజనము పెట్టుమని అడిగిరి.

ఏవ ముక్తా తదా దేవీ దధ్యౌ తాసాం తు భోజనమ్‌,

న చాధ్యగచ్ఛత యదా తాసాం భోజన మన్తికాత్‌. 35

తతో దధ్యౌ మహాదేవం రుద్రం పశుపతిం విభుమ్‌,

సోపి ధ్యానాత్‌ సముత్తస్థౌ పరమాత్మా త్రిలోచనః. 36

వారట్లు పలుకగా ఆ దేవి వారిభోజనమును గూర్చి భావించెను. కాని తనకడ వారికి భోజనము కలుగకుండగా అప్పుడామె మహాదేవుడు, పశుపతి, విభుడు అగు రుద్రుని ధ్యానించెను. పరమాత్మ యగు ముక్కంటి ఆధ్యానమువలన అచట సాక్షాత్కరించెను.

ఉవాచ చ ద్రుతం దేవీం కింతే కార్యం వివక్షితమ్‌,

బ్రూహి దేవి వరారోహే యత్‌ తే మనసి వర్తతే. 37

దేవీ, వరారోహో! నీ మనసున ఏమున్నదో, నేను చేయవలసిన దేమో చెప్పుము - అని దేవితో పలికెను.

దేవ్యువాచ - దేవి పలికెను.

భక్ష్యార్థమాసాం దేవేశ కిఞ్చిద్‌ దాతు మిహార్హసి,

బలాత్కుర్వన్తి మామేతా భక్షార్థిన్యో మహాబలాః,

అన్యథా మామపి బలాద్‌ భక్షయిష్యన్తి మాం ప్రభో. 38

దేవదేవా! వీరు తినుటకు కొంచెమేదేని నీ వొసగవలయును. ఆకలితో ఉన్న ఈ మహాబల లందరు నన్ను ఒత్తిడి చేయుచున్నారు. లేనిచో వీరు నన్నేతిని వేయగలరు.

ఏతాసాం శృణు దేవేశి భక్ష మేకం మయోద్యతమ్‌,

కథ్యమానం వరారోహే కాళరాత్రి మహాప్రభే. 39

దేవేశి! మహాప్రభా! కాళరాత్రీ! వరారోహా! వీరి తిండిని ఒకదానిని నేను సిద్ధము చేసితిని. చెప్పుదును. వినుము.

యాస్త్రీ సగర్భా దేవేశి అన్యస్త్రీ పరిధానకమ్‌,

పరిధత్తే స్పృశేచ్చాపి పురుషస్య విశేషతః. 40

సభాగే స్తు మహాభాగే కాసాఞ్చిత్‌ పృథివీతలే,

అన్యాశ్చిద్రేషు బాలాని గృహీత్వా తత్ర వై బలిమ్‌,

లబ్ధ్వా తిష్ఠన్తు సుప్రీతా అపి వర్షశతాన్యపి. 41

గర్భముతాల్చిన ఏ స్త్రీ అయినను ఇతర వనితల వస్త్రమును కట్టుకొన్నను, ముఖ్యముగా పురుషుని వస్త్రమును తాకినను అది వీరిలో కొందరికి భాగమగును. తక్కినవారు దోషములున్నచోట పిల్లలను బలిగా గొని నూర్లకొలది ఏండ్లు ప్రీతికలవారై ఉండవలయును.

అన్యాః సూతిగృహే ఛిద్రం గృహ్ణీయు స్తత్ర పూజితాః,

నివసిష్యన్తి దేవేశి తథాన్యా జాతహారికాః. 42

మరికొందరు పురిటియింటిలో దోషమును మ్రొక్కులు గొనుచు కొనుచుందురుగాక! ఇంకను కొందరు పుట్టిన బిడ్డలను హరించుచు నివసింతురు.

గృహే క్షేత్రే తడాగేషు వాప్యుద్యానేషు చైవ హి,

అన్యచిత్తా రుదన్త్యో యాః స్త్రియ స్తిష్ఠన్తి నిత్యశః,

తాసాం శరీరా ణ్యావిశ్య కాశ్చి త్తృప్తి మవాప్స్యథ. 43

ఇంటిలో, పొలములో, చెరువులకడ, తోటలలో అన్యులపై మనసుకలవారై ఏడ్చెడు స్త్రీల శరీరముల నావేశించి వీరిలో కొందరు తృప్తి నందెదరు.

ఏవముక్త్వా తదా దేవీం స్వయం రుద్రః ప్రతాపవాన్‌,

దృష్ట్వా రురుం చ సబల మసురేన్ద్రం నిపాతితమ్‌,

స్తుతిం చకార భగవాన్‌ స్వయం దేవ స్త్రిలోచనః. 44

ఇట్లు పలికి ప్రతాపవంతుడగు రుద్రుడు, అసురేంద్రుడగు రురువు, వానిబలము కూలియుండగా చూచి తానై దేవిని ఇట్లు స్తుతించెను.

రుద్ర ఉవాచ - రుద్రుడు పలికెను.

జయస్వ దేవి చాముణ్డ జయభూతాపహారిణి,

జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తు తే. 45

దేవీ! చాముండా! భూతముల రూపుమాపుదానా! అన్ని యెడల నుండెడు ఓ దేవీ! కాళరాత్రీ! నీకు నమస్కారము.

విశ్వమూర్తే శుభే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే,

భీమరూపే శివే విద్యే మహామాయే మహోదయే. 46

విశ్వమంతయు నీరూపమే, నీవు శుభస్వరూపిణివి, నిర్మలవు, విరూపాక్షివి. ముక్కంటివి. భీమరూపవు. శివా! విద్యాస్వరూపిణీ! మహామాయవు. మహోదయా! నీకు నమస్సు.

మనోజవే జయే జృంభే భీమాక్షి క్షుభితక్షయే.

మహామారి విచిత్రాంగే గేయనృత్యప్రియే శుభే. 47

నీవు మనస్సున కున్నంత వేగము కలదానవు. జయము నీ స్వరూపము. నీవు ఆవులింతవు. భయము గొలుపు కన్నులు కలదానవు. క్షోభను నశింపజేయుదానవు. మహామారీ! విచిత్రాంగీ గేయము, నృత్యము అనువానియందు ప్రీతికలదానా! శుభా! నీకు నమస్కారము.

వికరాళే మహాకాళి కాళికే పాపహారిణి,

పాశహస్తే దణ్డహస్తే భీమరూపే భయానకే. 48

మహాకాళీ! కాళికా! భీమరూపిణీ! పాపములను పరమార్చు దానా! పాశముచేత దాల్చినదానా! దండహస్తా! భయము గొలుపుదేవీ! నీకు మ్రొక్కులు.

చాముణ్డ జ్వలమానాస్యే తీక్షదంష్ట్రే మహాబలే,

శవయానస్థితే దేవి ప్రేతాసనగతే శివే. 49

చాముండా! మంటలుగ్రక్కుచున్న మొగముగలదానా! మిక్కిలి వాడియగు కోరలు గలదానా! మహాబలా! శవవాహనమున నిలుచుదానా! దేవీ! ప్రేతాసనమున నుండు మంగళస్వరూపా! నీకు నమస్సు.

భీమాక్షి భీషణ దేవి సర్వభూతభయంకరి,

కరాళే వికరాళే చ మహాకాళే కరాళిని,

కాళీ కరాళీ విక్రాన్తా కాళరాత్రి నమోస్తుతే. 50

భీమాక్షీ! భీషణా! దేవీ! సర్వభూతభయంకరీ! కరాళా! వికరాళా! మహాకాళీ! కరాళినీ! కాళీ! కరాళీ! పరాక్రమించుతల్లీ! నీకు నమస్కారము; (కరాళి - వెవపుపుట్టించునది, పొడవైనది).

వికరాళముఖీ దేవి జ్వాలాముఖి నమోస్తు తే,

సర్వసత్వహితే దేవి సర్వదేవి నమోస్తు తే. 51

మిక్కిలి వెరపు గొలుపుముఖము కల దేవీ! అగ్ని జ్వాలలను వెలిగ్రక్కు మోముకల తల్లీ! ప్రాణులన్నింటికి మేలు చేయు సర్వేశ్వరీ! నీకు ప్రణతి.

ఇతి స్తుతా తదా దేవీ రుద్రేణ పరమేష్ఠినా,

తుతోష పరమా దేవీ వాక్యం చేదమువాచ హ.

వరం వృణీష్వ దేవేశ యత్‌ తే మనసి వర్తతే. 52

పరమేష్ఠియగు రుద్రు డిట్లు స్తుతింపగా దేవి మిక్కిలిగా ఆనందపడెను. ఇట్లు పలికెను. దేవదేవా! నీ మనసున నున్న వరమును కోరుకోనుము.

స్తోత్రేణానేన యే దేవి త్వాం స్తువన్తి వరాననే,

తేషాం త్వం వరదా దేవి భవ సర్వగతా సతీ. 53

దేవీ! ఈ స్తోత్రముతో నిన్ను స్తుతించువారికి అంతట నుండుతల్లివి నీవు వరముల నొసగుము.

యశ్చేమం త్రిప్రకారం తు దేవి భక్త్యా సమన్వితాః,

సపుత్ర పౌత్ర పశుమాన్‌ సమృద్ధి ముపగచ్ఛతి. 54

దేవీ! భక్తితోకూడి దినమునకు మూడుమారులు దీనిని పఠించువాడు పుత్రులు, మనుమలు, పశువులు సమృద్దిగా కలవాడై ఐశ్వర్యమును పొందును.

యశ్చేమం శృణుయాద్‌ భక్త్యా త్రిశక్త్యాస్తు సముద్భవమ్‌,

సర్వపాపవినిర్ముక్తః పదం గచ్ఛత్యనామయమ్‌. 55

మూడు శక్తులుగల అమ్మవారి ఈ స్తోత్రమును భక్తితో వినువాడు పాపములన్నింటిని పాసి ఏ రోగములేని స్థానమున కరుగును.

ఏవం స్తుత్వా భవోదేవీం చాముణ్డాం పరమేశ్వరీమ్‌,

క్షణా దంతర్హితో దేవ స్తే చ దేవా దివం యయుః. 56

ఇట్లు శివుడు పరమేశ్వరి యగు చాముండను స్తుతించి క్షణములో అంతర్ధానము చెందెను. దేవతలును స్వర్గమున కరిగిరి.

య ఏతాం వేదవై దేవ్యా ఉత్పత్తిం త్రవిధాం ధరే,

సర్వపాప వినిర్ముక్తః పరం నిర్వాణ మృచ్ఛతి. 57

ఈ మూడు విధములైన దేవి పుట్టుకను చక్కగా ఎరిగినవాడు ఓ భూదేవి! సర్వపాపముల నుండి విడివడి పరమనిర్వాణమును (మోక్షమును) పొందును.

భ్రష్టరాజ్యో యదా రాజా నవమ్యాం నియతః శుచిః,

అష్టమ్యాంచ చతుర్దస్యా ముపవాసీ నరోత్తమః.

సంవత్సరేణ లభ##తే రాజ్యం నిష్కణ్టకం నృపః. 58

రాజ్యము కోల్పోయిన రాజెవ్వడైనను శ్రద్ధతో శుచియై నవమినాడును, అష్టమినాడును, చతుర్దశినాడును ఉపవాసముండి (ఈ దేవిని కొలుచునేని) ఒక్కయేడు కాలములో ఏ బాధలులేని రాజ్యము పొందును.

ఏషా త్రిశక్తి రుద్దిష్టా నయసిద్ధాంతగామినీ,

ఏషా శ్వేతా పరాసృష్టిః సాత్వికీ బ్రహ్మసంస్థితా. 59

ఈ త్రిశక్తి నయసిద్ధాంతమునకు చెందినది. ఇదిగో తెల్లని ఈ తల్లి బ్రహ్మయందు సత్వరూపమున నెలకొని పరాసృష్టి యగుచున్నది.

ఏషైవ రక్తా రజసి వైష్ణవీ పరికీర్తితా,

ఏషైవ కృష్ణా తమసి రౌద్రీ దేవీ ప్రకీర్తితా. 60

ఈమెయే ఎర్రని వన్నె కలదియై రజోగుణమున వైష్ణవియనియు, ఈమెయే నల్లదియై తమోగుణమునందు రుద్రశక్తి యనియు ప్రసిద్ధి కెక్కుచున్నది.

పరమాత్మా యథా దేవ ఏకఏవ త్రిధా స్థితః,

ప్రయోజనవశా చ్ఛక్తి రేకైవ త్రివిధా భవత్‌. 61

పరమాత్ముడగు దేవు డెట్లు ఒక్కడే మూడువిధములుగా నాయెనో అట్లే ప్రయోజనమునుబట్టి ఒకేశక్తి మూడువిధములుగా ఆయెను.

య ఏతం శృణుయాత్‌ సర్గం త్రిశక్త్యాః పరమం శివమ్‌,

సర్వపాప వినిర్ముక్తః పరం నిర్వాణ మాప్నుయాత్‌. 62

పరమమంగళ##మైన ఈ త్రిశక్తిసృష్టిని విన్నవాడు పాపము లన్నింటిని పరిమార్చి పరమనిర్వాణమును పొందును.

యశ్చేదం శృణుయాద్‌ భక్త్యా నవమ్యాం నియతః స్థితః,

స రాజ్య మతులం లేభే భ##యేభ్యశ్చ ప్రముచ్యతే. 63

నవమియందు శ్రద్ధతో భక్తితో దీనిని విన్నవాడు సాటిలేని రాజ్యమును పొందును. మరియు భయమునుండి ముక్తి పొందును.

యస్యేదం లిఖితం గేహే సదా తిష్ఠతి ధారిణి,

న తస్యాగ్నిభయం ఘోరం సర్పచౌరాదికం భ##వేత్‌. 64

భూదేవీ! ఎవనియింట ఈ కథ లిఖింపబడునో వానికి అగ్నిభయము, సర్పభయము దొంగభయము కలుగదు.

యశ్చైతత్‌ పూజయేద్‌ భక్త్యా పుస్తకేపి స్థితం బుధః,

తేన యష్టం భ##వేత్‌ సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌. 65

పుస్తకమునందును దీనిని భక్తితో పూజించుపండితుడు చరాచరాత్మకమగు మూడులోకములను పూజించిన వాడగును.

జాయన్తే పశవః పుత్రా ధనం ధాన్యం వరస్త్రియః,

రత్నాన్యశ్వా గజా భృత్యా యానాశ్చాశు భవన్త్యుత.

యస్యేదం తిష్ఠతే గేహే తస్యేదం జాయతే ధ్రువమ్‌. 66

ఈ గ్రంథము ఎవని యింటిలో ఉండునో అతనికి పశువులు, పుత్రులు, ధనము, ధాన్యము, చక్కనికాంతలు, రత్నములు, గుఱ్ఱములు, ఏనుగులు, సేవకులు, వాహనములు శీఘ్రముగా కలుగును.

శ్రీవరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవు డిట్లు పలికెను.

ఏతదేవ రహస్యం తే కీర్తితం భూతధారిణి,

రుద్రస్య ఖలు మాహాత్మ్యం సకలం కీర్తితం మయా. 67

భూతధారిణీ! రుద్రుని రహస్యమగు మహిమను గూర్చి మొత్తముగా నీకు తెలిపితిని.

నవకోట్యస్తు చాముండా భేదభిన్నా వ్యవస్థితా,

యా రౌద్రీ తామసీ శక్తిః సా చాముండా ప్రకీర్తితా. 68

చాముండాదేవి తొమ్మిదికోట్ల భేదస్వరూపములతో నిలిచియున్నది. ఆమె రుద్రునికి చెందిన తామసి యగు శక్తి.

అష్టాదశ తథా కోట్యో వైష్ణవ్యా భేద ఉచ్యతే,

యా సాచ రాజసీ శక్తిః పాలనీ వైష్ణవీ.

అట్లే వైష్ణవి భేదములు నదునెనిమిది కోట్లు. ఆమె రజస్సంబంధమగు శక్తి. లోకముల నేలునది.

యా బ్రహ్మశక్తిః సత్వస్థా అనంతా స్తాః ప్రకీర్తితాః. 69

ఇక ఆ సత్వగుణమునందున్న బ్రహ్మశక్తి భేదములు అనంతములు.

ఏతాసాం సర్వభేదేషు పృథగేకైకశో ధరే,

సర్వాసాం భగవాన్‌ రుద్రః సర్వగశ్చ పతిర్భవేత్‌. 70

ఈ మువ్పురి భేదములన్నింటి యందును, రుద్రుడు విడిగా ఒక్కొక్కరూపముతో అంతటనుండు ప్రభువై యుండును.

యావన్త్యస్యా మహాశక్త్యా స్తావద్‌రూపాణి శంకరః,

కృతవాం స్తాంశ్చ భజతే పతిరూపేణ సర్వదా. 71

ఈ మహాశక్తి రూపము లెన్నికలవో అన్నింటి యందు శంకరుడు పతిరూపమున నుండి వానిని పొందుచున్నాడు.

య శ్చారాధయతే తాస్తు రుద్ర స్తుష్టో భవిష్యతి,

సిద్ధ్యన్తే తాస్తదా దేవ్యో మన్త్రిణో నాత్ర సంశయః. 72

ఆ రూపములను ఆరాధించినచో రుద్రుడు తుష్టుడగును. ఆ దేవిమంత్రులు సర్వకార్యములను సిద్ధింప జేయుచుందురు. సంశయము లేదు.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పఞ్చనవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదియైదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters