Varahamahapuranam-1    Chapters   

సప్తనవతితమోధ్యాయః - తొంబదియేడవ అధ్యాయము

ధరణ్యువాచ - ధరిణి పలికెను.

యోసౌ సత్యతపా నామ లుబ్ధో భూత్వా ద్విజో బభౌ,

యే నారుణీ ర్వ్యాఘ్రభయాద్‌ రక్షితో యః స్వశక్తితః.

దుర్వాససా శ్రుతార్థశ్చ హిమవన్తోత్తరం య¸°,

తస్యోపరి మహాశ్చర్యం భవతీతి త్వ యేరితమ్‌,

కీదృశం తన్మమాచక్ష్వ మహత్‌ కౌతూహలం విభో. 2

ప్రభూ! సత్యతపుడనువాడు మొదట బోయ అయి, తరువాత బ్రహ్మణుడై ప్రకాశించెను, అతడు తనశక్తిమేరకు ఆరుణి అనువానిని పెద్దపులిభయము వలన కాపాడెను. దుర్వాసుడు ఉపదేశింపగా హిమవత్పర్వతపు ఉత్తరదిశ కరిగెను. అందొక గొప్పవింత జరిగెనని నీవు చెప్పితివి. అది ఎట్టిది? చాల వేడుకగా నున్నది. నాకు దానిని చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

సహి సత్యతపాః పూర్వం భృగువంశోద్భవో ద్విజః,

దస్యుసంసర్గ సంభూతో దస్యువత్‌ సమజాయత. 3

ఆ సత్యతపుడు పూర్వము భృగువంశమున పుట్టిన బ్రాహ్మణుడు, క్రూరుల సంసర్గము వలన బోయవాడుగా పుట్టెను.

తతః కాలేన మహతా ఋషినఙ్గాత్‌ పున ర్ద్విజః,

బభౌ దుర్వాససా సమ్యగ్‌ బోధితశ్చ విశేషతః. 4

అంత పెద్దకాలమునకు ఋషుల చెలిమివలన మరల బ్రాహ్మణుడాయెను. దుర్వాసునిబోధవలన మరింత ప్రకాశించెను.

హిమాద్రే రుత్తరే పాదే పుష్పభద్రా నదీ శుభా,

తస్యాస్తీరే శిలా దివ్యా నామ్నా చిత్రశిలా ధరే. 5

హిమగిరి ఉత్తర పాదమున పుష్పభద్ర అను మంచి నది కలదు. దాని యొడ్డున ఒకదివ్య శిల కలదు. దాని పేరు చిత్రశిల.

న్యగ్రోధశ్చ మహాం స్తత్ర నామ్నా భద్రమహావటః,

తత్ర సత్యతపాః స్థిత్వా తపః కుర్వన్‌ మహాతపాః. 6

అక్కడ ఒకగొప్ప మఱిచెట్టు భద్రమహావటమను నది కలదు. అందా సత్యతపుడు తపస్సు చేయుచు మహాతాపసుడాయెను.

స కదాచిత్‌ కుఠారేణ చకర్త సమిధః కిల,

అఛైత్సీ దజ్గుళిం చైకాం వామతర్జనికాం మునిః. 7

అతడొకనాడు గొడ్డలితో సమిధలు కోయుచు ఎడమ చేతి చూపుడు వ్రేలిని నరకుకొనెను.

ఛిన్నాయా అంగుళే స్తస్య భస్మచూర్ణం భవత్‌ కిల,

నలోహితం నమాంసం తు నమజ్జా తత్ర దృశ్యతే. 8

తెగినవ్రేలి నుండి భస్మపుపొడి ఏర్పడినదట. రక్తము, మాంసము, క్రొవ్వు ఏదియు కానరాలేదు.

సోనాదృత్య పునర్వృశ్య సమిధో మునిపుంగవః,

ఏవమేవ పునర్భస్మ స్రవన్తం తు ప్రదృశ్యతే,

అంగుళీసంధితా తేన పూర్వవచ్చాభవత్‌ కృతే. 9

అతడు లెక్క పెట్టక మరట సమిధలు కొట్టుచుండెను. మరల అట్లే భస్మము కారుచు కన్పట్టెను. వ్రేలు అతుకుకొని మునుపటివలె ఆయెను.

తస్మిన్‌ భద్రవటే చైకం మిథునం కింనరం స్థితమ్‌,

రాత్రౌ సుప్త మృషే స్తస్య దృష్ట్వా తన్మహ దద్భుతమ్‌,

ప్రభాతే విమలే ప్రాప్త మిన్ద్రలోక మితిస్మృతిః. 10

ఆ భద్రవటమున ఒక కింనరమిథునము కలదు. రాత్రి నిద్రించియుండెను. ఆ ఋషికి సంబంధించిన అద్భుతమును చూచి తెల్లవారినపిదప ఇంద్రలోకమున కరిగెను.

అధేంద్రేణ సురాఃసర్వే యక్షగంధర్వకిన్నారాః,

వృష్టాః కిఞ్చదిహాశ్చర్య మపూర్వం కథ్యతామితి. 11

అంత ఇంద్రునితోపాటు దేవతలందరు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఏదేని మునుపెన్నడు మహాశ్చర్యము కలిగెనా చెప్పుడని అడిగిరి.

తత్ర రుద్ర సరస్తేరే యదేతన్మిథునం శుభమ్‌,

స్థితం కింనరయో స్తచ్చ వాక్యం చేదమువాచ హ. 12

అంత రుద్రసరస్సు ఒడ్డున ఉండు ఈ కిన్నరులజంట ఇట్లు పలికెను.

దృష్టం కిఞ్చిదిహాశ్చర్యం దృష్టంతు హిమవద్గిరౌ

పుష్పభద్రానదీతీరే మహదాశ్చర్య ముత్తమమ్‌. 13

హిమవత్పర్వతమున పుష్పభద్రానది యొడ్డున మేమొక మహాశ్చర్యమును చూచితిమని వారు పలికిరి.

యదేతత్‌ సత్యతపసః నమవోచు స్తతః శుభే,

స్రవణం భస్మన శ్చైవ శ్రుతం సర్వం శశంస హ. 14

సత్యతపసుని వృత్తాంతము, చేతినుండి భస్మము వెలికి వచ్చుట అనుదానిని వివరించి చెప్పిరి.

తచ్ఛ్రుత్వా సహసా శక్రో విస్మితో విష్ణు మబ్రవీత్‌,

ఆగచ్ఛ విష్ణో గచ్ఛావ హిమవత్పార్శ్వముత్తమమ్‌,

తత్రాశ్చర్యమపూర్వం మే కథితం కిన్నరేణ హ. 15

అది విని ఇంద్రుడు అచ్చెరువంది విష్ణువుతో ఇట్లనెను. విష్ణూ! రమ్ము, హిమవత్పర్వతము వైవు వెళ్లుదము. అక్కడ ఒక మహాశ్చర్యము సంభవించినదట. కిన్నరుడు చెప్పెను.

ఏవముక్త స్తతో విష్ణు ర్వరాహః సంబభూవ హ,

మృగయశ్చ తథైవేన్ద్రో జగ్మతు స్తమృషిం ప్రతి. 16

ఇట్లు పలుకగా విష్ణువు వరాహమాయెను. ఇంద్రుడు వేటకాడై వారిరువురు ఆ ఋషికడ కరిగిరి.

విష్ణు ర్వరాహరూపేణ ఋషిదృష్టిపథే స్థితః,

భూత్వా దృశ్యోప్యదృశ్యోభూత్‌ పునరేవచ దృశ్యతే. 17

విష్ణువు పంది రూపముతో ఋషి కంటబడి నిలిచెను. కనపడియు కనబడక మరల కనబడుచు ఉండెను.

తావదిన్ద్రో ధనుః పాణి స్తీ క్షణసాయకధృక్‌ పురః,

ఆగత్య సత్యతపస మృషి మేన మువాచ హ. 18

ఇంతలో ఇంద్రుడు విల్లు చేపట్టి వాడి బాణములు తాల్చి వచ్చి సత్యతపర్షితో ఇట్లనెను.

భగవన్నిహ దృష్టస్తే వరాహః పృథులో మహాన్‌,

యేన తం హన్మి భృత్యానాం పోషణాయ మహామునే. 19

మహామునీ! దొడ్డదొరా! ఇచట ఒక బలిసిన పెద్ద పందిని చూచితివా? దానిని నావారి పోషణకై చంపెదను.

ఏవముక్తో మునిస్తేన చింతయామాస ధారణి,

యది తం దర్శయా మ్యసై#్మ వరాహో హన్యతే తదా. 20

న చేత్‌ కుటుంబం క్షుధయా సీదత్యస్య న సంశయః

జాయాపుత్ర సమాయుక్తో లుబ్ధకోయం క్షుధాన్వితః. 21

ఇట్లు పలుకగా, ధారణీ! ఆ మునియిట్లు తలపోసెను. ఈతనికి ఆ పందిని చూపితినా దానిని వీడు చంపును. చూపకుందునా, ఆకలితో వీని కుంటుంబము నిస్సంశయముగా నశించును. పెండ్లము బిడ్డలతో వీడు మిక్కలి ఆకలితో నున్నాడు.

సశల్యశ్చ వరాహోయం మమాశ్రమ ముపాగతః,

ఏవం గతే తు కిం కార్యం మయా సౌ చిన్తయన్మునిః,

నాధ్యగచ్ఛత బుద్ధిశ్చ క్షణాత్‌ తస్య వ్యజాయత. 22

బాణము తగిలిన పంది నా ఆశ్రమమును చేరుకొనినది. ఇట్టి స్థితిలో నేనేమి చేయుదును? అని ఆ ముని చింతించుచు నిశ్చయము పొందకుండెను. క్షణములో ఆతని కొక ఊహతోచెను.

ద్రష్టుం చక్షు ర్నిహితం జఙ్గమేషు

జిహ్వా వక్తుం మృగయో తద్‌ విసృష్టమ్‌,

ద్రష్టుం చక్షు ర్నాస్తి జిహ్వేహ వక్తుం

జిహ్వయైవ స్యాద్‌ వక్తి యో నాస్తి చక్షుః. 23

ప్రాణముకలవారికి చూచుటకు కంటిని, పలుకుటకు నాలుకను భగవంతుడు ఏర్పరచెను. వేటకాడు వదలిన దానిని చూచినకంటికి పలుకగలనాలుక లేదు. పలికెడు నాలుకకు చూచు కన్ను లేదు.

ఏవం శ్రుత్వా ద్వావపి తస్య తుష్టా

వింద్రా విష్ణూ దర్శయతాం స్వమూర్తిమ్‌,

వాక్యం చేద మూచతు ర్బ్రూహి నౌ తే

తుష్టౌ ధన్యం వర మేకం వదస్వ. 24

ఇది విని ఆ ఇంద్రుడు, విష్ణువును, సంతోషించి తమ నిజరూపమును చూపిరి. మేము సంతసించితిమి. నీవొక కోరిక కోరుకొనుము. అనియు పలికిరి.

తచ్ఛ్రుత్వాసౌ సత్యతపా ఉవాచ

దేవా వలం మే వర ఏష ధన్యః,

యద్‌దృష్టౌ మే పురతో దేవదేవౌ

నచాతిరిక్తోస్తి వరః పృథివ్యామ్‌. 25

అది విని సత్యతపుడు ఇట్లనెను. దేవులారా! ఈ వరమే నాకు చాలును. నేను ధన్యుడను. దేవదేవులిరువురు నాముందు కాన వచ్చితిరి. భూమిపై ఇంతకు మించిన వర మేముండును?

తథాపీదం యే సదా పర్వకాలే

విప్రాన్‌ విప్రాః శ్రావయన్తీతి భక్త్యా,

తేషాం పాపం నశ్యతాం మాస మేకం

యత్‌ సంచితం త్వేష ఏకో వరోస్తు. 26

అయినను పండుగదినములలో ఒకనెల ఈ కథను విప్రులకు భక్తితో వినిపించినచో విప్రుల ప్రోగువడిన పాపమంతయు నశించుగాక. ఇది నేను కోరు ఒక వరము.

ముక్తిం చాహం వ్రజామీతి ద్వితీయోస్తు వరోమమ,

తథేత్యుక్త్వా తు తౌ దేవౌ దత్వా తస్య వరం శుభమ్‌. 27

అదర్శనం గతౌ దేవౌ సోపి తత్ర వ్యవస్థితః,

లబ్ధ్వా వరం సత్యతపా బ్రహ్మభూతోభవద్‌ హృది. 28

నేను ముక్తి పొందవలయును. ఇది రెండవ వరము. అని పలుకగా ఆ దేవు లిరువురు అట్లే అని ఆతనికాశుభ##మైన వరమునొసగి అదృశ్యులైరి. అతడును వరములు పొంది ఆ ఆశ్రమమున నుండి హృదయమున బ్రహ్మభూతుడాయెను.

యావదాస్తే శుభే దేశే కృతకృత్యో మహామునిః

తావత్తస్య గురుస్తత్ర ఆరుణిః సమదృశ్యత. 29

అట్లు నెరవేరిన ప్రయోజనముగల ఆ మహాముని ఆదేశమున ఉండగా ఆతని గురువు ఆరుణి అతనికి కానవచ్చెను.

పృథ్వీం ప్రదక్షిణీకృత్య తీర్థహేతో ర్విచక్షణః,

తేన చాసౌ మహా భక్త్యా పూజితో మునిపుంగవః.

పాద్యాచమనగోదానైః కృతాసనపరిగ్రహః. 30

ఆ ఆరుణి భూమినంతయు తీర్థయాత్రలకై చుట్టివచ్చెను. ఆ మునిపుంగవుని ఈతడు పాద్యము, ఆచమనము, గోదానము మున్నగువానితో మహాభక్తితో పూజించెను. ఆ ఆతడును ఆసనమును స్వీకరించియుండెను.

జ్ఞాత్వా స శిష్యం సిద్ధం తు తపసా దగ్ధకిల్బిషమ్‌,

ఉవాచ వినయాపన్నం ప్రాఞ్జలిం పురతః స్థితమ్‌ 31

ఆతడును ఆశిష్యుడు తపస్సు చేత కాలిన పాపములుగల సిద్ధుడని ఎరిగి, ఎదురుగా చేతులు మోడ్చి వినయముతో నిలిచియున్న ఆతనితో నిట్లనెను.

ఆరుణి రువాచ - ఆరుణి యిట్లు పలికెను.

పుత్ర సిద్ధోసి తపసా బ్రహ్మభూతోసి పుత్రక,

ఇదానీ మాత్మనా సార్ధం ముక్తికాల మితోస్తితే. 32

బిడ్డా! తపస్సుచేత సిద్ధుడవయితివి. బ్రహ్మభూతుడవయితివి. ఇప్పుడు నీకు ముక్తికాలము చేకూరినది.

ఉత్తిష్ఠ గమ్యతాం పుత్ర మయా సార్ధం వరం పదమ్‌,

యద్గత్వా నపునర్జన్మ భవతీతి న సంశయః. 33

లేరా! నాతో కలసి పరమపదమునకు రమ్ము. అచటకు పోయినచో నీకు మరల జన్మము కలుగదనుటకు సంశయములేదు.

ఏవ ముక్త్వా తతః సిద్ధావుభౌ సత్యతపోరుణీ,

ధ్యాత్వా నారాయణం దేవం సదేహౌ తౌ దివంగతౌ. 34

ఇట్లు పలికిన పిమ్మట ఆ సిద్ధు లిరువురు సత్యతపుడును, ఆరుణియు నారాయణ దేవుని ధ్యానించి తమదేహములతో స్వర్గమున కరిగిరి.

యశ్చా పి శృణుయాత్‌ పాదం పర్వాధ్యాయం సవిస్తరమ్‌,

శ్రావయేద్‌ వా స పితరో యజేద్‌ గత్వా గయామితి. 35

ఈ విస్తరమైన పర్వాధ్యయమున ఒక్క నాలుగవభాగము నైనను చదువువాడు, వినిపించువాడు గయకరిగి పితృదేవతలను పూజించిన ఫలమును పొందును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తనవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదియేడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters