Sri Devi Bhagavatam-1
Chapters
శ్రీ గణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః శ్రీ దేవీ భాగవతమ్ ప్రథమస్కంధః - ప్రథమాధ్యాయః ఓం సర్వచైతన్య రూపాం తా మాద్యాం విద్యాం చ ధీమహి| బుద్ధిం యా నః ప్రచోదయాత్.* 1 శౌనక ఉవాచః సూత సూత మహాభాగ ధన్మోసి పురుషర్షభ! యదధీతాస్త్వయా సమ్యక్పురాణ సంహితాః శుభాః.
2 అష్టాదశ పురాణాని కృష్ణేన మునినా%నఘ! కథితాని సుదివ్యాని పఠితాని త్వయా%నఘ!
3 పంచలక్షణయుక్తాని సరహస్యాని మానద! త్వయా జ్ఞాతాని సర్వాణి వ్యాసా త్సత్యవతీసుతాత్.
4 అస్మాకం పుణ్యయోగేన ప్రాప్త స్త్వంక్షేత్ర ముత్తమమ్! దివ్యం విశ్వసనం పుణ్యం కలిదోష వివర్జితమ్.
5 సమాజో7యం మునీనాం హి శ్రోతుకామో%స్తి పుణ్యదామ్! పురాణసంహితాం సూతబ్రూహిత్వం నః సమాహితః.
6 దీర్ఘాయుర్భవ సర్వజ్ఞ! తాపత్రయవివర్జిత! కథయాద్య మహాభాగ! పురాణం బ్రహ్మసమ్మితమ్.
7 శ్రోత్రేంద్రియయుతాః సూత! నరాః స్వాదవిచక్షణాః| న శృణ్వంతి పురాణాని వంచితా విధినా హి తే.
8 యథా జిహ్వేంద్రియాహ్లాదో షడ్రసైః ప్రతిపద్యతే| తథా శ్రోత్రేంద్రియాహ్లాదో వచోభిః సుధియాం స్మృతః.
9 అశ్రోత్రాః ఫణినః కామం ముహ్యంతి హి నభోగుణౖః! సకర్ణా యే న శృణ్వంతి తే%ప్యకర్ణాః కథం నచ. 10 అతంః సర్వే ద్విజాః సౌమ్య! శ్రోతుకామాః సమాహితాః| వర్తంతే నైమిశారణ్య క్షేత్రే కలిభయార్దితాః. 11 శ్రీ గణాధిపతియే నమః ప్రథమస్కంధము - మొదటి అధ్యాయము మా బుద్ధుల నాత్మచింతనమునకై ప్రేరించు దేవియు సర్వ చైతన్యరూపయు ఆద్యయు మహావిద్యయు నగు శ్రీ భగవతిని ధ్యానింతుము. *శ్రీ దేవీ రూప పరిణామమే సకల చిదచిదాత్మక చరాచరాత్మక జగత్తులగుటచే నామె సర్వరూప. ఆమె చిద్రూపయగుటం జేసి చైతన్య రూప. చైతన్యాత్మికయగు నామెయొక్క పరిణామమగు నీ జగములు నందలి సకలభూతములును చిద్రూపములే కావలయును. కావున నామె సర్వభూతములయందలి చైతన్యమును నై యున్నది. ఆ దేవి సర్వమునకును ఆద్యయును పరతత్త్వ సాక్షాత్కారమునకు సాధనమగు విద్యయును. అట్టి విద్య యొక్క రూపములలో సర్వ శ్రేష్ఠ మగుటచే నాద్య యగునది ప్రణవము. అది ఆద్య. అ+ఆద్య. అకార ఉకార మకారములు ఓమ్. అకారము ఆది వర్ణముగా గలది. ఆ ప్రణవ విద్య యొక్క విస్తృత రూపమే గాయత్రీ మంత్రము. ఆ రూపమున శ్రీదేవీ తత్త్వమును ప్రతిపాదించుటయే శ్రీదేవీభాగవతమునందలి ప్రధాన తత్త్వము. శ్రీ గాయత్రీ మంత్రముయొక్క రూపాంతరమే శ్రీ పంచదశీ మహావిద్య. ఆ విద్యయొక్క 'కాదివిద్యా' రూపమునకు ఆది విద్య యని శాస్త్ర సంకేతము. విద్యకును విద్యా ప్రతిపాద్య తత్త్వమునకును అభేదమే కావున ఆ దేవి ''ఆది విద్యా'' యగును. శ్రీపంచదశీ మహావిద్యయొక్క సునిష్కృష్ట రూపమగు శ్రీ షోడశాక్షరీ విద్యయు నంతే. శ్రీదేవి శబ్ద బ్రహ్మాత్మిక. అట్టి పరాది వాగాత్మక శక్తి మాతృకారూప. అవి అకారాదికములు గదా! అందుచేత నామె ''ఆద్యా విద్యా'' అ-ఆద్యా=అకారము ఆదిగా గలది. ఆ దేవి మనయందర బుద్ధి తత్త్వములను ప్రేరించును. ఆ ప్రేరణకు మూలము సంకల్పము - అనగా - ఇచ్ఛ. బుద్ధి అనగా ఆయా కృత్యముల గూర్చిన జ్ఞానము. జ్ఞానము ననుసరించి సృష్ట్యాది కృత్యములు జరుగును. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు మూడును ఆ దేవి రూపములే. ఇట్లు ఆమె శక్తిత్రయరూప త్రిగుణాత్మక మాయారూప, మాయా పరిణామ జగద్రూప. మాయా పాశమోచన సాధన విద్యారూప అని యీ గాయత్రీ ఛందోరూపమగు శ్రీదేవీ ప్రార్థనము సూచించుచున్నది. ఇట్లు సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్త్వాది లక్షితమైన శ్రీదేవీ రూప మాయా శబలిత బ్రహ్మ మీ మంగళ శ్లోకమున ప్రార్థింపబడుచు న్నది. మాయా శబల బ్రహ్మను ఇచట ధ్యాన విషయమగుటచే నట్టి తత్త్వము నిష్క్రియము కాదు కావున మా బుద్ధి వృత్తులను ప్రేరించుగాక! అని శ్రీదేవిని ప్రార్థించుట సముచితము. శౌనకముని సూతుని పురాణములగూర్చి ప్రశ్నించుట శౌనకముని యిట్లనెను : ఓ పురుషర్షభా మహాభాగా సూతమహామునీ! మేలు చేకూర్చు పురాణ సంహితలన్నియును నీచే చక్కగ నధ్యయనము చేయబడినవి. నీవు కడు ధన్యుడవు. ఓ సుకృతీ! వేద వ్యాసమహర్షి దివ్యములగు పదునెనిమిది పురాణములను ప్రపంచించగా వానిని నీవు చక్కగ చదివితివి. ఆ పురాణములు సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశానుచరితము నను నైదు లక్షణములతో నొప్పారుచు రహస్య విషయములతో గూడియున్నవి. అట్టివాని నెల్ల నీవు సత్యవతీ పుత్రుడగు వ్యాసుని వలన నెఱింగితివి. అట్టి నీవు మా పుణ్యవశమున నీ యుత్తమ పుణ్యక్షేత్రమున కరుదెంచితివి. ఈ క్షేత్రము ఉత్తమమును దివ్యమును మునులకు విశ్రామ ప్రదేశమును పుణ్యకరమును కలిదోష శూన్యమునునై యున్నది. ఈ మా మునిగణము పుణ్యప్రదమగు పురాణ సంహితను వినగోరుచున్నది. కనుక మాకు దానిని సమాహితచిత్తుడవై వివరింపుము. నీవు సర్వజ్ఞుడవును మహానుభావుడవును. నీవు ఆధిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైవికములను తాపత్రయములు లేనివాడవు. మాకిపుడు వేద తుల్యమగు పురాణ సంహితను వివరించి చిరకాలము చల్లగ వర్ధిల్లుము. రసాస్వాదన సమర్థులై చెవి మున్నగు నింద్రియములు కలవారైనను పురాణములు వినని మనుజులు దైవ వంచితులే కదా! ఈ నాలుక షడ్రసములచే నాహ్లాద మొందినట్లు మహాత్ముల వచనములు వినుటవలన చెవి ఆహ్లాదము చెందును. చెవులులేని పాములును ఆకాశగుణ మగు శబ్దములచే మోహితములగును. చెవులుండియు సత్కథలు వినని నరులు చెవులు లేనివారేల కారు? ఈ కారణమువలన మా ద్విజులెల్లరము కలిభయ పీడితులమై పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రమును జేరి సావధానముగ సత్కథలు వినగోరుచున్నారము. యేనకేనాప్యుపాయేన కాలాతివహనం స్మృతమ్| వ్యసనైరిహ మూర్ఖాణాం బుధానాం శాస్త్రచింతనైః. 12 శాస్త్రాణ్యపి విచిత్రాణి జల్పవాద యుతాని చ| త్రివిధాని పురాణాని శాస్త్రాణి వివిధాని చ, వితండాచ్ఛలయుక్తాని సర్వామర్ష కరాణి చ| నానార్థవాదయుక్తాని హేతుమంతి బృహంతి చ. 13 సాత్త్వికం తత్ర వేదాంతం మీమాంసా రాజసం మతమ్| తామసం చ న్యాయశాస్త్రం హేతువాదాభియంత్రితమ్. 14 తథైవ చ పురాణాని త్రిగుణాని కథానకైః| కథితాని త్వయా సౌమ్య! పంచలక్షణవంతి చ. 15 తత్ర భాగవతం పుణ్యం పంచమం వేదసమ్మితమ్| కథితం య త్వయా పూర్వం సర్వ లక్షణ సంయుతమ్. 16 ఉద్దేశ మాత్రేణ తదా కీర్తి తం పరమాద్భుతమ్| ముక్తిప్రదం ముముక్షూణాం కామదం ధర్మదం తథా. 17 విస్తరేణ తదాఖ్యాహి పురాణోత్తమ మాదరాత్| శ్రోతుకామా ద్విజాః సర్వే దివ్యం భాగవతం శుభమ్. 18 త్వం తు జానాసి ధర్మజ్ఞ! పౌరాణీం సంహితాం కిల | కృష్ణోక్తాం గురుభక్తత్వా త్సమ్య క్సత్త్వగుణాశ్రయంః. 19 శ్రుతాన్యన్యాని సర్వజ్ఞ! త్వన్ముఖా న్ని ఃసృతాని చ | నైవ తృప్తిం వ్రజామో%ద్య సుధాపానే%మరా యథా. 20 ధిక్ సుధాం పిబతాం సూత! ముక్తిర్నైవ కదాచన | పిబన్ భాగవతం సద్యో నరో ముచ్యేత సంకటాత్. 21 సుధాపాన నిమిత్తం య త్కృతా యజ్ఞాః సహస్రశః | న శాంతి మధిగచ్ఛామః సూత! సర్వాత్మనా వయమ్. 22 మఖానాం హి ఫలం స్వర్గః స్వర్గా త్ప్రచ్యవనం పునః | ఏవం సంసార చక్రే%స్మి న్భ్రమణం చ నిరంతరమ్. 23 వినా జ్ఞానేన సర్వజ్ఞ! నైవ ముక్తిః కదాచన | భ్రమతాం కాల చక్రే%త్ర నరాణాం త్రిగుణాత్మకే. 24 అతః సర్వరసోపేతం పుణ్యం భాగవతం వద | పావనం ముక్తిదం గుహ్యం ముముక్షూణాం సదా ప్రియమ్. 25 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టాదశ సాహస్య్రాం సంహితాయాం ప్రథమస్కంధే శౌనక కృత ప్రశ్నో నామ ప్రథమో%ధ్యాయః. ఈ కాలచక్ర మేదోవిధముగ గడచి పోవుచునే యుండును. కాని యది మూర్ఖులకు వ్యసనములతోను పండితులకు శాస్త్ర చింతనములతోను గడచుచుండును. ఈ శాస్త్రములును విచిత్రములైనవి. అవి నానార్థవాదములతో తర్కముతో జల్పముతో వితండ వాదముతో యుక్తిప్రయుక్తులతో రోషగర్వములను కలిగించును. లఘుటీక : అర్థవాదము=స్తావకము, జల్పము=పరపక్షమును నిరాకరించుచు స్వపక్షమును స్థాపించుచు జయేచ్ఛతో చేయు ప్రసంగము, వాదము=యథార్థము తెలిసికొనుటకై చేయు చర్చ, వితండ=స్వపక్షమును స్థాపించక పర పక్షమును ఖండించుచు చెప్పు వాక్యము, ఛలము=విపరీతార్థకల్పనచే పరవచనవిఘాతము. (పరిష్కర్త) ఆ శాస్త్రములలో వేదాంతము సాత్త్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము అగుటచే తామసము నై యొప్పుచుండును. పురాణములు త్రిగుణములతో త్రివిధములై కథలతో కూడియుండును. పంచలక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి. వానిలో శ్రీ దేవీభాగవత మైదవది. పుణ్యప్రదమైనది. వేదసదృశము. సర్వ లక్షణ సంయుతము. అన్నిటి కంటె శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాములకు కామఫలమును నొసంగగల దగుటచే పరమాద్భుతమైనది. అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమున చెప్పితివి. ఇపుడా దివ్యమై శుభకరమైన శ్రీ దేవీ భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విశదముగ నభివర్ణింపుము. దాని నిచటి ద్విజులెల్లరము విన వేడుకపడుచున్నారము. ధర్మజ్ఞుడవగు సూతా! గురుభక్తి సత్త్వగుణము గలిగిన వాడవగుటచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాఙ్మయమును బాగుగ నెఱింగియున్నావు అనునది నీయందలి విశేషము. పురాణతత్త్వ సర్వస్వము నెఱిగిన వాడవు. నీ నోట నెన్నియో పురాణములను వింటిమి. కాని మా కిపుడు అమృత పానముచే నమరులకు వలె మాకు అంత మాత్రమున తృప్తి గలుగుటలేదు. ఎన్నటికిని ముక్తి నీయజాలని యమృతము గ్రోలుట వ్యర్థమే గదా! ఎందువలన ననగా, భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధమునుండి వెంటనే విముక్తు డగును. మే మమృతపానము గోరి యెన్నెన్నో జన్నము లొనరించితిమి. కాని యీనాటికిని మాకు పూర్తిగ శాంతి చేకూరలేదు. యాగములకు ఫలితముగ సర్వ ప్రాప్తిగలుగును. కాని యా స్వర్గమునుండి తిరిగి పతనము గలుగును. ఈ విధముగ నీ సంసార చక్రమునందు నిరంతరముగ భ్రమణము గలుగుచునేయుండును. సత్త్వ రజస్తమోరూపమగు నీ కాల చక్రమునబడి తిరుగుచున్న నరులకు తత్త్వజ్ఞానము లేకుండ నెన్నటికిని ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమై రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరస భరితమై యొప్పారు శ్రీ దేవీభాగవత మహాపురాణమును మాకు తేటతెల్ల మొనరించుము. ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి ప్రథమ స్కంధమందు శౌనక కృత ప్రశ్నమను ప్రథమాధ్యాయము.