Sri Devi Bhagavatam-1    Chapters   

అథ సప్తవింశో%ధ్యాయః

హతౌ తౌ దానవౌ దృష్ట్వా హతశేషాశ్చ సైనికాః | పలాయనం తతః కృత్వా జగ్ముః సర్వే నృపం ప్రతి. 1

భిన్నాంగా విశిఖైః కేచిత్కేచి చ్ఛిన్నకరా స్తథా | రుధిరస్రావదేహాశ్చ రుదంతో%భియయుః పరే. 2

గత్వా దైత్యపతిం సర్వే చక్రు ర్బుంబారవం ముహుః | రక్ష రక్ష మహారాజ భక్షయత్యద్య కాళికా. 3

తయా హతౌ మహావీరౌ చండముండౌ సురార్దవౌ | భక్షితాః సైనికాః సర్వే వయం భగ్నా భయాతురాః 4

భీతిదం చ రణస్థానం కృతం కాళికయా ప్రభో | పాతితై ర్గజ వీరాశ్వై ర్దాసేరక పదాతిభిః. 5

శోణితౌఘవహా కుల్యా కృతా మాంసాతికర్దమా | కేశ##శైవాలినీ భగ్నరథ చక్ర విరాజితా. 6

భిన్న బాహ్వాదిమత్స్యా ఢ్యా శీర్ష తుంబీఫలాన్వితా | భయదా కాతరాణాం వై శూరాణాం మోదవర్ధినీ. 7

కులం రక్ష మహారాజ పాతాళం గచ్ఛ సత్వరమ్‌ | క్రుద్ధా దేవీ క్షయం సద్యః కరిష్యతి న నంశయః. 8

సింహో%పి భక్షయత్యాజౌ దానవాన్దనుజేశ్వర | తథైవ కాళికా దేవీ హంతి బాణౖ రనేకధా. 9

తస్మా త్త్వమపి రాజేంద్ర మరణాయ మృషా మతిమ్‌ | కరోషి సహితో భ్రాత్రా శుంభేన కుపితాశయః. 10

కిం కరిష్యతి నార్యేషా క్రూరా కులవినాశినీ | యస్యా మేతో ర్మహారాజ హంతుమిచ్ఛసి బాంధవాన్‌. 11

దైవాధీనౌ మహారాజ లోకే జయపరాజ¸° | అల్పార్థాయ మహద్దుఃఖం బుద్ధిమా న్న ప్రకల్పయేత్‌. 12

చిత్రం పశ్య విధేః కర్మ యదధీనం జగత్ర్పభో | నిహతా రాక్షసాః సర్వే స్త్రియా పశ్యైకయా%నయా. 13

ఇరువదిఏడవ అధ్యాయము

రక్తబీజుడు శ్రీదేవితో పోరవచ్చుట

అట్లు చండముండులు నిహతులగుటగని తక్కిన సైన్యము శుంభుని చెంతకు పరుగెత్తెను. వారిలో గొందఱి యంగములు - చేతులు బాణములచే తెగెను. మఱి కొందఱి మేనులనుండి నెత్తురు కారుచండగ వారు రోదించు చుండిరి. వారెల్లరును దానవపతిని జేరి రాజా! కాపాడుము. నేడు మహాకాళి మమ్ము భక్షించుచున్నద'ని గొల్లున వాపోయిరి. మహాకాళిచేత సురభీకర వీరులగు చండ ముండులు సమసిరి, తక్కిన సైన్యము మ్రింగబడెను. మేము కళవళమంది పారివచ్చితిమి. శ్రీకాళిక మూలమున నొంటెలు గజాశ్వములు వీరపదాతులు నేలగూలుటచే రణభూమి బీభత్సముగ నున్నది. ఆ రణస్థలమున నెత్రుటేర్లు పారుచున్నవి. మాంసము బురదగ వెండ్రుకలు నాచుగ విరిగిన రథచక్రములు సుడిగుండములుగ నున్నవి. తెగిన చేతులు చేపలుగ తలలు తంబీఫలములుగ నుండి పిరికిగుండెలకు వెఱపును వీరులకు సంతోషమును గల్గించుచున్నవి. ప్రభూ! ఇకనైన నీవు పాతాళ##మేగి నీ వంశమును నిలువబెట్టుకొనుము. కానిచో కాళికాదేవి నిస్సంశయముగ మహారౌద్రముతో మనలను నాశ మొనర్పగలదు. దైత్యపతీ! ఆ పోరాటములో శ్రీ కాళి పెక్కురీతులతో బాణములు ఏసి చంపుచుండగ సింహము సైతము దానవులను పొట్ట బెట్టుకొనుచున్నది. ఐనను నీవు నీ సోదరునితోపాటు వట్టి కోపముతో వ్యర్థముగ చచ్చుటకు పూనుకొనుచున్నావు. ఆమెకొఱకు నీ బందుగులు ప్రాణములు వదలుచున్నారు. అట్టి యామెను నీవొకవేళ గెల్చినను కులనాశని-క్రూరస్వభావురాలగు ఆమెతో నీకేమి లాభము? లోకమునందు జయాపజయములు దైవాధీనములు. ధీశాలి కొద్ది ప్రయోజనములకు ప్రాణాంతకములైన పనులు చేయగూడదు. లోకమందు విధివశములైన పనులన్నియు విచిత్రములు. ఏలన, నొక్క వీరయువతి చేతిలో రాక్షసులెల్లరు నూచకోతగా మడిసిరిగదా!

జేతా త్వం లోకపాలానాం సైన్యయుక్తో హి నాంప్రతమ్‌ | ఏకా ప్రార్థయతే బాలా యుద్ధాయేతి సుసంభ్రమః. 14

పురా త్వయా తపస్తప్తం పుష్కరే దేవతాయనే | వరదానాయ సంప్రాప్తో బ్రహ్మా లోకపితామహః. 15

ధాత్రోక్త స్త్వం మహారాజ వరం వరయ సువ్రత | తదా త్వయా%మరత్వం చ ప్రార్థితం బ్రహ్మణః కిల. 16

దేవదైత్యమనుష్యేభ్యో న భ##వే న్మరణం మమ | సర్పకిన్నరయక్షేభ్యః పుంలింగ వాచకాదపి. 17

తస్మా త్త్వాం హంతుకామైషా ప్రాప్తా యోషిద్వరాప్రభో | యుద్ధం మా కురు రాజేంద్ర విచార్యైవం ధియా%ధునా. 18

దేవీ హ్యేషా మహామాయా ప్రకృతిః పరమా మతా | కల్పాంతకాలే రాజేంద్ర సర్వసంహారకారిణీ. 19

ఉత్పాదయిత్రీ లోకానాం దేవానా మీశ్వరీ శుభా | త్రిగుణా తామసీ దేవీ సర్వశక్తి సమన్వితా. 20

అజయ్యా చాక్షయా నిత్యా సర్వజ్ఞా చ సదోదితా | వేదమాతా చ గాయత్త్రీ సంధ్యా సర్వసురాలయా. 21

నిర్గుణా సుగుణా సిద్ధా సర్వసిద్ధి ప్రదా%వ్యయా | ఆనందా%%నందనా గౌరీ దేవానా మభయప్రదా. 22

ఏవం జ్ఞాత్వా మహారాజ వైరభావం త్యజానయా | శరణం వ్రజ రాజేంద్ర దేవీ త్వాం పాలయిష్యతి. 23

ఆజ్ఞాకరో భ##వైతస్యాః సంజీవయ నిజం కులమ్‌ | హతశేషా శ్చ యే దైత్యా స్తే భవంతు చిరాయుషః. 24

ఇతి తేషాం వచః శ్రుత్వా శుంభః సురబలార్దనః | ఉవాచ వచనం తథ్యం వీరవర్యగుణాన్వితమ్‌. 25

మానం కుర్వంతు భో మందా యూయం భగ్నా రణాజిరాత్‌ | శీఘ్రం గచ్ఛత పాతాళం జీవితాశా బలీయసీ. 26

నీవు లోకపాలురను గెల్చినమాట నిజమే; ఇప్పుడు నీకు దొడ్డ సేనయు తోడుగ నున్నది. ఐననేమి? ఆ యొక్క వీరమూర్తి నిన్ను పోరుటకు పురికొల్పుచున్న దనుటెంతయు నబ్రముగా నున్నదిగదా! మున్ను నీవు పుణ్యపుష్కర తీర్థమందు తపమొనర్చు నపుడు లోకపితామహుడగు బ్రహ్మ వరమొసగ నేతెంచెను. అతడు నిన్ను వరము కోరుకొమ్మనగ నీవా విధితో నమరత్వ మిమ్మంటివి. బ్రహ్మ దాని నీయ ననగ నీవు దేవ-దానవ-నాగ-కిన్నర-యక్ష-మనుజులలో నే పురుషుని వలనను చావులేని వరమిమ్మని కోరుకొంటివి. కనుక నిప్పుడీ వీరరసావతార నిన్ను చంపుకోరికతో నేతెంచెను. ఇకనైన దూరమాలోచించుకొని యుద్ధము విరమింపుము. రాజా! ఈ దేవి మహామాయపరాప్రకృతి. కల్పాంతమున సర్వసంహారకారిణి. ఆమె దివ్య లోకములు సృజియించు సృజనాత్మక శక్తి దేవతలకు ఈశ్వరి, త్రిగుణమయి తామసీ శక్తి, సర్వ శక్తి సమన్విత. ఆమె అజయ్య - అక్షయ -నిత్య - సర్వజ్ఞ - సర్వదాప్రకాశమాన - సకల సురనిలయ - వేదజనని - సంధ్య - గాయత్రి - సర్వసురలకు ఆశ్రయరూప. నిర్గుణ - సగుణ-సిద్ధ-సర్వసిద్ధిప్రద-అవ్యయ-ఆనందరూప- దేవతల కభయానందము లొసగు దేవదేవి-గౌరి-దేవతల కభయప్రద. రాజా! ఆమె నీ విధముగ నెఱుగుము. పగ పెంచుకోకుము. ఆమె శ్రీపాదరజమునకు ప్రపన్నుడవు గమ్ము. ఆమె నిన్ను బ్రోవగలదు. ఆ తల్లి యానతి తలదాల్చి నీ కులమును కాపాడుకొమ్ము. హతశేషులగు దానవులకు ప్రాణదాన మొనరింపుము'' అను సేనల మేలిమాటలు వినియును శుంభాసురుడు వీరగుణోపేతుడై తన యభిప్రాయము నిట్లని చెప్పసాగెను. మూఢులారా! మీరు బ్రతు కాసచే పోరినుండి పారివచ్చితిరి. ఇక మీ గొప్పలు కట్టిపెట్టుడు. వెంటనే పాతాళ మేగుడు.

దైవాధీనం జగత్సర్వం కా చింతా%త్ర జయే మమ | దేవా స్తథైవ బ్రహ్మాద్యా దైవాధీనా వయం యథా. 27

బ్రహ్మా విష్ణు శ్చ రుద్రో%యం యమో%గ్ని ర్వరుణస్తథా | సూర్య శ్చంద్ర స్తథా శక్రః సర్వే దైవవశాః కిల. 28

కా చింతా తర్హి మే మందా యద్భావి తద్భవిష్య తి | ఉద్యమ స్తాదృశో భూయా ద్యాదృశీ భవితవ్యతా 29

సర్వదైవం విచార్యైవ న శోచంతి బుధాః క్వచిత్‌ | స్వధర్మం న త్యజం తీహ జ్ఞానినో మరణా ద్భయాత్‌. 30

సుఖం దుఃఖం తథైవాయు ర్జీవితం మరణం నృణామ్‌ | కాలే భవతి సంప్రాప్తే సర్వదా దైవనిర్మితమ్‌. 31

బ్రహ్మా పతతి కాలే స్వే విష్ణుశ్చ పార్వతీపతిః | నాశం గచ్ఛం త్యాయుషో%ంతే సర్వే దేవాః సవాసవాః. 32

తథా%హమపి కాలస్య వశగః సర్వథా%ధునా | నాశం జయం వా గంతాస్మి స్వధర్మపరిపాలనాత్‌. 33

ఆహూతో%ప్యనయా కామం యుద్ధాయాబలయా కిల | కథం పలాయనపరో జీవేయం శరదాం శతమ్‌. 34

కరిష్యామ్యద్య సంగ్రామం యద్భావి తద్భవ త్విహ | జయో వా మరణం వా%పి స్వీకరోమి యథాతథా. 35

దైవం మిథ్యేతి విద్వాం సో విదంత్యుద్యమ వాదినః | యుక్తియుక్తం వచస్తేషాం యే జానంత్యభిభాషితమ్‌. 36

ఉద్యమేన వినా కామం న సిధ్యంతి మనోరథాః | కాతరా ఏవ జల్పంతి యద్భావ్యం తద్భవిష్యతి. 37

అదృష్టం బలవ న్మూఢాః ప్రవదంతి న పండితాః | ప్రమాణం తస్య సత్త్వే కి మదృశ్యం దృశ్యతే కథమ్‌. 38

అదృష్టం క్వాపి దృష్టం స్యా దేషా మూర్ఖబిభీషికా | అవలంబం వినైవైషా దుఃఖే చిత్తస్య ధారణా. 39

ఈ జగము బ్రహ్మాది సురలు మనుమును దైవాదీనులము. ఇక జయముగూర్చి యింతగ చింతింప నేల? హరి హర బ్రహ్మలును ఇంద్రాగ్ని యమ వరుణులును రవిచంద్రులు నెల్లరును దైవపరాధీనులు గదా? మూఢులారా! కానున్నది కాకమానదు. ఎట్లు కానున్నదోయట్లే యత్నము జరుగును. దీనికింత చింతింప నేల? అని యిట్లు తెలిసిన పండితులు శోకింపరు. ఆత్మవంతులగు జ్ఞానులకు మరణభయము లేదు. వారు స్వధర్మము విడువరు. ఎల్ల ప్రాణులకు సుఖదుఃఖములు - బ్రతుకుదెఱువు - ఆయువు - దైవనిర్ణీతములై కాలానుసారముగ గల్గుచుండును. ఇంద్రుడును హరిహరబ్రహ్మలును తమ తమ కాలములు దీరినచో తప్పక కాలగర్భమున గలియుదురు. అట్లే నేను సైతము కాలబద్ధుడను గదా. ఇపుడు నా స్వధర్మము నెఱవేర్చుచు జయమో లేక నాశమో పొందగలను. నే డీ యబలచే రణమునకు పురికొల్పబడితిని. ఇపుడు వెన్ను చూపి నే నెట్లు వందలయేండ్లు మనగలను? తప్పక సమర మొనర్తును. చావో గెలుపో దేనినైనను గ్రహింతురు. ఏదెట్లు గానున్నదో జరుగుగాక! ప్రయత్నశీలురగు పండితులు దైవమును మిథ్యయని పల్కుదురు. వారి మాటలు యుక్తియుక్తములు. వాని సార మెఱిగినవారు నిజ మెఱిగినవారు. ప్రయత్నము చేయనిచో కోరిక లెన్నడును సఫలములు గావు. పిరికిగుండెలవారే యేది కానున్నదో యదే జరుగునని వాదింతురు. మూఢులగు పండితులు దైవమే బలవత్తరమైనదని తలంతురు. అదృష్టము కలదు లేదని యనుట కేదియును ప్రమాణము లేదు. అదృశ్య మెట్లు దృశ్యమగును? అదృష్ట మెచ్చటనైన గనుపించు వస్తువని మూర్ఖులు బెదరింతురు. ఇట్లనుకొనుట వలన దుఃఃతులగు మూఢులకు చిత్తము శాంతించును. కుక వారి కిది యాధారము.

చక్రీసమీపే సంవిష్టా సంస్థితా పిష్టకారిణీ | ఉద్యమేవ వినా పిష్టం న భవత్యేవ సర్వథా. 40

ఉద్యమే చ కృతే కార్యం సిద్ధిం యాత్యేవ సర్వదా | కదాచిత్తస్య న్యూనత్వే కార్యం నైవ భ##వేదపి. 41

దేశం కాలం చ విజ్ఞాయ స్వబలం శత్రుజం బలమ్‌ | కృతం కార్యం భవత్యేవ బృహస్పతివచో యథా. 42

ఇతి నిశ్చత్య దైత్యేంద్రో రక్తబీజ మహాసురమ్‌ | ప్రేషయామాస సంగ్రామే సైన్యేన మహతా వృతమ్‌. 43

రక్త బీజమహాబాహోః గచ్చత్వం సమరాంగణ | కురుయుద్ధం మహాభాగ యథానే బలమాహితమ్‌. 44

రక్త బీజః ః మహారాజ న తే కార్యా చింతా స్వల్పతరా%పి వా | అహమేనాం హనిష్యామి కరిష్యామి వశే తవ. 45

పశ్య మే యుద్ధ చాతుర్యం క్వేయం బాలా సురప్రియా | దాసీం తే%హం కరిష్యామి జిత్వేమాం సమరే బలాత్‌. 46

ఇత్యాభాష్య కురుశ్రేష్ఠ రక్తబీజో మహాసురః | జగామ రథ మారుహ్య స్వసైన్య పరివారిత. 47

హస్త్యశ్వరథ పాదాతబృందై శ్చ పరివేష్టితః | నిర్జగామ రథారూఢో దేవీం శైలోపరిస్థితామ్‌. 48

తమాగతం సమాలోక్య దేవీ శంఖ మవాదయత్‌ | భయాదం సర్వదైత్యానాం దేవానాం మోదవర్ధనమ్‌. 49

శ్రుత్వా శంఖస్వనం చోగ్రం రక్తబీజో%తి వేగవాన్‌ | గత్వా సమీపే చాముండాం బభాషే వచనం మృదు. 50

బాలే కిం మాం భీషయసి మత్వాత్వం కాతరం కిల | శంఖనాదేన తన్వంగి వేత్సి కిం ధూమ్రలోచనమ్‌. 51

రక్తబీజో%స్మి నామ్నా%హం త్వత్సకాశ మిహాగతః | యుద్ధే చ్ఛా చే త్పికాలాపే సజ్జా భవ భయం న మే. 52

పశ్యాద్య మే బలం కాంతే దృష్టా యే కాతరాస్త్వయా | నాహం పంక్తిగత స్తేషాం కురు యుద్ధం యథేచ్ఛసి. 53

విసరురాయి (తిరుగలి) గలదు. విసరవలసిన వస్తువును గలదు. కాని, మనుజయత్నము లేనిచో పిండి రాదు. అట్లే ప్రయత్నము చేసినచో కార్యము తప్పక ఫలించును. యత్నము లోపించినచో కార్యము ఫలింపనేరదు. తన బలము - పరబలము- దేశకాలములు ఎఱిగి చేసినపని తప్పక నెరవేరునని మున్ను బృహస్పతి వచించెను అని యిట్లు శుంభుడు పలికి మహాసురుడగు రక్తబీజునకు గొప్ప సేన నిచ్చి రణమున కంపుచిట్లనియెను : మహాబాహూ! రక్తబీజా! నీవు సంగ్రామమునకేగి నీ బలము కొలది యుద్ధ మొనర్పుము అన రక్తబీజు డిట్లనెను : మహారాజా! ఈ కొద్దిదాని కింత చింతింప నేల ? నే నామెను చంపగలను. లేనిచో నీకు వశ్యురాలినిగ జేయగలను. నేడు నా యుద్ధ కౌశల్యము చూతువు గాక! ఆ దేవప్రియ యగు నబల నాముం దెంతటిది? నేను పోరిలో నా బలముతో నామెను గెల్చి తెచ్చి నీ పాదాలముందు పడవేతును అని రక్తబీజ మహాసురుడు పల్కి తన బలముతో పోర తరలెను. అతడు చతురంగ బలముతోగూడి రథ మెక్కి పర్వతము పైనున్న జగదంబతో పోరుటకు నగరము వెడలెను. వచ్చుచున్న దానవునిగని పరాదేవి సురల కానందము - నసురలకు భీతి గల్గించు శంఖనినాద మొనరించెను. రక్తబీజుడు దేవి భీకర శంఖధ్వని వినెను. అతడు చాముండాదేవిని సమీపించి యామెతో మెత్తని పల్కులతో నిట్లనెను : బాలా! నన్ను ధూమ్రలోచనునివలె పరికివానిగ భావించి శంఖరవముతో భయపెట్టుచున్నావా? పికభాషిణీ! నన్ను రక్తబీజు డందురు. నేను నిర్భయముగ నీ చెంతకు వచ్చితిని. నీవు రణము చేయదలచినచో ఆయత్తవు గమ్ము. కాంతా! నేడు నా బలము చూతువు గాక! నీ వింతకుముందు గాంచిన భీరులవంటివాడను గాను నేను. నీ యిచ్చవచ్చినట్లు నాతో బోరుము.

వృద్ధా శ్చ సేవితాః పూర్వం నీతిశాస్త్రం శ్రుతం త్వయా | పఠితం చార్థ విజ్ఞానం విద్వద్గోష్ఠీ కృతా%థవా. 54

సాహిత్యతంత్ర విజ్ఞానం చేదస్తి తవ సుందరి | శృణు మే వచనం పథ్యం తథ్యం ప్రమితిబృంహితమ్‌. 55

రసానాం చ నవానాం వై ద్వా వేవ ముఖ్యతాం గతౌ | శృంగారకః శాంతిరసో విద్వజ్జన సభాసు చ. 56

తయోః శృంగార ఏవాదౌ నృపభావే ప్రతిష్ఠితః | విష్ణు ర్లక్ష్మ్యా సహాస్తే వై సావిత్ర్యా చతురాననః. 57

శ##చ్యేం ద్రః శైలసుతయా శంకరః సహ శరతే | వల్ల్యా వృక్షో మృగో మృగ్యా కపోత్యా చ కపోతకం. 58

ఏవం సర్వే ప్రాణభృతః సంయోగరసికా భృశమ్‌ | అప్రాప్తభోగ విభవా యే చాన్యే కాతరా నరాః. 59

భవంతి యతయ స్తే వై మూఢా దైవేన వంచితాః | అసంసారరసజ్ఞా స్తే వంచితా వంచనాపరైః. 60

మధురాలాపనిపుణౖః రతాః శాంతిరసే హి తే | క్వ జ్ఞానం క్వ చ వైరాగ్యం వర్తమానే మనోభ##వే. 61

లోభే క్రోధే చ దుర్ధర్షే మోహే మతి వినాశ##కే | తస్మా త్త్వమపి కల్యాణి కురు కాంతం మనోహరమ్‌. 62

శుంభం సురాణాం జేతారం నిశుంభం వా మహాబలమ్‌ ఇత్యుక్త్వా రక్తబీజో%సౌ విరరామ పురః స్థితః. 63

శ్రుత్వా జహాస చాముండా కాళికా చాంబికా తథా | 64

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే సప్తవింశో%ధ్యాయః.

రమణీమణీ! నీవు పూర్వము పెద్దలను సేవించినచో నీతిశాస్త్రము వినినచో అర్థశాస్త్రము చదివినచో పండిత గోష్ఠులు జరిపినచో సాహిత్య రసము తంత్ర విజ్ఞానము నెఱిగినచో నా మాట వినుము. నేను సప్రమాణముగ నిక్కముగ చక్కగ బల్కుచున్నాను. పండితులు సభలందు నవరసములలో రెండు రసములు ముఖ్యము లందురు. అందొకటి శృంగార రసము. రెండవది శాంతరసము. ఆ రెంటిలోను శృంగారము రసరాజమని ప్రసిద్ధిగాంచినది. ఎడబాటెఱుగక విష్ణువు లక్ష్మితో - బ్రహ్మ సావిత్రితో - శివుడు పార్వతితో - నింద్రుడు శచితో గూడియుందురు. చెట్టు తీవియతో - మృగము మృగితో -కపోతము కపోతితో కలిసిమెలిసి యుండును. ఇట్లు ప్రాణులెల్లను శృంగారసమందు మునిగి తేలుచుండును. తీయని భోగసంపదలకు నోచుకోని వారు దైవవంచితులై-మూర్ఖులై-తుదకు సంన్యాసులగుదురు. వారికి సంసార సుఖము తెలియదు. వంచకుల తీపిమాటలకు మోసపోదురు. అట్టివారికి శాంతరసము రుచించును. కామాగ్ని ప్రజ్వరిల్లగ జ్ఞాన వైరాగ్యములకు తావెక్కడిది? నిత్యకల్యాణీ! కామక్రోధలోభమోహములు మదిని చెడగొట్టును. అవి చెడ్డవి. కనుక నీవు సురవిజేత యగు శుంభునిగాని నిశుంభునిగాని కాంతునిగ వరింపుము. వారు మహాబలులు అని పల్కి రక్తబీజుడు విరమించెను. ఆ మాటలన్ని విని జగదంబికయు కాళియగు చాముండయు తమలో తాము నవ్వుకొనిరి.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమస్కంధమందు రక్తబీజుడు శ్రీదేవితో పోరవచ్చుటయను నిరుదియేడవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters