Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకత్రింశో%ధ్యయః

వ్యాసః: నిశామయ మహారాజ బ్రవీమి విశదాక్షరమ్‌ | మహాత్మ్యం ఖలు మాయాయాః నారదాత్తుమాయాశ్రుతమ్‌. 1

మాయా పునర్మునిః పృష్టో నారదః సర్వవిత్తమః | శ్రుత్వా కథాం మునే స్తస్య నారీదేహ సముద్భవామ్‌. 2

బ్రూహి నారద పశ్చాత్కిం కథితం హరిణా తదా | క్వం గతశ్చజగన్నాథో భవతా సహ మాధవః. 3

నారదః: ఇత్యుక్త్వా భగవాం స్తస్మిం స్తటాకే%తి మనోహరే | ఆరుహ్య గరుడం గంతుం వైకుంఠే చ మనోదధే. 4

మామువాచ రమాకాంతో యథేష్టం గచ్ఛ నారద | ఏహి వా మమ లోకం స్వం యథారుచి తథా కురు. 5

బ్రహ్మలోకం గత శ్చాహ మాపృచ్ఛ్య మధుసూదనమ్‌ | భగవానపి దేవేశ స్తత్‌క్షణా ద్గరుడాసనః. 6

వైకుంఠ మగమ త్తూర్ణం మామాదిశ్య యథాసుఖమ్‌ | తతో%హం పితృసదనం గతో యాతే జనార్దనే. 7

చింతయ న్సకలం దుఃఖం సుఖం చ పరమాద్భుతమ్‌ | గత్వా ప్రణమ్య పితరం స్థితో యావత్పురః పితుః. 8

తాతత్రృష్టో మునే పిత్రా వీక్ష్య చింతా తురం తు మామ్‌ | క్వ గతో%సి మహాభాగ కస్మాచ్చింతాతురః సుత. 9

స్వస్థం నైవాద్య పశ్యామి మనస్తే మునిసత్తమ | కేనాపి వంచితో%సి త్వం దృష్టం వా కించి దద్భుతమ్‌. 10

విషణ్ణం గతవిజ్ఞానం పశ్యామి త్వాం కథం సుత | ఇతి పృష్ట స్తదా పిత్రా బృస్యాం సముపవేశ్యచ. 11

తమబ్రువం స్వవృత్తాంతం మాయాబలసముద్భవమ్‌ | వంచితో%హం పితః కామం విష్ణునా ప్రభవిష్ణునా. 12

ముప్పదియొకటవ యధ్యాయము

మాయాప్రభావము - నారద వృత్తాంతము

వ్యాసు డిట్లనెను : ఓ మహారాజ! శ్రీమాయాదేవీ మాహాత్మ్యము నేను నారదునివలన వింటిని. దాని నంతయు నీకు తేటపరతును. చక్కగ నాలకింపుము. అట్లు నారదుడు నారీరూపము దాల్చిన కథయంతయు నతని నుండి నేను వింటిని. ఆ పిదప నేను సకలవిదుడగు నారదుని మరల నిట్లు ప్రశ్నించితిని : మునీశా! అటు పిమ్మట నారాయణుడు నీతో నేమి పలికెను? మాధవుడగు జగన్నాథుడు నిన్ను గూడి యెచటి కరిగెను? నారదు డిట్లనెను : ఆ విధముగ శ్రీహరి నాతో మనోహరమగు సరస్సుచెంత బలికిన పిమ్మట నతడు గరుత్మంతునెక్కి వైకుంఠమేగ నివ్చయించుకొనెను. అపుడు హరి నాతో నారదా! నీవు నీ యిచ్చవచ్చినచోటి కేగుము లేదా నా లోకమునకైన రమ్ము. ఇందు నీకేది యిష్టమో దాని నొనరింపు' మనెను. నేను మాధవునకు నమస్కరించి బ్రహ్మలోకమున కేగితిని. దేవదేవుడగు హరి వెంటనే గరుడాసన మధిరోహించెను. అట్లు హరి నన్ను సాగనంపి తను వైకుంఠధామము జేరెను. జనార్దనుడరిగిన తరువాత నేను నలువకొలువు కూటమున కేగితిని. నే నట నా తండ్రికి ప్రణమిల్లితిని. నేననుభవించిన మహాద్భుతములగు సుఖదుఃఖములు తలపోయుచు నేను నా తండ్రిముందు నిలుచుంటిని. చింతాతురుడనగు నన్నుగాంచి నా తండ్రి నాతో నిట్లనెను : ఓ మునీ! మహాత్మా! నీ వింతవఱకెక్కడి కేగితివి? ఏల దిగులుతో నున్నావు. మునిసత్తమా! నీ చిత్తమేలకో నేడు కొందలమందుచున్నట్లు దోచుచున్నది. నిన్నెవరేని వంచించిరా? కాకేదేని యవ్యక్తమైన మహాద్భుత విషయము గనుగొంటివా? కుమారా! నీవు వ్యాకులునివలె జ్ఞానహీనునివలె నేల కనబడుచున్నావు? అని నా తండ్రి యడుగగ నేను దర్భాసనముపై గూరుచుండి ఆ పిమ్మట కాలాత్మకమగు మాయబలమునకు గురియైన నా వృత్తాంతమంతయు నతని కిట్లు పూసగ్రుచ్చినట్లు చెప్పితిని : తండ్రీ! నేను ప్రభ విష్ణువగు విష్ణుని చేతిలో మోసపోతిని.

స్త్రీభావం గమితః కామం వర్షాణి సుబుహూన్యహం | అనుభూతం మహాదుఃఖం పుత్రశోకముద్భవమ్‌. 13

ప్రబోధితో%హం తేనైవ మృదువాక్యామృతేన చ | పునః సరోవరే స్నాత్వా జాతో%హం నారదం పుమాన్‌. 14

కి మేత త్కారణం బ్రహ్మ న్యన్మోహ మగమం తదా | విస్మృతం పూర్వవిజ్ఞానం తన్మయ స్తరసా కృతః. 15

ఏతన్మాయాబలం బ్రహ్మన్న జానే%హం దురత్యయమ్‌ | జ్ఞానహానికరం జాతం మూలం మోహస్య విస్ఫుటమ్‌. 16

అనుభూతం మయా సమ్యక్‌ జ్ఞాతం సర్వం శుభాశుభమ్‌ | కథం త్వం జితవాం స్తాత తముపాయం వదస్వ మే. 17

నారద ఉవాచ : విజ్ఞ ప్తో%సౌ మయా ధాతా ప్రీతి పూర్వమతః పురమ్‌ | మామువాచ స్మితం కృత్వా పితా మే వాసవీసుత. 18

దుర్జయైషా సురైః సర్వైర్మునిభిశ్చ మహాత్మభిః | తాపసై ర్జా నయుక్తైశ్చ యోగిభిః పవనాశ##నైః. 19

నాహం తాం సర్వథా జ్ఞాతుం శక్తోమాయాం మహాబలామ్‌ | విష్ణు ర్జా తుం న శక్తశ్చ తథా శంభు రుమాపతిః. 20

దుర్జేయా సా మహామాయా సృష్టి స్థిత్యంతకారిణీ | కాలకర్మ స్వభావద్యై ర్నిమిత్తకారణౖ ర్వృతా. 21

శోకం మా కురు మేధావిం స్తత్ర మాయామహాబలే | న చైవ విస్మయః కార్యో వయం సర్వే విమోహితాః. 22

నారద ఉవాచ : పిత్రేత్యుక్త స్తదా వ్యాస తమా పృచ్ఛ్య గతస్మయః | ఆగతో%స్మ్యత్ర పశ్యన్వై తీర్థాని చ వరాణి చ. 23

తస్మాత్త్వ మపి సంత్యజ్య మోహం కౌరవనాశజమ్‌ | కాలక్షయం సుఖాసీనః స్థానే%స్మి న్కురుసత్తమ. 24

నేను పెక్కేండ్లు స్త్రీ రూపము దాల్చిన పుత్రశోకముతో తీరని దుఃఖ మనుభవించితిని. పిమ్మట కొన్నాళ్లకు మరల విష్ణుని మేలి వచనములకు తెలివొంది కొలనిలో గ్రుంకి నారదుడనైతిని. నేను మయామోహము పొందుటకు కారణమేమి? నేను వట్టి మాయకు లొంగి పూర్వ విజ్ఞానమంతయు గోల్పోతిని. ఈ మహామాయా ప్రభావము దాటరానిది. జ్ఞానమును నశింపజేయునది. ప్రమోహమున కిది మూలకందము. ఇట్టి మాయను నేనెన్నడు నెఱుంగనైతిని. మాయలోని మంచిచెడ్డలన్నియు ననుభవించితిని. తండ్రీ! నీవు కాల మాయాపరీక్షలో నే తీరుగ నిగ్గు దేలితివో యా యుపాయము నాకు కొంచెము సెలవిమ్ము అని నేను పలుకగ బ్రహ్మ ప్రేమతో నలతినగవు తళుకొత్త నాతో బలికెను : మాయ సకల సురమునులకును జ్ఞానులకును తాపసులకును గాలి యాహారముగల వారికిని యోగులకును తెలువరానిది. ఈ మాయాశక్తి బల మెఱుంగుటకు నే నశక్తుడను. అటులే విష్ణువుగాని శివుడుగాని దాని పుట్టుపూర్వోత్తరము లెఱుగరు. ఏమియులేని మాయ తానంతయు నాయెను. అది కాల-కర్మ-స్వభావములతో నిమిత్త కారణములతో గూడియుండును. సృష్టి స్థితి సంహార కార్యము లొనర్చును. ఎంతటి వారికిని తెలువ సాధ్యముగానిది. మాయా మహాబలముగూర్చి యింతగ నబ్బురమొంద నేల? మే మెల్లరము మాయా శక్తికి మోహితులమై యున్నవారమే అని నా తండ్రి వచింపగ నేనచ్చెరువందక నా తండ్రి యనుమతినొంది పుణ్యతీర్థములు దర్శించుచు నిచటి కేతెంచితిని. కనుక వ్యాసా! నీవును కౌరవ నాశనము గల్గిన శోకము విడనాడి యిచ్చట నిశ్చింతగా కాలము గడుపుము.

అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ | నిశ్చయం హృదయే కృత్వా విచరస్వ యథాసుఖమ్‌. 25

ఇత్యుక్త్వా నారదో రాజ న్గతో యాం ప్రతిబోధ్యచ | అహం తచ్చింతయాన్వాక్యం యదుక్తం మునినా తదా. 26

స్థితః సరస్వతీతీరే కల్పే సారస్వతే వరే | కాలాతివాహనాయైత త్కృతం

భాగవతంమయా. 27

పురాణ ముత్తమం భూప సర్వసంశయనాశనమ్‌ | నానాఖ్యాన సమాయుక్తం వేదప్రామాణ్యసంశ్రితమ్‌. 28

సందేహో%త్ర నకర్తవ్యః సర్వథా నృపసత్తమ | యథైంద్రజాలికః కశ్చి త్పాంచాలీం దారవీం కరే. 29

కృత్వా నర్తయతే కామం స్వేచ్ఛయా వశవర్తినీమ్‌ | తథా నర్తయతే మాయా జగత్థ్సావరజంగమమ్‌. 30

బ్రహ్మాది స్తంబపర్యంతం సదేవాసురమానుషమ్‌ | పంచేంద్రియ సమాయుక్తం మనశ్చిత్తానువర్తనమ్‌. 31

గుణా స్తు కారణం రాజ న్సర్వేషాం సర్వథా త్రయః | కార్యం కారణ సంయుక్తం భవతీతి వినిశ్చయః. 32

భిన్న భిన్న స్వభావాస్తే గుణా మాయాసముద్భవాః | శాంతో ఘోర స్తథా మూఢ స్త్రయస్తు వివిధా యతః. 33

తత్సమేతః పుమాన్నిత్యం తద్విహీనః కథం భ##వేత్‌ | న భవత్యేవ సంసారే రహిత స్తంతుభిః పటః. 34

తథా గుణౖ స్త్రిభి ర్హీనో న దేహీతి వినిశ్చియః | దేవదేహో మనుష్యోవా తిరశ్చోవా

నరాధిప. 35

గుణౖ ర్విరహితో నస్యా న్మృద్విహీనో ఘటో యథా | బ్రహ్మా విష్ణు స్తథా రుద్ర స్త్రయశ్చామీ గుణాశ్రయాః. 36

జీవుడు తాను జేసికొన్న మంచిచెడ్డలను తప్పక అనుభవించి తీరవలయునని మదిలో నిశ్చయించుకొని స్వేచ్ఛగ తిరుగుము. రాజా! ఈ ప్రకారముగ నారదుడు పలికి నాకు కనువిప్పు గలిగించెను. పిమ్మట నేను నారద వచనములు నెమ్మది తలపోయుచుంటిని. అపుడు నా బ్రదుకు క్రొత్త మలుపును తిరిగెను. అంత నేను సారస్వత కల్పమునం దీ సరస్వతీ తీరమందున వసించి ప్రొద్దుపోవుట కీ శ్రీదేవీ భాగవతము రచించితిని. రాజా! ఈ మహాదేవీ పురాణము సర్వసంశయములు పాపును. అత్యుత్తమము. పెక్కుపాఖ్యానముల కూడలి. వేద ప్రామాణ్యము నాశ్రయించినది. నృపవర్యా! దీనిని గూర్చి నీకు సందియ మావంతయు వలదు. ఒక గారడివాడొక కట్టెబొమ్మను తనచేత నుంచుకొనును. అది యతనికి వశమగును. అతడు దానిని తన యిచ్చ వచ్చిన రీతి నాడించును. అదే విధముగ మహామాయ యీ చరాచర జగముల నాటాడించును. ప్రతి ప్రాణికి పంచేంద్రియములు-మనస్సు-చిత్తమునుండును. కనుక బ్రహ్మాదిస్తంబమువఱకు గల దేవ-దనుజ-మనుజులను మాయాశక్తి యాడించును. ఈ యంతటి కన్నివిధముల మాయా త్రిగుణములే కారణములు. కారణము లేక కార్య మెప్పుడును గలుగదనుట నిజము గదా! జీవుల స్వభావములు భిన్న భిన్నములుగ నుండును. కనుక జీవుల పుట్టుకలు మాయాత్రిగుణముల బలమువలన గలుగును. గుణముల కారణమున నొకడు శాంతుడుగ నొక్కడు ఘోరుడుగ మఱొక్కడు మూఢుడుగ బుట్టును. ఈ ప్రపంచమునందు గుణముల మేళనమున బుట్టిన నరుడు గుణరహితు డెట్లు గాగలడు? దారములు లేక వస్త్రము లేదుగదా! అట్లే త్రిగుణములు లేనిచో సంసారియు లేడనుట నిక్కము. మట్టిలేక కుండలేదు. అటులే గుణములు లేక ప్రాణి లేడు. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు మువ్వురును త్రిగుణబద్ధులే.

కదాచి త్ర్పీతియుక్తా స్తే తథా ప్రీతియుతాః పునః | తథా విషాదయుక్తా స్తే భవంతి గణయోగతం. 37

బ్రహ్మ కదాచిత్స త్త్వస్థ స్తదా శాంతః సమాధిమాన్‌ | ప్రీతియుక్తో భ##వే త్సర్వభూతేషు జ్ఞానసంయుతః. 38

పునః సత్త్వవిహీన స్తు రజోగుణ సమావృతః | తదా భ##వే ద్ఘోరరూపః సర్వత్రా%ప్రీతి సంయుతః. 39

యదా తమోగుణావిష్టో బాహుల్యేన భ##వేద్విధిః | తదా విషాదసంపన్నో మూఢో భవతి నాన్యథా. 40

మాధవో%పి సదా సత్త్వసంశ్రితః సర్వథా భ##వేత్‌ | యదా శాంతః ప్రీతియుక్తో భ##వేత్‌ జ్ఞానసమన్వితః. 41

స ఏవ రజ ఆధిక్యా దప్రీతి సంయుతో భ##వేత్‌ | ఘోరశ్చ సర్వభూతేషు గుణాధీనో రమాపతిః. 42

రుద్రో%పి సత్త్వసంయుక్తః ప్రీతిమాన్‌ శాంతిమాన్‌ భ##వేత్‌ | రజోనిమీలితః సో%పి ఘోరః ప్రీతి వివర్జితః. 43

తమోగుణయుతః సో%పి మూఢో విషాదయుగ్భవేత్‌ | ఏతే యది గుణాధీనా బ్రహ్మవిష్ణుహరాదయః. 44

సూర్యవంశోద్భవా స్తద్వ త్సోమవంశభవా అపి | మన్వాదయశ్చ యే ప్రోక్తా శ్చతుర్దశ యుగే యుగే. 45

అన్వేషాం చైవ కా వార్తా సంసారే%స్మి న్నృపోత్తమ | మాయాధీనం జగత్సర్వం సదేవాసురమానుషమ్‌. 46

తస్మా ద్రాజ న్న కర్తవ్యం సందేహో%త్ర కదాచన | దేహీ మాయాపరాధీన శ్చేష్టతే తద్వశానుగః. 47

సా చ మాయా పరే తత్త్వే సంవిద్రూపే%స్తి సర్వదా | తదధీనా ప్రేరితా చ తేన జీవేషు సర్వదా. 48

వీరు ఆయా గుణములవలన నొకప్పుడు శాంతులుగ వేరొకప్పు డుగ్రులుగ నింకొకప్పుడు విషాదభరితులుగ నుందురు. బ్రహ్మ సత్వగుణములతో తేజరిల్లునపుడు శాంతుడు జ్ఞాని సమాధియుతుడు సర్వభూత ప్రీతిసహితుడునై వర్తించును. సత్త్వము గోలుపోయినప్పుడతడు రజోగుణమున రాగిల్లి ఘోర తీవ్రరూపముతో దయమాలి యుండును. అతడు తమోగుణముతో గ్రుడ్డియైనపుడు పలువిధములగు విషాదములతో మూఢుడగును. ఇది యథార్థము. విశ్వాధారుడగు మాధవు డెల్లవేళల సత్త్వప్రకాశము నాశ్రయించి యుంటవలన నిత్యశాంతుడు నిత్యప్రియుడు నిత్యజ్ఞానియై విరాజిల్లును. లక్ష్మీకాంతుడు రజోగుణ పరాధీనుడైనపుడెల్ల భూతములందు దయమాలి ఘోరరూపమున వర్తిల్లును. పరమశివుడును సత్త్వసంపన్నుడై నపుడు శాంతి ప్రియములు గురియును. ఆ శివుడే రజోరంజితుడై కరుణమాలి ఘోరరూపమున నుగ్రుడగును. శివుడు తమోగుణమయుడై నపుడు విషాదమున మూఢత నందును. ఈ విధముగ బ్రహ్మ - విష్ణు - మహేశులను గుణబద్ధులగుదురు. ఇక సూర్యచంద్రవంశజులు యుగయుగమందలి చతుర్దశమన్వాదుల విషయము చెప్పనేల? ప్రపంచమందు వీరుగా కితరుల విషయ మింక చెప్ప బనిలేదు. ఈ విశ్వవిశ్వమంతయును దేవ - దానవ - నర - ప్రాణులతో నిండి నిబిడమై మాయాధీనమై ఎసంగును. ఇంక మాయను గుఱించి సంశయింప బనిలేదు. ప్రతి జీవుడు మాయకు వశుడై భ్రాంతుడై తత్పరుడై వ్యవహరించును. మాయ సచ్చిదానందలహరియగు పరతత్వమునకు వశ##మై తదధీనమై ప్రేరితయై యెల్లజీవులందు బాయకుండును.

తతో మాయా విశిష్టాం తాం సంవిదం పరమేశ్వరీమ్‌ | మాయేశ్వరీం భగవతీం సచ్చిదానందరూపిణీమ్‌. 49

ధ్యాయే త్తథా%%రాధయే చ్చ ప్రణమేచ్చ జపేదపి | తేన సా సదయా భూత్వా మోచయత్యేవ దేహినమ్‌. 50

స్వ మాయం సంతరత్యేవ స్వానుభూతిప్రదానతః | భువనం ఖలు మాయా స్యా దీశ్వరీ తస్య నాయికా. 51

భువనేశీ తతః ప్రోక్తా దేవీ త్రైలోక్య సుందరీ | తద్రూపే యది సక్తం స్యా చ్చిత్తం భూమిపతే సదా. 52

మాయయా కిం భ##వే త్తత్ర సదసద్భూతయా నృప | తస్మాన్మాయానిరాసార్థం నాన్యద్వై దేవతాంతరమ్‌. 53

సమర్థం తు వినా దేవీం సచ్చిదానందరూపిణీమ్‌ | తమోరాశిం నాశయితుం శక్తంనైవ తమో భ##వేత్‌. 54

కింతు భానుప్రభాచంద్రవిద్యుద్వహ్ని ప్రభాదయః | తస్మా న్మాయేశ్వరీమంబాం స్వప్రకాశాం తు సంవిదమ్‌. 55

ఆరాధయే దతిప్రీత్యా మాయాగుణనివృత్తయే | ఇతి సమ్యక్‌ మాయా%%ఖ్యాతం వృత్రాసుర వధాదికమ్‌. 56

యత్పృష్టం రాజశార్దూల కి మన్యోచ్ఛ్రోతు మిచ్ఛసి | పూర్వార్ధో%యం పురాణస్య కథిత స్తవ సువ్రత. 57

యత్ర దేవ్యా స్తు మహిమా విస్తరేణోపపాదితః | ఏతద్రహస్యం శ్రీమాతు ర్నదేయం యస్యకస్యచిత్‌. 58

దేయం భక్తాయ శాంతాయ దేవీభక్తిరతాయ చ | శిష్యాయ జేష్ఠపుత్రాయ గురుభక్తియుతాయ చ. 59

ఇదమఃల కథానాం సారభూతం పురాణం | నిఃల నిగమతుల్య సప్రమాణానువిద్ధమ్‌.

పఠతి పరమ భావా ద్యః శృణోతీహ భక్త్యా సభవతి ధనవాన్వై జ్ఞానవాన్మానవో%త్ర. 60

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే భగవతీ మహాత్మ్యే ఏకత్రింశో%ధ్యాయః.

వేదాష్టవసుభూసంఖ్యైః (1884) పద్యైర్వ్యాసకృతైః శుభైః | దేవీభాగవతస్యాస్య షష్ఠస్కంధః సమాప్తిమాన్‌.

కనుక జ్ఞాన ప్రకాశము గోరువాడు మాయేశ్వరి పరమేశ్వరి అఃలేశ్వరి మాయావిశిష్ట సచ్చిదానందమయియగు భగవతిని గొలువవలయును. శ్రీదేవిని ధ్యానించవలయును. శ్రీమాత నారాధింపవలయును. శ్రీమహారాజ్ఞికి మోకరిల్లవలయును. శ్రీరాజరాజేశ్వరిని జపించవలయును. దాని ఫలితముగ దయామతల్లియగు లోకాలనేలు తల్లి ప్రసన్నురాలయి దయతో జీవులను బంధముక్తులుగ జేయును. జగదంబ తన దివ్యానుభూతిని తన భక్తులకు గలిగించును. జీవకోటిని మాయనుండి దాటించును. ఈ భువనములన్నియు మాయామయములు. జగదీశ్వరి భువనైక నాయిక. అందువలననే త్రైలోక్య సుందరియగు దేవి త్రిభువనేశ్వరీ నామమున వన్నె గాంచినది. రాజా! ఆ చిద్రూపిణియందు చిత్తము నిలుపవలయును. అట్టి వానిని సదసద్రూప యగు మాయ యేమియు కదలింపజాలదు. కనుక మాయను దాటి దాటించుట కితర దేవతలు సమర్థులుగారు. దానికి కేవలము సచ్చిదానందమయియగు శ్రీమాతయే సమర్థురాలు. పెంజీకటిని జీకట్లు పోగొట్టజాలవు గదా! కాని సూర్యచంద్రాగ్నుల కాంతులును మెఱపుకాంతులును చీకట్లను పాపగలవు. కనుక శ్రీదేవి స్వయంప్రకాశస్వరూపిణి - మాయాధీశ్వరి - సంవిద్రూపిణి - జగదంబ. మాయాగుణములు తొలగుటకు పరమప్రీతితో దేవి నారాధింపవలయును. ఈ ప్రకారముగ నీకు వృత్రాసురవధ మున్నగు ఆఖ్యానములు చక్కగ విరవించితిని. రాజా! ఇంక నీ వే విషయము వినదలతువో తెలుపుము. ఓ సత్యవ్రతా! నీకింతవరకును శ్రీకరంబగు శ్రీదేవీ భాగవతమునందలి పూర్వార్ధము వివరించితిని. ఇందు పరదేవి మాహాత్మ్యము విపులముగ తేనెలొలుకునట్లు వర్ణింపబడినది. శ్రీమాతృదేవీరహస్యము ప్రతివానికి చెప్పకూడదు. దీనిని దేవీభక్తుడు-జ్యేష్ఠపుత్రుడు-గురుభక్తిగల శిష్యుడునగు వారికి తెలుపవచ్చును. ఇది సకల కథలకు సారభూతమగు పురాణము. సమస్త వేదములతో సమానము. సముచితములగు ప్రమాణములతో సమకూర్చబడినది. ఈ లోకమున ఎవడు దీనిని పరమభక్తి భావమున వినునో చదువునో అతడీ లోకమున ధనవంతుడును జ్ఞానవంతుడును నగును.

ఇది శ్రీదేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు మాయా మాహాత్మ్యవర్ణనమను ముప్పది యొకటవ అధ్యాయము.

ఇది శ్రీ వ్యాస భట్టారకునిచే ప్రణీతమైన శ్రీదేవీ భాగవతమందు పదునెనిమిది వందల ఎనుబది నాలుగు శ్లోకములు గల షష్ఠ స్కంధము.

శ్రీ దేవీ భాగవత పూర్వార్ధము సమాప్తము

శ్రీః

l l l

Sri Devi Bhagavatam-1    Chapters