Sri Devi Bhagavatam-1    Chapters   

అథ సప్తమాధ్యాయః

సూతః : 

పంచానాం ద్రౌపదీ భార్యా సామాన్యా సా పతివ్రతా | పంచ పుత్రా స్తు తస్యా స్స్యు ర్భర్తృభో%తీవ సుందరా ః 1

అర్జునస్య తథా భార్యా కృష్ణస్యభగినీ శుభా | సుభద్రా యా హృతా పూర్వం జిష్ణునా హరిసమ్మతే. 2

తస్యాం జాతో మహావీరో నిహతో%సౌ రణాజిరే | అభిమన్యు ర్హతా స్తత్ర ద్రౌపద్యాశ్చ సుతాః కిల 3

అభిమన్యో ర్వరా భార్యా వైరాటీ చాతిసుందరీ | కులాంతే సుషువే పుత్రం మృతో బాణాగ్ని నా శిశుః 4

జీవితః స తు కృష్ణేన భాగినేయసుతః స్వయమ్‌ | ద్రౌణిబాణాగ్ని నిర్దగ్ధః ప్రతానే నాద్భుతేన చ. 5

పరిక్షీణషు వంశేషు జాతో యస్మా ద్వరః సుతః | తస్మా త్పరిక్షితో నామ విఖ్యాతః పృథివీతలే. 6

నిహతేషు చ పుత్రేషు ధృతరాష్ట్రో%తిదుఃఃతః | తస్థౌ పాండవరాజ్యే చ భీమవాగ్బాణపీడితః. 7

గాంధారీ చ తథా%తిష్ఠ త్పుత్రశోకాతురా భృశమ్‌ | సేవాం తయో ర్దివారాత్రం చకారార్తో యుధిష్ఠిరః. 8

విదురో%ప్యతిధర్మాత్మా ప్రజ్ఞానేత్ర మబోధయత్‌ | యుధిష్ఠిర స్యానుమతే భ్రాతృపార్శ్వే వ్యతిష్ఠత. 9

ధర్మపుత్రో%పి ధర్మాత్మా చకార సేవనం పితుః | పుత్రశోకోద్భవం దుఃఖం తస్య విస్మారయ న్నివ. 10

ఏడవ అధ్యాయము

శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

సూతుడిట్లనియెను : ఆ పంచపాండవులకు ద్రౌపది భార్యయై పతివ్రతయైనది. ఆ సాధ్వీమతల్లికి తన పతులకంటె సుందరతరులగు నైదుగురు కొమరులు గల్గిరి. అర్జునుడు శ్రీకృష్ణు ననుమతమున నతని సోదరియగు సుభద్రను హరించుకొనివచ్చి భార్యగ బడసెను. మహాభారతయుద్ధమందు సుభద్రకు జనియించిన అభిమన్యుడును ద్రౌపదేయులును వీరస్వర్గమలంకరించిరి. ఆ సమయమున నభిమన్యుని భార్య యుత్తర నిండుచూలాలుగ నుండెను. ఆమె గర్భ మశ్వత్తాముని బాణాగ్నికి క్రాగిక్రాగి మృతశిశువును గనెను. అపుడు శిష్టరక్షకుడు శ్రీవాసుదేవుడు తన లోకాద్భుత ప్రతాపము జూపించి యశ్వత్థామ బాణాగ్నికి దగ్ధుడైన తన మేనల్లుని కొడుకునకు మరల ప్రాణము పోసెను. వంశము పరిక్షీణమగుచుండగ బుట్టినవాడగుటవలన నా బాలుడు పరిక్షిత నామమున నిలపై వన్నెకు వాసికెక్కెను. ధృతరాష్ట్రుడు తన నూరుగురు కొడుకులు సంగరమందు చచ్చుటవలన దుఃఃతుడై పాండవుల యేలుబడిలో నుండెను. భీముని హృదయవిదారకమైన పరుషములకు పీడితుడయ్యును కోరలూడపెఱికిన పామువలె పడియుండెను. గాంధారియు శోకాతురయై యచ్చటనే యుండెను. ధర్మరాజు వారిరువురకు పరిచర్యలు సలుపుచుండెను. ధర్మాత్ముడగు విదురుడును యుధిష్ఠి రానుమతిచే వారిచెంతనే యుండి మంచి మాటలతో వారిని ప్రబోధించుచుండెను. ధర్మపుత్త్రుడును వారికి నిరంతర సేవలు సేయుచు వారి పుత్త్రశోకము మఱపించుచుండెను.

యథా శృణోతి వృద్ధో%సౌ తథా భీమో%తి రోషితః | వాగ్బాణనాహన త్తం తు శ్రావయ న్సంస్థితా న్జనాన్‌. 11

మయా పుత్రా హతాః సర్వే దుష్టస్యాంధస్య తే రణ | దుశ్శాసనస్య రుధిరం పీతం హృద్యం తథా భృశమ్‌ 12

భునక్తి పిండ మంధో%యం మయా దత్తం గతత్రపః | ధ్వాంక్షవద్వా శ్వవచ్చాపి వృథా జీవ త్యసౌ జనః. 13

ఏవంవిధాని రూక్షాణి శ్రావయ త్యనువాసరమ్‌ | ఆశ్వాసయతి ధర్మాత్మా మూర్ఖో%యమితి చబ్రువన్‌. 14

అష్టాదశైవ వర్షాణి స్థిత్వా తత్రైవ దుఃఃతః | ధృతరాష్ట్రో వనే యానం ప్రార్థయామాస ధర్మజమ్‌. 15

అయాచత ధర్మపుత్రం ధృతరాష్ట్రో మహీపతిః | పుత్రేభ్యో%హం దదామ్యద్య నిర్వాపం విధిపూర్వకమ్‌. 16

వృకోదరేణ సర్వేషాం కృతమత్రౌర్ధ్వదైహికమ్‌ | న కృతం మమ పుత్రాణాం పూర్వవైర మనుస్మరమ్‌. 17

దదాసి చే ద్ధనం మహ్యం కృత్వా చైవౌర్ధ్వదైహికమ్‌ | గమిష్యే%హం వనం తప్తుం తపః స్వర్గఫలప్రదమ్‌. 18

ఏకాంతే విదురే ణోక్తో రాజా ధర్మసుతః శుచిః | ధనం దాతుం మన శ్చక్రే ధృతరాష్ట్రాయ చార్థినే. 19

సమాహూయ నిజా న్సర్వా నువాచ పృథివీపతి | ధనం దాస్యే మహాభాగాః పిత్రే నిర్వాపకామినే. 20

తచ్ఛ్రుత్వా వచనం భ్రాతు ర్జ్యేష్ఠస్యామితతేజసః | సంగ్రహే%స్య మహాబాహుర్మారుతిః కుపితో%బ్రవీత్‌. 21

భీముడు మాత్రము పట్టరాని యుక్కురోషమున లోకులు వినునట్టుగ వారిని వాగ్బాణములతో పీడితులుగజేయుచుండెను. ఈ పుట్టు గ్రుడ్డివాని కొడుకులందఱు రణరంగమున నొక్కుమ్మడిగ నాచేతిలోబడి మన్నుగఱచిరి. ఆ క్రూర దుశ్శాసనుని ఱొమ్ముచీల్చి వానిగుండె నెత్తురు కుత్తుకబంటిక గ్రోలితిని. ఈ కుచ్చితాలమారి గ్రుడ్డివాడిపుడు మేమిడు ధర్మపిండమును తలవంచుకొని తినుచున్నాడు. ఇతడు కాకమువంటివాడు. వట్టి పనికిమాలినకుక్క. వ్యర్ధముగ జీవించుచున్నాడు. భీము డీ రీతిగ ప్రతిదినము పరుష వాక్యములు ధృతరాష్ట్రుని ముందాడుచుండెను. ధర్మాత్ముడగు ధర్మరాజు మాత్రమతడు మోఱకుడని తలచి యతని నూరడించుచుండును. ఇట్లు ధృతరాష్ట్రు డచట పదునెన్మిదేండ్లు తీరని పుత్రశోకమున నెట్టులో గడపి తుదకు వనములకేగుటకు ధర్మరాజు నడిగెను. నేను విధివిధానముగ నా కొడుకులకు తిలతర్పణము లొనరింతు నని ధృతరాష్ట్రుడు యుధిష్టిరునిగోరెను. భీముడు రణమృతుల కందఱి కంత్యక్రియలు జరిపెనుగాని ప్రాతపగలు మనస్సులో పెట్టుకొని నా కొడుకులకు మాత్రము కర్మలు జరుపలేదు. కనుక నీవు నాకు సరిపడు ధనమొసంగినచో నా కొడుకుల కర్మలొనరించి పిమ్మట స్వర్గ ఫలప్రదమగు తపమొనరింప వనముల కేగుదును. అపుడు విదురుడు ధృతరాష్ట్రునకు ధనవిమ్మని ధర్మరాజుతో చాటుగ చెప్పెను. అందులకు ధర్మజు డతనికి ధనమీయ దలంచెను. అంత ధర్మరాజు తన వారిని రావించి ఓ మహాశయులరా ! ధృతరాష్ట్రున కతని కుమారుల తిలతర్పణమునకు డబ్బిత్తు, ననెను. మహాతేజస్కుడగు తన పెద్దన్న మాటలు విని మహాబాహుడగు భీము డుగ్రుడై యిట్లనియెను:

ధనం దేయం మహాభాగ దుర్యోధనహితాయ కిమ్‌ | అంధో% పి సుఖ మాప్నోతి మూర్ఖత్వం కి మతఃపరమ్‌. 22

తవ దుర్మంత్రితేనాథ దుఃఖమ ప్రాప్తా వనేవయమ్‌ | ద్రౌపదీ చ మహాభాగా సమానీతా దురాత్మనా. 23

విరాటభవనే వాసః ప్రసాద త్తవ సువ్రత | దాసత్వం చ కృతం సర్వై ర్మర్త్యస్యామితవిక్రమైః. 24

దేవితా త్వం నచే జ్జ్యేష్ఠః ప్రభ##వే త్సంక్షయః కథమ్‌ | సూపకారో విరాటస్య హత్వా %భూవం తు మాగధమ్‌. 25

బృహన్నలా కథం జిష్టు ర్భవే ద్బాలస్య నర్తకః | కృత్వా వేషం మహాబాహు ర్యోషాయా వాసవాత్మజః. 26

గాండీవ శోభితౌ హస్తౌ కృతౌ కంకణశోభితా | మానుషం చ వవుః ప్రాప్య కిం దుఃఖం స్యా దతఃపరమ్‌ 27

దృష్ట్వా వేణీం కృతాం మూర్ధ్ని కజ్జలం లోచనే తథా | అసి గృహీత్వా తరసా చ్ఛేద్మ్యహం నాన్యథా సుఖమ్‌. 28

అపృష్ట్వా చ మహీపాలం నిక్షిప్తో%గ్ని ర్మయా గృహే | దగ్ధు కామశ్చ పాపాత్మా నిర్దగ్ధో%సౌ పురోచనః 29

కీచకా నిహతాః సర్వే త్వా మపృష్ట్వా జనాధిప | న తథా నిహతాః సర్వే సభార్యా ధృతరాష్ట్రజాః 30

మూర్ఖత్వం తవ రాజేంద్ర గంధర్వేభ్యశ్చ మోచితాః | దుర్యోధనాదయః కామం శత్రవో నిగడీకృతాః 31

దుర్యోధనహితాయాద్య ధనం దాతుం త్వ మిచ్ఛసి | నాహం దదే మహీపాల సర్వథా ప్రేరిత స్త్వయా. 32

''ఓ మహానుభావా! దుర్యోధన పక్షపాతికి ధనమిచ్చుటయా? అతడా సొమ్ముతో సుఖము లొందును. ఇంతకన్న మూర్ఖత్వము మరేమున్నది? నీ యీ దుర్మంత్రణము వలననే మేము మొదటి నుండి కష్టాలపాలయితిమి. ఆ దుర్మార్గుని వలననే కదా ద్రోపది నిండు సభ కీడ్పించబడినది? ఓ సువ్రతా! మేమా విరాట నగరమున నుండుటకు హేతువు నీ ప్రసాదమే కదా! అమిత విక్రములమగు మాకొక మత్స్యరాజు నింట నూడిగము చేయవలసి వచ్చెగదా! ఇంతకు నీవు జూదమాడనిచో మాకీ యష్టకష్టాలు వచ్చెడివే కావు. ఆ జరాసంధునే పరిమార్చగల్గిన నేనొక విరాటుని వంట యింట గంటె త్రిప్పవలసి వచ్చెను. అర్జును డింద్రుని కుమారుడు. అంతటివాడే యాడుపిల్లలకు నర్తనము నేర్పువాడై బృహన్నల గావలసి వచ్చెను గదా! అతడొక సామాన్య స్త్రీ రూపము దాల్చెను. విధి యెంతగ మారె నకట ! గాండీవగుణరవమున శోభిల్లు గాండీవి చేతగాజులు గలగల లాడుటయా! ఆత్మాభిమానము గల మహాపురుషున కభిమానము చంపుకొనుటకన్న దుఃఖమేముండును? కనులకు కాటుక తల వెనుక జడకొప్పుదాల్చి కులుకు పార్థుని గాంచినప్పుడెల్ల నా గుండె నీరై కరిగిపోయెడిది. దీనికంతటికి మూలకారణమైన యీ ముసలి గ్రుడ్డివాని తల నా కఱకు కత్తివాటుతో కఱకఱ దెగనఱికినగాని నామదికూరటగల్గదు. అయ్యో! ఆ దుష్టదుర్యోధనుడు విదురాదులతో సంప్రతింపకయే మమ్మానాడు మంటలు మండు లక్కయింట గాల్పచూచెనే! అయ్యో పాపము, మమ్ము గాల్పదలచిన యా దుష్టుడే చివరకు కాలి బూడిద యయ్యెను గదా! ఓ నరపతీ! ఆనాడు నీ యనుమతి లేకయే కీచకాదుల నంతమొందించితిని. కాని ధృతరాష్ట్రుని సుతులు వారి భార్యలందరు నా చేత చంపబడక పోయిరి గదా! రాజేంద్రా! ఒకనాడు నీ శత్రులగు దుర్యోధనాదులు గంధర్వుల చేతిలో జిక్కిరి. అపుడు నీ దయాభిక్షవలన వారు విడిపింపబడిరి. అది నీ మూర్ఖత్వము గాక మరేమి? అట్టి కిరాతకుడైన దుర్యోధనుని మేలునకు నీవిపుడు ధనమీయదలచితివే! నీవెంత ప్రేరించినను నేను మాత్రమే దీని కొప్పుకొనను.''

ఇత్యుక్త్వా నిర్గతే భీమే త్రిభిః పరివృతో నృపః | దదౌ విత్తం సుబహుళం ధృతరాష్ట్రాయ ధర్మజః. 33

కారయామాస విధివ త్పుత్రాణాం చౌర్ధ్వదైహికమ్‌ | దదౌ దానాని విప్రేభ్యో ధృతరాష్ట్రో%ంబికాసుతః. 34

కృత్వౌర్ధ్వదైహికం సర్వం గాంధారీసహితో నృపః | ప్రవివేశ వనం తూర్ణం కుంత్యా చ విదురేణ చ. 35

సంజయేన పరిజ్ఞాతో నిర్గతో%సౌ మహీపతిః | పుత్రై ర్నివార్యమాణా%పి శూరసేనసుతా గతా. 36

విలవ న్భీమసేనో%పి తథా న్యే చాపి కౌరవాః గంగాతీరా త్పరావృత్య యయుని సర్వే గజాహ్వయమ్‌. 37

తే గత్వా జాహ్నవీతీరే శతయూపాశ్రమం శుభమ్‌ | కృత్వా తృణౖః కుటీం తత్ర తప స్తేపుః సమాహితాః. 38

భీము డీ రీతిగ పలికి వెళ్ళెను. పిదప ధర్మజుడు తక్కిన మువ్వురితో సంప్రతించి ధృతరాష్ట్రునకు బహు ధన మొసంగెను. అపు డంబికాసుతుడగు ధృతరాష్ట్రుడు తన కొడుకుల కూర్ధ్వలోక క్రియలు జరిపెను. విప్రులకు భూరిగ దాన దక్షిణ లొసగెను. ఆ విధముగ ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై తన కొడుకులకు పరలోకక్రియలు జరిపెను. పిమ్మట నతడు విదురునితో కుంతీగాంధారులతో వనముల కేగెను. మహామతి విజ్ఞుడునగు సంజయుడుగూడ వారివెంట బయలుదేరెను. పాండవులు కుంతి నెంతయో వారించిరి. కాని యామె వినక వనముల కేగెను. ఆ సమయమున భీముడు నితర కౌరవులు విలపించుచు గంగాతీరమువదలి గజపురి కేగిరి. వారట్లడవులకేగి గంగాతీరమందలి శుభ##మైన శతయూపాశ్రమము జేరి యచ్చట పర్ణకుటీర మేర్పరచుకొని యందు సమాహితచిత్తమున తపము నెఱపిరి.

గతా న్యబ్ధాని షట్తేసాం యదా యాతా హి తాపసాః | యుధిష్ఠిరస్తు విరహా దునుజా నిద మబ్రవీత్‌. 39

స్వప్నే దృష్టా మయా కుంతీ దుర్బలా వనసంస్థితా | మనో మే జాయతే ద్రష్టుం మాతరం పితరౌ తథా. 40

విదురం చ మహాత్మానం సంజయం చ మహామతిమ్‌ | రోచతే యది వః సర్వా స్వ్రజామ ఇతి మే మతిః. 41

తత స్తే భ్రాతరః సర్వే సుభద్రా ద్రౌపదీ తథా ః వైరాటీ చ మహాభాగ తథా నాగరికో జనః. 42

ప్రాప్తాః సర్వజనైః సార్థం పాండవా దర్వనోత్సుకాః | శతయూపాశ్రమం ప్రాప్య దదృశుః సర్వ ఏవతే. 43

విదురో న యదా దృష్టో ధర్మస్తం వృష్టవాం స్తదా | క్వాస్తే స విదురో ధీమాం స్త మువాచాంబికా సుతః. 44

విరక్త శ్చరతే క్షత్తా నిరీహోనిష్పరిగ్రహః కుత్రాప్యేకాంతసంవాసీ ధ్యాయతే%ంతః సనాతనమ్‌. 45

గంగాం గచ్ఛ న్ద్వితీయే%హ్ని వనే రాజా యుధిష్ఠరః | దదర్శ విదురం క్షామం తపసా సంశితవ్రతమ్‌. 46

దృష్ట్వోవాచ మహీపాలో వందే హం త్వాం యుధిష్ఠిరః | తస్థౌ శ్రుత్వా చ విదురః స్థాణుభూత ఇవానఘః. 47

క్షణన విదురస్యాస్యా న్నిఃసృతం తేజ అద్భుతమ్‌ | తీనం యుధిష్టిరస్యాస్యే ధర్మాంశత్వా త్పరస్పరమ్‌. 48

వారు పోయి యారేండ్లు గడచెను. ఒకనాడు ధర్మజుడు వారి యెడబాటు సైపలేక తన తమ్ములతో నిట్లు పలికెను: 'నేను కలలో దుర్బలయై వనమందుండియున్న కుంతిని గాంచితిని. కనుక మన తల్లిని పితరులను దర్శింపవలయునని నా మనస్సు దలంచుచున్నది. మహాత్ములగు విదుర సంజయులను జూడవలయుననియు నా మది గోరుచున్నది. కనుక మీకిష్టమైనచో మనమందఱము కలసి పోదము. ఇది యుక్తమని తలచుచున్నాను.' అటు పిమ్మట పాండవులు ద్రౌపది సుభద్ర యుత్తర నాగరకజనులును - వారిని దర్శించు కోరికతో శతయూపాశ్రమము చేరిరి. అచ్చో వారు వారిని సందర్శించిరి. వారిలో విదురుడు గనబడలేదు. అందులకే దర్మజు డతనినిగూర్చి ధృతరాష్ట్రు నడిగెను. ధృతరాష్ట్రుడు ధర్మజునకిట్లు పలికెను: 'ఆ విదురుడు నిస్పృహుడు నిష్పరిగ్రహుడు విరక్తుడు. కాన నెటనో యేకాంతమున సనాతనతత్త్వమును దనలో ధ్యానించుచున్నాడు.' మరునాడు యుధిష్ఠిరు డాగంగాతటమున సంశితవ్రతుడు తీవ్రతపమున కృశాంగుడునగు విదురుని దర్శించెను. ధర్మజుడపుడు 'నేను దర్మజుడను; నీకు ప్రణమిల్లుచున్నాను అని పలికెను. విదురు డది వినియు స్థాణువువలె విననట్టులుండెను. అంతలో నొక్క క్షణమాత్రలో విదురుని నుండి యొక మహాద్భుత దివ్యతేజము బయలువెడలి ధర్మాంశజుడగు ధర్మజునిలో లీనమయ్యెను.

క్షత్తా జహొ తదా ప్రాణా న్శుశోచాతి యుధిష్ఠిరః | దామార్థం తస్యదేహస్య కృతవా నుద్యమం నృపః. 49

శృణ్వతస్తు తదా రాజ్ఞో వాగువాచాశంరిణీ | విరక్తో%యం న దాహార్హో యథేష్టం గచ్ఛ భూపతే. 50

శ్రుత్వా తే భ్రాతరః సర్వేసస్ను ర్గంగాజలే%మలే | గత్వా నివేదయామాసు ర్ధృతరాష్ట్రాయ విస్తరాత్‌. 51

స్థితా స్తత్రాశ్రమే సర్వే పాండవా నాగరైః సహ | తత్ర సత్యవతీసూను ర్నారదశ్చ సమాగతః. 52

మునయో%న్యే మహాత్మాన శ్చాగతా ధర్మనందనమ్‌ | కుంతీ ప్రాహ తదా వ్యాసం సంస్థితం శుభదర్శనమ్‌. 53

కృష్ణ ! కర్ణస్తు పుత్రో మే జాతమాత్ర స్తు వీక్షితః | మనో మే తప్యతే సర్వం దర్శయస్వ తపోధన. 54

సమర్థో%పి మహాభాగ కురుమేవాంఛితం ప్రభో | గాంధార్వువాచ: దుర్యోధనోరణ%గచ్ఛద్వీక్షితో సమయామునే. 55

తం దర్మయముని శ్రేష్ఠ పుత్రం మేత్వంసహానుజమ్‌ | సుభద్రోవాచః అభిమన్యుంమహావీరం ప్రాణాదప్యధికం ప్రియమ్‌. 56

ద్రష్టుకామా%స్మి సర్వజ్ఞ దర్శయాద్య తపోధన | సూతః ఏవంవిధాని వాక్యాని శ్రుత్వా సత్యవతీసుతః. 57

ప్రాణాయామం తతః కృత్వా దధ్యౌ దేవీం సనాతనీమ్‌ | సంధ్యాకాలే%థ సంప్రాప్తే గంగాయాం మునిసత్తమః. 58

సర్వాం స్తాంశ్చ సమాహూయ యుధిష్ఠిరపురోగమాన్‌ | తుష్టావ విశ్వజననీం స్నాత్వా పుణ్యసరిజ్జలే. 59.

అట్లు విదురుడు ప్రాణములు వదలగ ధర్మజుడు వగచి యతని దేహమునకు దహనసంస్కారములు చేయబూనుకొనెను. అంతలో నొక యశరీరవాణి యిట్లు పలికెను: ఓ ధర్మరాజా! వినుము. ఇతడు వైరాగ్య శ్రీలలితుడు. బంధముక్తుడు. కాన దహనార్హుడు గాడు. మీరింక యథేచ్ఛముగ నేగుడు. అపుడు పాండవ సోదరులందరును పావనగంగలో మునిగి దృతరాష్ట్రునకు జరిగిన దంతయును నివేదించిరి. పాండవులు మరల తమ యాశ్రమములు చేరి పౌరులతో నుండిరి. అంతలో వారి చెంతకు శ్రీ వ్యాసభగవానుడును నారదమహర్షియు నేతెంచిరి. అత్తఱి కొంద ఱితర మునులుగూడ ధర్మజునికడ కరుగుదెంచిరి. అపుడు శుభదర్శనుడగు వ్యాసునితో కుంతి యిట్లు విన్నవించెను. 'తపోధనా! ద్వైపాయనా! నా కొడుకు కర్ణుడు తాను పుట్టినప్పుడే నానుండి దూరమయ్యెను. నా మది యిపు డతనిని గాంచ పరితపించుచున్నది. కనుక నాకతనిని జూపుము. ఓ విభూ! మహానుభావా! ఇందులకు నీవే సమర్థుడవు. కనుక నా వాంఛితము నెఱవేర్పుము.' గాంధారి యిట్లనియెను: 'దుర్యోధనుడు రణమున కేగిన పిమ్మట నేనతనిని చూచి యెరుగను. కనుక నోమునివర్యా ! అతనిని నతని సోదరులను నాకిపుడు జూపుము.' సుభద్ర యిట్లు పలికెను: 'ఓ మహాతపోధనా! అభిమన్యుడు నాకు ప్రాణములకంటె ప్రియమైనవాడు. నే నతనిని జూడగోరుచున్నాను. కనుక నా కతనిని జూపుము.' సూతుడిట్లనియెను: ఆ విధముగ వ్యాసుడు వారు పల్కిన పల్కు లాలకించెను. ఆ మునీశ్వరుడు సంధ్యాసమయమున గంగనుజేరి ప్రాణాయామ మాచరించెను. అపు డతడా దేవదేవి దీనబంధువగు శ్రీసనాతనీ దేవిని హృదయకమలమందు నిలిపి ధ్యానించెను. పిదప వ్యాసుడు యుధిష్ఠరాదుల రావించెను. వారా పుణ్యగంగాజలముల పరిశుద్ధులైరి. ఆ విశ్వజననిని సంతుష్టురాలిని చేసి వ్యాసుడిట్లు సన్నుతించెను:

ప్రకృతిం పురుషారామాం సుగుణాం నిర్గుణాం తథా | దేవదేవీం బ్రహ్మరూపాం మణిద్వీపాధివాసినీమ్‌. 60

యదా న వేధా న చ విష్ణు రీశ్వరో న వాసవో నైవ జలాధిప స్తథా |

న విత్తపో నైవ యమశ్చ పావకస్తదా%సి దేవి త్వం మహం నమామి తామ్‌. 61

జలం న వాయు ర్న ధరా నచాంబరమ్‌ గుణా న తేషాం చ న చేంద్రియా ణ్యహమ్‌ |

మనో న బుద్ధి ర్న చతిగ్ముగుః శశీ తదా%సి దేవి త్వ మహం నమామి తామ్‌. 62

ఇమం జీవలోకం సమాధాయ చిత్తే గుణౖ ర్లింగకోశం చ నీత్వా సమాధౌ |

స్థితా కల్పకాం నీయ స్వాత్మతంత్రా న కో%ప్యస్తి వేత్తా వివేకం గతో%పి. 63

ప్రార్థయత్యేష మాం లోకో మృతానాందర్శనంపునః | నాహం క్షమో%స్మిమాతస్త్వం దర్శయాశుజనాన్మృతాన్‌. 64

సూతః. ఏవం స్తుతా తదా దేవీమాయా శ్రీభువనేశ్వరీ | స్వర్గా దాహుయ సర్వాన్వై దర్శయామాస పార్థివాన్‌. 65

దృష్ట్వా కుంతీ చ గాంధారీ సుభద్రా చ విరాటజా | పాండవా ముముహుః సర్వే వీక్ష్య ప్రత్యాగతా న్స్వకాన్‌. 66

పున ర్విసర్జితా స్తేన వ్యాసేనామితతేజసా | స్మృత్వా దేవీం మహామాయా మింద్రజాల మివోద్యతామ్‌. 67

తదా పృష్ట్వా యయుః సర్వే పాండవా మునయన్తథా | రాజా నాగపురం ప్రాప్తః కుర్వ న్వ్యాసకథాం పథి. 68

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే సప్తమో%ధ్యాయః.

''శ్రీదివ్యమూల ప్రకృతీ! పురుషారామా! సగుణనిర్గుణాకృతీ! దేవదేవీ! బ్రహ్మ రూపిణీ! సుందరమణిద్వీపనివాసినీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంద్రాగ్ని యమవరుణ కుబేరులకు పూర్వమే వెలుగొందు శ్రీమాతృదేవీ! ఓ ఆద్యయగు పరాశక్తీ! నీకు సుమాంజలు లర్పింతును తల్లీ! ఓ పరిపూర్ణా! కళామయీ! భవానీ! ఈ పంచమహాభూతములు వాని గుణములు మనోబుద్ధ్యహంకారములు కరణములు సూర్యచంద్రులులేని మహాకాలమున తెలియరాని పెంజీకట్ల కావల నేకైక మహాజ్యోతిర్మూర్తివై విలసిల్లు దేవీ! నీకు సుమాంజలు లర్పింతును. విరాట్‌ స్వరూపమగు జీవలోకమును హిరణ్యగర్భమయమగు చిత్తమందునిలిపి యాసమష్టిలింగశరీరమగు హిరణ్యగర్భతత్త్వమును సామ్యావస్థలో నుంచి కల్పము చివరిదాక నిశ్చలచైతన్యజ్యోతియై వెలుగొందు శ్రీదేవి నెంత వివేకియు నెఱుగజాలడు. నీ వే యా మృతవీరుల జూపింపుము.'' ఈ వ్యాసస్తోత్రముతో నన్నుతయై శ్రీ భువనేశ్వరీ దేవి స్వర్గమునుండి మృతవీరుల రావించి యక్కడివారికి జూపెను. అట్లు మరల గనంబడిన తమ తమ వారిని కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు చూచి చూచి ముగ్ధులై శ్రద్ధాంజలు లర్పించిరి. పిదప వ్యాసుని యమితతేజము చేత వచ్చినవారలు మరల తమ తమ చోటులకు పంపబడిరి. ఇట్లు పాండవులు శ్రీదేవి దయవలన నింద్రజాలమువంటి దృశ్యము గాంచిరి. తరువాత నెల్లరు తమ తమ వాసములకు చేరుకొనిరి. పాండవ లట్లు శ్రీవ్యాసుని కథామృతపు చిలువలు రుచి జూచుచు హస్తిపుర మరిగిరి.

ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందలి సప్తమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters