Sri Devi Bhagavatam-1    Chapters   

అథ అష్టమో%ధ్యాయః

సూతః: తతో దినే తృతీయే చ ధృతరాష్ట్రః స భూపతిః | దావాగ్నినా వనే దగ్ధః సభార్యఃకుంతిసంయుతః. 1

సంజయ స్తీర్థయాత్రాయాం గత స్త్యక్త్వా మహీపతిమ్‌ | శ్రుత్వా యుధిష్టిరో రాజా నారదా ద్దుఃఖ మాప్తవాన్‌. 2

షట్త్రింశే%థ గతే వర్షే కౌరవాణాం క్షయాత్పునః | ప్రభాసే యాదవాః సర్వే విప్రశాపా తయం గతాః. 3

తే పీత్వా మదిరాం మత్తాః కృత్వా యుద్ధం పరస్పరమ్‌ | క్షయం ప్రాప్తా మహాత్మానః పశ్యతో రామకృష్ణయోః. 4

దేహం తత్యాజ రామస్తు కృష్ణః కమలోచనః | వ్యాధబాణహతః శాపం పాలయ న్భగవాన్హరిః. 5

వసుదేవస్తు తచ్ఛ్రుత్వా దేహత్యాగం హరే రథ | జహౌ ప్రాణాన్‌ శుచీన్‌ కృత్వా చిత్తే శ్రీభువనేశ్వరీమ్‌. 6

అర్జునస్తు తతో గత్వా ప్రభాసే చాలిదుఃఖితః | సంస్కారం తత్ర సర్వేషాం యథాయోగ్యం చకార హ. 7

సమీక్ష్యాథ హరే ర్దేహం కృత్వా కాష్ఠస్య సంచయమ్‌ | అష్టాభిః సహ పత్నీభి ర్దాహయామాస పార్థివః. 8

దేహం రామస్య రేవత్యా సహ దగ్ద్వా విభావసౌ | అర్జునో ద్వారకా మేత్య పురా న్నిష్క్రామయ జ్జనమ్‌. 9

పురీ సా వాసుదేవస్య ప్లావితోదధినా తతః | అర్జునః సర్వలోకాన్వై గృహీత్వా నిర్గత స్తదా. 10

అనిరుద్ధ సుతో నామ్నా పార్ఖేనామితతేజసా | వ్యాసాయ కథితం దుఃఖం తేనోక్తో%సౌ మహారథః. 11

ఎనిమిదవ అధ్యాయము

పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

సూతు డిట్లనెను : ఆనాటికి మూడవనాడు ధృతరాష్ట్రుడు గాంధారీకుంతీసహితుడై వనమందు దావాగ్నిలోబడి దగ్ధుడయ్యెను. సంజయు డంతకుముందే దర్మజుని ధృతరాష్ట్రుని వదలి తీర్థయాత్రకు వెడలెను. ఇదంతయును నారదుని వలన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లకు యాదవు లెల్లరును ప్రభాసతీర్థమున నశించిరి. వారు మదిరాపానమత్తులై రామకృష్ణులు చూచుచుండగనే తమలో తాము కయ్యాలు పెట్టుకొని సమసిరి. బలరాముడు మేను చాలించెను. కమలాక్షుడగు శ్రీకృష్ణుడును శాపానుసారముగ వ్యాధుని బాణమున నిహతుడయ్యెను. అట్లు కృష్ణుడు తన యవతారము చాలించెనని విని వసుదేవుడు తన హృదయమందు శ్రీ భువనేశ్వరీదేవిని నిలిపి ప్రాణములు వదలెను. అంతట అర్జును డతి దుఃఖితుడై ప్రభాసతీర్థమునకేగి వారి వారికి దగినట్లుగ సంస్కారము లొనరించెను. అర్జునుడు హరి మృతశరీరముగాంచి చితిపేర్చి యందతనితో నతని యష్టమహిషులనుజేర్చి దహనసంస్కారము లొనర్చెను. రేవతితోడి బలరాముని దేహ మగ్నిలో దహింపజేసెను. పిమ్మట నతడు ద్వారకకుజని యచటి జనులను దోడుకొని పురమును వెడలించి నడచెను. వెంటనే సముద్ర ముప్పొంగి వాసుదేవుని పురమును నీటముంచెను. అంతట కిరీటి ప్రజలను వెంటనిడుకొని నిర్గమించెను. తేజస్వియగు నర్జును డనిరుద్దుని కొడుకు నింద్రప్రస్థపురికి రాజుగ జేసెను. పిమ్మట నర్జునుడు తన పడిన పాటులన్ని యును వ్యాసునకు చెప్పి రోదించెను.

పున ర్యదా హరిస్త్వం చ భవితాసి మహామతే | కృష్ణవత్న్య స్తదా మార్గే చౌరాభీరైశ్చ లుంఠితాః. 12

ధనం సర్వం గృహీతం చ నిస్తేజా శ్చార్జునో %భవత్‌ | ఇంద్రప్రస్థే సమాగమ్య వజ్రో రాజా కృత స్తతః. 13

తదా తేజ స్తవాత్యుగ్రం భవిష్యతి పున ర్యుగే | తచ్ఛ్రుత్వా వచనం పార్థో గత్వా నాగపురే%ర్జునః. 14

దుఃఖితో ధర్మజాదీనాం వృత్తాంతం సర్వ మబ్రవీత్‌ | దేహత్యాగం హరేః శ్రుత్వా యాదవానాం క్షయం తథా 15

గమనాయ మతిం చక్రే రాజా హైమాచలం వ్రతి | షట్త్రింశద్వార్షికం రాజ్యే స్థాపయిత్వో త్తరాసుతమ్‌. 16

నిర్జగామ వనం రాజా ద్రౌపద్యా భ్రాతృభిః సహ | షట్త్రింశ##చ్చైవ వర్షాణి కృత్వా రాజ్యం గజాహ్వయే. 17

వ్యాసుడు అర్జునితో మహామతీ ! శ్రీహరి మరల నవతరించునపుడు నీవు నతని వెంటవత్తు వనెను. అటు తరువాత చోరులును అభీరులును కృష్ణుని తక్కిన భార్యలమీద స్త్రీలమీదపడి దోచిరి. స్త్రీల యొంటిమీది సొమ్ములన్నియు నొలుచుకొని పోయిరి. అర్జునుడుగూడ తేజోహీనుడయ్యెను. వజ్రనామకు డింద్రప్రస్థమున యాదవులకు రాజుగ జేయబడెను. రాబోవు యుగమున నీవు మరల పూర్ణతేజస్కుడవు గాగలవని వ్యాసుడు చెప్పగ నర్జునుడువిని ముదమంది కరిపురమున కేగెను. అచట జరిగిన వృత్తాంతమంతయు నర్జునుడు ధర్మరాజాదులకు దెలిపెను. ధర్మజుడు శ్రీహరి దేహత్యాగము యాదవ వంశక్షయము అంతయువినెను. అంతట ధర్మరాజు హిమాచలమునకేగ సంకల్పించెను. అతడు ముప్పదియాఱండ్ల ప్రాయముగల పరీక్షిత్తునకు బట్టము గట్టెను. ఆ ప్రకారముగ ధర్మనందనుడు కరిపురమును ముప్పదియాఱండ్లు చక్కగ పరిపాలించి పిదప తన తమ్ములతో ద్రౌపదితో బయలుదేరెను.

గత్వా హిమాచలం షట్తే జహుః ప్రాణా న్పృథాసుతాః | పరీక్షిదపి రాజర్షిః ప్రజాః సర్వాః సుధార్మికాః 18

అపాలయచ్చ రాజేంద్రః షష్టి వర్షా ణ్యతంద్రితః | బభూవ మృగయాశీలో జగామ చ వనం మహాత్‌. 19

విద్ధం మృగం విచిన్వానో మధ్యాహ్నే భూపతిః స్వయమ్‌ | తృషితశ్చ పరిశ్రాంతః క్షుధిత శ్చోత్తరా సుతః. 20

రాజా ఘర్మేణ సంతప్తో దదర్శ ముని మంతికే | ధ్యానే స్థితం మునిం రాజా జలం పప్రచ్ఛ చాతురః. 21

నోవాచ కించి న్మౌనస్థ శుకోప నృపతి స్తదా | మృతం సర్పం తదా%%దాయ ధనుష్కోట్యా తృషాతురః. 22

కలినా%%విష్టచిత్తస్తు కంఠే తస్య న్యవేశయత్‌ | ఆరోపితే తథా సర్వే నోవాచ మునిసత్తమః. 23

న చచాల సమాధిస్థో రాజా%పి స్వగృహం గతః | తస్య పుత్త్రో%తితేజస్వీ గవి జాతో మహాతపాః. 24

మహాశక్తో%థ శుశ్రావ క్రీడమానో వనాంతికే | మిత్రాణ్యాహుశ్చ తత్పుత్రం పితుః కంటే తవాదునా. 25

లంభితో%స్తి మృతః సర్పః కేనాపీతి మునీశ్వర | తేషాం తద్వచనం శ్రుత్వా చుకోపాతివయం తదా. 26

శశాప నృపతిం క్రుద్ధో గృహీత్వా%%శు కరే జలమ్‌ | పితుః కంఠే %ద్య మే యేన వినిక్షిప్తో మృతోరగః. 27

తక్షకః సప్తరాత్రేణ తం దశే త్పాపపూరుషమ్‌ | మునేః శిష్యో%థ రాజానం సముపేత్య గృహే స్థితమ్‌. 28

శాపం నివేదయామాస మునిపుత్రేణ చార్పితమ్‌ | అభిమన్యుసుతః శ్రుత్వా శాపం దత్తం ద్విజేన వై. 29

ఆ విధముగ నారుగురును హిమగిరికేగి యందే ప్రాణములు వదలిరి. ఇట పరీక్షిత్తు పరమ ధార్మికుడు - రాజర్షి - రాజేంద్రుడు- చక్కగ నరువదేండ్లు పరిపాలించెను. ఒకనాడత డడవికి వేటకేగెను. ఆ రాజు దెబ్బతిన్న మృగాదులను పట్టుకొనుటలో మట్టమధ్యాహ్నమయ్యెను. ఆ పట్టపగటి వేడిమి కత డాకలిదప్పికలచే నలమటించెను. అతడా వడదెబ్బకు తాళ##లేక చేరువలో ధ్యానమగ్నుడైయున్న యొక మునివరునిగాంచి జలమిమ్మని యడిగెను. ఆ ముని నిర్మలనిశ్చలసమాధిలో నుంటచే మాటాడలేదు. పరీక్షిత్తు దప్పికచే కలిమాయచే కుపితుడై తన వింటికొనచే నచట చచ్చిపడియున్న పామును పైకెత్తెను. అతడు కలి ప్రభావమున దాని నా ముని మెడలో వేసెను. పామును తన మెడలో వైచినను ముని మాటాడకుండెను. ముని నిర్వికల్పుడై యుండెను. పిదప రాజు తన గృహమున కేగెను. ఆ ముని కుమారుడు గవిజాతుడు మహా తపస్వి. మహాతేజస్వి, మహాశక్తుడు. ఆ బాలుడు వన ప్రాంతమున తోడి మిత్రులతోడ నాడుకొనుచుండెను. అంతలో నతని మిత్రులెవరో యతనితో 'నీ తండ్రి మెడలో ఎవరో చచ్చిన పాము వేసి'రనిరి. ఆ మాటలు వినగనే యతుడు క్రుద్ధుడైవేగిరమే దోసిట జలముగొని నాతండ్రి మెడలో చచ్చినపాము వేసిన రాజు-పాపి యేడునాళ్లలో తక్షకునిచే కాటువేయబడి చచ్చునుగాత' మని శపించెను. అపుడు కొందఱు ముని కుమారకులు రాజభవనమందున్న పరీక్షిత్తుకడ కేగిరి. వారు రాజుతో నతనికి ముని బాలుడిచ్చిన శాపమును దెలిపిరి. అట్లు రాజు తనకు ముని బాలు డిచ్చిన శాపము తెలసికొనెను.

అనివార్యం చ విజ్ఞాయ మంత్రివృద్ధా నువాచ హ | శప్తో%హం ద్విజరూపేణ మను ద్వేషా దసంశయమ్‌. 30

కిం విధేయం మయా%మాత్యా ఉపాయ శ్చింత్యతా మిహ | మృత్యుః కిలా నివార్యో%సౌ వదంతి వేదవాదినః. 31

యత్న స్తథా%పి శాస్త్రోక్తః కర్తవ్యః సర్వథా బుధైః | ఉపాయవాదినః కేచి త్ప్రవదంతి మనీషిణః. 32

విజ్ఞోపాయేన సిద్ధ్యంతి కార్యాణి నేతరస్య చ | మనిమంత్రౌషధీనాం చ ప్రభావాః ఖలు దుర్విదః. 33

న భ##వేదితి కిం తైస్తు మణిమద్భిః సుసాధితైః | సర్పదష్టా పురా భార్యా మునేః సంజీవితామృతా. 34

దత్వార్థ మాయుష స్తేన మునినా సా వరాప్సరాః | భవితవ్యే న విశ్వాసః కర్తవ్యః సర్వథా బుధైః. 35

ప్రత్యక్షం తత్ర దృష్టాంతు పశ్యంతు సచివాః కిల | దివి కో%పి పృథివ్యాం వా దృశ్యతే పురుషః క్వచిత్‌. 36

దైవే మతిం సమాధాయ యస్తిష్ఠేత్తు నిరుద్యమః | విరక్తస్తు యతి ర్భూత్వా భిక్షార్థం యాతి సర్వథా. 37

గృహస్థానాం గృహే కామ మహోతో%వ్యథ వ్యా%న్యథా | యదృచ్ఛయోపపన్నం చ క్షిప్తం కేనాపి వా ముఖే. 38

ఉద్యమేన విన్యా చాస్యా దుదరే సంవిశే త్కథమ్‌ | ప్రయత్న శ్చోద్యమే కార్యో యదా సిద్ధిం న యాతి తత్‌. 39

తదా దైవం స్థితం చేతి చిత్త మాలంబయే ద్బుదః | మంత్రిణః : కో ముని ర్యేనదత్త్వార్థమాయుషోజీవితా ప్రియా. 40

అంత పరీక్షిత్తు శాపము తప్పదని యెఱింగి వెంటనే వృద్ధామాత్యులను రావించి వారి కిట్లనియెను: ''నా ద్వేషకారణముగ నొక ముని బాలునిచేత శపింపబడితిని. కాన నో మంత్రులారా! ఇపుడు నే జేయదగిన యుపాయమేదేని నున్నచో నాలోచింపుడు. ఎట్టివానికేని చావు తప్పింపరాదని వేదవిదులందురు గదా! ఐనను తెలిసినవారు శాస్త్రోక్తపద్ధతులాచరింతురు. ఉపాయజ్ఞులగు - బుద్ధిమంతులు కొంద ఱిట్లు వచింతురు. ఎల్ల కార్యములు విజ్ఞుల యుపాయములవలన తప్ప మరిదేనివలనను నెఱవేరవు. మణి మంత్రౌషధముల ప్రభావము దుస్తరము. వాటి సిద్ధులవలన కార్యములు సిద్ధించును. తొల్లి యొక ముని తన భార్య పాముకాటునకు చనిపోగా నత డామెను మరల బ్రతికించుకొనెను. ఆ ముని తన భార్యకు తన యాయువులోని సగపాలిచ్చి యామెను మరల బ్రతికించుకొనెను. పండితులగు వారు భవితవ్యమును విశ్వసింతురు. మంత్రులారా! ఇందులకు ప్రత్యక్ష దృష్టాంతము ఇది: ఈ భువిపైగాని దివిపైగాని యే పురుషుడైనను దైవముపై భారము వైచి నిరుద్యోగమున నూరక కూరుచుండునా? విరక్తుడగు యతికి సైతము బిచ్చమెత్తుకొనక పొట్టగడువదు గదా ! అతడు గృహస్థులు పిలిచినను పిలువకున్నను నింటింటికి వెళ్ళుచుండును. కాని యూరక గోళ్ళుగిల్లుకొనుచు కూరుచుండునా? కూరుచున్నచో నతని నోటిముందునకు పట్టెడు మెదుకులు తెచ్చి పెట్టువాడెవడు? తినకున్నచో నన్నము పొట్టలోనికి పోవుటెట్లు? కావున కార్యము నెఱవేరినను ప్రయత్నము మాత్రము చేసి తీరవలయును. ఒకవేళ కార్యము సాధ్యముగానిచో మాత్రమే మదిలో దైవమునే దిక్కుగ నమ్ముకొన వలయును.'' రాజు మాటలువిని మంత్రులనిరి: 'తన ప్రియురాలికై తన ఆయురర్ధ మిచ్చి బ్రతికించికొన్న యా ముని యెవరో యాతనిభార్య యెట్లు మరణించెనో విశదముగ దెలుపుడు.

కథం మృతా మహారాజ తన్నో బ్రూహి సవిస్తరమ్‌ | రాజా: భృగో ర్భార్యా వరారోహా పులోమానామసుందరీ. 41

తస్యాం తు చ్యవనో నామ ముని ర్జాతో%తివిశ్రుతః | చ్యవనస్య చ శర్యాతేః సుకన్యా నామ సుందరీ. 42

తస్యాం జజ్ఞే సుతః శ్రీమా న్ప్రమతి ర్నామ విశ్రుతః | ప్రవతేస్తు ప్రియా భార్యా ప్రతాపీ నామ విశ్రుతా. 43

రురు ర్నామ సుతో జాతస్థథా పరమ తాపనః తస్మింశ్చ సమయే కశ్చి త్ధ్సూలకేశశ్చ విశ్రుతః. 44

బభూవ తపసా యుక్తో దర్మాత్మా సత్యసమ్మతః | ఏతస్మిన్నంతరే మాన్యా మేనకా చ వరాప్సరాః. 45

క్రీడాం చక్రే నదీతీరే త్రిషు లోకేషు సుందరీ | గర్భం విశ్వావసోః ప్రాప్య నిర్గతా వరవర్ణినీ. 46

స్థూలకేశాశ్రమే గత్వా విససర్జ వరాస్పరాః | కన్యకాం చ నదీతీరే త్రిషు లోకేషు సందరీమ్‌. 47

దృష్ట్వా%నాథాం తదా కన్యాం జగ్రాహ మునిసత్తమః | వుపోష స్థూలకేశస్తు నామ్నా చక్రే ప్రమద్వరామ్‌. 48

సా కాలే ¸°వనం ప్రాప్తా సర్వలక్షనసంయుతా | రురుర్దృష్ట్వా%థ తాం బాలాం కామబాణార్దితోహ్యభూత్‌. 49

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంథే%ష్టమోధ్యాయః.

రాజిట్లనియెను: ''భృగుమహర్షి భార్య పులోమ. ఆమె చాల సౌందర్యరాశి. ఆమెకు చ్యవనుడను ప్రసిద్ధికెక్కిన ముని సంభవించెను. ఆ చ్యవనునకు శర్యాతికూతురు సుకన్యయను నామె భార్య యయ్యెను. ఆ సుకన్య సుందరాంగి. వారికి ప్రమతియను ప్రఖ్యాత సుతుడు గలిగెను. ఆ ప్రమతి భార్య ప్రతాపి యనబరగెను. ఆమెకు రురువను సుతుడు జనియించెను. ఆనాళ్లలో స్థూలకేశుడను తపస్వి యుండెను. ఆ తాపసుడు ధర్మాత్ముడు. సత్యసమ్మతుడు. త్రిలోకసుందరి మేనక విశ్వావసువువలన గర్భము దాల్చెను. ఆమె యొకనాడు నదీతీరమున విహరించుచుండగా నిది జరిగెను. ఆ మేనక స్థూలకేశు నాశ్రమమున నొక యందాలపాపను గనెను. ఆ బాలనదీతటమున నొప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ ముని యాదిక్కు లేని బాలను చేరదీసి ప్రమద్వరయను పేరిడి ముద్దుగ పెంచుకొనుచుండెను. కొంతకాలమున కా కన్నియ సర్వలక్షణశోభితయై పడుచుదనమున నెసగుచుండెను. ఒకనాడా పడుచుకన్నెను రురుమహర్షికన్నారగాంచెను. ఆతని హృదయమున పూవుముల్కుల కైపైక్కెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయ స్కంధమందలి ఎనిమిదవ అధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters