Sri Devi Bhagavatam-1    Chapters   

శ్రీదేవీ భాగవతము

అథ తృతీయస్కంధః

అథ ప్రథమో%ధ్యాయః

జనమేజయః : భగవన్భవతా ప్రోక్తం యజ్ఞమంబాభిధం మహత్‌ | సా కా కథం సముత్పన్నా కుత్రకస్మాచ్చకింగుణా. 1

కీదృశశ్చ మఖ స్తస్యాః స్వరూపం కీదృశం తథా | విధానం విధివ ద్భ్రూహి సర్వజ్ఞో%సి దయానిధే. 2

బ్రహ్మాండస్య తథోత్పత్తిం వద విస్తరత స్తథా | యథోక్తం యాదృశం బ్రహ్మ న్నఖిలం వేత్సి భూసుర. 3

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ త్రయోదేవా మయా శ్రుతాః | సృష్టిపాలనసంహారకారకాః సగుణా స్త్వమీ. 4

స్వతంత్రా స్తే మహాత్మానః పారాశర్య వదస్వ మే | ఆహోస్వి త్పరతంత్రాస్తే మిచ్ఛామి సాంప్రతమ్‌. 5

మృత్యుధర్మాశ్చ తే నో వా సచ్చిదానంతరూపిణః | అధిభూతాదిభి ర్యుక్తా న వా దుఃఖై స్త్రీధాత్మకైః. 6

కాలస్య వశగా నో వా తే సురేంద్రా మహాబలాః | కథం తేవై సముత్పన్నాః కస్మా దితి చ సంవయః. 7

హర్షశోకయుతా స్తే వై నిద్రాలస్య సమన్వితాః | సప్తధాతుమయా స్తేషాం దేహాః కిం వా%న్యథా మునే. 8

కైర్ద్రవ్యై ర్నిర్మితా స్తేవై కైర్గుణౖ రింద్రియై స్తథా | బోగశ్చ కీదృశ స్తేషాం ప్రమాణ మా యుష స్తథా. 9

నివాసస్థాన మష్యేషాం విభూతిం చ వదస్వ మే | శ్రోతు మిచ్ఛామ్యహం బ్రహ్మ! న్విస్తరేణ కథా మిమామ్‌. 10

మొదటి యధ్యాయము

త్రిభువనేశ్వరి విషయమున జనమేజయ కృతప్రశ్నము

జనమేజయు డిట్లనియెను: భగవానుడా! నీవు శ్రీదేవీ యాగ మొనరింపుమని వక్కాణించితివి. ఆ శ్రీదేవీ యెవరు? ఎట్లవతరించెను? ఎవరి వలన జన్మించెను? ఆమె స్వరూపమేమి? ఆమె యందలి గుణ విశేషము లెవ్వి? ఆ దేవి దివ్యాకృతి యెట్టిది? ఆ తల్లి యజ్ఞ మేవిధముగ జరుపవలయును? ఆ యాగ విధానమును సర్వజ్ఞుడవగు నీవు తేట పఱచుము. బ్రాహ్మణోత్తమా! ఈ విశ్వముయొక్క సృష్టి రహస్యము నీవెఱుంగుదువు. బ్రహ్మాండమన ఎట్టిది? దాని యుత్పత్తి ప్రకారమేమి? విస్తరించి చెప్పుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగలరనియు, వారు త్రిగుణమయులనియు, సృష్టిపాలన సంహారము లొనరింతురనియు నేను వింటిని. ఆ త్రిమూర్తులును స్వతంత్రులా? పరతంత్రులా? ఆ మహాత్ములను గుఱించి నాకు వినవేడుక యగుచున్నది. వారికి గూడ చావు సహజమా లేక వారు సచ్చిదానంద స్వరూపులా? వార లాధ్యాత్మికము అధిదైవికము అధి భౌతికము అను తాపత్రయము గలవారా? లేక దుఃఖరహితులా? ఇంద్రాదులు మహాబలశాలురు గదా! వారిని కాలము కాటు వేయునా? లేదా? వారలెవరివలన నే తెఱగున ప్రాదుర్భవించిరి? అను సందియము నన్ను పీడించుచున్నది. వారికి సుఖ దుఃఖములు గలవా లేవా? వారు నిద్రాలస్యములకు వశులగుదురా కారా? వారి శరీరములు సప్తధాతుమయములా కావా? వారే యే దివ్యపదార్థములవలన గుణంద్రియముల వలన సృజింపబడిరి? వారి జీవితకాలమునకు ప్రమాణమెంత? మునివరా! ఆయా దేవతల నివాసస్థానములను వారి వారి మహావిభూతుల కథలను నాకు బోధపడునట్లు విప్పి చెప్పుము. ఇట్టి మహాత్ముల కథ లెన్నయినను నేను వినుటకు వెనుకాడను.

వ్యాసః : దుర్గమః ప్రశ్నభారో%యం కృతోరాజం స్త్వయా%ధునా! బ్రహ్మాదీనాం సముత్పత్తిః కస్మాదితిమహామతే. 11

ఏతదేవ యమా పూర్వం వృష్టో%సౌ నారదో మునిః | విస్మితః ప్రత్యువాచేద ముత్థితః శృణు భూపతే. 12

కస్మింశ్చ సమయే చాహం గంగాతీరే స్థితం మునిమ్‌ | అపశ్యం నారదం శాంతం సర్వజ్ఞం వేదవిత్తమమ్‌. 13

దృష్ట్వా%హం ముదితో గత్వా పాదయో రపతం మునేః | తేనాజ్ఞప్తః సమీపే%స్య సంవిష్టశ్చ వరాసనే. 14

శ్రుత్వా కుశలవార్తాం వై తమపృచ్ఛం విధేః సుతమ్‌ | నివిష్టం జాహ్నవీతీరే నిర్జనే సూక్ష్మవాలుకే. 15

మునే%తివితతస్యాస్య బ్రహ్మాండస్య మహామతే | కః కర్తా పరమః ప్రోక్త స్తన్మే బ్రూహి విధానతః. 16

కస్మా దేత త్సముత్పన్నం బ్రహ్మాండం మునిసత్తమ | అనిత్యం వా తథా నిత్యం తదాచక్ష్వ ద్విజోత్తమ. 17

ఏకకర్తృక మేతద్వా బహుకర్తృక మన్యథా | అకర్తృకం న కార్యం స్యా ద్విరోధో%యం విభాతిమే. 18

ఇతి సందేహాసందోహే మగ్నం మాం తారయాదునా | వికల్పకోటీః కుర్వాణం సంసారే%స్మి న్ప్రవిస్తరే. 19

బ్రువంతి శంకరం కేచి న్శత్వా కారణకారణమ్‌ | సదా శివం మహాదేవం ప్రళయోత్పత్తివర్జితమ్‌. 20

ఆత్మారామం సురేశం చ త్రిగుణం నిర్మలం హరమ్‌ | సంసారతారకం నిత్యం సృష్టిస్థిత్యంతకారణమ్‌. 21

వ్యాసుడిట్లనియెను: 'ఓయి జనమేజయ మహారాజా! ఆ బ్రహ్మాదిదేవత లెవ్వరివలన సంభవించిరని నీవు ప్రశ్నించితివి. నీ ప్రశ్నకు సమాధానము కడు దుర్గమము. అది అంత తేలికైనదికాదు. నేను మున్ను నారదు నిదే ప్రశ్న మడిగితిని. దాని కతడు చోద్యమంది నాకు సమాధానించిన విధము నీకు వినిపింతును, ఏకాగ్రతతో నాలింపుము. వెనుక నొకప్పుడు నాకు పావనగంగా తీరమున పరమశాంతుడు సర్వజ్ఞుడు వేదవిదుడునగు నారదమహర్షి కనబడెను. నేను ప్రమోదమంది యా ముని సన్నిధికేగి యతని పాదపద్మముల కెఱగి యతని యనుమతితో నొక వరాసనమున గూర్చుంటిని. ఆ గంగాతటమున చల్లని యిసుకతిన్నెలపై సుఖాసీనుడై యున్న నారదుని కుశలమడిగి విని నేనతనితో మరల నిట్లంటిని: మునీశ్వరా! ఈ విశాలవిశ్వమునకు మూలకర్త యెవ్వరు? ఈ బ్రహ్మాండ మే మహాశక్తివలన సముత్పన్నమైనది. ఈ సృష్టి నిత్యమా? అనిత్యమా? విధానము ననుసరించి తెలియబలుకుము. కర్తలేక కార్యము జరుగదు గదా! ఈ యింతటి బ్రహ్మాండము నొకడే నిర్మించెనా? లేక పల్వురు కలిసికట్టుగ చేసిరా? అను సందియము నా కెప్పుడును గల్గుచుండును. ఈ పలువిధములైన తర్కవితర్కములతో సందేహ సందోహములతో నే నీ విపుల సంసార సాగరములోన మునింగితిని. నన్నుద్ధరించి కడతేర్చుము. కొందఱు మహాదేవుడు సద్యోజాతుడు రుద్రుడు తత్పురుషుడు మహేశ్వరుడునగు శివుడు ప్రళయోత్పత్తి లేనివాడు నగు శంకరుడు కారణకారణుడని వాక్రుత్తురు. ఆ హరుడు సోముడు రుద్రుడు శంభువు శంకరుడు త్రిగుణుడు సృష్టి స్థిత్యంతకారకుడు సంసారోత్తారకుడు శివుడు శివతరుడని వక్కాణించి పల్కుదురు.

అన్యే విష్ణుం స్తువంత్యేనం సర్వేషాం ప్రభు మీశ్వరమ్‌ | పరమాత్మాన మవ్యక్తం సర్వశక్తిసమన్వితమ్‌. 22

భుక్తిదం ముక్తిదం శాంతం సర్వాదిం సర్వతోముఖమ్‌ | వ్యాపకం విశ్వశరణ మనాదినిధనం హరిమ్‌. 23

ధాతారం చ తథా చాన్యే బ్రువంతి సృష్టికారణమ్‌ | తమేవ సర్వవేత్తారం సర్వభూతా ప్రవర్తకమ్‌. 24

చతుర్ముఖం సురేశానం నాభిపద్మభవం విభుమ్‌ | స్రష్టారం సర్వలోకానాం సత్యలోకనివాసినమ్‌ 25

దినేశం ప్రవదంత్యన్యే సర్వేశం వేదవాదినః | స్తువంతి చైవ గాయంతి సాయంప్రాత రతంద్రితాః. 26

యజంతి చ తథా యజ్ఞే వాసవం చ శతక్రతుమ్‌ | సహస్రాక్షం దేవదేవం సర్వేషాం ప్రభు ముల్బణమ్‌. 27

యజ్ఞాధీశం సురాధీశం త్రిలోకేశం శచీపతిమ్‌ | యజ్ఞానాం చైవ భోక్తారం సోమపం సోమపప్రియమ్‌. 28

వరుణం చ తథా సోమం పావకం పవనం తథా | యమం కుబేరం ధనదం గణాధీశం తథాపరే. 29

హేరంబం గజవక్త్రం చ సర్వకార్యప్రసాదకమ్‌ | స్మరణా త్సిద్ధిదం కార్యం కామదం కామగం పరమ్‌. 30

మఱికొందఱు శ్రీహరి హృషీకేశుడు మాధవుడు పద్మనాభుడు సర్వశక్తియుక్తుడు విశ్వుడు సర్వభూతాత్ముడు పరమాత్ముడగు విష్ణుని నుతింతురు. ఆ విష్ణువు భుక్తిముక్తిప్రదుడు పరమశాంతుడు విశ్వతోముఖుడు సర్వవ్యాపకుడు సర్వాద్యుడు విశ్వశరణ్యుడనాదినిధనుడునని వారు సన్నుతింతురు. ఇంక కొందఱు బ్రహ్మదేవుని విధాతగ లోకసృష్టి కారకునిగ సర్వవేత్తగ సర్వభూత ప్రవర్తకునిగచతుర్ముఖునిగ సరేశునిగ కమలసంభవునిగ సత్యలోకవాసిగ సర్వలోక కర్తగా వచింతురు. ఇతరులు కొందఱు వేదవాదులు సర్వేశ్వరుడగు సూర్యుని విశ్వకర్తగ భావించి యతనిని సంధ్యలందు సమాహితమతితో సంస్తుతించి ధ్యానింతురు. వేరొక కొందరు దేవదేవుడు సహస్రాక్షుడు శతక్రతుడు సకలప్రభువగు నింద్రుని కర్తగ దలంచి యింద్రయాగ మొనరింతురు. వారా యింద్రుడు పురుహూతుడు యజ్ఞపతి సురపతి లోకపతి శచీపతి యాగభోక్త సోమపుడు సోమపాయి ప్రియుడు నని వచింతురు. ఇతరులు కొంద ఱగ్నిని యముని వరుణుని వాయుదేవుని సోముని ధనదుడగు కుబేరుని గణపతిని గొప్పగ భావింతురు. ఆ గణపతి హేరంబుడు గజవక్త్రుడు స్మరించినంతనే విఘ్నములు బాపి సిద్ధి చేకూర్చువాడు సర్వకార్యసాధకుడు కామదుడు కామగుడని సర్వభావమున సంభావించి పూజింతురు.

భవానీం కేచనాచార్యాః ప్రవదం త్యఖిలార్థదామ్‌ | ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగామ్‌. 31

బ్రహ్మైకతాసమాపన్నాం సృష్టిస్థిత్యంతకారిణీమ్‌ | మాతరం సర్వభూతానాం దేవతానాం తథైవ చ. 32

అనాదినిధనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు | ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాం సగుణాం శివామ్‌. 33

వైష్ణవీం శాంకరీం బ్రాహ్మీంవాసవీంవారుణీం తథా | వారాహీం నారసింహీం చమహాలక్ష్మీం తథాద్భు%%తామ్‌. 34

వేదమాతర మేకాం చ విద్యాం భవతరోః స్థిరామ్‌ | సర్వదుఃఖనిహంత్రీం చ స్మరణా త్సర్వకామదామ్‌. 35

మోక్షదాం చ ముముక్షూణాం కామదాం చ ఫలార్థినామ్‌ | త్రిగుణాతీతరూపాం చ గుణవిస్తార కారికామ్‌. 36

నిర్గుణాం సుగుణాం తస్మా త్తాం ధ్యాయంతి ఫలార్థినః | నిరంజనం నిరాకారం నిర్లేపం నిర్గుణం కిల. 37

అరూపం వ్యాపకం బ్రహ్మ ప్రవదంతి మునీశ్వరాః | వేదోపనిషది ప్రోక్త స్తేజోమయ ఇతి క్వచిత్‌. 38

సహస్రశీర్షా పురుషః సహస్రనయ స్తథా | సహస్రకరకర్ణశ్చ సహస్రాస్యః సహస్రపాత్‌. 39

కొంద రాచార్యులు సర్వార్థప్రదాయిని ఆదిమాయ మహాశక్తి పురుషానువర్తిని-బ్రహ్మైక్యస్వరూప జననరక్షాలయకారిణి సర్వభూతదేవతల కడుపుపంటగ గన్నతల్లి - అనాదినిధన - పూర్ణ - సర్వలోకేశ్వరి - సగుణనిర్గుణ - శివస్వరూప సర్వప్రాణివ్యాప్త బ్రాహ్మి వైష్ణవి శాంకరి వాసవి వారుణి వారాహి నారసింహి శ్రీమహాలక్ష్మి అద్భుతరూప-వేదమాత ఏకవిద్యాస్వరూప తారిణి సర్వదుఃఖ నిహంత్రి తలచినంతనే కోర్కులు కురియు దేవి ముముక్షులకు ముక్తిదాయిని ఫలార్థులకు ఫలప్రదాయిని త్రిగుణాతితరూప గుణవిస్తారకారిక నిర్గుణ సగుణ అగు శ్రీదేవిని ఫలార్థులై ధ్యానింతురు. కొంతమంది నిత్యము నిరంజనము నిరాకారము నిర్లేపము నిర్గుణము అరూపము శుద్ధబుద్ధముక్తయు ప్రజ్ఞానఘనమునగు బ్రహ్మమే సర్వకారణమని పలుకుదురు. ఆ బ్రహ్మమే వేదోపనిషత్తుల సారమని పరంజ్యోతి యని వచింతురు. ముని పుంగవులా బ్రహ్మతేజమునే సహస్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్రపాదుడు సహస్రకరుడు అగు పురుషోత్తమునిగ విశ్వసింతురు.

ఇష్ణోః పాద మథాకాశం పరమం సముదాహృతమ్‌ | విరాజం విరజం శాంతం ప్రవదంతి మనీషిణిః. 40

పురుషోత్తమం యథా చాన్యే ప్రవదంతి పురా విదః | నైకో%పీతి వదం త్యన్యే ప్రభు రీశః కదాచన. 41

అనీశ్వర మిదం సర్వం బ్రహ్మాండ మితి కేచన | న కదా%పీశజన్యం య జ్జగ దేవ ద్విచింతితమ్‌. 42

సదైవేద మనీశం చ స్వభావోత్థం సదేదృశమ్‌ | అకర్తా%సౌ పుమాన్‌ ప్రోక్తః ప్రకృతిస్తు తథా చ సా. 43

ఏవం వదంతి సాంఖ్యాశ్చ మునయః కపిలాదయః | ఏతే సందేహసందోహాః ప్రభవంతి తథా%పరే. 44

వికల్పోపహతం చేతః కిం కరోమి మునీశ్వర | ధర్మాధర్మవివక్షాయాం న మనో మే స్థిరం భవత్‌. 45

కో ధర్మః కీదృశో%ధర్మ శ్చిహ్నం నైవోపలభ్యతే | దేవాః సత్వగుణోత్పనాః సత్యధర్మవ్యవస్థితాః. 46

పీడ్యంతే దానవైః పాపైః కుత్ర ధర్మవ్యవస్థితః | ధర్మస్థితాః సదాచారాః పాండవా మమ వంశజాః. 47

దుఃఖం బహువిధం ప్రాప్తాస్తత్ర ధర్మస్య కా స్థితిః | అతో మే హృదయం తాత వేపతే%తీవ సంశ##యే. 48

కురు మే%సంశయం చేతః సమర్థో%సి మహామునే | త్రాహి సంసారవార్ధే స్త్వం జ్ఞానపోతేన మాం మునే. 49

మజ్జంతం చోత్పతంతం చ మగ్నం మోహజలావిలే. 50

ఆ శ్రీమహావిష్ణునియొకే పాద మాకాశముc అంతటను ప్రకాశించునది పరమము శాంతము విరజము విరాట్టునని మనీషులు వెల్లడింతురు. పూర్వవిదులు పురుషోత్తముడే విశ్వప్రభువని మనసార నమ్ముదురు. ఆ సర్వేశ్వరు డొక్కడేకాదని యనువారును గొందఱుగలరు. ఈ ప్రపంచ మూహింపరానిది. ఈ బ్రహ్మాండ మీశ్వరసృష్టి కాదు. ఇది అనీశ్వరమని వాదించువారును గొందఱు లేకపోలేదు. అదంతయు సన్మాత్రమే. ఇది అనీశ్వరము. ఇది సహజముగనే పరిణతి జెందుచుండును. పురుషు డకర్త. అన్నిటికి ప్రకృతియే కర్త్రియని యెలుగెత్తి చాటువారును గలరు. ఈ విధముగ వివ్వసృష్టిని గూర్చి సాంఖ్యులు కాపిలులు మున్నగువారలు తమ భిన్నభిన్నభావములు వ్యక్తీకరింతురు. కావున నా కెంతకు నంతుపట్టని సందియము లిట్టి వెన్నియో కల్గుచుండును. వ్యాసమునీంద్రా! సరియైన ధర్మాధర్మ వివక్ష చేయలేక నా చిత్తము శాంతిబాసి వికల్పములకు పాల్పడుచున్నది. ఇందేది ధర్మమో గుర్తించుటకు సాధ్యము గాకున్నది. ఎల్లదేవతలు సత్త్వగుణ సంపన్నులు సత్యధర్మనిష్ఠులునై యుందురు. ఇట్టి దేవతలే పాపాత్ములగు దానవుల చేతులలో బాధలు పడుచుందురు. ఇక ధర్మస్థితికి గతి యెక్కడిది? ధర్మపరులు సదాచారులు మా వంశజులగు పాండవులే పలువిధాల యిడుమలు పడిరి. ఓ మునీశ్వరా! ఇంక ధర్మమునకు తావెక్కడిది? కాన నిట్టి సంశయములతో నా మనస్సు నిరంతరముగ కలత జెందుచుండును. ఇట్టి నా చిత్తమందలి సంశయములను బాపుటకు నీవే కడు సమర్థుడవు. కాన మోహమను జలముతో కల్లోలితమగు సంసార సాగరమునందు మునుగుచు తేలుచున్న నన్ను నీ విజ్ఞాన నావచేత తరింపజేయుము.

ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమందు ప్రథమాధ్యాయము.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ%ష్ఠాదశ సాహస్య్రాం సంహితాయాం తృతీయస్కంధే జనమేజయప్రశ్నే ప్రథమో%ధ్యాయః.

Sri Devi Bhagavatam-1    Chapters