Sri Devi Bhagavatam-1    Chapters   

అథ అష్టమో%ధ్యాయః

బ్రహ్మోవాచ: సర్గో%యం కథితస్తాత! యత్పృష్టో%హం త్వయాధునా |

గుణానాం రూపసంస్థాంవై శృణుషై#్వకాగ్ర మానసః. 1

సత్వం ప్రీత్యాత్మకం జ్ఞేయం సుఖా త్ప్రీతిసముద్భవః | ఆర్జవంచ తతా సత్యం శౌచంశ్రద్ధా క్షమాధృతిః. 2

అనుకంపా తథాలజ్జా శాంతిఃసంతోష ఏవచ | ఏతైః సత్త్వప్రతీతిశ్చ జాయతే నిశ్చలాసదా.

3

శ్వేతవర్ణం తథాసత్త్వం ధర్మేప్రీతికరం సదా | సచ్ఛ్రద్ధోత్పాదజం నిత్య మసచ్ఛ్రద్ధా నివారకమ్‌. 4

సాత్త్వికీ రాజసీచైవ తామసీచ తథా%పరా | శ్రద్ధాతు త్రివిధాప్రోక్తా మునిభి స్తత్వదర్శిభిః. 5

రక్తవర్ణం రజఃప్రోక్త మప్రీతికర మద్భుతమ్‌ | అప్రీతిదుఃఖ యోగత్వా ద్భవత్యేవ సునిశ్చితా. 6

ప్రద్వేషో%థ తథా ద్రోహో మత్సరః స్తంభఏవచ | ఉత్కంఠాచ తథానిద్రా శ్రద్ధాతత్ర చ రాజసీ. 7

మానోమద స్తథాగర్వో రజసాకిల జాయతే | ప్రత్యేతవ్యం రజస్త్వేతై ర్లక్షణౖః. 8

కృష్ణవర్ణం తమఃప్రోక్తం మోహనంచ విషాదకృత్‌ | ఆలస్యంచ తథా%జ్ఞానం నిద్రాదైన్యం భయంతథా. 9

వివాదశ్చైవ కార్పణ్యం కౌటిల్యం రోషేవచ | వైషమ్యం చా%తినాస్తిక్యం పరదోషాను దర్శనమ్‌. 10

ప్రత్యేతవ్యం తమస్త్వేతై ర్ల క్షణౖః సర్వథా బుధైః తామస్యా శ్రద్ధయాయుక్తం పరతాపోప పాదకమ్‌. 11

సత్త్వం ప్రకాశయితవ్యం నియంతవ్యం రజః సదా | సంహర్తవ్యం తమః కామం జనేన శుభ మిచ్ఛతా. 12

ఎనిమిదవ అధ్యాయము

త్రిగుణ స్వరూప వివరణము

బ్రహ్మ యిట్లనియె: నారదా! ఈ ప్రకారముగ సృష్టి క్రమమును గుఱించి నీవడుగగా జెప్పితిని. ఇపుడు త్రిగుణముల స్వరూపమును వాని యవస్థలును వెల్లడింతును, ఏకాగ్ర మనస్కుడవై యాలకింపుము. సత్వము ప్రీత్యాత్మకమని యెఱుగుము. ఆర్జవము-సత్యము-శౌచము-శ్రద్ధ-క్షమ-ధైర్యము-దయ-లజ్జ-శాంతి-సంతోషము అనునవి సత్త్వగుణము యొక్క లక్షణములు. ఇది తెల్లని వర్ణము గలది. ఇది ధర్మమునందు ప్రీతిని సచ్ఛ్రద్ధను నివారించును. తత్వదర్శనులగు మునులీ శ్రద్ధను సత్వరజస్తమో భేదములచే ముత్తెఱంగుల బేర్కొనిరి. రజోగుణము రక్తవర్ణమున చెన్నొందును. ఇది దుఃఖ సంయోగమున గల్గును. ఇది అద్భుత శక్తి గలది. దుఃఖరూపమైనది. ఈ రజోగుణమునకు ప్రద్వేషము ద్రోహచింత మచ్చరము స్తంభముఉత్కంఠ నిద్ర అనునవి గల్గును. ఇది రాజసశ్రద్ధ. మదము-గర్వము ఇవి రజో గుణ లక్షణములు. తమోగుణమునల్లనివన్నె గలది. మోహము-విషాదము-అజ్ఞానము-ఆలస్యము-నిద్ర-ధైన్యము-భయము- వివాదము-కృపణత్వము కుటిలత్వము - వైషమ్యము - అతినాస్తికత - పరదోషదర్శనము వీటన్నిటిని బుధులు తమోలక్షనములుగ నెఱుగవలయును. ఈ తామసశ్రద్ధవలన తనకును పరులకును మనోవ్యథ గలుగును. తనకు శుభము గోరుకొను మనుజుడు సత్వగుణము ప్రకాశింపజేయవలయును. రజోగుణము నట్టడుగున నణచిపెట్ట వలయును. తమమును సంహరించవలయును.

అన్యోన్యాభిభవాచ్చైతే విరుధ్వంతి పరస్పరమ్‌ | తథా%న్యోన్యాశ్రయాః సర్వే నతిష్ఠంతి నిరాశ్రయాః. 13

సత్త్వం నకేవలం క్వాపి నరజో నతమస్తథా | మిళితాశ్చ సదాసర్వే తేనాన్యో న్యాశ్రయాఃస్మృతాః. 14

అన్యోన్యమిథునాశ్చైవ విస్తారం కథయామ్యహమ్‌ | శృణునారద యద్‌జ్ఞాత్వాముచ్యతే భవబంధనాత్‌. 15

సందేహో%త్రన కర్తవ్యో జ్ఞాత్వేత్యుక్తం మయావచః | జ్ఞాతంతదనుభూతం యత్పరిజ్ఞాతం ఫలేసతి. 16

శ్రవణా ద్దర్శనాచ్చైవ సపద్యేవ మహామతే ! సంస్కారాను భవాచ్చైవ పరిజ్ఞాతం న జాయతే. 17

శ్రుతం తీర్థం పవిత్రంచ శ్రోద్ధోత్పన్నా చ రాజసీ | నిర్గతస్తత్ర తీర్థేవై దృష్టంచైవ యథాశ్రుతమ్‌. 18

స్నాతస్తత్ర కృతంకృత్యం దత్తం దానంచ రాజసమ్‌ | స్థితస్తత్ర క్రియాత్కాలం రజోగుణ సమావృతః. 19

రాగద్వేషా న్ననిర్ముక్తః కామక్రోధ సమావృతః | పునరేవ గృహం ప్రాప్తౌ యథాపూర్వం తథాస్థితః. 20

శ్రుతంచ నాను భూతం వై తేన తీర్థం మునీశ్వర | నప్రాప్తంచ ఫలంయస్మా దశ్రుతం విద్ధినారద. 21

ఈ త్రిగుణములందు ప్రతిది రెండవదానిని గడ్డిపోచగ కించపరచుచు

వ్యతిరేకించుచుండును. ఐననునివి స్వతంత్రముగనుండక

పరస్పర మాశ్రయించుకొనియే యుండును. కేవలము సత్త్వముగాని రజముగాని తమముగాని నిలువజాలదు. ఇవెల్ల యెల్లవేళల కలిసి అన్యోన్యపూరకములై ముందునకు

సాగుచుండును. ఇవి పరస్పర సమ్మేళనమున తమకు తాము వ్యాపించియుండును. వీని వివరింతును వినుము. దానినెఱిగినచో భవబంధము తీరిపోవును. ఇదేదో నా మాటయే గదయని సందేహింపకుము. ఏదైన ఫలమనుభవమునకు వచ్చినప్పుడే దాని వాస్తవికత బట్టబయలగును. ఏదైననొక విషయము చూచుటవలనను వినికిడివలనను స్వానుభవమునను తెలియును. కానిదాని ఫలితమెఱుగనిచో నది వ్యర్థమేయగును. ఎట్లన నొకడొక పుణ్యతీర్థ కథ వినెను. కాని దాని ఫలితమతడు తెలిసికొనలేదు. అందువలన నతనిలో రాజసశ్రద్ధ పెచ్చు పెరిగెను. అతడేది వినెనో దానినే కనెను. తీర్థమందు స్నానమాడెను. రజోగుణముతో దానము లొసంగెను. అతడు కొంతకాలము రజోగుణముతో నచ్చటనే కడపెను. అతని యెడద రజోగుణఫలితముగ కామ క్రోధములతో కన్నుమిన్ను గానకుండెను. అతని గుండెలోని రాగద్వేషములా మంటలు గ్రక్కుచుండెను. అతడు తీర్థముగూర్చి వినెనుగాని దాని ఫలితము గూర్చి వినలేదు. కాన నతడు తీర్థ సంసేవన ఫలితమందలేదు. అతడు వినియు విననివాడేయయ్యెను. అతడనుభవశూన్యుడని యెఱుగము.

నిష్పాపత్వం ఫలంవిద్ధి తీర్థస్య మునిసత్తమ | కృషేః ఫలం యథాలోకే నిష్పన్నా న్నస్య భక్షణమ్‌. 22

పాపదేహ వికారాయే కామక్రోధాదయఃపరే | లోభో మోహ స్తథా తృష్ణా ద్వేషో రాగ స్తథా మదః. 23

అసూయేర్ష్యా%క్షమా%శాంతిః పాపాన్యేతాని నారద | ననిర్గతాని దేహాత్తు తావత్పావయుతో నరః. 24

కృతే తీర్థే య దైతాని దేహాన్న నిర్గతానిచేత్‌ | నిష్ఫలః శ్రమవివైకః కర్షకస్య యథాతథా.

25

శ్రమేణాపీడితం క్షేత్రం కృష్టా భూమిః సుదుర్ఘటా | ఉప్తంబీజం మహార్ఘంచ హితావృత్తి రుదాహృతా. 26

అహోరా తంపరిక్లిరక్షణార్థంఫలోత్సుకః | కాలే సుప్తస్తు హేమంతే వనేవ్యాఘ్రాది భి ర్భృశమ్‌. 27

భక్షితం శలభైః సర్వం నిరాశశ్చ కృతఃపునః | తద్వత్తీర్థ శ్రమఃపుత్ర కష్టదో నఫలప్రదః. 28

వ్యవసాయము చేసినందులకు ఫలితముగ లోకమున పుష్కలముగ నన్నము దొరకును. అటులే తీర్థసంసేవనకు ఫలముగ పాపనాశమగునని తెలిసికొనుము. ఈ దేహ వికారములగు కామక్రోధములు లోభమోహములు తృష్ణామదములు రాగద్వేషములు ఘోరపాతకములు అసూయ ఈర్ష్య అసహనము అశాంతి యనునవన్నియు పాప ఫలితములని తెలిసికొనుము. ఇవి యీ పాపిష్ఠతనువున గూడుకట్టుకొని పేరుకొని యుండును. వీనిమూలమున నరుడు పాపాత్ముడగును. ఆ నరుడెంతటి మహాపుణ్యతీర్థములో గ్రుంకినప్పటికి నీద్వంద్వ శత్రువులతని గుండెలో చోటుచేసికొని బయలువెడలకుండును. అపుడు జాగరూకత లేని కర్షకుని పగిది నతని శ్రమయంతయు వ్యర్థమగును. ఒక సేద్యగాడు పనికిమాలిన శ్రమయనుకొనక దుక్కిదున్ని పారవంతమొనర్చును. అతడందులో మేలైన విత్తనములు వేయును. ఈరీతిగ శ్రమించి వ్యవసాయము చేసిన కర్షకునకు మంచి ఫలము చేతికందును. ఇట్లాత డెక్కువ దిగుబడి నాశించి రేయింబవళ్లెండయనక వానయనక కష్టించి తన పొలమును కంటికిరెప్పగా జూచికొనును. కాని చలికాలమున పంటసిద్ధమైనపుడతడు నిదురించినచో పొలములో పులులుచేరి పంట చెఱచును. మిడుతలదండు వచ్చి పంట పొలమును తినివేయును. అపుడు రైతు హతాశుడై మిక్కిలిగ వగచును. అట్లే గుండెనిండ పాపరాసులు విషమువలె బాధలు పెట్టు చుండగ నెన్ని తీర్థములందు గ్రుంకిడిన నేమి ఫలితము? ఫలము సున్న; శ్రమ మిన్న.

సత్త్వం సముత్కటం జాతం ప్రవృద్ధం శాస్త్రదర్శనాత్‌ | వైరాగ్యం తత్ఫలంజాతం తామసార్థేషు నారద | 29

ప్రసహ్యాభి భవత్యేవ తద్రజస్త మసీ ఉభే | రజః సముత్కటం జాతం ప్రవృత్తం లోభయోగతః. 30

తత్త థా%భిభవత్యేవ తమఃస్సత్వే తథాఉభే | తమస్తథోత్కటం భూత్వా ప్రపృద్ధం మోహయోగతః. 31

తత్సత్త్వ రజసీచోభే సంగమ్యాభి భవత్యపి | విస్తరం కథయామ్యద్య యథా%భి భవతీతివై. 32

యదాసత్త్వం ప్రవృద్ధంవై మతిర్ధర్మే స్థితాతదా | నచింతయతి బాహ్యార్థం రజస్త మః సముద్భవమ్‌. 33

అర్థం సత్త్వసముద్భూతం గృహ్ణాతిచ నచాన్యథా | అనాయాసకృతం చార్థం ధర్మం యజ్ఞంచ వాంఛతి. 34

సాత్త్వికేష్వేవ భోగేషు కామంవై కురుతేతదా | రాజసేషు నమోక్షార్థీ తామ సేషు పునఃకుతః? 35

ఏవంజిత్వా రజఃపూర్వం తతశ్చ తమసోజయః | సత్త్వంచ కేవలం పుత్ర! తదాభవతి నిర్మలమ్‌. 36

యదారజః ప్రవృద్ధంవై త్యక్త్వా ధర్మాన్సనాతనాన్‌ | అన్యథా కురుతే ధర్మాన్‌ శ్రద్ధాం ప్రా ప్యతు రాజసీమ్‌. 37

రాజసా దర్థసంవృద్ధి స్తథా భోగస్తురాజసః | సత్త్వం వినిర్గతం తేన తమసశ్చాపి నిగ్రహః.

38

యదాతమో వివృద్ధం స్యా దుత్కటం సంబభూవహ | తదావేదే న విశ్వాసో ధర్మశాస్త్రే తథై వచ. 39

శ్రద్ధాంచ తామసీం ప్రాప్య కరోతిచ ధనాత్యయమ్‌ | ద్రోహం సర్వత్రకురుతే నశాంతి మధిగచ్ఛతి. 40

ఉత్తమ శాస్త్ర మెఱుగుటవలన సత్త్వము తేజరిల్లి వర్ధిల్లును. అపుడు తమము విరియును. వైరాగ్యము రూపుదాల్చిన బ్రహ్మజ్యోతిగ వెలుగొందును. ఇది సత్త్వగుణ ప్రకాశమునకు దృష్టాంతము ఇక రజస్తమస్సులు బలిమిని నరుని గుండెలో సులువుగచోటు చేసికొనును. ఈ రజము లోభముతో చేతులు గలిపి నాయంతవాడు లేడని మిట్టిపడును. అపుడా రజము సత్వతమోగుణముల రెంటిని మించి యెసంగును. తమస్సు ప్రమోహముతో బాసచేసి గ్రుడ్డి దగును. అది సత్త్వరజోగుణముల నతిక్రమించి మైమఱచియుండును. ఈ తమోగుణ ప్రాబల్యముగూర్చి విపులీకరింతును. వినుము: సత్వతేజమందు నెలకొన్నవాని కెల్లెడల నిర్మలసత్త్వమే వెలుగుబాట చూపుచుండును. అతడు సత్యధర్మమందే తన యమరజీవనము సాగించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సుభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. అతడు రజస్తమములవలన గలిగిన నురుగులవంటి యనర్థకర విషయములను కన్నెత్తియైన గాంచడు. సత్వతేజ ముదయింపగ నహంకారతమము వ్రీలిపోవును. ఇట్లు సత్త్వగుణ మెవనికి సులభముగ ప్రాపించునో యతడు దాని సాయమున సమచిత్తత్వము నలవరచుకొని ధార్మికయాగము లాచరించును. ఇట్టి పుణ్యాత్ము డెల్లవేళల సర్వసంగపరిత్యాగ ధర్మమును పాటించును. ఇతరుల సుఖదుఃఖములను తనవిగ భావించును. మోక్షార్థియైన సాత్త్వికుడు రజోగుణమునకు రాగిల్లడు. దానికి దాసుడుగాడు. అంధతమస్సులో నేల బాధపడును? ఓ పుత్రా! ఇట్లు తెలివిగలవాడు మొదట రజమును పిదప తమమును త్రోసిరాజన వలయును. అపుడు శుద్ధమగు సత్త్వ మొక్కటియే వెలుగొందును. ఎవనియందు రజోగుణము ప్రబలునో యతడు సనాతన ధర్మములకు స్వస్తి చెప్పును. రాజసశ్రద్ధతో దేహాత్మభ్రాంతితో నధర్మము లొనర్చుచుండును. ఎవ్వనిలో రజోగుణము ప్రబలరూపము దాల్చునో యత డనర్థములవంటి యర్థములను సమకూర్చుకొనును. భోగములకు బానిస యగును. అపుడతనినుండి సత్త్వప్రకాశము చెప్పక పారిపోవును. అతని గుండెనిండ తమములు ముసురును. ఎవని యందు తమోగుణము తీవ్రరూపము దాల్చునో యతనియందు వేదముల-ధర్మముల-విషయమున విశ్వాసము సమసిపోవును. అతడు తామసశ్రద్ధతోకూడి దురభ్యాసములకు లొంగిపోవును. ధనము నిష్టము వచ్చినట్లు దుర్వ్యయము చేయును. ఎల్లెడల ద్రోహచింత దల పెట్టును. అట్టి వాని కాత్మశాంతి కరవగును.

జిత్తాసత్త్వం రజశ్చైవ క్రోధనో దుర్మతిఃశఠః | వర్తతే కామచారేణ భావేషు వితతేషుచ. 41

ఏకంసత్త్వం నభవతి రజశ్చైకం తమస్తథా | సహైవాశ్రిత్య వర్తంతే గుణా మిథునధర్మిణః.

42

రజోవినా నసత్త్వంస్యా ద్రజఃసత్త్వం వినాక్వచిత్‌ | తమోవినా నచైవైతే వర్తంతే పురుషర్షభ

43

తమస్తాభ్యాం విహీనంతు కేవలం నకదాచన | సర్వే మిథునధర్మాణో గుణాః కార్యాంతరేషువై. 44

అన్యోన్య సంశ్రితాః సర్వేతిష్ఠంతి నవియోజితాః | అన్యోన్యజనకాశ్చైవ యతఃప్రసవ ధర్మిణః. 45

సత్త్వం కదాచిచ్చ రజస్త మసీ జనయత్యుత | కదాచిత్తురజస్సత్త్వ తమసీ జనయత్యపి. 46

కదాచిత్తుతమః సత్త్వరజసీ జనయత్యుభే | జనయంత్యేవ మన్యోన్యం మృత్పిండశ్చ ఘటంయథా. 47

బుద్ధిస్థా స్తేగుణాః కామా న్బోధయంతి పరస్పరమ్‌ | దేవదత్త విష్ణుమిత్ర యజ్ఞదత్తాదయో యథా. 48

యథాస్త్రీ పురుషశ్చైవ మిథునౌచ పరస్పరమ్‌ | తథాగుణాః సమాయాంతి యుగ్మభావం పరస్పరమ్‌. 49

రజసోమిథునే సత్త్వం సత్త్వస్య మిథునేరజః ఉభేతేసత్త్వ రజసీ తమసో మిథునేవిదుః. 50

నారదః!ఇత్యేతత్కథితంపిత్రా గుణరూపమనుత్తమమ్‌శ్రుత్వా% ప్యేతత్సఏవాహంతతో%పృచ్ఛంపితామహమ్‌ 51

ఇతి శ్రీదేవీ భాగవతే మహా పురాణ తృతీయస్కంధే%ష్టమో%ధ్యాయః.

క్రోధము ద్వేషము దుర్మతి శఠత్వముగల తామసుడు సత్త్వరజోగుణములను మంటగలిపి విషయలంపటుడై కామచారుడై తిరుగును. ఎక్కడను సత్త్వముగాని రజముగాని తమముగాని యొక్కటే నిలుకడజెంది యుండజాలదు. ఇవి యొండొంటితో గలిసి మిథునభావముగలవై జంటగ నుండును. సత్త్వమును బాసి రజము రజమునుబాసి సత్త్వము తమమును బాసి యీ రెంటిలో నే యొక్కటియు నెప్పుడును మనజాలవు. అట్లే తమ మీ రెంటినిబాసి యొంటిగ నిలువజాలదు. ఇవన్నియు మిథున ధర్మమున గలిసిననే తమ తమ కార్యప్రభావములు జూపగల్గును. ఈ త్రిగుణములు మూడు నొండొంటి నాశ్రయించుకొనియుండును. విడివిడిగ గడుపజాలవు. ఇవి పరస్పరముకూడి యొకటి రెండవ దానిని ప్రకటించుకొనుచుండును. ఒక్కొక్కప్పుడు సత్త్వమునుండి రజస్తమములు మరొకప్పుడు రజమునుండి సత్త్వతమములు గలుగుచుండును. మరొకప్పుడు తమమునుండి సత్త్వరజములు జనించును. మన్ను నుండి కుండ సిద్ధమగు చందముగ నివి పరస్పర మొకదానినుండి మరియొకటి పుట్టుచుండును. ఈ విధముగ త్రిగుణములును దేవదత్తుడు యజ్ఞదత్తుడు మున్నుగువారి బుద్ధి యందు సమావేశ##మై జంటలై యుండును. స్త్రీ పురుషులు పరస్పరము కలిసి మిథునధర్మమున లోకప్రవృత్తికి మూలమగునట్లే యీ గుణములు జంటలుగా నేర్పడి లోకప్రవర్తకము లగును. రజముతోగలిసి సత్వము సత్త్వముతోగలిసి రజము ఈ రెంటితోగలిసి తమమును జంటలు జంటలుగ వ్యవహరించునుండును. ఈ విధముగ నా తండ్రియగు బ్రహ్మత్రిగుణ స్వరూపములను తెల్లముగ వెల్లడించెను. అదంతయు విని నేను మరల నా తండ్రి నిట్లు ప్రశ్నించితిని:

ఇతి శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమం దెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters