Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్థో%ధ్యాయః

ఋషయ ఊచుః :

సౌమ్య వ్యాసస్య భార్యాయాం కస్యాం జాతః సుతః శుకః | కథం వా కీదృశో యేన పఠితేయం సుసంహితా 1

అయోనిజస్త్వయా ప్రోక్త స్తథా చారణిజః శుకః | సందేహో%స్తి మహాంస్తత్ర కథయాద్య మహామతే. 2

గర్భయోగీ శ్రుతః పూర్వం శుకో నామ మహాతపాః | కథం చ పఠితం తేన పురాణం బహువిస్తరమ్‌. 3

సూత ఉవాచ :

పురా సరస్వతీతీరే వ్యాసః సత్యవతీ సుతః | ఆశ్రమే కలవింకౌతు దృష్ట్యా విస్మయ మాగతః. 4

జాతామాత్రం శిశుం నీడే ముక్త మండా న్మనోహరమ్‌ | తామ్రాస్యం శుభ సర్వాంగం పిచ్ఛాంకుర వివర్జతమ్‌. 5

తౌ తు భక్ష్యార్థ మత్యంతం రతౌ శ్రమపరాయణౌ | శిశో శ్చంచూపుటే భక్ష్యం క్షిపంతౌ చ పునః పునః. 6

అంగే నాంగాని బాలస్య ఘర్షయంతౌ ముదాన్వితౌ | చుంబంతౌ చ ముఖం ప్రేవ్ణూ కలవింకౌ శిశోః శుభమ్‌. 7

వీక్ష్య ప్రేమాద్భుతం తత్ర బాలే చటకయో స్తదా | వ్యాస శ్చింతాతురః కామం మనసా సమచింతయత్‌. 8

తిరశ్చా మపి యత్ప్రేమ పుత్త్రే సమభిలక్ష్యతే | కిం చిత్రం య న్మనుష్యాణాం సేవాఫల మభీప్సతామ్‌. 9

కి మేతౌ చటకౌ చాస్య వివాహం సుఖసాధనమ్‌ | విరచ్య సుఖినౌ స్యాతాం దృష్ట్యా వధ్వా ముఖం శుభమ్‌. 10

నాలుగవ అధ్యాయము

శ్రీ వ్యాసమహర్షి పుత్త్ర సంతతికై పరితపించుట

ఋషు లిట్లనిరి: ఓ సౌమ్యా! ఈ పురాణసంహితను వ్యాసునివలన పఠించిన శుకుడెట్టివాడు? వ్యాసుని యే భార్యయందీతడు జన్మించెను. నీవు శుకు డయోనిజుడని యరణి సంజాతుడని వచించితివి. ఈ విషయమై మాకు సందియము గల్గుచున్నది. కనుక శుకుని జన్మవృత్తాంతము వివరించి మా సందేహము బాపుము. మహాతపస్వియగు శుకుడు గర్భయోగియని మేము వింటిమి. అత డీ విస్తృతమగు పురాణమెట్లు వినగలిగెను? సూతు డిట్లనియె: ఒకానొకప్పుడు సత్యవతి సుతుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీర మందొక యాశ్రమమున నివసించుచుండెను. అచ్చటనున్న రెండు గోరువంకలను చూచి వ్యాసుడు విస్మయమొందెను. ఆ పక్షులు గ్రుడ్డునుండి యప్పుడే వెడలిన తమ ఱక్కలురాని పిల్లను గూటిలోనే వదలినవి. దాని ముక్కెఱ్ఱగ నున్నది. దానికింకను తోక యీకలు రానేలేదు. అది యెంతయో చూడ ముచ్చట గొల్పుచున్నది. ఆ పిట్టల జంట తమ సంతానమునకు భక్ష్య మందించుట కాసక్తితో పూనుకొనెను. అవి తమ ముక్కుపుటములతో మెతుకులు దెచ్చి దెచ్చి తమ పిల్లనోటిలో మాటిమాటికి పెట్టుచుండెను. అవి తమ యంగములతో దాని యంగములు తాకుచు దాని యెఱ్ఱని ముద్దులు గారు మోమును పలుమారు ప్రేముడితో ముద్దిడుకొనుచు సంబరము పడుచుండెను. ఇట్లా పక్షులు రెండును తమబిడ్డపై చూపు ప్రేమను గని వ్యాసుడు చింతాతురుడై నెమ్మది నిట్లు తలపోయసాగెను: ఆహా! తిర్యగ్జంతువులు సైతము తమ పుత్త్రులపై గుండెనిండిన ప్రేమను గురియునుగదా! ఇంక సేవాఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో నిదియుండు ననుటలో వింత యేమున్నది? ఈ పక్షులు తమ పుత్త్రునకు సుఖసాధనమగు పెండ్లి జరిపి తమ కోడలి యందాల మోముగాంచి సంతసించునా?

అథవా వార్ధకే ప్రాప్తే పరిచర్యాం కరిష్యతి| పుత్రః పరమ ధర్మిష్ఠః పుణ్యార్థం కలవింకయోః. 11

అర్జయిత్వా%థవా ద్రవ్యం పితరౌ తర్పయిష్యతి | అథవా ప్రేతకార్యాణి కరిష్యతి యథావిధి. 12

అథవా కిం గయాశ్రాద్ధం గత్వా సంవితరిష్యతి | తిలోత్సర్గం చ విధివ త్ప్రకరిష్యతి బాలకః. 13

సంసారే%త్ర సమాఖ్యాతం సుఖానా ముత్తమం సుఖమ్‌ | పుత్రగాత్రపరిష్వంగో లాలనం చ విశేషతః. 14

అపుత్రస్య గతి ర్నాస్తి స్వర్గో నైవ చ నైవచ | పుత్రా దన్యతర న్నాస్తి పరలోకస్య సాధనమ్‌. 15

మన్వాదిభిశ్చ మునిభి ర్ధర్మశాస్త్రేషు భాషితమ్‌ | పుత్రవా న్స్వర్గ మాప్నోతి నా పుత్త్రస్తు కథంచన. 16

దృశ్యతే%త్ర సమక్షం త న్నానుమానేన సాధ్యతే | పుత్రవా న్ముచ్యతే పాపా దా ప్తవాక్యం చ శాశ్వతమ్‌. 17

ఆతురో మృత్యుకాలే%పి భూమిశయ్యాగతో నరః | కరోతి మనసా చింతాం దుఃఖితం పుత్రవర్జితః. 18

ధనం మే విపులం గేహే పాత్రాణి వివిధాని చ | మందిరం సుందరం చైత త్కో%స్య స్వామీ భవిష్యతి. 19

మృత్యుకాలే మనస్తస్య దుఃఖేన భ్రమతే యతః | అతో%స్య దుర్గతి ర్నూనం భ్రాంతిచిత్తస్య సర్వథా. 20

ఈ పక్షి శాబకము ధర్మమతితో పున్నెము బడయగోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలోబెట్టి పూజించి వారిని ప్రసన్నులను చేయజాలునా? డబ్బు గడించిన తన తల్లిదండ్రులను తృప్తిపఱచునా? అవి చనిపోవగా వానికిది యుత్తర క్రియలు నెరవేర్చునా? గయకేగి గయాశ్రాద్ధ మాచరించునా? తన పితరుల నుద్దేశించి సక్రమమున నీల వృషోత్సర్జనము జరుపునా? పుత్త్రునంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్త్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుటయే తల్లిదండ్రుల కీ ప్రపంచమం దుత్తమోత్తమ సుఖము సేకొనుటని పెద్దలు నొక్కి వక్కాణింతురు. పుత్త్రులు లేనివారికి సద్గతులు గలుగ నేరవు. స్వరము లభించదు. కనుక పరలోకము జేరుటకు పుత్త్రుల బడయుట కంటె వేరొండు సాధనము గనిపించదు. పుత్త్రవంతుడే స్వర్గసీమ నలంకరించగలడు. పుత్త్రహీనుడు దానిని జేరజాలడని ఎల్ల ధర్మశాస్త్రములయు మన్వాదిమునులయు వచనము. పుత్త్రవంతుడే సకల దురిత బంధములనుండి విముక్తుడగు ననుటకు శాశ్వతమైన యాప్తవచనమగు వేదమును సాక్ష్యముగ నున్నది. ఈ విషయము సందేహించుట కెంతమాత్రము వీలులేదు. చావు మొగముతో నున్నవాడు భూశయనము సేయబడియు తానపుత్త్రకుడగుటను గూర్చి చింతాకులుడై లోలోన వగచి వగచి కుమిలి కుమిలి యిట్లు పొగులు చుండును. ''నేడు నా యీ గృహము ధనధాన్య రాసులతో పెక్కు విధములగు పాత్ర పుంజములతో కలకల లాడుచున్నది. దీని కికముందు ఎవడు స్వామి కాగలడో గదా!'' అని యిట్టు లా పుత్త్రహీనుని మనస్సు దుఃఖమున పరిపరి విధముల పరిభ్రమించు చుండును. అత్తఱి నట్టి వ్యాకుల చిత్తునకు దుర్గతులు గా కింకేమి గల్గును!

ఏవం బహువిధాం చింతాం కృత్వా సత్యవతీసుతః | నిఃశ్వస్య బహుధా చోష్ణం విమనాః సంబభూవ హ. 21

విచార్య మనసా%త్యర్థం కృత్వా మనసి నిశ్చయమ్‌ | జగామ చ తప స్తప్తుం మేరుపర్వతసన్నిధౌ. 22

మనసా చింతయామాస కం దేవం సముపాస్మహే | వరప్రదాననిపుణం వాంఛితార్థప్రదం తథా. 23

విష్ణుం రుద్రం సురేంద్రం వా బ్రహ్మాణం వా దివాకరమ్‌ | గణశం కార్తికేయం చ పావకం వరుణం తథా. 24

ఏవం చింతయత స్తస్య నారదో మునిసత్తమః | యదృచ్ఛయా సమాయాతో వీణాపాణిః సమాహితః. 25

తం దృష్ట్యా పరమప్రీతో వ్యాసః సత్యవతీసుతః | కృత్వా%ర్ఘ్య మాసనం దత్వా పప్రచ్ఛ కుశలం మునిమ్‌. 26

శ్రుత్వాథ కుశలప్రశ్నం పప్రచ్ఛ మునిసత్తమః | చింతా తురో%సి కస్మా త్త్వం ద్వైపాయన! వదస్వ మే. 27

ఇటుల సత్యవతీ సుతు డనేక విధముల చింతించి వేడినిట్టూర్పులు నిగుడించెను. విమనస్కుడయ్యెను. వ్యాసుడట్లు కొంతతడవాలోచించి తుదకు మేరుగిరిపై నుగ్రతప మాచరించుటకు నెమ్మదిలో గట్టిగ నిశ్చయించుకొనెను. నే నిపు డేదేవత నుపాసించవలయును? వరములు గురియుటలో నే దేవత సమర్థురాలు? ఏ దేవి త్వరితగతిని వాంఛితార్థము లీడేర్చగలదు? అని వ్యాసుడు విత్కరించుకొనుచుండెను. శ్రీ గణపతి బ్రహ్మ విష్ణువు మహేశుడు రవి వరుణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్ని-వీరలలో నే నెవ్వరి నారాధించవలయును? అని వ్యాసుడు తలంచుచుండు నంతలోనే నిర్మలాత్ముడు మునిసత్తముడునగు నారదుడు చేత మహతిబూని యాదృచ్ఛికముగ నట కరుగుదెంచెను. అంత వ్యాస మహర్షి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై యతనిని గూర్చుండ నియోగించి అర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల మడిగెను. కుశల ప్రశ్నములైన పిమ్మట నారదుడు వ్యాసున కిట్లనియెను: ఓ ద్వైపాయనా! నీవేల చింతాకులుడవై కనిపించుచున్నావు? నాకంతయు వేగమే తెలుపుము.

వ్యాస ఉవాచ:

అపుత్త్రస్య గతి ర్నా స్తి న సుఖం మానసే తతః | తదర్థం దుఃఖిత శ్చాహం చింతయామి పునః పునః. 28

తపసా తోషయా మ్యద్య కం దేవం వాంఛితార్థదమ్‌ | ఇతి చింతాతురో%స్మ్యద్య త్వా మహం శరణం గతంః. 29

సర్వజ్ఞో%సి మహర్షే త్వం కథయా%%శు కృపానిధే | కందేవం శరణం యామి యో మే పుత్త్రం ప్రదాస్యతి. 30

సూత ఉవాచ:

ఇతి వ్యాసేన పృష్టస్తు నారదో వేదవి న్మునిః | ఉవాచ పరయా ప్రీత్యా కృష్ణం ప్రతి మహామనాః. 31

నారద ఉవాచ:

పారాశర్య మహాభాగ య త్త్వం పృచ్ఛసి మా మిహ | త మేవార్థం పురా పృష్టః పిత్రా మే మధుసూదనః. 32

ధ్యానస్థం చ హరిం దృష్ట్యా పితా మే విస్మయం గతంః | పర్యపృచ్ఛత దేవేశం శ్రీనాథం జగతః పతిమ్‌. 33

కౌస్తుభోద్భాసితం దివ్యం శంఖచక్రగదాధరమ్‌ | పీతాంబరం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసమ్‌. 34

శరణం సర్వలోకానాం దేవదేవం జగద్గురుమ్‌ | వాసుదేవం జగన్నాథం తప్యమానం మహ త్తపః. 35

బ్రహ్మోవాచ:

దేవదేవ జగన్నాథ భూతభవ్యభవత్ప్రభో | తప శ్చరసి కస్మా త్త్వం కిం ధ్యాయసి జనార్దన. 36

విస్మయో%యం మమాత్యర్థం త్వం సర్వజగతాం ప్రభుః | ధ్యానయుక్తో%సి దేవేశ కించ చిత్ర మతః పరమ్‌. 37

త్వన్నాభికమలా జ్జాతః కర్తా%హ మఖిలస్య హ | త్వత్తః కో%ప్యధికో%స్త్యత్ర తం దేవం బ్రూహి మాపతే. 38

జానామ్యహం జగన్నాథ త్వ మాదిః సర్వకారణమ్‌ | కర్తా పాలయితా హర్తా సమర్థః సర్వ కార్యకృత్‌. 39

ఇచ్ఛయా తే మహారాజ సృజామ్యహ మిదం జగత్‌ | హరః సంహరతే కాలే సో%పి తే వచనే సదా. 40

సూర్యో భ్రమతి చాకాశే వాయు ర్వాతి శుభాశుభః | అగ్ని స్తపతి పర్జన్యో వర్షతీశ త్వదాజ్ఞయా. 41

త్వం తు ధ్యాయసి కం దేవం సంశయో%యం మహా న్మయ| త్వత్తః పరం న పశ్యామి దేవం వై భువనత్రయే. 42

కృపాం కృత్వా వదస్వాద్య భక్తో%స్మి తవ సువ్రత | మహతాం నైవ గోప్యం హి ప్రాయః కించి దితి స్మృతిః. 43

వ్యాసుడిట్లనెను: సంతానము లేనివానికి సద్గతులు గలుగవు. వాని యాత్మకు శాంతియును గలుగదు. అందులకే నేనును చింతించుచు పలుమారు విలపించుచున్నాను. సంతతి బడయుటకు నే నేదేవతను ప్రసన్ననుగా చేసికొనవలయును? సకలార్థము లొసగు దేవి యెవ్వరనునది తెలియక విచారించుచున్నాను. ఆ విషయము తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను. మహర్షీ! నీవు దయగలవాడవు. సర్వజ్ఞుడవు. నే నేదేవతను శరణువేడిన ఆమె సుప్రసన్నయై త్వరగ నాకు పుత్రుని ప్రసాదించగలదో తెలుపుము. సూతుడిట్లనియె: అటుల వ్యాసుడడుగగా వేదవిదుడు నారదుడు పరమప్రీతితో నతని కీ ప్రకారముగ సమాధానము నొసగెను. నారదు డనియె: ఓ మహాభాగా! పారాశర్యా! నీవు నన్నడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ తొల్లి మధుసూదను నడిగెను. నా తండ్రియగు బ్రహ్మ ధ్యానమున మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశుడునగు శ్రీహరిని సందర్శించి విస్మయమంది యతని నుతించుచు నిట్లనియెను. ఆ హరి చతుర్భుజుడు. శంఖ చక్ర గదా పద్మధరుడు. పీతాంబరుడు. కౌస్తుభ మణి ప్రభలు దీపిల్లువాడు. దివ్య శ్రీవత్సాంకితమైన వెడదఱొమ్మువాడు. సకలలోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడునగు శ్రీహరియు తపమొనర్చుచుండగా జూచి యతనిని నా తండ్రి శరణు వేడెను. బ్రహ్మ యిట్లనెను: ఓ జగన్నాథా! నీవు దేవేశుడవు. భూత భావి వర్తమానములపై నధికారముగల ప్రభువవు. నీవేరిని గూర్చి తపించుచున్నావు? ఏ పరతత్త్వమును ధ్యానించుచున్నావు ? అఖిల జగత్ప్రభుడవగు నీవే ధ్యానము చేయుచున్నావే. దీనిని మించిన యాశ్చర్యకర మేమున్నది? నాకిదంతయు వింతగ దోచుచున్నది. నీ బొడ్డుతమ్మినుండి పుట్టిన నేనే యీ విశ్వమునకు సృష్టికర్తను. ఇంక నీకంటె నధికుడెవడైన నున్నచో వానిని గూర్చి నాకు తెలుపుము. నీవే యీ లోకముల కన్నిటికిని కర్తవు భర్తవు హర్తవు. సర్వకారణములకు నీవు మూలకందము. సర్వ కార్యదక్షుడవు నీవే యని నేను బాగుగ నెఱుగుదును. నీ సంకల్ప బలముననే నే నీ జగములు రచింప శక్తుడనైతిని. ఆ హరుడును లయకాలమున నీ కోరికమేరకే లోకములనెల్ల సమయింపజాలును. నీ యాజ్ఞ చేతనే నింగిపై వేవెలుగు భ్రమించుచున్నాడు. వాయువు చల్లగా వెచ్చగా వీచును. అగ్ని ప్రజ్వలించును. మేఘము వర్షించును. నిన్ను మించిన పరదైవతమును నేనీ ముల్లోకములందింతకు ముందు చూచి యెఱుగను. అట్టి నీవును ధ్యానమున నుండుట జూడగ నాకు గొప్ప సందియము గలుగుచున్నది. నేను నీకు పరమ భక్తుడను. నాపై దయదలచి నాకంతయును తేటతెల్లముగ దెలుపుము. మహాత్ములకు తఱచుగ తెలుపరాని రహస్యములుండవని స్మృతి పలుకును.

తచ్ఛ్రుత్వా వచనం తస్య హరి రాహ ప్రజాపతిమ్‌ | శృణుషై#్వకమనా బ్రహ్మం స్త్వాం బ్రవీమి మనోగతమ్‌. 44

యద్యపి త్వాం శివం మాం చ స్థితిసృష్ట్యంతకారణమ్‌ | తే జానంతి జనాః సర్వే సదేవాసురమానుషాః. 45

స్రష్టా త్వం పాలకశ్చా%హం హరః సంహారకారకః | కృతాః శ##క్త్యేతి సంతర్కః క్రియతే వేదపారగైః. 46

జగత్సంజననే శక్తి స్త్వయి తిష్ఠతి రాజసీ | సాత్త్వికీ మయి రుద్రే చ తామసీ పరికీర్తితా. 47

అను బ్రహ్మ వినయవాక్కులు విని హరి యతనికిట్లు పలికెను: వత్సా! ఏకాగ్ర చిత్తమున నాలకింపుము. నా మనోగతమును వెల్లడించుచున్నాను. నీవీ యెల్లలోకములను పుట్టించువాడవని నేను పోషకుడనని రుద్రుడు సంహారకుడని నీవు దలంచుచున్నావు. సకల సురాసురులు మనుజులు నట్లే తలంతురు. నీవీ యెల్ల భువనములు పుట్టించుటకును నేను పెంచుటకును హరుడు ద్రుంచుటకును కారకులము. ఐనను వేదపారగులగు మహాశయులీ సర్వ మొకేమూలప్రకృతి - పరాశక్తి - మూలమున జరుగుచున్నదని భావింతురు. ఈ లోకములెల్ల పుట్టించుటకు నీయందు రాజసశక్తియు పెంచుటకు నాలోన సత్త్వశక్తియు త్రుంచుటకు హరునియందు తామస శక్తియు గలదని శాస్త్రమున చెప్పబడియున్నది.

తయా విరహిత స్త్వం న తత్కర్మకరణ ప్రభుః | నాహం పాలయితుం శక్తిః సంహర్తుం నాపి శంకరః. 48

తదధీనా వయం సర్వే వర్తామః సతతం విభో | ప్రత్యక్షే చ పరోక్షే చ దృష్టాంతం శృణు సువ్రత. 49

శేషే స్వపిమి పర్యంకే పరతం తోన సంశయః | తదధీనః సదోత్తిష్ఠే కాలే కాలవశం గతః. 50

తప శ్చరామి సతతం తదధీశో%స్మ్యహం సదా | కదాచి త్సహ లక్ష్మ్యా చ విహరామి యథా సుఖమ్‌. 51

కదాచి ద్దానవైః సార్థం సంగ్రామం ప్రకరో మ్యహమ్‌ | దారుణం దేహదమనం సర్వలోకభయంకరమ్‌. 52

ప్రత్యక్షం తవ ధర్మజ్ఞ తస్మి న్నే కార్ణవే పురా | పంచవర్షసహప్రాణి బాహుయుద్ధం మయా కృతమ్‌. 53

తౌ కర్ణమలజౌ దుష్టౌ దానవౌ మదగర్వితౌ | దేవ దేవ్యాః ప్రసాదేన నిహతౌ మధుకైటభౌ. 54

తదా త్వయా న కిం జ్ఞాతం కారణం తు పరాత్పరమ్‌ | శక్తిరూపం మహాభాగ కిం పృచ్ఛసి పునఃపునః. 55

యదిచ్చాపురుషో భూత్వా విచరామి మహార్లవే | కచ్చపః కోలసింహౌ చ వామనశ్చ యుగేయుగే. 56

న కస్యాపి ప్రియో లోకే తిర్యగ్యోనిషు సంభవః | నా%భవం స్వేచ్ఛయా వామ వరాహాదిషు యోనిషు. 57

విహాయ లక్ష్మ్యా సహ సంవిహారం | కో యాతి మత్య్సాదిషు హీనయోనిషు |

శయ్యాం చ ముక్త్వా గరుడాసనస్థః | కరోతి యుద్ధం విపులం స్వతంత్రః 58

పురా పురస్తే%జశిరో మదీయం | గతం ధను ర్జ్యాస్ఖలనా త్క్వ చాపి |

త్వయా తదా వాజిశిరో గృహీత్వా | సంయోజితం శిల్పివరేణ భూయః. 59

హయాననో%హం పరికీర్తితశ్చ | ప్రత్యక్ష మేత త్తవ లోకకర్తః |

విడంబనేయం కిల లోకమధ్యే కథం భ##వే దాత్మపరోయది స్యామ్‌. 60

తస్మా న్నా హం స్వతంత్రోస్మి శక్త్యధీనో%స్మి సర్వథా | తా మేవ శక్తిం సతతం ధ్యాయామి చ నిరంతరమ్‌. 61

నాతః పరతరం కించి జ్ఞానామి కమలోద్భవ |

నారద ఉవాచ:

ఇత్యుక్తం విష్ణునా తేన పద్మయోనేస్తు సన్నిధౌ. 62

తేన చాప్యహ ముక్తోస్మి తథైవ మునిపుంగవ | తస్మా త్త్వమపి కల్యాణ పురుషార్థాప్తిహేతవే. 63

అసంశయంహృదంభోజే భజ దేవీపదాంబుజమ్‌ | సర్వం దాస్యతి సా దేవీ యద్య దిష్టం భ##వే త్తవ. 64

సూత ఉవాచ:

నారదే నైవ ముక్తస్తు వ్యాసః సత్యవతీసుతః | దేవీపాదాబ్జనిష్ణాత స్తపసే ప్రయ¸° గిరౌ. 65

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే చతుర్థో%ధ్యాయః.

ఆ మహత్తరశక్తియే లోపించినచో నీవు సృష్టి కృత్యమును జేయజాలవు. నేను పరిరక్షింపనోపను. హరుడు దెగటార్ప నశక్తుడు. మనమెల్లరమా దివ్యపరశక్తికి పరతంత్రులమై వర్తింతుము. దీనినిగూర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములును గలవు, వినుము. నేను ప్రళయకాలమునందు పరతంత్రుడనై శేషశయ్యపై యోగనిద్రంజెందుదును. మరల కాలవశుండనై తగిన సమయము వచ్చినపుడు మేల్కాంతును. ఆ దేవికి వశుడనై నే నెల్లకాలమును తపమాచరించుచుందును. ఒక్కొక్కప్పుడు శ్రీ లక్ష్మితోడ యథా సుఖముగ విహార మొనర్చుచుందును. ఒక్కొక్కతఱి క్రూరదానవులతో దారుణము సర్వలోకభీకరమునై దేహములను నింద్రియములను బాధించు సమరము జరుపుదును. మున్ను నేను మహాజలరాశిపై నైదు వేలేండ్లు ఘోర బాహుయుద్ధము సలిపితిని. అది నీకు ప్రత్యక్ష విదితమేగద! నా చెవులమలమునుండి పుట్టి మదమున విఱ్ఱవీగిన మధుకైటభులను దుష్టదానవులా దేవదేవి దయవలననే నాచే దనుమబడిరి. ఆనాటి నా విజయశ్రీకి కారణము నీ వెఱుంగవా? ఓ మహాభాగా! ఆ పరాత్పర శక్తియే దానికి మూలకారణము. అట్టి శక్తిగూర్చి పదేపదే ఏల యడుగుదువు? ఆమె ఇచ్ఛ చేతనే నేను మొదట మణి ద్వీపమున స్త్రీరూపమునుండి అనంతరము సముద్రమున పుం రూపమున విష్ణుడనై విహరించుచున్నాను. ఆ తల్లి దయవలననే గదా యుగయుగమున కూర్మ వరాహ నరసింహాద్యవతారములు దాల్చుచుందును. ఈ తిర్యగ్యోనులందు పుట్టుట కెవ్వడిచ్చగించును? నాకే స్వేచ్ఛయున్నచో వరాహాది యోనులందు నేనేల జన్మింతును? లక్ష్మితోడి వినోదవిహారములు వదలి చేప మున్నగు నీచయోనులందు బుట్టుట కెవ్వనికి మనసొప్పును? పాపఱని సెజ్జవదలి గరుటామంతుని మూపుపైనెక్కి స్వతంత్రేచ్ఛతో ఏవాడు బవరమొనర్ప నుత్సహించును? మునుపొకప్పుడు నీవు చూచుచుండగనే వింటి యల్లెత్రాటిచేత నా తల తెగిపడినదిగదా! శిల్పనిపుణుడగు త్వష్ట వెనువెంటనే గుఱ్ఱముతలదెచ్చి నా మొండెమున కతికించెను. ఆనాటి నుండి నన్ను హయగ్రీవుడనుచున్నారు. ఇదంతయును లోకవిడంబనమేసుమా! నా కాత్మ స్వాతంత్య్రమే యున్నచో నిట్లెట్లు జరుగును? కాన నేను స్వతంత్రుడనుగాను. సర్వవిధముల శక్తి పరతంత్రుడను. అందుచేత నేనా శక్తినే రేయింబవళ్లెడతెగక ధ్యానించుచుందును. ఇంతకుమించి నాకేమియు తెలియదు. నారదుడిట్లనియె: ఈ ప్రకారముగ విష్ణువు బ్రహ్మతో బలికెను. ఓ వ్యాసమునీ! నేనా బ్రహ్మవలన సర్వము వింటిని. కనుక నీవును నిత్యకల్యాణ ప్రదమగు పురుషార్థ ప్రాప్తికి బూనుకొని ఆ దేవీ పదకమలములను నీ హృదయారవిందమున నిరంతరము భజింపుము. నీవు కోరినదెల్ల ఆ తల్లియే ప్రసాదించుచుండును. ఇందు సందియ మావంతయును లేదు. సూతు డిట్లనియె: నారదుడీవిధముగ దెలుపగా వ్యాసుడా దేవి దివ్యచరణారవిందములను లోనిడెందమున దలంచుచు తపము చేయుటకు పర్వతము జేరెను.

ఇది శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందలి చతుర్థాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters