Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

లోమశ: నవేదాధ్యయనం కించి జ్ఞానాతి నజపం తథా | ధ్యానంన దేవతానాంచ నచైవారాధనం తథా. 1

నాసనం వేదవిప్రో%సౌ ప్రాణాయామం తథా పునః | ప్రత్యాహారం తు నోవేద భూతశుద్ధిం చ కారణమ్‌. 2

నమంత్రం కీలకం జాప్యం గాయత్రీంచ నవేదసః | శౌచంస్నాన విధించైవ తథా%%చమనకం పునః. 3

ప్రాణాగ్నిహోత్రే నోవేద బలిదానం నచాతిథిమ్‌ | నసంధ్యాం సమిధో హోమం వివేదచ తథామునిః. 4

సో%కరో త్ప్రాతరుత్థాయ యత్కించి ద్దంతధావనమ్‌ | స్నానంచ శూద్రవత్తత్ర గంగాయాం మంత్రవర్జితమ్‌. 5

ఫలాన్యాదాయ వన్యాని మధ్యాహ్నే%పి యదృచ్ఛయా | భక్ష్యాభక్ష్య పరిజ్ఞానం నజానాతి శఠ స్తథా. 6

సత్యంబ్రూతే స్థితస్తిత్ర నానృతం వదతే పునః | జనైఃసత్య తపానామ కృతమస్య ద్విజస్యవై. 7

నాహితం కస్యచి త్కుర్యా న్నతథా%విహితం క్వచిత్‌ | సుఖం స్వపితి తత్రైవ నిర్భయ శ్చింతయ న్నితి. 8

పదునొకండవ అధ్యాయము

వాగ్బీజ ప్రభావమున సత్యవ్రతుడు సిద్ధినందుట

లోమశుడిట్లనెను : ఆ యుతథ్యుడు వేదాధ్యయనముగాని జపధ్యానములుగాని దేవతార్చనగాని యెఱుగడు. నియమాసనములు ప్రాణాయామ ప్రత్యాహారములు భూతశుద్ధి విధానములు నెఱుంగడు. మంత్రకీలక జపములుగాని శ్రీగాయత్రి గాని శుచిత్వముగాని స్నానవిధిగాని యాచమనాదులుగాని ఆతనికి తెలియవు. ప్రాణాగ్ని హోత్రమున బలిదానము అతిథిసత్కారము సంధ్యోపాసన సమిద్ధోమములు మున్నగువాని గూర్చి బొత్తుగ తెలియదు. అతడు మాత్రము ప్రతి దినము నుదయ కాలమందు మేల్కాంచి పండ్లు తోముకొని శూద్రునివలె స్నానమంత్రము చెప్పకయే గంగలో మునుగుచుండును. ఆ శఠద్విజుడు పట్టపగలు స్వేచ్ఛగ వనమందేగి తినదగినవనిగాని కూడనివనిగాని తలంపక కొన్నిపండ్లు దెచ్చుకొని తినుచుండును. ఆ బాపడు నిత్యము సత్యమే పలుకును. అసత్య మాడకుండుటవలన లోకు లతనికి సత్య తపుడను పేరిడిరి. ఆత డెవ్వరికి గాని హితాహితము లొనర్పక నిర్భయముగ నిశ్చింతగ నేదియో లోన జింతించుచు సుఖనిద్ర చెందుచుండును.

కదామే మరణంభావి దుఃఖం జీవామి కాననే | జీవితం ధిశ్చ మూర్ఖస్య తరసా మరణం ధ్రువమ్‌. 9

దైవేనాహం కృతోమూర్ఖో నాన్యో%త్ర కారణంమమ | ప్రాప్యచైవోత్తమం జన్మ వృథాజాతం మమాధునా. 10

యథా వంధ్యా సురూపాచ యథావా నిష్ఫలోద్రుమః | అదుగ్ధదోహా ధేనుశ్చ తథా%హం నిష్ఫలఃకృత. 11

కింనునిందా మ్యహందైవం నూనంకర్మ మమేదృశమ్‌ | నదత్తం పుస్తకం కృత్వా బ్రాహ్మణాయ మహాత్మనే. 12

నవై విద్యా మయాదత్తా పూర్వజన్మని నిర్మలా | తేనాహం కర్మయోగేన శఠో%స్మి చ ద్విజాధమః. 13

నచతీర్థే తపస్తప్తం సేవితో నచ మాధవః | నద్విజాః పూజితా ద్రవ్యై స్తేన జాతో%స్మి దుష్ఠధీః. 14

వర్తంతే మునిపుత్త్రాశ్చ వేదశాస్త్రార్థ పారగాః | అహం సమూఢః సంజాతో దైవయోగేన కేవచిత్‌. 15

నజానామి తపస్తప్తుం కింకరోమి సుసాధనమ్‌ | మిథ్యా%యం మే%త్ర సంకల్పో నమేభాగ్యం శుభంకిల. 16

దైవమేవ పరంమన్యే ధిక్పౌరుష మనర్థకమ్‌ | వృథాశ్రమ కృతంకార్యం దైవాద్భవతి సర్వథా. 17

బ్రహ్మా విష్ణుశ్చరుద్రశ్చ శక్రాద్యాః కిల దేవతాః | కాలస్య వశగాః సర్వే కాలోహి దురతిక్రమః. 18

నాకు చావెప్పుడు మూడునో కద! ఈ యడవిలోబడి జీవిత మతి కష్టమున వెళ్ళబుచ్చవలసివచ్చినది. అయ్యో! మూర్ఖుని జీవితము లోకమున నెంతయు పనికి మాలినదే! దీనికంటె చావే నయము. నా దైవమే నన్ను మూర్ఖునిగ జేసినది. అంతేకాని మరింకేదియు దీనికి కారణముగాదు. నే నుత్తమజన్మమెత్తియు వట్టి వ్యర్థుడనై పోతిని గదా! అందాలు విరజిమ్ము గొడ్రాలు ఫలములులేని చెట్టు పాలులేని యావు నెట్లో నేను నట్లే యెందులకును పనికిమాలినవాడనై పోతినే! నన్ను బుట్టించిన దేవుని నిందించి ఫలమేమి? నే చేసికొన్న కర్మ కేడువవలయును. నే నెన్నడైన నొక బ్రాహ్మణునకైన నొక పుస్తకము దాన మీయలేదేమో! నా తొంటి పుట్టువులో నా వెంటబడు విద్యార్థులకు బ్రహ్మవిద్య ధారపోయనైతినొక్కో! ఆ దుష్కర్మయోగమున నే నిపుడీ నికృష్టజన్మ మనుభవించుచున్నాను. పూర్వము నేను పుణ్యతీర్థములందు తపము సేయలేదేమో? సాధులను సేవింపలేదో? ద్విజులను ద్రవ్యములతో బూజింపలేదో? దాని ఫలితముగనే యిపుడీ దుష్టబుద్ధితో బుట్టితినేమో! పెక్కురు నాతోడి మునికుమారులు వేదశాస్త్ర పారగులై యున్నారు. ఏదో తెలియని దైవయోగమున నా కర్మకాలి నే నిట్లు మూఢుడనై పడియున్నాను. నాకు జపతపములు తెలియవు. సాధన లొనర్చు టంతకంటె తెలియదు. నా సంకల్పములన్నియు మిథ్యలు-గాలిమూటలు- తీరనివి. నా యదృష్టము తలక్రిందైనది. మానవున కెంత పౌరుషమున్న నంతయు నిరర్థకము. కార్య పరిశ్రమయు వ్యర్థము. అన్నిటికి దైవబలమే పరమార్థము. అన్నియు దైవమువలననే నెరవేరును. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రాది దేవతలు నఖండమైన కాలమునకు కట్టుబడినవారే. కాల మె వారికిని దురతిక్రమణీయము. విచిత్రము.

ఏవంవిధా న్వితర్కాంస్తు కుర్వాణో%హర్నిశం ద్విజః | స్థితస్తత్రాశ్రమే తీరే జాహ్నవ్యాః పావనే స్థలే. 19

విరక్తః సతు సంజాత స్థిత స్తత్రాశ్రమే ద్విజః | కాలాతివాహనం శాంత శ్చకార విజనే వనే.

20

ఏవం స్థితస్యతు వనే విషులోదకేవై వర్షాణి తత్ర నవపపంచ గతానికామమ్‌ |

నారాధనం నచజపం సవివేద మంత్రమ్‌ కాలాతివాహన మసౌ కృతవాన్వనేవై. 21

జానాతి తస్యవితతం వ్రతమేవ లోకః సత్యంవదత్యపి మునిఃకిల నామజాతమ్‌ |

జాతంయశశ్చ సకలేషు జనేషు కామమ్‌ సత్యవ్రతో%య మనిశం నమృషా%భిభాషీ. 22

తత్రైకదాతు మృగయాం రమమాణవ ప్రాప్తో నిషాదనిశఠో ధృతచాపబాణః |

క్రీడన్వనే%తి విపులే యమతుల్యదేహః క్రూరాకృతి ర్హననకర్మణి చాతిదక్షః. 23

తేనాతికృష్టేన శ##రేణవిద్ధః కోలఃకిరాతేనధనుర్ధరేణ |

పలాయమానో భయవిహ్వలశ్చమునేఃసమీపంవిద్రుతోజగామ. 24

వికంపమానో రుధిరార్ద్రదేహో యదాజగా మాశ్రమమండలంవై |

కోలస్తదా%తీవ దయార్ద్రభావం ప్రాప్తోమునిస్తత్ర సమీక్ష్యదీనమ్‌. 25

అగ్రేవ్రజంతం రుధిరార్ద్రదేహం దృష్ట్వామునిః సూకరమాశువిద్ధమ్‌ |

దయాభివేశా దతికంపమానః సారస్వతం బీజమథోచ్చచార. 26

అజ్ఞాతపూర్వం చతథా%శ్రుతంచ దైవాన్ముఖే వైసముపాగతంచ |

నజ్ఞాతవా న్బీజమసౌ విమూఢో మమజ్జశోఖే సమునిర్మహాత్మా. 27

కోలఃప్రవిశ్యా%%శ్రమ మండలంత ద్గతో నికుంజే ప్రవిలీయగూఢమ్‌ |

ఆప్రాప్తమార్గో దృఢనిర్విణ్ణచేతాః ప్రవేపమానః శరపీడితత్వాత్‌. 28

ఇట్లతడు రేయింబవళ్లు తనలోతాను వితర్కరించుకొనుచు పావన గంగాతటమున కాలము గడపుచుండెను. ఒంటరిగనుండి విరక్తుడై జీవితమును పరమశాంతముగ సాగించుచుండెను. ఇట్లతడు జపమంత్రార్చనల విధాన మెఱుంగక నదీతీరమున వసించుచుండగ పదునైదేడులు నాగిపోయెను. నిత్యము సత్యమే పలుకుచు పొరపాటుననైన నసత్యము బల్కి యెఱుగనందున నతనికి సత్యతపుడను నామము సార్థకమై ఆతని కీరితి నేల నాల్గుచెఱగుల వ్యాపించెను. అంత నొక్కనాడొక బోయవాడు విల్లమ్ములుదాల్చి వేట తమకమున నచ్చటి కేతెంచెను. అతడు యమునివలె భీకరాకారుడు. మహాక్రూరుడు; శఠుడు; ప్రాణాలు బలిగొనుటలో వెనుకాడనివాడు. ఆ కిరాతుడు వింట బాణమును సంధించి యొక పందిని గొట్టెను. అది గడగడలాడుచు ప్రాణాలమీది తీపితో మునిచెంతకు పరుగెత్తెను. నెత్తుటదోగాడు తనువుతో కంపించుచు నాశ్రమ సమీపమున జేరిన దాని దీనస్థితి గనగనే ముని గుండె దయతో నిండెను. అట్లు తన యెదుట నెత్తుట దడిసిన పంది పరుగెత్తుటగాంచి ముని బాలుడు దయాంతరంగితాంతరంగుడై సారస్వత బీజమగు ''ఐ'' కారముతో దాని నదల్చెను. అతడంతకుముందా బీజము వినలేదు. తెలిసికొనలేదు. అది యిప్పుడతని నోటి వెంట దైవయోగమున వెలువడెను కాని, ఆ పంది దైన్యమునకాముని మిక్కిలి బాధపడెను. ఆ పంది కిరాతుని బాణపు దెబ్బకు తాళ##లేక వడకుచు రొప్పుచు మూల్గుచు నెవ్వరును చొరలేని యాశ్రమపు పొదరింట దూరెను.

తతఃక్షణా దాకరనాంతకృష్టం చాపందధానో%తి కరాళ##దేహః |

ప్రాప్తస్తదంతే సచమృగ్యమాణో నిషాదరాజః కిలకాలఏవ. 29

దృష్ట్వామునిం తత్రకుశాసనేస్థితం నామ్నాతు సత్యవ్రత మద్వితీయమ్‌ |

వ్యాధః ప్రణమ్య ప్రముఖే స్థితో%సౌ పప్రచ్ఛకోలః క్వగతోద్విజేశ. 30

జానామితే%హం సువ్రతంప్రసిద్ధం తేనాద్య పృచ్ఛే మమ బాణవిద్ధః |

క్షుధార్దితంమే సకలంకుటుంబమ్‌ బిభర్తుకామః కిలఆగతో%స్మి. 31

వృత్తిర్మమైషా విహితావిధాత్రా నాన్యా%స్తి విప్రేంద్ర ఋతంబ్రవీమి |

భర్తవ్యమేవేహ కుటుంబమంజసా కేనాప్యుపాయేన శుభాశుభేన. 32

సత్యంబ్రవీత్వద్య సత్యవ్రతో%సి క్షుధాతురో వర్తతేపోష్య వర్గః

క్వాసౌగగతం సూకరోబాణవిద్ధః పృచ్ఛామ్యహం బాడబ బ్రూహితూర్ణమ్‌. 33

తేనేతిపృష్టః సమునిర్మహాత్మా వితర్కమగ్నః ప్రబభూవకామమ్‌ |

సత్యవ్రతంమే%ద్య భ##వేన్న భగ్నమ్‌ నదృష్టఇ త్యుచ్చరితేన కింవై. 34

గతో%త్ర కోలఃశరవిద్ధదేహః కథంబ్రవీమ్యద్య మృషా%మృషావా |

క్షుధార్థితో%యం పరిపృచ్ఛతీవ దృష్ట్వాహనిష్య త్యపిసూకరంవై. 35

సత్యం నసత్యం ఖలుయత్రహింసా దయాన్వితం చానృతమేవసత్యమ్‌ |

హితంనరాణాం భవతీహయేన తదేవసత్యం నతథా%న్యథైవ. 36

హితంకథంస్యా దుభయోర్విరుద్ధయో స్తదుత్తరం కింనయథా మృషావచః |

విచారయన్బాడబధర్మసంకటే నప్రాపవక్తుంవచనం యథోచితమ్‌. 37

బాణాహతం వీక్షదయాన్వితంచ కోలంతదంతే సముదాహృతంవచః |

తేనప్రసన్నా నిజబీజతఃశివా విద్యాందురాపాం ప్రదదౌచతసై#్మ. 38

బీజోచ్చారణతో దేవ్యావిద్యా ప్రస్ఫురితా%భిలా |

వాల్మీ కేశ్చ యథాపూర్వం తథాస హ్యభవత్కవిః. 39

ఆ బోయ రెండవ యమునివలె భీకరదేహముతో నారి సారించుచు పందిని వెదకుచు మునిచెంతకువచ్చి దర్భాసనముపై పద్మాసనమున గూర్చున్న సత్యవ్రతుడను మునినిగని సాగిలపడి మ్రొక్కి యిట్లనెను : 'ఓ మునీ! నా పంది యెటు పరుగిడెను? చెప్పుము. నీవు సత్యవ్రతుడవని వాసిగాంచుట నే నెఱుంగుదును. నా కుటుంబము పేరాకట మలమల మాడుచున్నది. దానిని పోషించుటకు వేటకు వచ్చితిని. నా బాణము దెబ్బతిన్న పంది యెటుపోయెను? తెలుపుము. నేను నిజము పలుకుచున్నాను. నాకు తగిన కులవృత్తి యిదేగాని మరేదియులేదు. నా సంసారమును మంచిదికాని చెడుదికాని అగు ఏదేనుపాయమున పోషించుట నా విధి. ఓ ద్విజవర్యా! నీవు సత్యవాదివి - సత్యవ్రతుడవు. నా కుటుంబ మాకటిమంటతో నకనకలాడుచున్నది. కాన నా బాణము తాకిడి తిన్న పంది యేమయ్యెనో నాకు వెంటనే తెలుపుము.' అను బోయని మాటలు విని ముని యిట్లు తలపోసెను: 'ఇపుడు నేను చూడలేదనుటచే నాసత్యవ్రతము భంగము కాదా? ఇపు డేమి చేతును? పెద్ద సందేహములో చిక్కుకొంటిని. బాణము దెబ్బతిన్న పంది యిచటికి వచ్చెనని నిజముగాని రాలేదని యసత్యముగాని నే నిపు డెట్లు పలుకగలను? ఇత డాకలిమంటతో నున్నాడు. అది వచ్చెనందునా? ఇతడు వెంటనే దానిని చంపి తీరును. హింసతోగూడిన సత్యము సత్యముగాదు. దయతోగూడిన యతస్యముగూడ సత్యమే యగును. దేనివలన విశ్వహితము చేకూరునో యదే లోకములందు సత్యమనం బరగును. తదితర మట్లు గాదు. ఇట్టి సంకట పరిస్థితులలో పందికి మేలు జరుగుట - నేను నిజము పలుకుట రెండు నొకేసారి యెట్లు పొసగునా, యని యతడు ధర్మసంకటమున వెనుక ముందులాడుచు బ్రాహ్మణుడవగు జమదగ్నీ! వాస్తవము దెలుపలేకుండెను. కాని బాణముదెబ్బ తగిలిన పందినిగాంచి ముని తలవనితలంపుగ దయతో ''ఐ'' యని పల్కెను. ఆ పల్కునకు వాగ్రూపిణియగు సరస్వతీశక్తి సంతసల్లి యతడు తన వాగ్బీజమే పల్కెనని యతనికి పండితుల కందని మహావిద్యను ప్రసాదించెను. తత్ప్రభావమున మున్ను వాల్మీకి ముని కెల్లవిద్యలు స్ఫురించినట్లా ముని బాలున కెల్లవిద్దెలు ప్రస్ఫురించెను. తత్ఫలితముగ నతడు మహాకవి యయ్యెను.

తమువాచ ద్విజోవ్యాధం సమ్ముఖస్థం ధనుర్థరమ్‌ | సత్యకామస్తు ధర్మాత్మా శ్లోకమేకం దయాపరః. 40

యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి | అహోవ్యాధ స్వకార్యార్థి న్కింపృచ్ఛసి పునఃపునః. 41

ఇత్యుక్తస్తు తదాతేన గతో%సౌ పశుహాపునః | విరాశః సూకరేతస్మి న్పరావృత్తో నిజాలయే | 42

బ్రాహ్మణస్తు కవిర్జాతః ప్రాచేతన ఇవాపరః | ప్రసిద్ధః సర్వలోకేషు నామ్నా సత్యవ్రతో ద్విజః 43

సారస్వతం తతో బీజం జజాప విధిపూర్వకమ్‌ | పండితశ్చాతి విఖ్యాతో ద్విజో%సౌ ధరణీతలే. 44

ప్రతిపర్వసు గాయంతి బ్రాహ్మణా యద్యశఃసదా | ఆఖ్యానం చాతివిస్తీర్ణం స్తువంతి మునయఃకిల. 45

తచ్ఛ్రుత్వా సదనంతస్య సమాగమ్య తదాశ్రమే | యేనత్యక్త పురాతేన గృహంనీతో%తి మానితః. 46

అపుడు తన ముందట విల్లమ్ములుదాల్చి నిలుచున్న బోయనుగని దయాధర్మ కాముడగు సత్యకాము డొక శ్లోకము చదివెను: ఓ వ్యాధా! ఏది చూచునో యది పలుకదు. ఏది పలుకునో యది చూడదు. కాన నీ స్వార్థమునకు నన్నింతగ గ్రుచ్చి గ్రుచ్చి యడుగుదువేల? ముని మాటలు విని పశుఘాతకుడగు వ్యాధుడు పందిమీది యాస వదలి తన యింటి మొగము పట్టెను. పిదప నా బ్రాహ్మణు డపర వాల్మీకివలె మహాకవిశేఖరుడై యెల్లలోకములందు సత్యవ్రత నామమున ఖ్యాతినందెను. పిమ్మట నా బ్రాహ్మణుడు వాగ్బీజము నిరంతరముగ విధిగ జపించుచు భూతలమున పండితోత్తముడై పేరెన్నిక గనెను. ఎల్ల మునులు విప్రులు ప్రతిపర్వమందు సత్యవ్రతుని యశము గానము చేయుదురు. ఆతని మహత్తర చరిత్రమును సంస్తుతింతురు. ఒకప్పు డతని నింటినుండి గెంటినవారే నే డతని కీర్తి ప్రభావము తెలిసికొని మరల నతని నింటికి గొనిపోయిరి.

తస్మాద్రాజ న్సదాసేవ్యా పూజనీయా చ భక్తితః | ఆదిశక్తిః పరాదేవీ జగతాం కారణం హి సా. 47

తస్యాయజ్ఞం మహారాజ కురు వేదవిధానతః | సర్వకామప్రదంనిత్యం నిశ్చయం కథితం పురా. 48

స్మృతా సంపూజితా భక్త్యా ధ్యాతా చోచ్చారితాస్తుతా | దదాతి వాంఛితానర్థా న్కామదా తేన కీర్త్యతే. 49

అనుమానమిదంరాజ న్కర్తవ్యం సర్వదా బుధైః| దృష్ట్వారోగయుతా న్దీనాన్‌క్షుధితాన్నిర్ధనాన్‌శఠాన్‌. 50

జనానార్తాంస్థితాన్‌ మూర్ఖాన్పీ డితాన్వైరిభిఃసదా | దాసానాజ్ఞాకరాన్‌ క్షద్రాన్వి కలాన్వి హ్వలానథ. 51

అతృప్తా న్భోజనే భోగే సదా%%ర్తానజితేంద్రియాన్‌ | తృష్ణాధికానశక్తాంశ్చ సహా%%ధిపరిపీడితాన్‌. 52

తథావిభవసంపన్నా న్పుత్రపౌత్ర వివర్ధనాన్‌ | పుష్టదేహాంశ్చసంభోగైః సంయుతా న్వేదవాదినః. 53

రాజలక్ష్మ్యా యుతాన్‌శూరాన్‌ వశీకృతజనానథ | స్వజనైరవియుక్తాంశ్చ సర్వలక్షణ లక్షితాన్‌. 54

వ్యతిరేకాన్వయాభ్యాం చవిచేతవ్యం విచక్షణౖః | ఏభిర్నపూజితా దేవీ సర్వార్థఫలదా శివా.

55

సమారాధితా చతథా నృభిరేభిః సదాంబికా | యతో%మీ సుఖనః సర్వేసంసారే%స్మిన్న సంశయః. 56

వ్యాసః: ఇతిరాజన్‌ శ్రుతంతత్ర మయాముని సమాగమే | లోమశస్య ముఖాత్కామం దేవీమాహాత్మ్య ముత్తమమ్‌. 57

ఇతి సంచింత్య రాజేంద్ర! కర్తవ్యంచ సదార్చనమ్‌ | భక్త్యాపరమయాదేవ్యాః ప్రత్యాచపురుషర్షభః 58

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే ఏకాదశో%ధ్యాయః

కావున నో మహారాజా! ఆ యాదిశక్తి జగత్కారణురాలు. పరాదేవి. ఆ తల్లి యెల్లరచే నైకాంతిక పరభక్తితోడి పూజలు సేవలు నందుకొనుచు విరాజిల్లుచుండును. ఓ రాజా! ఆ దేవీ యాగ మొనరింపుము. ఆమె నీ సర్వకామితము లీడేర్చును. ఇందు నలుసంతయు సందేహము లేదు. తన్నెవరు చిత్తశుద్ధితో నభ్యాసయోగ సంస్కృత చిత్తముతో ధ్యానింతురో సంస్మరింతురో పూజింతురో నామ సంకీర్తనము చేయుదరో వారి వాంచితార్థము లొసంగును గాన దేవి కామప్రదాయిని నా బరమగును. ప్రపంచములో రెండు విధముల మనుజులుందరు. వారెవ్వరన దీనులు - ఆర్తులు - దరిద్రులు - శఠులు - ఆకలి దప్పులచే మండి యెండిన గుండెల వారు రోగ పీడితులు - పతితులు - మూర్ఖులు - వైరిపీడితులు - బానిసలు - వ్యాకులచిత్తులు - దిక్కులేనివారు - వికలులు - నీచాత్ములు ననువారొక విధమువారు. భోగములెన్ని భోగించినను తనియనివారు ఇంద్రియా సంభోగ నష్టవీర్యులు వేదవాదులు రాజ్యలక్ష్మీ మత్తులు శూరులు అమాయికులను నెత్తిమీదకొట్టువారు స్వార్థపరులు సకల లక్షణ లక్షితులు ననువారింకొక విధమగువారు. వీరిలో దైవ ధర్మవిరుద్ధమైన గుణములు గల వారినిచూచి సర్వార్థముల నొసంగు సర్వేశ్వరి వీరిచే పూజింపబడలేదు. కావుననే యిట్లు దేవీ పూజాఫలములగు సకల దుఃఖము లననుభవించుచున్నారనియు శుభ లక్షణములుగల రెండవ రీతి వారినిచూచి దేవీ సేవాఫలములు వీరి యొద్ద కనబడుటచే సకల సుఖములకు హేతువగు దేవీ పూజ వీరిచే నొకప్పుడు చేయబడియుండుననియు అన్వయ వ్యతిరేకములచే పండితులూహించ వలయును. ఒకనాడా పరాంబిక నారాధించిన దేవీ భక్తులే నేడీ సంసారమున సుఖ సంతోషములతో నలరుచున్నారు. ఇది ముమ్మాటికి నిజము. జనమేజయా! నేనటులా లోమశ మహామునివలన మునుల సమాజమందు శ్రీదేవీ మాహాత్మ్యము చెవుల పండువుగ వింటిని. కావున నా జగన్మాతృదేవీ దివ్యస్వరూపము నీ హృదయపీఠమందుం చుకొని శ్రీదేవి నర్చింపుము అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయస్కంధమందు పదునొకండవయధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters