Sri Devi Bhagavatam-1    Chapters   

అథ సప్తదశో%ధ్యాయః

వ్యాస ఉవాచ : ఇత్యాకర్ణ్య వచస్తస్య మునేస్త త్రావనీపతిః | మంత్రివృద్ధం సమాహూయ పప్రచ్ఛ తమతంద్రితః1

కిం కర్తవ్యం సుబుద్ధే%త్ర మయా%ద్య వద సువ్రత! బలా న్నయామి తాం కామం సుపుత్రాంచ సుభాషిణీమ్‌. 2

రిపు రల్పో%పి నోపేక్ష్యః సర్వథా శుభమిచ్చతా: రాజయేక్ష్మేవ సంవృద్ధో మృత్యవే పరిక్పలయేత్‌. 3

నాత్ర సైన్యం న యోద్ధా%స్తి యో మామత్ర నివారయేత్‌| గృహీత్వా హన్మిం తం తత్ర దౌహిత్రస్య రిపుంకిల. 4

నిష్కంటకం భ##వేద్రాజ్యం యతామ్యద్య బలాదహమ్‌ | హతే సుదర్శనే నూనం నిర్భయో%సౌ భ##వేదితి. 5

ప్రధాన ఉవాచ : నహికర్తవ్యం శ్రుతం రాజన్మునేర్వచః | విశ్వామిత్రస్య దృష్టాంతః కథితస్తేనమారిష! 6

పురా గాధిసుతః శ్రీమా న్విశ్వామి%త్రోతి విశ్రుతిః | విచర న్సనృపశ్రేష్ఠో వసిష్ఠాశ్రమ మభ్యగాత్‌. 7

నమస్కృత్య చ తం రాజా విశ్వామిత్రః ప్రతాపవాన్‌ | ఉపనిష్టో నృపశ్రేష్ఠో మునినా దత్త విష్టరః 8

నిమంత్రితో వసిష్ఠేన భోజనాయ మహాత్మనా | ససైన్యశ్చ స్థితోరాజా గాధిపుత్రో మహాయశాః. 9

నందిన్యా22సాదితం సర్వం భక్ష్యభోజ్యాదికం చయత్‌ | భుక్త్వారాజా ససైన్యశ్చ వాంఛితం తత్రభోజనమ్‌. 10

ప్రతాపం తం చ నందిన్యాః పరిజ్ఞాయ స పార్థివః| యయాచే నందినీం రాజా వసిష్ఠం మునిసత్తమమ్‌. 11

విశ్వామిత్రః : మునే! ధనేసహస్రం తేఘటోధ్నీనాం దదామ్యహమ్‌ నందినీందేహి మేధేనుం ప్రార్థయామిపరంతప. 12

పదునేడవ అధ్యాయము

సుదర్శనుడు కామరాజ బీజము జపించుట

వ్యాసుడిట్లనియె: భరద్వాజుని వాక్కులు విని యుధాజిత్తు వృద్ధామాత్యుని బిలిచి యతనితో నిట్లనియెను. ''ఓ సుబుద్ధీ! సుభాషిణియు సుపుత్త్రయునగు మనోరమను నేనిప్పుడు నా బలము ప్రయోగించి తెచ్చుట మంచిదా, కాదా? నా కర్తవ్యమేమో నీవే తెలుపుము. తన మేలుగోరుకొనువాడు తన యల్ప శత్రువునైన సుపేక్షించి విడిచిపెట్టరాదు. అట్లొనర్చిన నది రాజయక్ష్మ రోగమువలె పెరిగి పెరిగి తన చావునకు కారణభూతమగును. ఇచ్చట నన్ను కాదని ధిక్కరించు యోధులు లేరు. కనుక నా మనుమని శత్రువగు సుదర్శనుని పట్టి పల్లార్తును. ఇపుడు బలప్రయోగముతోనైన నీపనికి బూనుకొందును. సుదర్శనుడంతమొందినచో నా మనుమడింక కంటినిండ నిద్రపోగలడు. అతని రాజ్యము నిష్కంటకము కాగలదు.'' మంత్రి యిట్లనియె : ఓ రాజా! సాహసము తగదు. ఈ మునివచనము పాటించుము. అతడు విశ్వామిత్రునంతటివానినే యుదాహరించి వాక్రుచ్చెను. పూర్వము గాధినందనుడును ప్రఖ్యాతమునియునగు విశ్వామిత్రుడెల్లెడల గ్రుమ్మరుచు వసిష్ఠమున్యాశ్రమము జేరెను. ప్రతాపియగు విశ్వామిత్ర భూపతి బ్రహ్మర్షికి వసిష్ఠునకు ప్రణమిల్లి యతడొసంగిన యాసనమందాసీనుడయ్యెను. అంత విశ్వామిత్రుడు బ్రహ్మర్షిచే నిమంత్రితుడై ససైన్యముగ భోజనమునకు సిద్ధమయ్యెను. వారి భోజనమునకు వలసిన భక్ష్య భోజ్యాదులెల్ల నందినీ ధేనువు సమకూర్చెను. ఆ రాజు ససైన్యముగ తుష్టిగ భుజించెను. అదంతయును నందినీ ప్రభావ మని విశ్వామిత్రుడెఱింగి వసిష్ఠ మునీశ్వరునితో అతడు ఓ పరంతపా! మునీశా! నీకు కడివెళ్ళ పాలిచ్చు గోవుల సహస్ర మిత్తును. నాకా నందినీ ధేనువు నొక్కటిమ్మని ప్రార్థించుచున్నాను అని యాచించెను.

వసిష్ఠ ఉవాచ : హోమధేను రియం రాజ న్న దదామి కథంచన| సహస్రం చాపి ధేనూనాం తవేదం తవ తిష్ఠతు. 13

విశ్వామిత్ర ఉవాచ : అయుతం వా%థలక్షం వా దదామి మనసేప్సితం | దేహిమే నందినీం సాధో గ్రహీష్యామి బలాదథ. 14

వసిష్ఠ ఉవాచ : కామం గృహాణ నృపతే | బలాదద్య యథారుచి | నాహం దదామితే రాజ న్స్వేచ్ఛయా నందినీం గృహాత్‌. 15

తచ్ఛ్రుత్వా నృపతి ర్భృత్యా నాదిదేశ మహాబలాన్‌ | నయధ్వం నందినీం ధేనుం బలదర్పసుసంస్థితాః. 16

తే భృత్యా జగృహుర్ధేనుం హఠా దాక్రమ్య యంత్రితాం వేపమానా మునిం ప్రాహసురభిః సాశ్రులోచనా. 17

మునే! త్యజసి మాంకస్మా త్కర్షయంతి సుయంత్రితామ్‌ | మునిస్తాం ప్రత్యువాచేదం త్యజే నాహం సుదుగ్ధదే! 18

బలా న్నయతి రాజా%సౌ పూజితో%ద్య మయా శుభే | కిం కరోమి ! న చేచ్ఛామి త్యక్తుం త్వాం మనసా కిల. 19

ఇత్యుక్తా మునినా ధేనుః క్రోధయుక్తా బభూవహ | హంభారవం చకారాశు క్రూరశబ్దం సుదారుణమ్‌. 20

ఉద్ధతాస్తత్ర దేహాత్తు దైత్యా ఘోరతరా స్తదా | సాయుధా స్తిష్ఠ తిష్ఠేతి బ్రువంతః కవచావృతాః. 21

సైన్యం సర్వం హతం తైస్తు నందినీ ప్రతిమోచితా | ఏకాకి నిర్గతోరాజా విశ్వామిత్రో%తి దుఃఃతః. 22

హంత! పాపో%తి దీనాత్మా నిందనాక్ష త్రబలం మహత్‌ | బ్రహ్మం బలం దురారాధ్యం మత్వా తపసి సంస్థితః. 23

తప్త్వా బహూని వర్షాణి తపోఘోరం మహావనే | ఋషిత్వం ప్రాప గాధేయ స్త్యక్త్వా క్షాత్ర విధిం పునః. 24

రాజా! ఇది నా హోమ ధేనువు. నీ కీయను. నీ యావులు నీ యొద్దనే యుండనిమ్ము అని వసిష్ఠుడన మునివరేణ్యా! నీవేరికోరుకొన్న యావులను పదివేలైన లక్షయైన నిత్తును. నాకు నీ గోవునిమ్ము. కాదేని నా బలము చూపి దానిని గొనిపోదును అని విశ్వామిత్రుడనెను. అది విని వసిష్ఠమహర్షి యిట్లు వాక్రుచ్చెను: మహీశా! నీకు దోచినట్లుగ బలముపయోగించి నందినిని తీసికొనుము. నేను మాత్రము నా యిష్టముతో నా యింటినుండి నాచేతిమీదుగ దీనిని నీకు వదలిపెట్టను. అంత నరపతి మహాబలదర్పితులగు తన భటులను నందినిని గొనిరమ్మని యాజ్ఞాపించెను. వారు హఠాత్తుగా దానిని బట్టుకొనబోగా నందిని వణకుచు కన్నీరు గార్చుచు మునీశునితో మునివల్లభా! నన్నేల త్యజింతువు? కట్టివేసిన నన్ను లాగికొనిపోవుచున్నారు అన ఓ నందినీ! నేను నిన్ను వదలుట లేదు. ఇపుడే పూజించిన నిన్నతడు బలిమితో గొంపోవుచున్నాడు. నేను మదిలోగూడ నిన్ను వదలదలచలేదు. నేనిపుడేమి సేతును? అను మునివరుని పల్కులు విని నందిని కోపోద్రిక్తయై క్రూరముగ హంభారవమొనరించెను. అంత నా గోవు మేనినుండి కవచధారులును సాయుధులైన ఘోర దైత్యులు బయలువెడలి నిలునిలుడని కేకలు పెట్టుచు వారి వెంటబడిరి. ఆ దైత్య సేనలు వైరి సేనలను ఱుమాడి కాకావికలు చేసి నందినిని విడిపించుకొని వచ్చెను. విశ్వామిత్రుడతి దుఃఃతుడై చేయునదిలేక ఒంటిగ వచ్చినబాట పట్టెను. పాపమతడు దీనాత్ముడై తన క్షాత్రమును ధిక్కరించుచు బ్రహ్మతేజోబలమే నిజమైన బలమని యది దుర్గ్రాహ్యమని భావించి తపోనిమగ్నుడయ్యెను. అట్లు గాధేయుడు పెక్కేండ్లు ఘోరముగ ఘోరారణ్యములందు తపమాచరించి క్షత్రియత్వము వదలి ఋషిత్వమందెను.

తస్మాత్త్వపమపి రాజేంద్ర! మా కృథా వైర మద్భుతమ్‌ | కులనాశకరం నూనం తాపసైః సహ సంయుగమ్‌. 25

మునివర్యం వ్రజాద్య త్వం సమాశ్వాస్య తపోనిధిమ్‌ | సుదర్శనో%పి రాజేంద్ర! తిష్ఠత్వత్ర యథాసుఖమ్‌. 26

బాలో%యం నిర్ధనః కింతే కరిష్యతి నృపాహితం | వృథా తే వైరభావో%య మనాథే దుర్బలే శిశౌ. 27

దయా సర్వత్ర కర్తవ్యా దైవాధీన మిదం జగత్‌ | ఈర్ష్యయా కిం నృపశ్రేష్ఠ యాద్భావ్యం తద్భవిష్యతి. 28

వజ్రం తృణాయతే రాజన్దైవయోగా న్నసంశయః | తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవయోగతః. 29

శశకో హంతి శార్దూలం మశకో వై యథా గజమ్‌ | సాహసం ముంచ మేధావి న్కురుమే వచనం హితమ్‌. 30

వ్యాస ఉవాచ : తచ్ఛ్రుత్వా వచనం తస్య | ప్రణమ్య తం ముని మూర్ధ్నా జగామ స్వపురం నృపః. 31

మనోరమా%పి స్వస్థా%భూ దాశ్రమే తత్ర సంస్థితా | పాలయా మాస పుత్రం తం సుదర్శన మృతవ్రతమ్‌. 32

దినేదినే కుమారో%సౌ జగామోపచయం తతః | మునిబాలగతః క్రీడన్నిర్భయః సర్వతః శుభః. 33

ఏకస్మి న్సమయే తత్ర విదల్లం సముపాగతమ్‌ | క్లీబేతి మునిపుత్ర స్తమా మంత్ర యత్తదంతికే. 34

సుదర్శన స్తు తచ్ఛ్రుత్వా దధారైకాక్షరం స్ఫుటమ్‌ | అనుస్వారయుతం తచ్చ ప్రోవాచాతి పునః పునః 35

బీజం వై కామరాజాఖ్యం గృహీతం మనసా తదా | జజాప బలకో%త్యర్థం ధృత్వా చేతసి సాదరమ్‌. 36

భావియోగా న్మహారాజ! కామరాజాఖ్య మద్భుతమ్‌ | స్వభావేనైన తేనేత్థం గృహీతం బాలకేన వై. 37

తదా%సౌ పంచమే వర్షే ప్రాప్య మంత్ర మనుత్తమం | ఋషిచ్ఛందో విహీనం చ ధ్యానన్యాస వివర్జితమ్‌. 38

ప్రజప న్మనసా నిత్యం క్రీడత్యపిస్వపిత్యపి | విసస్మార న తం మంత్రం జ్ఞాత్వా సారమితి స్వయమ్‌. 39

కనుక నో రాజేంద్రా! ఇపుడు నీవును మునితో పగబూనకుము. తాపసోత్తములతోడి వైరము కులనాశకరము. నీవిపుడే మునివరుడగు తపోనిధిని సంతసింపజేసి యేగుము. సుదర్శను డిచట యథా సుఖముగ మనుగడ సాగించు గావుత. రాజా! ఈ నిఱుపేద బాలుడు నీకేమపకార మొనరింపగలడు? ఈ దిక్కుమాలిన దుర్బలుడగు బాలునిపై నీకు విరోధ భావము తగదు. అందఱియందు కనికరమును జూపవలెను. జగము సర్వము దైవవశము గద! ఈసువలన ప్రయోజనము సున్న. ఏది ప్రాప్తవ్యమో యది తప్పక ప్రాప్తమై తీరును. ఒక్కొక్క సమయమందు దైవయోగమున గడ్డిపోచ వజ్రముగను వజ్రము గడ్డిపోచగను మారును. కుందేలు శార్దూలమును దోమ యేనుగును చంపగలదు. కాన నతిసాహసము వలదు. నా హిత వాలింపుము.

మంత్రి హితము విని యుధాజిత్తు మునికి తలవంచి నమస్కరించి తన నగరి కరిగెను. మనోరమయు స్వస్థయై ఋతవ్రతుడగు తన సుతుని పోషించుచు మున్యాశ్రమందుండెను. ఆ సుదర్శన బాలుడు నెల బాలునివలె దిన దిన ప్రవర్ధమానుడై మునిబాలురతో నిర్భయముగ నాటలాడుచుండెను. అంత నొకనాడు విదల్లుడచ్చటికేతెంచెను. మునిలబాలురతనినిగని క్లీబుడని పిలిచి గేలిచేసిరి. సుదర్శనుడాశబ్దము విని బకారమువదలి యనుస్వారయుతముగ నేకాక్షరమగు ''క్లీం'' కారమును సుస్పష్టముగ మాటామాటికి నుచ్చరింపదొడగెను. అట్లా బాలుడు కామరాజ బీజమును నెమ్మనమందు నెమ్మితోదాల్చి విసుగుసనక లోలోన నిరంతరాయముగ దానినే జపింపసాగెను. ఆ పగిది భావి శుభయోగసూచకముగ సుదర్శనుడు కామరాజ బీజమును సహజముగ గ్రహించి జపము సాగించెను. ఆ యైదేండ్లప్రాయపు రాకుమారుడు ఋషి ఛందము న్యాసము ధ్యానము వదలి యా దివ్యప్రణవమును జపించుచు ధ్యానించుచుండెను. అతడా యేకాక్షర మంత్రమే సర్వ విజ్ఞాన సారమని స్వయముగ నెఱింగి యేమరక మఱువక నాడుచు పాడుచు నిదురించుచు మనసార హృదయమున జపించుచుండెను.

వర్షే చైకాదశే ప్రాప్తే కుమారో%సౌ నృపాత్మజః| మునినా చోపనీతో%థ వేద మధ్యాపితస్తథా. 40

ధనుర్వేదం తథా సాంగం నీతిశాస్త్రం విధానతః| అభ్యస్తా స్సకలా విద్యా స్తేన మంత్రబలాదిన. 41

కదాచిత్సో%పి ప్రత్యక్షం దేవీరూపం దదర్శహ| రక్తాంబరం రక్తవరణం రక్త సర్వాంగ భూషణమ్‌. 42

గరుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తి మద్భుతాం| దృష్ట్వా ప్రసన్న వదనః స బభూవ నృపాత్మజః. 43

వనే తస్మి న్ధ్సితః సో%థ సర్వవిద్యార్థ తత్వవిత్‌ | మాతరం సేవమానస్తు విజహార నదీతటే.

44

శరాసనం చ సంప్రాప్తం విశిఖాశ్చ శిలాశితాః | తూణీరం కవచం తసై#్మ దత్తం చాంబికయా వనే. 45

ఏతస్మి న్సమయే పుత్రీ కాశీరాజస్య సుప్రియా| నామ్నా శశికళా దివ్యా సర్వలక్షణ సంయుతా. 46

శుశ్రావ నృపపుత్రం తం వనస్థం చ సుదర్శనమ్‌| సర్వ లక్షణ సంపన్నం శూరం కామమివాపరమ్‌. 47

వందీజనముఖా చ్ఛ్రుత్వా రాజపుత్రం సుసమ్మతమ్‌| చకమే మనసా తం వై వరం వరయితుం ధియా. 48

స్వప్నే తస్యాః సమాగమ్య జగదంబా నిశాంతరే| ఉవాచ వచనం చేదం సమాశ్వాస్య సుసంస్థితా. 49

వరం వరయ సుశ్రోణి! మమ భక్తః సుదర్శనః | సర్వకామ ప్రదస్తే%స్తు వచనా న్మమ భామిని. 50

ఏవం శశికళా దృష్ట్వా స్వప్నేరూపం మనోహరమ్‌ | అంబాయా వచనం స్మృత్వా జహర్ష భృశ మానినీ. 51

ఉత్థితా సా ముదాయుక్తా పృష్టా మాత్రా పునఃపునః | ప్రమోదే కారణం బాలా నోవాచాతి త్రపాన్వితా. 52

అతడు పదునొకండేండ్ల ప్రాయమున భారద్వాజునిచేత నుపనీతుడై వేదాధ్యయన మొనరించెను. అతడు క్లీం'' మంత్ర ప్రభావమున సాంగధనుర్వేదము నీతి శాస్త్రము తుదకు సకల విద్యలు తేలికగ నభ్యసించెను. పిమ్మట నతడొకనాడు రక్తాంబర రక్తవర్ణ రక్తమండల మండితయగు శ్రీ పరాదేవతను ప్రత్యక్షముగ సందర్శించెను. అతడు గరుడ వాహనమం దాసీనయైయున్న పరమాద్భుత కామకళాశక్తియగు శ్రీ మహావైష్ణవిని సంవీక్షించి నిర్మలవదనుడయ్యెను. అట్లా సుదర్శనుడు వనమందు సకలవిద్యార్థ రహస్యములు బడసి తన మాతృమూర్తిని సేవించుచు నదీతటమున విహరించుచుండగా జగన్మాతయగు శ్రీ మాతృదేవి యతనిపై దయతలచి విల్లమ్ములు కవచతూణీరములు నొసంగినది. అదే సమయమున కాశీరాజు ప్రియపుత్త్రిక సర్వసులక్షణసంయుత యగు శశికళయను నామె యెప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ కన్యకామణి నృపతనయుడును అపరమన్మథుడును సకల సులక్షణ సంయుతుడునగు సుదర్శనుని గుఱించి వందిజనము వలన విని యతనినే తన వరునిగ వరింప మదిలో గాఢ నిశ్చయము చేసికొనెను. అంత నొకనాటి రేయి కలలో జగదంబ ఆమెకు గనంబడి యాకన్నియ నూరడించుచు ఓ సుశ్రోణీ ! సుదర్శనుడు నాకు భక్తుడు. అతనినే వరునిగ వరింపుము. నా వాక్కుల వలన నతడే నీకు సర్వకామప్రదుడగును అనెను. అట్లు శశికళ కలలో జగదంబనుగని యామె యొక్క ప్రియవాక్కులు విని ముదితాంతరంగయై మేల్కనిన తరువాత గూడ సంతసిల్లుచుండెను. ఆమెతల్లి యామె ప్రమోదమునకు కారణమడిగెను. కాని, యామె సిగ్గును మారు మాట పలుకకుండెను.

జహాస ముదమాపన్నా స్మృత్వాస్వప్నం ముహుర్ముహుః| సఖీం ప్రాహతదా%న్యాం వైస్వప్న వృత్తంసవిస్తరమ్‌. 53

కదాచిత్సా విహారార్థ మవా పోపవనం శుభం| సఖీయుక్తా విశాలాక్షి చంపకై రుపశోభితమ్‌.

54

పుష్పాణి చిన్వతీ బాలా చంపకాధః స్థితా%బలా | అపశ్య ద్బ్రాహ్మణం మార్గే ఆగచ్ఛంతం త్వరాన్వితమ్‌. 55

తం ప్రణమ్య ద్విజం శ్యామా బభాషే మధురం వచః | కుతో దేశా న్మహాభాగ! కృతమాగమనం త్వయా. 56

ద్విజః : భారద్వాజాశ్రమా ద్బాలే: నూనమాగమనం మమ| జాతం వైకార్య యోగేన కిం పృచ్ఛసి వదస్వ మామ్‌. 57

శశికళోవాచ: తత్రాశ్రమే మహాభాగ వర్ణనీయం కిమస్తివై| లోకాతిగం విశేషేణ ప్రేక్షణీయతమం కిల. 58

బ్రాహ్మణ : ధ్రువసంధిసుతః శ్రీమానాస్తే సుదర్శనో నృపః | యథార్థనామా సుశ్రోణి వర్తతే పురుషోత్తమః. 59

తస్య లోచన మత్యంతం నిష్ఫలం ప్రతిభాతిమే | యేన దృష్టో న వామోరు ! కుమారస్తు సుదర్శనః. 60

ఏకత్ర నిహితా ధాత్రా గుణాః సర్వే సిసృక్షుణా | గుణానామాకరం ద్రష్టుం మన్యే తేనైవ కౌతుకాత్‌. 61

తవ యోగ్యః కుమారో2సౌ భర్తా భవితు మర్హతి | యోగో%యం విహితో%స్యాసీ న్మణికాంచనయోరివ. 62

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే సప్తదశో%ధ్యాయః

ఆ బాల ప్రమదము నిండార తేపతేపకు కలను స్మరించుచు స్వప్న వృత్తాంత మంతయును తన చెలికత్తెకు సవిస్తరముగ చెప్పెను. ఒకనాడు విశాలనయనయగు నాబాల తన చెలితో చంపకములు పరిమళించు సుందరోద్యానమునకు వాహ్యాళి కేగెను. ఆమె పూలుగోయుచు నొక సంపెంగ పూలచెట్టు చెంతనుండి అపుడదే మార్గమున తనవైపునకేతెంచుచున్న యొక విప్రునిగనెను. ఆమెయతనికి చేతులు జోడించి తీయని మాటలతో నో మహానుభావా! మీరాక యేదేశమందుండి?' అని యడుగ ఆ విప్రుడును ఓ బాలా! నేను భరద్వాజాశ్రమమునుండి యొక కార్యము నిమిత్త మేతెంచుచున్నాను. నీవేమడుగుదువో యడుగుము' అనెను. ఓ మహాత్మా! ఆ పవిత్రాశ్రమమందు విశేషముగ వర్ణనీయము లోకాతీతము ప్రేక్షణీయమునైన వస్తువేది కలదు?' అని శశికళయడుగ: విప్రుడిట్లనియె ఓ వరోరు! ధ్రువసంధి రాజు తనయుడు సుదర్శనుడు. అతడు శ్రీమంతుడు. సార్థకనామధేయుడు; పురుషోత్తముడు. అతడాయాశ్రమందు గలడు. కమలనయనా! అతని సోయగముజూడని కన్నులు కన్నులుగావని నాకు దోచుచున్నది. సకలసృష్టి సలుపు విధాత గుణనిలయుని చూడగోరియే విశ్వ సుగుణముల నతనిలో రాశిగబోసి సృజించి యుండె గాబోలు! ఆ రాజకుమారుడే నీ కన్నివిధముల తగిన వరుడు - యోగ్యుడు. ఈ మీ యోగము మణికాంచన యోగమట్లు సంఘటిల్లినది.

ఇది శ్రీదేవి భాగతమందలి తృతీయస్కంధమున పదునేడవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters