Sri Devi Bhagavatam-1    Chapters   

అథ అష్టాదశో%ధ్యాయః

వ్యాసః : శ్రుత్వా తద్వచనం శ్యామా ప్రేమయుక్తాబభూవహ | వ్రతస్థే బ్రాహ్మణ స్తస్మాత్థ్సా నాదుక్త్వా సమాహితః. 1

సాతు పూర్వానురాగా ద్వై మగ్నా ప్రేవ్ణూ%తిచంచలా | కామబాణాహతేవాస గతే తస్మిన్ద్విజోత్తమే. 2

అథ కామార్దితా ప్రాహ సఖీం ఛందానువర్తినీం | వికారశ్చ సముత్పన్నో దేహీ యచ్ఛ్ర వణాదను. 3

అజ్ఞాతరసవిజ్ఞానం కుమారం కులసంభవం | దునోతి మదనః పాపః కిం కరోమిః క్వ యామి చః. 4

స్వప్నేషు వా మయా దృష్టః పంచబాణ ఇవాపరః | తపతే మే మనో%త్యర్థం విరహాకులితం మృదు. 5

చందనం దేహలగ్నం మే విషవద్భాతి భామిని | స్రగియం సర్పవచ్చైవ చంద్రపాదాశ్చ వహ్నివత్‌. 6

న చ హర్మ్యే వనే శం మే దీరికాయాం న పర్వతే | న దివా న నిశాయాం వా న సుఖం సుఖసాధనైః. 7

న శయ్యా నచ తాంబూలం న గీతం నచ వాదనం | ప్రీణయంతి మనో మే%ద్య న తృప్తే మమ లోచనే. 8

ప్రయామ్యద్య వనే తత్ర యత్రాసౌ వర్తతే శఠః | భీతా%స్మి కులలజ్జాయాః పరతంత్రా పితు స్తథా. 9

స్వయంవరం పితా మే%ద్య నకరోతి కరోమికిం | దాస్యామి రాజపుత్రాయ కామం సుదర్శనాయవై. 10

సంత్యన్యే పృథివీపాలః శతశః సంభృతర్థయః | రమణీయా నమే తే%ద్య రాజహీనో%ప్యసౌమతః. 11

పదునెనిమిదవ అధ్యాయము

శశికళ విరహ వర్ణనము

వ్యాసభట్టారకు డిట్లనియె : విప్రుని పలుకు లాలకించి యా యువతి తన ప్రియునందు బద్ధానురాగ యయ్యెను. బ్రాహ్మణుడు అట్లు ప్రియవచనములు పలికి యచ్చటినుండి బయలుదేరెను. ఆ ద్విజోత్తము డేగిన మీదట నామె పూర్వానురాగము వలన ప్రేమయందు మునిగినదై కాముని బాణముల దెబ్బ తినినదో యనునట్లు మిగుల చంచలురాలయ్యెను. తన యనుకూల వర్తినియగు నెచ్చెలితో తా నెవరిని గూర్చి వినుట వలన మనస్సున కామ వికార ముత్పన్న మయ్యెనో తెలిపెను. శృంగార రసవిజ్ఞానము నేమాత్ర మెరుగనిదియు సత్కుల జాతనగు నాకు సంబంధించినదియు సుకుమారము నగు నా మనస్సును పాపుడగు వలరాజు బాధపెట్టుచున్నాడు. ఇపు డేమి సేతును? ఎక్కడ కేగుదును? ఆనాడు కలలో కనబడిన యా రాకుమారుడు రెండవ కాముడో యన నా మనస్సును విరహాకులితమును కోమలమునగు నా మనస్సును మిగుల తపింపజేయుచున్నాడు. ఓ భామినీ! నా మేన పూయబడిన చందనము విషముగను పూమాల పాముగను జంద్రకిరణము అగ్నిగను తోచుచున్నవి. హర్మ్యమున కాని ఉపవనమున కాని నడబావికడ కాని క్రీడా పర్వతమున కాని పగలు కాని రాత్రికాని ఏ సుఖ సాధనములతో కాని నాకు సుఖము కలుగకున్నది. లోని వలపుమంట లెంతకును చల్లారుటలేదు. సెజ్జ-విడెము - గీత వాద్యములు ఇవేవియు నా మనస్సునకు ప్రీతి గొలుపుట లేదు నా కన్నులును తృప్తి నొందుటలేదు. ఆ శఠుడున్న చోటికే పోవుదునా అనిపించుచున్నది. పితృపరాధీనను కావునను కుల లజ్జవలనను వెఱచుచున్నాను. నా తండ్రి యింకను నా స్వయంవరమును కేర్పాటు చేయుటలేదు. ఏమి చేయుదును? తండ్రి స్వయంవరమును ఏర్పాటు చేసినచో నా అనురాగమును సుదర్శనునికే అర్పింతును. సకల సంపత్‌ సంపన్నులగు నరపతు లితరు లెందఱో కలరు. కాని, వారియందు నా మది తగులుట లేదు. ఆ సుదర్శనుడు రాజ్యహీనుడైనను నా కిష్టుడగుచున్నాడు.

వ్యాసః: ఏకాకీ నిర్ధన శ్చైవ బలహీనః సుదర్శనః | వనవాసీ ఫలాహార స్తస్యాశ్చిత్తే సుసంస్థితః 12

వాగ్బీజస్య జాపత్సిద్ధి స్తస్యాఏషా%వ్యుపస్థితా | సో%పి ధ్యానపరో%త్యంతం జజాప మంత్రముత్తమమ్‌. 13

స్వప్నే వశ్యత్యసౌ దేవీం విష్ణుమాయా మఖండితామ్‌ | విశ్వ మాతర మవ్యక్తాం సర్వసంపత్కరాంబికామ్‌. 14

శృంగబేరపురాధ్యక్షో నిషాదః సముపేత్య తమ్‌ | దదౌ రథవరం తసై#్మ సర్వోపస్కరసంయుతమ్‌. 15

చతుర్భి స్తురగై ర్యుక్తం పతాకావరమండితమ్‌ | జైత్రం రాజసుతే జ్ఞాత్వా దదౌ చోపాయనంతదా. 16

సో%పి జగ్రాహ తత్ప్రీత్యా మిత్రత్వేన సుసంస్థితం | వన్యై ర్మూలఫలైః సమ్య గర్చ యామాస శంబరమ్‌. 17

కృతాతిథ్యే గతే తస్మి న్నిషాదాధిపతౌ తదా | మునుయః ప్రీతియుక్తాస్తే తమూచు స్తాపసా మిథః. 18

రాజపుత్ర! ధ్రువం రాజ్యం ప్రాప్స్యసి త్వం చ సర్వథా | స్వల్పై రహోభి రవ్యగ్రః ప్రతాపాన్నా త్రసంశయః. 19

ప్రసన్నా తే%ంబికాదేవీ వరదా విశ్వమోహినీ | సహాయస్తు సుసంపన్నో మా చింతాం కురు సువ్రతః. 20

మనోరమాం తథోచుస్తే మునయః సంశితవ్రతాః | పుత్రస్తే%ద్య ధరాధీశో భవిష్యతి శుచిస్మితే: 21

సా తానువాచ తన్వంగీ వచనం లో%స్తు సత్ఫలమ్‌ | దాసో%యం భవతాం విప్రాః కిం చిత్రం సదుపాసనాత్‌. 22

న సైన్యం సచివాః కోశో న సహాయశ్చ కశ్చస | కేన యోగేన పుత్రో మే రాజ్యం ప్రాప్తు మిహార్హతి. 23

ఆశీర్వాదైశ్చ వో నూనం పుత్రో%యం మే మహీపతిః | భవిష్యతి న సందేహో భవంతో మంత్ర విత్తమాః 24

వ్యాసుడిట్లనె: ఇట్లు నిర్ధనుడు బలహీనుడు ఫలాహారి వనవాసి యేకాకి యగు సుదర్శనుడే యామె చిత్తమున దృఢముగ నిలిచెను. ఆమెకు ఈ స్థితి వాగ్బీజ జపమువలన కలిగిన సిద్ధియే. ఆ సుదర్శనుడును కామరాజ బీజమును ధ్యాన పరుడై జపించుచుండెను. అతడు కలలో విశ్వమాత - అవ్యక్తరూప-సర్వసంపత్కర-విష్ణుమాయారూప యగు దేవిని - అంబికను సందర్శించెను. శృంగవేరపురపతియగు నిషాదు డొక డా సుదర్శనుని ఆశ్రయించి యతనికి సకల సామగ్రితో నిండినదై నాల్గు గుఱ్ఱములతో టెక్కెముతో నలంకృతమై యొప్పు జైత్రరథమును కానుకగ సమర్పించెను. సుదర్శను డా నిషాదునితో నేస్తము చేసికొని యరదము స్వీకరించి అతనిని వన్యఫల మూలములతో చక్కగ ఆదరించి సంతుష్టుని జేసెను. అట్లు నిషాదుడాతిథ్యము స్వీకరించి యేగిన పిమ్మట నితర తపస్వులు ఏకాంతమున నెమ్మిగదుర సుదర్శనున కిట్లు పలికిరి: ఓ రాజపుత్త్రా! నీవు కొలది దినములకే నిస్సంశయముగ నెల్ల భంగుల నిజప్రతాపమున నీ రాజ్యమును బడయగలవు. ఆ వరదాయిని జగన్మోహిని అగు పరాదేవత నీయందు సుప్రన్నయై నిండియున్నది. ఆ తల్లి నీకన్ని విధముల సాయపడును. ఇక నావంతయు వంతజెందకుండుము. ఆత్మమననశీలురగు మునులు మనోరమతో ఓ శుచిస్మితా! నీ తనయుడు తప్పక నరపతిగా గల'డనిరి. ఓ విప్రులారా! మీ వాక్కమోఘము, సత్ఫలప్రదము. ఇతడు మీ దాసుడు. సాధు సంసేవనమువలన రాజ్యప్రాప్తి గల్గుటాశ్చర్యము గాదు. నా కుమారన కొక సైన్యబలము కోశబలము సచివులు సహాయకులు నెవ్వరును లేరు. ఐన నితడు యోగబలమున రాజ్యము సంపాదించుటకు యోగ్యుడు గాగలడు. మీరలు మంత్రవేత్తలు. మీ యాశీర్బలమున నా కొమరుడు తప్పక మహీపతి గాగల'డని మనోరమ యనెను.

వ్యాసః : రథా రూఢః సమేధానీ యత్రయాతి సుదర్శనః | అక్షౌహిణీ సమావృత్త ఇవా%%భాతి స తేజసా. 25

ప్రతాపో మంత్రబీజస్య నాన్యః కశ్చన భూపతే | ఏవంవై జపత స్తస్య ప్రీతియుక్త స్య సర్వథా. 26

సంప్రాప్య సద్గురోర్బీజం కామరాజాఖ్యమద్భుతమ్‌ | జపేద్యస్తు శుచిః శాంతః సర్వాన్కామానవాప్నుయాత్‌. 27

నతదస్తి పృథివ్యాం వా దివి వా%పి సుదర్లభం | ప్రసన్నాయాః శివాయాశ్చ యదప్రాప్యం నృపోత్తమ. 28

తే మందాస్తే%తి దుర్భాగ్యా రోగైస్తే సమభిద్రుతాః | యేషాం చిత్తే న విశ్వాసో భ##వే దంబార్చనాదిషు. 29

యా మాతా సర్వదేవానాం యుగాదౌ పరికీర్తితా | ఆదిమాతేతి విఖ్యాతా నామ్నాతేన కురూద్వహ. 30

బుద్ధిః కీర్తి ర్ధృతి ర్లక్ష్మీః శక్తిః శ్రద్ధామతిః స్మృతిః | సర్వేషాం ప్రాణినాం సావై ప్రత్యక్షం వై విభాసతే. 31

న జానంతి నరా యే వై మోహితా మాయయా కిల | న భజంతి కుతర్కజ్ఞా దేవీం విశ్వేశ్వరీం శివామ్‌. 32

బ్రహ్మా విష్ణు స్తథా శంభు ర్వాసవో వరుణోయమః | వాయు రగ్నిః కుబేరశ్చ త్వష్టా పూషా%శ్వినౌ భగః. 33

ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవ మరుద్గణాః | సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణీమ్‌. 34

కో న సేవేత విద్యాన్వై తాం శక్తిం పరమాత్మికాం | సుదర్శనేన సా జ్ఞాతా దేవీ సర్వార్థదా శివా. 35

బ్రహ్మైవ సా%తి దుష్ట్రాపా విద్యా%విద్యా స్వరూపిణీ | యోగగమ్యా పరాశక్తి ర్ముముక్షూణాం చ వల్లభా. 36

పరమాత్మ స్వరూపం కో వేత్తు మర్హతి తాం వినా | యా సృష్టిం త్రివిధాం కృత్వా దర్శయ త్యఃలాత్మనే. 37

వ్యాసు డిట్లనియె : ఆ మేధావియగు సుదర్శను డెక్కడక్కడి కేగునో యక్కడక్కడ నెల్ల నతడు దివ్య తేజమున నక్షౌహిణీ సేనాసమేతుడైనట్లు భాసిల్లుచుండెను. దీనికంతకు నతడు ప్రతి నిత్యము ప్రీతితో జపించు నతని కామరాజ బీజమంత్ర ప్రభావము మూలకారణము. మరేదియు కాదు. కనుక కామరాజబీజమగు దేవీమంత్రమును బడసి యెవడు శుచియై శాంతుడై దానిని నిత్యము జపించునో వాని వాంఛితము లెల్ల నీడేరును. నరోత్తమా! శివా భగవతి సుప్రసన్నయైనచో నీ యీ రేడు భువనాలలో దుర్లభ##మైనది ప్రాప్యము కానిది ఏదియులేదు. ఎవ్వరి చిత్తమందు శ్రీ జగదం బార్చన చేయుట కాత్మ విశ్వాసము గలుగదో వారు మూఢులు మందులు భాగ్యహీనులు రోగపీడితులు. తొల్లి యుగాదియందే దేవదేవి సకల దేవబృందముచేత విశ్వమాతగ నేకగ్రీవముగ నుతింపబడెనో యా తల్లి యాదిమాతగ పేరెన్నిక గన్నది. ఎల్ల జీవరాసుల కా తల్లి శక్తి శ్రద్ధ బుద్ధి స్మృతి మతి కీర్తిలక్ష్మి - ఈ రూపములతో ప్రత్యక్షముగ నిత్యము భాసిల్లుచుండును. మాయా మోహితులును కుతర్కవాదులు నగు మూఢు లా విశ్వేశ్వరిని శివరూపయగు దేవి నెఱుగలేక దేవిని భజింపజాలరు. బ్రహ్మ విష్ణు మహేశులు ఇంద్రాగ్నియమ వరుణ వాయు కుబేరులు త్వష్ట పూషాశ్వినులు భగుడు వసు రుద్రాదిత్యులు - విశ్వేదేవతలు - మరుద్గణములు నెల్లరు నా సృష్టి స్థిత్యంత కారిణియగు పరాదేవిని ధ్యానింతురు. ఇట్టి పరమాత్మికా దివ్యశక్తిని విబుధుడైన వాడేవాడు సేవింపకుండును? ఆ సర్వార్థప్రదయగు శివాదేవి సుదర్శనునిచేత గుర్తింపబడినది. ఆ పరదాదేవి విద్యా విద్యా స్వరూపిణి మిక్కిలి దుష్ప్రాపయగు బ్రహ్మమే అనగా సంవిద్రూపిణి. పరమయోగగమ్య యగు నాపరాశక్తి ముముక్షువులకు ప్రియమైనది. త్రివిధమైన సృష్టి సలిపి దానిని సర్వప్రాణులకు గోచరింపజేయు ఆ తల్లి దయలేనిచో పరమాత్మ స్వరూపమును నెవ్వడును గ్రహింపజాలడు.

సుదర్శన స్తు తాం దేవీం మనసా పరిచింతయన్‌ | రాజ్యలాభా త్పరం ప్రాప్య సుఖం వై కాననే స్థితః. 38

సా2పి చంద్రకళా%త్యర్థం కామబాణప్ర పీడితా | నానోపచారై రనిశం దధార దుఃఃతం వపుః. 39

తావత్త స్యాః పితా జ్ఞాత్వా కన్యాం పుత్త్రీంవరార్థినీమ్‌ | సుబాహుః కరాయామాస స్వయంవర మతంద్రితః. 40

స్వయం వరస్తు త్రివిధో విద్వద్భిః పరికీర్తి తః | రాజ్ఞాం వివాహ యోగ్యోవై నాన్యేషాం కథితః కిల. 41

ఇచ్ఛాస్వయంవర శ్చైకో ద్వితాయశ్చ పణాభిదః | యథా రామేణ భగ్నం వైత్య్రంబకస్య శరాసనమ్‌. 42

తృతీయః శౌర్యశుల్కశ్చ శూరాణాం పరికీర్తితః | ఇచ్ఛాస్వయంవరం తత్ర చకారనృపసత్తమః 43

శిల్పిభిః కారితా మంచాః శుభై రాస్తరణౖర్యుతాః | తతశ్చ వివిధాకారః సుక్లప్తాః సభ్యమండపాః. 44

ఏవం కృతే%తి సంభారే వివాహార్థం సువిస్తరే | సఖీం శశికళా ప్రాహదుఃఃతా చారులోచనా. 45

ఇదం మే మాతరం బ్రూహి త్వమేకాంతే వచో మమ | మయా వృతః పతిశ్చిత్తే ధ్రువసంధిసుతః శుభః. 46

నాన్యం వరం వరిష్యామి తమృతే వై సుదర్శనం | సమే భర్తా నృపసుతో భగవత్యా ప్రతిష్ఠితః. 47

సుదర్శునుడా జగన్మాతను నెమ్మదిలో జింతించుచు రాజ్య లాభమునకంటె మిన్నయగు స్వాత్మ సుఖముబడసి నుడవిలో నుండెను. ఇట శశికళయును మదన బాణములచే మిగుల బాధింపబడినదగుటచే శిశిరోపచారములెన్ని చేసినను దుఃఖాన్వితమగు దేహముతోనే యుండెను. అంతలో సుబాహువును తన కూతురు తనకునచ్చిన వరుని వరింప గోరుచున్నదని తెలిసికొని వెంటనే స్వయంవరము చాటించెను. రాజకుమారులకు వివాహయోగ్యములగు స్వయం వరములు ముత్తెఱంగుల నుండునని పండితులందురు. ఇతరులకు కాదు. అందు మొదటి దిచ్ఛాస్వయంవరము. రెండవది పణము (పందెము) గలది. ఎటులనగా, శ్రీరాముడు శివధనుర్భంగముచేసి సీతను గైకొనెను. మూడవది శూరులకు సంబంధించినది. అది వీర్యశుల్కము గలది. దీనిలో సుబాహు డిచ్ఛాస్వయంవరమును చాటించెను. శిల్పకారులు సభ్యులకొఱకు శుభాసనములు గల మంచెలు వివిధాకార మంటపములు నాయత్త మొనరించిరి. వివాహార్థము వలయు వస్తు సామాగ్రులధికముగ సమకూర్చబడెను. అపుడు చారులోచనయగు శశికళ దుఃఃతమతితో తన చెలికత్తెతో నీవు నా తల్లిచెంతకేగి రహస్యముగ నా మాటగ ధ్రువసంధి తనయునే నేను వరించితినని పలుకుము. ఆ సుదర్శనునిగాక నే నితరుని వరింపజాలను. ఆ నృపసుతుడే నాకు భర్తగాగలడని తొల్లి భగవతి విధించెను అని చెప్పెను.

వ్యాసః : ఇత్యుక్తా సా సఖీ గత్వా మాతరం ప్రాహ సత్వరా| వైదర్భీవం విజనే వాక్యం మధురం మంజుభాషిణీ. 48

పుత్త్రీతే దుఃఃతా ప్రాహ సాధ్వి! త్వాం మన్ముఖేన యత్‌ | శృణుత్వం కురుకళ్యాణి ! తద్ధితం త్వరితా%ధునా. 49

భారద్వాజాశ్రమే పుణ్య ధ్రువసంధి సుతో%స్తియః | సమేభర్తా వృత శ్చిత్తే నాన్యం భూపం వృణోమ్యహమ్‌. 50

వ్యాసః. రాజ్ఞీ తద్వచనం శుత్వా స్వపతౌ గృహమాగతే | నివేదయామాస తదా పుత్త్రీవాక్యం యథాతథమ్‌. 51

తచ్ఛ్రుత్వా వచనం రాజా విస్మితః ప్రహస న్ముహుః | భార్యా మువాచ వైదర్భీం సుబాహుస్తుఋతంవచః. 52

సుభ్రు! జానాసి బాలో%సౌ రాజ్యాన్నిష్కాసితో వనే | ఏకాకీ సహ మాత్రా వై వసతే నిర్జనే వనే. 53

తత్కృతే నిహతో రాజా వీరసేనో యుధాజితా | స కథం నిర్ధనో భర్తా యోగ్యః స్యాచ్చారులోచనేః. 54

బ్రూహి పుత్త్రీంతతో వాక్యం కదాచిదపి విప్రియం | ఆగమిష్యంతి రాజానః స్థితిమంతః స్వయంవరే. 55

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే%ష్టాదశో%ధ్యాయః

ఆ మంజుభాషిణియగు చెలియ వేగమే శశికళ తల్లియగు వైదర్భినిజేరి మధుర వచనముల నామెతో ఓ సాధ్వీ! అతి దుఃఃత యగు నీ పుత్త్రి నా నోట తెల్పిన వార్త విని వెంటనే యా కళ్యాణికి కళ్యాణము చేకూర్చుము. నేను భారద్వాజాశ్రమ మందున్న ధ్రువసంధి సుతనే నా భర్తగ మనసున వరించితిని. ఇతరునెవ్వని గోరను అని యామె పలుకుచున్నది అనెను. అంతలో నచటికి వచ్చిన రాజునకు రాణి తన గాదిలి కూతు కోరికను ఉన్నది ఉన్నట్లుగా విన్నవించెను. సుబాహుడామె పలుకు లాలించి విస్మయమంది పకపకనగుచు తన భార్యకిట్లనియెను. ఓ సుభ్రు! ఆ బాలుడు చిన్నప్పుడే రాజ్యభ్రష్టుడై నిర్జన వనమున తన తల్లితో నొంటిగ నివసించుచున్నాడని నీ వెఱుగుదువుగద! ఓ చారులోచనా! యుధాజిత్తువలన వీరసేను డంతమొందెను. అట్టి నిర్ధనుడు మన సులోచనకెట్లు పతిగ తగియుండును? కావున మన పుత్రికకు చెప్పుము. నీ వాక్యమెప్పుడైనను విప్రియమైనదియే. స్వయంవరమునకు స్థితిమంతులగు రాజాధిరాజు లెందఱో విచ్చేతురు.

ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయస్కంధమున పదునెనిమిదవ అధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters