Sri Devi Bhagavatam-1
Chapters
పంచమోధ్యాయః ఋషయ ఊచుః: సూతాస్మాకం మనః కామం మగ్నం సంశయ సాగరే | యథోక్తం మహదాశ్చర్యం జగద్విస్మయకారకమ్
1 యన్మూర్థా మాధవస్యాపి గతో దేహా త్పునః పరమ్ | హయగ్రీవ స్తతో జాతః సర్వకర్తా జనార్దనః 2 దేవో%పి స్తౌతి యం దేవం దేవాః సర్వే యదాశ్రయాః | ఆదిదేవో జగన్నాథః సర్వకారణకారణః 3 తస్యాపి వదనం ఛిన్నం దైవయోగా త్కథం | తత్సర్వం కథయా%%శు త్వం విస్తరేణ మహామతే 4 సూత ఉవాచ : శృణ్వంతు మునయః సర్వే సావధానాః సమంతతః | చరితం దేవదేవస్య విష్ణోః పరమతేజసః 5 కదాచి ద్దారుణం యుద్ధం కృత్వా దేవః సనాతనః | దశవర్షసహస్రాణి పరిశ్రాంతో జనార్దనః 6 సమే దేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం విభుః | ఆవలంబ్య ధనుః సజ్యం కంఠదేశే ధరాస్థితమ్ 7 దత్వా భారం ధనుష్కోట్యాం నిద్రా మాప రమాపతిః శ్రాంతత్వా ద్దైవయోగాచ్చ జాత స్తత్రాతినిద్రితః 8 తా కాలేజన కియతా దేవాః సర్వే సవాసవాః | బ్రహ్మేశ సహితాః సర్వేయజ్ఞం కర్తుం సముద్యతాః 9 గతాః సర్వే%థ వైకుంఠం ద్రష్టుం దేవం జనార్దనమ్ | దేవకార్యార్థసిద్ధ్యర్థం మాఖానా మధిపం ప్రభుమ్ 10 ఐదవ అధ్యాయము శ్రీ హయగ్రీవావతారవర్ణనము ఋషులనిరి: ఓ సూత మహర్షీ! లోకములకు వింత - యచ్చెరువు గొలుపు కత మాకు వినిపించితివి. అది విని మా మనంబులు సంశయ సాగరమున కొట్టుమిట్టాడుచున్నవి. ఆ భగవానుడు మాధవుని తల శరీరమునుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్తయగు జనార్దనుడు హయగ్రీవ రూపము దాల్చెననియు అంటివి. దేవతలెల్ల రేదేవ దేవుని ప్రస్తుతింతురో విబుధులెల్లరు సర్వము తానయైన యే విష్ణువు నాశ్రయింతురో అతడే జగన్నాథుడు - ఆదిదేవుడు - సర్వకారణ కారణుడును. అట్టివాని తలయును ఎట్టి విధియోగమున దెగిపడినది? ఆ కథయంతయును మాకు విశదముగ తెలుపుము. సూతుడిట్లనియె: ఓ మునులారా! దేవదేవుడును పరమతేజస్వియగు శ్రీ మహావిష్ణుని పావన చరిత సావధానముగ చెవులార వినుడు. సనాతనుడును భగవానుడు నగు జనార్దనుడు తొల్లి పదివేలేండ్లు భీకరమైన పోరాటము సలిపి మిక్కిలి యలసట జెందెను. అపుడతడు సమప్రదేశమున పద్మాసనముపై కూర్చుండి ఎక్కు పెట్టిన విల్లు తన కంఠ పురోభాగమునకు నానించుకొని అలసట చెందియుండుటచే వింటికొనపై తన మేనిబరువంతయు నుంచి నిదురించెను. కొంతకాలము గడిచిన పిమ్మట నింద్రుడు మున్నగు దేవతలెల్లరును బ్రహ్మతోగూడి యొక యాగము సేయదలంచిరి. మహాయజ్వయగు విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యాగాధిపత్యము వహించుటకును సమర్థుడని తలచి బ్రహ్మాదులు జనార్దనుని దర్శింప వైకుంఠమేగిరి. అదృష్టా తం తదా తత్ర జ్ఞానదృష్ట్యా విలోక్యతే | యత్రాస్తే భగవా న్విష్ణు ర్జగ్ము స్తత్ర తదా సురాః. 11 దదృశు స్తే తదేశానం యోగనిద్రావశం గతమ్ | విచేతనం విభుం విష్ణుం తత్రాసాం చక్రిరే సురాః. 12 స్థితేషు సర్వదేవేషు నిద్రాసుప్తే జగత్పతౌ | చింతా మాపుః సురాః సర్వే బ్రహ్మరుద్ర పురోగమాః. 13 తా నువాచ తతః శక్రః కిం కర్తవ్యం సురోత్తమాః | నిద్రాభంగః కథం కార్యశ్చింతయంతు సురోత్తమాః 14 త మువాచ తదా శంభు ర్నిద్రాభంగే%స్తి దూషణమ్ | కార్యం చైవ ప్రకర్తవ్యం యజ్ఞస్య సురసత్తమాః 15 ఉత్పాదితా తదా వమ్రీ బహ్మ్రణా పరమేష్ఠినా | తయా భక్షయితుం తత్ర ధనుషో%గ్రం ధరాస్థితమ్. 16 భక్షితే %గ్రే తదా% నిమ్నం గమిష్యతి శరాసనమ్ | తదా నిద్రావిముక్తో%సౌ దేవదేవో భవిష్యతి. 17 దేవకార్యం తదా సర్వం భవిష్యతి న సంశయః | స వమ్రీం సందిదేశా%థ దేవదేవః సనాతనః 18 త మువాచ తదా వమ్రీ దేవదేవన్య మాపతేః | నిద్రాభంగః కథం కార్యో దేవస్య జగతాం గురోః 19 నిద్రాభంగః కథాచ్ఛేదో దంపత్యోః ప్రీతిభేదనమ్ | శిశుమాతృవిభేదశ్చ బ్రాహ్మహత్యాసమం స్మృతమ్ 20 తత్కథం దేవదేవస్య కరోమి సుఖనాశననమ్ | కిం ఫలం భక్షణా ద్దేవ యేన పాపం కరోమ్యహమ్. 21 సర్వః స్వార్థవశో లోకః కురుతే పాతకం కిల | తస్మా దహం కరిష్యామి స్వార్థమేవ ప్రభక్షణమ్. 22 అచట వారికి హరి కనబడలేదు. వారు జ్ఞానదృష్టితో విష్ణుడున్న జాడ నెఱిగి యచ్చోటి కరిగిరి. నిశ్చలముగ యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈశానుని గనుంగొనిరి. బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమచింతాక్రాంతులైరి. అంత నింద్రుడు వారి కిట్లనియె : ఓ సురలారా! ఇపుడు మన కర్తవ్యమేమి? ఆ హరికి నిద్రాభంగము చేయుట తగదు. అది మహాదోషము. కనుక మీరలెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు. బ్రహ్మ యిట్లనియె : ''నేను చెదపురుగును పుట్టించి యీ నేలనున్న వింటికొనను తినుటకు దాని నాదేశింతును. చెద పురుగు వింటికొనను తినగా నారి తెగును. అపుడు గాని యీ దేవదేవుడు నిదురనుండి మేలుకొనడు! దానివలన దేవకార్యము నెరవేరును. ఇందు సంశయము లేదు.'' అని దేవదేవుడగు బ్రహ్మ చెద పురుగు నాదేశించెను. చెద పురు గిట్లనెను : రమాపతియు జగద్గురుడునగు దేవదేవునకు నేను నిద్రాభంగమెట్లు గల్గింతును? ఎవ్వరికైనను నిద్ర చెడగొట్టుట సత్కథలు వినకుండ చేయుట భార్యాభర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లినుండి శిశువును వేరు చేయుట - ఇవి బ్రహ్మహత్యాసమములని స్మృతులు వక్కాణించును. ఆ దేవదేవుని నిద్రాసుఖమున కెట్లు నేను భంగము కల్గింతును? దానిని తినుట వలన నాకు వచ్చెడి ఫలితమేమి? నేను పాపినగుటయే కదా? లోకములన్నియు తఱచుగ స్వార్థపీడితములై ఘోరదురితములు చేయుచుండును. అట్టి స్వార్థ మాశించియే నేనును తినవలయునా? బ్రహ్మోవాచ : తవ భాగం కరిష్యామో మఖమధ్యే యథా శృణు | తేన త్వం కురు కార్యం నో విష్ణుం బోధయ మా పరమ్. 23 హోమకర్మణి పార్శ్వే చ హవిర్దానా త్పతిష్యతి | తం తే భాగం విజానీహి కురుకార్యం త్వరాన్వితా. 24 సూత ఉవాచ : ఇత్యుక్తా బ్రహ్మణా వమ్రీ ధనుషో%గ్రం త్వరానితా | చఖాద సంస్థితం భూమౌ విముక్తా జ్యా తదా%భవత్ 25 ప్రత్యంచాయాం విముక్తాయాం ముక్తా కోటి స్తథోత్తరా | శబ్దః సమభవ ద్ఘోర స్తేన త్రస్తాః సురా స్తదా. 26 బ్రహ్మాండం క్షుభితం సర్వం వసుధా కంపితా తదా | సముద్రాశ్చ సముద్విగ్నా స్త్రేసుశ్చ జలజంతవః 27 వవు ర్వాతా స్తథా చోగ్రాః పర్వతాశ్చ చకంపిరే | ఉల్కాపాతా మహోత్పాతా బభూవు ర్దుఃఖశంసినః 28 దిశో ఘోరతరా శ్చాస న్సూర్యో%ప్యస్తం గతో%భవత్ | చింతా మాపుః సురాః సర్వే కిం భవిష్యతి దుర్దినే. 29 బ్రహ్మయిట్లనియె : యాగములో నీకు కొంత భాగమేర్పరతుము. కనుక నీవు వెంటనే విష్ణుడు మేల్కొనునట్లు చేయుము. మా కార్యము నెరవేర్చుము. యజ్ఞములందు వేల్చునపుడు హవిస్సునుండి కొంత ప్రక్కలకు బడును. అది నీ భాగమని తెలిసికొనుము. ఇక త్వరగ నీ పని కొనసాగింపుము. సూతుడిట్లనియె : ఆ విధముగ బ్రహ్మ పలుకగా చెదపురుగు వెనువెంటనే వింటి నారిని కొరికెను. వెంటనే వింటి నుండి నారి తెగిపడెను. తత్ఫలితముగ విల్లు నేలపై బడినది. పడుటయే తడవుగ ఘోర శబ్ద ముప్పతిల్లెను. అది విని దేవతలందఱును భయపడిరి. బ్రహ్మాండము దద్దరిల్లెను. భూమి కంపించెను. సంద్రము లల్లకల్లోలమందెను. జలజంతువు లదరిపడెను. పెనుగాలులు వీచెను. గిరులు గ్రక్కదలెను. దుఃఖసూచకములును మహోత్పాతములునగు ధూమకేతువులు రాలిపడెను. ఎల్లదెసలు ఘోర రూపము దాల్చెను. సూర్యు డస్తమించెను. ఇట్టి దుర్దినమున నేమి మూడునో కదా! యని వేల్పులెల్లరు పెల్లుగ జింతిల్లిరి. ఏవం చింతయతాం తేషాం మూర్థా విష్ణోః సకుండలః | గతః సమకుటః క్వాపి దేవదవస్య తాపసాః. 30 అంధకారే తదా ఘోరే శాంతే బ్రహ్మహరౌ తదా | శిరోహీనం శరీరం తు దదృశాతే విలక్షణమ్. 31 దృష్ట్వా కబంధం విష్ణోస్తే విస్మితాః సురసత్తమాః | చింతాసాగరమగ్నాశ్చ రురుదుః శోకకర్శితాః 32 హా నాథ! కిం ప్రభో జాత మత్యద్భుత మమానుషమ్ | వైశసం సర్వదేవానాం దేవదేవ| సనాతన. 33 మాయేయం కస్య దేవస్య యయా తే%ద్య శిరో హృతమ్ | అచ్ఛేద్యస్త్వ మభేద్యో%సి అస్యదాహ్యో%పి సర్వదా 34 ఏవం గతే త్వయి విభో మరిష్యంతి చ దేవతాః | కీదృశ స్త్వయి నః స్నేహః స్వార్థేనైవ రుదామహే. 35 నాయం విఘ్నః కృతో దైత్యై ర్న యక్షై ర్న చ రాక్షసైః | దేవై రేవ కృతః కస్య దూషణం చ రమాపతే. 36 పరాధీనాః సురాః సర్వే కిం కుర్మః క్వ వ్రజామ చ | శరణం నైవ దేవేశ సురాణాం మూఢ చేతసామ్. 37 న చైషా సాత్త్వికీ మాయా రాజసీ న చ తామసీ | యయా భిన్నం శిరస్తే %ద్య మాయేశస్య జగద్గురోః 38 క్రందమానాం స్తదా దృష్ట్యా దేవాన్ శివపురోగమాన్ | బృహస్పతి స్తదోవాచ శమయ న్వేదవిత్తమః. 39 రుదితేన మాహాభాగాః క్రందితేన తథా%పికిమ్ | ఉపాయ శ్చా %త్ర కర్తవ్యః సర్వథా బుద్ధిగోచరః 40 దైవం పురుషకారశ్చ దేవేశ సదృశా వుభౌ | ఉపాయశ్చ విధాతవ్యో దైవా త్ఫలతి సర్వథా. 41 అమరులిట్లు చింతించుచుండగనే దేవదేవుడగు విష్ణునియొక్క కిరీటకుండలములతో శోభిల్లు తల అదృశ్యమయ్యెను. కొంతవడికి వెఱపుగొలుపు పెంజీకట్లు విరిసెను. బ్రహ్మరుద్రాదిదేవతలపుడు తలలేని హరి మొండెమును గని విస్మితులై శోకసాగరమున మునిగి యిట్లు వాపోయిరి : జగన్నాథా, ప్రభూ! ఇది నీ యమానుషలీలా రూపమా యేమి? సనాతనా! దీనివలన వేల్పులకందఱకును వంత మిక్కుటమైనది. నీవు అచ్ఛేద్యుడవు - ఆదాహ్యుడవు - అక్లేద్యుడవు - అశోష్యుడవు - నిత్యుడవు. ఇంతటి నీ తల తెగుట కేదేవతమాయ హేతువో కదా! నీ విటుల తలలేకున్నచో దేవత లెల్లరు వసువులు గోల్పోవుదురు. మాకు నీయందిం కెటుల ప్రీతి గల్గును? కావున మేము మా స్వార్థము గోరి శోకించుచున్నాము. రమావల్లభా! ఇంతటి ఘోరమే దైత్యులచేగాని యక్షులచేతగాని రాక్షసులచేగాని సాధ్యము కాదు. ఇది దేవతల వలననే జరిగి యుండును. కావున నెవరిని నిందించగలము? ఎవరిని దూషించగలము! దేవేశా! మేమెల్ల దేవతలము పరతంత్రులము. మేమిపుడేమి చేయవలయునో యెచటి కేగవలయునో - మూఢమతులమగు మాకింక శరణ్యమెవ్వరో ఏమియును దోచుట లేదు. విష్ణువు మాయాపతి యగుట వలన సత్వరజస్తమ శ్శక్తులు గల మాయ యీ జగద్గురుని తల ఛేదింపనోపదు. శివుడు మున్నగు దేవతలీతీరున వాపోవుచుండిరి. అదంతయు విని వేదవిదుడగు దేవగురుడు వారి బిట్టేడ్పు చల్లార్పదలచి వారి కిట్లు పలికెను : ఓ మహాభాగులారా! ఇట్లు రోదించుటవలన నేమి ప్రయోజనము? ఇపుడెల్ల విధముల చక్కని బుద్ధితో నుపాయ మాలోచించుటయే మన కర్తవ్యము. ఇంద్రా! అదృష్టము పురుషకారమును రెండును సమానములే. కనుక మతిమంతుడు తొలుత నుపాయ మాలోచించవలయును. పిదప తప్పక దైవ మనుకూలించును. ఇంద్ర ఉవాచ : దైవమేవ వరం మన్యే ధిక్పౌరుష మనర్థకమ్ విష్ణో రపి శిర చ్ఛిన్నం సురాణాం చైవ పశ్యతామ్. 42 బ్రహ్మోవాచః : అవశ్య మేవ భోక్తవ్యం కాలే నాపాదితం చ యత్ | శుభం వా%ప్యశుభం వా% పి దైవం కో %తిక్రమే త్పునః 43 దేహవాన్సుఖదుఃఖానాం భోక్తా నైవాత్ర సంశయః | యథా కాలవశాత్ కృత్తం శిరో మే శంభునా పురా 44 తథైవ లింగ పాతశ్చ మహాదేవస్య శాపతః | తథైవాద్య హరే ర్మూర్ధా పతితో లవణాంభసి. 45 సహస్రభగసంప్రాప్తి దుఃఖం చైవ శచీపతేః | స్వర్గా ద్భ్రంశ స్తథా వాసః కమలే మానసే సరే. 46 ఏతే దుఃఖస్య భోక్తారః కేన దుఃఖం న భుజ్యతే | సంసారే%స్మి న్మహాభాగా స్తస్మా చ్ఛోకం త్యజంతువై 47 చింతయంతు మహామాయం విద్యాం దేవీం సనాతనీమ్ | సా విధాస్యతి నః కార్యం నిర్గుణా ప్రకృతిః పరా. 48 బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా | యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరమ్. 49 ఇంద్రు డిట్లనెను : దైవమే బలవత్తరమైనది. పురుషార్థ మనర్థమునకు దారితీయును. అది వ్యర్థము. మనకండ్ల యెదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడెనుగదా! బ్రహ్మ యిట్లనియె: కాలానుగుణముగ మంచిగాని చెడుగాని యేది ప్రాప్తించిన దానిని తప్పక యనుభవించి తీరవలయును. ఎట్టివాడును దైవమును మీరలేడుగదా! దేహధారియగు జీవుడు సుఖ దుఃఖములనుభవించి తీరవలయును. ఇందు సందియమే లేదు. నేనును కాలబద్ధుట నగుట చేతనే నా తల శివునిచేత ద్రుంప బడినది. శాపకారణమున హరుని లింగము పతనమందినది. నేడును హరితల తెగి లవణ సాగరమున బడినది. దేవేంద్రునంతటి వానికిని సహస్రభగుడగు దుఃఖము తప్పలేదు. అతడును పదభ్రుష్టుడై మానస సరస్సులో తల దాచుకొనెను. ఇంతటి వారే దుఃఖములు గఱచు చుండగ నిక దుఃఖించని మనుజు డెవ్వడు? ఈ ఘోర దుఃఖ సంసార సాగర మేరికిని దాటశక్యము గాదు. కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు. అందుచే మన మిపుడా మహామాయ శ్రీ విద్యామయి సనాతన పరా ప్రకృతియగు నిర్గుణదేవిని సంస్మరింతముగాక. ఆ దేవ దేవియే మనయెల్ల కార్యకములు చక్కగ సమకూర్చ గలదు. ఆమెయే బ్రహ్మ విద్య - జగద్ధాత్రి - విశ్వజనయిత్రి - చరా చరాత్మకమైన ముల్లోకములకు తల్లి. ఆ లోకములన్నియు నామెచేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి. సూత ఉవాచ : ఇత్యుక్త్వా వై సురా న్వేధా నిగమా నాదిదేశ హ | దేహయుక్తాన్ స్థితా నగ్రేసుర కార్యార్థ సిద్ధయే. 50 బ్రహ్మోవాచః : స్తువంతు పరమాం దేవీం బ్రహ్మ విద్యాంసనాతనీమ్ || గూఢాంగీం చ మహా మాయాం సర్వ కార్యార్థ సాధనీమ్. 51 తచ్ఛ్రుత్వా వచనం తస్య వేదాః సర్వాంగ సుందరాః తుష్టువుః జ్ఞానగమ్యాం తాం మమామాయాం జగత్ స్థితామ్. వేదా ఊచుః : నమో దేవి మహామయే విశ్వోత్పత్తికరే శివే | నిర్గుణ సర్వభూతేశి మాతః శంకర కామదే. 53 త్వం భూమిః సర్వ భూతానాం ప్రాణః ప్రాణవతాం తథా | ధీః శ్రీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా ధృతిః స్మృతిః. 54 త్వ ముద్గీథే%ర్థమాత్రా%సి గాయత్రీ వ్యాహృతి స్తథా | జయా చ విజయ ధాత్రీ లజ్జా కీర్తిః స్పృహా దయా. 55 త్వాం సంస్తుమోంబ భువనత్రయ సంవిధాన దక్షాం దయారసయుతాం జననీం జనానామ్, విద్యాం శివాం సకలలోకహితాం వరేణ్యాం వాగ్బీజ వాసనిపుణాం భవనాశకర్త్రీమ్. 56 బ్రహ్మా హరః శౌరిసహస్రవేత్ర వాగ్వహ్ని సూర్యా భువనాధినాథాః తే త్వత్కృతాః సంతి తతో న ముఖ్యా మాతా యత స్త్వం స్థిర జంగమానామ్. 57 సకల భువన మేత త్కర్తుకామా యదా త్వం సృజసి జనని దేవా న్విష్ణురుద్రాజముఖ్యాన్ స్థితిలయజననం తైః కారయ స్యేకరూపా న ఖలు తవ కథంచి ద్దేవి సంసారలేశః. 58 సూతు డిట్లనియె : అని యీ ప్రకారముగ బ్రహ్మ దేవతలతో పలికెను : పిదప బ్రహ్మ వేదముల నాదేశింపగ నవియు దేవకార్యము సాధించుటకు శరీరములు దాల్చి యతని యెట్టయెదుట నిలుచుండెను. మీరు సర్వ కార్యములు సఫల మొనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మ విద్యయు గూఢాంగియు మహామాయయు నగు మహాదేవిని సంస్తుతింపుడు అని వేదములను బ్రహ్మ యాదేశించెను. బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయుచున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసారవికారవాసనలు లేశమాత్రమున పొడసూపవు. న తే రూపం వేత్తుం సకలభువనే కో%పి నిపుణో న నామ్నాం సంఖ్యాం తే కథితు మిహ యోగ్యో%స్తి పురుషః య దల్పం కీలాలం కలయితు మశక్త స్స తు నరః కథం పారావారాకలన చతురః స్యాదృతమతిః. 59 నదేవానాం మధ్యే భగవతి తవానంత విభవం విజానాత్యేకో%పి త్వ మిహ భువనైకా%సి జనని : కథం మిథ్యా విశ్వం సకలమపి చైకా రచయసి ప్రమాణం త్వేతస్మి న్నిగమవచనం దేవి విహితమ్. 60 నిరీహైవాసి త్వం నిఖిలిజగతాం కారణ మహో చరిత్రం తే చిత్రం భగవతి మనో నో వ్యథయతి, కథంకారం వాచ్యః సకల నిగమాగోచర గుణ ప్రభావః స్వం యస్మా త్స్వయమపి న జానాతి పరమమ్ 61 న కింజానాసి త్వం జనని మధుజిన్మౌళిపతనం శివేకిం వాజ్ఞాత్వావివిదిషసి శక్తింమధుజితః! హరే కిం వా మాత ర్దురితతతి రేసా బలవతీ భవత్యాః పాదాబ్జే భజననిపుణ క్వాస్తి దురితమ్. 62 ఉపేక్షా కిం చేయం తవ సురసమూహే%తివిషమా హరే ర్మూర్థ్నో నాశో మత మిహ మహాశ్చర్యజనకమ్, మహద్దుఃఖం మాత స్త్వమసి జననచ్ఛేదకువలా న జానీమో మౌళే ద్విగన విలంబః కథమభూత్. 63 జ్ఞాత్వా దోషం సకలసురతాపాదితం దేవి చిత్తే కిం వా విష్ణా వమరజనితం దుష్కృతం పాతితం తే, విష్ణోర్వా కిం సమరజనితః కో%పి గర్వో%తివేగాత్ ఛేత్తుం మాత స్తవ విలసితం నైవ విద్మో%త్ర భావమ్. 64 కిం వా దైత్యః సమరవిజితై స్తీర్థదేశే సురమ్యే ఘోరం తప్త్వా భగవతి వరం లబ్ధవద్భి ర్భవత్యాః, అంతర్థానం గమిత మధునా విష్ణుశీర్షం భవాని ద్రష్టుం కిం వా విగతశిరసం వాసుదేవం వినోదః 65 సింధోః పుత్య్రాం దోషితా కిం త్వమాద్యే కస్మాదేనాం ప్రేక్షసే నాధహీనామ్, క్షంతవ్య స్తే స్వాంశజాతాపరాధో వ్యుత్థాపై#్యనం మోదితాం మాం కురుష్వ. 66 నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్యప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణభూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములన్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బలమెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది. ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము. భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరములొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందేమనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ! ఏతా సురా స్త్వాం సతతం నమంతి కార్యేషు ముఖ్యాః ప్రథిత ప్రభావాః, శోకార్ణవా త్తారయ దేవి దేవా నుత్థాప్య దేవం సకాలాధినాథమ్. 67 మూర్థా గతః క్వాంబ హరే ర్నవిద్మో నాన్యో%స్త్యుపాయః ఖలు జీవనే%ద్య| యథా సుధాజీవన కర్మదక్షా తథా జగజ్జీవితదా%సి దేవి! 68 సూత ఉవాచ : ఏవం స్తుతా తదా దేవీ గుణాతీతా మహేశ్వరీ | ప్రసన్నా పరమా మాయా వేదైః సాంగైశ్చ సామగైః 69 తా నువాచ తదా వాణీ చాకాశస్థా%శరీరిణీ | దేవాన్ప్రతి సుఖైః శ##బ్దైర్జనానందకరీ శుభా 70 మా కురుధం సురాశ్చింతాం స్వస్థా స్తి ష్ఠంతు చామరాః స్తుతాహం నిగమైః కామం సంతుష్టా%స్మిన సంశయంః 71 యః పుమా న్మానుషే లోకేస్తౌ త్యేతాం మామకీం స్తుతిమ్ | పఠిష్యతి సదాభక్త్యా సర్వాన్కామా నవాప్నుయాత్. 72 శృణోతి వా స్త్రోత్ర మిదం మదీయం భక్త్యా త్రికాలం సతతం నరో యః, విముక్త దుఃఖః స భ##వేత్సుఖీ చ వేదోక్త మేత న్నను వేదతుల్యమ్. 73 మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! సూతుడిట్లనియె ; ఈ ప్రకారముగ సాంగములగు వేదములతో సామగులు సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత - మహేశ్వరి - పరమమాయ పరమానంద భరితురాలయ్యెను. అంతలో నంతరంగముల కభిరామమైన యశరీరవాణి సుస్వరమున వేల్పుల నుద్దేశించి యిట్లు పలికెను. అమరులారా! నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని. మీరలు చింత - వంత వదలుడు. స్వస్థులుగండు, నా మాట నమ్ముడు. ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు. శృణ్వంతు కారణం చాద్యయద్గతం వదనం హరేః | అకారణం కథం కార్యం సంసారే%త్ర భవిష్యతి. 74 ఉదధే స్తనయాం విష్ణుః సంస్థితా మంతికే ప్రియామ్ | జహాస వదనం వీక్ష్య తస్యా స్తత్ర మనోహరమ్. 75 తయా జ్ఞాతం హరి ర్నూనం కథం మాం హసతి ప్రభుః | విరూపం హరిణా దృష్టం ముఖం మే కేన హేతునా. 76 వినా%పి కారణనాద్య కథం హాస్యస్య సంభవః | సపత్నీవ కృతా తేన మన్యే%న్యా వరవర్ణినీ. 77 తతః కోపయుతా జాతా మహాలక్ష్మీ స్తమోగుణా | తామసీతు తదా శక్తి స్తస్యా దేహే సమావిశత్. 78 కేనచి త్కాలయోగేన దేవకార్యార్థసిద్ధయే | ప్రవిష్టా తామసీ శక్తి స్తస్యా దేహే%తిదారుణమ్. 79 తామస్యా%%విష్టదేహా సా చుకోపాతిశయం తదా | శనకైః సమువాచేద మిదం పతతు తే శిరః 80 స్త్రీ స్వభావాచ్ఛ భావిత్వా త్కాలయోగా ద్వినిర్గతః | అవిచార్య తదా దత్తః శాపః స్వసుఖనాశనః 81 సపత్నీ సంభవం దుఃఖం వైధవ్యా దధికం త్వితి | విచింత్య మనసేత్యుక్తం తామసీ శక్తి యోగతః. 82 ఆనృతం సాహసం మాయా మూర్ఖత్వ మతిలోభతా | అశౌచం నిర్దయత్వం చ స్త్రీణాం దోషాః స్వభావజాః 83 సశీర్షం వాసుదేవం తం కరోమ్యద్య యథా పురా | శిరో%స్య శాపయోగేన నిమగ్నం లవణాంబుధౌ. 84 అన్యచ్చ కారణం కించి ద్వర్తతే సురసత్తమాః | భవతాం చ మహత్కార్యం భవిష్యతి న సంశయః. 85 లోకమందు కారణము లేక కార్యము లేదు. కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణమాలింపుడు. మున్నొకప్పుడు కడలిరాచూలి హరిప్రియురాలు హరి చెంతనే యుండెను. అత్తఱి మనోరమమగు నామె పద్మవదనముగని హరి నవ్వెను. నన్ను జూచి యూరకే మాధవుడేల నవ్వును? తప్పక యేదేని వికారము నా మొగమందా ప్రభునకు బొడగట్టి యుండనోపును. అకారణముగ నవ్వేల వచ్చును? ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగ నిల్చి యుండనోపునని లచ్చి తలంచెను. ఆమె మేనియందప్పుడు తామస శక్తి యావేశించి యుండెను. అందుచే నా మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యెను. ఆ సమయమున దైవయాగమునను దేవకార్యమునకు నామె శరీరమందు దారుణమైన తామసశక్తి నిండి మెండుకొని యుండినందున తదావేశముచే ''నీ తలతెగి పడిపోవుగాక!'' యని లక్ష్మి మెల్లగ హరితో ననెను. పరా దైత్యో మహాబాహు ర్హయగ్రీవో%తివిశ్రుతః | తప శ్చక్రే సరస్వతా స్తీరే పరమదారుణమ్. 86 జప న్నే కాక్షరం మంత్రం మాయాబీజాత్మకం మమ | నిరాహారో జితాత్మచ సర్వభోగవివర్జితః. 87 ధ్యాయ న్మాం తామసీం శక్తిం సర్వభూషణభూషితాం | ఏవం వర్షసహస్రం తపశ్చక్రే%తిదారుణమ్. 88 తదా%హం తామసం రూపం కృత్వా తత్ర సమాగతా | దర్శనే పురతస్తస్య ధ్యాతం తత్తేన యాదృథమ్. 89 సింహోపరి స్థితా తత్ర తమవోచం దయాన్వితా | వరం బ్రూహి మహాభాగ దదామి తవ సువ్రత. 90 ఇతి శ్రుత్వా వచో దేవ్యా దానవః ప్రేమపూరితః | ప్రదక్షిణాం ప్రణామం చ చకార త్వరిత స్తదా. 91 దృష్ట్వా రూపం మదీయం స ప్రేమోత్ఫుల్లవిలోచనః | హర్షాశ్రుపూర్ణనయన సుష్టావ స చ మాం తదా. 92 హయగ్రీవ ఉవాచ : నమో దేవ్యై మహామాయే సృష్టిస్థిత్యంతకారిణి | భక్తానుగ్రాహచతురే కామదే మోక్షదే శివే. 93 ధరాంబుతేజఃపవనఖపంచానాం చ కారణమ్ | త్వం గంధరసరూపాణాం కారణం స్పర్శ శబ్దయోః. 94 ఘ్రాణంచరసనాచక్షు స్త్వక్ఛ్రోత్ర మ్రిందియాణిచ, కర్మేంద్రియాణిచాన్యానిత్వత్తఃసర్వంమహేశ్వరి. 95 మునుపు మహావీరుడగు హయగ్రీవుడను దైత్యుడుండెను. అతడు సరస్వతీనదీ తీరమున ఘోరముగ తపమొనర్చెను. అతడన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజమగు నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితమగు నా తామసిక శక్తి ననుధ్యానించుచు వేయేండ్లతి దారుణమైన తపస్సు చేసెను. అతడెట్టి తామసరూపమును ధ్యానించెనో నేనదే తామసరూపమున నతని యెదుట ప్రత్యక్షమైతిని. సువ్రతా! నీకు వరమొసంగుదును. ఏదేని గోరుకొమ్మని సింహాసనాసీననై నేనతనితో దయదలచి పలికితిని. అతడు నా మాటలు విని బత్తితో నాకు ప్రదక్షిణించి సాగిలపడి మ్రొక్కెను. అతడు నా దివ్యస్వరూపముగాంచి కనులనిండ నానంద బాష్పములునిండ నన్నుకీర్తించెను. హయగ్రీవుడిట్లనె : కామమోక్షములొసగు మహామాయాదేవీ! భక్తాసు గ్రహస్వరూపిణీ! సృష్టిస్థిత్యంతకారిణీ! నీకు నమః సహస్రములు. నింగి గాలి నిప్పు నీరు నేలలకును శబ్దస్పర్శరూపరస గంధములకును నీవే మూలమైనదానవు. త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములలో వాక్పాణి పాద పాయూపస్థలును శక్తి చేత తమతమ పనులు జేయుచున్నవి. శ్రీదేవ్యువాచ : కిం తే%భీష్టం వరం బ్రూహి వాంఛితం య ద్దదామి తత్ | పరితుష్టా%స్మి భక్త్యా తే తపసా చాద్భుతేన చ. 96 యథా మే మరణం మాత ర్నభ##వేత్త త్తథా కురు ! భ##వేయ మమరో యోగీ తథా%జేయః సురాసురైః. 97 దేవ్యువాచ : జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ | మర్యాదా చేదృశీ లోకే భ##వేచ్చ కథ మన్యథా. 98 ఏవం త్వం నిశ్చయం కృత్వా మరణ రాక్షసోత్తమ | వరం వరయ చేష్టం తే విచార్య మనసా కిల. 99 హయగ్రీవ ఉవాచ : హయగ్రీవాచ్చ మే మృత్యు ర్నాన్యస్మా జ్జగదంబికే | ఇతి మే వాంఛితం కామం పూరయస్వ మనోగతమ్. 100 దేవ్యువాచ: గృహం గచ్ఛ మహాభాగ కురు రాజ్యం యథాసుఖమ్ | హయగ్రీవాదృతే మృత్యు ర్నతే నూనం భవిష్యతి. 101 ఇతి దత్వా వరం తస్మా అంతర్ధానం గతా తదా | ముదం పరమికాం ప్రాప్య సో%పి స్వభవనంగతః 102 స పీడయతి దుష్టాత్మా మునీ న్వేదాంశ్చ సర్వశః | న కో%పి విద్యతే తస్య హంతా%ద్య భువనత్రయే. 103 తస్మా చ్ఛీర్షం హయస్యాస్య సముద్ధృత్య మనోహరమ్ | దేహే%త్ర విశిరో విష్ణో స్స్రష్టా సంయోజయిష్యతి. 104 హయగ్రీవో%థ భగవాన్ హనిష్యతి త మాసురమ్ | పాపిష్ఠం దానవం క్రూరం దేవానాం హితకామ్యయా. 105 సూత ఉవాచ : ఏవం సురాం స్తదా%%భాష్య శర్వాణీ విరరామహ దేవా స్తదా%తిసంతుష్టా స్త మూచు ర్దేవశిల్పినమ్. 106 దేవా ఊచుః : కురుకార్యంసురాణాంవై విష్ణోః శీర్షాభియోజనమ్ దానవప్రవరం దైత్యంహయగ్రీవోహనిష్యతి. 107 సూత ఉవాచ : ఇతిశ్రుత్వావచస్తేషాంత్వష్టా చాతిత్వరాన్వితఃవాజిశీర్షంచకర్తాశుఖడ్గేనసురసన్నిధౌ 108 విష్ణోః శరీరే తేనాశు యోజితం వాజిమస్తకమ్ హయగ్రీవో హరిర్జాతో మహామాయాప్రసాదతః. 109 కియతా తేన కాలేన దానవో మదదర్పితః | నిహత స్తరసా సంఖ్యే దేవానాం రిపు రోజసా. 110 య ఇదం శుభ మాఖ్యానం శృణ్వంతి భువి మానవాః | సర్వదుఃఖవినిర్ముక్తా స్తే భవంతిన సంశయః. 111 మహామాయాచరిత్రం తు పవిత్రం పావనాశనమ్ పఠతాం శృణ్వతాం చైవ సర్వసంపత్తి కారకమ్. 112 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే హయగ్రీవావతారకథనం నామ పంచమో%ధ్యాయః. శ్రీదేవి యిట్లనియెను : ఓ దానవా! నీ యద్భుత తపమునకు నీ పరభక్తికిని మెచ్చితిని. నీ కెట్టి కోర్కియున్నను తీర్చెద. వరమడుగుము. హయగ్రీవుడనియె : అమ్మా! సురాసురుల కజేయుడనై యోగినై యమరుడనై చావకుండునట్లు వరము నా కిమ్ము. శ్రీదేవి యిట్లనియె : పుట్టిన ప్రాణి తప్పక గిట్టును. గిట్టినదెల్ల తిరిగి పుట్టును. ఇది లోకమర్యాద. దీనికి విరుద్ధముగ నెట్లు జరుగగలదు? కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము. హయగ్రీవుడనె : తల్లీ! నా చావు కేవలమొక్క హయగ్రీవుని వలననే జరుగవలయును. ఇతరుని చేత కూడదు. ఇదే నా కోర్కి. నాయీ కోర్కి తీర్చుము. శ్రీదేవి యిట్లనియె : ఓ మహాభాగా! నీవిక నీయింటికేగి సుఖముండుము. హయగ్రీవుడుగాక యితరునివలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమొసగి అదృశ్యయయ్యెను. ఆ రక్కసుడును ప్రమోదించి తన యింటికేగెను. నాటినుండి యతడు వేదవిప్రులను మునినరులను బాధింపదొడగెను. ముల్లోకములలో నతని నెదుర్కొని తెగటార్చువాడెవ్వడును లేకుండెను. కావున దేవతలారా! మీరిపుడొక గుఱ్ఱము తలతెచ్చిఇండు. దానినీ మొండెమున కతికించి హరిని త్వష్ట మరల బ్రతికించును. అపుడా శ్రీ హయగ్రీవ భగవానుడా పాపిష్ఠుడును క్రూరుడునగు హయగ్రీవ దానవుని దప్పక దునుమాడగలడు. సూతుడిట్లనియె : ఈ విధముగ శ్రీభువనేశాని పలికి మౌనమూనెను. దేవతలును మోదమలర దేవశిల్పియగు త్వష్టతో శ్రీహరి మొండెమునకు గుఱ్ఱము తల నతికింపుము. ఆ శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని దెగటార్చును. ఇట్లు దేవతల కార్యము సాధింపుము అని వేడిరి. సూతుడిట్లనియె : ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల ద్రుంచి దానిని హరిమొండెమున కతికించెను. అంత మహామాయ దయవలన హరి హయగ్రీవుడయ్యెను. కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవవైరియగు హయగ్రీవుని నేలగూల్చెను. ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఃఖములు బాసి సుఖించగలడు. సందేహము లేదు. ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము, పరమ పావనము, పాపనాశనము. దీనిని చదివిన వారికిని వినిన వారికిని మేలి కలుములు చేకూరును. ఇది ముమ్మాటికి నిజము. ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమున శ్రీ హయగ్రీవావతార కథనమను పంచమాధ్యాయము.