Sri Devi Bhagavatam-1
Chapters
అథ వింశో%ధ్యాయః ఇతి వాదిని భూపాలే కేరళాధిపతౌ తదా | ప్రత్యువాచ మహాభాగ: యుధాజిదపి పార్థివః1 నీతిరియం మహీపాల! యద్బ్రవితి భవానిహా? సమాజే పార్థివానాం వై సత్యవాగ్విజితేంద్రియః.
2 యోగ్యేషు వర్తమానేషు కన్యారత్నం కులోద్వహ | అయోగ్యో%ర్హతి భూపాల! న్యాయో%యం తవ రోచతే.
3 భాగం సింహస్యగోమాయు ర్భో క్తు మర్హతి వా కథమ్ | తథా సుదర్శనో%యంవై కన్యారత్నం కి మర్హతి.
4 బలం వేదో హి విప్రాణాం భూభుజాం చాపజం బలమ్ | కి మన్యాయ్యం మహారాజ! బ్రవీమ్యహ మిహాధునా.
5 బలం శుల్కం యథా రాజ్ఞాం వివాహే వరికీర్తితమ్ | బలవానేన గృహ్ణాతు నాబలస్తు కదాచన.
6 తస్మా త్కన్యాం పణం కృత్వా నీతిరత్ర విధీయతామ్ | అన్యథా కలహః కామం భవిష్యతి మహీభుజామ్
7 ఏవం వివాదే సంవృత్తే రాజ్ఞాం తత్ర పరస్పరమ్ | ఆహూత స్తు సభామధ్యే సుబాహుర్నృపసత్తమః.
8 సమాహూయ నృపాః సర్వే తమూచు స్తత్త్వదర్శినః | రాజన్నీతి స్త్వయా కార్యా వివాహే%త్ర సమాహితా. 9 కింతే చికీర్షితం రాజం స్తద్వదస్వ సమాహితః | పుత్య్రాః ప్రదానం కసై#్మతే రోచతే నృప చేతసి?
10 సుబాహు రువాచ: పుత్ర్యామే మనసా కామం వృతః కిల సుదర్శనః | మయా నివారితా%త్యర్థం నసా ప్రత్యేతి మే వచనః. కిం కరోమి సుతాయామే న వశే వర్తతే మనః | సుదర్శన స్తథైకాకీ సంప్రాప్తో%స్తి నిరాకులః. ఇరువదవ అధ్యాయము స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను : ఈ విధముగ కేరళాధిపతి వాదింపగా యుధాజిత్తు మరల నిట్లనియెను : ఓ భూపాలా! ఈ రాజ సమాజమునందు సత్యవాది జితేంద్రియుడు అని పేరొందిన నీవు పలుకునది నీతియేనా? యోగ్యులైన నరపతు లిందఱుండగ కన్యారత్నము విషయమున అయోగ్యుడు తగియుండునా? ఇట్టి న్యాయము నీకు రుచించును. మఱి యితరులకు రుచించదు. సింహము పాలి సొమ్ము నక్క యెట్లనుభవించగలదు? రాజులపాలి యీ కన్యారత్నమును సుదర్శను డెట్లనుభవింపగలడు? విప్రులకు వేదము బలము. క్షత్రియులకు చాపము బలము. కాన నిట నేను అన్యాయ మేమి చెప్పుదును? వివాహముందు రాజులకు వీర్యమే శుల్క మగుట ప్రసిద్ధమేగద! బలవంతుడే కన్యను గ్రహింపవలెను. బలహీనుడెప్పుడును గ్రహింపరాదు. కాన నిపుడు కన్యను పణముగ నుంచుటయే నీతి. కాదేని రాజలోకమున పెద్ద కలవరము బయలుదేరును. ఈ విధముగ రాజుల మధ్య వాద వివాదములు చెలరేగగా నృపోత్తముడగు సుబాహు నృపతి సభామధ్యమునకు బిలువబడెను. తత్త్వవిదులగు రాజులెల్లరు సుబాహుని బిలిచి, ఓ రాజా! నీ వీ వివాహమున జక్కని నీతి పాటింపవలయును. నీవు చేయదలచిన కార్యము మాకు సమాహిత మతితో దెలుపుము. నీ మదిలో నీ పుత్రిక నెవ్వని కీయదలంచితివో నిక్కము బలుకుమనిరి. నా కూతురు తన మదిలో సుదర్శనునే పతిగ వరించినది. నేను వలదని యెంత చెప్పినను నా మాట వినుటలేదు. ఇంక నేనేమి చేతును? నా కూతురు మనసు నా వశమందు లేదు. సుదర్శనుడొంటరిగ నిరాకులుడై యేతెంచెను అని సుబాహుడనెను. వ్యాస ఉవాచ : సంపన్న భూభుజః సర్వే సమాహూయ సుదర్శనమ్ | ఊచుః సమాగతం శాంత మేకాకిన మతంద్రితాః. 13 రాజపుత్రః మహాభాగ : కేనాహూతో%సి సువ్రత | ఏకాకీ యః సమాయాతః సమాజే భూభృతామిహ. 14 నవై సైన్యం న సచివా న కోశో న బృహద్బలమ్ | కిమర్థం చ సమాయాత స్తత్త్వం బ్రూహి మహామతే. 15 యుద్ధకామా నృపతయో వర్తంతే%త్ర సమాగమే | కన్యార్థం సైన్యసంపన్నాః కిం త్వం కర్తు మిహేచ్ఛసి? 16 భ్రాతా తే సుబలః శూరః సంప్రాప్తో%స్తి జిఘృక్షయా | యుధాజిచ్చ మహాబాహుః సాహాయ్యం కర్తు మాగతః. 17 గచ్ఛ వా తిష్ఠ రాజేంద్ర ! యథాతథ్య ముదాహృతమ్ | త్వయి సైన్యవిహీనే చ యుథేష్టం కురు సువ్రత: 18 సుదర్శన ఉవాచ : న బలం న సహాయో మే న కోశో దుర్గసంశ్రయః | న మిత్రాణి న సౌహార్దీ న నృపా రక్షకా మమ. అత్ర స్వయంవరం శ్రుత్వా ద్రష్టుకామ ఇహాగతః | స్వప్నే దేవ్యా ప్రేరితో%స్మి భగవత్యా న సంశయః. 20 నాన్య చ్చికీర్షితం మే%ద్య మామాహ జగదీశ్వరీ | తయా యద్విహితం తచ్చ భవితా%ద్య న సంశయః. 21 న శత్రు రస్తి సంసారే కో%ప్యత్ర జగదీశ్వరాః: సర్వత్ర పశ్యతో మే%ద్య భవానీం జగదంబికామ్. 22 యః కరిష్యతి శత్రుత్వం మయాసహ నృపాత్మజాః | శాస్తా తస్య మహావిద్యా నాహం జానామి శత్రుతామ్. 23 యద్భావి తద్వై భవితా నాన్యథా నృపసత్తమాః | కా చింతా హ్యత్ర కర్తవ్యా దైవాధీనో%స్మి సర్వథా. 24 అపుడు శిష్టులైన రాజులందఱు సుదర్శనుని రావించిరి. అత డేకాకియై శాంతుడై రాగా వారతని కిట్లు నెమ్మదిగా బలికిరి : మహాభాగా! రాకుమారా! సువ్రతా! నిన్నెవరు పిలువగ నీ రాజుల సమాజమున కొంటరిగ నురుగుదెంచితివి? నీ చెంత సైన్యముగాని సచివులుగాని కోశముగాని మహాబలముగాని లేదే? మరియేల వచ్చితివో యథార్థము తెల్పుము. ఎల్లరాజులును యుద్ధకాములై సేనాసమేతులై కన్యకార్థము వచ్చిరి. నీవొక్కడవిక్కడ వట్టిచేతుల నేమి చేయవచ్చితివి? నీ సోదరుడు మహాసైన్యము వెంటబెట్టుకొని నిన్ను హతమార్చ వచ్చియున్నాడు. అతనికి యుధాజిత్తు సాయము చేయ వచ్చియున్నాడు. నీవున్న నుండుము. పోయిన పొమ్ము. నిజము చెప్పుము. నీవు బలహీనుడవై యున్నావు. కాన నీకు తగినొట్లనరింపుము. సుదర్శుడిట్లు పలికెను : ఇపుడు నా చెంత సుహృన్మిత్రులుగాని రాజభటులుగాని కోశముగాని దుర్గబలముగాని సాయమొనర్చువారుగాని ఎవ్వరును లేరు. ఇచట జరుగు స్వయంవరమును చూచు వేడుకతో నేతెంచితిని. కలలో భగవతి యగు శ్రీదేవి చేత ప్రేరితుడనైతిని. ఇందు సందియము లేదు. నా మదిలో మరెట్టి కోరికయు లేదు. అన్నియు నా తల్లియే నాకు జెప్పెను. నా తల్లి పలికిన పలుకు అక్షరాల జరిగి తీరును. నాకీ ప్రపంచమందంతట శత్రు వెవ్వడును లేడు - నాకెల్లెడల నెల్ల ప్రాణులందాభవానియే ప్రత్యక్షముగ గనంబడుచున్నది. నృపులారా! నాతో నెవడైన బగబూనినచో వానిని ఆ మహావిద్య దండించి తీరును. నేనుమాత్ర మెవ్వనితోడను శత్రుత్వము బూనను. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. వేరుగ జరుగదు. నేను దైవాధీనుడను - నాకింత చింత యెక్కడిది? దేవభూత మనుష్యేషు సర్వభూతేషు సర్వదా:| సర్వేషాం తత్కృతా శక్తి ర్నాన్యథా నృపసత్తమాః. 25 సా యం చికీర్షతే భూపం త కరోతి నృపాధిపాః | నిర్ధనం వానరం కామం చింతావై తదా మమ. 26 తామృతే పరమాం శక్తిం బ్రహ్మ విష్ణు హరాదయః | న శక్తాః స్పందితుం దేవాః కా చింతా మే తదా నృపాః. 27 అశక్తో వా సుశక్తోవా యాదృశ స్తాదృశ స్త్వహం | తదాజ్ఞయా నృపా%ద్యైవ సంప్రాప్తో%స్మి స్వయంవరే. 28 సాయదిచ్ఛతి తత్కుర్యాన్మ మ కిం చింతనేన వై | నాత్రశంకా ప్రకవర్తవ్యా సత్యమేత ద్బ్రవీమ్యహమ్. 29 జయే పరాజయే లజ్జా నమే%త్రాణ్వపి పార్థివాః | భగవత్యా స్తు లజ్జా%స్తి తదధీనో%స్మి సర్వదా. 30 ఇతి తస్య తదాకర్ణ్య వదనం రాజసత్తమాః | ఊచుః పరస్పరం ప్రేక్ష్య నిశ్చయజ్ఞా నరాధిపాః. 31 సత్య ముక్తం త్వయా సాధో | న మిథ్యా కర్హిచిద్భవేత్ | తథా%ప్యుజ్జయినీనాథ స్త్వాం హంతుం పరికాంక్షతి. 32 త్వత్కృతేన దయాదృష్ట్యా త్వాం బ్రవీమో మహామతే | యద్యుక్తం తత్త్వయా కార్యం విచార్య మనసా%నఘ. 33 సురనరాది సకల భూతములందు నిరంతర మా దివ్య చైతన్యశక్తి విరాజిల్లుచుండును. ఆ శక్తి తలంపునకు భిన్నముగ నేదియును జరుగుటకు వీలులేదు. ఆ తల్లి తలచుకొన్నచో నెవ్వనినైన నిఱుపేదనైన రాజుగ చేయగలదు. నాకింక లేనిపోని చింతయేల? ఆ పరాశక్తి - జనని - దయలేనిచో దేవతలును హరిహర బ్రహ్మలు కూడ కదలశక్తులుగారు. ఇక నాకీ చింత యేటికి? నేనశక్తుడనో సుశక్తుడనో యెట్టివాడనో యట్టివాడను. నేనీ స్వయంవరమునకు ఆ జగన్మాతృ నానతి చేత వచ్చితిని. ఆ తల్లి యేది దలచిన నది చేసితీరును. ఇంక నడుమ నాకెందులకు విచారము? ఈ విషయమై శంకింప పనిలేదు. నేను చెప్పినది అంతయును సత్యము. జయాపజయముల విషయమున లేశ##మైన నాకు లజ్జ గలుగదు. నేనా తల్లి కధీనుడను. నాకేదైన లజ్జ కల్గిన నది ఆమెకే కలుగును. సుదర్శనుని వచనము లాలకించి నరపతు లొండొరుల మొగములు చూచుకొని నిశ్చితమతులై యతని కిట్లనిరి: ఓ సాధూ! నీ పలికినదంతయు నిజమే. అందులో సందేహమేమియు లేదు. కాని యుజ్జయినీపతి నిన్ను చంపుటకు చూచుచున్నాడు. నీ ఆచరణ చూచి నీమీది దయకొలది చెప్పుచున్నాము. నీకేది యుక్తమని తోచునో యది మనస్సులో చక్కగ విచారించి యాచరింపుము. సుదర్శన ఉవాచ : సత్య ముక్తం భవద్భిశ్చకృపావద్భిః సుహృజ్జనైః | కిం బ్రవీమిపునర్వాక్యాముక్త్వా నృపతిసత్తమాః. 34 న మృత్యు కేనచిద్భావ్యః కస్యచిద్వా కదాచన | దైవాధీన మిదం సర్వం జగత్థ్సావరజంగమమ్. 35 స్వవశో%యం న జీవో%స్తి స్వకర్మ వశగః సదా | తత్కర్మ త్రివిధం ప్రోక్తం విద్వద్భి స్తత్త్వదర్శిభిః. 36 సంచితం వర్తమానం చ ప్రారబ్ధం చ తృతీయకం | కాల కర్మస్వభావై శ్చ తతం సర్వ మిదం జగత్. 37 న దేవో మానుషం హంతుం శక్తః కాలాగమం వినా | హతం నిమిత్త మాత్రేణ హంతి కాలః సనాతనః. 38 యథా పితా మే నిహతః సింహే నామిత్ర కర్షణః | తథా మాతామహో%ప్యేవం యుద్ధే యుధాజితా హతః. 39 యత్నకోటిం ప్రకుర్వాణో హన్యతే దైవయోగతః | జీవే ద్వర్ష సహస్రాణి రక్షణన వినా నరః. 40 నాహం బిభేమి ధర్మిష్ఠాః : కదాచిచ్చ యుధాజితః | దైవ మెవ పరం మత్వా సుస్థితో%స్మి సదా నృపాః. 41 స్మరణం సతతం నిత్యం భగవత్యాః కరోమ్యహం | విశ్వస్య జననీ దేవీ కళ్యాణం సా కరిష్యతి. 42 పూర్వార్జితం హి భోక్తవ్యం శుభ వా%ప్యశుభం తథా | స్వకృతస్య చ భోగేన కీదృక్ఛోకో విజానతామ్. 43 స్వకర్మ ఫలయోగేన ప్ర్యాప్య దుఃఖ మచేతనః | నిమిత్త కారణ వైరం కరోత్యల్పమతిః కిల. 44 న తథా%హం విజానామి వైరం శోకం భయం తథా | నిశ్శంక మిహ సంప్రాప్తః సమాజే భూభృతామిహ. 45 ఏకాకీ ద్రష్టుకామో%హం స్వయంవర మనుత్తమం : భవిష్యతి చ యద్భావ్యం ప్రాప్తో%స్మి చండికాజ్ఞయా. 46 భగవత్యాః ప్రమాణం మే; నాన్యం జానామి సంయతః | తత్కృతం చ సుఖం దుఃఖం భవిష్యతి చ నాన్యథా. 47 యుధాజిత్సుఖ మాప్నోతు; న మే వైరం నృపోత్తమాః | యః కరిష్యతి మే వైరం స ప్రాస్స్యతి జలం తథా. 48 సుదర్శనుడిట్లనియె : ఓ నృపతులారా ! కృపాళురు సుహృజ్జనులునైన మీరు నిజము పల్కితిరి. నేనింక పలుక వలసినది లేదు. ఐనను చెప్పుచున్నాను. ఒకనిచావు మరొకని వలన నెన్నడు సంభవింపదు. స్థావర జంగమాత్మకమగు నీజగమంతయును దైవాధీనమే. ఈ జీవుడు సంతతమును స్వవశమునుండక కర్మ పరాధీనుడై యుండును. తత్త్వవిదులగు విబుధులు కర్మ ముత్తెఱంగుల నుండు నందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధము ననబరగును. ఈ బ్రహ్మాండమంతయును కాలము కర్మము స్వభావము వీనితో నిండి యున్నది. దేవడు గూడ కాలము రాని వానిని చంపజాలడు. కాని సనాతనమైన కాలము నిమిత్త మాత్రమున హతుడైన వానిని చంపివేయును. శత్రునిషూదనుడగు నా తండ్రి సింహము చేత నిహతుడయ్యెను. నా మాతామహుడును యుధాజిత్తు చేత చంపబడెను. కోటి ప్రయత్నములు చేయుచున్న వాడును దైవయోగమున వాయువు మూడిన నాడు చచ్చి తీరును. ఒకడు (నేలపై నూకలున్నవాడు) రక్షణ లేకున్నను దైవేచ్ఛచే వేయేండ్లు జీవింపగలడు. ధర్మిష్ఠులగు నృపులారా! యుధాజిత్తునకు నే నేనాడును భయపడుటలేదు. నేనన్నిటికి ఆ దైవమే పరమమని భావించి నిబ్బరముగ నున్నాను. నేను నిరంతరముగ నిత్య మాపరమ భగవతి మధురనామ సంస్మరణము చేయుచున్నాను. ఆ జగదేకమాత దేవి నాకు తప్పక కళ్యాణము జరుపగలదని దృఢముగ నాశించుచున్నాను. జీవుడు శుభమునుగాని - యశుభమునుగాని తన పూర్వార్జిత కర్మఫలమునే - యనుభవించును. అతడు స్వయంకృతము ననుభవించుచుండును. ఇది యెరిగిన జ్ఞానికి శోకమెట్లు గల్గును? బుద్ధిలేని మూఢుడు తన కర్మఫలానుసారముగ దుఃఖము లనుభవించుచు నల్పబుద్ధియగుటచే నా దుఃఖములకు నిమిత్త కారణమైన పరులతో పగ పెంచుకొనును. నాకు వైరమును శోకమును భయమును లేవు. కనుకనే నేను నిశ్శంకముగ నీ రాజన్యుల నడుమకు రాగలిగితిని. నేనీ యుత్తమ స్వయంవరమును వీక్షించు కాంక్షతో శ్రీ చండికాదేవి యనుమతి బడసి యేతెంచితిని. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. నాకు పరమ భగవతి వచనమే యన్నివిధాల ప్రమాణముగ మదిలో నమ్మియున్నాను. ఇంకెవ్వరిని నమ్ముట లేదు. నా తల్లి నాకు కలుగచేసిన సుఖముగాని దుఃఖముగాని వేఱుగ కాదు. నదియు ఆ యుధాజిత్తునే సుఖము బడయనిండు. నాకు మాత్ర మతని పట్ల ఎట్టి వైరము లేదు. నా యందెవ్వనికైన వైరమున్నచో దాని ఫలము నతడనుభవించి తీరును. వ్యాస ఉవాచ : ఇత్యుక్తాస్తే తథా తేన సంతుష్టా భూభుజః స్థితాః| సో7పి స్వమాశ్రమం ప్ర్యా సుస్థితః సంబభూవ హ. 49 అపరే%హ్ణి శుభే కాలే నృపాః సమ్మంత్రితాః కిల | సుబాహునా నృపేణాథ రుచిరే వై స్వమండపే. 50 దివ్యాస్తరణయుక్తేషు మంచేషు రచితేషు చ| ఉపవిష్టావ్చ రాజానః శుభాలంకరణౖర్యుతాః. 51 దివ్యవేషధరాః కామం విమానేష్వమరా ఇవ | దీప్యమానాః స్థితాస్తత స్వయంవర దిదృక్షయా. 52 ఇతి చింతాపరాః సర్వే కదా సా%ప్యాగమిష్యతి | భాగ్యవంతం నృపశ్రేష్ఠం శత్రుంపుణ్యం వరిష్యతి. 53 యదా సుదర్శనం దైవా త్ప్రజా సంభూషయేదిహ| వివాదోవై నృపాణాం చ భవితా నాత్రసంశయః. 54 ఇత్యేవం చింతయానాస్తే భూపా మంచేషు సంస్థితాః| వాదిత్రఘోషః సుమహానుత్థితో నృపమండపే. 55 అథ కాశీపతిః ప్రాహ సుతాం స్నాతాం స్వలంకృతాం | మధూకమాలా సంయుక్తాం క్షౌమవాసో విభూషితామ్. 56 వివాహోపస్కరైర్యుక్తాం దివ్యాం సింధుసుతోపమాం| చింతాపరాం సువసనాం స్మితపూర్వ మిదంవచః 57 ఉత్తిష్ఠ పుత్రి! సునసే! కరే ధృత్యా శుభాం స్రజం| వ్రజ మండపమధ్యే%ద్య సమాజం పశ్య భూభుజామ్. 58 గుణవాన్రూప సంపన్నః కులీనశ్చ నృపోత్తమః| తవ చిత్తే వసే ద్యస్తు తం వృణుష్వ సుమధ్యమే. 59 దేశ##దేశాధిపాః సర్వే మంచేషు రచితేషు చ! సంవిష్టా పవ్య తన్వంగి! వరయస్వ యథారుచి. 60 సుదర్శనుని మాటలకు రాజులు సంతసిల్లిరి. అతడును తన యాశ్రమమున కేగి సుఖముండెను. మరునాడు శుభసమయమున రాజులెల్లరును తన సుందర భవనమునకు రావలసినదిగ సుబాహువు ఆహ్వానించెను. రాజులందఱును శుభాలంకారములతోనేతెంచి శుభాసనములతో రచింపబడిన పీఠములపై నాసీనులైరి. వారు దివ్యవేషధారులైన విమానములందలి దేవతలో యన విరాజిల్లుచు స్వయంవరము నవలోకించు వేడుకతో నుండిరి. ఆ రాచకూతు రెప్పుడెప్పుడు వచ్చునో యామె శ్రుతకీర్తి భాగ్యవంతుడునైన యేరాచకుమారుని వరించునో యని యెల్లరును దారితెన్నులు చూచుచుండిరి. ఒకవేళ నామె సుదర్శనునే పూలమాలతో నలంకరించినచో రాజలోకమునందు నిస్సంశయముగ కల్లోలము బయలుదేరును. ఇట్టు లాసనములందున్న నరపతులు తలపోయుచున్నంతలో మంగళవాద్యఘోషములు చెలరేగెను. అంత శుచిస్నాతయై శుభ్ర వసనములును సొమ్ములును దాల్చి మధూక పుష్పమాలిక చేతబూని తన కూతురు రాగా లక్ష్మివలె నొప్పుచు వివాహ యోగ్య లక్షణములు గల్గి సువసనములు దాల్చి చింతలో మునిగిన తన కూతును జూచి నగుచు సుబాహువామె కిట్లనియెను : పుత్త్రీ! లెమ్ము. శుభసుమమాల చేబూనుము. ఈ రాజుల సమూహము బాగగ పరికించి చూడుము. ముందునకు సాగుము. ఇందఱిలో గుణవంతుడును కులీనుడును రూపసంపన్నుడునగు నే రాకుమారుడు నీ చిత్తమునకు నచ్చునో యతనినే వరింపుము. దేశ##దేశాలనుండి వచ్చిన రాజు లున్నతాసములం దుపవిష్టులై యున్నారు. వారినందఱిని చక్కగ గాంచి నీ కిష్టమైనవానినే వరింపుము. తం తథా భాషమాణం వై పితరం మితభాషణీ | ఉవాచ వచనం బాలా లలితం ధర్మసంయుతమ్. 61 నాహం దృష్టిపథే రాజ్ఞాం గమిష్యామి పితః| కిల! కాముకానాం నరేశానాం గచ్ఛంత్యన్యాశ్చ యోషితః. 62 ధర్మశాస్త్రే తాత! మయేదం వచనం కిల! ఏక ఏవ వరో నార్యా నిరీక్ష్యః స్యా న్న చాపరః. 63 సతీత్వం నిర్గత న్తస్యాః యా ప్రయాతి బహూనథ| సంకల్పయంతి తే సర్వే దృష్ట్యామే భవతాత్త్వితి. 64 స్వయంవరే స్రజం ధృత్వా యదా గచ్ఛతి మండపే| సామాన్యా సా తదా జాతా కులటేవాపరా వధూః. 65 వారస్త్రీ విపణౌ గత్వా యథా వీక్ష్య నరాన్థ్పితాన్| గుణాగుణ పరిజ్ఞానం కరోతి నిజమానసే. 66 నైకభావా యథా వేశ్యా వృథా పశ్యతి కాముకం| తథా%హం మండపే గత్వా కుర్వే వారస్త్రీయా కృతమ్. 67 వృద్ధై రేతైః కృతం ధర్మం న కరిష్యామి సాంప్రతమ్| పత్నీ వ్రతం తథా కామం చరిష్యే%హం ధృతవ్రతా. 68 సామాన్యా ప్రథమం గత్వా కృత్వా సంకల్పితం బహు| వృణోతి చైకం తద్వద్వై వ్రజామి కథమద్యవై. 69 సుదర్శనో మయా పూర్వం వృతః సర్వాత్మనా పితః | తమృతే నాన్యథా కర్తు మిచ్ఛామి నృపసత్తమ. 70 వివాహ విధినా దేహి కన్యాదానం శుభే దినే| సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి శుభం మమ. 71 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే వింశో7ధ్యాయః. తన తండ్రి మాటలు విని మితభాషిణియగు నా కన్య ధర్మసమ్మతమైన లలిత వచనము లిట్లు పలికెను : తండ్రీ! కాముకులును సామాన్యులునగు పురుషులను కన్నెత్తియైనను జూడను. తండ్రీ! స్త్రీచే నొక్కరుడే చూడదగినవాడుకాని వేరొకరిని చూడగూడదని ధర్మశాస్త్రమున నేను వింటిని. ఎవ్వతె పెక్కుమందితోడ గూడునో దాని సతీత్వము చెడిపోవును. అట్టి దానిని గని యందఱును నిది నాదిగనైన బాగుగనుండునని లోలోన దలంచుదురు. ఒక స్త్రీ తనచేత పూలమాలగొని యెప్పుడు స్వయంవర మంటపమెక్కెనో యప్పుడామె కులటవలె సర్వ సామాన్యగ తలంపబడును. ఒక వారవనిత వీథికేగి యచట గల నరుల జూచి వారి మంచి చెడ్డలను గూర్చి తనలో భావించుకొనుచుండును. కాముకు ననేక భావములతో వ్యర్థముగ గనుచుండు వారకాంతవలె నేను స్వయంవర మండపమునకు వచ్చి వారకాంతా కృత్యమును చేయవలయునా! పెద్దల చేత నిర్ణీతమైన యిట్టి స్వయంవర ధర్మమును నేను పాటింపజాలను. నేను వ్రతనిష్ఠను పూని ఇపుడు పత్నీవ్రత మాచరింపగలను. ఒక సామాన్యకాంత మండపమున కేతెంచి తన మదిలోన పెక్కురీతుల సంకల్పించుకొని యందొక్కని వరించునట్లు నేనిపుడు పతివ్రతనై యెట్లు చేయగలను? పూర్వము సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించితిని. అతనినిగాక యితరుని వరింపజాలను, తండ్రీ! నీవు నా మేలుగోరు దేనియొక శుభముహూర్తమున వివాహ విధిప్రకారముగ నన్ను సుదర్శనునకు కన్యాదాన మొనరింపుము. ఇది శ్రీదేవి భాగవతమందలి తృతీయ స్కంధమున ఇరువదవ అధ్యాయము.