Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ద్వావింశో%ధ్యాయః

వ్యాస ఉవాచ : శ్రుత్వా సుతావాక్య మనిందితాత్మా | నృపాంశ్చ గత్వా నృపతి ర్జగాద |

వ్రజంతు కామం శిబిరాణి భూపాః | శ్వో వా వివాహం కిల సంవిధాస్తే. 1

భక్ష్యాణి పేయాని మయార్పితాని | గృహ్ణంతు సర్వే మయి సుప్రసన్నాః |

శ్వో భావి కార్యం కిల మండపే%త్ర | సమేత్య సర్వై రిహ సంవిధేయమ్‌. 2

నాయాతి పుత్రీ కిల మండపే%త్ర | కరోమి కిం భూపతయో%త్ర కామమ్‌ |

ప్రాతః సమాశ్వాస్వ సుతాం నయిష్యే | గచ్ఛంతు తస్మా చ్ఛిబిరాణి భూపాః. 3

న నిగ్రహో బుద్ధిమతాం నిజాశ్రితే | కృపావిధేయా సతతం హ్యపత్యే |

విధాయ తాం ప్రాత రిమానయిష్యే | సుతాంతు గచ్ఛంతునృపా యథేష్టమ్‌ 4

ఇచ్ఛాపణం వా పరిచింత్య చిత్తే | ప్రాతః కరిష్యామథ సంవివాహమ్‌ |

సర్వైః సమేత్యాత్ర నృపైః సమేతైః | స్వయంవరః సర్వమతేన కార్యః. 5

శ్రుత్వా నృపాస్తే%వితథం విదిత్వా | వచో యయుః స్వాని నికేతనాని |

విధాయ పార్శ్వే నగరస్య రక్షాం | చక్రుః క్రియా మధ్యదినోదితాశ్చ. 6

సుబాహు రప్యార్యజనైః సమేత | శ్చకార కార్యాణి వివాహకాని |

పుత్రీం సమాహుయ గృహే సు గుప్తే | పురోహితై ర్వేదవిదాం వరిష్ఠైః. 7

స్నానాదికం కర్మ వరస్య కృత్వా | వివాహభూషాకరణం తథైవ |

ఆనాయ్య వేదీరచితే గృహే వై | తస్యార్హణాం భూమిపతి శ్చకార. 8

సవిష్టరం చాచమనీయ మర్యం | వస్త్రద్వయం గా మథ కుండలే ద్వే |

సమర్ప్య తసై#్మ విధివన్నరేంద్రః | పశ్చాత్సుతాదానమహీనసత్త్వః. 9

స్బోప్యగ్రహీత్సర్వ మదీనచేతాః | శశామ చింతా%థ మనోరమాయాః |

కన్యాం సుకేశీం నిధికన్యకాసమాం | మేనే తదా%%త్మాన మనుత్తమం చ. 10

సుపూజితం భూషణవస్త్రదానై | ర్వరోత్తమం తం సచివా స్తదానీమ్‌ |

నిన్యు శ్చ తే కౌతుకమండపాంత | ర్ముదా%న్వితా వీతభయాశ్చ సర్వే. 11

ఇరువదిరెండవ అధ్యాయము

శశికళా సుదర్శనుల వివాహము

వ్యాసమునీశుడిట్లనియెను : ఆ యనిందితాత్ముడగు సుబాహువు తన కూతు పలుకు లాలకించి రాజులచెంతకేగి యిట్లనియె : రాజులారా ! నేటికి మీమీ శిబిరముల కేగుడు. రేపు పెండ్లి జరుగగలదు. మీరు నాయందు దయయుంచి నాయొసంగు నన్నపానీయములు గ్రహించి ప్రసన్నులుగండు. రేపు ప్రభాతవేళ##కెల్లరు పెండ్లి వేదికకు రండు. అన్ని కార్యములును చక్కబడును. నేడు నా కూతురీ మంటపమునకు వచ్చుటలేదు. నేనేమిచేయుదును ? రేపెట్టులో యామె నొప్పించి రప్పింతును. నేటికి మీమీ విడుదుల కేగుడు. మతిమంతులు తమ యాశితులపట్ల నిగ్రహము బూనరు. మీరు నాపై నా సంతుపై దయపూనవలయును. రేపుదయమున నా కూతు నొప్పించి రప్పింతును. నేటికి యథేచ్ఛగ జనుడు. ఏదైన నిచ్ఛాపణ మేర్పరచి రేపు ప్రభాతకాలమున సకల రాజలోకము సమక్షమున నెల్లర యనుమతితో వివాహ మంగళకార్యము జరుపుదును అను సుబాహువు పలుకులాలకించి అవి నిజమని భావించి రాజులు తమతమ విడుదులకేగిరి. నగర రక్షణ జరిపి మాధ్యందిన కృత్యములు నిర్వహించిరి. అంత సుబాహు వార్యజనుల రావించి వేదవిదులగు పురోహితులతో రహస్యమందిరమున తన పుత్రికకు వివాహము జరిపించెను. అందరు నా వరునకు మంగళస్నాన మొనరింపజేసిరి. వివాహ భూషాలంకృతు నొనరించిరి. రాజు వరుని పెండ్లిమంటపమునకు గొనివచ్చి యతనికి తగిన పూజాదివిధు లొనరించెను. మహాసత్త్వుడగు సుబాహువు వరున కాసనాచమనములు అర్య పాద్యములు వస్త్రద్వయము కుండలములు గోవు నొసంగి విధిగ కన్యాదానము సంకల్పము చేసెను. వరుడన్నిటిని నిశ్చలముగ స్వీకరించెను. ఆ సమయమున మనోరమ చిత్తము చింతారహితమయ్యెను. నవనిధిశాలియగు కుబేరుని కన్యవలె నలరు రాచకన్నియను గాంచి యామె తన్ను ధన్యగ నెంచుకొనెను. ఆపుడు మంత్రులెల్లరు భయరహితులై ముదము నిండార సలక వస్త్రభూషణ భూషితుడు పూజితుడు నైన వరోత్తముని కౌతుక మంటపమునకు గొనివచ్చిరి.

సమాప్తభూషాం విధవద్విధిజ్ఞాః స్త్రియశ్చ తాం రాజసుతాం సుయానే |

ఆరోప్య నిన్యు ర్వర సన్నిధానమ్‌ | చతుష్కయుక్తే కిల మండపే వై. 12

అగ్నిం సమాధాయ పురోహితః స | హూత్వా యధావచ్చ తదంతరాళే |

ఆహ్వాయయ త్తౌ కృతకౌతుకౌ తు | వధువరౌ ప్రేమయుతౌ నికామమ్‌. 13

లాజావిసర్గం విధివద్విధాయ | కృత్వా హుతాశస్య ప్రదక్షిణాం చ |

తౌ చక్రతు స్తత్ర యథోచితం త | త్సర్వం విధానం కులగోత్రజాతమ్‌. 14

శతద్వయం చాశ్వయుజాం రథానాం | సుభూషితం చాపి శరౌఘసంయుతమ్‌ |

దదౌ నృపేంద్రస్తు సుదర్శనాయ | సుపూజితం పారిబర్హం వివాహే. 15

మదోత్కటాన్‌ హేమవిభూషితాంశ్చ | గజా న్గిరేః శృంగసమాన దేహాన్‌ |

శతం సపాదం నృప సూనవే%సౌ | దదావథ ప్రేమయుతో నృపేంద్రః. 16

దాసీశతం కాంచనభూషితం చ | కరేణుకానాం చ శతం సుచారు |

సమర్పయామాస వరాయ రాజా | వివాహకాలే ముదితో%నువేలమ్‌. 17

అదాత్పునర్దాససహస్ర మేకం | సర్వా యుధైః సంభృత భూషితం చ |

రత్నాని వాసాంసి యథోచితాని | దివ్యాని చిత్రాణి తథా%వికాని. 18

దదౌ పునర్వాస గృహాణి తసై#్మ | రమ్యాణి దీరాణి విచిత్రితాని |

సింధూద్భవానాం తురగోత్త మానా | మదాత్సహస్ర ద్వితయం సురమ్యమ్‌. 19

క్రమేలకానాం చ శతత్రయం వై | ప్రత్యాదిశ ద్భారభృతాం సుచారు |

శతద్వయం వై శకటోత్తమానాం | తసై#్మ దదౌ ధాన్యరసైః ప్రపూరితమ్‌. 20

మనోరమాం రాజసుతాం ప్రణమ్య | జగాద వాక్యం విహితాంజలిః పురః |

దాసో%స్మితే రాజసుతే వరిష్ఠే | తద్ర్బూహి యత్‌ స్యాత్తు మనోగతం తే. 21

తం చారువాక్యం నిజగాద సా2పి | స్వస్త్వస్తు తే భూపకులస్య వృద్ధిః.

అపుడలంకరణ నిపుణలగు నెఱజాణలు రాచకన్నియనలంకరింపజేసి వరవాహన మెక్కించుకొని వేదులతో గూడిన మంటపమున నలరుచున్న వరుని సన్నిధానమునకు గొనివచ్చిరి. ఇట్లు వైవాహిక మంగళములతో సంస్కరింపబడిన వధూవరులను వైవాహిక మండపమునకు రావించిరి. పురోహితు లగ్నిని ప్రతిష్ఠించి హోమములు జరపిరి. దంపతులు లాజహోమము జరిపి విధ్యనుసారముగ నగ్నికి ప్రదక్షిణ మొనరించి తమ కులవంశ సంప్రదాయానుసారముగ నచట జరుగదగు యథోచిత క్రియలు నెరవేర్చిరి. సుబాహువు అల్లుడగు సుదర్శనునకు పెండ్లికట్నము క్రింద గుఱ్ఱములపూన్చిన రెండు నూర్ల రథములను బాణములు గల యమ్ముల పొదిని సువర్ణభూషితములై పర్వత శిఖరాలవంటి నూటయిరువదియైదు మత్తగజములను బంగారముతో నలంకృతములైన దాసీశతమును నూఱాడుఏనుగులను భూషణముల నాయుధముల దాల్చిన వేయిమంది దాసజనమును రత్నములను మేలైన చిత్రములైన యున్ని వస్త్రములను రమ్యములు చిత్రములునైన వాసగృహములను సింధుదేశీయములైన రెండువేల మంచి గుఱ్ఱములను బరువులు మోయుటకు మున్నూరొంటెలను ధాన్యముతో నిండిన రెండువందల బండ్లను సమర్పించెను. ఆ పిమ్మట నాతడు రాజసుతయగు మనోరమకు కేలుమోడ్చి యోవరిష్ఠా! నేను నీ దాసుడను. నీ మదిలోని యభిప్రాయము వెల్లడింపు మనెను.

సమ్మానిత్బాహం మమ సూనవే త్వయా | దత్తా యతో రత్నపరా స్వకన్యా. 22

న వంది పుత్రీ నృప మాగధీవా | స్తౌమీహ కిం త్వాం స్వజనం మహత్తరమ్‌ |

సుమేరుతుల్య స్తు కృతః సుతో%ద్యమే | సంబంధినా భూపతినోత్తమేన. 23

అహో%తిచిత్రం నృపతేశ్చరితమ్‌ | పరంపవిత్రం తవ కిం వదామి |

యద్భ్రష్టరాజ్యాయ సుతాయ మే%ద్య | దత్తా త్వయా పూజ్యసుతా వరిష్ఠా. 24

వనాధివాసాయ కి లాధనాయ | పిత్రా విహీనాయ విసైన్యకాయ |

సర్వా నిమా న్భూమిపతీ న్విహాయ | ఫలాశనా యార్థవివర్జితాయ. 25

సమానవిత్తే%థ కులే బలే చ | దదాతి పుత్త్రీం నృపతి శ్చ భూయః |

న కో%పి మే భూప ! సుతే%ర్థహీనే | గుణాన్వితాం రూపవతీం చ దద్యాత్‌. 26

వైరం తు సర్వై స్సహ సంవిధాయ | నృపైర్వరిష్ఠైర్బల సంయుతైశ్చ |

సుదర్శనాయాథ సుతా%ర్పితామే | కిం వర్ణయే ధైర్యమిదం త్వదీయమ్‌. 27

అపుడు మనోరమ మధుర వాక్కులతో రాజున కిట్లనెను పీనీకు మేలగుత! నీ కులవృద్ధియగుగాక! నీ కన్యారత్నమును నా కుమారున కొసంగి నన్ను సమ్మానించితివి. రాజా! నిన్ను గొప్పగ పొగడుట కేను వందిమాగధుల పుత్త్రినిగాను. స్వజనమైన మీవంటి పెద్దలను నేనేమి స్తుతింపగలను? నీ యుత్తముడు వియ్యంకుడునగు భూపతిచే నా కొడుకు మేరుతుల్యుడుగ చేయబడెను. నీ చరిత్రమెంతయు పవిత్రము! ఎంతయు నుదాత్తము! ఎంతయు విచిత్రము! నేనేమని పలుకుదును? రాజ్యభ్రష్టుడగు నా సుతునకు యోగ్యమగు నీ కన్య నొసంగితివి. వచ్చిన రాజులనెల్లర త్రోసిరాజని వనవాసి నిఱుపేద పితృశూన్యుడు సేనావిహీనుడు ధనరహితుడు నగు నా కొడుకునకు నీ కూతునొసంగితివి. ఏ రాజైన తన కన్యకను సమాన కులబలధనములు గలవానిని చూచి యిచ్చును. అర్థహీనుడగు నా కొమరునకు రూపగుణ సంపన్నయగు కన్నియ నెవడిచ్చును? మహాబలశాలురగు నిందఱ రాజులతో వైరమూనియు సుదర్శనునకు నీ కూతునొసంగితివి. ఆహా! నీ ధైర్యమెంతయు శ్లాఘనీయము.''

నిశమ్య వాక్యాని నృపః ప్రహృష్ట! | కృతాంజలి ర్వాక్య మువాచ భూయః |

గృహాణ రాజ్యం మమ సుప్రసిద్ధమ్‌ | భవామి సేనాపతి రద్య చా హమ్‌. 28

నోచేత్త దర్థం ప్రతిగృహ్య చాత్ర | సుతాన్వితో రాజ్యఫలాని భుంక్ష్వ |

విహాయ వారాణసికానివాసం | వనే పురే వాస మతో న మే%స్తి. 29

నృపా స్తు సంత్యేవ రుషా%న్వితా వై | గత్వా కరిష్యే ప్రథమం తు సాంత్వనమ్‌ |

తతః పరం ద్వా వపరాపుపా¸° | నోచేత్తతో యుద్ధమహం కరిష్యే. 30

జయాజ¸° దైవవశౌ తథా%పి | ధర్మే జయో నైవ కృతే%ప్యధర్మే |

తేషాం కిలాధర్మవతాం నృపాణామ్‌ | కథం భవిష్య త్యను చింతితం వై. 31

ఆకర్ణ్య తద్భాషిత మర్థవచ్చ | జగాద వాక్యం హితకారకం తమ్‌ |

మనోరమా మాన మవాప్యతస్మా | త్సర్వాత్మనా మోదయుతా ప్రసన్నా. 32

రాజన్‌ శివం త్బేస్తు కురుష్వ రాజ్యమ్‌ | త్యక్త్వా భయం త్వం స్వసుతైః సమేతః |

సుతో%పి మే నూన మవాప్య రాజ్యమ్‌ | సాకేత పుర్యాం ప్రచరిష్యతిహ. 33

విసర్జయాస్మా న్నిజ సద్మ గంతుమ్‌ | శివం భవానీ తవ సంవిధాస్యతి |

నకా%పి చింతా మమ భూప ! వర్తతే | సంచింతయంతాః పరమాంబికాం వై. 34

దోషాగతా వివిధ వాక్యపదై రసాలై | రన్యోన్య భాషణపదై రమృతోపమైశ్చ |

ప్రాత ర్నృపాః సమధిగమ్య కృతం వివాహమ్‌ | రోషాన్వితా నగరబాహ్యగతాస్తథోచుః.

35

అద్యైవ తం నృపకళంకధరం చ హత్వా | బాలం తథైవ కిల తం నవివాహయోగ్యమ్‌ |

గృహ్ణీమ తాం శశికళాం నృపతేశ్చ లక్ష్మీమ్‌ | లజ్జా మవాప్య నిజసద్మ కథం వ్రజేమ.

36

శృణ్వంతు తూర్యనినదాన్కిల వాద్యయానాన్‌ | శంఖస్వనా నభిభవంతి మృదంగశబ్దాః |

గీతధ్వనిం చ వివిధం నిగమస్వనం చ | మన్యామహే నృపతిన్బాత్ర కృతో వివాహః.

37

అస్మా న్రృతార్య వచనై ర్విధివ చ్చకార | వైవాహికేన విధినా కరపీడనం చ |

కర్తవ్య మద్య కిమహో ! ప్రవిచింతయంతు | భూపాః ! పరస్పర మతిం చసమర్థయంతు. 38

అను మనోరమ మాటలు విని రాజు మర్షమున దొసిలి యొగ్గి మరల నామె కిట్లనియె : ఇదిగో నా రాజ్యము గొమ్ము. నే నీకు సేనాపతిగ నుందును. కానిచో నా సగము రాజ్యము గొని నీ సుతునితో రాజ్యఫల మనుభవింపుము. పవిత్రమైన కాళీ నివాసభాగ్యము వదలి మీరు వనముననో పురముననో యుండుటను నా మన సొప్పదు. ఈ రాజులు రోషాగ్నులు గ్రక్కుచున్నారు. తొలుత వీరిని శాంతింపజేయవలయును. కానిచో దానభేదములు నెఱపవలయును. అవియు లాభము లేనిచో చివరకు మిగిలినది పోరుండనే యున్నది. జయాపజయములు దైవాధీనములు. ఐనను ధర్మమునకే విజయము గలుగును గాని యధర్మమునకు గాదు. కాన నధర్మపరులగు రాజులకు విజయ మెట్లు చేకూరును? అను నర్థవంతములైన రాజు మాట లాలకించి మనోరమ సర్వాత్మత్వభావముతో మోదభరితయై యభిమానముతో మరల హితవచనము లిట్లు పలికెను. పీఓ రాజా! నీకు భద్రము గల్గుగాక! నీవు భయము పాసి నీ సుతులతోగూడి రాజ్య మనుభవింపుము. నా పుత్రుడు సాకేతపురికి రాజయి సుఖముగ నుండగలడు. మమ్ము మా నివాసమునకు సాగ నంపుము. శ్రీభవానీదేవి నీకు మంగళ మొనగూర్చుగాత! నేను నిరంతర మా పరమాంబికదేవిని సంస్మరించుచుందును. ఇంక నాకు చింత యెక్కడిది?'' ఈ రీతిగ వారిరువురి మధురిమ లొలుకు సంభాషణ సాగుచుండగ నంతలో రేయి గడచెను. మరునా డుదయమున రాజు లెల్లరును అప్పటికే పెండ్లి జరుగుట విని రోషముతో నగర బహిఃప్రదేశ మేగి యిట్లు పెద్దగ కేకలు వేసిరి: పీమన మిపుడు నృపకలంకుడు వివాహమున కయోగ్యుడు నగు సుదర్శనుని వధింతుము. ఆ శశికళను గ్రహింతుము. కానిచో నింత సిగ్గుతో మన యిండ్ల కెట్లేగగలము? ఇదిగో వినుడు. తుముల తూర్య వాద్య రవములు. మృదంగ శంఖధ్వనులు వివిధ గీతానినదంబులు వేదఘోషలు వినిపించుచున్నవి. వీనిని బట్టి రాజు వివాహము జరిపించెనని తెలియుచున్నది. ఇతడు మనకు పెక్కు తీయని మాటలు చెప్పి నమ్మించి మోసగించి వైవాహిక విధులతో యథావిధిగా పెండ్లి జరిపించెను. ఇపుడు మన ప్రస్తుత కర్తవ్య మేమో రాజుల మెల్లర మేకమతితో నాలోచించి యుచితమైన దానిని నిర్ణయింతము.

ఏవం వదత్సు నృపతిష్వథ కన్యకాయా | కృత్వా వివాహవిధి మప్రతిమప్రభావః |

భూపా న్నిమంత్రయితు మాశుజగమా రాజా కాశీపతిః స్వసుహృదైః ప్రథిత ప్రభావైః 39

ఆగచ్ఛంతం చ తం దృష్ట్వా నృపాః కాశీపతిం తదా | నోచుః కించిదపి క్రోధాన్‌ మౌనమాధాయ సంస్థితాః 40

స గత్వా ప్రణిపత్యాథ కృతాంజలి రభాషత | ఆగంత్యవం నృపైః సర్వై ర్భోజనార్థం గృహే మమ. 41

కన్యయా2సౌ వృతో భూపః కిం కరోమి హితాహితమ్‌ | భవద్భి స్తు శమః కార్యో మమాంతో హిదయాళవః 42

తన్నిశమ్య వచ స్తస్య నృపాః క్రోధపరిప్లుతాః | ప్రత్యూచు ర్భుక్త మస్మాభిః స్వగృహం నృపతే ! వ్రజ. 43

కురు కార్యా ణ్యశేషాణి యథేష్టం సుకృతం కృతమ్‌ | నృపాః సర్వే ప్రయాం త్వద్య స్వాని స్వాని గృహాణివై. 44

సుబాహు రపి తచ్ఛ్రుత్వా జగామ శంకితో గృహమ్‌ | కిం కరిష్యంతి సంవిగ్నాః క్రోధయుక్తా నృపోత్తమాః. 45

గతే తస్మి న్మహీ పాలాశ్చక్రుశ్చ సమయం పునః | రుద్ధ్వా మార్గం గ్రహీష్యామః కన్యాం హత్వా సుదర్శనమ్‌. 46

కేచనోచుః కిమస్మాకం హంత: తేన నృపేణ వై | దృష్ట్వా తు కౌతుకం సర్వం గమిష్యామో యథాగతమ్‌. 47

ఇత్యుక్త్వా తే నృపాః సర్వే మార్గ మాక్రమ్య సంస్థితాః | చకారోత్తర కార్యాణి సుబాహుః స్వగృహం గతః. 48

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయస్కంధే ద్వావింశోధ్యాయః

అట్లు రాజులెల్లరు తమలో తా మనుకొండుచుండిరి. అంతలో నప్రతిమ ప్రభావుడగు సుబాహువు వివాహవిధి నెరవేర్చి ప్రసిద్ధ ప్రభావులైన తన మంత్రుతో కూడి రాజుల నాహ్వానింప బయలుదేరెను. తమచెంత కేతెంచు కాశీపతిని గాంచి రాజు లేమియు బలుకక మిన్నకుండిరి. సుబాహువు వారిని జేరి దోయిలించి యిట్లనెను. నృపతు లెల్లరును మా యింటికి భోజనమునకు రండు. నా కన్య సుదర్శనునే వరించినది. ఇక మంచి చెడ్డలకు నేను కర్తను గాను. మీరు కడు మహాత్ములు. దయాళురు. శాంతి వహింపుడు'' అను సుబాహువు మాటలు విని రాజా! మేము బాగుగనే భుజించితిమి లెమ్ము. ఇక నీ యింటికి నీవు వెళ్లుము. మిగిలిన కార్యము చక్కగ నొనరింపజేయుము. మీరు మిక్కిలి సుకృతము చేసితిరి. ఇక మేమే మా మా యిండ్ల కేగుదు'' మనిరి. ఆ రాజు మాటలు విని సుబాహువు కోపసముద్విగ్నులైన వీరేమి ముప్పు తల పెట్టుదురో కదా యని యనుమానించుచు తన నివాసమున కరిగెను. అట్లు రాజేగిన పిదప రాజు లెల్లరును గూడి మార్గ మడ్డగించి సుదర్శనుని జంపి కన్యను గొన ప్రతినబూనిరి. అందు కొందఱు మంచివారు మన కతనితో నేమి పని? పెండ్లి వేడుక కన్నారగని తిరిగి యేగుద'మనిరి. కాని, యది యంగీరింపని రాజు లెల్లరు త్రోవ నడ్డగించి నిలిచిరి. కాశీపతియు తన గృహమున కేగి తరువాతి కార్యములు యథావిధిగ జరిపించెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమున నిరువది రెండవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters