Sri Devi Bhagavatam-1    Chapters   

అథ సప్తవింశోధ్యాయః

హీనాంగీం వర్జయేత్కన్యాం కుష్ఠయుక్తాం వ్రణాంకితామ్‌ | గంధ స్ఫురిత హీనాంగీం విశాలకుల సంభవామ్‌.1

జాత్యంధాం కేకరాం కాణీం కురూపాం బహురోమశామ్‌ | సంత్యజే ద్రోగిణీం కన్యాం రక్త పుష్పాదినాం%కితామ్‌. 2

క్షామాం గర్భ సముద్భూతాం గోలకాం కన్యకోద్భవాం | వర్జనీయాః సదా చైతాః సర్వపూజాది కర్మసు. 3

అరోగిణీం సురూపాంగీం సుందరీం వ్రణవర్జితామ్‌ | ఏకవంశ సముద్భూతాం కన్యాం సమ్య క్ర్పపూజయేత్‌. 4

బ్రాహ్మణీ ర్ర్బహ్మజాః పూజ్యా రాజన్యై ర్ర్బహ్మ వంశజాః | వైశ్యై స్త్రీవర్ణగాః పూజ్యా శ్చతస్రః పాదసంభ##వైః 6

కారుభిశ్చైవ వంశోత్థా యథాయోగ్యం ప్రపూజయేత్‌ | నవరాత్ర విధానేన భక్తి పూర్వం సదైవ హి. 7

అశక్తో నియతం పూజాం కర్తుం చే న్నవరాత్రకే | అష్టమ్యాం చ విశేషేణ కర్తవ్యం పూజనం సదా. 8

పురా2ష్టమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞ వినాశినీ | ప్రాదుర్భూతా మహాఘోరా యోగినీ కోటిభిః సహా. 9

అతో2ష్టమ్యాం శిశేషేణ కర్తవ్యం పూజనం సదా | నానావిధోపహారైశ్చ గంధమాల్యాను లేపనైః 10

పాయసౌ రామిషైర్హోమై ద్ర్బాహ్మణానాం చ భోజనైః | ఫల పుష్పోపహారైవ్చ తోషయే జ్జగదంబికామ్‌. 11

ఉపావాసే హ్యాశక్తానాం నవరాత్ర వ్రతే పునః | ఉపోషణత్రయం ప్రోక్తం యథోక్తం ఫలదం నృప: 12

ఇరువది యేడవ అధ్యాయము

శ్రీదేవీ నవరాత్రవ్రత మాహాత్మ్యము

వ్యాసు డింకను నిట్లనియెను : కన్యకలలో

మంచి కులమున బుట్టినదైనను కుష్ఠరోగము గలది - వ్రణములతో గూడినది. దుర్గంధముతో రోగ పుట్టించునది - వికల హీనాంగములు గలది పూజకు దగదు. పుట్టు గ్రుడ్డి మెల్లకన్ను గలది మిక్కిలి రోమములు గలది దీర్ఘ రోగగ్రస్తు రజస్సు మున్నగు ¸°వన చిహ్నములు గలదియగు స్త్రీ పూజాది కర్మలకు బనికి రాదు. కృశాంగి - మిక్కిలి శిశువు - విధవాసంజాత - కన్యకకు బుట్టినది పూజాది సర్వ కర్మలందు బనికిరాదు. ఏ రోగములును లేనిది - యేక వంశసంజాత - వ్రణములు లేనిది - అందకత్తె - సురూప అగు కన్నియగు చక్కగ పూజింపవలయును. ఎల్ల కార్యములందు బ్రాహ్మణకన్యను భయమునకు రాచకన్నెను లాభమునకు వైశ్య కన్యనుగాని శూద్రకన్యనుగాని పూజింపవలయును. బ్రాహ్మణులు బ్రాహ్మణకన్యను క్షత్రియులు బ్రాహ్మణకన్యను వైశ్యులు త్రివర్ణముల కుమారికలను శూద్రులు చతుర్వర్ణముల కన్నెలను పూజింపవచ్చును. శిల్పులు తమ కొలమున బుట్టిన కన్నెలనే తగినట్లు బూజింపవలయును. ఈ విధముగ నవరాత్ర వ్రతమునందు భక్తి పూర్వకముగ కన్యలను దేవీభావమున బూజింపవలయును. ఈ నవరాత్రములందును నిత్యము నియతితో పూజింప శక్తి జాలనివారొక్క యష్టమినాడైన విశేషించి యెల్లప్పుడును శ్రద్ధాభక్తులతో దేవి నర్చింపవలయును. ఎందులకనగా, పూర్వము దక్షయాగ విధ్వంస కాలమునందు శ్రీ భద్రకాళి మహాభీకర స్వరూపముతో యోగినీగణ కోటులతో నష్టమినాడే ప్రాదుర్భవించినది. కావున అష్టమినాడు శ్రీ పరమేశ్వరిని నానావిధములగు నుపాహారములతో గంధమాల్యాను లేపనములతో నర్చింపవలయును. పాయసములతోను క్షత్రియాదులు మాంసములతోను బ్రాహ్మణ భోజనములతోను ఫలపుష్ఫోపహారములతోను జగజ్జననిని సంతోష పెట్టవలయును. ఓ రాజా! నవరాత్రములు పూర్తిగా నుపవసింప జాలనివాడు మూడునాళ్ళు మాత్రముపవసించిన జాలును; నవరాత్రముల ఉపవాస ఫలితమంతయు లభించును.

సప్తమ్యాం చ తథా%ష్టమ్యాం నవమ్యాం భక్తిభావతః | త్రిరాత్రకరణా త్సర్వం ఫలం భవతి పూజనాత్‌. 13

పూజాభిశ్చైవ హోమైశ్చ కుమారీపూజనై స్తథా | సంపూర్ణం తద్ర్వతం ప్రోక్తం విప్రాణాం చైవ భోజనైః 14

వ్రతాని యాని చాన్యాని దానాని వివిధాని చ | నవరాత్ర వ్రతస్యాస్య నైవ తుల్యాని భూతలే. 15

ధనధాన్యప్రదం నిత్యం సుఖసంతావృద్ధిదమ్‌ | ఆయురారోగ్యదం చైవ స్వర్గదం మోక్షదం తథా. 16

విద్యార్థీనా ధనార్థీవా పుత్రార్థీవా భ##వేన్నరః | తేనేదం విధివ త్కార్యం వ్రతం సౌభాగద్యం శివమ్‌. 17

విద్యార్థీ సర్వ విద్యాం వై ప్రాప్నోతి వ్రతసాధనాత్‌ | రాజ్యభ్రష్టో నృపో రాజ్యం సమవాప్నోతి సర్వథా. 18

పూర్వజన్మని యైర్నూనం న కృతం వ్రతముత్తమమ్‌ | తే వ్యాధితా దరిద్రాశ్చ భవంతి పుత్రవర్జితాః. 19

వంధ్యా చ యా భ##వేన్నారీ విధవా ధనవర్జితా | అనుమా తత్ర కర్తవ్యా నేయం కృతవతీ వ్రతమ్‌. 20

నవరాత్రవ్రతం ప్రోక్తం న కృతం యేన భూతలే | స కథం విభవం ప్రాప్య మోదతే చ తథా దివి. 21

రక్త చందన సమ్మిశ్రైః కోమలై ర్బిల్వ పత్రకైః | భవానీ పూజితా యేన స భ##వే న్నృపతిః క్షితౌ. 22

నారాధితా యేన శివా సనాతనీ దుఃఖా ర్తిహా సిద్ధికరీ జగద్వరా.

దుఃఖావృతః శత్రుయుతశ్చ భూతలే నూనం దరిద్రో భవతీహ మానవః. 23

యాం విష్ణు రింద్రో హరపద్మజౌ తథా వహ్నిః కుబేరో వరుణో దివాకరః |

ధ్యాయంతి సర్వార్థ సమాప్తి నందితా స్తాం కిం మనుష్యా న భజంతి చండికామ్‌. 24

సప్తమి - అష్టమి - నవమి - యీ మూడు దినము లైకాంతిక భక్తితో శ్రీదేవిని బూజించిన సర్వ ఫలములును సంప్రాప్తమగును. ఈ దేవీ నవరాత్ర వ్రతము దేవీపూజలు హోమములు కుమారికాపూజలు బ్రాహ్మణ సంతర్పణములు వీనితో సంపూర్ణమగును. ఈ భూమండలమందు నితరములగు నానావిధ వ్రతములును దానములును దేవీ నవరాత్ర వ్రతముతో సరిపోలజాలవు. ఈ శ్రీదేవీ నవరాత్ర వ్రతము నిత్యము ధనధాన్యముల నిచ్చును. సుఖ సంతాన వృద్ధికరము. ఆయురారోగ్య ప్రదము, స్వర్గమోక్షదాయకము. విద్యార్థిగాని విత్తార్థిగాని పుత్రార్థిగాని యథావిధిగ మంగళకరమగు సౌభాగ్య సంపత్కరమగు ఈ దేవీ నవరాత్ర వ్రత మాచరింపవలయును. ఈ వ్రత సాధనము వలన విద్యార్థి సకల విద్యలు పడయును. రాజ్యభ్రష్టుడు మరల రాజ్యము పొందును. పూర్వజన్మమున దేవీవ్రత మాచరింపనివారు నేడు వ్యాధిగ్రస్తులు దరిద్రులు పుత్రహీనులై పుట్టుదురు. వంధ్య విధవ నిఱుపేదరాలునగు స్త్రీ వెనుకటి జన్మలో దేవీవ్రతము చేయలేదని ఊహించవలయును. ఈ దేవీ నవరాత్ర వ్రతమును భూతలమున చక్కగ నాచరింపనివారు స్వర్గ సుఖవైభవములు పడయజాలరు. రక్త చందన మలందిన సుకుమారములగు మారేడు దళములతో శ్రీ జగన్మాతను బూజించినవాడు తప్పక రాజు గాగలడు. దుఃఖార్తినాశని సిద్ధికరి జగద్వర యగు శివనుగొలువనివాడు భూమిపై దుఃఖ భాజనుడు నిఱుపేద శత్రుయుతుడు గాగలడు. హరిహర హిరణ్య గర్భులు ఇంద్రుడు మిత్రాగ్ని వరుణులు కుబేరుడును సైతము సర్వార్థ సిద్ధుల నంది ముదితాత్ములై యే దేవి నారాధింతురో యా చండికను నరులేల గొల్వరు?

స్వాహా స్వధానామ మనుప్రభావై స్తృప్యంతి దేవాః పితర స్తథైవ |

యజ్ఞేషు సర్వేషు ముదా హరంతి యన్నా మయుగ్మం శ్రుతిభి ర్మునీంద్రాః. 25

యస్యేచ్ఛయా సృజతి విశ్వమిదం ప్రజేశో నానావతారకలనం కురుతే హరిశ్చ |

నూనం కరోతి జగతః కిల భస్మ శంబు స్తాం శర్మదాం న భజతే ను కథం మనుష్య. 26

నైకో%స్తి సర్వభువనేషు తయా విహీనో దేవో నరో%థ విహగః కిల పన్నగో వా |

గంధర్వరాక్షస పిశాచనగేషు నూనం యః స్పందితుం భవతి శక్తియుతో యథేచ్చమ్‌. 27

తాం నసేవేత కశ్చండీం సర్వకామార్థదాం శివామ్‌ | వ్రతం తస్యా న కః కుర్యా ద్వాంఛ న్నర్థ చతుష్టయమ్‌. 28

మహా పాతకసంయుక్తో నవరాత్రవ్రతం చరేత్‌ | ముచ్యతే సర్వపాపేభ్యో నాత్ర కార్యా విచారణా. 29

పురా కశ్చి ద్వణిక్‌ క్షీణో ధనహీనః సుదుఃఃతః | కుటుంబీ చాభవ త్కశ్చిత్కో సలే నృపసత్తమ | 30

అపత్యాని బహూన్యస్యాభవన్‌ క్షుత్పీడితాని చ | భక్ష్యం కించిత్తు సాయాహ్నే ప్రాపుస్తస్య చ బాలకాః. 31

భుంక్తే స్మ కార్యకర్తా%సౌ పరస్యాథ బుభుక్షితః | కుటుంబభరణం తత్ర చకారాతినిరాకులః. 32

సదా ధర్మరతః శాంతః సదాచారశ్చ సత్యవాక్‌ | అక్రోధనశ్స ధృతిమా న్నిర్మదశ్చాన సూయకః. 33

సంపూజ్య దేవతా నిత్యం పితౄన ప్యతిథీం స్తథా | భుంజానే పోష్యవర్గే%థ కృతవా న్భోభజంన వణిక్‌. 34

ఎల్లయాగములందును స్వాహా స్వధారూప మంత్రములతో వేల్చగ సర్వదేవతలు పరితృప్తులగుదురు. కావున మునీంద్రులు సంతోషముతో సర్వ యజ్ఞములందును దేనియొక్క ఏ స్వాహాస్వధా రూపమంత్రములను వేదమంత్రాంతమున నుచ్చరించుచు వేల్తురో ఏ దేవియొక్క కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగములు సృజించునో వారి పెక్కవతారము లెత్తి వానిని బ్రోచునో హరుడు లయకాలమున నంతమొందించునో అట్టి యాత్మ శాంతిదాయినియగు జగదంబను నరుడేల భజింపడు! ఆదేవీ చైతన్యశక్తి లేనిచో నీ విశ్వభువనము లందలి సుర-నర-దనుజ-గంధర్వ-పక్షి-పన్నగ-పిశాచ వృక్షము లందెవ్వ డైనను కదలుటకును శక్తుడు గాడు. పురుషార్థములు గోరువాడు సకల కామార్థదాయిని - శివ - చండి యగు దేవినేల సంసేవింపడు? మహాపాపియైనను దేవీ నవరాత్ర వ్రత మాచరించినచో నతడు సకల దురితముల నుండి తప్పక ముక్తుడగును.

రాజా! తొల్లి యొక వర్తకుడు దనహీనుడగుటచేత దుఃఖార్తుడగుచు సకుటుంబముగ కోసల దేశమున వసించుచుండెను. అతనికి పెక్కురు సంతానము కలరు. వా రాకటిచే నకనకలాడుచు సాయంకాలమునందు దొరకు నన్నముతో కాలము గడుపుచుండిరి. ఆ కోమటియు ఇతరులకడ పని చేయుచు నాకలితో బాధ పడుచునే ఎటులో కుటుంబమును పోషించు కొనుచు కలవరపాటు మాత్ర మందక కాలము గడుపుచుండెను. అతడు ధర్మనిరతుడు - సదాచార సంపన్నుడు - సత్యధైర్యవంతుడు - శాంతుడు - క్రోధమద రహితుడు. అతడు నిత్యమును దేవతలను బూజించి పితరులను తనిపి యున్నంతలో నతిథుల కన్నమిడి తన కుటుంబమువారు తిన్న పదిప తాను తినుచుండెడివాడు.

ఏవం గచ్చతి కాలే వై సుశీలో నామతో గుణౖః | దారిద్ర్యార్తో ద్విజం శాంతం పప్రాచ్ఛాతిబుభుక్షితః 35

భో భూదేవ కృపాం కృత్వా వదస్వాద్య మహామతే | కథం దారిద్ర్యనాశః స్యా దితి మే నిశ్చయేనవై. 36

ధనేషణా మే నైవాస్తి ధనీ స్యామితి మానద ! కుటుంబభరణార్థం వై పృచ్ఛామి త్వాం దిజోత్తమః 27

పుత్రీసుతస్తు మే బాలో భక్షార్థీ రోదతే భృశమ్‌ | తావన్మాత్రం గృహే నాన్నం ముష్టిమేకాందదామ్యహమ్‌. 38

విసర్జితో యతో గేహా ద్గతో బాలో రుదన్మయా | ఆతో మే దహ్యతే%త్యర్థం కిం కరోమి ధనం వినా. 39

వివాహో%స్తి సుతాయా మే నాస్తి విత్తం కరోమి కిమ్‌ | దశవర్షాధికాయాస్తు దానకాలో%పి యాత్యలమ్‌. 40

తేన శోచామి విప్రేంద్ర| సర్వజ్ఞో%సి దయానిధే | తపో దానం వ్రతం కించి ద్ర్బూహి మంత్రంజపం తథా 41

యేనాహం పోష్యవర్గస్య కరోమి ద్విజ | పోషణమ్‌ | తావన్మే స్యా ద్ధన ప్రాప్తి ర్నాథికం ప్రార్థయే కిల. 42

త్వత్ర్పసాదా త్కుటుంబం మే సుఃతం ప్రభ##వేదిహ | తత్కురుష్వ మహాభాగ | జ్ఞానేన పరిచింత్య చ. 43

ఇతి పృష్ట స్తథా తేన బ్రాహ్మణః సంశితవ్రతః | ఉవాచ పరమప్రీత స్తం వైశ్యం నృపసత్తమ | 44

వైశ్యవర్య! కురుష్వాద్య నవరాత్రవ్రతం శుభమ్‌ | పూజనం భగవత్యాశ్చ హవనం భోజనం తథా. 45

వేదపారాయణం శక్తిజపహోమాదికం తథా | కురుష్వాద్వ యథాశక్తి తవ కార్యం భవిష్యతి. 46

ఇట్లు చాలాకాలము గడచుచుండగా ఒకనాడు పేరుచేతను గుణము చేతను సుశీలుడగు నత(వైశ్యు) డాకట మలమల మాడుచు శాంతుడగు నొక ద్విజునితో నిట్లనెను: ఓ భూదేవా! మహామతీ! నా యీ దుర్భరమైన దారిద్ర్య బాధ తొలగు నుపాయమును దయతో సెలవిమ్ము. నేను గొప్ప ధనవంతుడను గావలయునన్న ధనాశ నాకు లేదు. నేను తిని నా కుటుంబము కింత పెట్టగలిగినంత యున్న చాలును. నా బిడ్డ లాకటిమంటకు నకనకలాడుచున్నారు. అక్కటా! దానము సేయుటకు గూడ పట్టెడన్నమైనను లేదు గదా! ఒక బాలుని ఇల్లు వెడలగొట్టితిని. అతడు మోము నిండ కన్నీరు నిండగ నిల్లు వెడలెను. అపు డది చూచి నా నిఱుపేద గుండె కరగి చెఱువైనది. ఒక కన్నె పెండ్లి కెదుగుచున్నది. ఆమె కెప్పుడో పదేండ్లు నిండుటచే కన్యాదాన కాలము దాటుచున్నది. అందువలన దుఃఃంచుచున్నాను. విప్రవర్యా! సర్వజ్ఞుడవు. దయామయుడవు. నా కేదేని తపమో జపమో మంత్రమో దానమో వ్రతమో యేదేని నుపాయము చూపింపుము. దానిచే పోష్యవర్గ పోషణము చేసెదను. నీ దయవలన నా కుటుంబము సుఖముండు గాక! అందుకై తెలివి వెల్గుతో విచారించి యేదేని వెల్గుబాట చూపుము. ఆ కోమటి మాటలు విని సంశితవ్రతు డగు విప్రు డతనికి పరమప్రీతితో నిట్లు పలికెను: వైశ్యోత్తమా ! శుభకరమైన దేవీ నవరాత్ర వ్రత మాచరింపుము. భగవతీ పూజా హోమములు జరుపుము. దేవికి భక్తితో నైవేద్యము సమర్పింపుము. యథాశక్తిగ దేవీ పూజా జపహోమములు బ్రాహ్మణ భోజనము జరిపింపుము. వేదపారాయణము చేయింపుము. నీ వాంఛితము లెల్ల సఫలము లగును.

ఏతస్మా దపరం కించిద్ర్వతం నాస్తి ధరాతలే | నవరాత్రాభిధం వైశ్య! పావనం సుఖదం తథా. 47

జ్ఞానదం మోక్షదం చైవ సుఖసంతానవర్ధనమ్‌ | శత్రునాశకరం కామం నవరాత్రవ్రతం సదా. 48

రాజ్యభ్రష్టేన రామేణ సీతా విరహితేన చ | కిష్కింధాయాం వ్రతం చైత త్కృతం దుఃఖాతురేణ వై. 49

వ్రతస్తేనాపి రామేణ సీతావిరహ వహ్నినా | విధివత్పూజితా దేవీ నవరాత్రవ్రతేన వై. 50

తేన ప్రాప్తా%థ వైదేహీ కృత్వా సేతుం మహార్ణవే | హత్వా మందోదరీనాథం కుంభకర్ణం మహాబలమ్‌. 51

మేఘనాదం సుతం హత్వా కృత్వాభూపం విభీషణమ్‌ | పశ్చదయోధ్యా మాగత్య ప్రాప్తం రాజ్య మకంటకమ్‌. 52

నవరాత్రవ్రతస్యాస్య ప్రభావేణ విశాంవర ! సుఖం భూమితలే ప్రాప్తం రామేణామితతేజసా. 53

ఇతి విప్రవచః శ్రుత్వా స వైశ్యస్తం ద్విజం గురుమ్‌ | కృత్వా జగ్రాహసన్మంత్రం మాయోబీజాభిధం నృప. 54

జజాప పరయా భక్త్యా నవరాత్ర మతంద్రితః | నానావిధోపహారైశ్చ పూజాయామాస సాదరమ్‌. 55

నవసంవత్సరం చైవ మాయాబీజపరాయణః | నవమే వత్సరాంతే తు మహాష్టమ్యాం మహేశ్వరీ. 56

అర్ధరాత్రే తు సంజాతే ప్రత్యక్షం దర్శనం దదౌ | నానావరప్రదానై శ్చ కృతకృత్యం చకార తమ్‌. 57

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే సప్తవింశో%ధ్యాయః.

ఈ భూమండల మంతటను దీనిని మించిన వ్రతము మరేదియును లేదు. ఈ నవరాత్ర వ్రతము పావనము, సుఖసంతోషప్రదము. ఇది సుఖసంతాన వర్ధకము. జ్ఞాన మోక్షప్రదము. శత్రు నాశకము. మున్ను రాజ్యభ్రష్టుడై సీతా వియోగమున విలవించు శ్రీరాముడు కిష్కింధలో దేవీ నవరాత్ర వ్రత మాచరించెను. అపుడు సీతా విరహానలమున తపించు రామభద్రుడు యథావిధిగ దేవీ నవరాత్ర వ్రతము చక్కగ నాచరించెను. ఈ వ్రత ప్రభావముననే శ్రీరాముడు జలధిపై సేతువు గట్టి రావణ కుంభకర్ణాదులను దనుమాడెను; మేఘనాథుని వధించి విభీషణుని లంకాపతిగ జేసి పిమ్మట నయోధ్యకేగి నిష్కంటముగ రాజ్య మేలెను. ఈ దేవీ వ్రత మహత్త్వమువలన నమిత విక్రముడగు రఘురాము డమితానందభరితు డయ్యెను. విప్రుని పలుకులు విని వైశ్యు డతనిని తన గురునిగ భావిచి మాయా బీజ (భువనేశ్వరీ) మంత్రము గ్రహించి ఆ మంత్రము నతడు దేవీ నవరాత్రములందు నిశ్చలభక్తితో జపించుచు నానా విధోపహారములతో భక్తితో దేవి నారాధించెను. ఇట్లతడు తొమ్మిదేండ్లు మాయా బీజ జప పరాయణుడై యుండి తొమ్మిదవ యేడు చివర నొక మహాష్టమినాడు శ్రీమహేశ్వరి యతనికి నడురేయి ప్రత్యక్షమై నానా వరము లొసగి యతనిని ధన్యుని జేసెను అని శ్రీవ్యాసముని జనమేజయునకు తెలిపెను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి తృతీయస్కంధమం దిరువదియేడవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters