Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ఏకోనత్రింశో%ధ్యాయః

తదాకర్ణ్య వచో దుష్టం జనకీ భయవిహ్వలా | వేపమానా స్థిరం కృత్వా మనో వాచ మువాచహ. 1

పౌలస్త్య! కి మసద్వాక్యం త్వమాత్థ స్మరమోహితః | నాహం వై సై#్వరణీ కింతు జనకస్య కులోద్భవా. 2

గచ్ఛ లంకాం దశాస్య! త్వం రామస్త్వాం వై హనిష్యతి | మత్కృతే మరణం తత్ర భవిష్యతి న సంశయః. 3

ఇత్యుక్త్వా పర్ణశాలాయాం గతా సా వహ్నిసన్నిధౌ | గచ్ఛ గచ్ఛేతి వదతి రావణం లోకరావణమ్‌. 4

సో%థ కృత్వా నిజం రూపం జగ మోటజ మంతికమ్‌ | బలాజ్ఞగ్రాహ తాం బాలాం రుదతీం భయవిహ్వలామ్‌. 5

రామ మేతి క్రందంతీం లక్ష్మణతి ముహుర్మహుః | గృహీత్వా నిర్గతః పాపో రథమారోవ్య సత్వరః. 6

గచ్ఛ న్నరుణపుత్రేణ మార్గే రుద్ధో జటాయుషా | సంగ్రామో%భూ న్మహారౌద్ర స్తయో స్తత్ర వనాంతరే. 7

హత్వాం తం తాం గృహీత్వా చ గతో%సౌ రాక్షసాధిపః లంకాయాం క్రందతీ తాత! కురరీవ ద్దురాత్మనా. 8

అశోకవనికాయాం సా స్థాపితా రాక్షసీయుతా | స్వవృత్తాన్నైవ చలితా సామదానాదిభిః కిల. 9

ఇరువది తొమ్మిదవ అధ్యాయము

సీతాపహరణము

వ్యాసభగవాను డిట్లనెను: ఆ దురాత్ముని మాటలు విని సీత భయాకుల చిత్తయై వణకుచు నెట్టకేలకు మది దిట్ట పఱచుకొని యతనితో నిట్టు లనెను: పౌలస్త్యా! ఏల మదనమోహితుడవై యసద్వాక్యము లాడెదవు? నేను కులటను గాను. జనక కుల సంజాతను. దశముఖా! నీవు లంక కేగుము. కాదేని రాముడు నిన్ను హతమార్పగలడు. నా నిమిత్తమున నీకు చావు వ్రాసియున్నదేమో! అని యిట్లు సీత పలికి లోకరావణుడగు రావణునిగూర్చి పోపొమ్మని పలుకుచు పర్ణశాలలోని యగ్ని సన్నిధి కేగెను. అపు డతడు రాక్షస స్వరూపము ధరించి లోని కేగి భయవిహ్వలయై యో రామా! రామా! ఓయి లక్ష్మణా! యని మాటిమాటికి నెలుగెత్తి యేడ్చుచున్న సీతను బలిమితో బట్టుకొనివచ్చి తన తేరి నెక్కించి ఆ పాపాత్ముడు త్వరితగతిని వెడలిపోయెను. అరుణతయుడగు జటాయువు త్రోవలో రావణు నడ్డగించెను. అపు డా వనమందు వారిరువురకు పోరు ఘోరముగ జరిగెను. తుదకు రాక్షసరాజు జటాయువును చంపి కురరి (ఆడ లకుముకిపక్షి) వలె విలపించు సీతను గొని లంక కేగి అచట నశోక వృక్షము క్రింద నుంచెను. మ్రుక్కడిరక్కసుల గుంపు లామె చుట్టు నుండెను. వారెన్ని యో సామదానములు ప్రయోగించిరి. ఐనను నా పరమపావని తన పవిత్ర చరిత్రమును ధ్రువముగ నిలుపుకొనెను.

రామో%పి తం మృగం హత్వా జగామా%%దాయ నిర్వృతః |

ఆయాంతం లక్ష్మణం వీక్ష్య కిం కృతం తే%సు జాసమమ్‌: 10

ఏకాకినీం ప్రియాం కృత్వా కిమర్థం త్వ మిహాగతః | శ్రుత్వా స్వనం తు పాపస్య రాఘవ స్త్వబ్రవీదిదమ్‌. 11

సౌమిత్రి స్త్వబ్రవీ ద్వాక్యం సీతావాగ్భాణతాడితః | ప్రభో%త్రాహం సమాయాతః కాలయోగా న్నసంశయః. 12

తదా తౌ పర్ణశాలాయాం గత్వా వీక్ష్యాతిదుఃఃతౌ | జానక్యన్వేషణ యత్న ముభౌ కర్తుం సముద్యతౌ. 13

మార్గమాణౌ తు సంప్రాప్తౌ యత్రాస్తే పతితః ఖగః | జటాయుః ప్రాణశేషస్తు పతితః పృథివీతలే. 14

తేనోక్తం రావణనాద్య హృతా%సౌ జనకాత్మజా | మయా నిరుద్ధః పాపాత్మా పాతితో%హం మృధే పునః. 15

ఇత్యుక్త్వా%సౌ గతప్రాణ! సంస్కృతో రాఘవేణవై | కృత్వౌర్ధ్వ దైహికం రామలక్ష్మణౌ నిర్గతౌ తతః. 16

కబంధం ఘాతయిత్వా%సౌ శాపాచ్ఛామోచయత్ర్పభుః | వచనాత్తస్య హరిణా సఖ్యం చక్రే%థ రాఘవః. 17

హత్వా చ వాలినం వీరం కిష్కింథారాజ్యముత్తమమ్‌ | సుగ్రీవాయ దదౌ రామః కృతసఖ్యాయ కార్యతః. 18

తత్రైవ వార్షికా న్మాసాం స్తస్థౌ లక్ష్మణసంయుతః | చింతయన్‌ జానకీం చిత్తే దశాననహృతాం ప్రియామ్‌. 19

అట రాముడు జింకను చంపి తీసికొని వచ్చుచుండెను. అంతలో నతని కెదురుగ లక్ష్మణు డేతెంచెను. అతనిని గని రాముడు ఓ యనుజా! ఎంత ఘోరము చేసితివి? ఆ పాపిష్ఠుని మారుగొంతుకతోడి పిలుపు విని ఒంటరిగ నున్న నా ప్రియురాలిని వదలి యిట కేల వచ్చితివి? అన అది విని సౌమిత్రి రామునితో ప్రభూ! నేను సీతా వాగ్చాణముల దెబ్బతిని దైవయోగముననిటకు వచ్చితిని. ఇందు నా దోష మేమియును లేదు' అనెను. అంత వారిరువురును పర్ణశాల కేగి చూచిరి. కాని, యట వారికి సీత కనబడలేదు. అపుడు వారు దుఃఃతమతులై సీతను వెదుక సమకట్టిరి. ఆమెకై కలయ వెదకుచు వెదకుచు కొనయూపిరితో పడియున్న జటాయువును గాంచిరి. సీతను రావణుడు తీసికొనిపోయెను. నేనా పాపాత్మునెదిరించి యిచట పడిపోతిని' అని పలికి జటాయువు ప్రాణములు వదలెను. రాముడు జటాయున కంత్యక్రియలు జరిపెను. వారిరువురందుండి మరల ముందునకు సాగిరి. పిదప కబంధుడు రామబాణములచే చచ్చి శాపమునుండి ముక్తుడయ్యెను. కబంధుని మాట ననుసరించి రాఘవుడు సుగ్రీవునితో మైత్రి చేసికొనెను. వాలిని దునిమి రామ సుగ్రీవులు పరస్పరము సాహాయ్యము చేసికొనుటకు ప్రతినలు చేసికొనిరి. రాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజుగ జేసెను. అచట సుగుణధాముడగు రాముడు రావణుడు కొనిపోయిన తన ప్రియయగు జానకిని స్మరించుచు లక్ష్మణునితో వర్షాకాలము నాలుగు నెలలు గడపెను.

లక్ష్మణం ప్రాహ రామస్తు సీతావిరహపీడితః | సౌమిత్రే కైకయసుతా జాతా పూర్ణమనోరథా. 20

న ప్రాప్తా జానకీ నూనం నాహం జీవామి తాంవినా | నాగమిష్యామ్యయోధ్యాయా మృతే జనకనందినీమ్‌. 21

గతం రాజ్యం వనే వాసో మృత స్తాతో హృతాప్రియా | పీడయ న్మాం స దుష్టాత్మా దైవో%గ్రే కిం కరిష్యతి. 22

దుర్ఞేయం భవితవ్యం హి ప్రాణినాం భరతానుజ | ఆవయోః కా గతిస్తాత భవిష్యతి సుదుఃఖదా. 23

ప్రాప్య జన్మ మనోర్వంశే రాజపుత్రా వుభౌ కిల | వనే%తి దుఃఖభోక్తారౌ జాతో పూర్వకృతేన చ. 24

త్యక్త్వా త్వమపి భోగాంస్తు మయాసహ వినిర్గతః | దైవయోగాచ్చ సౌమిత్రే | భుంక్ష్వ దుఃఖం దురత్యయమ్‌. 25

న కోప్యస్మత్కులే పూర్వం మత్సమో దుఃఖభాఙ్నరః | అకించనో%క్షమః క్లిష్టో న భూతో న భవిష్యతి. 26

కిం కరోమ్యద్య సౌమిత్రే | మగ్నో%స్మి దుఃఖసాగరే | నచాస్తి తరణోపాయో హ్యసహాయస్య మే కిల. 27

న విత్తం న బలం వీర త్వమేకః సహచారకః | కోపం కస్మి న్కరోమ్యద్య భోగే%స్మి న్స్వకృతే%నుజ. 28

గతం హస్తగతం రాజ్యం క్షణా దింద్రసభోపమమ్‌ | వనే వాసస్తు సంప్రాప్తః కో వేద విధినిర్మితమ్‌. 29

బాల భావాచ్చ వైదేహీ చలితా చావయోః సహ | నీతా దైవేన దుష్టేన శ్యామా దుఃఖతరాం దశామ్‌. 30

లంకేశస్య గృహే శ్యామా కథం దుఃఖం భవిష్యతి | పతివ్రతా సుశీలా చ మయి ప్రీతియుతా భృశమ్‌. 31

న చ లక్ష్మణ వైదేహీ సా తస్య వశతా భ##వేత్‌ | సై#్వరిణీవ వరారోహా కథం స్యా జ్జనకాత్మజా. 32

త్యజే త్ర్పాణా న్ని యంతృత్వే మైథిలీ భరతానుజః | న రావణస్య వశగా భ##వేదితి సునిశ్చితమ్‌. 33

మృతా చే జ్జానకీ వీర ప్రాణాం స్త్యక్ష్యా మ్యసంశయమ్‌ | మృతా చే దసితాపాంగీ కిం మే దేహేన లక్ష్మణః. 34

రాముడు దుర్భర సీతావియోగముతో తన తమ్మున కిట్లనెను. లక్ష్మణా! ఇపుడు కైక కోరిక పూర్ణమైనది. నా జానకి లభించనిచో నేను బ్రతుకజాలను. నా సీత లేనిచో నయోధ్యకు రాజాలను. నా రాజ్యము పోయెను. వనవాసము మిగిలెను. తండ్రి గతించెను. ప్రియ హరింపబడెను. దుష్ట దైవము నన్నిట్లు వేధించుచు ఇంక ముందేమి చేయనున్నదో తెలియదు. లక్ష్మణా! ప్రాణుల భవితవ్య మెంతటివారికిని తెలియదు. మన కింక నెంతటి దుఃస్థితి పట్టనున్నదో కదా! మనము మనువంశమునందు రాజులమై జన్మించితిమి. కాని, పూర్వ కర్మానుసారముగ నిపుడు వనములందు వెతలతో మనుచున్నాము. సౌమిత్రీ! నీవును రాజభోగములు పరిత్యజించి దైవయోగమున నా వెంట వచ్చితివి. ఇపుడు తీరని దుఃఖములను బాగుగ ననుభవింపుము. మన పవిత్ర వంశమందు నావంటి దుఃఖభాగి అకించనుడు అసమర్థుడు క్లిష్టుడు పూర్వము లేడు. ముందుండబోడు. నే నీ దుఃఖసాగరమున మునిగితిని. నిస్సహాయుడనగు నా కింక తరణోపాయ మేదియును లేదు గదా ! నా కిపుడు బలముగాని ధనముగాని లేవు. నీ వొక్కడవే నాకు తోడు - నీడ. నేను నా స్వయంకృత మనుభవించుచున్నాను. ఇతరు నెవని గోపింపగలను? ఒక్క త్రుటిలో నింద్రసభా సమానమైన రాజ్యము చేత జిక్కినట్లే చిక్కి మాయ మయ్యెను. వనవాసము ప్రాప్తమయ్యెను. దైవ నిర్మిత మెవ డెఱుంగును? బాల భావమున మన వెంట వచ్చెను. ఆమెయును దైవదుర్విపాకమున దుఃఖతరమైన దుర్దశ ననుభవించుచున్నది. సుశీల పతివ్రత యగు నామె నా పట్ల నత్యంతప్రీతితో వర్తించును. అట్టి యామె నేడు లంకేశు నింట నెన్ని బాధలు పడుచున్నదో కదా! ఆ వైదేహి రావణున కెన్నడును వశవర్తిని గాదు. పావన జనకనందిని సై#్వరిణివలె నెటుల గాగలదు? ఒకవేళ రావణుడు బలాత్కరించినచో సీత ప్రాణములైన వదలును గాని యతనికి మాత్రము స్వాధీన గాదని నా నిశ్చయము. ఆ యసితాపాంగి యగు జానకి మరణించినచో నేను ప్రాణములు వదలుదును. ఆమె గతించిన పిమ్మట నా కీ తనువుతో నేమి పని?''

ఏవం విలవమానం తం రామం కమలలోచనమ్‌ | లక్ష్మణః ప్రాహ ధర్మాత్మా సాంత్వయ న్నృతయా గిరా. 35

ధైర్యం కురు మహాబాహో! త్యక్త్వా కాతరతా మిహ | ఆనయష్యామి వైదేహీం హత్వా తం రాక్షసాధమమ్‌. 36

ఆపది సంపది తుల్యా ధైర్యా ద్భవంతి తే ధీరాః | అల్పధియస్తు నిమగ్నాః కష్టే భవంతి విభ##వే%పి. 37

సంయోగో విప్రయోగశ్చ దైవాధీనా పుభావపి | శోకస్తు కీదృశ్చ స్తత్ర దేహే%నాత్మని చ క్వచిత్‌. 38

రాజ్యా ద్యథా వనేవాసో వైదేహ్యా హరణం యథా | తథా కాలే సమీచీనే సంయోగో%పి భవిష్యతి. 39

ప్రాప్తవ్యం సుఖదుఃఖానాం భోగా న్నిర్వర్తనం క్వచిత్‌| నాన్యథా జానకీజానేః తస్మాచ్ఛోకం త్యజాధునా. 40

వానరాః సంతి భూయాంసో గమిష్యంతి చతుర్దిశమ్‌ | శుద్దిం జనకనందిన్యా ఆనయిష్యంతి తే కిల. 41

జ్ఞాత్వా మార్గస్థితం తత్ర గత్వా కృత్వా పరాక్రమమ్‌ | హత్వా తం పాపకర్మాణ మానయిష్యామి మైథిలీమ్‌. 42

ససైన్యం భరతం వా%పి సమాహూయ సహానుజమ్‌ | హనిష్యామో వయం శత్రుం కిల శోచసి వృథా%గ్రజః. 43

రఘుణౖకరథేనైవ జితాః సర్వా దిశః పురా | తద్వంశజః శోకం మర్హసి రాఘవః. 44

అని బిట్టు విలపించుచున్న కమలలోచనుడు ధర్మాత్ముడు నగు శ్రీరాముని లక్ష్మణు డూరడించి ప్రియహిత వచనముల నిట్లు పలికెను. ఓ మహాబాహూ! భయ ముడుగుము. నే నా రాక్షసాధముని హతమార్చి వైదేహిని దెత్తును. ధీరులు సంపదలందు నాపదలందును ధైర్యమువలన సమభావమున నుందురు. అల్పమతులు కష్టసుఖములందు మునిగిపోదురు. సంయోగ వియోగములు రెండును దైవాధీనములు. ఈ యనాత్మయగు తనువునుగూర్చి యింతగ శోకింపనేల? రాజ్యమునుండి మనకు వనవాస మెట్లు కలిగెనో వైదేహీహరణ మెట్లు సంభవించెనో అటులే మంచికాలము వచ్చినపుడు మనకు మరల సంయోగము కూడ సంభవించును. సుఖదుఃఖములు మనలను వెన్నాడుచుండును. వాని ననుభవించిన గాని యవి తీరిపోవు. కావున నో జానకీరమణా! ఇపుడు శోక ముడుగుము. ఇచట పెక్కురు వానరులు గలరు. వారు నలుదెస లేగి సీత జాడ నరసి రాగలరు. పిమ్మట చక్కని మార్గము గుర్తించి అచటి కేగి మనము పరాక్రమముతో నా పాపకర్ముని రూపుమాపుదము. మైథిలిని గొనివత్తము. కాదేని భరతుని ససైన్యముగ సోదరునితో గలిసి రప్పించుదము. అపుడు మన మెల్లరమును కలిసి శత్రువును (రావణుని) పరిమార్చెదము. ఇంతమాత్రాన కూరక శోకింపనేల? పూర్వము రఘుమహారా జొక్క రథముతో నేగి యెల్ల దిక్కులను జయించెను. నీ వా రఘువంశ సంజాతుడవు. ఇంక శోకింపతగవు.

ఏకో%హం సకలాన్‌ జేతుం సమర్థో%స్మి సురాసురాన్‌ | కిం పునః ససహాయో వై రావణం కులపాంసనమ్‌. 45

జనకం వా సమానీయ సాహాయ్యే రఘునందన | హనిష్యామి దురాచారం రావణం సురకంటకమ్‌. 46

సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరమ్‌ సుఖమ్‌ | చక్రనేమి రివైకం తన్న భ##వే ద్రఘునందన. 47

మనో%తి కాతరం యస్య సుఖదుఃఖ సముద్భవే | స శోకసాగరే మగ్నో న సుఖీ స్యా త్క దాచన. 48

ఇంద్రేణ వ్యసనం ప్రాప్తం పురా వై రఘునందన | నహుషః స్థాపితో దేవైః సర్వై ర్మఘవతః పదే. 49

స్థితః పంకజమధ్యే చ బహువర్షగణా నపి | అజ్ఞాతవాసం మఘవా భీత స్త్యక్త్యా నిజం పదమ్‌. 50

పునః ప్రాప్తం నిజం స్థానం కాలే విపరివర్తతే | నహుషః పతితో భూమౌ శాపా దజగరాకృతిః. 51

ఇంద్రాణీం కామయానస్తు బ్రాహ్మణా నవమాన్య చ | అగస్త్యకోపాత్సంజాతః సర్పదేహో మహీపతిః. 52

తస్మా చ్ఛోకో న కర్తవ్యో వ్యసనే సతి రాఘవ | ఉద్యమే చిత్త మాస్థాయ స్థాతవ్యం వై విపశ్చితా. 53

సర్వజ్ఞో%సి మహాభాగ సమర్థో%సి జగత్పతే | కిం ప్రాకృత ఇవాత్యర్థం కురుషే శోక మాత్మని. 54

ఇతి లక్ష్మణ వాక్యేన బోధితో రఘునందనః | త్యక్త్వా శోకం తథా%త్యర్థం బభూవ విగతజ్వరః. 55

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయ స్కంధే ఏకోనత్రింశో%ధ్యాయః.

నే నొక్కడనే సకల సురాసురులను గెలువజాలినవాడను. ఇక నీవును తోడు నీడగ నుండగ కులపాంసనుడగు రావణుడొక లెక్కయా? అట్లు కాదేవి జనకుని సాయము బడసి సురకంటకు డగు దుష్ట రావణుని అంతమొందింతము. సుఖము తరువాత దుఃఖము, దుఃఖము తరువాత సుఖము రెండును బండి చక్రము వలె తిరుగుచుండెను. ఒక్క దుఃఖముగాని సుఖముగాని రాదు. సుఖ, దుఃఖములు కలిగినపుడు ఎవని మనస్సు భయగ్రస్తమగునో యతడు శోకసాగరమగ్ను డగును. అట్టి వానికి సుఖ మెట్లు గలుగును? మున్నింద్రుడు దుఃఖముల పాలుగాగా దేవత లెల్లరు గలిసి యతని స్థానమున నహుషు నుంచిరి. అపుడు సురపతి యంతవాడే భీతిల్లి తన పదము బాసి యొక పద్మము నడుమ పెక్కేడు లజ్ఞాతవాసమున నుండెను. పిమ్మట కాలము రాగా నింద్రుడు మరల తన పదవి తాను బడసెను. నహుషుడు శాపవశమున నజగరమై నేల గూలెను. నహుషు డింద్రాణిని గోరెను. విప్రులను దిరస్కరించెను. అందువలన నగస్త్యునిచే నతడు సర్పము కమ్మని శపింపబడెను. కునుక నో సుగుణాభిరామా! తెలివి గలవాడు కష్ట కాలములందు శోకింపగూడదు. అతడు తన పనిలో చిత్తముంచి వర్తింపవలయును. ఓ మహానుభావా! త్రిజగత్పతీ! నీవు సమర్థుడవు. సర్వజ్ఞుడవు. ఒక ప్రాకృత నరునివలె నాత్మ నింతగ క్షోభ పెట్టుకొందువేల? ఈ రీతిగ బలుకు లక్ష్మణుని వచనములచే ప్రబోధితుడై రఘురాముడు అధిక శోకము వదలి శాంత చిత్తుడయ్యెను అని వ్యాసముని జనమేజయునితో పలికెను.

ఇది శ్రీ మద్దేవి భాగవతమందలి తృతీయ స్కంధమందిరువది తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters