Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టమో%ధ్యాయః ఇతి పృష్ట స్తదా విప్రో రాజ్ఞా పారిక్షితేన వై | ఉవాచ విస్తరా త్సర్వం వ్యాసః సత్యవతీసుతః.
1 జనమేజయో%పి ధర్మాత్మా నిర్వేదం పరమం గతః | చిత్తం దుశ్చరితం మత్వా వైరాటీతనయస్య వై.
2 తసై#్య వోద్ధరణార్థాయ చకార సతతం మనః | విప్రావమాన పాపేన యమలోకం గతస్యవై.
3 పున్నామనరకాద్యస్మా త్త్రాయతే పితరం స్వకమ్ | పుత్త్రేతి నామ సార్థం స్యా త్తేన తస్య మునీశ్వరాః.
4 సర్పదష్టం నృపం శ్రుత్వా హర్మ్యోపరిమృతం తథా | విప్రశాపా దౌత్తరేయం స్నానదానవివర్జితమ్. 5 పితుర్గతి నిశమ్యా%సౌ నిర్వేదం గతవాన్నృపః | పారిక్షితో మహాభాగః సంతప్తో భయవిహ్వలః. 6 పప్రచ్ఛా%థ ముని వ్యాసం గృహగత మనిందితః | నరనారాయణ స్యేమా కథాం పరమ విస్తృతామ్. 7 స యదా నిహతో రౌద్రో హిరణ్యకశిపుర్నృప | అభిషిక్త స్తదా రాజ్యే ప్రహ్లాదో నామ తత్సుతః. 8 తస్మిన్ శాసతి దైత్యేంద్ర దేవబ్రాహ్మణ పూజకే | మఖై ర్భూమ్యాం నృపతయో యజంతః శ్రద్ధాయా%న్వితాః. 9 బ్రాహ్మణాశ్చ తపోధర్మతీర్థయాత్రా శ్చ కుర్వతే | వైశ్యా శ్చ స్వస్వ వృత్తిస్థాః శూద్రాః శుశ్రూషణ రతాః. 10 నృసింహేన చ పాతాళే స్థాపితః సో%థ దైత్యరాట్ | రాజ్యం చకార తత్రైవ ప్రజాపాలనతత్పరః. 11 కదాచి ద్భృగుపుత్త్రో%థ చ్యవనాఖ్యో మహాతపాః | జగామ నర్మదాం స్నాతుం తీర్థం వై వ్యాహృతీశ్వరమ్. 12 ఎనిమిదవ అధ్యాయము ప్రహ్లాదుని తీర్థయాత్రాసేవనము ఈ ప్రకారముగ జనమేజయుడు ప్రశ్నింపగా సత్యవతీ సుతుడగు వ్యాస భగవాను డతనికి సవిస్తరముగ నంతయు తెలిపెను. ధర్మాత్ముడగు జనమేజయుడును తన తండ్రి చిత్తము దుర్వర్తనముతో కూడినదను విషయమును స్మరించి మిగుల నిర్వేదమును చెందెను. బ్రాహ్మణు నవమానించి యమపురి కేగిన తన తండ్రి నెట్టులైన నుద్ధరింపవలయునని రాజు తన మదిలో నిశ్చయించెను. పుత్త్రుడు తన తండ్రిని పున్నామ నరకము నుండి సముద్ధరించినచో నతని పుత్త్రనామము సార్థకమగును. పరీక్షిన్మహారాజు విప్రశాపముచే స్నానదానము లుజ్జగించి తన భవనములో నుండగా సర్ప మతనిని కాటువేసెను. తనతండ్రికట్లు గల్గిన దుర్గతి విని మహాభాగుడగు జనమేజయుడు భయవిహ్వలత్వమున మిక్కుటముగ నిర్విణ్ణుడయ్యెను. తన గృహమునకు ఏతెంచిన వ్యాసమునీశ్వరుని ఉదాత్తుడగు జనమేజయరాజు తనకు నరనారాయణుల పుణ్యగాధ నెఱిగింపు మని కోరెను. వ్యాసుడిట్లనెను : హిరణ్యకశిపుడు పరాక్రమశాలి. అతడు మరణించగ నతని రాజ్యమున కతని సుతుడు ప్రహ్లాదుడభిషిక్తుడయ్యెను. ఆ దానవపతి దేవబ్రాహ్మణ పూజా నిరతుడు. అతని పాలనమున రాజులు శ్రద్ధతో పెక్కు జన్నములొనర్చిరి. ఆ ప్రహ్లాదుని యేలుబడిలో నెల్ల బ్రాహ్మణులు తపోధర్మరతులు - తీర్థయాత్రా చరణశీలురు నైరి. వైశ్యులు నిజవృత్తి నిరతులైరి. శూద్రులు సేవా తత్పరులైరి. శ్రీ లక్ష్మీనృసింహస్వామి ప్రహ్లాదుని పాతాళమందుండ నియమించెను. అందుచే ప్రహ్లాదుడచ్చటనే యుండి ప్రజాపాలన తత్పరుడై రాజ్యమేలు చుండెను. ఒకప్పుడు భృగుపుత్రుడగు చ్యవన మహర్షి నర్మదలో స్నానము చేయుటకు వ్యాహృతీశ్వర తీర్థమున కరిగెను. దేవాం మహానదీం దృష్ట్యా తతస్తస్యా మవాతరత్ | ఉత్తరంతం ప్రజగ్రాహ నాగో విషభయంకరః. 13 గృహీతో భయభీతస్తు పాతాళే మునిసత్తమః | సస్మార మనసా విష్ణుం దేవదేవం జనార్దనమ్. 14 సంస్మృతే పుండరీకాక్షే నిర్విషో%భూ న్మహోరగః | న ప్రాప చ్యవనో దుఃఖం నీయమానో రసాతలమ్. 15 ద్విజిహ్వేన మునిస్త్యక్తో నిర్విణ్ణనా%తిశంకినా | మాం శ##పేత మునిః క్రుద్ధం స్తాపసో%యం మహానితి. 16 చచార నాగకన్యాభిః పూజితో మునిసత్తమః | వివేశాప్యథ నాగానాం దానవానాం మహత్పురమ్. 17 కదాచిద్భృగు పుత్త్రం తం విచరంతం పురోత్తమే | దదర్శ దైత్యరాజో%సౌ ప్రహ్లాదో ధర్మవత్సలః. 18 దృష్ట్వా తం పూజయామాస మునిం దైత్యపతి స్తదా | పప్రచ్ఛ కారణం కిం తే పాతాళాగమనే వద. 19 ప్రేషితో%సి కి మింద్రేణ సత్యం బ్రూహి ద్విజోత్తమ | దైత్య విద్వేషయుక్తేన మమ రాజ్యదిదృక్షయా. 20 చ్యవనః: కిం మే మఘవతా రాజ న్యదహం ప్రేషితః పునః | దూతకార్యం ప్రకుర్వాణః ప్రాప్తవాన్నగరే తవ. 21 విద్ధి మాం భృగుపుత్త్రం తం స్వనేత్రం ధర్మతత్పరమ్ | మా శంకాం కురు దైత్యేంద్ర! వాసవ ప్రేషితస్య వై. 22 స్నానార్థం నర్మదాం ప్రాప్తః పుణ్యతీర్థే నృపోత్తమః నద్యామేవావతీర్ణో%హం గృహీతశ్చ మహా%హినా. 23 జాతో%సౌ నిర్విషః సర్పో విష్ణోః సంస్మరణా దివ | ముక్తో%హం తేన నాగేన ప్రభావా త్స్మరణస్య వై. 24 అతడు పుణ్యతీర్థమైన రేవానదిలోనికి దిగుచుండగనే యొక భయంకర విషసర్ప మతనిని గట్టిగ పట్టుకొనెను. అది తన్ను పాతాళమునకు గొనిపోవుచుండుట గని మునిసత్తముడు భయముతో దేవదేవుడగు విష్ణుని మనసార సంస్మరించెను. ఆ పుండరీకాక్షుని దివ్యనామ మొక్కమారు స్మరించినంతనే సర్ప విషము దిగిపోయెను. అందుచే నతడు రసాతలమున కేగియు నెంత మాత్రము దుఃఖ మొందకుండెను. ఇతడు గొప్ప ముని-తపస్వి- కునుక తన్ను శపించునేమో'యని భయపడి పాము మునిని వదిలిపెట్టెను. ఆ చ్యవన మహర్షి నాగకన్యలచేత బూజింపబడుచు నెల్లెడల స్వేచ్ఛగ దిరుగుచు నాగదానవుల సుందరపురము ప్రవేశించెను. అచ్చోట భృగుపుత్రుడగు చ్యవన మహర్షి తిరుగుచుండగా ధర్మవత్సలుడగు ప్రహ్లాదుడా మునిని గాంచెను. ఆ దానవరాజు మునిరాజు నుచిత రీతిగ సత్కరించి ఓ ద్విజసత్తమా! దానవ విద్వేషియైన యింద్రుడు నా రాజ్యపాలన గాంచి రమ్మని పంపెనా యేమి? నిజము పలుకుము' అని యతడు పాతాళమునకు వచ్చుటకు గల కారణమడిగెను. ఆ యింద్రునితో నా కేమి పని? అతడు నన్ను దూతగ పంపుటేమి? నేను నీ నగరమునకు వచ్చుటేమి? నేను ధర్మతత్పరుడను - స్వతంత్రుడను - భృగుమహర్షి పుత్త్రుడను. నన్ను మహేంద్రుడు పంపలేదు. మనమున నీ వీ సందేహము విడువుము. రాజా! నేను స్నానార్థమయి నర్మదానదిలో నొక పుణ్యతీర్థమున దిగితిని. ఇపుడు నన్నొక భీకర సర్పము పట్టుకొనెను. నేను సత్వరమే శ్రీహరినామ సంస్మరణ మొనరించితిని. ఆ సర్ప విషము దిగిపోయెను. అట్లు నేను హరినామ స్మరణ ప్రభావమున పాము బారినుండి విముక్తి బొందితిని. అత్రా%%గతేన రాజేంద్ర మయా%%ప్తం తవ దర్శనమ్ | విష్ణుభక్తో%సి దైత్యేంద్ర! తద్భక్తం మాం విచింతయ. 25 తన్నిశమ్య వచః శ్లక్షణం హిరణ్యకశిపోః సుతః | పప్రచ్ఛ పరయా ప్రీత్యా తీర్థాని వివిధాని చ. 26 పృథివ్యాం కాని తీర్థాని పుణ్యాని మునిసత్తమ | పాతాళే చ తథా%%కాశే తాని నో వద విస్తరాత్. 27 చ్యవనః : మనోవాక్కాయశుద్ధానాం రాజం స్తీర్థం పదే పదే | తథా మలినచిత్తానాం గంగా%పి కీకటా%ధికా. 28 ప్రథమం చే న్మనః శుద్ధం జాతం పాపవివర్జితమ్ | తదా తీర్థాని సర్వాణి పాపనాని భవంతి వై. 29 గంగాతీరే హి సర్వత్ర వసంతి నగరాణి చ | ప్రజాశ్చైవాకరా గ్రామాః సర్వే ఖేటా స్తథాపరే. 30 నిషాదానాం నివాసాశ్చకైవర్తానాం తథా%పరే | హూణవంగఖసానాం చ వ్లుెచ్ఛానాం దైత్యసత్తమ! 31 పిబంతి సర్వదా గాంగం జలం బ్రహ్మోపమం సదా | స్నానం కర్వంతి దైత్యేంద్ర త్రికాలం స్వేచ్ఛయా జనాః. 32 తత్రైకోపి విశుద్ధాత్మ న భవత్యేవ మారిష | కిం ఫలం తర్హి తీర్థస్య విషయోపహతాత్మసు. 33 కారణం మన ఏవాత్ర నాన్యద్రాజ న్విచింతయ | మనఃశుద్ధిః ప్రకర్తవ్యా సతతం శుద్ధి మిచ్ఛతా. 34 తీర్థవాసీ మహాపాపీ భ##వే త్తత్రాన్యవంచనాత్ | తత్రైవాచరితం పాప మానంత్యాయ ప్రకల్పతే. 35 యథేంద్రవారుణం పక్వం మిష్టం నైవోపజాయతే | భావదుష్ట స్తథా తీర్థే కోటిస్నాతో న శుద్ధ్యతి. 36 ఇచటికి వచ్చిన తోడనే మీ దర్శనభాగ్యము లభించినది. దానవేంద్రా! నీవు విష్ణుని పరమభక్తుడవు. నన్ను నట్లే యెఱుంగుము అని చ్యవనుడు పలికెను. ప్రహ్లాదుడు ముని యమృతవాక్కు లాకర్ణించి తనకు వివిధ తీర్థ విశేషములు విస్తరించి తెలుపుమని కోరుచు పరమప్రీతితో మునితో నిట్లనెను: మునీశా! ఆకాశము భూమి పాతాళము - వీనియం దేయే పుణ్యతీర్థములు గలవో వాని నెల్ల నాకు స్పష్టముగ తెలియబలుకుము అన చ్యవనర్షి యిట్లనెను: రాజేంద్రా! ఎవ్వని మనో వాక్కాయ కర్మములు విశుద్ధములుగ నుండునో వాని యడుగడుగున తీర్థమే యుండును. మలిన చిత్తులకు గంగయును కీకట ప్రదేశముకంటె చెడ్డది. మొదట మనస్సు పాపరహితము గావలయును. చిత్తశుద్ధి యేర్పడవలయును. అపుడతనికి సర్వ తీర్థములును పవిత్రములగును. దైత్యసత్తమా! పవిత్రమైన పుణ్యగంగాతటమునందు పెక్కు నగరములు గ్రామములు గొల్ల పల్లెలు గలవు. అట బోయపల్లెలును గలవు. వానియందు హూణవంగవ్లుెచ్ఛాది జాతుల వారు నివాసముందురు. ఆ బ్రహ్మ సమానమైన పావన గంగాజలమందు పుణ్యాత్ములు త్రికాలముంలందును క్రుంకులిడుచు జలములు క్రోలుచు స్వేచ్ఛగనుందురు. కాని, వారి యందొక్కడును విశుద్ధాత్ముడు గానరాడు. ఇంక విషయోపభోగ చిత్తులకు తీర్థఫలమెట్లు గల్గును? ఇంతకును మనస్సు కారణము - ఇతర మేదియు గాదని యెఱుగుము. శుచిత్వము గోరువాడు తొలుత తన మనస్సును శుద్ధ మొనర్చుకొనవలమును. తీర్థవాసి యితరులను వంచించినచో నతడు మహాపాపి యగును. ఆ తీర్థములందొనరించని కొలది పాప మనంతగుణముల పెరుగును. ఇంద్రవారుణ మను పండు పండినను తీయగ నుండదు. అట్లే చిత్తశుద్ధి లేనివాడు కోటిమారులు తీర్థ మాడినను పవిత్రుడు గాజాలడు. ప్రథమం మనసః శుద్ధిః కర్తవ్యా శుభమిచ్ఛతా | శుద్ధే మనసి ద్రవ్యస్య శుద్ధిర్భవతి నాన్యథా. 37 తథైవా%చారశుద్ధిః స్యా త్తత స్తీర్థం ప్రసిద్ధ్యతి | అన్యథా తు కృతం సర్వం వ్యర్థం భవతి తక్షణాత్. 38 హీన వర్ణస్య సంసర్గం తీర్థే గత్వా సదా త్యజేత్ | భూతానుకంపనం చైవ కర్తవ్యం కర్మణా ధియా. 39 ప్రథమం నైమిషం పుణ్యం చక్రతీర్థం చ పుష్కరమ్ | అన్యేషాం చైవ తీర్థానాం సంఖ్యా నాస్తి మహీతలే. 40 పావనాని చ స్థానాని బహూని నీపసత్తమః | తచ్ఛ్రుత్వా వచనం రాజా నైమిషం గంతు ముద్యతః. 41 నోదయామాస దైత్యా న్వై హర్షనిర్భరమానసః | ఉత్తిష్ఠంతు మహాభాగా గమిష్యామో%%ద్య నైమిషమ్. 42 ద్రక్ష్యామః పుండరీకాక్షం పీతవాసన మచ్యుతమ్ | ఇత్యుక్త్వా విష్ణుభ##క్తేన సర్వే తే దానవాస్తదా. 43 తేనైన సహా పాతాళా న్నిర్యయుః పరయా ముదా | తే సమేత్య చ దైతేయా దానవాశ్చ మహాబలాః. 44 నైమిషారణ్య మాసాద్య స్నానం చక్రుర్ముదా%న్వితాః ప్రహ్లాద స్తత్ర తీర్థేషు చరన్దైత్యైః సమన్వితః. 45 సరస్వతీం మహాపుణ్యాం దదర్శ విమలోదకామ్ | తీర్థే తత్ర నృపశ్రేష్ఠ ! ప్రహ్లాదస్య మహాత్మనః. 46 మనః ప్రసన్నం సంజాతం స్నాత్వా సారస్వతే జలే ! విధవత్తత్ర దైత్యేంద్రః స్నానదానాదికం శుభే. 47 చకారాతి ప్రసన్నాత్మా తీర్థే పరమపావనే. ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే%ష్టమో%ధ్యాయః. శుభము గోరువాడు మొదట చిత్తశుద్ధిని బడయవలయును. హృదయశుద్ధిచే ద్రవ్యశుద్ధి యగును. అంతేకాని వేరు విధమున గాదు. ద్రవ్యశుద్ధికి తరువాత నాచారశుద్ధి దాని తరువాత తీర్థశుద్ధి జరుగును. శుద్ధిలేనిచో నంతయు క్షణమాత్రమున వ్యర్థమగును. తీర్థ మేగినవాడు నీచజాతులతో సాంగత్యము చేయరాదు. అతడు స్థిరబుద్ధితో సత్కర్మములతో భూతదయ నెఱపవలయును. దివ్యతీర్థ కథలు చెప్పుమంటివి. వచింతును, ఆలకింపుము. రాజేంద్రా! మొట్టమొదట పుణ్యప్రదమైన తీర్థము నైమిషము. తరువాతిది చక్రతీర్థము. ఆ తరువాత పుష్కరతీర్థము ప్రశస్తము. ఈ భూమండలమందుగల పుణ్యతీర్థము లెన్నతరముగాదు. ఇంకను పావన తీర్థరాజము లెన్నియో కలవు, అను ముని మాటలు విని ప్రహ్లాదుడు నైమిషమున కేగ సిద్ధపడెను. అతడు సంతుష్టచిత్తుడై యితర దానవుల నిట్లు ప్రేరించెను. ఓ మహాత్ములారా! లెండు. మనము నైమిషమున కేగుదము. అచట పీతాంబరుడు పండరీకాక్షుడు నైన యచ్యుతుని సందర్శింతము'' అని యిట్లు ప్రహ్లాదుడు వచింపగా దనుజులెల్లరును లేచి సిద్ధపడిరి. వారెల్లరును పరమప్రీతితో ప్రహ్లాదునిగూడి పాతాళమునుండి వెడలిరి. అట్లు బలశాలురగు దైత్యదానవులెల్లరును గుమిగూడి ప్రమోదముతో నైమిశారణ్యము చేరి యచటి తీర్థమున తానములాడిరి. ప్రహ్లాదుడు నెల్ల దైత్యులంగూడి తీర్థము లెల్ల తిరిగెను. ఆ మహాత్ముడగు ప్రహ్లాదుడు విమలజలములతో పుణ్యప్రదమైన సరస్వతీ తీర్థమునందలి పావనజలములను గాంచెను. అతడందు మునిగినంతనే యతని చిత్తము సుప్రసన్నమయ్యెను. అతడా పరమపావన తీర్థమునందు సవిధిగ స్నానదానాదులొనర్చెను. ఇట్లు ప్రహ్లాదుడు పరమపావన తీర్థమున శుద్ధాత్ముడై పెక్కు శుభకర్మములాచరించెను. అని శ్రీ వ్యాసముని జనమేజయునితో వచించెను. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు ప్రహ్లాదుని తీర్థయాత్రాసేవనమను అష్టమాధ్యాయము.