Sri Devi Bhagavatam-1    Chapters   

అథ చతుర్దశో%ధ్యాయః

వ్యాసః : ఇతి సంచిత్య మనసా తానువాచ హసన్నివ| వంచితా మత్స్యరూపేణ దైత్యాః కిం గురుణా కిల. 1

అహం కావ్యో గురుశ్చా%యం దేవకార్య ప్రసాధకః అనేన వంచితా యూయం మద్యాజ్యా నాత్ర సంశయః. 2

మా శ్రద్ధధ్వం వచో%స్యార్యా దాంభికోయం మదాకృతిః | అనుగచ్ఛత మాం యాజ్యా స్త్యజతైనం బృహస్పతిమ్‌. 3

ఇత్యాకర్ణ్య వచస్తస్య దృష్ట్వా తౌ సదృశౌ పునః | విస్మయం పరమం జగ్ముః కావ్యో%యమితి నిశ్చితాః 4

స తాన్వీక్ష్య సుసంభ్రాంతా న్గురుర్వాక్య మువాచ హ | గురు ర్వో వంచయత్వేవ మద్రూపో%యం బృహస్పతిః. 5

ప్రాప్తో వంచయితుం యుష్మా న్దేవకార్యార్థ సిద్ధయే | మా విశ్వాసం వచస్యస్య కురుధ్వం దైత్య సత్తమా. 6

ప్రాప్తా విద్యా మయా శంభో ర్యుష్మా నధ్యాపయామితాం | దేవేభ్యో విజయం సూనం కరిష్యామి న సంశయః. 7

ఇతి శ్రుత్వా గురో ర్వాక్యం కావ్యరూపధరస్య తే | విశ్వాసం పరమం జగ్ముః కావ్యోయమితి నిశ్చయాత్‌. 8

కావ్యేన బహుధా తత్ర బోధితాః కిల దానవాః | బుబుధు ర్న గురోర్మాయామోహితాః కాలపర్యయాత్‌. 9

ఏవం తే నిశ్చయం కృత్వా తతో భార్గవ మబ్రువన్‌ | ఆయం గురు ర్నో ధర్మాత్మా బుద్ధిదశ్చ హితే రతః 10

దశ వర్షాణి సతత మయం నః శాస్తి భార్గవః | గచ్ఛ త్వం కుహకో భాసి నా%స్మాకం గురురప్యుత. 11

పదునాల్గవధ్యాయము

దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

అట్లు శుక్రాచార్యుడు తన మదిలో నాలోచించుకొని నవ్వుచు దైత్యులతో నిట్లు పలికెను. ఓ దైత్యులారా! మీరు నా రూపుదాల్చి వచ్చిన దేవగురుని నమ్మి మోసపోసితిరి. వాస్తవ శుక్రుడను నేను. నా యాజ్యులు మీరు. ఇతడు దేవకార్యము సాధింపవచ్చిన బృహస్పతి. మీరితని చేత నిజముగ వంచితులైతిరి. ఇతడు నా రూపరేఖలు దాల్చిన దాంభికుడు. ఈతని మాటలు నమ్మకుడు. ఈ బృహస్పతిని వీడి నన్ననుసరింపుడు' అను శుక్రుని మాటలు విని వారెల్లరును పరమ విస్మయమందిరి. వారా యిరువురి యాకారములను సరిగ పోల్చుకొనలేకపోయిరి. తమకు బోధించుచున్న గురుని వారు శుక్రునిగ భావించిరి. అంత బృహస్పతి మాయామోహితులైన రాక్షసులను గని యిట్లు పలికెను, దైత్యులారా! ఇతడు శుక్రుడు గాడు. ఆ బృహస్పతి నా రూపమున నిపుడు మీ కడకు వచ్చెను. ఇతడు దేవతల పని నెరవేర్ప మీ కడకు వచ్చి మిమ్ము వంచింపజూచుచున్నాడు. ఇతని మాట నమ్మకుడు. నేను శంభునినుండి విద్య బడసితిని. దానిచే మీకు దేవతల తోడి యుద్ధమున జయము గల్పింతు'నని శుక్రరూపుడైన గురువు పలికెను. దానవులును అతడే తమ గురువగు శుక్రుడని తమ మదిలో నిశ్చయించుకొనిరి. అపుడు శుక్రుడు వారి కెంతయో నచ్చజెప్పి చూచెను. కాని, వారు గురుమాయా మోహితులై కాల విపర్యయమున శుక్రుని మాటలు పెడచెవిపెట్టిరి. వారట్లొక నిర్ణయమునకు వచ్చి శుక్రునితో నిట్లనిరి : ఇతడే మా గురువు. ధర్మాత్ముడు. మాకు మంచిబుద్ధి నొసగి మా మేలుగోరువాడు. ఈ శుక్రుడే పదేండ్లనుండి మమ్మెడబాయక శాసించుచున్నాడు. నీవు టక్కరివలె బొడగట్టుచున్నావు. నీవు మా గురువు గావు. ఇచ్చోటు వదలి వెళ్ళుము.

ఇత్యుక్త్వా భార్గవం మూఢా నిర్భర్త్స్య చ పునః పునః | జగృహుస్తం గురుం ప్రీత్యా ప్రణిపత్యా%భివాద్య 12

కావ్య స్తు తన్మయా న్దృష్ట్వా చుకోపా%థ శశాప చ | దైత్యా న్విబోధితా న్మత్వా గురునా చాతివంచితాన్‌. 13

యస్మా న్మయా బోధితా నై గృహ్ణీయుర్న చ మే వచః | తస్మా త్ప్రణష్ట సంజ్ఞా వై పరాభవ మవాప్స్యథ. 14

మదవజ్ఞాఫలం కామం స్వల్పే కాలే హ్యవాప్స్యథ | తదా%స్య కపటం సర్వం పరిజ్ఞాతం భవిష్యతి. 15

ఇత్యుక్త్వా%సౌ జగామా%%శు భార్గవః క్రోధసంయుతః | బృహస్పతిర్ముదం ప్రాప్యతస్థౌతత్రసమాహితః. 16

తతః శప్తా న్గురు ర్జాత్వా దైత్యాం స్తాం న్భార్గవేణ హి | జగామా తరసా త్యక్త్వా స్వరూపం స్వం విధాయ చ. 17

గత్వోవాచ తదా శక్రం కృతం కార్యం మయా ధ్రువమ్‌ | శప్తాః శుక్రేణ తే దైత్యా మయా త్యక్తాః పునః పునః 18

నిరాధారాః కృతా నూనం యతధ్వం సురసత్తమాః | సంగ్రామార్థం మహాభాగ: శాపదగ్ధా మయా కృతాః. 19

ఇతి శ్రుత్వా గురోర్వాక్యం మఘవా ముదమాప్తవాన్‌ | జహృఘశ్చ సురాః సర్వే ప్రతిపూజ్య బృహస్పతిమ్‌. 20

సంగ్రామాయ మతిం చక్రుః సంవిచార్య మిథః పునః | నిర్యయు ర్మిళితాః సర్వే దానవాభిముఖాః సురాః 21

సురా న్సముద్యతాన్‌ జ్ఞాత్వా కృతోద్యోగాన్మమాబలాన్‌ | అంతర్హితం గురుంచైవ బభూవు శ్చింతయా%న్వితాః. 22

అట్లు మూఢదైత్యులు నిజమైన శుక్రుని పలుమారులు నిందించిరి. శుక్రరూపముననున్న గురుని నమస్కరించి యతనిని ప్రేమతో గురునిగ దలచిరి. అతని మాటలే నమ్ముచు తన్మయులై యున్నారని శుక్రుడు కోపాతిరేకమున వారినిట్లు శపించెను: నేనెంతగ చెప్పినను మీరు నా మాట నమ్ముటలేదు. కనుక చైతన్యరహితులై తిరస్కార మొందుదురుగాక! నన్ను నిందించిన దాని ఫలితముగ కొలదికాలములోనే మీరు తగిన ఫలితమనుభవింతురుగాక! ఇతని కపట వర్తనము లానాడుగాని మీకు బోధపడవు' అని యిట్లు శుక్రుడు పలికి కోపముతో నచ్చోటువదలి వెళ్ళెను. అంత బృహస్పతి ముదముతో నచటనే స్థిరచిత్తుడై యుండెను. అట్లు శుక్రుడు దానవులను శపించిన విషయము గురునకు తెలిసెను. ఆతడు వెంటనే యచ్చోటు వదలి నిజరూపము దాల్చి వెడలి ఇంద్రునిజేరి యతనితో నిట్లనియెను: ఓ సురసత్తమా! నేను నా పని నెరవేర్చితిని. శుక్రుడు వారిని శపించెను. నేను వారిని వదలి వచ్చితిని. ఇపుడు దానవులు నిరాశ్రయులు. నావలన శాపదగ్ధులు. కనుక నిపుడు పోరాటమున కాయత్తపడుము అను గురువాక్యము లాకర్ణించి యింద్రుడు ప్రమోదభరితుడయ్యెను. సురలు సంతసిల్లిరి. వారు గురుని పెక్కు రీతుల బూజించిరి. అపుడు దేవతలెల్లరు పరస్పరము మంతనము జరుపుకొనిరి. యుద్ధమే కర్జమని యెల్లరు నిశ్చయించుకొనిరి. వారు మూకుమ్మడిగ దానవులపై బడిరి. అట్లు దేవతలు గొప్ప బలముతో ముందు ప్రయత్నముతో బవరమునకు గడంగుటయును తమ గురువు వెళ్ళిపోవుటయు గని దానవులు చింతాక్రాంతులైరి.

పరస్పర మథోచుస్తే మోహితాస్తస్య మాయయా | సంప్రసాద్యో మహాత్మా చ యాతో%సౌ రుష్టమానసః 23

వంచ యిత్వా గతః పాపో గురుః కపటపండితః | భ్రాతృస్త్రీలంభనః ప్రాయో మలినో%ంతర్బహిః శుచిః. 24

కిం కుర్మః క్వ చ గచ్ఛామః కథం కావ్యం ప్రకోపితం | కుర్వీమహి సహాయార్థం ప్రసన్నం హృష్టమానసమ్‌. 25

ఇతి సంచింత్య సర్వే మిళితా భయకంపితాః | ప్రహ్లాదం పురతః కృత్వా జగ్ము స్తే భార్గవం పునః. 26

ప్రణము శ్చరణౌ తస్య మునే ర్మౌనభృత స్తదా | భార్గవ స్తా నువాచాథ రోషసంరక్తలోచనః. 27

మయా ప్రబోధితా యూయం మోహితా గురుమాయయా | న గృహీతం వచో యోగ్యం తదా యాజ్యాహితంశుచి!

తదా%వగణిత శ్చాహం భవద్భిస్తద్వశం గతైః | ప్రాప్తం నూనం మదోన్మత్తై ర్మమా%వమానజం ఫలమ్‌. 29

తత్ర గచ్ఛత సద్ర్భష్టా యత్రాసౌ కపటాకృతిః | వంచకః | సురకార్యార్థీ నాహం తద్వద్ధి వంచకః. 30

ఏవం బ్రువంతం శుక్రం తు వాక్యం సందిగ్ధయా గిరా | ప్రహ్లాద స్తం తదోవాచగృహీత్వాచరణౌతతః 31

ప్రహ్లాదః: భార్గవా% ద్య సమాయాతాన్యాజ్యానస్మాంస్తథా%%తురాన్‌ |

త్యక్తుం నార్హసి సర్వజ్ఞ! త్వద్ధితాం స్తనయాన్హి నః. 32

గతే త్వయి తు మంత్రార్థం శైలూషేణ దురాత్మనా | త్వద్వేషమధురా%%లాపై ర్వయం తేన ప్రవంచితాః. 33

అజ్ఞాన కృతదోషేణ నైవ కుప్యతి శాంతిమాన్‌ | సర్వజ్ఞస్త్వం విజానాసి చిత్తం నః ప్రవణం త్వయి. 34

వారు తమలో తామిట్లనుకొనిరి: మనము గురుని మాయచే విమోహితులమైతిమి. శుక్రుడు కోపమువచ్చి వెళ్ళిపోయెను. ఇపుడా మహాత్ముని శుక్రుని ప్రసన్నుని జేసికొనుట మన కర్తవ్యము. ఆ గురువు కపటచతురుడు - పాపి - భ్రాతృభార్యాగామి. లోన మలినము బయట నైర్మల్యము గలవాడు. మనమిపుడేమి చేయుదము? ఎచటికేగుదము? శుక్రుడు కోపముతో మండిపడుచున్నాడు. మనకిపుడు సాయ మవసరము. మఱి యతనిని మనమెట్లు ప్రసన్నునిగ జేసికొనగలము? ఇట్లు దైత్యులు తమలో తామాలోచించుకొని భయకంపితులైరి. వారు ప్రహ్లాదుని ముందిడుకొని శుక్రాచార్యుని సన్నిధి కరిగిరి. వారందఱు మౌనముగ నున్న శుక్రుని చరణములకు నొకేసారి నమస్కరించిరి. శుక్రుడు నిప్పులు గురియుచు వారికిట్లు పలికెను. నేనానాడు మీకు హితముగ నెంతయో చెప్పితిని. కాని, మీరు గురుమాయా మోహితులై నాడు నా మాట పెడచెవిని బెట్టితిరి. మూఢాత్ములై నన్ను తూలనాడితిరి. మదోన్మత్తులగు మీరు తత్ఫలితము వెంటనే పొందితిరి. ఈనాడుగూడ మీరు కపటాకృతి - వంచకుడు. సురకార్యార్థియైన మీ గురుని చెంతకే వెళ్లుడు. మీరు భ్రష్టులైపోతిరి. నేనతనివలె వంచకుడనుగాను.' అట్లు శుక్రుడు సందిగ్ధ వాక్యములు పలుకగ ప్రహ్లాదుడ తని పాదములు పట్టుకొని యిట్లు పలికెను:' ఓ భార్గవమునీశ! నీవు సర్వజ్ఞుడవు. మేము నీ యాజ్యులము. నీకు హితకరులము. పుత్రతుల్యులము. భయాతురులమై వచ్చినవారము. అట్టి మమ్ము నీవీ పరిస్థితిలో విడువ తగదు. నీవు మంత్రార్థ మరిగితివి. అపుడా దురాత్ముడు కపట నటునివలె నీ వేష భాషలతో వచ్చి తియ్యగ బలుకరించుచు మమ్ము వంచించెను. తెలియక పొరపడిన వారి దోషములకు శాంతులు కోపింపరు.' నీవు సర్వవిదుడవు. మా చిత్తములు నీయందే లగ్నమైనవని నీవెఱుగుదువు.

జ్ఞాత్వా న స్తపసా భావం త్యజ కోపం మహామతే | బ్రువంతీ మునయః సర్వే క్షణకోపా హి సాధవః. 35

జలం స్వభావతః శీతం వహ్న్యాతపసమాగమాత్‌ | భవత్యుష్ణం వియోగాచ్చ శీశత్వ మనుగచ్ఛతి. 36

క్రోధ శ్చామలరూపోవై త్యక్తవ్యః సర్వథా బుధైః | తస్మాద్రోషం పరిత్యజ్య ప్రసాదం కురు సువ్రత. 37

యది న త్యజసి క్రోధం త్యజస్యస్మాన్సుదుఃఃతాన్‌ | త్వయా త్యక్తా మహాభాగ గమిష్యాయో రసాతలమ్‌. 38

వ్యాసః: ప్రహ్లాదస్య వచః శ్రుత్వా భార్గవో జ్ఞాన చక్షుషా | విలోక్య సుమనా భూత్వాతానువాచ హసన్నివ. 39

న భేతవ్యం న గంతవ్యం దానవా వా రసాతలమ్‌ | రక్షయిష్యామి వో యాజ్యా న్మంత్రైరవితథైః కిల. 40

హితం సత్యం బ్రవీమ్యద్య శృణుధ్వం తత్తు నిశ్చయమ్‌ | వచనం మమ ధర్మజ్ఞాః శ్రుతం యద్ర్బ హ్మణః పురా. 41

అవశ్యం భావినో భావాః ప్రభవంతి శుభా%శుభాః | దైవం న చా%న్యథా కర్తుం క్షమః కో%పి ధరాతలే. 42

అద్య మందబలా యూయం కాలయోగా దసంశయమ్‌ | దేవైర్జితాః సకృచ్చా%పి పాతాళం ప్రతిపత్స్యథ. 43

ప్రాప్తః పర్యాయకాలో వై ఇతి బ్రహ్మా%భ్యభాషత | భుక్తం రాజ్యం భవద్భిశ్చ పూర్ణం సర్వం సమృద్ధిమత్‌. 44

యుగాని దశ పూర్ణాని దేవానాక్రమ్య మూర్ధని | దైవయోగా చ్చ యుష్మాభి ర్భుక్తం త్రైలోక్యమూర్జితమ్‌. 45

సావర్ణికే మనౌ రాజ్యం పున స్తత్తు భవిష్యతి | పౌత్త్ర సై#్త్రలోక్యవిజయీ రాజ్యం ప్రాప్స్యతితేబలిః. 46

నీ తపఃప్రభావ మతీతము. కోపముడుగుము. సాధుసత్తములు క్షణకోపులని మునులందురుగదా! నీరు సహజముగ చల్లగా నుండును. అది నిప్పుతో గలిసిన వేడియగును. వేడిమి తగ్గిన నీరు మరల చల్లబడును. క్రోధము చండాలుని వంటిది. బుధులు దాని నెల్లవిధముల వదలిపెట్టుదురు - కాన నీవు నటులే రోషము విడనాడి మాపట్ల ప్రసన్నుడవు గమ్ము. నీవు కోపము విడువక దుఃఃతులమైన మమ్ము వదలినచో మేము పాతాళమున కేగుదుము అను ప్రహ్లాదుని మాటలు విని శుక్రుడు జ్ఞాననేత్రముతో సర్వము నెఱింగి సుమనస్కుడై చిరునగవుతో వారితో నిట్లనెను: దానవులారా! మీరు భయపడి పాతాళమునకు వెళ్ళవలదు. మీరు నా యాజ్యులు. నా మంత్రబలముచే మిమ్ము రక్షింతును. పూర్వము బ్రహ్మ సత్యము హితకరమునైన యొకమాట చెప్పెను. అది మీకు వినిపింతును వినుడు. ఈ నేలపై మేలుగాని కీడుగాని జరుగవలసినది తప్పక జరిగితీరును. దైవమునకు విరుద్ధముగ నెవ్వడు నేమియు జేయజాలడు. మీరిపుడు కాలయోగమున నిజముగ బలహీనులైతిరి. దేవతలచేత నోటమిచెంది యొకమారు పాతాళ మేగవలయును. కాలము కలిసివచ్చినప్పుడు మీరు సర్వసమృద్ధమైన త్రైలోక్య రాజ్యమనుభవింతురని తొల్లి బ్రహ్మ వచించెను. మీరొకప్పుడు దైవయోగమున దేవతలను తలదన్ని పదియుగముల వఱకు పూర్తిగ త్రైలోక్య సంపద లనుభవించితిరి. సావర్ణిక మన్వంతరమందు మరల సామ్రాజ్యము మీ కైవసమగును. అపుడు ప్రహ్లాదుని మనుమడైన బలి విజయుడై ముల్లోకముల కేలిక గాగలడు.

యదా వామనరూపేణ హృతం దేవేన విష్ణునా | తదైన చ భవత్పౌత్త్రః ప్రోకో దేవేన జిష్ణునా. 47

హృతం యేన బలే రాజ్యం దేవవాంఛార్థ సిద్ధయే | త్వ మింద్రో భవితా చాగ్రే స్థితే సావర్ణికే మనౌ. 48

ఇత్యుక్తో హరిణాపౌత్రా స్తవ ప్రహ్లాద సాంప్రతమ్‌ | అదృశ్యః సర్వభూతానాం గుప్తశ్చరతి భీతవత్‌. 49

ఏకదా వాసవేనాసౌ బలి ర్గర్దభరూపభాక్‌ | శూన్యేగృహే స్థితః కామం భయబీతః శతక్రతోః. 50

పృష్టశ్చ బహుధా తేన వాసవేన బలి స్తదా | కిమర్థం గార్దభం రూపం కృతవాన్దైత్య పుంగవః. 51

భోక్తా త్వం సర్వలోకస్య దైత్యా నాం చ ప్రశాసితా | న లజ్జా ఖరరూపేణ తవ రాక్షస సత్తమ!

తస్య తద్వచనం శ్రుత్వా దైత్యరాజో బలిస్తదా. 52

ప్రోవాచ వచనం శక్రం కో%త్రశోకః శతక్రతో | యథా విష్ణుర్మహాతేజా మత్స్యకచ్ఛపతాంగతః. 53

తథా%హం ఖరరూపేణ సంస్థితః కాలయోగితః | యథా త్వం కమలే లీనః సంస్థితో బ్రహ్మహత్యయా. 54

పండితశ్చ తథా హ్యద్య స్థితో%హం ఖరరూపధృక్‌ | దైవాధీనన్య కిం దుఃఖం కిం సుఖం పాకశాసన. 55

కాలః కరోతి వై నూనం యదిచ్ఛతి యథా తథా | భార్గవః! ఇతి తౌ బలిదేవేశౌ కృత్వా సంవిద ముత్తమామ్‌. 56

ప్రబోధం ప్రాపతుః కామం యథాస్థానం చ జగ్మతుః | ఇత్యేతత్తే సమాఖ్యాతా మయా దైవబలిష్ఠతా. 58

దైవాధీనం జగత్సర్వం సదేవాసురమానుషమ్‌. 58

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే చతుర్దశో%ధ్యాయః.

మున్ను విష్ణువు వామనావతారమున బలి సర్వస్వము హరించెను. అప్పుడు హరి బలితో నేను దేవ వాంచాసిద్ధికి లోకత్రయ సామ్రాజ్య మిపుడు హరించితిని. ఇకముందు సావర్ణిక మన్వంతరమందు నీవే యింద్రుడవగుదువు' అని పలికెను. ఓ ప్రహ్లాదా! ఆనాడు విష్ణువట్లుపలుక నీ పౌత్రు డెల్ల భూతముల కదృశ్యుడై గుప్తముగ భీతునివలె నేడు చరించుచున్నాడు. ఒకప్పుడు బలి యింద్రుని భయమున గర్దభరూపముదాల్చి యొక శూన్యగృహమందు తలదాచుకొనెను. ఒకనాడింద్రుడు బలినిగని ఓ రాక్షస సత్తమా! నీవు సర్వలోక భోక్తవు. దానవ శాస్తవు. అంతటి నీకీ గాడిదరూపు సిగ్గు గల్గించుటలేదా? అన విని దైత్యరాజిట్లనియెను: ఓ శతక్రతూ! ఇందు వింతేమి గలదు? విష్ణువంతటివాడు చేప-తాబేలు మున్నగు రూపులు దాల్చెనుగదా! తొలుత నొకప్పుడు నీవును బ్రహ్మహత్యవలన మానస సరోవమందలి కమలమున లీనమై దాగియుంటివి కదా! అట్లే నేనును కాలవశమున యీ ఖరరూపమున నున్నాను. దైవపరాధీనునకు సుఖమెక్కడికి? దుఃఖమెక్కడికి? అఖండమైన కాలము నిజముగ నెట్లు దలచునో యట్లు జరిగితీరును! ఇట్లు బలి యింద్రుడు తమలో తాము సంభాషించుకొనిరి. వారు పిదప తెలివొంది నిజనివాసముల కరిగిరి. ఈ యుపాఖ్యానము దైవమే బలవత్తరమైనదను విషయము తెలుపుచున్నది. దీనిని మీకు తెలిపితిని. ఈ సురాసుర నరజంతుయుతమగు జగమెల్ల దైవాధీనమే.

ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు దైవమే బలవత్తరమను నుపాఖ్యానముగల చతుర్దశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters