Sri Devi Bhagavatam-1
Chapters
అథ సప్తదశో%ధ్యాయః జనమేజయ ఉవాచ : వారాంగనా స్త్వయా%%ఖ్యాతా నరనారాయణా%%శ్రమే ! ఏవం నారాయణం శాంత కామయానాః స్మరాతురాః
1 శప్తుకామ స్తదాజాతో మునిర్నారాయణశ్చ తాః | నివారితో నరేణా%థ భ్రాత్రా ధర్మవిదా నృప!
2 కిం కృతం మునినా తేన వ్యసనే సముపస్థితే | తాభిః సంకల్పితేనా%ర్థ కామార్థాభిర్భృశం మునే! 3 శ##క్రేణోత్పాదితాభిశ్చ బహు ప్రార్థనయా పునః | యాచితేన వివాహార్థం కింకృతం తేన జిష్ణునా. 4 ఇత్తేత చ్ఛ్రోతుమిచ్ఛామి చరితం తస్య మోక్షదమ్ | నారాయణస్య మే బ్రూహి విస్తరేణ పితామహ. 5 వ్యాసః: శృణు రాజన్ప్రవక్ష్యామి యథా తస్య మహాత్మనః | ధర్మపుత్త్రస్య ధర్మజ్ఞ ! విస్తరేణ పదామి తే. 6 శప్తుకామ స్తు సంహృష్టో నరేణా%థ యదా హరిః | వారితో%సౌ సమాశ్వాస్య ముని ర్నారాయణ స్తదా. 7 శాంతకోప స్తదోవాచ తాస్తపస్వీ మహామునిః | స్మితపూర్వ మిదం వాక్యం మధురం ధర్మనందనః. 8 అస్మిన్ జన్మని చార్వంగ్యః | కృతసంకల్పవానహమ్ | ఆవాభ్యాం చ న కర్తవ్యః సర్వథా దారసంగ్రహః. 9 తస్మాద్గీచ్ఛంతు త్రిదివం కృపాంకృత్యా మమోపరి | ధర్మజ్ఞానప్రకుర్వంతి వ్రతభంగం పరస్యవై. 10 శృంగారే%స్మిన్రసే నూనం స్థాయీ భావో రతిః స్మృతః | కథం కరోమి సంబంధం తదభావే సులోచనాః. 11 కారణన వినాకార్యం న భ##వేదితి నిశ్చయం | కవిభిః కథితం శాస్త్రే స్థాయీభావో రసః కిల. 12 ధన్యః సుచారు సర్వాంగః సభాగ్యో%హం ధరాతలే | ప్రీతిపాత్రం యతో జాతా భవతీనా మకృత్రిమమ్. 13 భవతీభిః కృపాం కృత్వా రక్షణీయం వ్రతం మమ | భవిష్యామి మహాభాగాః పతిరప్యన్య జన్మని. 14 పదుహేడవ అధ్యాయము జనమేజయునకు గల్గిన సందేహములు జనమేజయుడిట్లు వ్యాసుని ప్రశ్నించెను - ఆ దేవకన్యకలు నరనారాయణాశ్రమమున కేతెంచి మన్మథ పరవశ##లైరనియును శాంతుడైన నారాయణుని కామించిరనియు నంటివి. ఆ ధర్మపరాయణు డగు నారాయణుడు వారిని శపింప దలంపగ ధర్మవిదుడగు నరుడు నారాయణుని వారించెను. ఇంద్రునిచేత పంపబడిన దేవకాంతలు అర్థకామముల నర్థించువారై నారాయణుని ప్రార్థింపగ ఆ ధర్మసంకటమున నతడేమి చేసెను? ఆ దేవకన్యలు తమ్ము వివాహము గమ్మని మునిని పెక్కుసార్లు యాచించిరి. తుద కాముని యేమి చేసెను? శ్రీ నారాయణ మహర్షి చరితము మోక్షప్రదము. దానిని వినగోరుదును. సవివరముగ వినిపింపుము అన వ్యాసుడిట్లనెను: రాజా! నారాయణుడు ధర్మపుత్త్రుడు - ధర్మజ్ఞుడు - మహనీయుడు. అతనిని గుఱించి విపులముగ వచింతును - ఆలకింపుము. అట్లు నారాయణుడు దేవకన్యలకు శాపమీయ దలంపగ నరుడతని కడ్డుపడి నివారించెను దాన నారాయణుని కోపము శాంతించెను. ఆ మహా తపస్వియగు ధర్మనందనుడు చిరునగవుతో తీయని పలుకులతో వారి కిట్లనియెను : ఓ వామాక్షులారా! నేనీ జన్మమున తపము చేయదలచితిని. ఇట్టి స్థితిలో మిమ్ము భార్యలుగ చేపట్టుట మా కెంతమాత్రమును తగనిపని. కనుక నాయందు దయయుంచి మీరిపుడు స్వర్గమునకు వెడలుడు. ధర్మజ్ఞు లితరులకు వ్రతభంగ మొనర్పరుగదా! ఓ సులోచనలారా! రసరాజమైన శృంగార రసమునకు స్థాయిభావము రతియగును. అది యిపుడు మాలో లోపించినది. ఇంక మాకు మీతోడి రాగ సంబంధ మెట్లు కుదురును? కారణము లేక కార్యమెన్నడును జరుగదు. కవులు శాస్త్రములందు స్థాయిభావమే రసమని నుడివిరి; మీ సహజమైన యనురాగమునకు పాత్రమనైతిని. కనుక నేనెంతయో ధన్యుడను. భాగ్యవంతుడను. అష్టావింశే విశాలాక్ష్యో! ద్వాపరే%స్మి న్ధరాతలే | దేవానాం కార్యసిద్ధ్యర్థం ప్రభవిష్యామి సర్వథా. 15 తదా భవత్యో మద్దారాః ప్రాప్య జన్మ పృథక్పృథక్ | భూపతీనాం సుతా భూత్వా పత్నీభావం గమిష్యథ. 16 ఇత్యాశ్వాస్య హరి స్తాస్తు ప్రతిశ్రుత్య పరిగ్రహమ్ | వ్యసర్జయత్స భగవాన్ జగ్ముశ్చ విగతజ్వరాః. 17 ఏవం విసర్జితా స్తేన గతాః స్వర్గం తదా%ంగనాః | శక్రాయ కథయామాసుః కారణం సకలం పునః. 18 ఆశ్రుత్య మఘవాం స్తాభ్యో వృత్తాంతం తస్య విస్తరాత్ | తుష్టావ తం మహాత్మానం నారీర్దృష్ట్వా తథోర్వశీః. 19 ఇంద్రః: అహోధైర్యం మునే ! కామం తథైవ చ తపోబలమ్ | యేనోర్వశ్యః స్వతపసా సదృగ్రూపాః ప్రకల్పితాః. 20 ఇతి స్తుత్వా వ్రసన్నాత్మా బభూవ సురరాట్ తతః | నారాయణో%పి ధర్మాత్మా తపస్యభిరతో%భవత్. 21 ఇత్యేత త్సర్వమాఖ్యాతం మునే ర్వృత్తాంత మద్భుతమ్ | నారాయణస్య సకలం నరస్య చ మహామునే! 22 తౌ హి కృష్ణార్జునౌ వీరౌ భూభారహరణాయ చ | జాతౌ తౌ భరతశ్రేష్ఠ! భృగోః శాపవశాదిహ. 23 రాజోవాచ: కృష్ణావతార చరితం విస్తరేణ వదస్వ మే | సందేహో మమ చిత్తే%స్తి తం నివారయ మానద. 24 యయోః పుత్రత్వమాపన్నౌ హర్యనంతౌ మహాబలౌ | దేవకీవసుదేవౌ తౌ దుఃఖభాజౌ కథం మునే! 25 కంసేన నిగడే బద్ధౌ పీడితౌ బహువాసరాన్ | యయోః పుత్రో హరిః సాక్షాత్తపసా తోషితో%భవత్. 26 జాతో%సౌ మథురాయాం తు గోకులే స కథం గతః | కంసం హత్వా ద్వారవత్యాం నివాసం కృతవాన్ కథమ్. 27 ఓ మహాభాగలారా! మీరలు దయచూసి నా వ్రతమును కాపాడుడు. నేను మరొక జన్మమున మీ కెల్లరకు పతిని గాగలను. ఓ విశాలాక్షులారా! నేను రాబోవు నిరువది యెనిమిదవ ద్వాపరమందు దేవకార్యమునకు భూమిపై నవతరింప గలను. అపుడు మీరు వేరు వేరు రాజులకు వేరు వేరుగ కొమరితలై పుట్టి నాకు భార్యలుగాగలరు. అపుడు నేను మిమ్ము తప్పక పరిగ్రహింతును. అని యోదార్చి నారాయణుడు దేవకన్యలను వీడ్కొలిపెను. వారును సంతాప రహితలై వెడలిపోయిరి. అట్లు సురకన్యలు నారాయణుని వీడ్కొని స్వర్గముచేరి వారింద్రునకు జరిగిన దంతయు విన్నవించిరి. ఇంద్రుడా వృత్తాంత మంతయు విస్తరముగ నాలకించి యూర్వశి మున్నగు రమణులను గని నారాయణుని వేనోళ్ళ నిట్టులుగ్గడించెను: ఔరౌర! ఆ ముని ధైర్యమే ధైర్యము. అతని తపోబలమే బలము. అతని తపో మహిమ వలన నూర్వశి మొదలగు సాటిలేని మేటి యందకత్తెలు సృజింపబడిరి. ఇట్లు సంస్తుతించి సురరాజు ప్రసన్నుడయ్యెను. ఇట ధర్మాత్ముడైన నారాయణుడును ధ్యానమున మునింగెను. రాజా! ఈ విధముగ నీ కత్యద్భుతము గొలుపునట్టి నరనారాయణుల చరిత్ర మంతయు వినిపించితిని. అట్లు భృగుమహర్షి శాపమున నరనారాయణులు భూభారహరణమునకై కృష్ణార్జునులుగ నవతరించిరి అనవిని రాజిట్లనియెను: ఓ మునివరేణ్యా! నాకు శ్రీకృష్ణుని యతిలోక చరిత్రము సవిస్తరముగ తేటపఱచి నా మదిలోని సందియము బాపుము. ఆ బలరామ కృష్ణులను పుత్త్రులుగ గన్న దేవకీ వసుదేవులేల వెతల పాలయితిరి. వారి తపమునకు మెచ్చి శ్రీహరి సాక్షాత్తుగ వారికి పుత్త్రుడయ్యెను గదా! ఇంక వారేల యినుప సంకెళ్ళలో బద్ధులై పెక్కుదినములు కంసునిచేత పీడింపబడిరి. మధురలో జన్మించిన శ్రీకృష్ణుడు గొల్లపల్లె కేల యరిగెను? అతడు కంసుని దెగటార్చి ద్వారావతి యందేల వసించెను? పిత్రాది సేవితం దేశ సమృద్ధం పాపనం కిల | త్యక్త్వా దేశాంతరే%నార్యే గతవాన్స కథం హరిః. 28 కులం చ ద్విజశాపేన కథముత్సాదితం హరేః | భారవతరణం కృత్వా వాసుదేవః సనాతనః. 29 దేహం ముమోచ తరసా జగామచదివం హరిః | పాపిష్ఠానాం చ భారేణ వ్యాకులా%భూచ్చ మేదినీ. 30 తేహతావాసుదేవేన పార్థేనామితకర్మణా | లుంఠితాయైర్హరేః పత్న్య స్తే కథం న ని పాతితాః. 31 భీష్మోద్రోణస్తథాకర్ణో బాహ్లీకో%ప్యథ పార్థివః | వైరాటో%థవికర్ణశ్చ దృష్టద్యుమ్నశ్చ పార్థివః. 32 సోమదత్తాదయః సర్వే నిహతాః సమరేనృప | తేషాముత్తారితోభారశ్చౌరాణాం న హృతః కథమ్. 33 కృష్ణపత్న్యః కథం దుఃఖం ప్రాప్త్రాః ప్రాంతేపతివ్రతాః | సందేహో%యం మునిశ్రేష్ఠ చిత్తేమే పరివర్తతే. 34 వాసుదేవస్తు ధర్మాత్మా పుత్రదుఃఖేన తాపితః | త్యక్తవాన్సకథం ప్రాణా నపమృత్యుం జగామ హ. 35 పాండవా ధర్మ సంయుక్తాః కృష్ణే చ నిరతాః సదా | తే కథం దుఃఖభోక్తారో హ్యభవన్ముని సత్తమ. 36 ద్రౌపదీ చ మహాభాగా కథం దుఃఖస్యభాగినీ | వేదీ మధ్యాచ్చ సంజాతా లక్ష్మ్యంశసంభవా కిల. 37 సభాయాం చ సమానీతా రజోదోషసమన్వితా | బాలా దుఃశాసనేనాథ కేశగ్రహణకర్శితా. 38 పీడితా సింధురాజ్ఞా%థ వనమధ్యగతా సతీ | తథైవ కీచకేనాపి పీడితా రుదతీ భృశమ్. 39 పుత్త్రాః పంచైవ తస్యాస్తు నిహత ద్రౌణినా గృహే | సుభద్రాయాః సుతో యుద్ధే బాల ఏవ నిపాతితః. 40 తథా చ దేవకీపుత్త్రాః షట్కంసేన నిషాదితాః | సమర్థేనాపి హరిణా దైవం న కృత మన్యథా. 41 పవిత్రమైన స్వదేశము తల్లిదండ్రుల ప్రేమామృతముతో నిండి స్వర్గమును తలదన్నును. అట్టి జన్మభూమిని విడనాడి కృష్ణుడు నింద్యమైన దేశాంతర మేల యేగెను? ఒక విప్రశాపమునకు గురియై యదువంశ మేల నశించెను? సనాతనుడగు వాసుదేవుడు భూభార మెట్లు పాపెను? హరి తన తనువు చాలించి దివి కేగెను గదా! అపుడు భూదేవి మోయరాని పాపాత్ముల బరువుచేత మరల కలత చెందెను. కొందఱు దుర్మార్గు లమిత బలవీర్యులైన కృష్ణార్జునులచే మడిసిరి. కాని, కృష్ణుని భార్యలను బాధించిన పాపులేల చంపబడలేదు? భీష్మద్రోణులు - కర్ణబాహ్లీకులు - వైరాటి - వికర్ణుడు - ధృష్టద్యుమ్నుడు - సోమదత్తుడు మున్నగు దుష్టు లెల్లరు నాలమున నంతమొందిరి. మఱి కృష్ణుడు చోరులనెల్ల చంపి పుడమి బరువేల దింపలేదు? తుదకు పతివ్రతలైన కృష్ణుని భార్యలును దుఃఖముల పాలైరి. ఇదంతయు చూడగ నా చిత్తమున నేదో సందేహము గలుగుచున్నది. ధర్మాత్ముడగు వసుదేవుడు పుత్త్ర దుఃఖమున పీడితుడై ప్రాణములు పాసి యపమృత్యువు నోట నేల పడెను? పాండవులు ధర్మయుక్తులును కృష్ణసక్తులును గదా! అట్టి వారు సైత మేల శోకము లనుభవించిరి? ద్రౌపది రమాంశ సంజాత - యజ్ఞవేదికాసంభూత - అదృష్టవంతురాలు గదా! ఆమెయు నేల దుఃఖములకు గురి యయ్యెను? ఆమె రజోవతిగా నండుగా దుశ్శాసను డామె నేల బాధించి యవమానించెను? ఆమె యైదుగురు చిన్ని కొమరు లింటనుండగా నశ్వత్థామ వారి నేల మట్టు పెట్టెను? వీరాభిమన్యుడు రణమున నేల నేలగూలెను? కంసుడు దేవకియొక్క యార్గురు కుమారుల నేల పొట్టపెట్టుకొనెను హరి సర్వసమర్థుడు కదా! అతడు విధి నేల మార్చలేకపోయెను? యాదవానాం తథా శాపః ప్రభాసే నిధనం పునః | కులక్షయ స్తథా తీవ్ర స్తత్పత్నీనాం చ లుంఠనమ్. 42 విష్ణునా చేశ్వరేణాపి సాక్షాన్నారాయణన చ | ఉగ్రసేనస్య సేవావై దాసవత్సతతం కృతా. 43 సందేహో%యం మహాభాగ! తత్ర నారాయణ మునౌ | సర్వజంతు సమానత్వం వ్యవహారే నిరంతరమ్. 44 హర్షశోకాదయో భావా! సర్వేషాం సదృశాః కథమ్ | ఈశ్వరస్య హరే ర్జాతా కథమప్యన్యథా గతిః. 45 తస్మా ద్విస్తరతో బ్రూహి కృష్ణస్య చరితం మహత్ | అలౌకికేన హరిణా కృతం కర్మ మహీతలే. 46 హతా ఆయుఃక్షయే దైత్యాః క్లేశేన మహతా పునః | క్వైశ్వర్యశక్తిః ప్రథితా హరిణా మునిపసత్తమ ! 47 రుక్మిణీహరణ సూనం గృహీత్వా%థ పలాయనమ్ | కృతం హి వాసుదేవేన చౌరవచ్చరితం తదా. 48 మథురామండలం త్యక్త్వా సమృద్ధం కులసమ్మతమ్ | జరాసంధభయోత్తేన ద్వారకాగమనం కృతమ్. 49 తదా కేనా2పి న జ్ఞాతో భగవాన్హరి రీశ్వరః | కించిత్ప్రబ్రూహి మే బ్రహ్మ న్కారణం వ్రజగోపనమ్. 50 ఏతే చాన్యే చ బహవః సందేహ వాసవీసుత | నాశయా%ద్య మహాభాగ! సర్వజ్ఞో%సి ద్విజోత్తమ | 51 గోప్య స్తథైకః సందేహో హృదయా న్ననివర్తతే | పాంచాల్యాః పంచభర్తృత్వం లోకే కిం న జుగుప్సితమ్. 52 సదాచారం ప్రమాణం హి ప్రవదంతి మనీషిణః | పశుధర్మః కథం తైస్తు సమర్థైరపి సంశ్రితః. 53 భీష్మేణాపి కృతం కిం వా దేవరూపేణ భూతలే | గోలకౌ తు సముత్పాద్య యత్తు వంశస్య రక్షణమ్. 54 ధిగ్ధర్మ నిర్ణయః కామం మునిభిః పరిదర్శితః | యేన కేనాప్యుపాయేన పుత్త్రోత్పాదన లక్షణః. 55 ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ చతుర్థ స్కంధే సప్తదశో%ధ్యాయః. యాదవులకున్న శాపములు - ప్రభాస తీర్థమున వారి దుర్మరణము - యదుకుల క్షయము - వారి భార్యలను కొల్లగొట్టుట - సాక్షాత్తుగ విష్ణువే యుగ్రసేనునకు దాసునివలె సేవ లొనర్చుట మున్నగు వింతలెల్ల యేల సంభవించకెను? ఇవన్నియును చూడగా శ్రీమన్నారాయణుడు సైతము సామాన్య ప్రాణుల పగిది వ్యవహరించెనను నభిప్రాయము నాకు గలుగుచున్నది. హరికిని సామాన్యులకు గలుగునట్లు హర్షకోశము లేల గలిగెను? ఈశ్వరుడైన శ్రీహరి సాధారణ మానవునివలె నేల ప్రవర్తించెను? లోకాతీతుడైన శ్రీకృష్ణుని మహామహిమలు నతని కర్మ విశేషములు నీ లోకమందెట్లు జరిగెను? నాకు వివరింపుము. మునిసత్తమా! ఆయువు మూడిన పిదప దానవు లెల్ల రెట్లును చత్తురు. కాని, యంత మహాశక్తిగల హరియును వారిని చంపుట కేల బాధపడెను? శ్రీ కృష్ణుడు రుక్మిణీహరణమున నామెను గొని పరుగెత్తెను గదా! ఇందు వాసుదేవుడొక్క దొంగవలె నేల ప్రవర్తించెను? లీలామానుష విగ్రహుడైన కృష్ణుడు జరాసంధునకు జంకి సకల సంపన్నమైన మథురానగరము వదలి ద్వారకేల యరిగెను? ఈ పనులన్నిట వలన కృష్ణుడు భగవానుడును ఈశ్వరుడునని యతని నెవరు నమ్ముదురు. అతడు గొల్లపల్లెలో నేల దాగెనో కొంచెము చెప్పుము. నా కిట్టి సందియములు పెక్కులు గల్గుచున్నవి. వాని నన్నిటిని నీవే తొలగింపవలయును. నాలో మరొక్క సందేహము చోటు చేసికొని నన్ను పీడించుచున్నది. అదేమన, పాంచాలి కైదుగురు భర్తలగుట లోకనింద్యము గదా! ధర్మమునకు సదాచారము ప్రమాణమని మనీషులు పేర్కొందురు గద! మఱి వారు సమర్థులయ్యు పశుధర్మము నెందుల కవలంబించిరి? భీష్ముడు దేవరూపుడు గదా! అతడు మాత్రమేమి చేయగల్గెను? అతడు గోళకులను సృజింపజేసి వంశమును గాపాడెను గదా! ఏ విధముగ నైనను సరే - పుత్త్రుని బడసి తీరవలయుననెడు మునుల ధర్మ నిర్ణయ మర్థము లేనిది గదా! ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి చతుర్థ స్కంధమందు జనమేజయునకు గల్గిన సందేహములను సప్తదశాధ్యాయము.