Sri Devi Bhagavatam-1    Chapters   

శ్రీమద్దేవీ భాగవతమ్‌

అథపంచమఃస్కంధః

అథ ప్రథమో%ధ్యాయః

ఋషయ ఊచుః: భవతా కథితం సూత! మహదాఖ్యానముత్తమమ్‌ | కృష్ణస్య చరితందివ్యం సర్వపాతకనాశనమ్‌. 1

సందేహో%త్ర మహాభాగ! వాసుదేవకథానకే | జాయతే నః ప్రోచ్యమానే%విస్తరేణ మహామతే. 2

వనే గత్వా తప స్తప్తం వాసుదేవేన దుష్కరమ్‌ | విష్ణో రంశావతారేణ శివస్యా%%రాధనం కృతమ్‌. 3

వరప్రదానం దేవ్యా చ పార్వత్యా యత్కృతం పునః | జగన్మాతు శ్చ పూర్ణాయాః శ్రీదేవ్యాఅంశభూతయా. 4

ఈశ్వరేణాపి కృష్ణేన కుతస్తౌ సంప్రపూజితౌ | న్యూనతా వా కిమస్త్యస్య తదేవం సంశయో మమ. 5

సూతః: శృణుధ్వం కారణం తత్రమయా వ్యాసశ్రుతంచతత్‌ | ప్రబ్రవీమి మహాభాగాః ! కథాం కృష్ణగుణాన్వితామ్‌. 6

వృత్తాంతం వ్యాసతః శ్రుత్వా వైరాటీసుతజ స్తదా | పునః ప ప్రచ్ఛ మేధావీ సందేహం పరమం గతః. 7

జనమేజయః: సమ్యక్సత్యవతీసూనో శ్రుతం పరమకారణం | తథా పి మనసోవృత్తిః సంశయం న విముచంతి. 8

కృష్ణేనారాధితః శంభు స్తప స్తప్త్వా%తి దారుణమ్‌ | విస్మయో%యం మహాభాగ! దేవదేవేన విష్ణునా. 9

యః సర్వాత్మా%పి సర్వేశః సర్వసిద్ధిప్రదః ప్రభుః | స కథం కృతవా నోరం తపః ప్రాకృతవద్ధరిః. 10

జగత్కర్తుం క్షమః కృష్ణ స్తథా పాలయితుం క్షమః | సంహర్తు మపి కస్మాత్స దారుణం తప ఆచరత్‌. 11

వ్యాసః: సత్య ముక్తం త్వయా రాజ న్వాసుదేవో జనార్దనః | క్షమః సర్వేషు కార్యేషు దేవానాం దైత్యసూదనః. 12

తథా%పి మానుషం దేహమాశ్రితః పరమేశ్వరః | కృతవాన్మానుషాన్‌ భావాన్‌ వర్ణాశ్రమసమన్వితాన్‌. 13

పంచమ స్కంధము - మొదటి అధ్యాయము

యోగమాయా ప్రభావము

ఋషు లిట్లనిరి : 'ఓ సూత మహర్షీ! శ్రీకృష్ణ పరమాత్ముని చరితార్థమైన చరిత్రము దివ్యము. సర్వపాపహరము. అట్టి మహాఖ్యానమును మాకు వినిపించితివి. వాసుదేవుని కథను సంక్షేపముగ చెప్పుటవలన దానినిగూర్చి మాలో పెక్కు సందేహములు గలుగుచున్నవి. వాసుదేవుడు శ్రీవిష్ణు నంశావతారము గదా! అతడును పరమశివు నారాధించి తన మాచరించెను. పార్వతి-పరాప్రకృతి-జగన్మాత-యగు శ్రీదేవీయొక్క యంశావతారమగు పార్వతియును కృష్ణునకు పెక్కు వరము లొసగెను. శ్రీకృష్ణు డీశ్వరుడు గదా! అతడు వారి నేల పూజించెను? దీనిచే కృష్ణుడు పార్వతీపరమేశ్వరుల కంటె నల్పుడను శంక మాకు గల్గుచున్నది.' అన విని సూతు డిట్లనెను : మహాశయులారా! మీ రడిగిన ప్రశ్నకు సమాధానమగు కారణమును నేను వ్యాసునివలన వింటిని. మహోజ్జ్వలము గుణభరితము నగు శ్రీకృష్ణుని గాథ వినిపింతును. శ్రద్ధగ వినుడు. మీకు గల్గిన సందేహము మేధావియగు జనమేజయునకును గల్గెను. అతడు వ్యాసు నిట్లు ప్రశ్నించెను: సత్యవతీ తనయా! నీ వలన శ్రీదేవీ తత్త్వమహత్త్వ మెంత వినినను నా మది సందియము వదలుట లేదు. దేవదేవుడు విష్ణువు నగు కృష్ణుడు శంభు నారాధించెననుట నాకు వింత గలిగించుచున్నది. సర్వభూతాత్మకుడు సర్వసిద్ధిప్రదుడు సర్వేశ్వరుడు నైన శ్రీహరి సామాన్య మానవునివలె దారుణ తప మేల యొనరించెను? శ్రీకృష్ణు డీ జగములను రచించి పెంచి సంహరింప నమర్థుడు. అంతటి వానికి కఠిన తప మేల చేయవలసివచ్చెను? అన వ్యాసుడిట్లనియెను: రాజా! నిజము పలికితివి. వాసుదేవుడు సర్వకార్యదక్షుడు - దానవాంతకుడు - జనార్దనుడు - నిజమే. ఐనను మానవుడగుట వలన నా పరమేశ్వరుడును వర్ణాశ్రమ ధర్మసమ్మతమైన మానవ భావములు గలిగియుండెను.

వృద్ధానాం పూజనం చైవ గురుపాదాభివందనమ్‌ | బ్రాహ్మణానాం తథాసేవా దేవతారాధనం తథా. 14

శోకే శోకాభియోగశ్చ హర్షే హర్షసమున్నతిః | దైన్యం నానాపవాదాశ్చ స్త్రీషు కామోపసేవనమ్‌: 15

కామః క్రోధ స్తథా లోభః కాలేకాలే భవంతి హి | తథా గుణమయే దేహే నిర్గుణత్వం కథం భ##వేత్‌. 16

సౌబలీశాపజా ద్దోషా త్తథా బ్రాహ్మణశాపజాత్‌ | నిధనం యదవానాం తు కృష్ణ దేహస్య మోచనమ్‌. 17

హరణం లుంఠనం తద్వత్త త్పత్నీనాం నరాధిప | అర్జునస్యాస్త్ర మోక్షేచ క్లీబత్వం తస్కరేషు చ. 18

అజ్ఞత్వం హరణం గేహా త్తత్ర్పద్యు మ్నానిరుద్ధయోః | ఏవం మానుషదేహే%స్మి న్మానుషం ఖలు చేష్టితమ్‌. 19

విష్ణో రంశావతారే% న్నారాయణ మునే స్తథా | అంశజే వాసుదేవే %త కిం చిత్రం శివసేవనే. 20

సహి సర్వేశ్వరో దేవో విష్ణో రపి చ కారణమ్‌ | సుషుప్త స్థాననాథః స విష్ణునా చ ప్రపూజితః. 20

తదంశభూతాః కృష్ణాద్యా సై#్తః కథం న స పూజ్యతే |

అకారో భగవా న్బ్రహ్మా% ప్యు కారః స్యాద్ధరిః స్వయమ్‌ 22

మకారో భగవా న్రుద్రో%ప్యర్ధమాత్రా మహేశ్వరీ | ఉత్తరో త్తరభావేనా వ్యత్తమత్వం స్మృతం బుధైః. 23

అతః సర్వేషు శాస్త్రేషు దేవీ సర్వోత్తమా స్మృతా | అర్ధమాత్రా స్థితా నిత్యా యా%నుచ్చార్యా విశేషతః. 24

విష్ణో రప్యధికో రుద్రో విష్ణు స్తు బ్రహ్మణో%ధికంః | తస్మా న్న సంశయః కార్యః కృష్ణేన శివపూజనే. 25

ఇచ్ఛయా బ్రహ్మక్ష వక్త్రాద్వర దానార్జ ముద్బభౌ | మూలరుద్ర స్యాంశభూతా రుద్రనామా ద్వితీయకః. 26

సో%పి సర్వేషాం మూల రుద్రస్య కా కథా |

దేవీ తత్త్వస్యసాన్నిధ్యా దుత్తమత్వం స్మృతం శివే. 27

గురు పాదాభివందనము-వృద్ధసేవ-విప్రపూజ-దేవతారాధనము-ఇతరుల హర్షశోకములకు హర్షశోకములకు హర్షశోకము లొందుట-దైన్యము-అపరాదము-యువతులతోడి రతిక్రీడలు-కామక్రోధలోభ గుణములు అనునవి ప్రతి దేహికి ప్రతికాలమున ప్రతిచోట గలుగుచుండును. ఇక నిర్గుణత్వ మెట్లు గలుగును? గాంధారీ శాప విప్రశాపములు కారణముగ యాదవుల చావు - కృష్ణుడు తనువు చాలించుట - దోపిడిగాండ్రు వారివారి భార్యల నపహరించి దోచుకొనుట - అర్జునుడు బాణములు వదలుట - అతడు నిర్వీర్యత జెందుట - ద్వారకనుండి ప్రద్యుమ్నానిరుద్ధు లపహరింపబడినను తెలియకపోవుట మున్నగు పనులన్నియును నరులకు గలుగు సామాన్య వ్యవహారములే కదా! శ్రీవిష్ణు నంశమువలన నారాయణ మహర్షి - యతని యంశమువలన వాసుదేవుడు నుద్భవించిరి. అట్లు పుట్టినవాడు శివుని సేవించుటలో వింత యేమున్నది? సర్వేశ్వరుడగు శివుడు సుషుప్తి స్థానమున కధిష్ఠాత. కనుక శివుడు విష్ణునకు కారణభూతుడై యతనిచేత పూజ లందుకొనెను. రాముడు కృష్ణుడు మొదలుగాగల యవతారములు విష్ణుని యంశములు. మఱి వారు శివు నేల పూజించరాదు? అకారము బ్రహ్మ. ఉకారము విష్ణువు. మకారము రుద్రుడు. మహేశ్వరి అర్ధమాత్ర. కనుక నుత్తరోత్తరముగ నొకరి కన్న నొక రుత్తమోత్తములని బుధోత్తము లందురు. అర్ధమాత్ర యెవరి చేతను నుచ్చరింప బడదు. కాన నిత్యమైనది. కావున సర్వ శాస్త్రములందు శ్రీదేవి సర్వోత్తమురాలైనది. బ్రహ్మకంలె విష్ణువు విష్ణునికంటె రుద్రుడు నధికుడు. కనుక కృష్ణుడు శివుని పూజించుటలో నెట్టి సంశయమును పెట్టుకొనరాదు. బ్రహ్మ ముఖమునుండి సదాశివుని కోరికపై రుద్రాంశమున మరొక రుద్రు డావిర్భవించి వరము లొసగును. ఆత్మ స్వరూపిణి యగు దేవి సాన్నిధ్యపు ప్రభావమున రెండవ రుద్రునకు శ్రేష్ఠత్వము పూజ్యత్వము లభించినవి. ఇంక మూలరుద్రునడుగు వారెవరు?

అవతారా హరే రేవం ప్రభవంతి యుగే యుగే | యోగమాయాప్రభావేన నాత్రా కార్యా విచారణా. 28

యానేత్ర పక్ష్మపరిసంచలనేన సమ్య గ్విశ్వంసృజత్యవతి హంతి నిగూఢ భావా |

సైషా కరోతి సతతం ద్రుహిణా చ్యుతేశా | న్నానావతారకలనే పరిభూయమానాన్‌. 29

సూతీగృహాద్ర్వ జనమప్యనయా నియుక్తం | సంగోపితశ్చ భవనే పశుపాలరాజ్ఞః |

సంప్రాపితశ్చ మథురాం వినియోజితశ్చ | శ్రీద్వారకాప్రణయనే నను భీత చిత్తం. 30

నిర్మాయ షోడశ సహస్రశతార్ధకా స్తా నార్యో%ష్ట సమ్మతతరాః స్వకలాసముత్థాః |

తాసాం విలాసవశగం తు విధాయ కామం దాసీకృతో హి భగవా ననయా%ప్య నంతః 31

ఏకా%పి బంధనవిధౌ యువతీ సమర్థా పుంసో యథా సుదృఢలోహమయం తు దామ |

కిం నామ షోడశసహస్రశతార్ధకా శ్చ తం స్వీకృతం శుకమివా%తి నిబంధయంతి. 32

సాత్రాజితీ వశగతేన ముదా%న్వితేన ప్రాప్తం సురేంద్రభవనం హరిణా తదానీమ్‌ |

కృత్వా మృధం మఘవతా విహృతస్తరూణా మీశః ప్రియాసదనభూషణతాం య ఆప. 33

యో భీష్మజాం హి హృతవాన్‌ శిశుపాలకాదీన్‌ జిత్వా విధిం నిఃల ధర్మకృతో విధిత్సుః |

జగ్రాహ తాం నిజబలేన చ ధర్మపత్నీం కో%సౌ విధిః పరకళత్రహృతౌ విజాతః. 34

అహంకారవశః ప్రాణీ కరోతి చ శుభాశుభమ్‌ | విమూఢో మోహజాలేన తత్కృతేనా%తి పాతినా. 35

అహంకారాద్ధి సంజాత మిదం స్థావరజంగమమ్‌ | మూలాద్ధరిహరాదీనా ముగ్రా త్ప్రకృతిసంభవాత్‌. 36

అహంకారపరిత్యక్తో యదా భవతి పద్మజః | తదా విముక్తో భవతి నో చే త్సంసారకర్మకృత్‌. 37

తన్ముక్తస్తు విముక్తో హి బద్ధ స్త ద్వశతాంగతః | న నారీ న ధనం గేహం న పుత్రా న సహోదరాః. 38

బంధనం ప్రాణినాం రాజ న్నహంకార స్తు బంధకః | అహం కర్తా మయాచేదం కృతం కార్యం బలీయసా. 39

కరిష్యామి కరోమ్యేవం స్వయం బధ్నాతి ప్రాణభృత్‌ | కారణన వినా కార్యం న సంభవతి కర్హిచిత్‌. 40

యథా న దృశ్యతే జాతో మృత్పిండేన వినా ఘటః | విష్ణుః పాలయితా విశ్వస్యాహంకారసమన్విత. 41

ఇట్టి యోగమాయా ప్రభావ విశేషమున యుగయుగమున విష్ణు నవతారములు గలుగు చుండును. ఇందు సందియము లేనేలేదు. ఆ విశ్వజనని తాను కనురెప్ప తెరచినంత మాత్రమున ప్రచ్ఛన్న రూపమున నీ బ్రహ్మాండములనెల్ల సృజించి పెంచి సమయింప గలదు. ఆ తల్లియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే పెక్కులవతారములు దాల్పజేసి వారికి శ్రమ గలిగించును. ఆ దేవి కృష్ణుని పురిటింటినుండి గొల్లపల్లెలో నందగోపాలు నింటనుంచునట్లు చేసినది. ఆ తల్లి యతనిని కంసవధకొఱకు ద్వారక కంపినది. కృష్ణునకు జరాసంధుని భీతి గలుగగా నతనిని ద్వారక కంపినది. జగన్మాతయగు దేవి స్వకళాంశజలగు నెనమండుగురు రమణులకు పదారువేల ఏబదిమంది యువతులను సృజియించి వారియందఱియందు కృష్ణుడు విలాస వంతుడై దక్షుడై యుండునట్లు నతడు తనకు దాసుడుగ నుండునట్లును కల్పించెను. ఒక్క యువతి తన యినుప సంకెళ్ల వంటిమాయలతో పురుషుని బంధించి వేయును. ఇంక పదారువేల ఏబదిమంది కామినులు హరిని పెంపుడు చిలుక పగిదిబంధించి రనుటలో నచ్చెరు వేమున్నది? కృష్ణుడు సత్యభామకు సమ్మదమున లోబడెను. అతడు స్వర్గమేగి యింద్రునితో బోరి సంతాన తరువు గొనితెచ్చి తన ప్రియురాలి యింటి కలంకారముగ నందగింప జేసెను. కృష్ణుడు నిఃల ధర్మ సంస్థాపన పరుడు. అతడు శిశుపాలాదులను జయించి భీష్మకసుతయగు రుక్మిణిని తన వీర్యబలమున గైకొని తన ధర్మపత్నిగ జేసికొనెను. ఇంక పరదారాపహరణమునగల్గు పాపమెక్కడ నున్నది? దురహంకారము నరుని పతితుని జేయును. అట్టి యహంకార జాలమున జిక్కి మూఢుడు శుభా శుభము లొనర్చుచుండును. మూల సహజ ప్రకృతినుండి హరి హర హిరణ్యగర్భు లుద్భవించిరి. తామసాహంకారము నుండి చరాచరజగ ముప్పతిల్లెను. బ్రహ్మ తన యహంకారమును విడనాడిన ముక్తుడగును. అతడహంకారమయుడైనపుడు విశ్వరచన వెలయించును. అటులే జీవు డహంకారము విడిచిన ముక్తుడగును. అహంకారవశుడైన బద్ధుడగును. ధనము గృహము భార్య పుత్రులు సోదరులు - వీరు ప్రాణులకు బంధన కారకులు గారు. ప్రాణి కహంకారమే బంధనకారణము - దురహంకారము మూలమున నేను కర్తను, ఈ పని నా బలమున సాధ్యమైనది, నేను చేతును చేయగలనని ప్రాణి స్వయముగ నహంకృతిచే బద్ధుడగును. కారణములేక కార్యమెన్నడును జరుగదుగదా! మట్టిలేనిచో ఘటములేదు. కనుక నహంకారముతోగూడి హరి విశ్వపాలన జరుపును.

అన్యథా సర్వదా చింతాం బుధౌమగ్నః కథం భ##వేత్‌ | అహంకారవిముక్త స్తు యదా భవతి మానవః. 42

అహంకారప్రవాహేషు కథం మజ్జే చ్ఛుభాశయః | మోహమూల మహంకారః సంసార స్తత్సముద్భవః. 43

అహంకారవిహీనానాం నమోహో న చ సంసృతిః | త్రివిధః పురుషః ప్రోక్తః సాత్త్వికో రాజస స్తథా. 44

తామసస్తు మహారాజ బ్రహ్మ విష్ణు శివా దిషు | త్రివిధ స్త్రిషు రాజేంద్ర | కాజేశా దిషు సర్వదా. 45

అహంకారః సదా ప్రోక్తో మునిభి స్తత్త్వ దర్శిభిః | అహంకారేణ తేనైవ బద్ధా ఏ తే న సంశయః. 46

మాయా విమోహితా మందాః ప్రవదంతి మనీషిణిః | కరోతిస్వేచ్ఛయా విష్ణు రవతారా ననేకశః. 47

మందో%పి దుఃఖ గహనే గర్భవాసే%తిసం కటే | న కరోతి మతిం విద్వాన్కథం కుర్యాత్స చక్రభృత్‌. 48

కౌసల్యా దేవకీ గర్భే విష్ఠామల సమాకులే | స్వేచ్ఛయా ప్రవదంత్యద్ధా గతోహి మధుసూదనః. 49

వైకుంఠ సదనం త్వక్త్వా గర్భవాసే సుఖం ను కిమ్‌ | చింతాకోటి సముత్థానే దుఃఖదే విషసమ్మితే. 50

తప స్తప్త్వా క్రమాన్కృత్వా దత్వా దానాన్యనేకశః | న వాంఛంతి యతో లోకా గర్భవాసం సుదుఃఖదమ్‌. 51

స కథం భగవా న్విష్ణుః స్వవశ##శ్చే జ్జనార్దనః | గర్భవాసరుచి ర్భూయా ద్భవేత్స్వవశతా యది. 52

జానీహి త్వం మహారాజా! యోగమాయావశే జగత్‌ | బ్రహ్మాదిస్తంబ పర్యంతం దేవమానుషతిర్యగమ్‌. 53

మాయా తంత్రీ నిబద్ధాయే బ్రహ్మ విష్ణు హరాదయః | భ్రమంతి బంధమాయాంతి లీలయా చోర్ణనాభవత్‌. 54

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమస్కంధే ప్రథమో%ధ్యాయః

నరుడహంకార బద్ధుడై పలువంతలకు గురియగును. అట్టి యహంకారమును విడువగల్గిన వాడు దేనికిని చింతింపడు. అహంకారము నుండి మోహము - దాని నుండి సంసారము - గలుగుచుండును. అట్లుగానిచో సదాశయుడగు హరి యవతార ప్రవాహములలో నేల మునుగును? కనుక నహంకారము లేనివారికి మోహములేదు. సంసారములేదు. పురుషుడు సత్వరజస్తమో గుణములనుబట్టి ముత్తెఱంగులుగ నుండును. ఈ త్రిగుణములును బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులను త్రిమూర్తులయందును గలపు. ఈ యహంకార నిజరూపమును గూర్చి తత్త్వవిదులైన మునులు చెప్పగలరు. త్రిమూర్తులు మువ్వురు నిస్సంశయముగ నహంకారబద్ధులే. విష్ణువు స్వేచ్ఛగ పెక్కవతారము లెత్తునని మాయామోహితుడైన మందుడనును. జడుడు సైతము దుఃఖములకు నెలవగు గర్భవాసము కోరుకొనడు. ఇంక నన్నియు తెలిసిన చక్రి గర్భవాసమేల కోరుకొనును? మధుసూదనుడు - దేవకీ కౌసల్యల మలమూత్ర దూషితములగు గర్భములందు తన యిచ్ఛానుసారము చేరెనని కొందఱందరు. అల వైకుంఠ నివాస సౌఖ్యము త్రోసిరాజని పెక్కు చింతలకు వంతలకు సంతయై విషయమువంటి గర్భవాసమును హరి యే సుఖమాశించి కోరుకొనును? లోకులు దుఃఖ భూయిష్ఠమగు గర్భవాస నరకమును మరల బడయకుండుటకు యజ్ఞ దాన తపము లాచిరంతురు. భగవంతుడైన విష్ణువును స్వతంత్రుడుగాడు. జనార్దనుడు స్వతంత్రుడైనచో గర్భవాస మేల వాంఛించును? ఈ బ్రహ్మాది స్తంబ పర్యంతమగు జగము దేవ - నరతిర్యక్కులతో నిండినది. ఇట్టి జగము యోగమాయకు వశ##మై యుండునని యెఱుంగుము. కావుననే హరిహర బ్రహ్మాదులా మాయాతంత్రములచే బద్ధులై సాలెపురుగులవలె లీలగ క్రీడించు చుందురు.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు యోగమాయా ప్రభావమను ప్రథమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters