Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వితీయో%ధ్యాయః రాజోవాచ :- యోగేశ్వర్యాః ప్రభావో%యం కథితశ్చాతి విస్తరాత్ |
బ్రూహి తచ్చరితం స్వామిన్ | శ్రోతుం కౌతుహలం మమ.
1 మహాదేవీ ప్రభావం వై శ్రోతుం కో నాభివాంఛతి | యో జానాతి జగత్సర్వం తదుత్పన్నం చరాచరమ్ వ్యాస ఉవాచ : శృణు రాజన్ర్పవక్ష్యామి విస్తరేణ మహామతే.
2 శ్రద్ధధానాయ శాంతాయ న బ్రూయాత్సతు మందధీః.
3 పురా యుద్ధ బభూ ద్గోరం దేవదానవసేనయోః | పృథివ్యాం పృథివీపాల మహిషాఖ్యే మహీపతౌ.
4 మహిషో నామ రాజేంద్ర ! చకార తప ఉత్తమమ్ | గత్వా హేమగిరౌ చోగ్రం దేవవిస్మయ కారకమ్.
5 వర్షాణామయుతం పూర్ణం చింతయన్ హృది దేవతామ్ | తస్య తుష్టో మహారాజ బ్రహ్మా లోకపితామహః.
6 తత్రా గత్యాబ్రవీ ద్వాక్యం హంసారూఢ శ్చతుర్ముఖః | వరం వరయ ధర్మాత్మ న్దదామి తవ వాంఛితమ్.
7 మహిషః : అమరత్వం దేవదేవ వాంఛామి ద్రుహిణప్రభో | యథా మృత్యుభయం న స్యాత్తథా కురు పితామహ!
8 బ్రహ్మోవాచ : ఉత్పన్నస్య ధ్రువోమృత్యుద్ధ్రువం జన్మ మృతస్య చ సర్వథా మరణోత్పత్తీ సర్వేషాం ప్రాణినాం కిల.
9 నాశః కాలేన సర్వేషాం ప్రాణినాం దైత్యపుంగవ | మహామహీధరాణాం చ సముద్రాణాం చ సర్వథా.
10 ఏకం స్థానం పరిత్యజ్య మరణస్య మహీపతే | ప్రబ్రూహి తం వరం సాధో యస్తే మనసి వర్తతే.
11 మహిషః : నదేవాన్మానుషాద్ధేత్యాన్మరణం మేపితామహ ! పురుషా న్న చ మే మృత్యు ర్యోషామాం కా హనిష్యతి. 12 తస్మా న్మే మరణం నూనం కామిన్యాః కురు పద్మజ | అబలా హంత మాం హంతుం కథం శక్తా భవిష్యతి. 13 రెండవ అధ్యాయము మహిషాసురుని జన్మవృత్తాంతము జనమేజయు డిట్లనియెను : ''మహామాయా యేగేశ్వరీ ప్రభావము విపులముగ వచించితివి. ఆ తల్లి యమృతచరిత్రము నాకింకను విన కౌతుహలము గల్గుచున్నది. దయతో వివరింపుము. విశ్వమాతయగు మహాశక్తి విజృంభణముచే నీ చరాచరజగము సృజియింపబడినదని యెఱింగినవాడు దేవీ ప్రభావము వినుట కేల యిచ్చగింపడు? అన వ్యాసుడిట్లనెను : రాజా! భక్తి శ్రద్ధలు - శాంతిగలవానికి తెలిసినవాడు తనకు తెలిసినది చెప్పవలయును. అట్లు చెప్పనివాడు మందమతి గలవాడగును. కాన తేటతెల్లముగ చెప్పుదును. నిశ్చలముగ వినుము. పూర్వమీ భూతలమున మహిషాసురుడను రాజుండెను. అతని కాలమున దేవాసురులకు ఘోర యుద్ధము సంఘటిల్లెను. ఆ దానవుడు తన కోర్కి యీడేరుటకు మేరుగిరిపై తీవ్ర తపమొనర్చెను. దానికి వేలుపు లబ్బురపడిరి. ఇట్లతడు నెమ్మదితో పదివేలేండ్లు దేవతను ధ్యానించెను. అంత లోక పితామహుడగు బ్రహ్మ సంతుష్టుడయ్యెను. నలువ రాయంచనెక్కి వచ్చి యో ధర్మాత్మా ! నీ వాంఛిత మీడెర్తును. వరమడుగు'మనెను. మహిషుడిట్లనెను : ''దేవదేవా! పితామహా! నే నమరత్వము గోరుచున్నాను. కాన నాకు చావుభయము గలుగనట్టు లొనరింపుము? బ్రహ్మయిట్టనెను : పుట్టిన వానికి చావు - చచ్చినవానికి పుట్టుక నిశ్చయము. ఇవి యెల్ల జీవులకు ధ్రువముగ నెల్ల భంగుల జరుగుచుండును. దానవపుంగవా ! ఈ పర్వతములు - సాగరములు - ప్రాణులు - సర్వము కాలము వచ్చినపుడు పోవలసినదే ! కనుక అమరత్వము దక్క మరొక్కటేదైన నీ మనసులోనిది కోరుకొనుము అన మహిషు డిట్లనెను. పితామహా ! నాకు దేవ దానవ నరుల వలన చావు గలుగకుండుత! ఆడుది నన్నేమి చేయగలదులే! కనుక పద్మజా! నాకు స్త్రీ వలన చావుమూడిన మూడనిమ్ము. ఒక యబల నన్నేమి చంపగలదు? బ్రహ్మోవాచ : యదాకదా%పి దైత్యేంద్ర నార్యాస్తేమరణం ధ్రువమ్ | న నరేభ్యో మహాభాగ! మృతిస్తే మహిషాసుర. 14 వ్యాసః: ఏవం దత్వా వరం తసై#్మయ¸° బ్రహ్మనిజాలయమ్ | సో%పిదైత్యవరః ప్రాపనిజం స్థానం ముదా%న్వితః. 15 రాజోవాచ: మహిషః కస్యపుత్రో%సౌకథం జాతోమహాబలీ | కథం చ మహిషం రూపం ప్రాప్తం తేన మహాత్మనా. 16 వ్యాసః : దనోః పుత్రౌ మహారాజ విఖ్యాతౌ క్షితిమండలే | రంభ##శ్చైవ కరంభశ్చద్వావాస్తాం దానవోత్తమౌ. 17 తావపుత్రో మహారాజ పుత్రార్థం తేపతుస్తపః | బహూ న్వర్షగణా న్కామం పుణ్యపాంచనదే జలే. 18 కరంభ స్తు జలే మగ్న శ్చకార పరమం తపః | వృక్షం రసాలవటం ప్రాప్య స రంభో%గ్ని మసేవత. 19 పంచాగ్ని సాధనాసక్తః స రంభ స్తు యదా2భవత్ | జ్ఞాత్వా శచీపతి ర్దుఃఖ ముద్య¸° దానవౌ ప్రతి. 20 గత్వా పంచనదే తత్ర గ్రాహరూపం చకార హ | వాసవస్తు కరంభం తం తదా జగ్రాహ పాదయోః. 21 నిజఘాన చ తం దుష్టం కరంభం వృత్ర సూదనః | భ్రాతరం నిహతం శ్రుత్వా రంభః కోపం పరంగతః. 22 స్వశీర్షం పావకే హోతు మైచ్ఛ చ్ఛిత్వా కరేణ హ | కేశపాశే గృహీత్వా%%శు కామేన క్రోధసంయుతః. 23 దక్షిణన కరేణోగ్రం గృహీత్వా ఖడ్గ ముత్తమమ్ | ఛినత్తి శీర్షం తత్తావ ద్వహ్నినా ప్రతిబోధితః. 24 ఉక్తశ్చ దైత్య! మూర్ఖో%సి స్వశీర్షం ఛేత్తు మిచ్ఛసి | ఆత్మహత్యా%తి దుఃసాధా కథంత్వం కర్తుముద్యతః. 25 వరం వరయ భద్రం తే యస్తే మనసి వర్తతే | మామ్రియస్వ - మృతేనాద్య కిం తే కార్యం భవిష్యతి. 26 బ్రహ్మ యిట్లనియెను : ''మహిషాసురా! నీకు నరుల వలన చావులేదు. నీ కెప్పుడైన స్త్రీ మూలముననే చావుగల్గును. నీవు చాల అదృష్టవంతుడవు' అని యిట్లు వర మొసంగి బ్రహ్మ తన లోకమున కరిగెను. దానవుడును ముదమంది తన చోటికి తాను వెళ్ళెను. అన విని రాజిట్లనెను : ''ఆ మహిషు డెవ్వని కొడుకు? అతని జన్మకారణమేమి? అతడు మహిషరూపము దాల్చుటకు కారణమేమి?' అన వ్యాసుడిట్లనియెను : 'మహారాజా ! పూర్వము భూమండలమందు దనుకుమారులిర్వురు పేరు గాంచిరి. ఒకడు రంభుడు. రెండవవాడు కరంభుడు. వారిరువురకు పుత్త్రసంతానము లేదు. వారు పుత్రార్థము పావనపంచ నదజలములందు పెక్కు లేండ్లు తపమొనర్చిరి. వారిలో కరంభుడు నీట మునిగి తపించుచుండెను. రంభుడొక పెద్ద వటవృక్షము నాశ్రయించి యగ్ని నారాధించుచుండెను. రంభుడు పంచాగ్నులను సాధించుటలో మునిగియుండెను. అది తెలిసి యింద్రుడు దుఃఃతుడై వారిచెంతకేగెను. ఇంద్రుడు పంచనదమునకేగి మొసలిరూపుదాల్చి కరంభుని పాదములు గట్టిగ పట్టెను. ఇంద్రుడట్లు పట్టి కరంభుని నంతమొందించెను. తన యన్న చావు విని రంభుడు దేవేంద్రునిపై కారాలు మిరియాలు నూరెను. అతడు క్రోధాతిరేకముతో నెడమచేత తన తలవెంట్రుకలు పట్టుకొని కుడిచేత తల నఱికి యగ్నిలో వేల్చదలచెను. అతడు కుడిచేత కత్తిబూని తన తల తెగవ్రేసికొనబోవునంతలో నగ్ని యతనికి తెలివి గలిగింపవచ్చి యిట్లనియెను : ఓరి మూర్ఖదైత్యా ! నీ తల నీవే నఱకుకొనదలతువేమి? ఆత్మహత్య కడు దుస్సాధమైనది. తగనిది. దాని నేల తలపెట్టితివి? ఊరక ఏల ప్రాణములు తీసికొందువు? చచ్చి యేమి సాధింతువు? నీ మదిలోని కోరిక తెల్పుము. వర మడుగుము. నీకు మేలగుత! వ్యాసః : తచ్ఛ్రుత్వా వచనం రంభః పావకస్య సుభాషితమ్ | తతో%బ్రవీద్వచో రంభ స్త్యక్త్వా కేశకలాపకమ్. 27 యది తుష్టో%సి దేవేసి దేహి మే వాంఛితం వరమ్ | త్రైలోక్యవిజయీ పుత్రః స్యాన్నః పరబలార్దనః. 28 అజేయః సర్వథా స స్యా ద్దేవ దానవమానవైః | కామరూపీ మహావీర్యః సర్వలోకాభివందితః. 29 పావక స్తం తథేత్యాహ భవిష్యతి తవేప్సితమ్ | పుత్త్ర స్తవ మహాభాగ మరణా ద్విరమాధునా. 30 యస్యాం చిత్తం తు రంభ త్వం ప్రమదాయాం కరిష్యసి | తస్యాం పుత్త్రో మహాభాగ భవిష్యతి బలాధికః. 31 వ్యాసః! ఇత్యుక్తో వహ్నినా రంభో వచనం చిత్తరంజనమ్ | శుత్వా ప్రణమ్య ప్రయ¸° వహ్నిం తం దానవోత్తమః. 32 యక్షైః పరివృతం స్థానం రమణీయం శ్రియా%న్వితమ్ | దృష్ట్వా చక్రే తదా భావం మహిష్యాం దానవోత్తమః. 33 మత్తాయాం రూపపూర్ణాయాం విహాయాన్యాం చ యోషితమ్ | సాసమాగాచ్చ తారసా కామయంతీ ముదా%న్వితా. 34 రంభో%పి గమనం చక్రే భవితవ్య ప్రణోదితః | సా తు గర్భవతీ జాతా మహీషీ తస్య వీర్యతః. 35 తాం గృహత్వో%థ పాతాళం ప్రవివేశ మనోహరమ్ | మహిషేభ్యశ్చ తాం రక్ష న్ర్పియామనుమతాం కిల. 36 కదా చిన్మహిష శ్చాన్యః కామార్తస్తా మాపాద్రవత్ | స్వయ మాగత్య తం హంతు దానవః సముపాద్రవత్. 37 స్వరక్షార్థం సమాగమ్య మహిషం సమతాడయత్ | సో%పి తం నిజఘానాశు శృంగాభ్యాం కామమోహితః. 38 తాడితస్తేన తీక్షాణభ్యాం శృంగాభ్యాం హృదయే భృశమ్ | భూమౌ పపాత తరసా మమార చ విమూర్ఛితః. 39 అగ్ని పలికిన సుభాషితములు విని రంభుడు చేతిలోని వెండ్రుకలు వదలి యగ్నితో నిట్లు పలికెను : దేవేశా ! నీవు ప్రసన్నుడవైనచో ముల్లోకములు గెలిచి వైరుల మద మడచు కుమారుని నాకు ప్రసాదించుము. అతడు దేవ దానవ మానవుల కజేయుడు - మహావీర్యుడు - కామరూపి - లోకవందితుడు గావలయును అన అగ్ని యిట్లనియెను : ''నీకు నీవు కోరిన కొడుకు పుట్టగలడు. ఇక చావునుండి విరమించుము. మహాభాగా! నీ మనస్సే ప్రమదయందు తగుల్కొనునో యామెకు బలాధికుడగు కొడుకు పుట్టగలడు' అట్లు తన మది కింపగు పలుకులు విని దానవుడగ్నికి నమస్కరించి అచటి నుండి యక్షులు తిరుగు రమణీయ ప్రదేశము చేరెను. అట దానవుడు మంచిరూపము గలిగి మత్తతతో నున్న యొక మహిషి యందు తన భావము నిలిపెను. అతడు మరే యువతిని కన్నెత్తియైన చూడలేదు. అతనిని చూడగనే ఆ మహిషి (గేదె) యును సమ్మదమున నతని నెదలో కామించి అతని కడకు వచ్చెను. అపుడు రంభుడు దైవ ప్రేరణచేత మహిషితో గలిసెను. మహిష యతని వీర్యమున గర్భము దాల్చెను. అతడు తన ప్రియ మహిషి నితర మహిషములనుండి గాపాడుటకు దానిని సుందరమైన పాతాళమునకు తోలుకొనిపోయెను. పిమ్మట నొక మదించిన మహిషము పెల్లుబుకు కామ మద మాపుకొన లేక యా మహిషిపై కురికి వచ్చెను. అపడు రంభుడు స్వయముగ వచ్చి దానిని చంపుటకు పరిగెత్తుకొనివెళ్ళెను. అతడు తన మహిషిని గాపాడుట కా మహిషమును గొట్టెను. అదియు బాగుగ మదమెక్కి యున్నందున నతనిని వాడి కొమ్ములతో గట్టిగ పొడిచెను. దాని వాడి కొమ్ముల పోట్లు తన గుండెకు తగులగ రంభుడచటనే మూర్ఛితుడే పడి యసువులు పాసెను. మృతే భర్తరి సా దీనా భయార్తా విద్రుతా భృశమ్ | సా వేగాత్తం వటం ప్రాప్య యక్షాణాం శరణం గతా. 40 పృష్ఠతస్తు గతస్తత్ర మహిషః కామపీడితః | కామయానస్తు తాం కామీ బలవీర్య మదోద్ధతః. 41 రుదతీ సా భృశం దీనా దృష్టా యక్షైర్భయాతురా | ధావమానం చ తం వీక్ష్యం యక్షా స్త్రాతు సమయయుః. 42 యుద్ధం సమభవ తార్థం యక్షాణాం చ హయారిణా | శరణ తాడిత స్తూర్ణం పపాత ధరణీతలే. 43 మృతం రంభం సమానీయ యక్షాస్తే పరమం ప్రియమ్ | చితాయాం రోపయామాసుస్తస్య దేవస్య శుద్ధయే. 44 మహిషీసా పతిం దృష్ట్వా చితాయాం రోపితం తదా | ప్రవేష్టుం సా మతిం చక్రే పతినా సహపావకమ్. 45 వార్యమాణా%పి యక్షైః సా ప్రవివేశ హుతాశనమ్ | జ్వాలామాలాకులం సాధ్వీ పతిమాదాయ వల్లభమ్. 46 మహిషస్తు చితామధ్యా త్స ముత్తస్థౌ మహాబలః | రంభో%ప్యస్య ద్వపుః కృత్వా నిఃసృతః పుత్రవత్సలః. 47 రక్త బీజో%ప్యసౌ జాతో మహిషో%పి మహాబలః | అభిషిక్త స్తు రాజ్యే%సౌ హయారి రసురోత్తమైః. 48 ఏవంస మహిషో జాతో రక్త బీజశ్చ వీర్యవాన్ | అవధ్యైస్తు సురై ర్దెత్యై ర్మానవైశ్చ నృపోత్తమ. 49 ఇత్యేత త్కథితం రాజన్ జన్మ తస్య మహాత్మనః | వరప్రదానం చ తథా ప్రోక్తం సర్వం సవిస్తరమ్. 50 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ద్వితీయో%ధ్యాయః. అపుడు మహిషి తన పతి మృతిగని దీనయై భయార్తయై యొక వటవృక్షము చెంతనున్న యక్షులను శరణు వేడెను. అపుడు బలవీర్య మదోద్ధతిచే కామాంధమగు మహిషము మహిషి వెంట దగిలెను. అట్లు మహిషము తనమీదకి వచ్చుచుండగ మహిషి దీనముగ నఱచుచుండెను. అట్లు తమ చెంతకు వచ్చు మహిషిని రక్షించుటకు యక్షులు సిద్ధపడిరి. అంత యక్షులకు మహిషమునకు మధ్య పెద్ద పోరాటము సాగెను. వారు దానిని బాణముల గొట్టిరి. అది నేల గఱచెను. యక్షులు తమ కిష్టుడగు రంభుని మృతదేహము శుద్ధినందుటకు రంభుని శవమును చితిపై నుంచిరి. తన పతి శవము చితిపై నుంటగని మహిషి తన ప్రియునితో నగ్నిలో సహగమనము చేయదలచెను. యక్షులెంతగ నడ్డగించినను వినక సాధ్వియగు మహిషి తన ప్రియునితో జ్వాలలెగయు నగ్నిలో ప్రవేశించెను. అంత మహిషి గర్భము వెల్వడి చితిమీదినుండి మహాబలుడగు మహిషుడు బయటకు వచ్చెను. రంభుడును పుత్త్రవాత్సల్యమున మరొక రూపు దాల్చి వచ్చెను. ఈ మరొక రూపు దాల్చిన రంభుడు రక్తబీజుడనబరగెను. మహిషుడు రాక్షసులచేత తమ రాజుగ నభిషిక్తుడయ్యెను. ఇట్లు వీర్యవంతులగు మహిష రక్తబీజులు పుట్టి దేవ దానవ నరుల కవధ్యులైరి. రాజా! నీకు ఇట్లు మహిషునకు బ్రహ్మ వర ప్రదానము - మహిషాసురుని జన్మము విపులీకరింపబడినవి. ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు మహిషాసురుని జన్మ వృత్తాంతమను ద్వితీయాధ్యాయము.