Sri Devi Bhagavatam-1    Chapters   

అథ%నవమో%ధ్యాయః

వ్యాసః: దేవా విష్ణువచః శ్రుత్వా సర్వే ప్రముదితా స్తదా | దదుశ్చ భూషణాన్యాశు వస్త్రాణి స్వాయుధాని చ. 1

క్షీరోద శ్చాంబరే దివ్యే రక్తే సూక్ష్మే తథా%జరే | నిర్మలం చ తథా హారం ప్రీత స్తసై#్య సుమండితమ్‌. 2

దదౌ చూడామణిం దివ్యం సూర్యకోటి సమప్రభమ్‌ | కుండలే చ తథా శుభ్రే కటకాని భుజేషు వై. 3

కేయూరా న్కంకణా న్దివ్యా న్నానారత్న విరాజితాన్‌ | దదౌ తసై#్య విశ్వకర్మా ప్రసన్నేంద్రియ మానసః. 4

నూపురౌ సుస్వరౌ కాంతౌ నిర్మలౌ రత్నభూషితౌ | దదౌ సూర్య ప్రతీకాశౌ త్వష్టా తసై#్య సుపాదయోః. 5

తథా గ్రై వేయకం రమ్యం దదౌ తసై#్య మహార్ణవః | అంగుళీయకరత్నాని తేజోవంతి చ సర్వశః. 6

అవ్లూన పంకజాం మాలాం గంధాడ్యాం భ్రమరా%నుగామ్‌ | తథైవ వైజయంతీం చ వరుణః సంప్రయచ్చత. 7

హిమనానథ సంతుష్టో రత్నాని వివిధాని చ | దదౌ చ వాహనం సింహం కనకాభం మనోహరమ్‌. 8

భూషణౖ ర్భూషితా దివ్యైః సా రరాజ వరా శుభా | సింహారుఢా వరారోహా సర్వలక్షణ సంయుతా. 9

విష్ణు శ్చక్రా త్సముత్పాద్య దదావసై#్య రథాంగకమ్‌ | సహస్రారం సుదీప్తం చ దేవారిశిరసాం హరమ్‌. 10

స్వత్రిశూలా త్సముత్పాద్య శంకరః శూలముత్తమమ్‌ | దదౌ దేవ్యై సురారీణాం కృంతనం భయనాశనమ్‌. 11

వరుణ శ్చ ప్రసన్నాత్మా దదౌ శంఖం సముజ్జ్వలమ్‌ | ఘోషవంతం స్వశంఖాత్తు సముత్పాద్య సుమంగళమ్‌. 12

హుతాశన స్తథా శక్తిం శథఘ్నీం సుమనోజవామ్‌ | ప్రాయచ్ఛత్తు ప్రసన్నాత్మా తసై#్మ దైత్య వినాశినీమ్‌. 13

తొమ్మిదవధ్యాయము

శ్రీదేవి దివ్యస్వరూపమునకు మహిషుడు మోహితుడగుట

విష్ణుని వచనములు విని యెల్ల దేవతలును సహర్షముగ శ్రీదేవికి తమ తమ దివ్యభూషణములు వస్త్రములు దివ్యాయుధములు సమర్పించిరి. శ్రీదేవికి క్షీరసాగరము ప్రీతితో నక్షయములు దివ్యములు సూక్ష్మములు నగు రెండెఱ్ఱని వస్త్రములు నొక మిగుల నలంకృతమగు మణిహారము నొసంగెను. విశ్వకరమ ప్రసన్నములగు ఇంద్రియములును మనస్సున కలవాడై సూర్యకోటి సమప్రభలతో వెలుగు దివ్య చాడామణిని చెవులకు శుభకుండలములను భుజములకు దివ్యకటకములను నానా రత్న విరాజితములై దివ్యములైన కేయూర కంకణములను దేవి కొసంగెను. దేవి పదపద్మములకు త్వష్ట సూర్యకాంతి సదృశకాంతులు విరజిమ్ముచు నిర్మల మంజుల రత్నభూషితములైన గజ్జెలందియ లొసంగెను. మహాసాగరుడు దేవదేవికి సర్వతేజోవంతములగు ముద్దుటుంగరములు సుందర కంఠహారములు నొసంగెను. వరుణదేవుడు శ్రీదేవికి వాడని కమలముల మాలను వైజయంతిని కానుకగ నొసంగెను. కమ్మని నెత్తావులు గుబాళించుటవలన కమలముల చుట్టు గుండుతుమ్మెదలు ఝంకారములు చేయుచుండెను. హిమవంతుడు సంతుష్టుడై బంగారమువంటి కాంతితో మనోహరమగు సింహవాహనమును వివిధ రత్నరాసులను దేవి కర్పించెను. ఈ విధముగ శ్రీదేవి సకల లక్షములతో భూషణములతో శ్రేష్ఠురాలై శుభరూపయై వరారోహయై మృగరాజుపై విరాజిల్లుచుండెను. అంత చక్రి తన చక్రమందుండి యొక దివ్య సుదర్శన చక్రమును సముత్పన్న మొనరించి శ్రీదేవి కొసంగెను. ఆ చక్రము రక్కసిమూకలు తలలు ప్రక్కలించుటకు సమర్థమై యుండెను. శూలి తన శూలమునుండి యొక యుత్తమ త్రిశూల ముత్పన్న మొనరించి మహాలక్ష్మి కొసంగెను. ఆ శూలము సురవైరులను నరుకజాలి సురల భయ ముడుపజాలి వెలుగొందుచుండెను. వరుణుడు తన శంఖమందుండి అతి శుభకరమగు నొక శంఖము సృజించి దేవికి ప్రసన్నమతితో నొసంగెను. అది మహాఘోష గంభీరమై దివ్యమై తనరారుచున్నది. అగ్నిదేవుడు దైత్య వినాశకరమైన తీవ్రవేగముగల శతఘ్నియగు శక్తిని శ్రీదేవికి ప్రదానము చేసెను.

ఇషుధిం బాణపూర్ణం చ చాపం చాద్భుత దర్శనమ్‌ | మారుతో దత్త వాం స్తపై#్య దురాకర్షం ఖరస్వరమ్‌. 14

స్వ వజ్రా ద్వజ్ర ముత్పాద్య దదావింద్రో%తి దారుణమ్‌ |

ఘంటా మైరావతా త్తూర్ణం సుశబ్దాం చాతిసుందరామ్‌. 15

దదౌ దండం యమః కామం కాలదండ సముద్భవమ్‌ | యేనాంతం సర్వభూతానా మకరోత్కాల ఆగతే. 16

బ్రహ్మా కమండలుం దివ్యం గంగావారి ప్రపూరితమ్‌ | దదా వసై#్య ముదా యుక్తో వరుణః పాశ##మేవ చ. 17

కాలః ఖడ్గం తథా చర్మ ప్రాయచ్ఛత్తు నరాధిప | పరశుం విశ్వకర్మా చ తీక్షణ మసై#్య దదా వథ. 18

ధనద స్తు సురాపూర్ణం పానపాత్రం సువర్ణజమ్‌ | పంకజం వరుణ శ్చాదా ద్దేవ్యై దివ్యం మనోహరమ్‌. 19

గదాం కౌముదకీం త్వష్టా ఘంటాశత నినాదినీమ్‌ | అ దాత్త సై#్య ప్రసన్నాత్మా సురశత్రు వినాశినీమ్‌. 20

అస్త్రా ణ్యనేకరూపాణి తథా%భేద్యం చ దంశనమ్‌ | దదౌ త్వష్ట్వా జగన్మాత్రే నిజరశ్మీ న్దివాకరః. 21

సాయుధాం భూషణౖర్యుక్తాం దృష్ట్వా తే విస్మయంగతాః | తుష్టువుస్తాం సురా దేవీం త్రైలోక్యమోహినీం శివామ్‌. 22

దేవాఊచుః: నమః శివాయై కల్యాణ్యౖ శాంత్యైపుష్ట్యైనమోనమః | భగవత్యైనమో దేవ్యైరుద్రాణ్యౖసతతం నమః. 23

కాళరాత్ర్యై తథా%ంబాయై ఇంద్రాణ్యౖ తే నమోనమః | సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమోనమః. 24

పృథివ్యాం యా స్థితా పృథ్వ్యా న జ్ఞాతా పృథివీంచయా | అంతః స్థితా యమయతి వందే తా మీశ్వరీం పరామ్‌. 25

మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయాన చ తా మజామ్‌| అంతః స్థితాప్రేరయతిప్రేరయిత్రీం నమఃశివామ్‌. 26

వాయుదేవుడు గొప్ప చాపమును కఱకుటమ్ములతో నిండిన యమ్ముల పొదియుగు శ్రీదేవి కొసంగెను. ఆ ధనువు లాగుటకు శక్యముగాక చూపఱ కచ్చెరువు గొల్పుచు భీకర టంకారమున నొప్పుచుండెను. ఇంద్రుడు తన వజ్రము నుండి సిద్ధపఱచిన యొక దారుణ వజ్రమును ఐరావతము నుండి శోభన శబ్దము కలదియు అతి సుందరమును నగు నొక ఘంటను శీఘ్రమే సమర్పించెను. కాలము తీరిన యెల్ల ప్రాణులకు దేనివలన చావుమూడునో యట్టి కాలదండము నుండి యముడొక దండమును సృజించి దేవి కర్పించెను. బ్రహ్మ గంగాజల పూరితమైన దివ్య కమండలువును వరుణుడు దివ్యపాశమును సంతసమున దేవదేవి కొసంగిరి. కాలుడు ఖడ్గ చర్మములను విశ్వకర్మ వాడి గండ్ర గొడ్డలిని శ్రీదేవికి సమర్పించిరి. వరుణ కుబేరులు దేవికి వరుసగ మనోహరమైన కమలమును సురతో నిండిన బంగరు మధుపాత్రను నందించిరి. త్వష్ట దానవ నాశనికి ప్రసన్న చిత్తముతో సురశత్రు వినాశనియు నూఱు గంటలతోకూడి ధ్వనించుచున్నదియు నగు కౌమోదకీ గదను సమర్పించెను. త్వష్ట దేవికి వైరులను నుగ్గొనర్చు పెక్కు విధములగు దివ్యాస్త్రములను భేదింపరాని కవచము నర్పించెను. సూర్యుడా జగదంబకు తన దివ్యతేజము నొసంగెను. ఆమె భూషణములతో నాయుధములతో విలసిల్లు త్రైలోక్యమోహినిగ శివస్వరూపిణిగ ప్రకాశించు చుండెను. ఆ తల్లిని గని దేవతలెల్లరును పరమ విస్మయము జెంది యామె నిటుల నుతింప దొడగిరి: మే మెల్ల వేళల నిత్యకల్యాణి-శాంతి-పుష్టి-భగవతి-రుద్రాణి-దేవదేవి యగు శివస్వరూపిణిని నమస్కరింతుము. కాళరాత్రి-సిద్ధి-వృద్ధి-సమృద్ధి-ఇంద్రాణి-స్థితబుద్ధి-వైష్ణవి యగు తల్లికి మా వందనశతములు. ఏ యీశ్వరీశక్తి భూమియందుండి భూమిచేత దెలియబడక భూమిని నియమించు చుండునో యట్టి పరాశక్తికి పునఃపునర్నమస్సులు. మాయలో నుండి మాయచేత నెఱుగబడక మాయను కార్యములకు ప్రేరించు చున్నట్టి ప్రేరయిత్రీ శివశక్తి కంజలి ఘటింతుము.

కళ్యాణం కురు భో మాత స్త్రాహినః శత్రుతాపితాన | జహి పాపం హయారిం త్వం తేజసా స్వేనమోహితమ్‌. 27

ఖలం మాయావినం ఘోరం స్త్రీవధ్యం వరదర్పితమ్‌ | దుఃఖదం సర్వదేవానాం నానారూపధరం శఠమ్‌. 28

త్వ మేకా సర్వదేవానాం శరణం భక్తవత్సలే | పీడితా న్దానవేనాద్య త్రాహి దేవి నమో%స్తుతే. 29

వ్యాసః: ఏవం స్తుతా తదా దేవీ సురైః సర్వసుఖప్రదా | తా నువాచ మహాదేవీ స్మితాపూర్వం శుభం వచః. 30

దేవ్యువాచ: భయం త్యజంతు గీర్వాణా మహిషాన్మందచేతసః | హనిష్యామి రణ%ద్యైవవరదృప్తం విమోహితమ్‌. 31

వ్యాసః: ఇత్యుక్త్వా సా సురాన్దేవీ జహాసాతీవసుస్వనమ్‌ | చిత్ర మేతచ్చ సంసారే భ్రమమోహయుతం జగత్‌. 32

బ్రహ్మవిష్ణుమహేశాద్యాః సేంద్రా శ్చాన్యే సురాస్థథా | కంపయుక్తా భయత్రస్తా వర్తంతే మహిషాత్కిల. 33

అహో దైవబలం ఘోరం దుర్జయం సురసత్తమాః | కాలః కర్తాస్తి దుఃఖానాం సుఖానాం ప్రభు రీశ్వరః. 34

సృష్టిపాలన సంహారే సమర్థా అపి తే యదా | ముహ్యంతి క్లేశసంతప్తా మహిషేణప్రపీడితాః. 35

ఇతి కృత్వా స్మితం దేవీ సాట్టహాసం చకార హ | ఉచ్చైః శబ్దం మహాఘోరం దానవానాం భయప్రదమ్‌. 36

చకంపే వసుధా తత్ర శ్రుత్వాతచ్ఛబ్ద మద్భుతమ్‌ | చేలుశ్చ పర్వతాః సర్వే చుక్షోభాబ్ధి శ్చ వీర్యవాన్‌. 37

మేరు శ్చ చాల శ##బ్దేన దిశః సర్వాః ప్రపూరితాః | భయం జగ్ము స్తదా శ్రుత్వా దానవాస్తం స్వనం మహత్‌. 38

జయ పాహీతి దేవా స్తా మూచుః పరమహర్షితాః | మహిషో%పి స్వనం శ్రుత్వా చుకోప మదగర్వితః. 39

కి మేత దితి తాన్‌ దైత్యా న్ప ప్రచ్ఛ స్వన శంకితః | గచ్ఛంతు త్వరితా దూతా జ్ఞాతుం శబ్ద సముద్భవమ్‌. 40

జగదంబా! నీ దివ్యతేజముతో మహిషుని మోహితుని జేసి యా పాపిని దెగటార్చుము. మేము శత్రు పీడితులము. మమ్ము కాపాడి మాకు మేలు ప్రసాదించుము. మహిషుడు ఘోరుడు-ఖలుడు-మాయావి. స్త్రీవధ్యుడు. వరబల దర్పితుడు-బహురూపధారి- దేవతలకు దుఃఖదాయకుడు-శఠుడు. ఓ భక్తవత్సలా! నీ వొక్కర్తుకవే దేవతల కెల్లరకు శరణ్యము. మేము దానవ పీడితులము. అమ్మా మమ్ము బ్రోవుమమ్మా! నీకు వందనములమ్మా,' అని యిటుల సురలు సన్నుతింపగ సుఖదాయిని యగు మహాదేవి చిరునగవులు చిందు మేలుమాటలతో వారికిట్లనెను : దేవతలారా! ఇక భయపడకుడు. వరదర్పితుడు-మదమోహితుడు మందమతి యగు మహిషు నిపుడే రణమున నేలగూల్తును అని దేవి వారితో బలికి ఎలుగెత్తి పెద్దగ పకపక నవ్వెను. దానికి జగమంతయును వింతగ మోహ సంభ్రాంతులు జెందెను. బ్రహ్మ విష్ణుమహేశులు-ఇంద్రాది దేవతలును మహిషునికి భయపడి గడగడ లాడుచున్నారు. ఓ సురసత్తములారా! దైవబల మతి విచిత్రము-ఘోరము-దుర్జయము. ఈ యెల్ల సుఖదుఃఖములకు కాలము కర్త-ప్రభువు-ఈశ్వరుడు. ఏలన, సృష్టి స్థితి సంహార దక్షులగు త్రిమూర్తులు సైతము మహిషుని ధాటి కోర్వలేక విమోహితులై క్లేశ సంతాపము లందియున్నారు అను భావముతో దేవి బెట్టిదపు టట్టహాసముతో నవ్వు నవ్వి దానవుల గుండె లదఱునట్లు ఘోర గంభీర ధ్వని చేసెను. ఆ భీకరాద్భుత ధ్వనికి భూమి కంపించెను. గిరులు గ్రక్కదలెను. సారము గల జలధులు క్షోభిల్లెను. ఆ ఘూర్జిల్లు శబ్దమునకు దిక్కులు పిక్కటిల్లెను. మేరువు క్రింది మట్టి లేచెను. ఆ మహా నిస్వనమునకు దానవుల గుండెలు దడదడ లాడెను. అంత దేవతలు పరమ హర్షమున ఓహో దేవీ! నీకు విజయ మగుగాక! మమ్ము గాపాడుమమ్మా!' యని పలికిరి. మహిషుడా ధ్వని విని మదగర్వముతో క్రొవ్వుతో కనుగ్రుడ్లెఱ్ఱ జేసెను. ఆ ధ్వని యతని కనుమానము గల్గించెను. అందుచే నతడా మహాశబ్దము పుట్టుటకు కారణమేదో తెలిసికొనుడని దానవుల నంపెను.

కృతః కేనాయ మత్యు గ్రః శబ్దః కర్ణవ్యథాకరః | దేవో వా దానవో వా%పి యో భ##వేత్స్వన కారకః. 41

గృహీత్వా తం దురాత్మానం మత్సమీపం నయంత్విహ | హనిష్యామి దురాచారం గర్జంతం స్మయ దుర్మదమ్‌. 42

క్షీణాయుషం మందమతిం నయామి యమసాదనమ్‌ | పరాజితాః సురాః కామంన గర్జంతి బయాతురాః. 43

నాసురా మమ వశ్యా స్తే కస్యేదం మూఢ చేష్టితమ్‌ | త్వరితా మాముపాయాంతు జ్ఞాత్వా శబ్దస్యకారణమ్‌. 44

అహం గత్వా హనిష్యామి తం పాపం వితథ శ్రమమ్‌ |

వ్యాస ఉవాచ: ఇత్యుక్తా స్తేన తే దూతా దేవీం సర్వాంగసుందరీమ్‌. 45

అష్టాదశభుజాం దివ్యాం సర్వాభరణభూషితామ్‌ | సర్వలక్షణసంపన్నాం వరాయుధ ధరాం శుభామ్‌. 46

దధతీం చషకం హస్తే పిబంతీంచ ముహుర్మధు | సంవీక్ష్య భయభీతా స్తే జగ్ము స్త్రస్తాః సుశంకితాః. 47

సకాశే మహిషస్యాశు తమూచుః స్వనకారణమ్‌ | దూతా ఊచుః: దేవీ దైత్యేశ్వర! ప్రౌఢా దృశ్యతే కాచిదంగనా. 48

సర్వాంగభూషణా నారీ సర్వరత్నో పశోభితా | న మానుషీ నాసురీసా దివ్యరూపా మనోహరా. 49

సింహారూఢా%%యుధధరా చాష్టాదశకరా వరా | సా నాదం కురుతే నారీ లక్ష్యతే మదగర్వితా. 50

సురాపానరతా కామం జానీమో న సభర్తృకా | అంతరిక్ష స్థితా దేవా స్తాం స్తువంతి ముదాన్వితాః. 51

జయేతి పాహి న శ్చేతి జహి శత్రు మితి ప్రభో | న జానే కా వరారోహా కస్య వా సా పరిగ్రహః. 52

కిమర్థ మాగతా చాత్ర కిం చికీర్షతి సుందరీ | ద్రష్టుం నైవ సమర్థాః స్మ స్తత్తేజః పరిధర్షితాః. 53

ఈ భీకరధ్వని కర్ణకఠోరము-వజ్రకఠినము. దీనికి కారకుడు దానవుడు గానిమ్ము. దేవుడు గానిమ్ము. మరెవ్వడేని గానిమ్ము. అట్టి దురాత్ముని పట్టి నా ముందునకు గొనితెండు. అట్లు గర్జించు దుర్మదాంధుని దునుమాడుదును. అట్టి మందమతి నల్పాయుష్కుని జేసి వాని నిపుడే యమాలయమున కంపుదును. సుర లోడిపోయి భీతిల్లిరి. కాన వారు గర్జింప నోపరు. అసురులు నాకెపుడును వశ్యులేగదా! మఱి యీ చెడ్డపని యింకెవ్వనిది గావచ్చును? మీరు త్వరగ నేగి శబ్దకారణ మెఱిగి నా చెంతకు రండు. అట్లూరక కేకలు వేయుచు శ్రమించు పాపినంత మొందింతునని మహిషుడు దూతలకనెను. అంత దూతలేగి సర్వాంగ సుందరియగు దేవిని గనిరి. ఆ దేవి యష్టా దశ భుజములతో దివ్య సర్వాభరణ భూషణములతో సర్వ శుభ లక్షణ సంపదలతో వరశుభా యుధములతో వెలయుచుండెను. ఆమెచేత మధుపాత్ర గలదు. ఆమె మాటిమాటికి మధురసము గ్రోలుచుండెను. దూతలామెను గని భయత్రస్తులై శంకాన్వితులై పారిపోయిరి. వారు మహిషునకు ధ్వనికారణ మిట్లెఱిగించిరి: ఓ దైత్యనాథా! ఓక ప్రౌఢాంగన యగు దేవి మాకు గనంబడినది. ఆమె యంగము లెల్ల రత్నభూషణశోభితములు. ఆమె దానవ స్త్రీ గాదు-మానవ వనిత గాదు. ఆమె ప్రత్యణువునుండి రమ్యములైన యమృతకాంతులు వెలయుచున్నవి. ఆ దేవి సింహాసీన-అష్టాదశభుజ-దివ్యాయుధధారిణియై ఘోర నినాదము చేయుచున్నది. చూడగ మద గర్వితవలె గనబడుచున్నది. సురాపానముచే మత్తిల్లి నున్నది. ఆమెకు పతి లేడని యెఱిగితిమి. సురలు గుమిగూడి వినువీథులందు ప్రమోదమున దేవిని ప్రస్తుతించుచున్నారు. ఓ దేవీ! నీకు విజయము. శత్రులను దునుమాడుము. మమ్ముల గాపాడు'మని వారు నుతించుచున్నారు. ఆ సుందరి యెవతెయో! ఎవ్వాని పత్నియో! ఆమె యేల యిట కరుగుదెంచెనో! ఏమి చేయదలచినదో మే మెఱుగము. ఆమె తేజమునకు మేము ముగ్ధులమైతిమి. ఆ మిఱుమిట్లు గొల్పు కాంతిని మేము చూడనేలేకపోతిమి.

శృంగార వీరహాసాఢ్యా రౌద్రాద్భుతరసాన్వితా | దృష్ట్వై వైవంవిధాం నారీ మసంభాష్య సమాగతాః. 54

వయం త్వదాజ్ఞయా రాజ న్కింకర్తవ్య మతః పరమ్‌ |

మహిష ఉవాచ : గచ్ఛ వీర మయా%%దిష్టో మంత్రిశ్రేష్ఠ ! బలాన్వితః. 55

సామాదిభి రుపాయై స్తాం సమానయ మమాంతికమ్‌ | కరోమి పట్టమహిషీం తా మరాళభ్రువం ముదా. 57

ప్రీతియుక్తా సమాయాతి యదిసా మృగలోచనా | రసభంగో యథా న స్యాత్తథా కురు మమేప్సితమ్‌. 58

శ్రమణా న్మోహితో%స్మ్యద్య తస్యా రూపస్య సంపదః |

వ్యాస ఉవాచ: మహిషస్య వచః శ్రుత్వా పేశలం మంత్రి సత్తమః. 59

జగామ తరసా కామం గజాశ్వరథ సంయుతః | గత్వా దూరతరం స్థిత్వా తామువాచ మనస్వినీమ్‌. 60

వినయావనతః శ్లక్షం మంత్రీ మధురయా గిరా |

ప్రధాన ఉవాచ: కా%సి త్వం మధురాలాపే ! కిమత్రాగమనం కృతమ్‌. 61

పృచ్ఛతి త్వాం మహాభాగే మన్ముఖేన మమ ప్రభుః | స జేతా సర్వదేవానా మవధ్యస్తు నరైఃకిల. 62

బ్రహ్మణో వరదానేన గర్విత శ్చారులో చనే | దైత్యేశ్వరో%సౌ బలవా న్కామరూపధరః సదా. 63

శ్రుత్వా త్వాం సముపాయాతాం చారువేషాం మనోహరామ్‌ | ద్రష్టు మిచ్ఛతి రాజా మే మహిషో నామ పార్థివః. 64

మానుషం రూప మాదాయ త్వత్సమీపం సమేష్యతి | యథా రుచ్యేత చార్వంగి ! తథా మన్యామహే వయమ్‌. 65

తర్హ్యేహి మృగశాబాక్షి సమీపం తస్య ధీమతః | నో చే దిహానయా మ్యేనం రాజానాం భక్తితత్పరమ్‌. 66

తథా కరోమి దేవేశి! యథా తే మనసేప్సితమ్‌ | వశగో%సౌ తవాత్యర్థం రూపసంశ్రవణాత్తవ. 67

కరభోరుః వదా%శు త్వం సంవిధేయం మయా తథా. 68

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే నవమోధ్యాయః.

ఆమె శృంగారము-హాస్యము-వీరము-రౌద్రము-అద్భుతము మున్నగు రసముల కాశ్రయమై యొప్పారుచున్నది. అట్టి నారీమణిని గాంచి మే మామెను పలుకరించకయే తిరిగి వచ్చితిమి. ఇపు డేమి చేయవలయునో యానతిమ్ము అన మహిషు డిట్లనెను: ఇపుడు బలవంతులగు మంత్రు లేగవలయును. ఆ శుభాంగిని సామాద్యుపాయములతో వారు తేవలయును. ఆమె మూడుపాయములచే వశ్యురాలై రాకపోవచ్చును. అపుడామెను చంపకయే నా చెంతకు గొనితెండు. ఆ కుటిలాలకను నా పట్టమహిషిగ ప్రియమున నొనర్తును. ఆ హరిణలోచన నెమ్మితో రాదలచినచో రసభంగముగాని తెఱగున తెచ్చి నా కోరిక నీడేర్చుడు. ఆమె సర్వశోభనమైన సురూపము విన్నంతనే మోహితుడ నైతిని అను మహిషుని మృదూక్తులొక మంత్రివర్యుడు వినెను. అతడు వేగమే గజాశ్వరథములతో నేగి దూరముగ నుండెను. అతడు వినయమున తలవంచి తీయని మెత్తని మాటలతో నా సుమనస్కురాలి కిట్లనెను: ఓ మధుర మంజుభాషిణీ! నీ వెవతెవు? నీ రాకకు కారణ మేమి? అని నా ప్రభువు నా నోట నిన్నడుగుచున్నాడు. అతడు తేజస్వి. సకల నరదేవతల కవధ్యుడు. చారులోచనీ! దైత్యపతి బ్రహ్మవరప్రసాది. మదమత్తుడు. కామరూపధారి. నీవు చారువేషవై మనోహరవై వచ్చితివి. నా మహిష మహీపతి నిన్ను చూడ వేడుక పడుచున్నాడు. ఓ శోభనాంగీ! అతడు నిన్ను మానవ రూపమున సమీపింపగలడు. నీ యిచ్చమెచ్చునట్లు కార్యము చక్కపెట్టుదుము. కనుక నో మృగనయనీ! నీవా ధీమంతుని యొద్దకు రమ్ము. కానిచో నీయందు భక్తితత్పరుడగు మా రాజును నీ సన్నిధికి దెత్తుము. ఓ దేవేశీ! నీ మది కేది యిష్టమో దాని నొనరింతుము. నీ సురూప సంపద విని యతడు నీకు గడుంగడు వశుడై యున్నాడు. కనుక నోకరభోరూ! నీవు శీఘ్రముగ నేది పలుకుదువో దానిని తప్పక యాచరింతుము.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమస్కంధమందు శ్రీదేవి దివ్యస్వరూపమును మహిషుడు మోహితుడగుటయను నవమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters