Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వావింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ దుర్గసంపత్తిః.

పుష్కర ఉవాచ :

దుర్గసంపత్తిమాఖ్యాస్యే దుర్గదేశేవసేన్నృపః | వైశ్యశూద్ర జనప్రాయో హ్యనాహార్యస్తథాపరైః. 1

కించిద్బ్రాహ్మణసంయుక్తో బహుకర్మ కరస్తథా | అదేవ మాతృకో భక్తజలో (నో) దేశః ప్రశస్యతే. 2

పరైరపీడితః పుష్పఫల ధాన్య సమన్వితః | అగమ్యః పరచక్రాణాం వ్యాలతస్కర వర్జితః. 3

షణ్ణామేకతమం దుర్గం తత్రకృత్వా వసేద్బలీ | ధన్వదుర్గం మహీదుర్గం నరదుర్గం తథైవచ. 4

వార్షం చైవామ్బుదుర్గంచ గిరిదుర్గంచ భార్గవ | సర్వోత్తమం శైల దుర్గమఖేద్యం చాన్యఖేదనమ్‌. 5

పురం తత్రచ హట్టాద్యం దేవతాయతనాదికమ్‌ | అనుయన్త్రాయుధోపేతం సోదకం దుర్గముత్తమమ్‌. 6

పుష్కరుడు చెప్పెను : ఇపుడు దుర్గమును గూర్చి చెప్పెదను. రాజు దుర్గమునందు నివసించవలెను. తనతో కూడ ఉండు వారిలో వైశ్య - శూద్రుల సంఖ్య అధికముగా ఉండవలెను. శత్రువులకు వశము కాని స్థలమునందు దుర్గము ఏర్పరచు కొనవలెను. దుర్గమునందు కొందరు బ్రాహ్మణులు కూడ ఉండవలెను. చాలమంది కార్మికులు ఎచట లభింతురో, ఎచట నీటికొరకై వర్షాల మీద ఆధారపడవలసి ఉండదో, నదీ తటాకాదుల నుండి జలము సమృద్ధముగా లభించునో, ఎచట శత్రుపీడ ఉండదో, పుష్పఫలములు, ధనధాన్యములు ఎచట సమృద్ధముగా ఉండునో, శత్రుసేనలు ఎచటికి రాజాలవో, సర్పభయము, చోరభయము, చోరభయము ఎచట ఉండదో అట్టి ప్రదేశములలో దుర్గమును నిర్మించుకొనవలెను. బలవంతుడైన వాడు, ధన్వదుర్గము, మహీదుర్గము, నరదుర్గము, వృక్షదుర్గము, జలదుర్గము, పర్వతదుర్గము అని ఆరు విధములగు దుర్గములలో ఏదైన ఒక దానిని ఆశ్రయించి ఉండవలెను. ఈ దుర్గములలో పర్వత దుర్గము శ్రేష్ఠమైనది. ఇది శత్రువులకు అభేద్యమై శత్రువులను నశింపచేయ వీలగునదిగా ఉండును. దుర్గమే రాజధాని. దాని యందు రాజవీథులు, ఆపణములు, దేవాలయములు ఉండవలెను. నాలుమూలల అస్త్రశస్త్ర భరితములగు యంత్రములు కలదై, జలప్రవాహయుక్తమై, చుట్టును జలముతో నిండిన కందకములు గలదై యుండు దుర్గముఉత్తమము.

రాజరక్షాం ప్రవక్ష్యామి రక్ష్యోభూపోవిషాదితః | పంచాఙ్గస్తు శిరీషఃస్యాన్మూత్రపిష్టా విషార్దనః. 7

శతావరీ ఛిన్నరుహా విషఘ్నీ తండులీయకమ్‌ | శాకోతకీ చ కహ్లారీ బ్రాహ్మీ చిత్రపటోలికా. 8

మండూకపర్ణీ వారాహీ ధాత్ర్యానన్ధకమేవచ | ఉన్మాదినీ సోమరాజీ విషమ్నం రత్నమేవచ. 9

వాస్తులక్షణసంయుక్తే వసన్ధుర్గే సురాన్యజేత్‌ | ప్రజాశ్చ పాలయేద్దుష్టాఞ్జయేద్ధానాని దాపయేత్‌. 10

ఇపుడు రాజరక్షణను గూర్చి చెప్పెదను. రాజు రాజ్యమునంతను తను పాలించువాడు గాన విషాదులచే ఆతనికి హాని కలుగకుండునట్లు రక్షించవలెను. శిరీషవృక్షము వ్రేళ్ళు, బెరడు, ఆకులు, పువ్వులు, పండ్లు ఈ ఐదింటిని గోమూత్రముతో నూరి సేవించినచో విషనివృత్తి కలుగును. శతాపరి, గుడూచి, తండులీయకము కూడ విషనివారకములు. కోశాతకి, కహ్లారి, బ్రాహ్మి, చిత్రపటోలిక, మండూకపర్ణి, వారాహీకందము, ఆమలకము, ఆనందకము, భంగు, సోమరాజి- ఇవి కూడ విషనివారకములు. కొన్ని మాణిక్యములు, ముత్యములు మొదలగునవి కూడ విషనాశకములు.

దేవద్రవ్యాది హరణాత్కల్పంతు నర కే వసేత్‌ | దేవాలయాంశ్చ -కుర్వీత దేవపూజారతోనృపః. 11

సురాలయాః పాలనీయాః స్థాపనీయాశ్చ దేవతాః | మృన్మయాద్దారుజం పుణ్యం దారుజాదిష్టకామయమ్‌. 12

ఐష్టకాచ్ఛైలజం పుణ్యం శైలజాత్స్వర్ణం రత్నజమ్‌ | క్రీడన్సురగృహం కుర్వన్భుక్తిముక్తిమవాప్నుయాత్‌.

చిత్రకృద్గీత వాద్యాది ప్రేక్షణీయాది దానకృత్‌ | తైలాజ్యమధు దుగ్ధాద్యైః స్నాప్యదేవం దివం వ్రజేత్‌. 14

పూజయేత్పాలయేద్విప్రాన్ద్విజస్యం న హరేన్నృపః | సువర్ణమేకం గామేకాం భూమేరప్యేకమఙ్గులమ్‌. 15

హరన్నరక మాప్నోతి యావదాభూత సవ్ల్పువమ్‌ | దురాచారం స ద్విషేచ్ఛ సర్వపాపేష్వపిస్థితమ్‌. 16

నైవాస్తి బ్రాహ్మణవధాత్పాపం గురుతరంక్వచిత్‌ | అదైవం దైవతం కుర్యుః కుర్యుర్దైవమదైవతమ్‌. 17

బ్రాహ్మణా హి మహాభాగాస్తాన్నమస్యేత్సదైవతు |

రాజు వాస్తులక్షణ లక్షితమైన దుర్గములో నివసించుచు దేవతాపూజనము, ప్రజాపాలనము, దుష్టశిక్షణము దానము చేయుచుండవలెను. దేవాదిధనమును అపహరించిన రాజు ఒక కల్పము వరకును నరకములో పడి యుండును. రాజు దేవపూజాతత్పరుడై దేవాలయమునకు కట్టించవలెను. దేవతాస్థాపన చేసి దేవాలయ రక్ష చేయవలెను. దేవతా విగ్రహముల మట్టితో కూడ చేయవచ్చును. మట్టితో చేసిన విగ్రహము కంటె దారునిర్మితము, దాని కంటే ఇటుకలతో చేసినది, దాని కంటే శిలానిర్మితము, దాని కంటే సువర్ణ నిర్మితము, దాని కంటే రత్నమయము పవిత్రమైనది. భక్తి పూర్వకముగా దేవాలయ నిర్మాణము చేయువాడు భుక్తిముక్తులను పొందును. దేవాలయములో చిత్రములు గీయించవలెను. గీతవాద్యాదులు ఏర్పరుపవలెను. అందమైన వస్తువులను దానము చేయవలెను. తైల - ఆజ్య - మధు - క్షీరాదులతో దేవతాభిషేకము చేయవలెను. ఇట్లు చేసినవాడు స్వర్గమును పొందును. బ్రాహ్మణులను పాలించి వారి సన్మానము చేయవలెను. వారి ధనమును లాగికొనరాదు. బ్రాహ్మణుని ఒక బంగారు నాణమును గాని, గోవును గాని, ఒక అంగుళము భూమి గాని అపహరించిన రాజు మహాప్రలయము వరకును నరకములో పడి ఉండును. అనేక పాపకృత్యములు చేయుచు దురాచారవంతుడుగా ఉన్న బ్రాహ్మణుని కూడ ద్వేషింపరాదు. బ్రహ్మహత్యను మించిన పాపములేదు. ప్రభావశాలియగు బ్రాహ్మణుడు తలచుకొన్నచో దేవతకాని వానిని దేవతగా చేయగలడు. దేవతను కూడ పదచ్యుతుని చేయగలడు. అందుచే సర్వదా ఆతనికి నమస్కారము చేయవలెను.

బ్రాహ్మణీ రుదతీ హన్తి కులం రాజ్యం ప్రజాస్తథా. 18

సాధ్వీస్త్రీణాం పాలనం చ రాజాకుర్యాచ్చధార్మికః | స్త్రియాప్రహృష్టయాభావ్యం గృహకార్యైకదక్షయాః. 19

సుసంస్కృతోపస్కరయా వ్యయే చాముక్తహస్తయా |

యసై#్మదద్యాత్పితా త్వేనాం శుశ్రూషేత్తం పతింసదా. 20

మృతేభర్తరి స్వర్యాయాద్ర్బహ్మచర్యే స్థితాఙ్గనా | పరవేశ్మరుచిర్నస్యాన్న స్యాత్కలహశాలినీ. 21

మండనం వర్జయేన్నారీ తథా ప్రోషితభర్తృకా | దేవతారాధనపరా తిష్ఠేద్భర్తృహితేరతా. 22

ధారయేన్మఙ్గలార్థాయ కించిదాభరణం తథా | భర్త్రాగ్నిం యా విశేన్నారీ సాపి స్వర్గమవాప్నుయాత్‌. 23

శ్రియః సమ్పూజనం కార్యం గృహసమ్మార్జనాదికమ్‌ | ద్వాదశ్యాం కార్తికే విష్ణుంగాంసవత్సాం దదేత్తథా. 24

సావిత్ర్యా రక్షితోభర్తా సత్యాచారవ్రతేన చ | సప్తమ్యాం మార్గశీర్షేతు సితేభ్యర్చ్య దివాకరమ్‌.

పుత్రానాప్నోతి చ స్త్రీహ నాత్రకార్యావిచారణా. 25

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దుర్గసంపత్తిర్నామ ద్వావింశతితమో7ధ్యాయః.

రాజు చేసిన అధర్మానికి బ్రాహ్మణ స్త్రీ ఏడ్వవలసి వచ్చినట్లయితే ఆతని రాజ్యము, వంశము, సర్వమును నశించును. అందుచే ధర్మ పరాయణుడగు రాజు పతివ్రతలకు మంచి రక్షణము కల్పించవలెను. స్త్రీగృహకర్మలయందు నిపుణురాలై, సంతుష్టురాలై ఉండవలెను. ఆమె ఇంటిలోని అన్ని వస్తువులను పరిశుభ్రముగా నుంచవలెను. ఖర్చు చేయుటలో సంయమవంతురాలై ఉండవలెను. తండ్రి కన్యకను ఎవనికిచ్చునో ఆతడే ఆమెకు పతి. ఆమె సర్వదాతన పతికి సేవచేయవలెను. భర్తృమరణానంతరము బ్రహ్మచర్యమును పాలించుకొనుస్త్రీ స్వర్గమునకువెళ్ళును. ఆమెఇతరులగృహములలో నివసించగూడదు. కలహములనుండి దూరముగా ఉండవలెను. భర్తపరదేశమునందున్న స్త్రీ అలంకరించుకొనగూడదు. సర్వదా ఆతని హితమునే కోరుచు దేవతారాధానము చేయుచుండవలెను. కేవలము మంగళార్థమై సౌభాగ్యచిహ్నముగా రెండు మూడు అలంకారములను మాత్రమే ధరించవలెను. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశముచేసిన స్త్రీకూడ స్వర్గము చేరును. లక్ష్మినిపూజించుట, ఇంటిని పరిశుభ్రముగానుంచుట స్త్రీకికర్తవ్యము. కార్తికద్వాదశినాడు విష్ణువును పూజించి వత్ససహిత గోదానము చేయవలెను. సావిత్రి తన సదాచార వ్రతముల ప్రభావముచే తన భర్తను మృత్యువునుండిరక్షించుకొనగల్గినది. మార్గశిరశుక్లసప్తమినాడు సూర్యునారాధించుటచే స్త్రీ పుత్రులను పొందును. ఇందులో ఏమాత్రము సందేహములేదు.

అగ్నిమహాపురాణమునందు దుర్గసంపత్తివర్ణనము-నారీధర్మకథనము-అను రెండువందలఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page