Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః
అథ దండప్రణయనమ్
పుష్కర ఉవాచ :
దండప్రణయనం వక్ష్యే యేనరాజ్ఞః పరాగతిః | త్రియవం కృష్ణలం విద్ధి మాషస్తత్పఞ్చాకంభ##వేత్. 1
కృష్ణలానాం తథాషష్ట్యాకర్షార్ధం రామకీర్తితమ్ | సువర్ణశ్చ వినిర్దిష్టో రామ షోడశమాషకః. 2
నిష్కః సువర్ణాశ్చత్వారో ధరణం దశభిస్తుతైః | తామ్రరూప్య సువర్ణానాం మానమేతత్ర్పకీర్తితమ్. 3
పుష్కరుడు పలికెను : రామా! రాజుకు ఉత్తమగతినిచ్చు దండనీతిప్రయోగమును గూర్చి చెప్పెదను. మూడు యవలు ఒక కృష్ణలము. ఐదుకృష్ణలములు ఒక మాషము అరువది కృష్టలములు అర్థకర్షము. పదునారు మాషములు ఒక సువర్ణము. నాలుగు సువర్ణములు ఒక నిష్కము. పది నిష్కములు ఒక ధరణము. ఇవి రాగి, వెండి, బంగారము తూచుమానములు.
తామ్రికైః కార్షికో రామప్రోక్తః కర్షాపణోబుధైః | ప్రణానాంద్వేశ##తేసార్ధం ప్రథమః సాహసఃస్మృతః. 4
మధ్యమః పంచవిజ్ఞేయః సహస్రమపిచోత్తమః | చోరైరమూషితో యస్తు మూషితో7స్మీతిభాషతే. 5
తత్ర్పదాతరి భూపాలే నదండ్యస్తావదేవతు | యోయావద్విపరీతార్థం మిత్యావాయోవదేత్తుతమ్. 6
తౌ నృపేణహ్యధర్మజ్ఞౌ దాప్యౌ తద్ద్విగుణం దమమ్ |
కూటసాక్ష్యం తు కుర్వాణాం స్త్రీన్వర్ణాంశ్చ ప్రదాపయేత్. 7
వివాసయేద్ర్బాహ్మణం తు భోజ్యోవిధిర్నహీరితః | నిక్షేపస్య సమం మూల్యం దండ్యోనిక్షేపభుక్తథా. 8
వస్త్రాదికస్య ధర్మజ్ఞ తథాధర్మో న హీయతే | యో నిక్షేపం మాతయతి యశ్చానిక్షిప్యయాచతే. 9
తావుభౌ చౌరవచ్ఛాస్యౌ దండ్యౌవాద్విగుణందమమ్ |
ఆజ్ఞానాద్యః పుమాన్కుర్యాత్పర ద్రవ్యస్యవిక్రయమ్. 10
నిర్దోషో జ్ఞానపూర్వం తు చౌరవద్ధండ మర్హతి | మూల్యమాదాయ యః శిల్పం నదద్యాద్దండ్య ఏవసః. 11
ప్రతిశ్రుత్యాప్రదాతారం సువర్ణం దండయేన్నృపః | భృతిం గృహ్యనకుర్యాద్యః కర్మాష్టౌ కృష్ణలాదమః. 12
ఆకాలేతు త్యజన్భృత్యం దండ్యఃస్యాత్తావదేవతు | క్రీత్వా విక్రీయవా కించిద్యస్యేహాసుశయోభ##వేత్. 13
సో7తర్ధశాహాత్తత్స్వామీ దద్యాచ్చైవాదదీతచ | పరేణతు దశాహస్య నాదద్యాన్నైవ దాపయతే. 14
పరశురామా! ఒక తామ్రకర్షమునకు విద్వాంసులు ''కార్షికము'' కార్షాపణము అని పేరు పెట్టినారు. రెండువందల ఏబది పణములు దండమునకు ప్రథమసాహసదండమని పేరు. ఐదువందల పణములదండము మధ్యమసాహసము. వెయ్యిపణములదండము ఉత్తమసాహసము. చోరుడు తన ధనమును అపహరించకపోయినను అపహరించినట్లు అసత్యముగా రాజుతో చెప్పి రాజునుంచి అపహరించిన ధనమును పొందుటకై ఎవ్వడైన ప్రయత్నించినపుడు ఆతడు అసత్యము చెప్పినట్లు నిర్ధారణమైనచో అట్లు అసత్యము చెప్పినదానినుండి అంతధనమును దండముగా గ్రహించవలెను. దొంగతనమునందు పోయిన ధనమునకు బదులు ఎక్కువగా ఎవడైన చెప్పినచో అతనినుండియు, ఎంత అసత్యముగాచెప్పునో వానినుండియురాజు రెట్టింపు ధనము దండరూపమున వసూలు చేయవలెను; ఎందుచేతననగా వారిరువురును ధర్మమును పాటించలేదు. కపటసాక్ష్యము చెప్పుక్షత్రియ - వైశ్య - శూద్రులను కఠినముగా శిక్షించవలెను. బ్రాహ్మణుని మాత్రము రాజ్యమునుండి వెడలగొట్టవలెను ఆతనికి మరొక దండమేదియు విధింపబడలేదు. ఓధర్మజ్ఞా! కుదువబెట్టిన దానిని అపహరించినవానినుండి కుదువబెట్టిన వస్త్రాదులమూల్యమెంతయుండునో అంత దండరూపమున అపహరించినచో ధర్మహాని కలుగదు. కుదువబెట్టినదానిని పోగొట్టినవానిని, కుదువబెట్టకుండగనే వస్తువునిమ్మని అడుగువానినికూడ దొంగనువలె శిక్షించవలెను లేదా రెట్టింపు ధనమును దండముగా వసూలు చేయవలెను. ఎవ్వడైన ఇతరుల వస్తువును తెలియక అమ్మివేసినను అతడు నిర్ధోషిగ పరిగణింపబడును. కాని తెలిసి ఇతరుల వస్తువులను తెలియక అమ్మివేసినను అతడు నిర్ధోషిగ పరిగణింపబడును. కాని తెలిసి ఇతరుల వస్తువులను తన వస్తువులని చెప్పి అమ్మినవానిని దొంగనువలె శిక్షంచవలెను. ఇచ్చెదనని చెప్పి ఇవ్వని వానిని రాజు ఒక సువర్ణము దండించవలెను. కూలి తీసుకొని పనిచేయనివానిపై ఎనిమిది కృష్ణలములు జుర్మానా వేయవలెను. ఆసమయమునందు భృత్యుని విడచివేయువానిపై కూడ అంతదండమే వేయవలెను. ఏదైన ఒక వస్తువును కొన్న తరవాతగాని, అమ్మినతరవాతగాని పశ్చాత్తాపము కలిగినచో అమ్మినవారు పదిరోజులలోగా అమూల్యము తిరిగిఇచ్చివేసి వస్తువును మరల తీసికొనవచ్చును. కొన్నవారు వస్తువును తిరిగి ఇచ్చివేసి తన ధనమును పొందవచ్చును. పదిదినములు దాటినచో ఈ ఆదానప్రదానములు కుదరవు. అనుచితములగు ఆదానప్రదానములు చేయువారిని రాజు ఆరువందలుదండము వేయవచ్చును.
ఆదదద్ది దదచ్చైవ రాజ్ఞాదండ్యః శతానిషట్ |
పరే దోషానవిఖ్యాప్యయః కన్యాం వరయేదిహ. 15
దత్తాప్యదత్తా సాతస్యరాజ్ఞాదండ్యః శతద్వయమ్ | ప్రదాయకన్యాం యో7న్యసై#్మపునస్తాం సంప్రయచ్ఛతి.
దండః కార్యో నరేంద్రేణ తస్యాప్యుత్తమసాహసః | సత్కఙ్కారేణ వాచా చ యుక్తం పుణ్యమసంశయమ్.
లుబ్ధో7న్యత్ర చ విక్రేతా షట్ఛతం దండమర్హతి | దద్యాద్ధేనుం నయఃపాలో గృహీత్వా భక్తవేతనమ్. 18
సతుదండ్యః శతం రాజ్ఞాసువర్ణంవాప్యరక్షితా | ధనుః శతం పరీణాహో గ్రామస్యతు సమన్తతః. 19
ద్విగుణం త్రిగుణం వాపి నగరస్య చ కల్పయేత్ | వృతిం తత్ర ప్రకుర్విత యాముష్ట్రోనావలోయేత్.
తత్రాపరివృతేధాన్యే హింసితే నైవదండనమ్ | గృహం తటాక మా రామం క్షేత్రం వా భీషయాహరన్. 21
శతాని పంచ దండ్యః స్యాదజ్ఞానాద్ద్విశతీదమః | మర్యాదాభేదకాః సర్వేదండ్యాః ప్రథమహసాహసమ్. 22
శతం బ్రాహ్మణమాక్రుశ్య క్షత్రియో దండమర్హతి | వైశ్యశ్చ ద్విశతం రామ శూద్రశ్చ వధమర్హతి. 23
పంచాశ్చద్ర్బాహ్మణో దండ్యః క్షత్రియస్యాభిశంసనే | వైశ్యే వాప్యర్థ పంచాశచ్ఛూద్రే ద్వాదశకో దమః. 24
క్షత్రియస్యాప్నుయాద్వైశ్యః సాహసం పూర్వమేవతు |
శూద్రః క్షత్రియమాక్రుశ్యజిహ్వాచ్ఛేదనమాప్నుయాత్. 25
ధర్మోపదేశం విప్రాణాం శూద్రః కుర్వంశ్చ దండభాక్ | శ్రుతదేశాదివితథీదాప్యో ద్విగుణసాహసమ్. 26
ఉత్తమః సాహసస్తస్యయః పాపైరుత్తమాన్షిపేత్ | ప్రమాదాద్యైర్మయా ప్రోక్తం ప్రీత్యాదండార్ధమర్హతి. 27
మాతరం పితరం జ్యేష్ఠం భ్రాతరం శ్వశురం గురుమ్ | అక్షారయఞ్చతం దండ్యః పంథానం చాదదద్గురోః.
అంత్యజాతిర్ద్విజాతింతు యేనాఙ్గేనా పరాధ్నుయాత్ | తదేవ ఛేదయేత్తస్య క్షిప్రమేవావిచారయన్. 29
అవనిష్ఠీవతో దర్పాద్ద్వావోష్ఠౌ ఛేదయేన్నృపః | అపమూత్రయతో మేఢ్రమపశబ్ధయతో గుదమ్. 30
ఉత్కృష్టాసన సంస్థస్య నీచస్యాధో నికృన్తపమ్ | యో యదఙ్గం చ రుజయేత్తదఙ్గం తస్యకర్తయేత్. 31
అర్ధపాదకరాః కార్యాగోగజాశ్వోష్ట్రఘాతకాః | వృక్షంతు విఫలం కృత్వా సువర్ణం దండమర్హతి. 32
ద్విగుణం దాపయేచ్ఛిన్నేపధిసీమని జలాశ##యే | ద్రవ్యాణీ యో హరేద్యస్య జ్ఞానతో7జ్ఞానతో7పివా. 33
స తస్యోత్పాద్య తుష్టింతు రాజ్ఞేదద్యాత్తతో దమమ్ |
యస్తు రజ్జుం ఘటం కూపాద్ధరేచ్ఛిన్ద్యాచ్చతాం ప్రపామ్. 34
వరునిలో ఉన్న దోషములను చెప్పక కన్యావరణము చేసినవానికి కన్యకనిచ్చెదమని మాట ఇచ్చినను ఇవ్వనట్లే అగును. రాజు అట్టి వానిపై రెండు వందల దండము విధించవలెను. కన్యను ఒకనికిచ్చెదనని మాట ఇచ్చి మరొకనికి ఇచ్చిన వానిపై ఉత్తమసాహస దండము విధించవలెను. నోటితో చెప్పిన దానిని కార్యరూపమున చేసినచో తప్పక పుణ్యము లభించును. ఏదైన ఒక వస్తువును ఒకచోట ఇచ్చెదనని చెప్పి లోభముచే మరొకరికి అమ్మినవానికి ఆరు వందల దండము. యజమాని నుండి భోజనవ్యయము, జీతము తీసికొని కూడ ఆతని ఆవును అతనికి అప్పగించని లేదా ఆవును పోషించని గొల్లవానిని నూరుసువర్ణములచే దండించవలెను. గ్రామమునకు నలువైపుల నూరు ధనుస్సుల పరిధి యందును, నగరమునకు రెండువందల ధనుస్సుల పరిధి యందును వ్యవసాయము చేయవలెను. అది నిలచి ఉన్న ఒంటెకు కనబడనంతదూరమున ఉండవలెను. కంచెలేని చేనులోని సస్యమునకు ఎవరినుండియైన హాని కల్గినను అతనిని దండించరాదు. ఇతరులను భయపెట్టి, వాని ఇళ్లు, చెరువులు,తోటలు, పొలములు కాజేయ ప్రయత్నించు వారికి ఐదువందల దండము. అతడు తెలియక చేసినచో రెండువందల మాత్రమే దండము. సరిహద్దులు మార్చివేయు వారికి ప్రథమ సాహసదండము.
పదండం ప్రాప్నుయాన్మాసం దండ్యః స్యాత్ర్పాణితాడనే |
ధాన్యం దశభ్యః కుంభేభ్యో హరతోభ్యధికం వధః. 35
శేషే7ప్యేకాదశగుణం తస్యదండం ప్రకల్పయేత్ | | సువర్ణ రజతాదీనాం నృస్త్రీణాం హరణవదః. 36
యేనయేన యథాఙ్గేనస్తేనోనృషు విచేష్టతే | తత్తదేవ హరేదస్య ప్రత్యాదేశాయ పార్థివః. 37
బ్రాహ్మణః శాకధాన్యాది హ్యల్పం గృహ్ణన్న దోషభాక్ |
గోదేవార్ధ హరంశ్చాపి హన్యాద్థుష్టం వధోద్యతమ్. 38
గృహక్షేత్రాప హర్తారం తథా పత్న్యభిగామినమ్ | అగ్నిదం గరదం హన్యాత్తథా చాభ్యుదయతాయుధమ్.
పరశురామా! బ్రాహ్మణునిఅవమానించు క్షత్రియునకు నూరు, వైశ్యునకు రెండువందల జుర్మానా విధించవలెను; శూద్రుని కారాగారములో నుంచవలెను. బ్రాహ్మణుడు, క్షత్రియునిపై దోషారోపణము చేసినచో ఏబది, వైశ్యునిపై చేసినచో ఇరువదియైదు, శూద్రునిపై చేసినచో పండ్రెండు దండము. వైశ్యుడు క్షత్రియుని అవమానించినచో ప్రథమసాహసదండము. శూద్రుడు క్షత్రియుని తిట్టినచో అతని నాలుకకు శిక్ష ఇవ్వవలెను. బ్రాహ్మణునకు ఉపదేశము చేయు శూద్రుడు కూడ దండార్హుడు. అసత్యముగా తన దేశమును గూర్చి, శాస్త్రజ్ఞానమును గూర్చి అసత్యము చెప్పువానికి రెట్టింపు సాహసదండము. శ్రేష్ఠ పురుషులను గూర్చి వారు పాపాచారవంతులని చెప్పి నిందించు వానికి ఉత్తమ సాహసదండము. ''నేను పొరబాటున ఇట్లు చెప్పినాను'' అని అనుచు అతడు ప్రేమను ప్రకటించినచో సగము దండము. తలిదండ్రులు, అన్న, మామ, గురువు వీరిపై నిందారోపము చేయువానికిని పెద్ద వారికి దారి ఇవ్వనివానికిని, నూరు దండము. ఒకడు తన ఏ అవయవముచే, పెద్దవారి విషయమున అపరాధము చేయునో ఆతని ఆ అవయవమును నిస్సందేహముగ వెంటనే ఖండించి వేయవలెను. గర్వాంధుడై ఉత్తమపురుషుని వైపు ఉమ్మివేసిన వాని పెదవులు ఖండించివేయవలెను. అట్లే ఉత్తమ పురుషునివైపు తిరిగి మూత్రము పోయువాని లింగమును, ఆతని వైపు పృష్ఠము పెట్టి, అపానశబ్దము చేయువాని గుదమును ఛేదించవలెను. ఉన్నతాసనముపై కూర్చున్న నీచుని శరీరము క్రింది భాగమునందు దండము ఇవ్వవలెను. ఒకడు ఇతరుల ఏ అవయవమును గాయపరచునో అతని ఆ అవయవమును ఖండించి వేయవలెను. గోవు, ఏనుగు, అశ్వము, ఒంటె వీటికి హాని కలిగించువాని సగము చేతులు సగము కాళ్ళు ఖండించివేయవలెను. ఇతరుల వృక్షముల పండ్లు కోసినవానికి ఒక సువర్ణము దండము. మార్గమును, పొలము సరిహద్దును, జలాశయాదికమును ఖండించి నష్టము కలుగ చేసిన వానికి ఎంతనష్టము కలిగినదో దానికి రెట్టింపు దండము. తెలిసికాని, తెలియక కాని ఇతరుల ధనము అపహరించిన వాడు ముందు ఆతని కాధనము తిరిగి ఇచ్చి వేసి, ఆతనిని సంతోషపెట్టవలెను. పిమ్మట రాజుకు కూడ జుర్మానా చెల్లించవలెను. నూతి నుండి ఇతరుల త్రాడు, పాత్ర, అపహరించిన వానికిని, చలివెందలి పాడు చేసిన వానికిని ఒక మాసముకైదు శిక్ష. ప్రాణులను చంపిన వానికి గూడ ఇదియే శిక్ష. పదిఘటముల ధాన్యమునకు మించిన ధాన్యమును అపహరించిన వానికి ప్రాణదండము. పది ఘటములలోపు ధాన్యము అపహరించిన వానికి ఎన్ని ఘటములు అపహరించబడినవో వాటికి పండ్రెండు రెట్లు దండము. బంగారమును, వెండిని, స్త్రీలను, పురుషులను అపహరించిన వానికి మరణదండము. చౌరుడు ఏ ఏ అవయవములతో మనుషులకు ప్రతికూలముగా ప్రవర్తించునో ఆయా అవయవములను నిర్దాక్షిణ్యముగ ఖండించవలెను. ఇట్లు చేయుటచే చోరులకు బుద్ధివచ్చును. బ్రాహ్మణుడు చాల కొంచెము శాకమును, ధాన్యమును గ్రహించినచో ఆతడు దోషికాడు. గోసేవ కొరకను, దేవపూజ కొరకును ఏదైన వస్తువును తీసికొనిన బ్రాహ్మణుడు కూడ దండ్యుడు కాడు. ఎవరినైన చంపనుద్యమించు దుష్టుని వధించవలెను. ఇతరుల గృహక్షేత్రముల నపహరించిన వానికిని, పరభార్యాసంగము చేసినవానికిని, ఇంటికి నిప్పు అంటించిన వానికిని, విషము పెట్టిన వానికిని, ఆయుధముతో చంపుటకై వచ్చిన వానికిని మరణదండము తగినది.
రాజాగవాభిరాచాద్యం హన్యాచ్చైవాతతాయినః | పరస్త్రీయం న భాషేత ప్రతిషిద్ధోవిశేన్న హి. 40
అదండ్యాస్త్రీ భ##వేద్రాజ్ఞా వరయన్తీపతిం స్వయమ్ | ఉత్తమాం సేవమానః స్త్రీం జఘన్యోవదమర్హతి. 41
భర్తారం లంఘయేద్యాతాం శ్వభిః సంఘాత యేత్త్సియమ్ |
సవర్ణదూషితాం కుర్యాత్పిండ మాత్రోవ జీవినీమ్. 42
జ్యాయసా దూషితా నారీ ముండనం సమవాప్నుయాత్ | వైశ్యాగమే తు విప్రస్య క్షత్రియస్యాన్త్యజాగమే.
క్షత్రియః ప్రథమం వైశ్యో దండ్యః శూద్రాగమే భ##వేత్ | గృహీత్వా వేతనం వేశ్యా లోభాదన్య తగచ్ఛతి.
వేతనం ద్విగుణం దద్యాద్ధండం చ ద్విగుణం తథా |
భార్యా పుత్రాశ్చ దాసాశ్చ శిష్యో భ్రాతా చ సోదరః. 45
కృతాపరాధాస్తాఢ్యాః స్యూరజ్జ్వా వేణుదలేనవా | పృష్ఠేన మస్తకే హన్యా చ్చౌరస్యాప్నోతి కిల్బిషమ్. 46
గోవులను చంపిన వానిని, అతతాయులను రాజు వధించవలెను. పరస్త్రీతో సంభాషణము చేయరాదు. వలదన్న ఇతరుల ఇండ్లలోనికి పోరాదు. స్వేచ్ఛానుసారము పతిని వరించు స్త్రీ రాజుచే దండ్యురాలు కాదు. కాని నీచవర్ణ పురుషుడు ఉచ్చవర్ణస్త్రీ సమాగమము చేసినచో అతడు వధ్యుడు. తన భర్తను కాదని వ్యభిచరించిన స్త్రీని కుక్కలచే కరిపించవలెను. సజాతీయుడగు పరపురుషునిచే దూషితురాలగు స్త్రీకి బ్రతుకుటకు మాత్రము అన్నము పెట్టవలెను. భర్త అన్నగారితో వ్యభిచరించిన స్త్రీ తలగొరిగించవలెను. బ్రాహ్మణుడు వైశ్య స్త్రీ తోడను, క్షత్రియుడు, నీచజాతిస్త్రీ తోడను సమాగమము చేసినచో వారికి కూడ ఇదియే దండము. శూద్ర స్త్రీ తో వ్యభిచరించిన క్షత్రియ వైశ్యులకు ప్రథమ సాహసదండము. వేశ్యాస్త్రీ ఒకని నుండి వేతనము తీసికొని, లోభముచే మరొకనితో వెళ్లినచో ఆమె రెట్టింపు వేతనము తిరిగి ఇచ్చివేసి, రెట్టింపు దండముగా చెల్లించవలెను. స్త్రీ, పుత్రుడు, దాసుడు, శిష్యుడు, సహోదరుడు మొదలగు వారు అపరాధము చేసినచో వారిని త్రాటితో గాని, వెదురు బెత్తముతోగాని కొట్టవలెను. వీపుమీదనే కొట్టవలెను కాని తలపై కొట్టకూడదు. తలపై కొట్టువానిని చోరుని దండించినట్లు దండించవలెను.
రక్షాస్వధికృతైర్యస్తు ప్రజాభ్యోర్థో విలుప్యతే | తేషాం సర్వస్వమాదాయ రాజా కుర్యాత్ర్పవాసనమ్. 47
యేనియుక్తాః స్వకార్యేషు హన్యుః కార్యాణికర్మిణామ్ | నిర్ఘృణాః క్రూరమనసస్తాన్నిఃస్వాన్కారయేన్నృపః
అమాత్యః ప్రాడ్వివాకో వా యః కుర్యార్కార్యమన్యథా | తస్య సర్వస్య మాదాయ తం రాజావిప్రవాసయేత్.
గురుతల్పే భగః కార్యః సురాపానే సురాధ్వజః | స్తేయేషు శ్వపదం విద్యాద్ర్బహ్మ హత్యాశిరః పుమాన్. 50
శూద్రాదీన్ఘాతయేద్రాజా పాపాన్విప్రాన్ర్పవాసయేత్ | మహాపాతకినాం విత్తం వరుణాయోపపాదయేత్. 51
గ్రామేష్వపి చ యేకేచిచ్చౌరాణాం భక్తదాయకాః | భాండార కోశ దాశ్చైవ సర్వాంస్తానపి ఘాతయేత్. 52
రాష్ట్రేషు రాష్ట్రాధి కృతాన్సామంతాన్పాపినో హరేత్ |
సంధిం కృత్వా తు యే చౌర్యం రాత్రౌకుర్వంతి తస్కరాః. 53
తేషాం ఛిత్త్వా నృపో హస్తౌతీక్‌ష్ణే శూలేనివేశ##యేత్ | తటాక దేవతా గార భేదకాన్ ఘాతయేన్నృపః. 54
సముత్సృజేధ్రాజమార్గే యస్త్వమేధ్యమనాపది | సహికార్షాపణం దండ్యస్తమమేధ్యం చ శోధయేత్. 55
ప్రతిమాసంక్రమభిదోదద్యుః పంచశతాని తే | సమైశ్చ విషమం యో వా చరతే మూల్యతో7పివా. 56
నమాప్నుయాన్నరః పూర్వం దమం మధ్యమమేవవా | ద్రవ్యమాదాయ వణిజామనర్ఘేణావరుంధతామ్. 57
రాజాపృథక్పృథక్ కుర్యాద్దండముత్తమసాహసమ్ | ద్రవ్యాణాం దూషకోయశ్చ ప్రతిచ్ఛన్ధక విక్రయీ. 58
మధ్యమం ప్రాప్నుయాద్ధండం కూటకర్తా తథోత్తమమ్ | కలహాపకృతం దేయం దండశ్చ ద్విగుణస్తతః. 59
అభక్ష్యభ##క్ష్యే విప్రేవా శూద్రేవా కృష్ణలోదమః | తులాశాసనకర్తాచ కూట కృన్నాశకస్య చ. 60
ఏభిశ్చ వ్యవహర్తాయః స దాప్యో దమముత్తమమ్ | విషాగ్నిదాం ప్రతిగురు విప్రాపత్యప్రమాపిణీమ్. 61
వికర్ణకరనాసౌష్ఠీం కృత్వా గోభిః ప్రవాసయేత్ | క్షేత్రవేశ్మగ్రామవనవిదారకాస్తథా నరాః. 62
రాజపత్న్యభిగామీ చ దగ్ధవ్యస్తు కటాగ్నినా | ఊనం వాప్యధికం వాపి లిఖేద్యోరాజశాసనమ్. 63
పారజాయక చౌరౌ చ ముఞ్చతో దండ ఉత్తమః | రాజయానాసనారోఢుర్దండ ఉత్తమ సాహసః. 64
యో మన్యేతాజితో7స్మీతిన్యాయేనాపి పరాజితః | తమాయాన్తం పరాజిత్య దండయేద్ద్విగుణం దమమ్. 64
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దండప్రణయనం నామ సప్తవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.
రక్షాకార్యనియుక్తుడై ప్రజలసొమ్ము దోచుకొను వాని సర్వస్వము లాగికొని రాజ్యమునుండి వెడల గొట్టవలెను. ఎవరిచేతనైన ఒక పనిచేయుటకై నియుక్తుడై అకార్యము పాడు చేసిన క్రూరుని సర్వస్వమును లాగివేయవలెను. మంత్రి గాని, న్యాయాధీశుడు గాని, స్వకర్తవ్యమునకు భిన్నముగ చేసినచో వాని సర్వస్వమును లాగికొని రాజ్యమునుండి వెడల గొట్టవలెను. గురుపత్నీ గమనము చేసిన వాని శరీరము మీద భగచిహ్నము వేయవలెను. సురాపానము చేసిన మహాపాపాత్ముని శరీరము మీద కల్లు దుకాణాం జండా గుర్తువేయవలెను. దొంగతనము చేసన వాని శరీరముపై కుక్క గోళ్ళ గుర్తువేయవలెను. బ్రహ్మహత్య చేసినవాని లలాటము మీద కపాలచిహ్నము చేయవలెను. రాజు పాపాత్ములను వధించి వేయవలెను. బ్రాహ్మణులైనచో దేశము నుండి వెడలగొట్టవలెను. మహాపాతకుల ధనమును వరుణునకు సమర్పించవలెను. (నీటిలో పారవేయవలెను). గ్రామాలలో చోరులకు భోజనముపెట్టి, దొంగిలించిన సొమ్ము దాచుకొనుటకు ఇల్లు ఇచ్చిన వారి నందరిని వధించవలెను. తన రాజ్యమునందు ఏదైన అధికారమునందు నియుక్తులైన సామంతరాజులు పాపము చేసినచో, రాజు వారిని అధికారము నుండి తొలగించవలెను. కన్నము త్రవ్వి దొంగతనము చేయువాని చేతులు నరికి, తీక్‌ష్ణమగు శూలముపై ఎక్కించవలెను. సరస్సులు, దేవమందిరములు పాడు చేసిన వారికి గూడ ఇట్లే మరణదండము ఇవ్వవలెను. ఆపత్సమయము కాక పోయినను, మార్గమునందు మలమూత్రాద్యపవిత్ర వస్తువులను పోయువానికి కార్షాపణ దండము విధించి, వానిచేతనే ఆ మలమూత్రాదులు ఎత్తించి శుభ్రము చేయించవలెను. ప్రతిమలను, మెట్లను విరగగొట్టిన వానికి ఐదువందల కర్షముల దండము. తనతో సమముగా ప్రవర్తించు వారి విషయమున విషమముగా ప్రవర్తించు వానికిని, వస్తువుల మూల్యమును చాల ఎక్కువగా పెంచివేయువానికి మధ్యమ సాహసదండము. వర్తకుని నుండి బహుమూల్యములగు వస్తువుల తీసికొని మూల్యమును చెల్లించని వారికి అందరికిని ఒక్కొక్కరికి ఉత్తమ సాహసదండము. మంచి వస్తువులలో చెడ్డవస్తువులు కలిపి ఇష్టము వచ్చిన ధరకు అమ్ము వర్తకునకు మధ్యమ సాహసదండము. మోసము చేయువానికి ఉత్తమసాహస దండము. కలహపూర్వకముగా అపకారము చేయు వానికి దానికి రెట్టింపు దండము. అభక్ష్యభక్షణము చేయు బ్రాహ్మణునకును, శూద్రునకును ఒక కృష్ణలము దండము. తప్పుడు తూకము తూచు వానికిని, మోసగానికిని, గ్రాహకులకు నష్టము కలిగించు వానికిని, అట్టి వారితో వ్యవహారము చేయు వానికిని ఉత్తమసాహస దండము. విషము పెట్టు వానిని, ఇంటికి నిప్పు అంటించు వానిని, పతి - గురు- బ్రాహ్మణ - సంతానము హత్య చేసిన దానిని చేతులు, ముక్కు, చెవులు, పెదవులు ఖండించి, ఎద్దుపై కూర్చుండబెట్టి రాజ్యమునుండి వెడలగొట్టవలెను. పొలము ఇల్లు, గ్రామము, అడవి -వీటిని నశింపచేసినవారిని, గడ్డితుక్కు నిప్పులో పడవేయవలెను. రాజాజ్ఞను పెంచిగాని తగ్గించిగాని వ్రాయువానికిని, పరస్త్రీగమనము చేసినవారిని, చోరులను శిక్షించక విడుచువానికిని ఉత్తమ సాహస దండము. రాజవాహనముపైనను, రాజాసనము పైనను కూర్చున్న వానికి గూడ ఉత్తమ సాహసదండము. పరాజితుడైనను అపరాజితుడనని చెప్పుకొనువాడు ఎదుటకు వచ్చినపుడు వానిని మరల జయించి, రెట్టింపు దండము విధించవలెను. ఆమంత్రితుడు కాని వానిని పిలచుకొనివచ్చు వాడు వధ్యుడు. దండించు పురుషుని నుండి తప్పించుకొని పారిపోవు అపరాధి పురుషార్థ విహీనుడు. అట్టి పిరికి వారికి శారీరకదండమునకు బదులు ధన దండమును విధించవలెను.
అగ్ని మహాపురాణమునందు దండప్రణయన కథనమను రెండువందల ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.
అ (6)