Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తత్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః
అథ శ్రీస్తోత్రమ్
పుష్కర ఉవాచ :
రాజలక్ష్మీ స్థిరత్వాయ యథేంద్రేణ పురాశ్రియః | స్తుతిః కృతాతథారాజా జయార్థం స్తుతిమాచరేత్. 1
ఇంద్ర ఉవాచ :
నమస్యే సర్వలోకానాం జననీ మబ్ది సంభవామ్ | శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షఃస్థలస్థితామ్. 2
త్వం సిద్ధిస్త్వం స్వధాస్వాహా సుధాత్వం లోకపావని | సంధ్యారాత్రిః ప్రభాభూతిర్మేధాశ్రద్ధా సరస్వతీ. 3
యజ్ఞవిద్యామహావిద్యా గుహ్య విద్యా చ శోభ##నే | ఆత్మ విద్యా చ దేవి త్వంవిముక్తి ఫలదాయినీ. 4
ఆన్వీక్షికీత్రయీ వార్తా దండనీతిస్త్వమేవచ | సౌమ్యాసౌమ్యైర్జరద్రూపైస్త్వయైతద్దేవిపూరితమ్. 5
కాత్వన్యా త్వామృలేదేవి సర్వయజ్ఞమయంవపుః | అధ్యాస్తేదేవదేవస్య యోగిచింత్యం గదాభృతః. 6
త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయమ్ | వినష్టప్రాయమభవత్త్వయేదానీం సమేధితమ్. 7
దారాః పుత్రాస్తథాగారం సుహృద్ధాన్య ధనాదికమ్ | భవన్త్యేతన్మహాభాగే నిత్యంత్వద్వీక్షణాన్నృణామ్. 8
శరీరారోగ్యమైశ్వర్య మరిపక్షక్షయః సుఖమ్ | దేవి త్వద్దృష్టి దృష్టానాం పురుషాణాం నదుర్లభమ్. 9
త్వమంబా సర్వభూతానాం దేవదేవోహరిః పితా | త్వయైతద్విష్ణునా చామ్బ జగద్వ్యాప్తం చరాచరమ్. 10
మానః క్రోశం తథాగోష్ఠం మాగృహం మాపరిచ్ఛదమ్ | మా శరీరం కలత్రంచ త్యజేథాః సర్వపావని. 11
మా పుత్రాన్మా సుహృద్వర్గాన్మా పశూన్మా విభూషణమ్ | త్యజేథా మమదేవస్య విష్ణోర్వక్షస్థలాలయే. 12
సత్త్వేన సత్యశౌచాభ్యాం తథాశీలాదిభిర్గుణౖః | త్యజన్తే తే నరాః సద్యః సన్త్యకాయె త్వయామలే. 13
త్వయావలోకితాః సద్యః శీలాద్యైరఖిలైర్గుణౖః | కులైశ్వరైశ్చ యుజ్యన్తే పురుషానిర్గుణా అపి. 14
నశ్లాఘ్యః సగుణీ ధన్యః సకులీనః సబుద్ధిమాన్ | సశూరః సచవిక్రాన్తో యస్త్వయాదేవి వీక్షితః. 15
సద్యోవైగుణ్యమాయాంతి శీలాద్యాః సకలాగుణాః | పరాఙ్‌ముఖీ జగద్ధాత్రీ యస్యత్వం విష్ణువల్లభే. 16
నతేవర్ణయితుంశక్తా గుణాఞ్ణిహ్వాపి వేధసః | ప్రసీదదేవి పద్మాక్షిమాస్మాంస్త్యాక్షీః కదాచన. 17
పుష్కర ఉవాచ :
ఏవం స్తుతా దదౌ శ్రీశ్చ వరమింద్రాయ చేప్సితమ్ | సుస్థిరత్వేచ రాజ్యస్య సంగ్రామ విజయాదికమ్. 18
స్వస్తోత్ర పాఠశ్రవణ కర్తౄణాం భుక్తిముక్తిదమ్ | శ్రీస్తోత్రం సతతం తస్మాత్పఠేచ్చ శృణుయాన్నరః.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శ్రీస్తోత్రం నామ సప్తత్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః.
పుష్కరుడు పలికెను : పూర్వము తన రాజ్యలక్ష్మిని స్థిరముగా ఉంచుకొనుటకై ఇంద్రుడేవిధముగ లక్ష్మిస్తవము చేసెనో అట్లే రాజు విజయము కొరకు లక్ష్మీస్తవము చేయవలెను. ఇంద్రుడు పలికెను : సకలలోక జననియు, సముద్రసంభవయు, వికసితకమలనేత్రయు, విష్ణువక్షఃస్థితయు అగు లక్ష్మికి నమస్కారము. ఓ లోకపావనీ! నీవే సిద్ధివి; స్వాహా - స్వధా -సంధ్యా- రాత్రి - ప్రభా - భూతి - మేధా - శ్రద్ధా సరస్వతీ రూపిణివి. ప్రకాశించు దానవు. ముక్తిరూపఫలదాత్రివి అగు ఓ దేవీ! యజ్ఞవిద్య, మహావిద్య, గుహ్మవిద్య, ఆత్మవిద్య, ఆన్వీక్షికి, త్రయి, వార్త, దండనీతి కూడ నీవే. నీవు సౌమ్యురాలవు, నీతో నిండిన ఈ జగత్తు కూడ సౌమ్యమైనది. దేవీ! గదాధారియైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క సర్వయజ్ఞ స్వరూపము, యోగులచే ధ్యానింపబడునది అయిన శరీరమును నీవు తప్ప ఎవరు అధిష్ఠించగలరు? దేవి! నీవు విడచినంతనే ఈ భువనత్రయము వినష్టమైపోయినది. నీచే ఇపుడు పోషింపబడుచున్నది. మహాదేవీ! నీ దృష్టిపడగనే మానవులకు భార్య, పుత్రులు, గృహము, స్నేహితులు, ధాన్యము, ధనము మొదలగునవి నిత్యము లభించును. నీ దృష్టిచే చూడబడిన పురుషులకు ఆరోగ్యము, ఐశ్వర్యము. శత్రుపక్షవినాశనము, సుఖము-ఇవన్నియు దుర్లభములు కావు. సర్వభూతములకును నీవే తల్లివి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు తండ్రి. ఈ చరాచర జగత్తునంతను, నీవు, శ్రీమహావిష్ణువు వ్యాపించి యున్నారు. ఓ సర్వపావనీ! నీవెన్నటికిని, నా కీర్తిని, ధనాగారమును, అన్నకోష్ఠమును, గృహమును, పరివారమును, శరీరమును, భార్యను విడచివెళ్ళకుము. శ్రీమహావిష్ణువు వక్షఃస్థలముపై నివసించుదానా! నా పుత్రులను, స్నేహితులను, పశువులను, అలంకారములను, విడచివెళ్ళకుము. ఓనిర్మలురాలా! నీచే విడువబడిన వారు, సత్యము చేతను, సమతాశౌచలము చేతను, శీలము మొదలగు గుణములచేతను పరిత్యజింపబడుదురు. నీచే చూడబడిన వారు నిర్గుణులైనను వారికి శీలాది సకల గుణములును, కలైశ్వర్యాదులును లభించును. ఓ దేవీ నాచే చూడబడినవాడే శ్లాఘ్యుడు, గుణవంతుడు ధన్యుడు. కులీనుడు, బుద్ధిమంతుడు. శూరుడు, విక్రాంతుడు, జగత్తును పోషించు ఓ విష్ణువల్లభా! నీవు ఎవని విషయమున పరాఙ్ముఖురాలవగుదువో ఆతని శీలాదిసకల గుణములును వెంటనే విగుణము లగును. బ్రహ్మదేవుని నాలుక గూడ నీ గుణములను వర్ణింపజాలదు. ఓ పద్మాక్షీ ! దేవీ ! అనుగ్రహింపుము. మమ్ములను ఎన్నడును విడువకుము. పుష్కరుడు పలికెను. ఈ విధముగ స్తుతింపబడిన లక్ష్మి ఇంద్రునకు కోరికను, రాజ్య స్థైర్యమును, యుద్ధ విజయాదులను అనుగ్రహించెను. తన స్తోత్రమును పఠించువారికిని, వినువారికిని భుక్తి ముక్తులను వరముగాప్రసాదించెను. అందుచే మానవుడు సర్వదా శ్రీస్తోత్రమును చదువవలెను. వినవలెను.
అగ్ని మహాపురాణమునందు శ్రీస్తోత్రవర్ణనమను రెండువందల ముప్పది ఏడవ అధ్యాయము సమాప్తము.