Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోన చత్వారింశ దధిక ద్విశతతమో7ధ్యాయః
అథ పునః శ్రీరాజధర్మాః
రామ ఉవాచ :
స్వామ్యమాత్యంచ రాష్ట్రంచ దుర్గం కోశో బలం సుహృత్ | పరస్పరోపకారీదం సప్తాఙ్గం రాజ్యముచ్యతే. 1
రాజ్యాఙ్గానాం వరం రాష్ట్రం సాధనం పాలయేత్సదా | కులం శీలం వయః సత్త్వం దాక్షిణ్యం క్షిప్రకారితా. 2
అవినంవాదితా సత్యం వృద్ధసేవాకృతజ్ఞతా | దైవ సంపన్నతా బుద్ధిరక్షుద్ర పరివారితా. 3
శక్యసామన్తతా చైవ తథా చ దృఢ భక్తితా | దీర్ఘదర్శిత్వముత్సాహః శుచితాస్థూలలక్షతా. 4
వినీతత్వం ధార్మికతా సాధోశ్చనృపతేర్గుణాః | ప్రఖ్యాత వంశ మక్రూరం లోకసంగ్రాహిణం
శుచిమ్. 5
కుర్యీతాత్మహితాకాంక్షీ పరివారం మహీపతిః |
శ్రీ రాముడు పలికెను : లక్ష్మణా ! స్వామి - అమాత్య - రాష్ట్ర - దుర్గ - కోశ - బల - సుహృత్తులనునవి పరస్పరోపకారములగు ఆరు అంగములు. వీటిలో రాజ - ఆమాత్యుల తరువాత ప్రధానమైనది రాష్ట్రము. అర్థసాధకము. అందుచే సర్వదా దానిని పాలించవలెను. కులీనత్వము, సత్త్వము, ¸°వనము, శీలము, దాక్షిణ్యము, శీఘ్రకారిత్వము, పూర్వపర విరుద్ధముగ మాటలాడుకుండుట, సత్యము, వృధ్ధసేవ, కృతజ్ఞత్వము, దైవానుకూల్య సంపాదనము, బుద్ధి, నీచపరివారము లేకుండుట, సమర్థులగు సామంతులు కలిగియుండుట, దృఢభక్తిత్వము, ముందుచూపు, ఉత్సాహము, చిత్తశుద్ధి, ఔదార్యము, వినయము, ధార్మికత్వము - ఇవి అభిగామికగుణములు, అభివృద్ధికోరు రాజు - సుప్రసిద్ధమగు కాలమునందు జనించినవారు, క్రౌర్యము లేనివారు, గుణవంతులు, పవిత్రులు అగు పురుషులను చేరదీసి తన పరివారము నందుంచుకొనవలెను.
వాగ్మీప్రగల్భః స్మృతిమానుదగ్రోబలవాన్వశీ. 6
నేతా దండస్యనిపుణః కృతశిల్పపరిగ్రహః | పరాభియోగప్రసహః సర్వదుష్టప్రతిక్రియా. 7
పరవృత్తాంతవేదీ చ సంధివిగ్రహతత్త్వవిత్ | గూఢమంత్ర ప్రచారజ్ఞో దేశకాల విభాగవిత్. 8
ఆదాతాసమ్యగర్థానాం వినియోక్తాచ పాత్రవిత్ | క్రోధలోభభయ ద్రోహ దంభ చాపలవర్జితః. 9
పరోపతాపవైశున్యమాత్సర్యేర్ష్యానృతాతిగః | వృద్ధోపదేశ సంపన్నః శక్తోమధుర దర్శనః. 10
గుణానురాగస్థితిమానాత్మసంపద్గుణాః స్మృతాః | కులీనాః శుచయః శూరాః శ్రుతవన్తో7ను రాగిణః. 11
దండనీతేః ప్రయోక్తారః సచివాః స్యుర్మహీపతేః |
వాగ్మి, ప్రగల్భుడు స్మరణభక్తి కలవాడు, ఎత్తైనవాడు, బలవంతుడు, జితేంద్రియుడు, సేనను నడవగల వాడు విద్యానిష్ణాతుడు, స్వరగ్రహుడు (పొరబాటున ప్రారంభించిన చెడుపని నుండి వెనుకకు మరలువాడు). పరాక్రమణము సహించగలవాడు, అన్నింటికిని ప్రతిక్రియ ఆలోచించ సమర్థుడు, శత్రువుల లోపములను కనిపెట్టువాడు, సంధివిగ్రహతత్త్వజ్ఞుడు, మంత్రణము గూఢముగా నుంచువాడు, దేశకాలవిభాగము ఎరిగినవాడు, ధనమును రాబట్టుకొనువాడు, తగువ్యయము చేయువాడు. సత్పాత్రలను ఎరిగినవాడు, క్రోధ - లోభ -భయ - ద్రోహ- స్తంభ (మొండితనము)-చాపల్యములను దోషములు లేనివాడు, పరపీడన - పైశున్య(చాడీలుచెప్పుట) - మాత్సర్య - ఈర్ష్యా - అసృతములను దుర్గుణములులేనివాడు, వృద్ధజనోపదేశానుసారము ప్రవర్తించువాడు, మధురభాషి, మధురదర్శనుడు, గుణానురాగి, మితభాషి, అయిన రాజు శ్రేష్ఠుడు. ఇవి రాజునకుండవలసిన ఆత్మసంపత్తికి సంబంధించిన గుణములు. ఉత్తమ కులసంజాతులు, బాహ్యాంతః శుద్ధులు, శౌర్యసంపన్నులు, అన్వీక్షక్యాదినిపుణులు, స్వామిభక్తులు, దండనీతి ప్రయోగకుశలులు అగు వారు రాజామాత్యులుగా ఉండుటకు యోగ్యులు.
సవిగ్రహో జనపదః కులశీల కలాన్వితః. 12
వాగ్మీ ప్రగల్భశ్చక్షుష్మానుత్సాహీ ప్రతిపత్తమాన్ | స్తంభశ్చాపలహీనశ్చ మైత్రః క్లేశసహః శుచిః. 13
సత్యసత్త్వధృతిస్థైర్య ప్రభావారోగ్యసంయుతః | కృతశిల్పశ్చదక్షశ్చ ప్రజ్ఞావాన్ ధారణాన్వితః. 14
దృఢభక్తిర కర్తాచ వైరాణాం సచివోభ##వేత్ | స్మృతిస్తత్పరతార్థేషు చిత్తజ్ఞో జాననిశ్చయః. 15
దృడతా మంత్రగుప్తిశ్చ మంత్రి నంపత్ర్పకీర్తితా | త్రయ్యాం చ దండ నీత్యాంచ కుశలః స్యాత్పురోహితః. 16
అథర్వవేద విహితం కుర్యాచ్ఛాన్తికపౌష్టికమ్ | సాధుతైషామమాత్యానాం తద్విద్యైః సహబుద్ధిమాన్. 17
చక్షుష్మత్తాం చ శిల్పంచ పరీక్షేత గుణద్వయమ్ | స్వజనేభ్యో విజానీయాత్ కులం స్థానమవగ్రహమ్. 18
పరికర్మసు దక్షంచ విజ్ఞానం ధారయిష్ణుతామ్ | గుణత్రయం పరీక్షేత ప్రాగల్భ్యం ప్రీతతాం తథా. 19
కథా యోగేషు బుధ్యేత వాగ్మిత్వం సత్యవాదితామ్ | ఉత్సాహంచ ప్రభావంచ తథాక్లేశ సహిష్ణుతామ్. 20
దృతిం చైవానురాగం చ స్థైర్యం చాపదిలక్షయేత్ | భక్తిం మైత్రీం చశౌచంచ జానీయాద్వ్యవహారతః. 21
అన్యాయమార్గమునుండి సులభముగ మరల్చుటకు శక్యమైనవాడు. అదే జనపదమునందు పుట్టినవాడు, సత్కులసంజాతుడు, సుశీలుడు, శారీరబలసంపన్నుడు, వక్తృత్వము కలవాడు, సభాసంభాషణప్రగల్భుడు, శాస్త్రమును నేత్రము కలవాడు, ఉత్సాహవంతుడు, సమయస్ఫూర్తి కలవాడు స్తబ్ధత్వ (మొండితనము) చాపల్యము లేనివాడు, స్నేహశీలుడు, శీతోష్ణాది క్లేశసహనసమర్థుడు, శుచి (లంచము మొదలగువాటికి దూరముగా నుండువాడు), సత్య - సత్త్వ - ధైర్య - స్థైర్య ప్రభావ - ఆరోగ్యాది గుణసంపన్నుడు, శిల్పనిపుణుడు, దక్షుడు. ప్రజ్ఞావంతుడు, ధారణాశక్తి కలవాడు, దృఢభక్తి, ఎవ్వరితోను వైరము లేనివాడు. ఇతరులు కల్పించిన విరోధమును శాంతింపచేయువాడు అగు పురుషుడు రాజునకు బుద్ధి సచివుడుగను, కర్మసచివుడుగను ఉండుటకు తగినవాడు. స్మరణశక్తి, కార్యవ్యగ్రత, ఊహాశక్తి జ్ఞాననిశ్చయము, దృఢత్వము, మంత్రగుప్తి ఇవి మంత్రిసంపద. పురోహితుడు వేదత్రయనిష్ణాతుడై, దండనీతిప్రయోగకుశలుడై, అథర్వవేదోక్త విధానమున రాజు కొరకు శాంతికర్మ - పుష్టికర్మలను సంపాదించుచుండవలెను. బుద్ధిమంతుడగు రాజు ఆయావిద్యలయందు నైపుణ్యముగల పండితులచే ఆమాత్యుల శిల్పశాస్త్రాదిజ్ఞానమును పరీక్షించవలెను. ఇది పరోక్ష పరీక్ష. కులీనత్వము, జన్మస్థానము, అవగ్రహము (ఆతడు ఎవరి చెప్పుచేతలలో ఉండును అను విషయము) ఈ మూడింటిని ఆతని ఆత్మీయులనుండి తెలుసుకొనవలెను. పరికర్మ (దుర్గాది నిర్మాణ) దక్షత్వము, విజ్ఞానము, ధారయిష్ణుత అను మూడు గుణములను కూడ పరీక్షించవలెను. ప్రగల్భత్వము, ప్రతిభ, వాగ్మిత్వము, సత్యవాదిత్యము అను నాలుగు గుణములను మాటలలో తానే స్వయముగా పరీక్షించవలెను. ఉత్సాహము ప్రభావము, క్లేశసహన సామర్థ్యము, ధైర్యము, స్వామిభక్తి స్థైర్యము అను గుణములను ఆపత్సమయములందు పరీక్షించవలెను. రాజు విషయమున దృఢమైన భక్తి, మైత్రి, ఆచార విచారములందు పరిశుద్ధత్వము - ఈ గుణములను ఆతని వ్యవహారమును బట్టి పరీక్షించవలెను.
సంవాసిభ్యో బలం సత్త్వమారోగ్యం శీలమేవచ | అస్తబ్ధతామచాపల్యం వైరాణాం చాప్యకీర్తనమ్. 22
ప్రత్యక్షతో విజానీయాద్భద్రతాం క్షుద్రతామపి | ఫలాను మేయాః సర్వత్ర పరోక్షగుణవృత్తయః. 23
సస్యాకరవతీపుణ్యా ఖనిద్రవ్యనమన్వితా | గోహితా భూరి సలిలా పుణ్యౖర్జనపదైర్యుతా. 24
రమ్యా సకుంజరబలా వారిస్థలపదాన్వితా | అదేవ మాతృకా చేతి శస్యతే భూరిభూతయే. 25
శూద్రకారువణిక్ర్పాయో మహారంభకృషీవలః | సానురాగో రిపుద్వేషీ పీడాసహకరః పృథుః. 26
నానాదేశ్యైః సమాకీర్ణో ధార్మికః పశుమాన్బలీ | ఈదృగ్జన పదః శస్తో7మూర్ఖవ్యసనినాయకః. 27
పృథుసీమం మహాఖాతముచ్చ ప్రాకారతోరణమ్ | పురం సమావసేచ్ఛైల సరిన్మరు వనాశ్రయమ్. 28
జలవద్ధాన్యధనవద్దుర్గం కాలసహం మహత్ | ఔదకం పార్వతం వార్షమైరిణం ధన్వినంచషట్. 29
ఈప్సితద్రవ్య సంపూర్ణః పితృపైతా మహోచితః |
జలము, సత్త్వము, ఆరోగ్యము, శీలము, అస్తబ్ధత, ఆచాపల్యము అనుగుణములను చుట్టుప్రక్కలనున్న వారిద్వారా పరీక్షించవలెను. వైరము పెంచుకొనకుండు స్వభావమును, భద్రత్వమును, నీచత్వమును ప్రత్యక్షముగనే చూచి గ్రహించవలెను. గుణప్రవృత్తులు ప్రత్యక్షముగా గ్రహించుటకు వీలుకాని పురుషుని గుణములను ఊహించి తెలుసుకొనవలెను. ఎక్కువ పంటలు పండునదియు, వివిధవస్తువుల గనులు, అమ్ముటకు వీలైన అధికమైన ఖనిజ పదార్థములు ఉన్నదియు, గోవులకు హితకరమైనదియు, అధిక జలము కలదియు, చుట్టును పవిత్రమైన జనపదము లున్నదియు, అందమైనదియు, అడవులలో ఏనుగు లున్నదియు, జలమార్గ - స్థలమార్గములన్నదియు, పంటలకై వర్షముపై ఆధారపడనిదియు, పంటలకై అధికముగ జలము లభించునదియు అగు భూమి ఐశ్వర్యవృద్ధికి ప్రశస్తము. జలము అధికముగ లభించునది, పర్వత సాహాయ్యమున్నది, శూద్ర - శిల్పి - వైశ్యులు అధికసంఖ్యలో ఉన్నది, ప్రయత్నశీలులు, పెద్దపెద్దపనులు తలబెట్టువారు, రాజానురక్తులు, రాజశత్రుద్వేషులు, పీడా - కరభారములను సహింపగలవారు, అగు వ్యవసాయదారులు కలది, అనేక దేశములనుండి వచ్చిన జనులకు నివాసస్థానమైనది, సువిస్తృతము, ధార్మికులు, పశుసంపద కలవారు, అగు ధనికులు కలది మూర్ఖులును, వ్యసనగ్రస్తులును అగు నాయకులుకలది యగు జనపదము రాజుకు శ్రేష్ఠమైనది. విస్తృతమైన సరిహద్దులు కలది, నాల్గువైపులందును విశాలమైన అగడ్తలు కలది, ఉన్నతమైన ప్రాకార-గోపురములు కలది, పర్వతమును గాని, మరుభూమిని గాని, అడవిగాని ఆశ్రయముగా గ్రహించి నిర్మించినది, అగుపురమునందు రాజు నివసించవలెను. జలము, ధాన్యము, ధనము అధికముగనున్న దుర్గము చాలకాలము శత్రువుల ఆక్రమణమును తట్టుకొనుటకు సమర్థమై యుండును. జలమయము, పర్వతమయము, వృక్షమయము, ఇరిణము (నిర్జనప్రదేశ నిర్మితము), ధాన్వనము (మరుభూనిర్మితము) అని దుర్గము ఐదువిధములు.
ధర్మార్జితో వ్యయసహః కోశో ధర్మాదివృద్ధయే. 30
పితృపైతామహోవశ్యః సంహతో దత్తవేతనః | విఖ్యాత పౌరుషోజన్యః కుశలః శకునైర్వృతః. 31
నానా ప్రహరణోపేతో నానా యద్ధవిశారదః | నానా యోధ సమాకీర్ణో నీరాజిత హయద్విపః. 32
ప్రవాసాయాస దుఃఖేషు యుద్డేషుచ కృతశ్రమః | అద్వైధ క్షత్రియప్రాయో దండో దండవతాం మతః. 33
యోగ విజ్ఞానసత్త్వాఢ్యం మహాపక్షం ప్రియం వదమ్ | అయతిక్షమమద్వైదం మిత్రం కుర్వీత సత్కులమ్. 34
దూరాదేవా భిగమనం స్పష్టార్థ హృదయానుగా | వాక్సత్కృత్య ప్రదానం చ త్రివిధోమిత్రసంగ్రహః. 35
ధర్మకామార్థ సంయోగో మిత్రాత్తు త్రివిధం ఫలమ్ | ఔరసంతత్ర సన్నద్ధం తథా వంశక్రమాగతమ్. 36
రక్షితం వ్యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధమ్ | మిత్రేగుణాః సత్యతాద్యాః సమానసుఖ దుఃఖతా. 37
వక్ష్యే7ను జీవినాం వృత్తం సేవీసేవేత భూపతిమ్ |
విశ్వాసపాత్రుల రక్షణినున్నది. ధర్మన్యాయానుసారముగ ఆర్జింపబడినది, ఎంత వ్యయము చేసినను తరగనిది అయిన కోశము శ్రేష్ఠము. కోశమును ధర్మాదివృద్ధికొరకును, భృత్యాదుల పోషణము కొరకును వినియోగించవలెను. తాత ముత్తాతల నుండియు సేవచేయుచున్నవారును, లొంగిఉండువారును, ఐకమత్యము కలవారును, జీతములు పూర్తిగా చెల్లించిన (తిసికొన్న) వారును, ప్రసిద్ధ పౌరుషవంతులును, తన జనపదమునందే జనించినవారును, యుద్ధకుశలులును, కుశలులగు సైనికులతో కలిసి ఉండువారును, నానావిధ శస్త్రాస్త్రసంపన్నులును, అనేక యుద్ధములందు ఆరితేరినవారును, అనేకులు మహాయోధులున్న దళములకు చెందినవారును, తమ సైన్యమునందలి అశ్వములకును గజములకును హారతి ఇచ్చువారును, పరదేశ నివాసము, యుద్ధమునందలి కష్టములు, అనేక విధములగు క్లేశములు సహించ సమర్థులును, యుద్ధమునందు చాల శ్రమపడినవారును రెండు ఆలోచనలు లేనివారును, చాలవరకు క్షత్రియజాతికి చెందినవారును అగు సైనికులు గల సైన్యము శ్రేష్ఠమైనదని దండనీతిజ్ఞుల అభిప్రాయము. త్యాగ-విజ్ఞాన-సత్త్వములు కలవారును, చాలమంది ఆత్మీయులు కలవారును, ప్రియముగ మాటలాడువారును, భవిష్యత్తులో ఉపయోగించువారును. రెండు ఆలోచనలు లేనివారును, ఉత్తమకుల సంజాతులును అగు పురుషులును మిత్రులనుగ చేసికొనవలెను మిత్రుడు రాగానే దూరము నుండియే ఎదురేగుట, స్పష్టములు, ప్రియములు అగు మాటలు చెప్పుట, సత్కారపూర్వకముగా మనోవాంఛిత వస్తువునిచ్చుట - ఇవి మూడును మిత్రసంగ్రహణోపాయములు. ధర్మార్థకామములు మిత్రులనుండి లభించు మూడుఫలములు. ఔరసులు (మాతృపిత్రాది సంబంధముద్వారా ఏర్పడినవారు), మైత్రీబంధబద్ధులు, కులక్రమాగతులు, కష్టముల నుండి రక్షింపబడినవారు అని మిత్రులు నాల్గు రకములు. సత్యవచనము, అనురాగము సుఖదుఃఖములందు ఒకే విధముగ పాలుపంచుకొనుట, ఇవి మిత్రగుణములు.
దక్షతా భద్రతాదార్ఢ్యం క్షాన్తిః క్లేశ సహిష్ణుతా. 38
సంతోషః శీలముత్సాహో మండయత్యను జీవినమ్ | యథాకాలము పాసీత రాజానం సేవకోనయాత్. 39
పరస్థానగమం క్రౌర్యమౌద్ధత్యం మత్సరం త్యజేత్ | విగృహ్య కథనం భృత్యో న కుర్యాజ్జ్యాయసాసహ. 40
గుహ్యం మర్మ చ మంత్రం చ నచ భర్తుః ప్రకాశ##యేత్ |
రక్తా ద్వృత్తిం సమీహేత విరక్తం సన్త్యజేన్నృ పమ్.
అకార్యే ప్రతిషేధశ్చకార్యే చాపి ప్రవర్తనమ్ | సంక్షేపాదితి సద్వృత్తం బంధుమిత్రాను జీవినామ్. 42
ఆజీవ్యః సర్వసత్త్వానాం రాజా పర్జన్యవద్భవేత్ | ఆయద్వారేషు చాప్త్యర్థం ధనం చాదదతీతి చ. 43
కుర్యాద్దుర్యోగ సంపన్నానధ్యక్షాన్సర్వకర్మసు | కృషిర్వణిక్పథో దుర్గం సేతుః కుంజర బంధనమ్. 44
ఖన్యాకరబలాదానం శూన్యానాంచ నివేశనమ్ | అష్టవర్గమిమం రాజా సాధు వృత్తో7ను పాలయేత్. 45
ఆముక్తికేభ్యశ్చౌరేభ్యః పౌరేభ్యో రాజవల్లభాత్ | పృథివీపతిలో భాచ్చ ప్రజానాం పంచధాభయమ్. 46
అవేక్ష్యైతద్భయం కాలే హ్యాదదీతకరం నృపః | అభ్యన్తరం శరీరం స్వం బాహ్యం రాష్ట్రం చ రక్షయేత్. 47
దండ్యాంస్తాన్దండయేద్రాజాస్వం రక్షేచ్చ విషాదితః | స్త్రియః పుత్రాంశ్చ శత్రుభ్యో విశ్వసేన్న కదాచన. 48
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రాజధర్మో నామైకోన చత్వారింశ దధిక ద్విశతతమో7ధ్యాయః.
రాజసేవకుల ప్రవృత్తినిగూర్చి చెప్పెదను ; సేవకులకు తగిన గుణములు కలవాడు రాజుసేవ చేయవలెను నేర్పు, లోకప్రియత్వము, దృఢత్వము. ఓర్పు, క్లేశసహశక్తి, సంతోషము, శీలము, ఉత్సాహము- ఈ గుణములు సేవకుల అలంకారములు. సేవకుడు సమమానుసారముగను, న్యాయపూర్వకముగను రాజసేవ చేయవలెను. ఇతరుల స్థానమునకు వెళ్ళుట, క్రూరత్వము, అసభ్యత్వము, ఈర్ష్య - ఈ దోషములను త్యజించవలెను. తన పై అధికారి మాటలను ఖండించిగాని, తద్విరుద్ధముగ గాని రాజసభలో మాటలాడగూడదు. రాజుయొక్క రహస్యకార్యములను, గుప్తమంత్రణమును ఎచ్చటను ప్రకటము చేయకూడదు. తన విషయమున స్నేహముగల స్వామివద్దసేవకుడుగా ఉండవలెను. రాజు తనపై విరక్తి చూపిచో, లేదా అసహ్యము చూపినచో ఆతనిని విడవవలెను. సంగ్రహముగా చెప్పవలెనన్నచో రాజు అనుచిత కార్యముచేయునున్నప్పుడు నివారించుట, సత్కార్యములు చేయుచున్నప్పుడు అతనికి సాహాయ్యము చేయుట. ఇది బంధువులు, మిత్రులు, సేవకులు చేయవలసిన శ్రేష్ఠాచారము. మేఘమువలె రాజుసమస్త ప్రాణులకును వృత్తి కల్పింపవలెను. ఆయా స్థానములన్నింటియందును, సుపరీక్షితులును, విశ్వాసయోగ్యులును అగువారిని నియోగించవలెను. ఉద్యమశీలులను మాత్రమే కర్మాధ్యక్షులుగ చేయవలెను. వ్యవసాయము, వర్తకులకు ఉపయోగించు స్థలజలమార్గములు, పర్వతాది దుర్గములు సేతుబంధములు, ఏనుగులను పట్టు స్థానములు సువర్ణ - రజతాదిఖనులు, వనమునందు లభించు శ్రేష్ఠమైన కఱ్ఱ మొదలైనవి శూన్యప్రదేశములందు గ్రామాది నిర్మాణము- ఈ ఎనిమిది ఆయద్వారములు వీటికి 'అష్టవర్గము' అని పేరు. ధర్మాత్ముడైన రాజు ఈ అష్టవర్గమును నిరంతరము రక్షించవలెను. అధికారులు, చోరులు, శత్రువులు, రాజబంధువులు, రాజు యొక్క దురాశ - ఈ ఐదును ప్రజలకు ఐదు విధములగు భయములను కలిగించుచుండును. రాజు, ఈ భయములు కలుగ కుండ చేయుచు ప్రజల నుండి తగుసమయములందు పన్ను వసూలు చేయచుండవలెను. బాహ్యము, అభ్యన్తరము అని రాజ్యము రెండు విధములు. రాజు యొక్క శరీరమే ఆభ్యంతరము. రాష్ట్రము బాహ్యరాజ్యము. రాజు ఈ రెండింటిని రక్షించుకొనవలెను. రాజ్యమునకు హాని కలిగించు పాపాత్ములు రాజప్రియులైనను దండనీయులే. రాజు వారందరిని శిక్షించవలెను. విషాదుల నుండి తనను రక్షించుకొనవలెను. స్త్రీలను, పుత్రులను, శత్రువులను ఎన్నడును విశ్వసించగూడదు.
అగ్ని మహాపురాణమునందు రాజధర్మ కథనమను రెండువందల తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.