Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ సమాధిః

అగ్ని రువాచ :

యదాత్మమాత్రం నిర్భాసంస్తిమితోదధి వత్థ్సితమ్‌ | చైతన్య రూప వద్ధాన్యం తత్సమాధిరి హోచ్యతే. 1

ధ్యాయన్మనః సన్నివేశ్య యస్తిష్ఠేదచలః స్థిరః | నిర్వాతానల వద్యోగీ సమాధిస్థః ప్రకీర్తితః. 2

నశృణోతి న చాఘ్రాతిన పశ్యతి న రస్యతి | న చ స్పర్శం విజానాతి న సంకల్పయతే మనః. 3

నచాభిమన్యతే కించిన్నచ బుధ్యతి కాష్ఠవత్‌ | ఏవమీశ్వర సంలీనః సమాధిస్థః సగీయతే. 4

యథాదీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృతా | ధ్యాయతో విష్ణుమాత్మానం సమాధి స్తస్యయోగినః. 5

ఉపసర్గాః ప్రవర్తన్తే దివ్యాః సిద్ధిప్రసూచకాః | పాతితః శ్రావణో ధాతుర్దశనస్వాంగ వేదనాః. 6

ప్రార్థయంతి చతందేవా భోగైర్దివ్యైశ్చ యోగినమ్‌ | నృపాశ్చ పృథివీ దానైర్దవైశ్చ సుధనాధిపా. 7

వేదాది సర్వశాస్త్రం చ స్వయమేవ ప్రవర్తతే | అభీష్టచ్ఛందో విషయం కావ్యం చాస్య ప్రవర్తతే. 8

రసాయనాని దివ్యాని దివ్యాశ్చౌషధ యస్తథా | సమస్తానిచ శిల్పాని కలాః సర్వాశ్చవిన్దతి. 9

సురేంద్రకన్యా ఇత్యాద్యా గుణాశ్చ ప్రతిభాదయః | తృణవత్తాంస్త్య జేద్యస్తు తస్య విష్ణుః ప్రసీదతి. 10

అగ్నిదేవుడు పలికెను. చైతన్యము ప్రశాంతసముద్రము వలె స్థిరమై ఆత్మ భిన్నములగు పదార్థము లేమియు భాసించక ఆత్మ మాత్రమే భాసించు ధ్యానము సమాధి. ధ్యాన సమయమున చిత్తమును ధ్యేయమునందు నిలిపి గాలిలేని ప్రదేశము నందలి దీపమువలె కదలకుండ నుండు యోగి ''సమాధిస్థుడు'' అని చెప్పబడును. ఆ సమయమున ఆతడు వినడు వాసన చూడడు, రుచి చూడడు, స్పర్శము తెలుసుకొనడు, మనస్సుచే సంకల్పించడు, దేని యందును అభిమానము కలవాడు కాడు దేనిని తెలిసికొనక కాష్ఠమువలె నుండును. ఈ విధముగ ఈశ్వరుని యందు లీనుడైన వాడు సమాధిష్థుడు. వాయువు లేని ప్రదేశమునందున్న దీపము ఎట్లు కదలదో అది ఉపమగా చెప్పబడినది. ఆత్మ స్వరూపుడు అగు విష్ణువును ధ్యానము చేయుచున్న యోగికి ఎన్నియో దివ్యములగు విఘ్నములు ఎదురగును. అవి సిద్ధి సూచకములు. సాధకుడు పైనుంచి క్రిందకు పడవేయును. చెవిలో బాధకలుగును. అనేక విధములగు ధాతువులు కనబడును. శరీరము నందు ఎక్కువ బాధ కలుగును. అట్టి యోగికి దివ్యభోగములను ఇచ్చెదమని దేవతలు లోభ##పెట్టుదురు. రాజులు భూమిని, ధనవంతులు, ధనములను ఇచ్చెదరు. వేదాది శాస్త్రములన్నియు స్వయముగనే స్ఫురించును. ఇష్టమైన ఛందస్సులతో కావ్యరచన కూడ ఆతడు చేయును. దివ్యమైన రసాయనములు దివ్యౌషధులు సకల శిల్పములు, కళలు అతనికి లభించును. సురేంద్ర కన్యకలు, ప్రతి భాది గుణములు కూడ అతనివద్దకు వచ్చును. వీటినన్నింటిని ఎవడు తృణమువలె పరిత్యజించునో వానిని విష్ణువు అనుగ్రహించును.

అణిమాది గుణౖశ్వరః శిష్యేజ్ఞానం ప్రకాశ్యచ | భుక్త్వా భోగాన్య థేచ్ఛాతస్తనుంత్యక్త్వాలయాతతః. 11

తిష్ఠేత్స్వాత్మని విజ్ఞాన ఆనందే బ్రహ్మణీశ్వరే | మలినో హి యథాధర్మ ఆత్మజ్ఞానాయ న క్షమః. 12

సర్వాశ్రయాన్నిజే దేహే దేహీ విన్దతి వేదనామ్‌ | యోగయుక్తస్తు సర్వేషాం యోగాన్నాప్నోతి వేదనామ్‌.

ఆకాశ##మేకం హియథాఘటాదిషు పృథగ్భవేత్‌ | తథాత్మైకో హ్యనేకేషు జలాధారేష్వి వాంశుమాన్‌. 14

బ్రహ్మఖానిల తేజాంసి జలభూక్షితి ధాతవః | ఇమేలోకా ఏషచాత్మాతస్మాచ్చ సచరాచరమ్‌.

15

మృద్దండ చక్రసంయోగాత్కుంభ కారోయథాఘటమ్‌ | కరోతి తృణవత్కా ష్ఠైర్గృ హంవాగృహ కారకః. 16

కారణాన్యేవ మాదాయ తాసుతాస్విహయోనిషు | సృజత్యాత్మాన మాత్మైవం సంభూయ కరణానిచ. 17

కర్మణా దోషమోహాభ్యామిచ్ఛ యైవ సబధ్యతే | జ్ఞానాద్విముచ్యతే జీవోధర్మాద్యో గీనరోగభాక్‌. 18

వర్త్యాధార స్నేహయోగాద్యథా దీపస్య సంస్థితిః | విక్రియావిచదృష్టైవ మకాలే ప్రాణసంక్షయః. 19

అణిమాది గుణౖశ్వర్య వంతుడగు యోగి శిష్యునకు జ్ఞానము ఇచ్చి ఇచ్చాను సారముగ భోగములనుభవించి లయయోగము ద్వారా శరీరమును పరిత్యజించి విజ్ఞానానందమయము. బ్రహ్మ స్వరూపము, ఐశ్వర్య సంపన్నము, అగు స్వాత్మయందు స్థితిని పొందవలెను. మలినమైన అద్దమున ప్రతిబింబమును గ్రహింప శక్యము కానట్లు అంతఃకర్ణ పరిపాకము లేని వాడు ఆత్మజ్ఞానము పొందజాలడు. దేహము సకల రోగ భాజనమ. దానియందు అభిమానము కలవాడు దుఃఖమును పొందును. కాని యోగి యోగ బలము వలన దుఃఖము పొందడు. ఒకే ఆకాశము ఘటాదుల ద్వారా వేర్వేరుగా కనబడు నట్లును ఒకే సూర్యుడు అనేక జలాధారములందు అనేక రూపముల కనబడునట్లును ఒకే ఆత్మ అనేకమువలె కనబడుచున్నది. ఆకాశవాయు అగ్ని, జల, పృథివీ, ధాతువులు, ఈ లోకములన్నియు సచరాచ రజగత్తు జీవాత్మా ఇవన్నియు బ్రహ్మ స్వరూపములు. కుంభకారుడు మట్టి దండము, చక్రము, వీటిని కలిపి కుంభమును చేసినట్లు గృహకారకుడు తృణ మృత్తికా కాష్ఠములతో గృహమును నిర్మించినట్లును ఆత్మయే ఆయాకరణములను సమకూర్చుకొని అయాయోనులందు తనను తానే సృశించుకొనును. కర్మచేతను, దోషమోహముల చేతను బద్ధుడగును. జీవులు జ్ఞానమువలన ముక్తుడగును. యోగి ధర్మానుష్ఠానము చేయుటచే రోగ విముక్తుడగును. వర్తి ఆధారము తైలము, వీటికలయికచే-దీపము నిలచినట్లును ఏఒక్కటి లేకున్నను అదినిలువకున్నట్లును యోగ ధర్మములు లేకపోవుటచే వికారము కలిపి అకాలమున ప్రాణనాశనము కలుగు చున్నది.

అనన్తా రశ్మయస్తస్య దీపవద్యః స్థితోహృది | సితాసితాః కద్రునీలాః కవిలాః పీతలోహితాః. 20

ఊర్ధ్వమేకః స్థితస్తేషాం యోభిత్త్వా సూర్యమండలమ్‌ | బ్రహ్మలోకమతిక్రమ్య తేనయాతి పరాంగతిమ్‌. 21

యదస్యాన్యద్రశ్మిశత మూర్ధ్వమేవ వ్యవస్థితమ్‌ | తేనదేవనికాయాని ధామాని ప్రతిపద్యతే.

22

యేనైక రూపాశ్చాధస్తాద్రశ్మయోస్య మృదుప్రభాః | ఇహకర్మోపభోగాయ తైశ్చసంచరతేహిసః. 23

బుద్ధీంద్రియాణి సర్వాణి మనః కర్మేంద్రియాణిచ | అహంకారశ్చ బుద్ధిశ్చ పృథివ్యాదీని చై వహి. 24

అవ్యక్తఆత్మాక్షేత్రజ్ఞః క్షేత్రస్యాస్య నిగద్యతే | ఈశ్వరః సర్వభూతస్య సన్నన్సదసచ్చయః.

25

బుద్ధేరుత్పత్తి రవ్యక్తా త్తతోహంకార సంభవః | తస్మాత్ఖాదీని జాయన్తే ఏకోత్తర గుణానితు.

26

శబ్దః స్పర్శశ్చ రూపంచ రసోగంధశ్చ తద్గుణాః | యోయస్మిన్నాశ్రితశ్చైషాం సతస్మిన్నేవలీయతే. 27

నత్త్వం రజస్తమశైవ గుణాస్తసై#్యవ కీర్తితాః | రజస్తమోభ్యామా విష్టశ్చక్రవద్బ్రామ్యతేహిసః. 28

ఆనాదిరాది మాన్యశ్చ సఏవ పురుషఃపరః | లింగేంద్రియైరుపగ్రాహ్యః సవికార ఉదాహృతః.

29

యతోవేదాః పురాణాని విద్యోపనిష దస్తథా | శ్లోకాః సూత్రాణి భాష్యాణి యచ్చాన్యద్వాజ్మయం భ##వేత్‌. 30

పితృయానోపవీథ్యాశ్చ యదగస్తస్య చాంతరమ్‌ | తేనాగ్ని హోత్రిణోయాంతి ప్రజాకామాదివంప్రతి. 31

యేచదానపరాః సమ్యగష్టాభిశ్చ గుణౖర్యుతాః | అష్టాశీతి సహస్రాణి మునయో గృహమేధినః. 32

పునరావర్తనే బీజభూతా ధర్మప్రవర్తకాః | సప్తర్షినాగవీథ్యాశ్చ దేవలోకం సమాశ్రితాః. 33

తావన్త ఏవమునయః సర్వారంభ వివర్జితాః | తపసా బ్రహ్మచర్యేణ సంగత్యాగేన మేధయా. 34

యత్ర యత్రావ తిష్ఠన్తే యావదాభూత సంప్లవమ్‌ |

హృదయములో దీపము వలెనున్న ఆత్మయొక్క రశ్ములు అనంతములై వ్యాపించియున్నవి. సితములు అసితములు కద్రువర్ణములు, నీలవర్ణములు, కపిలవర్ణములు, కపిలవర్ణములు, పీతలోహితములు అగువాటిలో ఒకటి ఊర్ధ్వముఖమై సూర్యమండలమును భేదించి బ్రహ్మలోకమునుకూడ అతిక్రమించి వెళ్లును. దాని మార్గమున పయనించువాడు ఉత్తమ గతిని పొందును. ఇది కాక మరినూరు రశ్ములు ఊర్ధ్వముఖములై యున్నవి. వాటి ద్వారా పయనించినవాడు ఆయా దేవలోకములను పొందును. క్రిందుకు ప్రసరించు అల్పకాంతిగల వివిధ రశ్ములద్వారా పయనించినవాడు కర్మోపభోగమునకై ఈ లోకమునందే జనించును. జ్ఞానేంద్రియములు, మనస్సు, కర్మేంద్రియములు, అహంకారము, బుద్ధి, పంచభూతములు, అవ్యక్తమగు ప్రకృతి వీటికి క్షేత్రము అని పేరు. వీటి స్వరూపము తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అతడే సర్వభూతాధీశ్వరుడు. అతడు సత్తుఅసత్‌ సదసద్రూపుడు. ప్రకృతి నుండి బుద్ధి, (మహత్తత్త్వము) దానినుండి అహంకారము, దానినుండి పంచ మహాభూతములు జనించును. వీటిలో ఉత్తరోత్తరమునకు ఒక్కొక్కగుణము అధికముగ నుండును. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, భూతగణములు ఏది దేనిని ఆశ్రయించి వున్నచో అది దానియందే లీనమగును. సత్త్వ రజస్తమస్సులు అవ్యక్త ప్రకృతి యొక్క గుణములు. రజస్తమోగుణములచే ఆవిష్టుడగు జీవుడు చక్రమువలె తిరుగుచుండును. అన్నిటికి ఆదియైన పరమ పురుషుడు ఆనాది. మనస్సు చేతను ఇంద్రియముల చేతను గ్రహింపబడునది, వికారము. వేదపురాణ విద్యా ఉపనిషత్‌ శ్లోక సూత్ర, భాష్యాది వాఙ్మయము ఈ పరమాత్మ నుండియే ఆవిర్భవించినది. సంతాన కాలములగు అగ్నిహోత్రులు పితృయానమార్గమునందలి ఉపవీథి మొదలు అగస్త్య నక్షత్ర మధ్యమ వరకు వున్న మార్గము ద్వారా స్వర్గమును చేరుదురు. దాన తత్పురులై అష్టగుణసంపన్నులగు వారుకూడ ఈ మార్గముననే పయనింతురు. ఎనుబది ఎనిమిదివేల గృహస్థమునులు ధర్మప్రవర్తకులు వారే పునరావృత్తికి కారణ భూతులు. వారు సప్తర్షులకును నాగవీథికిని మధ్యనున్న మార్గము ద్వారా దేవలోకమునకు వెళ్ళిరి. అంతే సంఖ్యగల మునులు సర్వారంభ శూన్యులై తపో, బ్రహ్మచర్య, అసంగతి, త్యాగ, మేధాశక్తుల ప్రభావముచే ఒక కల్పము వరకు ఆయా దేవలోకములలో నివసింతురు.

వేదానువచనం యజ్ఞా బ్రహ్మచర్యం తపోదమః.

శ్రద్ధోపవాసః సత్యత్వ మాత్మనో జ్ఞానహేతపః | సత్త్వాశ్రమైర్నిదిధ్యాసః సమసై#్తరేవ మేవతు. 36

ద్రష్టవ్యస్త్వథ మన్తవ్యః శ్రోతవ్యశ్చ ద్విజాతిభిః | య ఏవమేవం విందంతియే చారణ్యకమాశ్రితాః. 37

ఉపాసతేద్విజాః సత్యం శ్రద్ధయా పరయాయుతా | క్రమాత్తే సంభవన్త్యర్చి రహః శుక్లం తథోత్తరమ్‌. 38

ఆయనం దేవలోకంచ సవితారం సవిద్యుతమ్‌ | తతస్తాన్పురుషోభ్యేత్య మానసోబ్రహ్మ లౌకికాన్‌. 39

కరోతి పునరావృత్తిస్తేషామిహనవిద్యతే | యజ్ఞేన తపసా దానై ర్యే హిస్వర్గ జితోజనాః 40

ధూమం నిశాం కృష్ణపక్షం దక్షిణాయన మేవచ | పితృలోకం చంద్రమనం నభోవాయుం జలంమహీమ్‌.

క్రమాత్తే సంభవన్తిహ పునతేవ వ్రజన్తీచ | ఏతద్యో నవిజానాతి మార్గద్వితయ మాత్మనః. 42

దందశూకః పతంగోవా భ##వేత్కీటోథవా కృమిః |

హృదయే దీపవద్ర్బహ్మ ధ్యానాజ్జీవోమృతో భ##వేత్‌. 43

న్యాయాగత ధనస్తత్త్వజ్ఞాన నిష్ఠోతిథి ప్రియః | శ్రాద్ధకృత్సత్య వాదీచ గృహస్థోపి విముచ్యతే. 44

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సమాధి నిరూపణం నామ షట్‌ సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.

వేదాధ్యయనము యజ్ఞము, బ్రహ్మచర్యము, తపస్సు శ్రద్ధాఇంద్రియనిగ్రహము, ఉపవాసము, సత్యము, వీటివలన ఆత్మ జ్ఞానము కలుగును. ద్విజాతులు సత్త్వగుణమును ఆశ్రయించి ఆత్మను గూర్చి శ్రవణమనన నిధిధ్యాసనములు చేసి ఆత్మ సాక్షాత్కారము పొందవలెను. ఈ విధముగ తెలుసుకొనువారు వానప్రస్థులై, శ్రద్ధాయుక్తులై, సత్యోపాసన చేయుచు క్రమముగ అగ్ని, దిన, శుక్లపక్ష, ఉత్తరాయణ దేవలోక, సూర్యమండల విద్యుద్దేవతల లోకములు చేరుదురు. పిదప మానస పురుషుడు అచటకు వచ్చి వారిని బ్రహ్మ లోకమున చేర్చును. వారికి పునరావృత్తి వుండదు. యజ్ఞతపోదానములచే స్వర్గము పొందువారు క్రమముగ ధూమ, రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన పితృలోక చంద్రలోక అభిమాని దేవతల లోకములకు వెళ్ళి మరల ఆకాశ, వాయు, జలముల మార్గముల ద్వార భూలోకమునకు తిరిగి వత్తురు. ఈలోకమున జన్మించి, మరణానంతరము మరల ఆమార్గముననే ప్రయాణము చేయుదురు. జీవాత్మకు సంబంధించిన ఈ రెండు మార్గములును తెలియనివాడు సర్పముగాను, పతంగముగాను, కీటకముగాను క్రుమిగాను పుట్టును. హృదయాకాశమున దీపమువలె భాసించుచున్న బ్రహ్మను ధ్యానించుటచే జీవుడు అమృత స్వరూపుడగును. న్యాయముగ ధనసంపాదన చేయుచు అతిథి ప్రియుడై తత్త్వజ్ఞాన నిష్ఠుడై శ్రాద్ధములు చేయుచు సత్యావాదియైవున్న గృహస్థుడు కూడ విముక్తుడగును.

అగ్ని మహాపురాణమున సమాధి నిరూపణమను మూడు వందల డెబ్బది ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page