Siva Maha Puranam-4
Chapters
అథ చత్వారింశో
పితృ దేవతల ప్రభావము
వ్యాస ఉవాచ |
ఇత్యాకర్ణ్య శ్రాద్ధదేవ సూర్యాన్వయమనుత్తమమ్ | పర్యపృచ్ఛన్మునిశ్రేష్ఠ శ్శౌనక స్సూతమాదరాత్ || 1
వ్యాసుడిట్లు పలికెను -
ఈ విధముగా సర్వశ్రేష్ఠమగు శ్రాద్ధదేవుడగు సూర్యుని వంశమును గురించి వినిన శౌనకమహర్షి ఆదరముతో సూతుని ఇట్లు ప్రశ్నించెను (1).
శౌనక ఉవాచ |
సూత సూత చిరం జీవ వ్యాసశిష్య నమో%స్తుతే | శ్రావితా పరమా దివ్యా కథా పరమపావనీ || 2
త్వయా ప్రోక్తః శ్రాద్ధదేవస్సూర్యస్సద్వంశవర్ధనః | సంశయస్తత్ర మే జాతస్తం బ్రవీమి త్వదగ్రతః || 3
కుతో వై శ్రాద్ధదేవత్వమాదిత్యస్య వివస్వతః | శ్రోతుమిచ్ఛామి తత్ర్పీత్యా ఛింధి మే సంశయం త్విమమ్ || 4
శ్రాద్ధస్యాపి చ మహాత్మ్యం తత్ఫలం చ వద ప్రభో | ప్రీతాశ్చ పితరో యేన శ్రేయసా యో జయంతి తమ్ || 5
ఏతచ్చ శ్రోతుమిచ్ఛామి పితృణాం సర్గముత్తమమ్ | కథయ త్వం విశేషేణ కృపాం కురు మహామతే || 6
శౌనకుడిట్లు పలికెను -
ఓ సూతా!సూతా! నీవు చిరకాలము జీవించుము. ఓ వ్యాసశిష్యా! నీకు నమస్కారమగుగాక! నీవు పరమదివ్యము, పరమపావనము అగు గాథను వినిపించితివి (2). శ్రాద్ధదేవుడగు సూర్యుడు గొప్ప వంశమును వర్ధిల్లజేసినాడని నీవు చెప్పియుంటివి. ఆ విషయములో నాకు సందేహము కలిగినది. దానిని నీ యెదుట చెప్పుచున్నాను (3). అదితిపుత్రుడగు వివస్వానునకు శ్రాద్ధదేవత్వము ఎట్లు కలిగినది ? నేనీ విషయమును వినగోరుచున్నాను. నీవు ప్రీతితో నా ఈ సంశయమును నిర్మూలించుము (4). ఓ ప్రభూ ! శ్రాద్ధము యొక్క మహిమను, దాని ఫలమును వివరించుము. పితృదేవతలు శ్రాద్ధముచే సంతోషించి మానవునకు శ్రేయస్సును కలుగజేసెదరు (5). ఇంతేగాక, ఉత్తమమగు పితృసృష్టిని గురించి కూడ నేను వినగోరుచున్నాను. ఓ మహాప్రాజ్ఞా ! నీవు నాయందు దయచూపి ఈ విషయమును వివరముగా చెప్పుము (6).
సూత ఉవాచ |
వచ్మి తత్తే%ఖిలం ప్రీత్యా పితృసర్గం చ శౌనక | మర్కండేయేన కథితం భీష్మాయ పరిపృచ్ఛతే || 7
గీతం సనత్కుమారేణ మార్కండేయాయ ధీమతే | తత్తే%హం సంప్రవక్ష్యామి సర్వకామఫలప్రదమ్ || 8
యుధిష్ఠిరేణ సంపృష్టో భీష్మో ధర్మభృతాం వరః | శరశయ్యాస్థితః ప్రోచే తచ్ఛృణుష్వ వదామి తే || 9
సూతుడిట్లు పలికెను -
ఓ శౌనకా ! భీష్ముడు ప్రశ్నించగా పితృసృష్టిని మార్కండేయుడు చెప్పెను. ఆ వివరములనన్నిటినీ నేను నీకు ప్రీతితో చెప్పెదను (7). బుద్ధిమంతుడగు మార్కండేయునకు కోరికలనన్నింటినీ ఈడేర్చే ఈ వృత్తాంతమును సనత్కుమారుడు చెప్పెను. దానిని నేను నీకు చక్కగా చెప్పగలను (8). ధర్మవేత్తలలో శ్రేష్ఠుడగు భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజు ప్రశ్నించెను. అపుడు ఆయన చెప్పిన వృత్తాంతమును నేను నీకు చెప్పెదను. వినుము (9).
యుధిష్ఠిర ఉవాచ |
పుష్టికామేన పుంసాం వై కథం పుష్టిరవాప్యతే | ఏతచ్ఛ్రోతుం సమిచ్ఛామి కిం కుర్వాణో న సీదతి || 10
ధర్మరాజు ఇట్లు పలికెను -
మానవులలో పుష్టిని గోరువాడు పుష్టిని పొందే ఉపాయమేది ? మానవుడు ఏమి చేసినచో, వినాశమును పొందడు ? నేనీ విషయమును వినగోరుచున్నాను (10).
సూత ఉవాచ |
యుధిష్ఠిరేణ సంపృష్టం ప్రశ్నం శ్రుత్వా స ధర్మవిత్ | భీష్మఃప్రోవాచ సుప్రీత్యా సర్వేషాం శృణ్వతాం వచః || 11
సూతుడిట్లు పలికెను -
యుధిష్ఠిరుడు వేసిన ప్రశ్నను విని ధర్మవేత్తయగు ఆ భీష్ముడు మిక్కిలి ఆనందించి అందరు వినుచుండగా, ఇట్లు పలికెను (11).
యే కుర్వంతి నరాశ్ర్శాద్ధాన్యపి ప్రీత్యా యుధిష్ఠిర | శ్రాద్ధైః ప్రీణాతి తత్సర్వం పితౄణాం హి ప్రసాదతః || 12
శ్రాద్ధాని చైవ కుర్వంతి ఫలకామాస్సదా నరాః | అభిసంధాయ పితరం పితుశ్చ పితరం తథా || 13
పితుఃపితామహశ్చైవ త్రిషు పిండేషు నిత్యదా | పితరా ధర్మకామస్య ప్రజాకామస్య చ ప్రజామ్ || 14
పుష్టికామస్య పుష్టించ ప్రయచ్ఛంతి యుధిష్ఠిర || 15
భీష్ముడిట్లు పలికెను -
ఓ ధర్మరాజా ! ఏ మానవులైతే ప్రేమతో శ్రాద్ధములను చేసెదరో, వారు పితృ దేవతల అనుగ్రహము వలన శ్రాద్ధముల ప్రభావముచే సర్వులకు ప్రీతిని కలిగించెదరు (12). ఫలమును కోరు మానవులు ప్రతి సంవత్సరము తండ్రిని, తాతను, ముత్తాతను స్మరించి మూడు పిండముల నర్పించి శ్రాద్ధములను చేయుదురు. ఓ ధర్మరాజా ! పితృదేవతలు ధర్మాత్ముడగు అట్టి నరునకు సంతానమును కోరినచో సంతానమును, పుష్టిని కోరినచో పుష్టిని సర్వదా ఇచ్చుచుందురు (13-15).
యుధిష్ఠిర ఉవాచ |
వర్తంతే పితరస్స్వర్గే కేషాంచిన్నరకే పునః | ప్రాణినాం నియతం చాపి కర్మజం ఫలముచ్యతే || 16
తాని శ్రాద్ధాని దత్తాని కథం గచ్ఛంతి వై పితౄన్ | కథం శక్తాస్త మాహర్తుం నరకస్థాః ఫలం పునః || 17
దేవా అపి పితౄన్ స్వర్గే యజంత ఇతి మే శ్రుతమ్ | ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ బ్రవీహి మే || 18
ధర్మరాజు ఇట్లు పలికెను -
కొందరి పితరులు స్వర్గములో నుండగా, మరికొందరి పితరులు నరకములో నుండవచ్చును. ప్రాణులు నిశ్చితముగా కర్మఫలముననుభవించెదరని చెప్పబడినది (16). మానవులు ఇచ్చే శ్రాద్ధములు పితరులకు ఎట్లు చేరును ? శ్రాద్ధఫలమును నరకములోని వారు ఎట్లు పొందగల్గుదురు ? (17) స్వర్గములో దేవతలు కూడ పితరులను పూజించెదరని వినియున్నాను. ఈ వివరములను నేను వినగోరుచున్నాను. నాకు చెప్పుడు (18).
భీష్మ ఉవాచ |
అత్ర తే కీర్తయిష్యామి యథా శ్రుతమరిందమ | పిత్రా మమ పురా గీతం లోకాంతరగతేన వై || 19
శ్రాద్ధకాలే మమ పితుర్మయా పిండస్సముద్యతః | మత్పితా మమ హస్తేన భిత్త్వా భూమిమయాచత || 20
నైష కల్ప విధిర్దృష్ట ఇతి నిశ్చిత్య చాప్యహమ్ | కుశేష్వేవ తతః పిండం దత్తవానవిచారయన్ || 21
తతఃపితామే సంతుష్టో వాచా మధురయా తదా | ఉవాచ భారతశ్రేష్ఠ ప్రీయమాణో మయానఘ || 22
త్వయా దాయాదవానస్మి ధర్మజ్ఞేన విపశ్చితా | తారితో%హం తు జిజ్ఞాసా కృతా మే పురుషోత్తమ || 23
ప్రమాణం యద్ధి కురుతే ధర్మాచారేణ పార్థివః | ప్రజాస్తదను వర్తంతే ప్రమాణాచరితం సదా || 24
శృణు త్వం భారతశ్రేష్ఠ వేదధర్మాంశ్చ శాశ్వతాన్ | ప్రమాణం వేదధర్మస్య పుత్ర నిర్వర్తితం త్వయా || 25
తస్మాత్తవాహం సుప్రీతః ప్రీత్యా వరమనుత్తమమ్ | దదామి త్వం ప్రతీక్షస్వ త్రిషు లోకేషు దుర్లభమ్ || 26
న తే ప్రభవితా మృత్యుర్యావజ్జీవితుమిచ్ఛసి | త్వత్తో % భ్యనుజ్ఞాం సంప్రాప్య మృత్యుః ప్రభవితా పునః || 27
కిం వా తే ప్రార్థితం భూయో దదామి వరముత్తమమ్ | తద్ బ్రూహి భరతశ్రేష్ఠ యత్తే మనసి వర్తతే || 28
ఇత్యుక్తవతి తస్మింస్తు అభివాద్య కృతాంజలిః | అవోచం కృతకృత్యో%హం ప్రసన్నే త్వయి మానద |
ప్రశ్నం పృచ్ఛామి వై కంచిద్వాచ్యస్స భవతా స్వయమ్ || 29
స మామువాచ తద్ బ్రూహి యదీచ్ఛసి దదామితే | ఇత్యుక్తే%థ మయా తత్ర పృష్టః ప్రోవాచ తన్నృపః || 30
భీష్ముడు ఇట్లు పలికెను -
ఓయీ శత్రువులను సంహరించినవాడా ! ఈ విషయమును పరలోకమును పొందిన నా తండ్రి పూర్వము చెప్పగా నేను వినియుంటిని. నేను దానిని నీకు యథాతథముగా చెప్పెదను (19). నేను శ్రాద్ధసమయములో నా తండ్రికొరకై పిండమును సిద్ధము చేసితిని. నా తండ్రి భూమిని పగులకొట్టుకొని వచ్చి చేతితో పిండమునిమ్మని కోరెను (20). కాని శ్రాద్ధకల్పమునందు పిండవిధి ఆ విధముగా చెప్పబడలేదని నిశ్చయించుకొని నేను వెనకాడకుండగా పిండమును అపుడు దర్భలయందు మాత్రమే సమర్పించితిని (21) భరతవంశములో శ్రేష్ఠమైనవాడా! పుణ్యాత్మా ! నేను చేసిన పనికి నా తండ్రి చాల సంతోషించి, అపుడు మధురమగు వాక్కుతో నిట్లనెను (22). ఓ పురుషశ్రేష్ఠా ! ధర్మవేత్త, పండితుడు అగు నీవంటి పుత్రునిచే నేను పుత్రుడు గలవాడనైతిని. నేను నీ వలన తరింప చేయబడితిని. నేను నీమనస్సును తెలియగోరి అట్లు చేసితిని (23). రాజు ఏ విధముగా ధర్మమునాచరించి ప్రమాణమును నెలకొల్పునో, ఆ ప్రమాణబద్ధమగు కర్మను మాత్రమే ప్రజలు సర్వదా అనుసరించెదరు (24). భరతవంశీయులలో శ్రేష్ఠమైనవాడా ! నీవు శాశ్వతములగు వేద ధర్మములను వినుము. ఓ పుత్రా ! నీవు వేదధర్మము యొక్క ప్రమాణమును నిలబెట్టితివి (25). కావున నేను నీ విషయములో మిక్కిలి ప్రీతుడనై సర్వశ్రేష్ఠమగు వరమును నీకు ఇచ్చుచున్నాను. ముల్లోకములలో పొంద శక్యము కాని వరమును స్వీకరించుము (26). నీవు ఎంతవరకు జీవించవలెనని కోరెదవో, అంతవరకు నిన్ను మృత్యువు ఏమియూ చేయలేదు. నీ అనుమతిని పొందిన తరువాత మాత్రమే మృత్యువు నిన్ను స్పృశించగల్గును (27). నీవు ఇంకనూ మరియొక ఉత్తమవరమును కోరుచున్నావా ? కోరుకొనుము. నేను మరల ఇచ్చెదను. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠమైనవాడా ! నీ మనసులోని మాటను చెప్పుము (28). ఆయన ఇట్లు పలుకగా, నేను చేతులు జోడించి ప్రణమిల్లి ఇట్లు పలికితిని. మర్యాదను నిలబెట్టు ఓ తండ్రీ ! నీవు ప్రసన్నుడవైనచో, నేను కృతార్థుడనైతిని. నేను ఒక ప్రశ్నను వేసెదను. నీవు దానికి స్వయముగా సమాధానమును చెప్పుము (29). అపుడాయన నాతో ఇట్లనెను :"నీవు దేనిని కోరినా, నేను దానిని నీకు ఇచ్చెదను. చెప్పుము". అపుడు నేను ఆ రాజును ప్రశ్నించగా, ఆయన ఇట్లు చెప్పెను (30).
శంతనురువాచ |
శృణు తాత ప్రవక్ష్యామి ప్రశ్నంతే%హం యథార్ధతః | పితృకల్పం చ నిఖిలం మార్కండేయేన మే శ్రుతమ్ || 31
యత్త్వం పృచ్ఛసి మాం తాత తదేవాహం మహామునిమ్ | మార్కండేయమపృచ్ఛం హి స మాం ప్రోవాచ ధర్మవిత్ || 32
శంతనుడిట్లు పలికెను -
ఓ పుత్రా ! వినుము. నీ ప్రశ్నకు యథార్థమగు సమాధానమును చెప్పెదను. నేను మార్కండేయుడు చెప్పగా పితృకల్పమునంతనూ వినియుంటిని (31). ఓ కుమారా ! నీవు నన్ను వేసిన ప్రశ్ననే నేను మార్కండేయమహర్షికి వేసితిని. ఆ ధర్మజ్ఞుడు నాకు ఇట్లు చెప్పెను (32).
మార్కండేయ ఉవాచ |
శృణు రాజన్మయా దృష్టం కదాచిత్పశ్యతా దివమ్ | విమానం మహదాయాంతమంతరేణ గిరేస్తదా || 33
తస్మిన్ విమానే పర్యక్షం జ్వలితాంగారవర్చసమ్ | మహాతేజః ప్రజ్వలంతం నిర్విశేషం మనోహరమ్ || 34
అపశ్యం చైవ తత్రాహం శయానం దీప్తతేజసమ్ | అంగుష్ఠమాత్రం పురుషమగ్నావగ్ని మివాహితమ్ || 35
సో%హం తసై#్మనమః కృత్వా ప్రణమ్య శిరసా ప్రభుమ్ | అపృచ్ఛం చైవ తమహం విద్యామస్త్వాం కథం విభో || 36
మామువాచ స ధర్మాత్మాతే న తద్విద్యతే తపః | యేన త్వం బుధ్యసే మాం హి మునే వై బ్రహ్మణస్సుతమ్ || 37
సనత్కుమారమితి మాం విద్ధి కిం కరవాణి తే | యే త్వన్యే బ్రహ్మణః పుత్రాః కనీయాంసస్తు తే మమ || 38
భ్రాతరస్సప్త దుర్ధర్షా యేషాం వంశాః ప్రతిష్ఠితాః | వయం తు యతిధర్మాణస్సంయమ్యాత్మాన మాత్మని || 39
యథోత్పన్నస్తథైవాహం కుమార ఇతి విశ్రుతః | తస్మాత్సనత్కుమారం మే నామైతత్కథితం మునే || 40
యద్భక్త్యాతే తపశ్చీర్ణం మమ దర్శనకాంక్షయా | ఏష దృష్టో%స్మి భద్రం తే కం కామం కరవాణి తే || 41
ఇత్యుక్తవంతం తం చాహం ప్రావోచం త్వం శృణు ప్రభో | పితృణామాదిసర్గం చ కథయస్వ యథాతథమ్ || 42
ఇత్యుక్తస్స తు మాం ప్రాహ శృణు సర్వం యథాతథమ్ | వచ్మి తే తత్త్వతస్తాత పితృసర్గం శుభావహమ్ || 43
మార్కండేయుడు ఇట్లు పలికెను -
ఓ రాజా ! వినుము. ఒకనాడు నేను అంతరిక్షమును పరికించుచుండగా, పర్వత సమీపమునుండి వచ్చుచున్న పెద్ద విమానము కనబడినది (33). ఆ విమానములో ప్రజ్వరిల్లే అగ్నిని బోలిన మహాతేజస్సును గాంచితిని. మనోహరమగు ఆ తేజస్సును మించినది మరియొకటి ఉండబోదు (34). దానిలో అగ్నియందు ఉంచబడిన అగ్నివలె గొప్పగా ప్రకాశించే, బొటనవ్రేలు పరిమాణము గల ఒక పురుషుని చూచితిని. ఆయన దానిలో విశ్రమించుచుండెను (35). నేనా ప్రభునకు తలవంచి నమస్కరించి, 'ఓ మహాత్మా! మీ పరిచయమేమి ?' అని ప్రశ్నించితిని (36). ఆ ధర్మాత్ముడు నాతో నిట్లనెను. ఓ మునీ ! నన్ను తెలుసుకో గలిగే తపస్సు నీ వద్ద లేదు. నేను బ్రహ్మపుత్రుడను (37). నేను సనత్కుమారుడనని తెలుసుకో. నీకు నేను ఏమి చేయవలెను ? బ్రహ్మ యొక్క ఇతరపుత్రులు నాకంటె చిన్నవారు (38). మహాతేజశ్శాలురగు నా ఏడ్గురు సోదరులు తమ వంశములను స్థాపించిరి. యతిధర్మముననుసరించే మేము మనస్సును ఆత్మయందు నిగ్రహించి ఉండెదము (39). పుట్టినప్పుడు ఎట్లు ఉంటినో, ఇప్పుటికీ అదే విధముగా నున్న నేను కుమారుడనని ప్రసిద్ధిని గాంచితిని. ఓ మునీ ! కావుననే, నాకు సనత్కుమారుడను పేరు కలిగినది (40).నీవు నన్ను చూడగోరి, భక్తితో తపస్సును చేసితివి. కావుననే, ఇదిగో! నీకు కనబడితిని. నీకు ఏ కోరిక గలదో చెప్పుము. నేను తీర్చెదను (41) ఆయన ఇట్లు పలుకగా, నేనాయనతో "ఓ ప్రభూ ! నీవు వినుము. పితృదేవతల ఆదిమసృష్టిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము" అని పలికితిని (42) . నేనట్లు పలుకగా, ఆయన నాతో ఇట్లనెను. ఓ వత్సా ! వినుము. శుభకరమగు పితృసృష్టిని గురించి పూర్తిగా యథాతథముగా నీకు చెప్పెదను. దాని తత్త్వమును నీకు వివరించెదను (43).
సనత్కుమార ఉవాచ |
దేవాన్ పురాసృజద్ర్బహ్మా మాం యక్షధ్వం స చాహ తాన్ | తముత్సృజ్య తమాత్మానమయజంస్తే ఫలార్థినః || 44
తే శప్తా బ్రహ్మణా మూఢా నష్ట సంజ్ఞా భవిష్యథ | తస్మాత్కించిదజానంతో నష్టసంజ్ఞాః పితామహమ్ || 45
ప్రోచుస్తం ప్రణతాస్సర్వే కురుష్వాను గ్రహం హి నః | ఇత్యుక్తస్తానువాచేదం ప్రాయశ్చిత్తార్థమేవ హి || 46
పుత్రాన్ స్వాన్ పరిపృచ్ఛద్వం తతో జ్ఞానమవాప్స్యథ | ఇత్యుక్తా నష్టసంజ్ఞాస్తే పుత్రాన్ ప ప్రచ్ఛురోజసా || 47
ప్రాయశ్చిత్తార్థమేవాధిలబ్ధ సంజ్ఞా దివౌ కసః | గమ్యతాం పుత్రకా ఏవం పుత్రైరుక్తాశ్చ తే%నఘ || 48
అభిశప్తాస్తు తే దేవాః పుత్రకామేన వేధసమ్ | పప్రచ్ఛురుక్తాః పుత్రైస్తే గతాస్తే పుత్రకా ఇతి || 49
తతస్తా న బ్రవీద్దేవో దేవాన్ బ్రహ్మ ససంశయాన్ | శృణుధ్వం నిర్జరాస్సర్వే యూయం న బ్రహ్మవాదినః || 50
తస్మాద్యదుక్తం యుష్మాకం పుత్రైసై#్తఃజ్ఞానిసత్తమైః | మంతవ్యం సంశయం త్యక్త్వా తథా న చ తదన్యథా || 51
దేవాశ్చ పితరశ్చైవ యజధ్వం త్రి దివౌకసః | పరస్పరం మహాప్రీత్యా సర్వకామఫలమప్రదా || 52
తతస్తే ఛిన్న సందేహాః | ప్రీతిమంతః పరస్పరమ్ | బభూవుర్మునిశార్దూల బ్రహ్మవాక్యాత్సుఖప్రదాః || 53
తతో దేవా హి ప్రోచుస్తాన్ యదుక్తాః పుత్రకా వయమ్ | తస్మాద్భవంతః పితరో భవిష్యథ న సంశయః || 54
సనత్కుమారుడు ఇట్లు పలికెను -
పూర్వము బ్రహ్మ దేవతలను సృష్టించి, 'నన్ను పూజించుడు' అని వారితో చెప్పెను. కాని వారు ఫలములను గోరి, బ్రహ్మను విడిచిపెట్టి తమను తాము ఆరాధించుకొనిరి (44). అపుడు బ్రహ్మ వారిని, 'బుద్ధిని గోల్పోయి మూర్ఖులు కండు' అని శపించెను. ఆ శాపమువలన బుద్ధిని గోల్పోయి దేనినైననూ తెలియజాలని ఆ దేవతలు అందరు బ్రహ్మకు ప్రణమిల్లి ఆయనతో, 'మమ్ములను అనుగ్రహించుము' అని ప్రార్థించిరి. వారు అట్లు పలుకగా, అపుడు బ్రహ్మ వారితో, 'మీరు మీ పుత్రులను అడిగి జ్ఞానమును పొందుడు' అని ప్రాయశ్చిత్తమునుపదేశించెను. బ్రహ్మ అట్లు చెప్పినవెంటనే, బుద్ధిని గోల్పోయి ఉన్న ఆ దేవతలు ధైర్యముతో పుత్రులను ప్రాయశ్చిత్తము కొరకు ప్రశ్నించిరి. ఓ పుణ్యాత్మా! ఆపుడా దేవతలతో వారి పుత్రులు, 'ఓ పుత్రులారా ! వెళ్లుడు' అని పలికిరి. అపుడా దేవతలకు బుద్ధి ఏర్పడెను (45-48). శాపమును పొందియున్న ఆ దేవతలు పుత్రులచే ఆ విధముగా పలుకబడిన వారై, పుత్రులయందలి కామనతో బ్రహ్మ వద్దకు వెళ్లి, 'ఆ పుత్రులు వెళ్లిపోయినారు' అని చెప్పిరి (49). అపుడు బ్రహ్మదేవుడు సంశయమును కలిగియున్న ఆ దేవతలతో నిట్లనెను: ఓ దేవతలారా ! మీరందరు వినుడు. మీరు బ్రహ్మవాదులు కారు (50). కావున, జ్ఞానులలో శ్రేష్ఠులగు ఆ పుత్రులు మీకు ఏమి చెప్పిరో, దానిని సందేహములను వీడి మననము చేయుడు. వారు చెప్పిన దానికి తిరుగు లేదు (51). ఓ స్వర్గవాసులారా ! దేవతలు, పితరులు ఒకరినొకరు మహాప్రీతితో పూజించుకొనుడు. దాని వలన మీరు కోరిన ఫలములన్నియు లభించగలవు (52). ఓ మహర్షీ! అపుడు వారు బ్రహ్మయొక్క ఈ వచనము వలన తొలగిన సందేహములు గలవారై ఒకరిపై నొకరు ప్రీతిని కలిగి యుండిరి (53). అపుడు దేవతలు ఆ పుత్రులతో నిట్లనిరి. మీరు మమ్ములను 'ఓపుత్రులారా !' అని సంబోధించినారు. కావున మీరు పితరులు అగుచున్నారు. దీనిలో సందేహము లేదు (54).
పితృశ్రాద్ధే క్రియాం కశ్చిత్కరిష్యతి న సంశయః | శ్రాద్ధై రాప్యాయితస్సోమో లోకానాప్యాయయిష్యతి || 55
సముద్రం పర్వతవనం జంగమాజంగమైర్వృతమ్ | శ్రాద్ధాని పుష్టికామైశ్చ యే కరిష్యంతి మానవాః || 56
తేభ్యః పుష్టిప్రదాశ్చైవ పితరః ప్రీణితాస్సదా | శ్రాద్ధా యే చ ప్రదాస్యంతి త్రీన్ పిండాన్నామగోత్రతః || 57
సర్వత్ర వర్తమానాస్తే పితరం ప్రపితామహాః | భావయిష్యంతి సతతం శ్రాద్ధదానేన తర్పితాః || 58
ఇతి తద్వచనం సత్యం భవత్వథ దివౌకసః | పుత్రాశ్చ పితరశ్చైవ వయం సర్వే పరస్పరమ్ || 59
ఏవం తే పితరో దేవా ధర్మతః పుత్రతాం గతాః | అన్యోన్యం పితరో వై తే ప్రథితాః క్షితిమండలే || 60
ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం పితృప్రభావ వర్ణనం నామ చత్వారింశో%ధ్యాయః (40).
ఎవడో ఒకడు నిస్సందేహముగా పితృశ్రాద్ధములో పిండదానాది క్రియలను చేయును. ఆ శ్రాద్ధ కర్మలచే పుష్టిని పొందిన సోముడు జనులకు పుష్టిని ఈయగలడు (55). సోముడు సముద్రమును, చరాచరప్రాణులతో గూడిన పర్వతములయందలి వనములను వర్ధిల్ల జేయును. ఏ మానవులైతే పుష్టిని గోరి శ్రాద్ధములను చేయుదురో, వారికి ప్రీతిని పొందిన పితరులు సర్వకాలములలో పుష్టిని ఈయగలరు. ఎవరైతే పేర్లను, గోత్రములను చెప్పి మూడు పిండములను శ్రాద్ధమునందు సమర్పించెదరో, వారి తండ్రులు, పితామహులు, ప్రపితామహులు అట్టి శ్రాద్ధ పిండదానముచే తృప్తిని పొందినవారై సర్వకాలములలో వారిని వెన్నంటియుండి వారికి అభివృద్ధిని కలుగ జేయుదురు (56-58). ఈ దేవతల వచనము సత్యము అగు గాక ! దేవతలు పుత్రులు కాగా, పితరులు వారి తండ్రులైరి. ఈ విధముగా దేవతలు, పితృదేవతలు అగు మనమందరము పరస్పరప్రేమను కలిగియున్నాము. ఈ విధముగా ఆ పితరుల యెదుట దేవతలు ధర్మబద్ధముగా పుత్రులైరి. పితృదేవతలు తండ్రులు అయిరి. వారు పరస్పరము ఆరాధించుకొనగా, పితృదేవతల ఆరాధన భూమండలములో ప్రఖ్యాతిని గాంచినది (59, 60).
శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు పితృదేవతల ప్రభావమును వర్ణించే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).