Siva Maha Puranam-4
Chapters
అథ ద్వావింశో
శివశాస్త్రములో చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మలు
ఉపమన్యురువాచ |
న్యాసస్తు త్రివిధః ప్రోక్తః స్థిత్యుత్పత్తిలయ క్రమాత్ | స్థితిర్న్యాసో గృహస్థానాముత్పత్తిర్బ్రహ్మచారిణామ్ || 1
యతీనాం సంహృతిన్యాసో వనస్థానాం తథైవ చ | స ఏవ భర్తహీనాయాః కుటుంబిన్యాః స్థితిర్భవేత్ || 2
కన్యాయాః పునరుత్పత్తిం వక్ష్యే న్యాసస్య లక్షణమ్ | అంగుష్ఠాదికనిష్ఠాంతం స్థితిన్యాస ఉదాహృతః || 3
దక్షిణాంగుష్ఠమారభ్య వామాంగుష్ఠాంతమేవ చ | ఉత్పిత్తిన్యాస ఆఖ్యాతో విపరీతస్తు సంహృతిః || 4
సబిందుకాన్నకారాదీన్ వర్ణాన్న్యస్యేదనుక్రమాత్ | అంగులీషు శివం న్యస్యేత్తలయోరప్యనామయోః || 5
అస్త్రన్యాసం తతః కృత్వా దశదిక్ష్వస్త్రమంత్రతః | నివృత్త్యాదికలాః పంచ పంచ భూతస్వరూపిణీః || 6
పంచభూతాధిపైస్సార్ధం తత్తచ్చిహ్నసమన్వితాః | హృత్కంఠతాలు భ్రూమధ్యబ్రహ్మరంధ్రసమాశ్రయాః || 7
తత్తద్బీజేన సంగ్రంథీస్తత్తద్బీజేషు భావయేత్ | తాసాం విశోధనార్థాయ విద్యాం పంచాక్షరీం జపేత్ || 8
నిరుద్ధ్వా ప్రాణవాయుం చ గుణ సంఖ్యానుసారతః | భూతగ్రంథిం తతశ్ఛింద్యాదస్త్రేణౖవాస్త్రముద్రయా || 9
నాడ్యా సుషుమ్నయాత్మానం ప్రేరితం ప్రాణవాయునా | నిర్గతం బ్రహ్మరంధ్రేణ యోజయేచ్ఛివతేజసా || 10
ఉపమన్యువు ఇట్లు పలికెను -
స్థితి, ఉత్పత్తి, లయము అను వరుసను బట్టి న్యాసము మూడు విధములుగా నున్నది. గృహస్థులు మరియు కుటుంబినులు అగు స్త్రీలు స్థితిన్యాసమును, బ్రహ్మచారులు మరియు కన్యలు ఉత్పత్తిన్యాసమును, యతులు సన్న్యాసులు మరియు భర్త లేని స్త్రీలు లయన్యాసమును చేయవలెను. ఇప్పుడు న్యాసము యొక్క లక్షణమును చెప్పెదను. బొటన వ్రేలితో మొదలిడి చిటికెన వ్రేలి వరకు చేసే న్యాసము స్థితిన్యాసమనబడును (1-3). కుడి బొటనవ్రేలితో మొదలిడి ఎడమ బొటనవ్రేలి వరకు ఉత్పత్తిన్యాసమనియు, దీనికి తల్లక్రిందులు అయినచో లయన్యాసమనియు చెప్పబడినది (4). సం, మం, శిం, వాం, యం, అను వర్ణములను వరుసగా అయిదు వ్రేళ్లయందు న్యాసము చేయవలెను. కరతలములయందు మరియు అనామికలయందు శివుని న్యాసము చేయవలెను (5). తరువాత పది దిక్కుల యందు అస్త్రమంత్రముతో అస్త్రన్యాసమును చేసి, పంచభూతములే స్వరూపముగా కలిగి ఆయా చిహ్నములతో కూడియున్న నివృత్తి మొదలగు కళలను పంచభూతముల అధిష్టానదేవతలతో సహా హృదయము, కంరము, తాలువు, కనుబొమల మధ్యభాగము మరియు బ్రహ్మరంధ్రము అను స్థానములలో పైన చెప్పిన బీజాక్షరములతో జోడించి న్యాసము చేయవలెను (6, 7). ఆ బీజములయందు ఆ కళలను భావన చేయవలెను. వాటి శోధనము కొరకై పంచాక్షరీమంత్రమును జపించవలెను (8). తరువాత మూడు సార్లు ప్రాణాయామమును చేసి, అస్త్రమంత్రమును చెప్పి అస్త్రముద్రతో భూతగ్రంథి (పాంచభౌతికమగు దేహముతో తాదాత్మ్యము) ని ఛేదించవలెను (9). ప్రాణవాయువుచే సుషుమ్నానాడిగుండా పైకి లేవదీయబడిన ఆత్మను బ్రహ్మరంధ్రముగుండా పైకి తీసుకువచ్చి శివతేజస్సుతో జోడించవలెను (10).
విశోష్య వాయునా పశ్చాద్దేహం కాలాగ్నినా సహ | తతశ్చోపరిభావేన కలాస్సంహృత్య వాయునా || 11
దేహం సంహృత్య వై దగ్ధం కలాస్స్పృష్ట్వా సహాబ్ధినా | ప్లావయిత్వామృతైర్దేహం యథాస్థానం నివేశ##యేత్ || 12
అథ సంహృత్య వై దగ్ధఃకలాసర్గం వినైవ తు | అమృతప్లావనం కుర్యాద్భస్మీభూతస్య వై తతః || 13
తతో విద్యామయే తస్మిన్ దేహే దీపశిఖాకృతిమ్ | శివాన్నిర్గతమాత్మానం బ్రహ్మరంధ్రేణ యోజయేత్ || 14
దేహస్యాంతః ప్రవిష్టం తం ధ్యాత్వా హృదయపంకజే | పునశ్చామృతవర్షేణ సించేద్విద్యామయం వపుః || 15
తతః కుర్యాత్కరన్యాసం కరశోధనపూర్వకమ్ | దేహన్యాసం తతః పశ్చాన్మహత్యా ముద్రయా చరేత్ || 16
అంగన్యాసం తతః కృత్వా శివోక్తేన తు వర్త్మనా | వర్ణన్యాసం తతః కుర్యాద్ధస్తపాదాదిసంధిషు || 17
షడంగాని తతో న్యస్య జాతిషట్కయుతాని చ | దిగ్బంధమాచరేత్పశ్చాదాగ్నేయాది యథాక్రమమ్ || 18
యద్వామూర్ధాదిపంచాంగం న్యాసమేవ సమాచరేత్ | తథా షడంగన్యాసం చ భూతశుద్ధ్యాదికం వినా || 19
ఏవం సమాసరూపేణ కృత్వా దేహాత్మ శోధనమ్ | శివభావముపాగమ్య పూజయేత్పరమేశ్వరమ్ || 20
తరువాత దేహమును వాయువుచే శోషింపజేసి (భావనలో) కాలమనే అగ్నితో దహించవలెను. తరువాత పైకి ప్రసరించే వాయువుతో కళలను ఒకచోటికి తీసుకువచ్చి, దహింపబడిన దేహమును వాటియందు ఉపసంహరించి, కళలచే సముద్రమును స్పృశింప జేసి, అమృతబిందువులతో దేహమును తడిపి ఉజ్జీవింప జేసి, దానిని మరల యథాస్థానములో నుంచవలెను (11,12). తరువాత ఈ విధముగా కళలను ఉపసంహరించి దహింపబడిన దేహము గల సాధకుడు కళల సృష్టి లేకుండగనే, భస్మమై యున్న దేహముపై అమృతమును కురిపించవలెను (13). తరువాత శివుని నుండి బయటకు వచ్చి నీపశిఖ యొక్క ఆకారములోనున్న ఆత్మను విద్యతో నిండియున్న ఆ దేహములో బ్రహ్మరంధ్రముతో కలుపవలెను (14). దేహములోపల ప్రవేశించిన ఆ ఆత్మను హృదయపద్మమునందు ధ్యానించి, మరల విద్యతో నిండియున్న దేహమును అమృతవర్షముతో తడుపవలెను (15). తరువాత చేతులను కడుగుకొని కరన్యాసమును చేయవలెను. తరువాత మహతీముద్రతో దేహన్యాసమును చేయవలెను (16). తరువాత అంగన్యాసమును చేసి, శివుడు చెప్పిన విధానములో చేతులు, కాళ్లు మొదలగు వాటి కీళ్లయందు వర్ణముల న్యాసమును చేయవలెను (17). తరువాత ఆరు జాతులతో కూడిన ఆరు అంగముల న్యాసమును చేసి, వరుసగా ఆగ్నేయము మొదలగు దిక్కుల బంధమును చేయవలెను (18). లేదా, శిరస్సు మొదలగు అయిదు అంగముల న్యాసమును మాత్రమే చేయవచ్చును. అదే విధముగా భూతశుద్ధి మొదలగునవి లేకుండగా ఆరు అంగముల న్యాసమును మాత్రమే చేయవచ్చును (19). ఈ విధముగా సంగ్రహముగా దేహశోధనమును మరియు ఆత్మశోధనమును చేసి, శివభావమును పొంది, పరమేశ్వరుని పూజించవలెను (20).
అథ యస్యాస్త్యవసరో నాస్తి వా మతి విభ్రమః | స విస్తీర్ణేన కల్పేన న్యాసకర్మ సమాచరేత్ || 21
తత్రాద్యో మాతృకాన్యాసో బ్రహ్మన్యాసస్తతః పరమ్ | తృతీయః ప్రణవన్యాసో హంసన్యాసస్తదుత్తరః || 22
పంచమః కథ్యతే సద్భిర్న్యాసః పంచాక్షరాత్మకః | ఏతేష్వేకమనేకం వా కుర్యాత్పూజాదికర్మసు || 23
అకారం మూర్ధ్ని విన్యస్య ఆకారం చ లలాటకే | ఇం ఈం చ నేత్రయోస్తద్వత్ ఉం ఊం శ్రవణయోస్తథా || 24
ఋం బుూం కపోలయోశ్చైవ లుం లూం నాసాపుటద్వయే | ఏమేమోష్ఠద్వయోరోమౌం దంతపంక్తిద్వయోః క్రమాత్ || 25
అం జిహ్వాయామథో తాలున్యః ప్రయోజ్యో యథాక్రమమ్ | కవర్గం దక్షిణ హస్తే న్యసేత్పంచసు సంధిషు || 26
చవర్గం చ తథా వామహస్తసంధిషు విన్యసేత్ | టవర్గం చ తవర్గం చ పాదయోరుభయోరపి || 27
పఫౌ తు పార్శ్వయోః పృష్ఠే నాభౌ చాపి బభౌ తతః | న్యసేన్మకారం హృదయే త్వగాదిషు యథాక్రమమ్ || 28
యకారాదిసకారాంతాన్న్యసేత్సప్తసు ధాతుషు | హకారం హృదయస్యాంతః క్షకారం భ్రూయుగాంతరే || 29
ఏవం వర్ణాన్ ప్రవిన్యస్య పంచాశద్రుద్రవర్త్మనా | అంగవక్త్రకలాభేదాత్పంచ బ్రహ్మాణి విన్యసేత్ || 30
ఆవశ్యకత ఉండి మానసికమగు విభ్రమము లేనివాడు విస్తారమగు ప్రయోగముతో న్యాసకర్మను చక్కగా చేయవలెను (21). న్యాసములలో మొదటిది మాతృకాన్యాసము. రెండవది బ్రహ్మన్యాసము. మూడవది ప్రణవన్యాసము. నాల్గవది హంసన్యాసము (22). అయిదవది పంచాక్షరన్యాసమని సత్పురుషులు చెప్పుచున్నారు. పూజ మొదలగు కర్మలలో వీటిలో ఒకదానిని గాని, లేదా అనేకములను గాని చేయవలెను (23). అకారమును శిరస్సుపై, ఆకారమునలలాటమునందు, ఇం ఈం అను వర్ణములను రెండు కళ్లయందు, అదే విధముగా ఉం ఊం అను వర్ణములను రెండు చెవులయందు (24). ఋం బుూం అను వర్ణములను రెండు చెక్కిళ్లయందు, లుం లూం (అచ్చులు) అను వర్ణములను రెండు ముక్కుపుటములయందు, ఏం ఐం అను వర్ణములను రెండు పెదవులయందు, ఓం ఔం అను వర్ణములను రెండు పలువరుసలయందు (25), అం అను వర్ణమును నాలుకయందు, తరువాత అః అను వర్ణమును తాలువుయందు న్యాసము చేయవలెను. కవర్గను కుడి చేతియందలి అయిదు సంధులయందు (26). అదే విధముగా చవర్గను ఎడమ చేతి సంధుల యందు న్యాసము చేయవలెను టవర్గ-తవర్గలను రెండు పాదములయందు (27), పకార ఫకారములను రెండు పార్శ్వములయందు, తరువాత బకారమును వీపునందు, భకారమును నాభియందు, మకారమును హృదయమునందు, చర్మము మొదలగు ఏడు ధాతువుయందు వరుసగా యకారమునుండి సకారము వరకు గల వర్ణములను, హకారమును వృదయము లోపల, క్షకారమును కనుబొమల మధ్యలో న్యాసము చేయవలెను (28,29). ఈ విధముగా ఏబది వర్ణములను రుద్రుడు చెప్పిన మార్గములో న్యాసము చేసి, అయిదు అవయవములు, అయిదు ముఖములు, అయిది కళలు అనే భేదముననుసరించి సద్యోజాతుడు మొదలగు అయిదు బ్రహ్మలను న్యాసము చేయవలెను (30)
కరన్యాసాద్యమపి తైః కృత్వా వాథ న వా క్రమాత్ | శిరోవదనహృద్గుహ్యపాదేష్వేతాని కల్పయేత్ || 31
తతశ్చోర్ధ్వాది వక్త్రాణి పశ్చిమాంతాని కల్పయేత్ | ఈశానస్య కలాః పంచ పంచస్వేతేషు చ క్రమాత్ || 32
తతశ్చతుర్షు వక్త్రేషు పురుషస్య కలా అపి | చతస్రః ప్రణిధాతవ్యాః పూర్వాదిక్రమయోగతః || 33
హృత్కంఠాంసేషు నాభౌ చ కుక్షౌ పృష్ఠే చ వక్షసి | అఘోరస్య కలాశ్చాష్టౌ పాదయోరపి హస్తయోః || 34
పశ్చాత్త్రయోదశకలాః పాయుమేఢ్రోరుజానుషు | జంఘాస్ఫిక్కటిపార్శ్వే షు వామదేవస్య భావయేత్ || 35
ఘ్రాణ శిరసి బాహ్వోశ్చ కల్పయేత్కల్ప విత్తమః | అష్టత్రింశత్కలాన్యాసమేవం కృత్వానుపూర్వశః || 36
పశ్చాత్ర్పణవవిద్ధీమాన్ ప్రణవన్యాసమాచరేత్ | బాహుద్వయే కూర్పరయోస్తథా చ మణిబంధయోః || 37
పార్శ్వోదరోరుజంఘేషు పాదయోః పృష్టతస్తథా | ఇత్థం ప్రణవవిన్యాసం కృత్వా న్యాసవిచక్షణః || 38
హంసన్యాసం ప్రకుర్వీత శివశాస్త్రే యథోదితమ్ | బీజం విభజ్య హంసస్య నేత్రయోర్ఘ్రాణయోరపి || 39
విభజ్య బాహునేత్రాస్యలలాటే ఘ్రాణయోరపి | కక్షయోస్స్కంధయోశ్చైవ పార్శ్వయోః స్తనయోస్తథా || 40
కట్యోః పాణ్యోర్గుల్ఫయోశ్చ యద్వా పంచాంగవర్త్మనా | హంసన్యాసమిమం కృత్వా న్యసేత్పంచాక్షరీం తతః || 41
అంగన్యాస కరన్యాసములను ఆ పంచబ్రహ్మమంత్రములతో చేయవచ్చును, చేయక పోవచ్చును. కాని శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు అను స్థానములయందు ఈ అయిదు బ్రహ్మలను భావనా రూపముగా స్థాపించవలెను (31). తరువాత ఊర్ధ్వదిక్కుతో మొదలిడి పశ్చిమముతో పూర్తి అయ్యే అయిదు ముఖములలో క్రమముగా ఈశానుని అయిదు కళలను స్థాపించవలెను (32). తరువాత తత్పురుషుని నాలుగు కళలను కూడా తూర్పు దిక్కుతో మొదలు పెట్టి క్రమముగా నాలుగు ముఖములలో స్థాపించవలెను (33). కల్పవేత్తలలో శ్రేష్ఠుడగు సాధకుడు అఘోరుని ఎనిమిది కళలను హృదయము, కంఠము, రెండు భుజములు, నాభి, ఉదరము, వీపు, వక్షస్థలము అను స్థానములయందు, తరువాత వామదేవుని పదమూడు కళలను పాదములు, చేతులు, విసర్జనేంద్రియము, జననేంద్రియము, తోడలు, మోకాళ్లు, పిక్కలు, పిరుదులు, నడుము, పార్శ్వములు, ముక్కు, తల, బాహువులు అను స్థానములలో భావించవలెను. ఈ విధముగా ఒక వరుసలో ముప్పది ఎనిమిది కళల న్యాసమును చేసి (34-36), తరువాత ఓంకారస్వరూపమునెరింగిన సాధకుడు రెండు బాహువులు, మోచేతులు, మణికట్లు, పార్శ్వములు, ఉదరము, మోకాళ్లు, పాదములు, వీపు అను స్థానములయందు ప్రణవ న్యాసమును చేయవలెను. న్యాసములో విద్వాంసుడగు సాధకుడు ఈ విధముగా ప్రణవన్యాసమును చేసి (37,38), శివశాస్త్రములో చెప్పబడిన విధముగా హంసన్యాసమును చేయవలెను. హంసమంత్రముయొక్క బీజమును విభాగము చేసి రెండేసి చొప్పున కన్నులు, ముక్కులు, బాహువులు, కక్షములు, భుజ స్కంధములు, పార్శ్వములు, నోరు, లలాటము అను స్థానములయందు న్యాసము చేయవలెను. లేదా, ఈ హంసన్యాసమును అయిదు అంగముల (హృదయము, శిరస్సు, శిఖ, కవచము, కన్నులు) పద్ధతిలో చేసి, తరువాత పంచాక్షరన్యాసమును చేయవలెను (39-41).
యథా పూర్వోక్తమార్గేణ శివత్వం యేన జాయతే | నాశివశ్శివమభ్యస్యేన్నాశివశ్శివమర్చయేత్ || 42
నాశివస్తు శివం ధ్యాయేన్నాశివః ప్రాప్నుయాచ్ఛివమ్ | తస్మాచ్ఛైవీం తనుం కృత్వా త్యక్త్వా చ పశుభావనామ్ || 3
శివో%హమితి సంచింత్య శైవం కర్మ సమాచరేత్ | కర్మయజ్ఞస్తపోయజ్ఞో జపయజ్ఞస్తదుత్తరః |
ధ్యానయజ్ఞో జ్ఞానయజ్ఞః పంచ యజ్ఞాః ప్రకీర్తితాః || 44
కర్మయజ్ఞరతాః కేచిత్తపోయజ్ఞరతాః పరే | జపయజ్ఞరతాశ్చాన్యే ధ్యానయజ్ఞరతాస్తథా || 45
జ్ఞానయజ్ఞరతాశ్చాన్యే విశిష్టాశ్చోత్తరోత్తరమ్ | కర్మయజ్ఞో ద్విధా ప్రోక్తః కామాకావిభేదతః || 46
కామాన్కామీ తతో భుక్త్వా కామాసక్తః పునర్భవేత్ | అకామే రుద్రభవనే భోగాన్ భుక్త్వా తతశ్చ్యుతః || 47
తపోయజ్ఞరతో భూత్వా జాయతే నాత్ర సంశయః | తపస్వీ చ పునస్తస్మిన్ భోగాన్ భుక్త్వా తతశ్చ్యుతః || 48
జపధ్యానరతో భూత్వా జాయతే భువి మానవః | జపధ్యానరతో మర్త్యస్తద్వైశిష్ట్యవశాదిహ || 49
జ్ఞానం లబ్ధ్వాచిరాదేవ శివసాయుజ్యమాప్నుయాత్ | తస్మాన్ముక్తో శివాజ్ఞప్తః కర్మయజ్ఞో%పి దేహినామ్ || 50
అకామః కామసంయుక్తో బంధాయైవ భవిష్యతి | తస్మాత్పంచసు యజ్ఞేషు ధ్యానజ్ఞానపరో భ##వేత్ || 51
ధ్యానం జ్ఞానం చ యస్యాస్తి తీర్ణస్తేన భవార్ణవః | హింసాదిదోషనిర్ముక్తో విశుద్ధశ్చిత్తసాధనః || 52
పైన చెప్పిన విధముగా న్యాసమును చేయుటవలన సాధకునియందు శివత్వము నిర్మాణమగును. ఈ విధముగా శివుడు కానివాడు శివమంత్రమును జపించరాదు; శివుని పూజించరాదు; శివుని ధ్యానించరాదు; శివుని సన్నిధికి పోరాదు; కావున, సాధకుడు దేహమును శివమయముగా చేసుకొని పశుభావమును విడనాడి, శివో%వామ్ (శివుడను నేనే) అని భావన చేసి, శివునకు సంబంధించిన కర్మను చేయవలెను. కర్మయజ్ఞము, తపోయజ్ఞము, జపయజ్ఞము, ధ్యానయజ్ఞము, జ్ఞానయజ్ఞము అను అయిదు యజ్ఞములు కీర్తించబడినవి (42-44). కొందరు కర్మయజ్ఞమునందు, కొందరు తపోయజ్ఞమునందు, మరికొందరు జపయజ్ఞమునందు, కొందరు ధ్యానయజ్ఞమునందు, ఇంకొందరు జ్ఞానయజ్ఞమునందు ప్రీతిని కలిగియుందురు. వీరిలో ముందు చెప్పిన వారికంటె తరువాతి వారు శ్రేష్ఠులు. కామ్యకర్మ మరియు నిష్కామకర్మ అను భేదమును బట్టి కర్మయజ్ఞము రెండు విధములుగా నున్నది (4,46). కామనలు గలవాడు కామములననుభవించి, మరల కామనలయందు ఆసక్తి గల వాడు అగును. కామనలు లేనివాడు రుద్రుని భవనములో భోగములను అనుభవించి, తరువాత అచటినుండి జారి (47), తపోయజ్ఞమునందు ప్రీతి గల సాధకునిగా జన్మించును. దీనిలో సందేహము లేదు. ఆతడు తపస్సును చేసి, మరల ఆ రుద్రలోకమునందు భోగముల ననుభవించి, మరల అచటినుండి జారి (48), జపమునందు మరియు ధ్యానమునందు ప్రీతి గల మానవునిగా భూలోకములో జన్మించును. జపమునందు మరియు ధ్యానమునందు ప్రీతి గల ఆ మానవుడు వాటి ప్రభావము వలన ఈ లోకములో జ్ఞానమును పొంది, శీఘ్రకాలములో శివుని సాయుజ్యమును పొందును. కావున, కామన లేకుండగా చేయబడిన కర్మయజ్ఞము కూడా శివుని ఆజ్ఞచే మానవులకు మోక్షమునిచ్చును. కామనలతో చేయబడిన కర్మయజ్ఞము బంధమును మాత్రమే కలిగించును. కావున, సాధకుడు ఈ అయిదు యజ్ఞములలో ధ్యాన జ్ఞాన యజ్ఞములయందు మాత్రమే నిష్టను కలిగియుండవలెను (49-51). ఎవని వద్ద ధ్యానము మరియు జ్ఞానము ఉన్నవో, వాడు మనస్సును నియంత్రించి, హింస మొదలగు దోషములనుండి బయటపడి శుద్ధాంతఃకరణుడై సంసార సముద్రమును దాటివేయును (52).
ధ్యానయజ్ఞః పరస్తస్మాదపవర్గఫలప్రదః బహిః | కర్మకరా యద్వన్నాతీవ ఫలభాగినః || 53
దృష్టా నరేంద్రభవనే తద్వదత్రాపి కర్మిణః | ధ్యానినాం హి వపుస్సూక్ష్మం భ##వేత్ర్పత్యక్షమైశ్వరమ్ || 54
యథేహ కర్మిణాం స్థూలం మృత్కాష్ఠాద్యైః ప్రకల్పితమ్ | ధ్యానయజ్ఞ రతాస్తస్మాద్దేవాన్ పాషాణమృన్మయాన్ || 55
నాత్యంతం ప్రతిపద్యంతే శివయాథాత్మ్య వేదనాత్ | ఆత్మస్థం యశ్శివం త్యక్త్వా బహిరభ్యర్చయేన్నరః || 56
హస్తస్థం ఫలముత్సృజ్య లిహేత్కూర్పరమాత్మనః జ్ఞానాద్ధ్యానం భ##వేద్ధ్యానాద్ జ్ఞానంభూయః ప్రవర్తతే || 57
తదుభాభ్యాం భ##వేన్ముక్తిస్తస్మాద్ధ్యానరతో భ##వేత్ | ద్వాదశాంతే తథా మూర్ధ్ని లలాటే భ్రూయుగాంతరే || 58
నాసాగ్రే వా తథాస్యే వా కంధరే హృదయే తథా | నాభౌ వా శాశ్వతస్థానే శ్రద్ధావిద్ధేన చేతసా || 59
బహిర్యాగోపచారేణ దేవం దేవీం చ పూజయేత్ | అథవా పూజయేన్నిత్యం లింగే వా కృతకేపి వా || 60
వహ్నౌ వా స్థండిలే వాథ భక్త్యా విత్తానుసారతః | అథ వాంతర్బహిశ్చైవ పూజయేత్పరమేశ్వరమ్ |
అంతర్యాగరతః పూజాం బహిః కుర్వీత వా న వా || 61
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివశాస్త్రోక్త నిత్యనైమిత్తిక కర్మవర్ణనం నామ ద్వావింశో%ధ్యాయః (22).
కావున, ధ్యానయజ్ఞము శ్రేష్ఠమైనది, మరియు మోక్షము అనే ఫలమును ఇచ్చునది. దీనికి భిన్నముగా బాహ్యకర్మను చేయు కర్మఠులకు, రాజుగారి కొలువు చేయువారికి లభించే జీతము వలెనే, లభించు ఫలము అల్పమే. ధ్యానమును చేయువారికి ఈశ్వరుని సూక్ష్మస్వరూపము ప్రత్యక్షమగును (53,54). కాని కర్మఠులకు మట్టి, చెక్క మొదలగు వాటితో తయారు చేయబడిన ఈశ్వరుని రూపమే గోచరించుచుండునుఅనునది మనకు అనుభవములోనున్న విషయమే. కావుననే, ధ్యానయజ్ఞమునందు ప్రీతిగల సాధకులు శివుని స్వరూపమును తెలిసినవారు గనుక, రాతితో మరియు మట్టితో చేసిన దేవతామూర్తులను తదేకనిష్ఠతో కొలవరు. ఏ మానవుడైతే ఆత్మయందు ఉన్న శివుని విడిచిపెట్టి బాహ్యమునందు అర్చించునో (55,56), వాడు తన అరచేతిలోని పండును విడిచిపెట్టి మోచేతిని ఆస్వాదించినట్లు అగును. జ్ఞానము వలన ధ్యానము కుదురును. మరల ధ్యానము వలన జ్ఞానము ముందుకు సాగును (57). అట్లు ఈ రెండింటి వలన ముక్తి కలుగును. కావున, సాధకుడు ధ్యానమునందు ప్రీతి గలవాడు కావలెను. పన్నెండు దళముల హృదయపద్మము, శిరస్సు, లలాటము, కనుబొమల మధ్యభాగము (58), ముక్కు కొన, నోరు, మెడ, వక్షఃస్థలము, నాభి అను స్థానములయందు గాని, లేదా మరియొక స్థిరమగు స్థానమునందు గాని, శ్రద్ధతో నిండిన మనస్సును నిలిపి (59), బాహ్యమగు యజ్ఞరూపముగా కూడ ఉపచారములను చేసి పార్వతీపరమేశ్వరులను పూజించవలెను. లేదా, సాధకుడు నిత్యము లింగమునందు గాని, మూర్తిని చేసి దానియందు గాని (60), అగ్నియందు గాని, వేదిభూమియందు గాని భక్తితో తన సంపదకు అనురూపముగా పూజను చేయవలెను. లేదా, సాధకుడు మనస్సు లోపల మరియు బాహ్యమునందు కూడ పరమేశ్వరుని పూజించవలెను. మానసికపూజయందు ప్రీతి గల సాధకుడు బాహ్యపూజను చేసినా, చేయకపోయినా పరవా లేదు (61).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివశాస్త్రములో చెప్పబడిన నిత్యనైమిత్తిక కర్మలను వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).