Siva Maha Puranam-4    Chapters   

శాస్రోక్తమగు శివపూజా విధానము

అథ చతుర్వింశోధ్యాయః

శాస్త్రోక్తమగు శివపూజా విధానము

ఉపమన్యురువాచ |

ప్రోక్షయేన్మూలమంత్రేణ పూజాస్థానం విశుద్ధయే | గంధచందనతోయేన పుష్పం తత్ర వినిక్షిపేత్‌ || 1

అస్త్రేణోత్సార్య వై విఘ్నానవగుంఠ్య చ వర్మణా | అస్త్రం దిక్షు ప్రవిన్యస్య కల్పయేదర్చనాభువమ్‌ || 2

తత్ర దర్భాన్‌ పరిస్తీర్య క్షాలయేత్ప్రోక్షణాదిభిః | సంశోధ్య సర్వపాత్రాణి ద్రవ్యశుద్ధిం సమాచరేత్‌ || 3

ప్రోక్షణీమర్ఘ్యపాత్రం చ పాద్యపాత్రమతః పరమ్‌ | తథైవాచమనీయస్య పాత్రం చేతి చతుష్టయమ్‌ || 4

ప్రక్షాల్య ప్రోక్ష్య వీక్ష్యాథ క్షిపేత్తేషు జలం శివమ్‌ | పుణ్యద్రవ్యాణి సర్వాణి యథాలాభం వినిక్షిపేత్‌ || 5

రత్నాని రజతం హేమ గంధపుష్పాక్షతాదయః | ఫలపల్లవదర్భాంశ్చ పుణ్యద్రవ్యాణ్యనేకధా || 6

స్నానోదకే సుగంధాది పానీయే చ విశేషతః | శీతలాని మనోజ్ఞాని కుసుమాదీని నిక్షిపేత్‌ || 7

ఉశీరం చందనం చైవ పాద్యే తు పరికల్పయేత్‌ | జాతికంకోలకర్పూరబహుమూలతమాలకాన్‌ || 8

క్షిపేదాచమనీయే చ చూర్ణయిత్వా విశేషతః | ఏలాం పాత్రేషు సర్వేషు కర్పూరం చందనం తథా || 9

కుశాగ్రాణ్యక్షతాంశ్చైవ యవవ్రీహితిలానపి | ఆజ్యసిద్ధార్థపుష్పాణి భసితం చార్ఘ్యపాత్రకే || 10

ఉపమన్యుపు ఇట్లు పలికెను -

పూజాస్థానముయొక్క విశేషశుద్ధి కొరకై మూలమంత్రముతో చందనపరిమళము గల నీటిని చల్లి, ఆ స్థానములో పుష్పమునుంచవలెను (1). అస్త్రమంత్రముతో విఘ్నములను పారద్రోలి, కవచమంత్రముతో ఆ స్థానమునకు అన్ని వైపులనుండియు వస్త్రముతో ముసుగును వేసి, అస్త్రమంత్రమును దిక్కులన్నింటియందు న్యాసము చేసి, ఆ పూజాస్థానమును సంసిద్ధము చేయవలెను (2). అచట దర్భలను పరిచి, నీటిని చల్లుట మొదలగు క్రియలతో కడుగవలెను. పాత్రలనన్నింటీని చక్కగా కడిగి, ద్రవ్యములను శుద్ధి చేయవలెను (3). ప్రోక్షణీపాత్ర, అర్ఘ్యపాత్ర, పాద్యపాత్ర, ఆచమనీయపాత్ర అనే నాలుగు పాత్రలను (4) కడిగి, నీటిని చల్లి, పరిశీలించి, తరువాత వాటిలో శుభకరమగు నీటిని పోయవలెను. వాటి యందు దొరికిన మేరకు రత్నములు, వెండి, బంగారము, గంధము, పుష్పములు, అక్షతలు, పండ్లు, చిగుళ్లు, దర్భలు మొదలగు పవిత్రద్రవ్యములను అన్నింటినీ అనేక విధములుగా వేయవలెను (5,6). స్నానజలమునందు సుగంధము మొదలగు వాటిని వేయవలెను. అచమనీయమును ఇచ్చే నీరు విశేషించి చల్లగా నుండవలెను. దానియందు ఆహ్లాదకరమగు పుష్పములు మొదలగు వాటిని వేయవలెను (7). పాద్యజలమునందు వట్టివేరును, చందనమును వేయవలెను. ఆచమనీయపాత్రయందు జాజికాయ, కంకోలము, కర్పూరము, బహుమూలము, తమలపాకులు అనువాటిని బాగా పొడి చేసి వేయవలెను. పాత్రలన్నింటిలో ఏలకులను వేయవలెను. అర్ఘ్యపాత్రలో కర్పూరము, చందనము, దర్భచిగుళ్లు, అక్షతలు, బియ్యము, ధాన్యము, నువ్వులు, నెయ్యి, ఆవాలు, పుష్పములు, భస్మ అనువాటిని కూడ వేయవలెను (8-10).

కుశపుష్పయవవ్రీహిబహుమూలతమాలకాన్‌ | ప్రక్షిపేత్ర్పోక్షణీపాత్రే భసితం చ యథాక్రమమ్‌ || 11

సర్వత్ర మంత్రం విన్యస్య వర్మణా వేష్ట్య బాహ్యతః | పశ్చాదస్త్రేణ సంరక్ష్య ధేనుముద్రాం ప్రదర్శయేత్‌ || 12

పూజాద్రవ్యాణి సర్వాణి ప్రోక్షణీ పాత్రవారిణా | సంప్రోక్ష్య మూలమంత్రేణ శోధయేద్విధివత్తతః || 13

పాత్రాణాం ప్రోక్షణీమేకామలాభే సర్వకర్మసు | సాధయేదర్ఘ్యమద్భిస్తత్సామాన్యం సాధకోత్తమః || 14

తతో వినాయకం దేవం భక్ష్యోభోజ్యాదిభిః క్రమాత్‌ | పూజయిత్వా విధానేన ద్వారపార్శ్వే%థ దక్షిణ || 15

అంతఃపురాధిపం సాక్షాన్నందినం సమ్యగర్చయేత్‌ | చామీకరాచలప్రఖ్యం సర్వాభరణభూషితమ్‌ || 16

బాలేందుముకుటం సౌమ్యం త్రినేత్రం చ చతుర్భుజమ్‌ | దీప్తశూలమృగీటంకతిగ్మవేత్రధరం ప్రభుమ్‌ || 17

చంద్రబింబాభవదనం హరివక్త్రమథాపి వా | ఉత్తరే ద్వారపార్శ్వస్య భార్యాం చ మరుతాం సుతామ్‌ || 18

సుయశాం సువ్రతామంబాపాదమండనతత్పరామ్‌ | పూజయిత్వా ప్రవిశ్యాంతర్భవనం పరమేష్ఠినః || 19

సంపూజ్య లింగం తైర్ద్రవ్యైర్నిర్మాల్యమపనోదయేత్‌ | ప్రక్షాల్య పుష్పం శిరసి న్యసేత్తస్య విశుద్ధయే || 20

ప్రోక్షణీపాత్రలో క్రమముగా దర్భలు, పుష్పములు, ధాన్యము, బియ్యము, బహుమూలము, తమలపాకులు మరియు భస్మ అనువాటిని వేయవలెను (11). పాత్రలన్నింటికీ మంత్రన్యాసమును చేసి, చుట్టూ కవచమంత్రముతో వస్త్రమును చుట్టి, తరువాత అస్త్రముంత్రముతో రక్షణను కల్పించి, ధేనుముద్రను ప్రదర్శించవలెను (12). మూలమంత్రమును ఉచ్చరిస్తూ పూజాద్రవ్యములనన్నింటిని ప్రోక్షణీపాత్రయందలి నీటితో యథావిధిగా సంప్రోక్షించి శుద్ధి చేయవలెను (13). ఈ పాత్రలు అన్నీ లభించని పక్షములో ఉత్తముడగు సాధకుడు పూజలన్నింటియందు ప్రోక్షణీపాత్రను ఒక్కదానిని పెట్టి అర్ఘ్యము మొదలగు ఉపచారములన్నింటికీ దానినే సమానముగా వినియోగించవలెను (14). తరువాత వినాయకదేవుని భక్ష్యములు, భోజ్యములు మొదలగు ఉపచారములతో క్రమముగా యథావిధిగా పూజించి, తరువాత ద్వారమునకు కుడి ప్రక్కన (15) సాక్షాత్తుగా అంతఃపురమునకు అధిపతి, బంగరు పర్వతమువలె ప్రకాశించువాడు, సకలములగు ఆభరణములను అలంకరించుకున్నవాడు. కిరీటముపై చంద్రవంకను దాల్చినవాడు, ప్రసన్నమైనవాడు, ముక్కంటి, నాలుగు భుజములు గలవాడు, ప్రకాశించే శూలమును లేడిని పరశువును మరియు వాడి బెత్తమును ధరించినవాడు, సమర్థుడు, చంద్రబింబమును పోలిన మోమువాడు, వానరముఖము గల వాడు అగు నందీశ్వరుని చక్కగా అర్చించవలెను. ద్వారమునకు కుడి వైపున నందీశ్వరుని భార్య, మరుత్తుల కుమార్తె, గొప్ప వ్రతము గలది, పార్వతీదేవి యొక్క పాదములను అలంకరించుటలో నిమగ్నమై యుండునది అగు సుయశను పూజించి, పరమేశ్వరుని భవనము లోపలికి ప్రవేశించి (16-19), ఆ ద్రవ్యములతో లింగమును పూజించి, నిర్మాల్యమును తొలగించవలెను. విశేషశుద్ధి కొరకై లింగమును కడిగి దానిపై పుష్పమును ఉంచవలెను (20).

పుష్పహస్తో జపేచ్ఛక్త్యా మంత్రం మంత్ర విశుద్ధయే | ఐశాన్యాం చండమారాధ్య నిర్మాల్యం తస్య దాపయేత్‌ || 21

కల్పయేదాసనం పశ్చాదాధారాది యథాక్రమమ్‌ | ఆధారశక్తిం కల్యాణీం శ్యామాం ధ్యాయేదధో భువి || 22

తస్యాః పురస్తాదుత్కంఠమనంతం కుండలాకృతిమ్‌ | ధవలం పంచఫణినం లేలిహానమివాంబరమ్‌ || 23

తస్యోపర్యాసనం భద్రం కంఠీరవచతుష్పదమ్‌ | ధర్మో జ్ఞానం చ వైరాగ్య మైశ్వర్యం చ పదానివై || 24

ఆగ్నేయాదిశ్వేతరక్తపీతశ్యామాని వర్ణతః | అధర్మాదీని పూర్వాధీన్యుత్తరాంతాన్యనుక్రమాత్‌ || 25

రాజావర్తమణిప్రఖ్యాన్న్యస్య గాత్రాణి భావయేత్‌ | అస్యోర్ధ్వచ్ఛాదనం పద్మమాసనం విమలం సితమ్‌ || 26

అష్టపత్రాణి తస్యాహురణిమాదిగుణాష్టకమ్‌ | కేసరాణి చ వామాద్యా రుద్రా వామాదిశక్తిభిః || 27

బీజాన్యపి చ తా ఏవ శక్తయోంతర్మనోన్మనీః | కర్ణికా పరవైరాగ్యం నాలం జ్ఞానం శివాత్మకమ్‌ || 28

కందశ్చ శివధర్మాత్మా కర్ణికాంతే త్రిమండలే | త్రిమండలోపర్యాత్మాది తత్త్వత్రితయమాసనమ్‌ || 29

సర్వాసనోపరి సుఖం విచిత్రాస్తరణాస్తృతమ్‌ | ఆసనం కల్పయేద్దివ్యం శుద్ధవిద్యాసముజ్జ్వలమ్‌ || 30

మంత్రశుద్ధి కొరకై పుష్పమును చేతియందుంచుకొని మంత్రమును యథాశక్తిగా జపించవలెను. ఈశాన్యదిక్కునందు చండుని ఆరాధించి నిర్మాల్యమును ఆయనకు సమర్పించవలెను (21). తరువాత దేవునకు ఆసనమును కల్పించవలెను. మూలాధారముతో మొదలిడి వరుసగా షట్‌ చక్రములను ధ్యానించవలెను. వెన్నెముకకు దిగువ పృథివీతత్త్వము నందు మంగళకారిణి, నల్లనిది అగు ఆధారశక్తిని ధ్యానించవలెను. (22). ఆధారపద్మమునకు ఎదురుగా పడగలను పైకి ఎత్తి ఉన్నవాడు, చుట్ట చుట్టుకొని ఉన్నవాడు, తెల్లని వాడు, అయిదు పడగలు గలవాడు, ఆకాశమునుండి ఆస్వాదించుచున్నాడా అన్నట్లు ఉన్నవాడు అగు అనంతుని భావించవలెను (23). ఆయనపై మంగళకరమైనది, ఆగ్నేయము మొదలగు నాలుగు మూలలలో క్రమముగా తెలుపు ఎరుపు పసుపు మరియు నలుపు అనే రంగులు గల ధర్మము జ్ఞానము వైరాగ్యము మరియు ఈశ్వరభావము అనే నాలుగు తత్త్వములే సింహపు కోళ్లుగా గలది అగు ఆసనమును, తూర్పుతో మొదలిడి ఉత్తరము వరకు వరుసగా అధర్మము అజ్ఞానము రాగము మరియు బంధము అను నాలుగింటిని భావన చేయవలెను (24,25). ఆ అనంతుని అవయవములు రాజావర్తమణి (గొప్ప మణులలో ఒకటి) వలె ప్రకాశించుచున్నట్లు భావన చేయవలెను. ఈ ఆసనము యొక్క పైభాగమును స్వచ్ఛమగు తెల్లని పద్మము కప్పియుంచును (26). అణిమ (శరీరము దూది వలె తేలికగా నగుట) మొదలుగు ఎనిమిది సిద్ధులు దాని రేకులనియు, వామా మొదలగు శక్తులతో కూడిన వామదేవుడు మొదలగు రుద్రులే దాని కేసరములు అనియు చెప్పెదరు (27). మనోన్మని మొదలగు శక్తులే దాని లోపలనుండే బీజములు. శ్రేష్ఠమగు వైరాగ్యమే దాని కర్ణిక (దుద్దు). శివస్వరూపమగు జ్ఞానమే దాని తూడు (28). దాని దుంప శివధర్మమే స్వరూపముగా గలది. కర్ణిక కొనయందు అగ్ని-సూర్య-చంద్ర అనే మూడు మండలములు గలవు. ఆ మూడు మండలములపై ఆత్మ, విద్య, శివుడు అనే మూడు తత్త్వముల రూపములో మూడు ఆసనములు గలవు (29). అసనములన్నింటి పైన సుఖకరమైనది, రంగురంగుల తివాచీ పరిచి యున్నది, శుద్ధవిద్యతో గొప్పగా ప్రకాశించునది అగు దివ్యాసనమును కల్పించవలెను (30).

ఆవాహనం స్థాపనం చ సన్నిరోధం నిరీక్షణమ్‌ | నమస్కారం చ కుర్వీత బద్ధ్వా ముద్రాః పృథక్‌ పృథక్‌ || 31

పాద్యమాచమనం చార్ఘ్యం గంధం పుష్పం తతః పరమ్‌ | ధూపం దీపం చ తాంబూలం దత్త్వాథ స్వాపయేచ్ఛివౌ || 32

అథవా పరికల్ప్యైవమాసనం మూర్తిమేవ చ | సకలీకృత్య మూలేన బ్రహ్మభిశ్చాపరైస్తథా || 33

ఆవాహయేత్తతో దేవ్యా శివం పరమకారణమ్‌ | శుద్ధస్ఫటికసంకాశం దేవం నిశ్చలమక్షరమ్‌ || 34

కారణం సర్వలోకానాం సర్వలోకమయం పరమ్‌ | అంతర్బహిః స్థితం వ్యాప్య హ్యణోరణు మహత్తరమ్‌ || 35

భక్తానామప్రయత్నేన దృశ్యమీశ్వరమవ్యయమ్‌ | బ్రహ్మేంద్రవిష్ణురుద్రాద్యైరపి దేవైరగోచరమ్‌ || 36

వేదసారం చ విద్వద్భిరగోచరమితి శ్రుతమ్‌ | ఆదిమధ్యాంతరహితం భేషజం భవరోగిణామ్‌ || 37

శివతత్త్వమితి ఖ్యాతం శివార్థం జగతి స్థిరమ్‌ | పంచోపచారవద్భక్త్యా పూజయేల్లింగముత్తమమ్‌ || 38

లింగమూర్తేర్మహేశస్య శివస్య పరమాత్మనః | స్నానకాలే ప్రకుర్వీత జయశబ్దాదిమంగలమ్‌ || 39

ఆవాహనము, ప్రతిష్ఠ, సన్నిరోధనము (మనస్సును పరమేశ్వరునిపై నిలుపుట), నిరీక్షణము (చూచుట), నమస్కారము అను ఉపచారములను వేర్వేరుగా ముద్రలను బంధించి చేయవలెను (31). తరువాత పాద్యము, ఆచమనము, అర్ఘ్యము, గంధము, పుష్పము, ధూపము, దీపము, తాంబూలము అను వాటిని ఇచ్చి తరువాత పార్వతీపరమేశ్వరులను స్థాపించవలెను (32). లేదా, ఆసనమును మరియు శివమూర్తిని మాత్రమే కల్పించి, మూలమంత్రముతో, పంచబ్రహ్మమంత్రములతో మరియు ఇతరమంత్రములతో సకలీకరణమును చేసి (33), తరువాత సర్వకారణకారణుడు, దేవితో కూడియున్నవాడు అగు శివుని ఆవాహన చేయవలెను. స్వచ్ఛమగు స్ఫటికమువలె ప్రకాశించువాడు, చలనము లేనివాడు, వినాశము లేనివాడు, సర్వలోకములకు కారణమైనవాడు, సర్వలోకస్వరూపుడు, పరంబ్రహ్మ లోపల బయట వ్యాపించియున్నవాడు, సూక్ష్మమైన దానికంటె సూక్ష్మమైనవాడు, గొప్పదానికంటె గొప్పవాడు, భక్తులకు అనాయాసముగా కనబడువాడు, జగన్నాథుడు, వికారములు లేనివాడు, బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు రుద్రుడు మొదలగు దేవతలకు కూడ గోచరించనివాడు, వేదముల సారతత్త్వమైనవాడు విద్వాంసులకు కూడ గోచరించనివాడని వేదములలో వర్ణింపబడినవాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, సంసారబంధము అనే రోగము గలవారికి వైద్యుడు, శివతత్త్వము అని ప్రఖ్యాతిని గాంచినవాడు, మంగళముల కొరకై జగత్తునందు స్థిరముగా నుండువాడు అగు శివదేవుని ఉత్తమమగు లింగరూపములో భక్తిపూర్వకముగా గంధము, ధూపము, దీపము, పుష్పము, నైవేద్యము అనే అయిదు ఉపచారములతో పూజించవలెను (34-38). మహేశ్వరుడు, పరమాత్మ యగు శివుని లింగమూర్తికి అభిషేకమును చేసే సమయములో జయశబ్దము మొదలగు మంగళధ్వనులను చేయవలెను (39).

పంచగవ్యఘృతక్షీరదధిమధ్వాదిపూర్వకైః | మూలైః ఫలానాం సారైశ్చ తిలసర్షపసక్తుభిః || 40

బీజైర్యవాదిభిశ్శ సైశ్చూర్ణైర్మాషాదిసంభ##వైః | సంస్నాప్యాలిప్య పిష్టాద్యైస్స్నాపయేదుష్ణవారిభిః || 41

ఘర్షయేద్బిల్వపత్రాద్యైర్లేపగంధాపనుత్తయే | పునస్సంస్నాప్య సలిలైశ్చక్రవర్త్యుపచారతః || 42

సుగంధామలకం దద్యాద్ధరిద్రాం చ యథాక్రమమ్‌ | తతస్సంశోధ్య సలిలైర్లింగం బేరమథాపి వా || 43

స్నాపయేద్గంధతోయేన కుశపుష్పోదకేన చ | హిరణ్యరత్నతోయైశ్చ మంత్రసిద్ధైర్యథాక్రమమ్‌ || 44

అసంభ##వే తు ద్రవ్యాణాం యథా సంభవసంభృతైః | కేవలైర్మంత్రతోయైర్వా స్నాపయేచ్ఛ్రద్ధయా శివమ్‌ || 45

కలశేనాథ శంఖేన వర్ధన్యా పాణినా తథా | సకుశేన సపుష్పేణ స్నాపయేన్మంత్రపూర్వకమ్‌ || 46

పవమానేన రుద్రేణ నీలేన త్వరితేన చ | లింగసూక్తాది సూక్తైశ్చ శిరసాథర్వణన చ || 47

ఋగ్భిశ్చ సామభిశ్శైవైర్ర్బహ్మభిశ్చాపి పంచభిః | స్నాపయేద్దేవదేవేశం శివేన ప్రణవేన చ || 48

యథా దేవస్య దేవ్యాశ్చ కుర్యాత్స్నానాదికం తథా | న తు కశ్చిద్విశేషో% స్తి తత్ర తౌ సదృశౌ యతః || 49

పంచగవ్యము (అయిదు గోవు యొక్క ద్రవ్యముల కలయిక), నెయ్యి, పాలు, పెరుగు, తేనె, దుంపలు, పండ్ల రసములు, నువ్వులు, ఆవాలు, పిండి (40), గింజలు, బియ్యము, మినుపపిండి మొదలగు ప్రశస్తములగు పదార్థములతో అభిషేకమును చేసి, పిండి మొదలగు వాటిని పూసి వేడి నీటితో స్నానమును చేయించవలెను (41). పైన పూసిన గంధమును తొలగించుటకై మారేడు పత్రి మొదలగు వాటితో రాపిడి చేయవలెను. చక్రవర్తికి ఉపచారమును చేసిన పద్ధతిలో మరల నీటితో చక్కగా స్నానమును చేయించి (42), సుగంధముతో కూడిన ఉసిరికను, పసుపును వరుసగా ఈయవలెను. తరువాత లింగమును, లేదా శివుని మూర్తిని నీటితో శుద్ధి చేసి (43), గంధపు నీటితో, దర్భలను మరియు పుష్పములను వేసిన నీటితో, బంగారమును మరియు రత్నమును వేసిన నీటితో, మంత్రోచ్చారణముచే పవిత్రమైన నీటితో వరుసగా అభిషేకమును చేయవలెను (44). ఈ ద్రవ్యముల నన్నింటినీ సంపాదించుట సంభవము కానిచో, దొరికినంత వరకు సంపాదించి అభిషేకించవలెను. లేదా, శివుని మంత్రశుద్ధములైన నీటితో మాత్రమే శ్రద్ధతో అభిషేకించవచ్చును (45). కలశముతో గాని, శంఖముతో గాని, వర్ధనీ పాత్రతో గాని, దర్భను పుష్పమును పట్టుకొనియున్న చేతితో గాని, మంత్రపూర్వకముగా అభిషేకించవలెను (46). పవమానసూక్తము, రుద్రాధ్యాయము, నీల సూక్తము, త్వరితమంత్రము, లింగసూక్తము మొదలగు సూక్తములు, అథర్వశీర్షము (47), ఋక్కులు, సామలు, శివమంత్రములు, పంచబ్రహ్మమంత్రములు అను వాటిని పఠిస్తూ దేవదేవుడగు శివుని అభిషేకించవలెను. శివనామముతో మరియు ఓంకారముతో కూడ అభిషేకించవలెను (48). శివునకు ఏ విధముగా అభిషేకము చేయబడినదో, అదే విధముగా పార్వతికి కూడా స్నానము మొదలగు ఉపచారములను చేయవలెను. వారిద్దరు ఒకరి నొకరు పొలినవారు గనుక, ఈ అంశములో భేదము ఏమియు లేదు (49).

ప్రథమం దేవముద్దిశ్య కృత్వా స్నానాదికాః క్రియాః | దేవ్యై పశ్చాత్ర్పకుర్వీత దేవదేవస్య శాసనాత్‌ || 50

అర్ధనారీశ్వరే పూజ్యే పౌర్వాపర్యం న విద్యేతే | తత్ర తత్రోపచారాణాం లింగే వాన్యత్ర వా క్వచిత్‌ || 51

కృత్వా%భిషేకం లింగస్య శుచినా తు సుగంధినా | సంమృజ్య వాససా దద్యాదంబరం చోపవీతకమ్‌ || 52

పాద్యమాచమనం చార్ఘ్యం గంధం పుష్పం చ భూషణమ్‌ | ధూపం దీపం చ నైవేద్యం పానీయం ముఖశోధనమ్‌ || 53

పునరాచమనీయం చ ముఖవాసం తతః పరమ్‌ | ముకుటం చ శుభం భద్రం సర్వరత్నైరలంకృతమ్‌ || 54

భూషణాని పవిత్రాణి మాల్యాని వివిధాని చ | వ్యజనే చామరే ఛత్రం తాలవృంతం చ దర్పణమ్‌ || 55

దత్త్వా నీరాజనం కుర్యాత్సర్వమంగలనిస్స్వనైః | గీతనృత్యాదిభిశ్చైవ జయశబ్దసమన్వితః || 56

హైమే చ రాజతే తామ్రే పాత్రే వా మృన్మయే శుభే | పద్మకైశ్శోభితైః పుషై#్పర్బీ జైర్దధ్యక్షతాదిభిః || 57

త్రిశూలశంఖయుగ్మాబ్జనంద్యావర్తైః కరీషజైః | శ్రీ వత్సస్వస్తికాదర్శవజ్రైర్వహ్న్యాదిచిహ్నతైః || 58

అష్టా ప్రదీపాన్‌ పరితో విధాయైకం తు మధ్యమే | తేషు వామాదికాశ్చాన్యాః పూజ్యాశ్చ నవ శక్తయః || 59

ముందుగా శివుని ఉద్దేశించి స్నానము మొదలగు క్రియలను చేసి, తరువాత పార్వతికి చేయవలెనని దేవదేవుని శాసనము (50). లింగమునందు గాని, లేదా మూర్తి మొదలగు వాటియందు కాని అర్ధనారీశ్వరుని పూజించే సందర్భములో ఉపచారముల విషయములో ఈ విధమగు ముందు వెనుకల ప్రసక్తి ఉండదు (51). లింగమునకు పరిమళభరితమగు స్వచ్ఛజలముతో అభిషేకమును చేసి, వస్త్రముతో తుడిచి, వస్త్రము, యజ్ఞోపవీతము (52), పాద్యము, ఆచమనము, అర్ఘ్యము, గంధము, పుష్పము, అలంకారము, ధూపము, దీపము, నైవేద్యము, నోటిని కడుగుకొనుటకు నీరు (53), మరల ఆచమనము, తాంబూలము అను వాటిని ఇచ్చి, తరువాత శోభాయుతము, మంగళకరము మరియు సకలరత్నములతో అలంకరింపబడినది అగు కిరీటమును (54), పవిత్రములగు అలంకారములను, అనేకవిధములగు పుష్పమాలలను, రెండు విసినె కర్రలను, రెండు వింజామరలను, గొడుగును, తాటియాకు విసినెకర్రను మరియు అద్దమును (55) ఇచ్చి, సాధకుడు జయశబ్దమునుచ్చరిస్తూ అన్ని విధముల మంగళధ్వనులతో మరియు పాటలు నాట్యములు మొదలగు వాటితో నీరాజనమునీయవలెను (56). బంగరు, వెండి, రాగి లేదా శోభాయుక్తమగు మట్టి పాత్రలో ప్రకాశించే పద్మములను, పుష్పములను, బీజములను, పెరుగును, అక్షతులు మొదలగు వాటిని వేసి (57), దానిపై త్రిశూలము, రెండు శంఖములు, పద్మము, నంద్యావర్తమనే శంఖము, పిడకల మంట, శ్రీవత్సము, స్వస్తికము, అద్దము, వజ్రము, అగ్ని మొదలగు బొమ్మలను చిత్రించవలెను (58). మధ్యలో ఒకటి, చుట్టూ ఎనిమిది దీపములను ఏర్పాటు చేసిస, వాటియందు వామా మొదలగు తొమ్మిది శక్తులను భావన చేసి, పూజించవలెను (59).

కవచేన సమాచ్ఛాద్య సంరక్ష్యాస్త్రేణసర్వతః | ధేనుముద్రాం చ సందర్శ్య పాణిభ్యాం పాత్రముద్ధరేత్‌ || 60

అథవారోపయేత్పాత్రే పంచ దీపాన్‌ యథాక్రమమ్‌ | విదిక్ష్వపి చ మధ్యే చ దీపమేకమథాపి వా || 61

తతస్తత్పాత్రముద్ధృత్య లింగాదేరుపరి క్రమాత్‌ | త్రిః ప్రదక్షిణయోగేన భ్రామయేన్మూలవిద్యయా || 62

దద్యాదర్ఘ్యం తతో మూర్ధ్ని భసితం చ సుగంధితమ్‌ | కృత్వా పుష్పాంజలిం పశ్చాదుపహారాన్ని వేదయేత్‌ || 63

పానీయం చ తతో దద్యాద్దత్త్వా వాచమనం పునః | పంచసౌగంధికోపేతం తాంబూలం చ నివేదయేత్‌ || 64

ప్రోక్షయేత్ర్పోక్షణీయాని గాననాట్యాని కారయేత్‌ | లింగాదౌ శివయోశ్చింతాం కృత్వా శక్త్యా జపేచ్ఛివమ్‌ || 65

ప్రదక్షిణం ప్రణామం చ స్తవం చాత్మసమర్పణమ్‌ | విజ్ఞాపనం చ కార్యాణాం కుర్యాద్వి నయపూర్వకమ్‌ || 66

అర్ఘ్యం పుష్పాంజలిం దత్త్వా బద్ధ్వా ముద్రాం యథావిధి | పశ్చాత్‌ క్షమాపయేద్దేవముద్వాస్యాత్మని చింతయేత్‌ || 67

పాద్యాదిముఖవాసాంతమర్ఘ్యాద్యం చాతిసంకటే | పుష్పవిక్షేపమాత్రం వా కుర్యాద్భావ పురస్సరమ్‌ || 68

తావతైవ పరో ధర్మో భావేన సుకృతో భ##వేత్‌ | అసంపూజ్య న భుంజీత శివమాప్రాణసంచరాత్‌ || 69

యది పాపస్తు భుంజీత సై#్వరం తస్య న నిష్కృతిః | ప్రమాదేన తు భుంక్తే చేత్తదుద్గీర్య ప్రయత్నతః || 70

స్నాత్వా ద్విగుణమభ్యర్య్చ దేవం దేవీముపోష్య చ | శివస్యాయుతమభ్యస్యేద్ర్బహ్మచర్యపురస్సరమ్‌ | | 71

పరేద్యుశ్శక్తితో దత్త్వాసువర్ణాద్యం శివాయ చ | శివభక్తాయ వా కృత్వా మహాపూజాం శుచిర్భవేత్‌ | | 72

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయమంహితాయాం ఉత్తరఖండే శాస్త్రోక్త శివపూజనవర్ణనం నామ చతుర్వింశోsధ్యాయః(24).

ఆ పాత్రకు కవచమంత్రముతో ఆచ్ఛాదనమును, అస్త్రమంత్రముతో అన్ని దిక్కుల యందు రక్షణను కల్పించి, ధేనుముద్రను చక్కగా చూపించి, చేతులతో దానిని పైకి ఎత్తవలెను (60). లేదా, పాత్రకు నాలుగు దిక్కులలో నాలుగు, మధ్యలో ఒకటి వెరసి అయిదు దీపములను వరసగా ఏర్పాటు చేయవలెను. లేదా ఒక దీపమును ఏర్పాటు చేయవలెను (61). తరువాత ఆ పాత్రను పైకి ఎత్తి, మూలమంత్రమును పఠిస్తూ లింగము మొదలగు వాటికి పైన వకుసగా మూడుసార్లు ప్రదక్షిణ విధానములో త్రిప్పవలెను (62). తరువాత అర్ఘ్యమును ఇచ్చి శిరస్సుపై సుగంధముతో కూడిన భస్మను పెట్టి, తరువాత దోసెడు పూలను, బహుమానములను సమర్పించవలెను (63). తరువాత పానీయమును ఇచ్చి, మరల ఆచమనమును సమర్పించి, అయిదు సుగంధద్రవ్యములతో కూడిన తాంబూలమును ఈయవలెను (64). ప్రోక్షణ చేయవలసిన పదార్ధములపై ప్రోక్షణను చేసి, గానమును నాట్యమును చేయించవలెను. లింగము మొదలగు వాటియందు పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి యథాశక్తిగా శివమంత్రమును జపించవలెను (65). ప్రదక్షిణము,నమస్కారము, స్తోత్రపాఠము, ఆత్మసమర్పణము, చేసిన పూజాకార్యములను విన్నవించుట అనే క్రియలను వినయపూర్వకముగా చేయవలెను (66). అర్ఘ్యమును, దోసెడు పూలను ఇచ్చి, యథావిధిగా ముద్రను బంధించి. తరువాత క్షమాపణను చెప్పి, దేవునకు ఉద్వాసన చెప్పి, మనస్సులో ధ్యానించవలెను (67). మిక్కిలి సంకటము వచ్చినప్పుడు పాద్యముతో మొదలిడి తాంబూలము వరకు గాని, అర్ఘ్యముతో మొదలిడి గాని, లేదా భక్తిపురస్సరముగా పూవులను సమర్పించుట అను కార్యమునైననూ చేయవలెను (68). అంత మాత్రమే చేతనే భక్తి ప్రభావముచే గొప్ప ధర్మమును చక్కగా ఆచరించినట్లే యగును. దేహములో ప్రాణములు ఉన్నంతవరకు శివుని పూజించకుండగా భుజించరాదు (69). పాపియగు వ్యక్తి అట్లు యథేచ్ఛగా భుజించినచో, వానికి నిష్కృతి లేదు. పొరపాటుచే అట్లు భుజించినచో, దానిని ప్రయత్న పూర్వకముగా వమనము చేసి(70). స్నానమును చేసి, పార్వతీపరమేశ్వరులకు రెండు రెట్లు పూజను చేసి, ఉపవాసమును చేసి, బ్రహ్మచర్యపూర్వకముగా శివమంత్రమును పదివేలు జపము చేయవలెను (71). మరునాడు యథాశక్తిగా శివభక్తునకు బంగారము మొదలుగు వాటికి ఇచ్చి, శివునకు పెద్ద పూజను చేసి, పరిశుద్ధుడు కావలెను (72).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శాస్త్రోక్తమగు శివపూజా విధిని వర్ణించే ఇరువది నాలుగవ అధ్యాయము ముగిసినది (24).

Siva Maha Puranam-4    Chapters