Siva Maha Puranam-4
Chapters
అథత సప్తవింశోధ్యాయః అగ్ని కార్యము ఉపమన్యురువాచ | అథాగ్నికార్యం వక్ష్యామి కుండే వా స్థండిలే%పి వా | వేద్యాం వా హ్యాయసే పాత్రే మృన్మయే వా నవే శుభే ||
1 ఆధాయాగ్నిం విధానేన సంస్కృత్య చ తతః పరమ్ | తత్రారాధ్య మహాదేవం హోమకర్మ సమాచరేత్ ||
2 కుండం ద్విహస్తమానం వా హస్తమాత్రమథాఫి వా | వృత్తం వా చతురస్రం వా కుర్యాద్వేదిం చ మండలమ్ ||
3 కుండం విస్తారవన్నిమ్నం తన్మధ్యే%ష్టదలాంబుజమ్ | చతురంగులముత్సేధం తస్య ద్వ్యంగులమేవ వా ||
4 వితస్తిద్విగుణోన్నత్యా నాభిమంతః ప్రచక్షతే | మధ్యం చ మధ్యమాంగుల్యా మధ్య మోత్తమపర్వణోః ||
5 అంగులైః కథ్యతే సద్భిశ్చతుర్వింశతిభిః కరః | మేఖలానాం త్రయం వాపి ద్వయమేకమథాపి వా ||
6 యథాశోభం ప్రకుర్వీత శ్లక్‌ష్టమిష్టం మృదా స్థిరమ్ | అశ్వత్థపత్రవద్యోనిం గజాధరవదేవ వా ||
7 మేఖలామధ్యతః కుర్యాత్పశ్చిమే దక్షిణ%పి వా | శోభనామగ్నితః కించిన్నిమ్నామున్మీలికాం శ##నైః ||
8 అగ్రేణ కుండాభిముఖీం కించిదుత్సృజ్య మేఖలామ్ | నోత్సేధనియమో వేద్యాస్సా మార్దీ వాథ సైకతీ ||
9 మండలం గోశకృత్తోయైర్మానం పాత్రస్య నోదితమ్ | కుండం చ మృన్మయం వేదిమాలిపేద్గోమయాంబునా ||
10 ఉపమన్యువు ఇట్లు పలికెను - ఇపుడు అగ్ని కార్యమును గురించి చెప్పెదను, కుండమునందు గాని, ఎత్తైన నేలపై గాని, వేదిపై గాని, శుభకరమగు కొంగ్రొత్త మట్టిపాత్రయందు గాని (1) అగ్నిని యధావిధిగా ఉంచి తరువాత సంస్కారములను చేసి, దానియందు మహాదేవుని ఆరాధించి హోమకర్మను చేయవలెను (2). కుండము ఒక చేయి లేక రెండు చేతుల పరిమాణమును కలిగి ఉండవలెను. వేది వృత్తాకారముగా గాని, చతురస్రాకారముగా గాని ఉండవలెను. మండలమును కూడ నిర్మించవలెను (3). కుండము విశాలముగా లోతుగా నుండవలెను. దాని మధ్యలో నాలుగు, లేక రెండు అంగుళముల ఎత్తు గల ఎనిమిది దళముల పద్మమును నిర్మించవలెను (4). కుండమునకు లోపల రెండు జానల ఎత్తులో నాభి గలదని మహర్షులు చెప్పుచున్నారు. మధ్యవ్రేలియొక్క మధ్య మరియు పై పర్వల మధ్యగల పొడవుతో సమానమైన మధ్య భాగము కుండమునకు ఉండును (5). ఇరువై నాలుగు అంగుళములు ఒక కరము అనే మానమును సత్పురుషులు చెప్పుచున్నారు. కుండమునకు మూడు, లేక రెండు, లేక ఒక మేఖల (మొలత్రాడు) ఉండవలెను (6). శోభతో కూడియున్నది, సన్ననిది, మనోహరమైనది, స్థిరమైనది మరియు రావి ఆకును గాని ఏనుగుయొక్క క్రింది పెదవిని గాని పోలియున్నది అగు యోనిని మట్టితో చేయవలెను (7). కుండమునకు పశ్చిమము నందు గాని, దక్షిణమునందు గాని మేఖలకు మధ్యలో అగ్ని వలన శోభించేది, కొంచెము లోతైనది, స్వల్పముగా తెరిచియున్నది, అగ్రభాగము కుండమునకు అభిముఖముగా గలది, మేఖలను కొంచెము విడిచి ఉండునది అగు యోనిని నిర్మించవలెను. వేది యొక్క ఎత్తు విషయములో నియమము ఏదియూ లేదు. వేదిని మట్టితో గాని, ఇసుకతో గాని చేయవలెను (8,9). మండలమును గోమయముతో నీటిని కలిపి చేయవలెను. పాత్రకు పరిమాణము చెప్పబడలేదు. కుండమును, మట్టితో చేసిన వేదిని కూడ గోమయముతో నీటిని కలిపి అలకవలెను (10). ప్రక్షాల్య తాపయేత్పాత్రం ప్రోక్షయేదన్యదంభసా | స్వసూత్రోక్తప్రకారేణ కుండాదౌ విలిఖేత్తతః ||
11 సంప్రోక్ష్య కల్పయేద్దర్భైః పుషై#్పర్వా వహ్నివిష్టరమ్ | అర్చనార్థం చ హోమార్థం సర్వద్రవ్యాణి సాధయేత్ ||
12 ప్రక్షాల్యక్షాలనీయాని ప్రోక్షణ్యా ప్రోక్ష్య శోధయేత్ | మణిజం కాష్ఠజం వాథ శ్రోత్రియాగారసంభవమ్ ||
13 అన్యం వాభ్యర్హితం వహ్నిం తతస్సాధారమానయేత్ | త్రిః ప్రదక్షిణమావృత్య కుండాదేరుపరి క్రమాత్ ||
14 వహ్నిబీజం సముచ్చార్య త్వాదధీతాగ్నిమాసనే | యోనిమార్గేణ వా తద్వదాత్మనస్సంముఖేన వా ||
15 యోనిప్రదేశగస్సర్వం కుండం కుర్యాద్విచక్షణః | స్వనాభ్యంతం స్థితం వహ్నిం తద్రంధ్రాద్విస్ఫులింగవత్ ||
16 నిర్గమ్య పావకే బాహ్యే లీనం బింబాకృతిం స్మరేత్ | ఆజ్యసంస్కారపర్యంతమన్వాధానపురస్సరమ్ ||
17 స్వసూత్రోక్తక్రమాత్కుర్యాన్మూలమంత్రేణ మంత్రవిత్ | శివమూర్తిం సమభ్యర్చ్య తతో దక్షిణపార్శ్వతః || 18 న్యస్య మంత్రం ఘృతే ముద్రాం దర్శయేద్ధేనుసంజ్ఞితామ్ | స్రుక్ర్సువౌ తైజసౌ గ్రాహ్యౌ న కాంస్యాయససైసకౌ || 19 యజ్ఞదారుమ¸° వాపి స్మార్తౌ వా శిల్పసమ్మతౌ | పర్ణే వా బ్రహ్మవృక్షదేరచ్ఛిద్రే మధ్య ఉత్థితే || 20 పాత్రను కడిగి వేడి చేయవలెను. ఇతరవస్తువులపై నీటిని చల్లవలెను. తరువాత తన గృహ్యసూత్రములో చెప్పిన విధముగా కుండము మొదలగు వాటియందు రేఖలను వ్రాయవలెను (11). దానిపై నీటని చల్లి దర్భలతో గాని, పుష్పములతో గాని అగ్నికి ఆసనమును కల్పించవలెను. అర్చన మరియు హోమముల కొరకు ద్రవ్యములను అన్నింటినీ సిద్ధము చేసుకొనవలెను (12). కడగవలసిన వస్తువులను కడిగి ప్రోక్షణీపాత్రయందలి నీటిని చల్లి శుద్ధి చేయవలెను. తరువాత సూర్యకాంతమణినుండి పుట్టినది గాని, కట్టెను రాపిడి చేయుట వలన పుట్టినది గాని, లేదా ఆహితాగ్ని యొక్క అగ్నిహోత్రశాలయందు ఉన్నది గాని (13), లేదా ఇతరమైన పూజార్హమగు అగ్నిని ఆధారపాత్రతో సహా తీసుకు రావలెను. ఆ అగ్నిని కుండము మొదలగు వాటిపైన వరుసగా మూడుసార్లు త్రిప్పి (14), అగ్నిబీజము (రమ్) ను చక్కగా ఉచ్చరించి, అగ్నిని యోనిమార్గము గుండా గాని, లేదా ముఖమునకు ఎదురుగా గాని, ఆసనమునందు ఉంచవలెను (15). విద్వాంసుడగు సాధకుడు యోనిస్థానమునందున్నవాడై కుండమునకంతకూ అగ్నినితో సంయోగము కలుగునట్లు చేయవలెను. తన నాభియందున్న అగ్ని ఆ నాభిరంధ్రమునుండి అగ్నికరణము రూపములో బయటకు వచ్చి (16), బాహ్యమునందున్న అగ్నితో లీనమై బింబముయొక్క ఆకారమును పొందినట్లు భావన చేయవలెను. మంత్రవేత్తయగు సాధకుడు తన గృహ్యసూత్రములో చెప్పిన క్రమములో అగ్నిపై సమిధను ఉంచుటతో మొదలిడి ఆజ్యసంస్కారము వరకు మూలమంత్రముతో చేయవలెను. తరువాత శివుని మూర్తిని కుడి వైపున చక్కగా పూజించి (17,18), మంత్రన్యాసమును చేసి, నేతికి ధేనుముద్రను చూపించవలెను. బంగారముతో చేసిన స్రుక్-స్రువములను గ్రహించవలెను. కంచు, ఇనుము, సీసములతో చేసినవి పనికి రావు (19). స్రుక్ - స్రువములు యజ్ఞమునకు సంబంధించిన కట్టెతో చేసినవి గాని, స్మృతి విహితములై యోగ్యమగు ఆకారములో చేయబడినవి గాని అయి ఉండవలెను. పలాశము మొదలగు వృక్షముయొక్క, చిల్లులు లేని మధ్యలో ఎత్తుగా నుండే రెండు ఆకులనైననూ ఉపయోగించవచ్చును (20). సంమృజ్య దర్భైస్తౌ వహ్నౌ సంతాప్య ప్రోక్షయేత్పునః | పారార్షర్చ్య స్వసూత్రోక్తక్రమేణ శివపూర్వకైః || 21 జుహుయాదష్టభిర్బీజైరగ్నిసంస్కారసిద్ధయే | భ్రుం స్తుం బ్రుం శ్రుం క్రమేణౖవ పుం డ్రుం ద్రుమిత్యతః పరమ్ || 22 బీజాని సప్త సప్తానాం జిహ్వానామనుపూర్వశః త్రిశిఖా మధ్యమా జిహ్వా బహురూపసమాహ్వయా || 23 రక్తాగ్నేయీ నైరృతీ చ కృష్ణాన్యా సుప్రభా మతా | అతిరిక్తా మరుజ్జిహ్వా స్వనామానుగుణప్రభా || 24 స్వబీజానంతరం వాచ్యా స్వాహాంతం చ యథాక్రమమ్ | జిహ్వామంత్రైస్తు తైర్హుత్వాజ్యం జిహ్వాస్త్వేకైకశః క్రమాత్ || 25 రం వహ్నయేతి స్వాహేతి మధ్యే హుత్వాహుతిత్రయమ్ | సర్పిషా వా సమిద్భిర్వా పరిషేచనమాచరేత్ || 26 ఏవం కృతే శివాగ్నిస్స్యాత్ స్మరేత్తత్ర శివాసనమ్ | తత్రావాహ్య యజేద్దేవమర్ధనారీశ్వరం శివమ్ | దీపాంతం పరిషిచ్యాథ సమిద్ధోమం సమాచరేత్ || 27 తాః పాలాశ్యః పరా వపి యాజ్ఞియా ద్వాదశాంగులాః | అవక్రా న స్వయం శుష్కాస్సత్వచో నిర్ర్వణాస్సమాః || 28 దశాంగులా వా విహితాః కనిష్ఠాంగులిసంమితాః | ప్రాదేశమాత్రా వాలాభే హోతవ్యాస్సకలా అపి || 29 దూర్వాపత్రసమాకారాం చతురంగులమాయతామ్ | దద్యాదాజ్యాహుతిం పశ్చాదన్నమక్షప్రమాణతః || 30 వాటిని దర్భలతో తుడిచి అగ్నియందు వేడి చేసి, మరల నీటిని చల్లి, సర్వోత్కృష్టుడగు మహర్షిచే రచించబడుటచే పూజింపదగిన తన గృహ్యసూత్రములో చెప్పిన క్రమములో అగ్నిసంస్కారము సిద్ధించుట కొరకై, శివబీజము (ఓమ్) మరియు భ్రుం స్తుం బ్రుం శ్రుం పుం డ్రుం ద్రుం అనే ఏడు, వెరసి ఎనిమిది బీజాక్షరములతో హోమమును చేయవలెను (21,22). ఈ ఏడు బీజములు క్రమముగా అగ్నియొక్క ఏడు జిహ్వలకు సంబంధించినవి. మూడు జ్వాలలు గల మధ్యమజిహ్వకు బహురూప అని పేరు (23). అగ్నేయమునందలి జిహ్వకు రక్త అనియు, నైరృతిజిహ్వకు కృష్ణ అనియు, వాయవ్య జిహ్వకు సుప్రభ అనియు, దాని ప్రక్కన పశ్చిమమునందలి జిహ్వకు మరుజిహ్వ అనియు పేర్లు. ఈ సుప్రభ అనే జిహ్వ తన పేరుకు తగ్గ కాంతిని కలిగియుండును (24). ప్రతి జిహ్వయొక్క నామమును దాని బీజాక్షరమునకు జోడించి స్వాహాతో అంతము చేసినచో, అది ఆ జిహ్వకు చెందిన మంత్రము అగును. వాటితో క్రమముగా జిహ్వలు అన్నింటికి నేతితో హోమము చేసి (25), రం వహ్నయే స్వాహా అని మధ్యలో మూడు అహుతులను నేతితో గాని, సమిధలతో గాని హోమము చేసి పరిషేచనమును చేయవలెను (26), ఇట్లు చేయుటచే, ఆ అగ్ని శివునకు సంబంధించినది అగును. దానియందు శివునకు ఆసనమును భావన చేయవలెను. దానియందు అర్ధనారీశ్వరుడగు శివుని ఆవాహన చేసి, దీపారాధన వరకు పూజించవలెను. తరువాత అగ్ని చుట్టూ నీటిని చల్లి, సమిధలతో హోమమును చేయవలెను (27). పలాశవృక్షము, లేక ఇతరమగు యజ్ఞసంబంధి వృక్షమునకు సంబంధించినవి, పన్నెండు లేక పది అంగుళముల పొడవు గలవి, లేదా చిటికెన వ్రేలితో సమానమగు చుట్టు కొలత గలవి, లేదా బొటనవ్రేలునకు మరియు చూపుడు వ్రేలునకు మధ్యలో ఇమిడే పరిమాణము గలవి, వంకరగా లేనివి, స్వయముగా ఎండిపోయినవి కానివి, బెరడు గలవి, బొడిపెలు లేనివి, సరిసమానముగా నున్నవి అగు సమిధలు విధింపబడినవి. ఇట్టివి దొరకనిచో, వేటినైననూ హోమము చేయవచ్చును (28,29). తరవాత గడ్డిపరకవలె సన్ననైన నాలుగు అంగుళముల పొడవు ఉండే ధారతో నేతిని హోమము చేసి, పదహారు మాషముల పరిమాణము గల అన్నపు ముద్దలను హోమము చేయవలెను (30). లాజాంస్తథా సర్షపాంశ్చ యవాంశ్చైవ తిలాంస్తథా | సర్పిషాక్తాని భక్ష్యాణి లేహ్యచోష్యాణి సంభ##వే || 31 దశైవాహుతయస్తత్ర పంచ వా త్రితయం చ వా | హోతవ్యాశ్శక్తితో దద్యాదేకమేవాథ వాహుతిమ్ || 32 స్రువేణాజ్యం సమిధా వా స్రుచా శేషాన్ కరేణ వా | తత్ర దివ్యేన హోతవ్యం తీర్థేనార్షేణ వా తథా || 33 ద్రవ్యేణౖకేన వా%లాభే జుహుయాచ్ర్ఛద్ధయా పునః | ప్రాయశ్చిత్తాయ జుహుయాన్మంత్రయిత్వాహుతిత్రయమ్ || 34 తతో హోమావశిష్టేన ఘృతేనాపూర్య వై స్రుచమ్ | నిధాయ పుష్పం తస్యాగ్రే స్రువేణాధోముఖేన తామ్ || 35 సదర్భేణ సమాచ్ఛాద్య మూలేనాంజలినోత్థితః | వౌషడంతేన జుహుయాద్ధారాం తు యవసంమితామ్ || 36 ఇత్థం పూర్ణాహుతిం కృత్వా పరిషించేచ్చ పూర్వవత్ | తత ఉద్వాస్య దేవేశం గోపయేత్తు హుతాశనమ్ || 37 పేలాలు, అవాలు, బియ్యము, నువ్వులు అను వాటిని నేతితో తడిపి, వీలైనచో తినుబండారములు లేహ్యములను (తేనే మొదలగునవి) మరియు చోష్యము (పెరుగు మొదలగు జుర్రదగిన పదార్థములు) లను కలిపి (31), పదిగాని, అయిదు గాని, మూడు గాని, లేదా ఒకే ఒక ఆహుతిని గాని శక్తిని మించకుండగా హోమము చేయవలెను (32). నేతిని స్రువముతో గాని, సమిధతో గాని హోమము చేయవలెను. మిగిలిన ద్రవ్యములను స్రుక్కుతో గాని, చేతితోగాని హోమము చేయవలెను. చేతితో చేసే పక్షములో దేవతీర్ధము (వ్రేళ్ల కొనలు) తో గాని, ఋషితీర్థము (చిటికెన వ్రేలు మరియు దర్భవ్రేలు అను వాటి మొదలు) తోగాని హోమమును చేయవలెను (33). వివిధద్రవ్యములు దొరకనిచో, ఒకే ద్రవ్యముతో చేయవలెను. కాని శ్రద్ధతో హోమమును చేయవలెను. ప్రాయశ్చిత్తము కొరకై అభిమంత్రించిన మూడు ఆహుతులను హోమము చేయవలెను (34). తరువాత హోమము చేయగా మిగిలిన నేతితో స్రుక్కును నింపి, దాని కొనయందు పుష్పమునుంచి, దానిని దర్భతో కూడి క్రిందకు ముఖముగల స్రువముతో సరిసమానముగా కప్పి, లేచి నిలబడి అరచేతిలో పట్టుకొని, ఓం నమశ్శివాయ వౌషట్ అను మంత్రముతో బియ్యపు గింజతో సమానమగు లావుగల ధారతో పూర్ణాహుతిని హోమము చేసి, పూర్వమునందు వలెనే పరిషేచనము చేసి, తరువాత దేవదేవుడగు శివునకు ఉద్వాసన చెప్పి అగ్నిని రక్షించవలెను (35-37). తమప్యుద్వాస్య వా నాభౌ యజేత్సంధాయ నిత్యశః | అథవా వహ్నిమానీయ శివశాస్త్రోక్తవర్త్మనా || 38 వాగీశగర్భసంభూతం సంస్కృత్య విధివద్యజేత్ | అన్వాధానం పునః కృత్వా పరిధీన్ పరిధాయ చ || 39 పాత్రాణి ద్వంద్వరూపేణ నిక్షిప్యేష్ట్వా శివం తతః | సంశోధ్య ప్రోక్షణీ పాత్రం ప్రోక్ష్య తాని తదంభసా || 40 ప్రణీతాపాత్రమైశాన్యాం విన్యస్యాపూరితం జలైః | ఆజ్యసంస్కారపర్యంతం కృత్వా సంశోధ్యస్రుక్స్రువౌ || 41 గర్భాధానం పుంసవనం సీమంతోన్నయనం తతః | కృత్వా పృథక్ పృథగ్ఘుత్వా జాతమగ్నిం విచింతయేత్ || 42 త్రిపాదం సప్తహస్తం చ చతుఃశృంగం ద్విశీర్షకమ్ | మధుపింగత్రినయనం సకపర్దేందు శేఖరమ్ || 43 రక్తం రక్తాంబరాలేపం మాల్యభూషణభూషితమ్ | సర్వలక్షణసంపన్నం సోపవీతం త్రిమేఖలమ్ || 44 శక్తిమంతం స్రుక్స్రువౌ చ దధానం దక్షిణ కరే | తోమరం తాలవృంతం చ ఘృతపాత్రం తథేతరైః || 45 జాతం ధ్వాత్వైవమాకారం జాతకర్మ సమాచరేత్ | నాలాపనయనం కృత్వాత తస్సంశోధ్య సూతకమ్ || 46 శివాగ్నే రుచినామాస్య కృత్వాహుతి పురస్సరమ్ | పిత్రోర్విసర్జనం కృత్వా చౌలోపనయనాదికమ్ || 47 ఆప్తోర్యామావసానాంతం కృత్వా సంస్కారమస్య తు | ఆజ్యధారాదిహోమం చ కృత్వా స్విష్టకృతం తతః || 48 అ అగ్నికి కూడా ఉద్వాసనను చెప్పి, లేదా తన నాభియందు మరల భావనారూపముగా ఉంచుకొని నిత్యపూజను చేయవలెను. లేదా, శివశాస్త్రములో చెప్పబడిన విధముగా వాగీశ్వరియొక్క గర్భమునుండి పుట్టిన అగ్నిని తీసుకువచ్చి, యథావిధిగా సంస్కరించి పూజించవలెను. మరల అన్వాధానము (అగ్నిపై సమిధను ఉంచుట) ను చేసి, పరిధులను (మేడి చెట్టు పుల్లలను) చుట్టూ ఉంచి (38,39), రెండేసి పాత్రలను ఉంచి, తరువాత శివుని ఆరాధించి, ప్రోక్షణీపాత్రను శుద్ధి చేసి, దానిలోని నీటిని ఆ పాత్రలపై చల్లి (40), ప్రణీతా పాత్రను ఈశాన్యమునందు ఉంచి, నీటితో నింపి, ఆజ్యసంస్కారము వరకు పూర్తిచేసి, స్రుక్ - స్రువములను శుద్ధి చేసి (41), గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము (గర్భమునందలి శిశువునకు చేసే సంస్కారములు) అను సంస్కారములను చేసి, ప్రతి సంస్కారమునకు వేర్వేరుగా హోమములను చేసి, వాగీశ్వరీశివులకు అగ్ని జన్మించినట్లుగా భావన చేయవలెను (42). అగ్నికి మూడు పాదములు (ప్రాత ః - మధ్యంది న - సాయం సవనములు) ఏడు చేతులు (ఛందస్సులు), నాలుగు కొమ్ములు (వేదములు), రెండు తలలు (ప్రాయణీయ -ఉదయనీయములు), తేనెవలె పింగళవర్ణము గల మూడు కన్నులు, చంద్రవంకచే అలంకరించబడిన జటాజూటము గలవు (43). ఎర్రనివాడు, ఎర్రని వస్త్రములు మరియు ఆలేపనము గలవాడు, పుష్పమాలలను మరియు ఆభరణములను అలంకరించుకున్నవాడు, సకల లక్షణములు సమృద్ధిగా గలవాడు, యజ్ఞోపవీతము మరియు మూడు మొలనూళ్లు గలవాడు (44), శక్తి గలవాడు, కుడిచేతియందు స్రుక్స్రువములను, మిగిలిన చేతులలో ఇనుప గుదియను, తాటియాకు విసినెకర్రను మరియు నేతిచెంబును పట్టుకున్నవాడు (45) అగు అగ్ని ఈ ఆకారముతో అప్పుడే జన్మించినట్లుగా భావన చేసి జాతకర్మను చేయవలెను. తరువాత బొడ్డును కోసి, పురిటి శుద్ధిని చేసి (46), శివునకు సంబంధించిన ఈ అగ్నికి ఆహుతులనిచ్చి, రుచి అని పేరు పెట్టి, తల్లిదండ్రులకు ఉద్వాసన చెప్పి, ఈ అగ్నికి చౌలము (పుట్టువెంట్రుకలను తీయుట), ఉపనయనములతో మొదలు పెట్టి (47), ఆప్తోర్యామముతో అంతమయ్యే సంస్కారకర్మలను చేసి, నేతిధార మొదలగు హోమములను చేసి, తరువాత స్విష్టకృత్ అనే హోమమును చేయవలెను (48). రమిత్యనేన బీజేన పరిషించేత్తతః పరమ్ | బ్రహ్మవిష్ణుశివేశానాం లోకేశానాం తథైవ చ || 49 తదస్త్రాణాం చ పరితః కృత్వా పూజాం యథాక్రమమ్ | ధూపదీపాదిసిద్ధ్యర్థం వహ్నిముద్ధృత్య కృత్యవిత్ || 50 సాధయిత్వాజ్య పూర్వాణి ద్రవ్యాణి పునరేవ చ | కల్పయిత్వాసనం వహ్నౌ తత్రావాహ్య యథా పురా || 51 సంపూజ్య దేవం దేవీం చ తతః పూర్ణాంతమాచరేత్ | అథవా స్వాశ్రమోక్తం తు వహ్నికర్మ శివార్పణమ్ || 52 బుద్ధ్వా శివాశ్రమీ కుర్యాన్న చ తత్రాపరో విధిః | శివాగ్నేర్భస్మ సంగ్రాహ్యమగ్నిహోత్రోద్భవం తు వా || 53 వైవాహోగ్నిభవం వాపి పక్వం శుచి సుగంధి చ | కపిలాయాశ్శకృచ్ఛస్తం గృహీతం గగనే పతత్ || 54 న క్లిన్నం నాతికఠినం న దుర్గంధం న శోషితమ్ | ఉపర్యధః పరిత్యజ్య గృహ్ణీయాత్పతితం యది || 55 పిండీకృత్య శివాగ్న్యాదౌ తత్ క్షిపేన్మూలమంత్రతః | అపక్వమతిపక్వం చ సంత్యజ్య భసితం సితమ్ || 56 ఆదాయ వా సమాలోడ్య భస్మాధారే వినిక్షి పేత్ | తైజసం దారవం వాపి మృన్మయం శైలమేవ వా || 57 అన్యద్వా శోభనం శుద్ధం భస్మాధారం ప్రకల్పయేత్ | సమే దేశే శుభే శుద్ధే ధనవద్భస్మ నిక్షిపేత్ || 58 తరువాత రమ్ అనే బీజాక్షరముతో పరిషేచనమును చేయవలెను. కర్మవిధానమును తెలిసిన సాధకుడు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈశానుడు, లోకపాలకులు అను వారికి, మరియు వారి అస్త్రములకు చుట్టూ వరుసగా పూజను చేసి, ధూపము దీపము మొదలగునవి సిద్ధించుటకై నిప్పును పైకి తీసి (49,50), మరల పూర్వమునందు వలెనే నెయ్యి మొదలగు ద్రవ్యములను సంపాదించుకొని, అగ్నియందు ఆసనమును భావనారూపముగా కల్పించి, దానియందు పూర్వమునందు వలెనే పార్వతీపరమేశ్వరులను ఆవాహన చేసి, చక్కగా పూజించి, అగ్నికర్మను తెలుసుకొని ఆచరించి శివునకు అర్పించవలెను. దీనికి మరియొక విధానము లేదు. శివాగ్నియందు గాని, అగ్నిహోత్రమునందు గాని, విహహాగ్నియందు గాని, తయారై ఉన్న భస్మను సంగ్రహించుకొనవలెను. పక్వము, శుచియైనది, సుగంధము గలది, తడిగా లేనిది, మిక్కిలి గట్టిగా లేనిది, దుర్గంధము లేనిది, ఎండిపోనిది అగు కపిలగోవుయొక్క గోమయమును క్రింద పడుటకు ముందే గాలిలో పట్టుకున్నచో, అది భస్మను చేయుటకు ప్రశస్తమైనది. ఒకవేళ క్రింద పడినచో, దాని క్రింది భాగమును మరియు పై భాగమును తీసివేసి మిగిలిన దానిని గ్రహించవలెను (51-55). దానిని పిండములుగా చేసి, మూలమంత్రముతో శివాగ్ని మొదలగు అగ్నులలో ఒకదానియందు వేయవలెను. కాలని వాటిని మరియు అధికముగా కాలినవాటిని విడిచిపెట్టి, తెల్లని భస్మను (56) తీసుకొని పొడిచేసి, భస్మపాత్రయందు ఉంచవలెను. అందమైనది, శుభకరమైనది, బంగారము చెక్క మట్టి రాయి మొదలగు వాటితో చేసినది అగు పాత్రయందు భస్మను దాచుకొనవలెను. ఆ భస్మను శుభకరము, పరిశుద్ధము అగు సమతల ప్రదేశమునందు ధనమును వలె దాచుకొనవలెను (57,58). న చాయుక్తకరే దద్యాన్నైవాశుచితలే క్షిపేత్ | న సంస్పృశేచ్చ నీచాంగైర్నోపేక్షేత న లంఘయేత్ || 59 తస్మాధ్బసితమాదాయ వినియుంజీత మంత్రతః | కాలేషూక్తేషు నాన్యత్ర నాయోగ్యేభ్యః ప్రదాపయేత్ || 60 భస్మసంగ్రహణం కుర్యాద్దేవే%నుద్వాసితే సతి | ఉద్వాసితే కృతే యస్మాచ్చండభస్మ ప్రజాయతే || 61 అగ్నికార్యే కృతే పశ్చాచ్ఛివశాస్త్రోక్తమార్గతః | స్వసూత్రోక్తప్రకారాద్వా బలికర్మ సమాచరేత్ || 62 అథ విద్యాసనం న్యస్య సుప్రలిప్తే తు మండలే | విద్యాకోశం ప్రతిష్ఠాప్య యజేత్పుష్పాదిభిః క్రమాత్ || 63 విద్యాయాః పురతః కృత్వా గురోరపి చ మండలమ్ | తత్రాసనవరం కృత్వా పుష్వాద్యైర్గురుమర్చయేత్ || 64 తతోనుపూజయేత్పూజ్యాన్ భోజయేచ్చ బుభుక్షితాన్ | తతస్స్వయం చ భుంజీత శుద్ధమన్నం యథాసుఖమ్ || 65 నివేదితం చ వా దేవే తచ్ఛేషం చాత్మశుద్ధయే | శ్రద్దధానో న లోభేన న చండాయ సమర్పితమ్ || 66 గంధమాల్యాది యచ్చాన్యత్తత్రాప్యేష సమో విధిః | న తు తత్ర శివో%స్మీతి బుద్ధిం కుర్యాద్విచక్షణః || 67 భుక్త్వాచమ్య శివం ధ్యాత్వా హృదయే మూలముచ్చరేత్ | కాలశేషం నయేద్యోగ్యైశ్శివశాస్త్రకథాదిభిః || 68 దానిని అయోగ్యుని చేతికి ఈయరాదు; అశుచియగు స్థలములో పెట్టరాదు; నీచమగు అవయవములు దానికి తాకరాదు; దానిని అశ్రద్ధ చేయరాదు; దానిని దాటరాదు (59). దానినుండి భస్మను తీసుకొని నిర్దేశించబడిన కాలములయందు మాత్రమే మంత్రముతో పెట్టుకొనవలెను; ఇతరసమయములలో పెట్టుకొనరాదు. అయ్యోగులకు భస్మను ఈయరాదు (60). శివునకు ఉద్వాసనను చెప్పక ముందే భస్మను తీసుకొనవలెను. ఏలయనగా శివునకు ఉద్వాసనను చెప్పిన తరువాత అది చండీశ్వరుని సొత్తు అయిపోవును (61). అగ్ని కార్యమును చేసిన తరువాత శివశాస్త్రములో గాని, తన గృహ్యసూత్రములో గాని చెప్పిన విధముగా బలికర్మను చేయవలెను (62). తరువాత చక్కగా అలికిన మండలమునందు విద్యాసనమును ఉంచి, విద్యాకోశమును ప్రతిష్ఠించి, పుష్పములు మొదలగువాటితో క్రమముగా పూజించవలెను (63). విద్యాకోశమునకు ఎదురుగా గురువుయొక్క మండలమును కూడా చేసి, దానియందు శ్రేష్ఠమగు అసనమును ఉంచి, పుష్పములు మొదలగు వాటితో గురువును పూజించవలెను (64). ఆ తరువాత పూజార్హులను పూజించి, ఆకలి గొన్నవారికి భోజనములను పెట్టవలెను. తరువాత సాధకుడు తాను కూడ శివునకు నివేదన చేసిన శుద్ధమగు అన్నమును, లేదా శివప్రసాదమును సుఖముగా శ్రద్ధతో భుజించవలెను; ఆబతో తినరాదు. చండీశ్వరునకు సమర్పించిన అన్నమును తినరాదు (65,66). గంధము, మాలలు మొదలగు వాటి విషయములో కూడ చండీశ్వరుని భాగమును స్వీకరించరాదనే ఈ విధి సమానము. విద్వాంసుడు వాటి విషయములో, నేనే శివుడును అనే బుద్ధిని చేయరాదు (67). సాధకుడు భోజనమును చేసి, ఆచమనమును చేసి, శివుని హృదయములో ధ్యానించి, మూలమంత్రమును ఉచ్చరించవలెను. మిగిలిన సమయమును శివశాస్త్రమునకు సంబంధించిన యోగ్యమగు చర్చలతో గడుపవలెను (68). రాత్రౌ వ్యతీతే పూర్వాంశే కృత్వా పూజాం మనోహరామ్ | శివయోశ్శయనం త్వేకం కల్పయేదతిశోభనమ్ || 69 భక్ష్యభోజ్యాంబరాలేపపుష్పమాలాదికం తథా | మనసా కర్మణా వాపి కృత్వా సర్వం మనోహరమ్ || 70 తతో దేవస్య దేవ్యాశ్చ పాదమూలే శుచిస్స్వపేత్ | గృహస్థో భార్యయా సార్ధం తదన్యే%పి తు కేవలాః || 71 ప్రత్యూషసమయం బుద్ధ్వా మాత్రామాద్యాముదీరయేత్ | ప్రణమ్య మనసా దేవం సాంబం సగణమవ్యయమ్ || 72 దేశకాలోచితం కృత్వా శౌచాద్యమపి శక్తితః | శంఖాదినినదైర్దివ్యైర్దేవం దేవీం చ బోధయేత్ || 73 తతస్తత్సమయోన్నిద్రైః పుషై#్పరతిసుగంధిభిః | నిర్వర్త్య శివయోః పూజాం ప్రారభేత పురొదితమ్ || 74 ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయం ఉత్తరఖండే అగ్నికార్యవర్ణనం నామ సప్తవింశో%ధ్యాయః (27). రాత్రియందు పూర్వభాగము గడిచిన తరువాత పూజను చేసి, పార్వతీపరమేశ్వరులకు మిక్కిలి సుందరము మరియు మనోహరము అగు శయ్యను ఒకదానిని ఏర్పాటు చేయవలెను (69). భక్ష్యములు, భోజ్యములు, వస్త్రములు, అలేపనములు, పుష్పమాలలు మొదలగు వాటిని అన్నింటిని మనోహరముగా వాస్తవముగా గాని, మానసికముగా గాని ఏర్పాటు చేయవలెను (70). తరువాత సాధకుడు పార్వతీపరమేశ్వరుల పాదముల చెంత శుచియై, గృహస్థుడైనచో భార్యతో గూడి, గృహస్థులు కానివారు ఒంటరిగను పరుండవలెను (71). తెల్లవారుజామున లేచి, మొదటి మాత్ర (అకారము) ను ఉచ్చరించి, జగన్మాతతో మరియు గణములతో కూడియున్నవాడు, వినాశము లేనివాడు అగు శివదేవునకు మనస్సులో నమస్కరించి (72), దేశకాలములకు తగిన పనులను చేసి, శౌచము మొదలగు వాటిని పూర్తి చేసుకొని, శక్తిని బట్టి శంఖము మొదలగువాటి దివ్యధ్వనులతో పార్వతీపరమేశ్వరులను మేలుకొలుప వలెను (73). తరువాత ఆ సమయములో వికసించిన, అతిశయించిన సుగంధము గల పుష్పములతో పార్వతీపరమేశ్వరులను పూజించి, పూర్వములో చెప్పబడిన కర్మను ఆరంభించవలెను (74). శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో అగ్నికార్యమును వర్ణించే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).