Siva Maha Puranam-4
Chapters
అథ త్రింశోధ్యాయః కామ్యకర్మల నిరూపణము తత్రాదౌ శివయోః పార్శ్వే దక్షిణ వామతః క్రమాత్ | గంధాద్యైరర్చయేత్పూర్వం దేవౌ హేరంబషణ్ముఖౌ ||
1 తతో బ్రహ్మాణి పరిత ఈశానాది యథాక్రమమ్ | సశక్తికాని సద్యాంతం ప్రథమావరణ యజేత్ ||
2 షడంగాన్యపిత త్రైవ హృదయాదీన్యనుక్రమాత్ | శివస్య చ శివాయాశ్చ వాహ్నేయాది సమర్చయేత్ ||
3 తత్ర వామాదికాన్ రుద్రానష్టౌ వామాదిశక్తిభిః | అర్చయేద్వా న వా పశ్చాత్పూర్వాది పరితః క్రమాత్ ||
4 ప్రథమావరణం ప్రోక్తం మయా తే యదునందన | ద్వితీయావరణం ప్రీత్యా ప్రోచ్యతే శ్రద్ధయా శృణు ||
5 అనంతం పూర్వదిక్పత్రే తచ్ఛక్తిం తస్య వామతః | సూక్ష్మం దక్షిణదిక్పత్రే సహ శక్త్యా సమర్చయేత్ ||
6 తతః పశ్చిమదిక్పత్రే సహ శక్త్యా శివోత్తమమ్ | తథైవోత్తరదిక్పత్రే చైకనేత్రం సమర్చయేత్ ||
7 ఏకరుద్రం చ తచ్ఛక్తిం పశ్చాదీశదలేర్చయేత్ | త్రిమూర్తిం తస్య శక్తిం చ పూజయేదగ్నిదిగ్దలే ||
8 శ్రీకంఠం నైరృతే పత్రే తచ్ఛక్తిం తస్య వామతః | తథైవ మారుతే పత్రే శిఖండీశం సమర్చయేత్ ||
9 ద్వితీయావరణ చేజ్యాస్సర్వతశ్చక్రవర్తినః | తృతీయావరణ పూజ్యాశ్శక్తిభిశ్చాష్టమూర్తయః ||
10 కామ్యకర్మయందు మొట్టమొదట పార్వతీపరమేశ్వరులకు కుడివైపున విఘ్నేశ్వరుని, ఎడమవైపున కుమారస్వామిని వరసగా గంధము మొదలగు వాటితో పూజించవలెను (1). తరువాత ఈశానునితో మొదలిడి వరుసగా సద్యోజాతుని వరకు శక్తులతో కూడియున్న పంచబ్రహ్మలను మొదటి అవరణలో పూజించవలెను (2). హృదయము మొదలగు ఆరు అంగములను మరియు పార్వతీపరమేశ్వరులను కూడ అక్కడనే అగ్నేయదిక్కుతో నారంభించి వరుసగా పూజించవలెను (3). తరువాత అచటనే వామ మొదలగు శక్తులతో కూడిన ఎనిమిది రుద్రులను తూర్పు దిక్కుతో మొదలిడి చుట్టూ అర్చించవలెను. ఈ రుద్రుల అర్చన మాత్రము వైకల్పికము (మానవచ్చును) (4). ఓ శ్రీ కృష్ణా! నేను నీకు మొదటి అవరణమును గురించి చెప్పితిని. నేను రెండవ ఆవరణమును గురించి ప్రీతి పూర్వకముగా చెప్పుచున్నాను. శ్రద్ధతో వినుము (5). తూర్పు దిక్కునందలి దళములో అనంతుని, ఆయనకు ఎడమ భాగములో ఆయన శక్తిని, దక్షిణదిక్కునందలి దళములో శక్తితో కూడిన సూక్ష్మదేవుని పూజించవలెను (6). తరువాత పశ్చిమదిక్కునందలి దళములో శక్తితో కూడిన శివోత్తముని, అదేవిధముగా ఉత్తరదిక్కునందలి దళములో ఏకనేత్రుని పూజించవలెను (7). తరువాత ఈశాన్యదిక్కునందలి దళములో ఏకరుద్రుని, ఆయన శక్తిని పూజించవలెను. ఆగ్నేయ దిక్కునందలి దళములో త్రిమూర్తిని మరియు ఆయన శక్తిని పూజించవలెను (8). నైరృతిదిక్కునందలి దళములో శ్రీకంఠుని, ఆయనకు ఎడమభాగమునందు ఆయన శక్తిని, అదే విధముగా వాయవ్యదిక్కునందలి దళములో శిఖండీశుని పూజించవలెను (9). రెండవ ఆవరణలో చక్రవర్తులనందరీని కూడ పూజించవలెను. మూడవ ఆవరణలో శక్తులతో కూడిన అష్టమూర్తులను పూజించవలెను (10). అష్టసు క్రమశో దిక్షు పూర్వాదిపరతః క్రమాత్ | భవశ్శర్వస్తథేశానో రుద్రః పశుపతిస్తతః ||
11 ఉగ్రో భీమో మహాదేవ ఇత్యష్టౌ మూర్తయః క్రమాత్ | అనంతరం తతశ్చైవ మహాదేవాదయః క్రమాత్ | శక్తిభిస్సహ సంపూజ్యాస్తత్రైకాదశ మూర్తయః ||
12 మహాదేవశ్శివో రుద్రశ్శంకరో నీలలోహితః | ఈశానో విజయో భీమో దేవదేవో భవోద్భవః ||
13 కపర్దీశశ్చ కథ్యంతే తథైకాదశ శక్తయః | తత్రాష్టౌ ప్రథమం పూజ్యా వాహ్నేయాది యథాక్రమమ్ ||
14 దేవదేవః పూర్వపత్రే ఈశానం చాగ్నిగోచరే | భవోద్భవస్తయోర్మధ్యే కపాలీశస్తతః పరమ్ ||
15 తస్మిన్నావరణ భూయో వృషేంద్రం పురతో యజేత్ | నందినం దక్షిణ తస్య మహాకాలం తథోత్తరే ||
16 శాస్తారం వహ్నిదిక్పత్రే మాతౄర్దక్షిణదిగ్దలే | గజాస్యం నైరృతే పత్రే షణ్ముఖం వారుణ పునః ||
17 జ్యేష్ఠాం వాయుదలే గౌరీముత్తరే చండమైశ్వరే | శాస్తృనందీశయోర్మధ్యే మునీంద్రం వృషభం యజేత్ ||
18 మహాకాలస్యోత్తరతః పింగలం తు సమర్చయేత్ | శాస్తృమాతృసమూహస్య మధ్యే భృంగీశ్వరం తతః ||
19 మాతృవిఘ్నేశమధ్యే తు వీరభద్రం సమర్చయేత్ | స్కందవిఘ్నేశయోర్మధ్యే యజేద్దేవీం సరస్వతీమ్ ||
20 తూర్పుతో మొదలిడి చుట్టూ వరుసగా ఎనిమిది దిక్కులయందు భవుడు, శర్వుడు, ఈశానుడు, రుద్రుడు, పశుపతి (11), ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు అను అష్టమూర్తులను, తరువాత శక్తులతో కూడియున్న మహాదేవుడు మొదలగు పదకొండు మూర్తులను చక్కగా పూజించవలెను (12). మహాదేవుడు, శివుడు, రుద్రుడు, శంకరుడు, నీలలోహితుడు, ఈశానుడు, విజయుడు, భీముడు, దేవదేవుడు, భవోద్భవుడు (13) మరియు కపర్దీశుడు అనువారు ఏకాదశ రుద్రమూర్తులు. వీరికి పదకొండు శక్తులు కూడ గలవు. ముందుగా వారిలో ఎనమండుగురిని ఆగ్నేయదిక్కుతో మొదలిడి క్రమమును తప్పకుండగా పూజించవలెను (14). తూర్పుదళమునందు దేవదేవుని, ఆగ్నేయదళమునందు ఈశానుని, వారి మధ్యలో భవోద్భవుని, తరువాత కపాలీశుని పూజించవలెను (15). ఆ ఆవరణలో మరల తూర్పునందు వృషభరాజును, ఆయనకు దక్షిణమునందు నందిని అదే విధముగా ఉత్తరమునందు మహాకాలుని పూజించవలెను (16). అగ్నేయదిక్కునందలి దళములో శాస్త (అయ్యప్ప) ను, దక్షిణదిక్కునందలి దళములో మాతృకలను, నైరృతిదిక్కునందలి దళములో గజాననుని, పశ్చిమదిక్కునందు మరల కుమారస్వామిని (17), వాయవ్యదిక్కునందు జ్యేష్ఠాదేవిని, ఉత్తరమునందు గౌరిని, ఈశాన్యమునందు చండుని, శాస్తకు నందీశ్వరునకు మధ్యలో వృషభమహర్షిని పూజించవలెను (18). మహాకాలునకు ఉత్తరమునందు పింగలుని, తరువాత శాస్తకు మరియు మాతృకలకు మధ్యలో భృంగీశ్వరుని చక్కగా పూజించవలెను (19). మాతృకలకు మరియు విఘ్నేశ్వరునకు మధ్యలో వీరభద్రుని, కుమరస్వామికి మరియు విఘ్నేశ్వరునకు మధ్యలో సరస్వతీదేవిని చక్కగా పూజించవలెను (20). జ్యేష్ఠాకుమారయోర్మధ్యే శ్రియం శివపదార్చితామ్ | జ్యోష్ఠాగణాంబయోర్మధ్యే మహామోటీం సమర్చయేత్ ||
21 గణాంబాచండయోర్మధ్యే దేవీం దుర్గాం ప్రపూజయేత్ | అత్రైవారణ భూయశ్శివానుచరసంహతిమ్ ||
22 రుద్రప్రమథభూతాఖ్యాం వివిధాం చ సశక్తికామ్ | శివాయాశ్చ సఖీవర్గం యజేద్ధ్యాత్వా సమాహితః ||
23 ఏవం తృతీయావరణ వితతే పూజితే సతి | చతుర్థావరణం ధ్యాత్వా బహిస్తస్య సమర్చయేత్ ||
24 భానుః పూర్వదలే పూజ్యో దక్షిణ చతురాననః | రుద్రో వరుణదిక్పత్రే విష్ణురుత్తరదిగ్దలే ||
25 చతుర్ణామపి దేవానాం పృథగావరణాన్యథా | తస్యాంగాని షడేవాదౌ దీప్తాద్యాభిశ్చ శక్తిభిః ||
26 దీప్తా సూక్ష్మా జయా భద్రా విభూతిర్విమలా క్రమాత్ | అమోఘా విద్యుతా చైవ పూర్వాది పరితః స్థితాః ||
27 ద్వితీయావరణ పూజ్యాశ్చతస్రో మూర్తయః క్రమాత్ | పూర్వాద్యుత్తరపర్యంతాశ్శక్తయశ్చ తతః పరమ్ ||
28 అదిత్యో భాస్కరో భానూ రవిశ్చేత్యనుపూర్వశః | అర్కో బ్రహ్మా తథా రుద్రో విష్ణుశ్చైతే వివస్వతః ||
29 విస్తారా పూర్వదిగ్భాగే సుతరాం దక్షిణ స్థితాః | బోధనీ పశ్చిమే భాగే అప్యాయిన్యుత్తరే పునః ||
30 ఉషాం ప్రభాం తథా ప్రాజ్ఞాం సంధ్యామపి తతః పరమ్ | ఐశానాదిషు విన్యస్య ద్వితీయావరణ యజేత్ ||
31 జ్యేష్ఠాదేవికి కుమారస్వామికి మధ్యలో శివుని పాదములను అర్చించే శ్రీదేవిని, జ్యేష్ఠాదేవికి గౌరీదేవికి మధ్యలో మహామోటిని చక్కగా పూజించవలెను (21). గౌరీదేవికి చండీశ్వరునకు మధ్యలో దుర్గాదేవిని విశేషముగా పూజించవలెను. ఈ ఆవరణలోననే మరల రుద్రగణములు, ప్రమధగణములు, మరియు భూతగణములు అనే పేర్లను కలిగి వివిధ రూపములతో మరియు శక్తులతో కూడియున్న శివుని అనుచరవర్గమును పూజించవలెను. సాధకుడు ఏకాగ్రమగు మనస్సు గలవాడై పార్వతీదేవి యొక్క సఖీగణమును ధ్యానించి పూజించవలెను (22,23). ఈ విధముగా విస్తారమగు మూడవ అవరణములో పూజను చేసి, దానికి బయట నాల్గవ అవరణమును ధ్యానించి పూజించవలెను (24). తూర్పుదళమునందు సూర్యుని, దక్షిణమునందు బ్రహ్మను, పశ్చిమదిక్కునందలి దళమునందు రుద్రుని, ఉత్తరదిగ్దలమునందు విష్ణువును పూజించవలెను (25). తరువాత ఆ నలుగురు దేవతల యొక్క వేర్వేరు ఆవరణములు గలవు. మొదటి అవరణములో ముందుగా దీప్త మొదలగు శక్తులతో కూడియున్న ఆరు అంగములను పూజించవలెను (26). దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, అమోఘ, విద్యుత్ అను శక్తులు తూర్పుతో మొదలు పెట్టి చుట్టూ వరుసగా నున్నవి (27) . రెండవ ఆవరణలో తూర్పుతో మొదలిడి ఉత్తరము వరకు క్రమముగా నలుగురు మూర్తులను, తరువాత వారి శక్తులను పూజించవలెను (28). అదిత్యుడు, భాస్కరుడు, భానుడు, రవి అనే నాలుగు సూర్యుని మూర్తులను మరియు అర్కుడు, బ్రహ్మ, రుద్రుడు, మరియు విష్ణువు అనే నాలుగు మూర్తులను అదే క్రమములో పూజించవలెను (29). తూర్పుదిక్కునందు విస్తర, దక్షిణమునందు సుతర, పశ్చిమమునందు బోధని మరియు ఉత్తరమునందు ఆప్యాయిని అను దేవతలు గలరు (30). వారిని పూజించిన తరువాత రెండవ ఆవరణములో ఉష, ప్రభ, ప్రాజ్ఞ, సంధ్య అను దేవతలను ఈశాన్యము మొదలగు మూలలయందు న్యాసము చేసి పూజించ వలెను (31). సోమమంగారకం చైవ బుద్ధం బుద్ధిమతాం వరమ్ | బృహస్పతిం బృహద్బుద్ధిం భార్గవం తేజసాం నిధిమ్ ||
32 శ##నైశ్చరం తథా రాహుం కేతుం ధూమ్రం భయంకరమ్ | సమంతతో యజేదేతాంస్తృతీయావరణ క్రమాత్ ||
33 అథవా ద్వాదశాదిత్యాన్ ద్వితీయావరణ యజేత్ | తృతీయావరణ చైవ రాశీన్ ద్వాదశ పూజయేత్ ||
34 సప్త సప్తగణాంశ్చైవ బహిస్యం సమంతతః | ఋషీన్ దేవాంశ్చ గంధర్వాన్ పన్నగానప్సరోగాణాన్ ||
35 గ్రామణీశ్చ తథా యక్షాన్ యాతుధానాంస్తథా హయాన్ | సప్తచ్ఛందోమయాంశ్చైవ వాలఖిల్యాంశ్చ పూజయేత్ ||
36 ఏవం తృతీయావరణ సమభ్యర్చ్య దివాకరమ్ | బ్రహ్మాణమర్చయేత్పశ్చాత్త్రిభిరావరణౖస్సహ ||
37 హిరణ్యగర్భం పూర్వస్యాం విరాజం దక్షిణ తతః | కాలం పశ్చిమదిగ్భాగే పురుషం చోత్తరే యజేత్ ||
38 హిరణ్యగర్భః ప్రథమో బ్రహ్మా కమలసన్నిభః | కాలో జాత్యంజనప్రఖ్యః పురుషః స్ఫటికోపమః ||
39 త్రిగుణో రాజసశ్చైవ తామసస్సాత్త్వికస్తథా | చత్వార ఏతే క్రమశః ప్రథమావరణ స్థితాః ||
40 ద్వితీయావరణ పూజ్యాః పూర్వాదిపరతః క్రమాత్ | ససత్కుమారస్సనకస్సనందశ్చ సనాతనః ||
41 చంద్రుడు, అంగారకుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడగు బుద్ధుడు, గొప్ప బుద్ధిశాలియగు బృహస్పతి, తేజస్సులకు నిధియగు శుక్రుడు (32), శని, రాహువు, బూడిదరంగుతో భయమును గొల్పే కేతువు అను ఈ గ్రహములను మూడవ ఆవరణములో చుట్టూ వరుసగా పూజించవలెను (33). లేదా, రెండవ ఆవరణములో పన్నెండుగురు ఆదిత్యులను, మూడవ ఆవరణలో పన్నెండు రాశులను పూజించవలెను (34). మూడవ ఆవరణమునకు బయట చుట్టూ అంతటా నలభై తొమ్మిది మరుద్గణములను, ఋషులను, దేవతలను, గంధర్వులను, నాగులను, అప్సరసల గణములను (35), గ్రామదేవతలను, యక్షరాక్షసులను, వేదరూపములగు ఏడు గుర్రములను (సూర్యుని ఏడు కిరణములను), వాలఖిల్య మహర్షులను పూజించవలెను (36). ఈ విధముగనే, మూడవ ఆవరణములో సూర్యుని పూజించి, తరువాత మూడు ఆవరణములతో కూడియున్న బ్రహ్మను పూజించవలెను (37). తరువాత తూర్పుదిక్కునందు హిరణ్యగర్భుని, దక్షిణమునందు విరాట్ పురుషుని, పశ్చిమ దిక్కునందు కాలపురుషుని, ఉత్తర దిక్కునందు పురుషుని పూజించవలెను (38). వీరిలో మొదటివాడగు హిరణ్యగర్భుడు పద్మమును బోలియుండే బ్రహ్మయే. కాలపురుషుడు పుట్టుక తోడనే కాటుకవలె నల్లనివాడు. పురుషుడు స్ఫటికమును బోలియుండును. (39). త్రిగుణాత్మకమగు ప్రధానము, సాత్త్వికము, రాజసము మరియు తామసము అనే నాలుగు తత్త్వములు మొదటి ఆవరణములో వరుసగా నుండును (40). రెండవ ఆవరణములో తూర్పుతో మొదలిడి వరుసగా సనత్కుమార, సనక, సనందన, సనాతనులను పూజించవలెను (41). తృతీయావరణ పశ్చాదర్చయేచ్చ ప్రజాపతీన్ | అష్టౌ పూర్వాంశ్చ పూర్వాదౌ త్రీన్ ప్రాక్ పశ్చాదనుక్రమాత్ ||
42 దక్షో రుచిర్భృగుశ్చైవ మరీచిశ్చ తథాంగిరాః | పులస్త్యః పులహశ్చైవ క్రతురత్రిశ్చ కశ్యపః ||
43 వసిష్ఠశ్చేతి విఖ్యాతాః ప్రజానాం పతయస్త్విమే | తేషాం భార్యాశ్చ తైస్సార్ధం పూజనీయా యథాక్రమమ్ ||
44 ప్రసూతిశ్చ తథా%% కూతిః ఖ్యాతిస్సంభూతిరేవ చ | ధృతిస్స్మృతిః క్షమా చైవ సన్నతిశ్చానసూయకా ||
45 దేవమాతారుంధతీ చ సర్వాః ఖలు పతివ్రతాః | శివార్చనరతా నిత్యం శ్రీమత్యః ప్రియదర్శనాః ||
46 ప్రథమావరణ వేదాంశ్చతురో వా ప్రపూజయేత్ | ఇతిహాసపురాణాని ద్వితీయావరణ పునః ||
47 తృతీయావరణ పశ్చాద్ధర్మశాస్త్రపురస్సరాః | వైదిక్యో నిఖిలా విద్యాః పూజ్యా ఏవ సమంతతః ||
48 తరువాత మూడవ ఆవరణములో పదకొండు ప్రజాపతులను పూజించవలెను. తూర్పుతో మొదలిడి ఎనిమిది దిక్కులలో ఎనమండుగురిని, తరువాత మరల తూర్పు, దక్షిణము మరియు పశ్చిమము అను దిక్కులలో మిగిలిన ముగ్గురిని పూజించవలెను (42). ఈ పదకొండుగురు ప్రజాపతులు దక్షుడు, రుచి, భృగువు, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, కశ్యపుడు (43), వసిష్ఠుడు అను పేర్లతో ప్రఖ్యాతిని చెందినారు. వారితో బాటు వారి భార్యలను వరుసలో పూజించవలెను (44). ప్రసూతి, ఆకూతి, ఖ్యాతి, సంభూతి, ధృతి, స్మృతి, క్షమ, సన్నతి, అనసూయ (45), దేవతల తల్లియగు అదితి, అరుంధతి అనే ఋషిపత్నులు అందరు పతివ్రతలు, నిత్యము శివుని పూజించుటలో ప్రీతి గలవారు. శోభను వెదజల్లే అ ఋషిపత్నుల దర్శనము ప్రీతిని కలిగించును (46). ఆవరణపూజను మరియొక విధముగా కూడ చేయవచ్చును. మొదటి ఆవరణములో నాలుగు వేదములను, రెండవ ఆవరణములో ఇతిహాసపురాణములను పూజించవలెను (47). తరువాత మూడవ ఆవరణములో ధర్మశాస్త్రములతో మొదలుబెట్టి, చుట్టూ వైదికవిద్యలను అన్నింటినీ పూజించవలెను. (48). పూర్వాదిపరతో వేదాస్తదన్యే తు యథారుచి | అష్టధా వా చతుర్ధా వా కృత్వా పూజాం సమంతతః ||
49 ఏవం బ్రహ్మాణమభ్యర్చ్య త్రిభిరావరణౖర్యుతమ్ | దక్షిణ పశ్చిమే పశ్చాద్రుద్రం సావరణం యజేత్ ||
50 తస్య బ్రహ్మషడంగాని ప్రథమావరణం స్మృతమ్ | ద్వితీయావరణ చైవ విద్యేశ్వరమయం తథా ||
51 తృతీయావరణ భేదో విద్యతే స తు కథ్యతే | చతస్రో మూర్తయస్తస్య పూజ్యాః పూర్వాదితః క్రమాత్ ||
52 త్రిగుణస్సకలో దేవః పురస్తాచ్ఛివసంజ్ఞకః | రాజసో దక్షిణ బ్రహ్మా సృష్టికృత్పూజ్యతే భవః ||
53 తామసః పశ్చిమే చాగ్నిః పూజ్యస్సంహారకో హరః | సాత్త్వికస్సుఖకృత్సౌమ్యే విష్ణుర్విశ్వపతిర్మృడః ||
54 ఏవం పశ్చిమదిగ్భాగే శంభోః షడ్వింశకం శివమ్ | సమభ్యర్చ్యోత్తరే పార్శ్వే తతో వైకుంఠమర్చయేత్ ||
55 తూర్పు దిక్కుతో మొదలిడి నాలుగు వేదములను క్రమముగా నాలుగు దిక్కులలో పూజించవలెను. ఇతరములగు విద్యలను నాలుగు గాని, ఎనిమిది గాని భాగములుగా చేసి చుట్టూ పూజించవలెను (49). ఈ విధముగా దక్షిణమునందు మూడు ఆవరణములతో కూడియున్న బ్రహ్మను పూజించి, తరువాత పశ్చిమమునందు ఆవరణములతో కూడియున్న రుద్రుని పూజించవలెను (50). ఆరు వేదాంగములు (లేదా, సద్యోజాతాది అయిదుగురు బ్రహ్మలు మరియు హృదయము) రుద్రుని మొదటి ఆవరణమని చెప్పబడినది. ఎనిమిది విద్యేశ్వరులు ఆయనకు రెండవ ఆవరణము అగుదురు (51). మూడవ ఆవరణములో భేదము గలదు. ఆ వివరములు చెప్పబడుచున్నవి. తూర్పుదిక్కుతో మొదలు బెట్టి వరుసగా ఆయనయొక్క నాలుగు రూపములను పూజించవలెను (52). మూడు గుణములు కలిగి సగుణస్వరూపుడై శివుడని ప్రఖ్యాతిని గాంచిన దేవుని తూర్పునందు, రజోగుణస్వరూపుడై సృష్టిని చేయు బ్రహ్మను దక్షిణమునందు పూజించవలెను. జగద్రూపముగా ప్రకటమగువాడు, తమోగుణప్రధానుడు, కాలాగ్నిరూపములో జగత్తును ఉపసంహరించువాడు అగు హరుని పశ్చిమమునందు, సత్త్వగుణప్రధానుడు, సుఖమునిచ్చువాడు అగు విష్ణువును ఉత్తరదిక్కునందు పూజించవలెను. జగత్తును పాలించే మృడుడు ఈయనయే (53,54). ఈ విధముగా పశ్చిమదిక్కునందు ఇరువది ఆరు తత్త్వముల శంభుని శివరూపమును చక్కగా పూజించి, తరువాత ఉత్తరదిక్కునందలి పార్శ్వమునందు విష్ణువును పూజించవలెను (55). వాసుదేవం పురస్కృత్వా ప్రథమావరణ యజేత్ | అనిరుద్ధం దక్షిణతః ప్రద్యుమ్నం పశ్చిమే తతః ||
56 సౌమ్యం సంకర్షణం పశ్చాద్వ్యత్యస్తౌ వా యజేదిమౌ | ప్రథమావరణం ప్రోక్తం ద్వితీయావరణం శుభమ్ ||
57 మత్స్యః కూర్మో వరాహశ్చ నరసింహోథ వామనః | రామశ్చాన్యతమః కృష్ణో భవానశ్వముఖోపి చ ||
58 తృతీయావరణ చక్రం పూర్వభాగే సమర్చయేత్ | నారాయణాఖ్యం యామ్యేస్త్రం క్వచిదవ్యాహతం యజేత్ ||
59 పశ్చిమే పాంచజన్యం చ శార్జ్గం ధనురథోత్తరే | ఏవం త్ర్యావరణౖస్సాక్షాద్విశ్వాఖ్యం పరమం హరిమ్ ||
60 మహావిష్ణుం సదావిష్ణుం మూర్తీకృత్య సమర్చయేత్ | ఇత్థం విష్ణోశ్చతుర్వ్యూహక్రమాన్మూర్తిచతుష్టయమ్ | పూజయిత్వా చ తచ్ఛక్తీశ్చతస్రః పూజయేత్ర్కమాత్ ||
61 ప్రభామాగ్నేయదిగ్భాగే నైరృతే తు సరస్వతీమ్ | గణాంబికాం చ వాయవ్యే లక్ష్మీం రౌద్రే సమర్చయేత్ ||
62 ఏవం భాన్వాదిమూర్తీనాం తచ్ఛక్తీ నామనంతరమ్ | పూజాం విధాయ లోకేశాంస్తత్రైవావరణ యజేత్ ||
63 ఇంద్రమగ్నిం యమం చైవ నిరృతిం వరుణం తథా | వాయుం సోమం కుబేరం చ పశ్చాదీశానమర్చయేత్ ||
64 ఏవం చతుర్థావరణం పూజాయిత్వా విధానతః | ఆయుధాని మహేశస్య పశ్చాద్బాహ్యం సమర్చయేత్ ||
65 మొదటి ఆవరణములో తూర్పునందు వాసుదేవుని, దక్షిణమునందు అనిరుద్ధుని, పశ్చిమమునందు ప్రద్యుమ్నుని, ఉత్తరమునందు సంకర్షణుని స్థాపించి పూజించవలెను. లేదా, ప్రద్యుమ్నుని ఉత్తరమునందు, సంకర్షణుని పశ్చిమమునందు పూజించవచ్చును. ఇంతవరకు మొదటి ఆవరణము చెప్పబడినది. ఇప్పుడు శుభకరమగు రెండవ ఆవరణము చెప్పబడుచున్నది (56,57). మత్స్య, కూర్మ, వరహా, నరసింహ, వామన అవతారములు, ముగ్గురు రాములలో ఎవరో ఒకరు, శ్రీకృష్ణుడవగు నీవు, హయగ్రీవుడు రెండవ ఆవరణములో పూజించబడెదరు (58). మూడవ ఆవరణములో చక్రమును తూర్పునందు, ఎక్కడనైననూ మొక్కవోని నారాయణాస్త్రమును దక్షిణమునందు పూజించవలెను (59). పశ్చిమమునందు పాంచజన్యమును, తరువాత ఉత్తరమునందు శార్ఙ్గధనస్సును పూజించవలెను. ఈ విధముగా మూడు ఆవరణములతో కూడియున్నవాడు, సాక్షాత్తుగా విశ్వము (జగత్తు) అనే నామము గలవాడు, సర్వోత్కృష్టుడు, పాపహారి (60). సర్వదా సర్వత్ర వ్యాపించి యున్నవాడు అగు శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తులను వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అనే నాలుగు వ్యూహముల క్రమములో చేసి, ఆ నాలుగు మూర్తులను శ్రద్ధగా పూజించవలెను (61). తరువాత ఆగ్నేయదిక్కునందు ప్రభా అనే శక్తిని, నైరృతియందు సరస్వతిని, వాయవ్యమునందు గణాంబికను, ఈశాన్యమునందు లక్ష్మిని పూజించవలెను (62). ఈ విధముగా భాను మొదలగు మూర్తులను, వారి శక్తులను పూజించి, అదే ఆవరణమునందు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, చంద్రుడు, కుబేరుడు, ఈశానుడు అనే లోకపాలకులను పూజించవలెను (63,64). ఈ విధముగా నాల్గవ ఆవరణమును యథావిధిగా పూజించి, తరువాత దానికి బయట మహేశ్వరుని ఆయుధములను పూజించవలెను (65). శ్రీమత్త్రి శూలమీశానే వజ్రం మాహేంద్రదిఙ్ముఖే | పరశుం వహ్నిదిగ్భాగే యామ్యే సాయకమర్చయేత్ ||
66 నైరృతే తు యజేత్ఖడ్గం పాశం వారుణగోచరే | అంకుశం మారుతే భాగే పినాకం చోత్తరే యజేత్ ||
67 పశ్చిమాభిముఖం రౌద్రం క్షేత్రపాలం సమర్చయేత్ | పంచమావరణం చైవం సంపూజ్యానంతరం బహిః ||
68 సర్వావరణదేవానాం బహిర్వా పంచమే%థ వా | పంచమే మాతృభిస్సార్ధం మహోక్షం పురతో యజేత్ ||
69 తతస్సమంతతః పూజ్యాస్సర్వ వై దేవయోనయః | ఖేచరా ఋషయస్సిద్ధా దైత్యా యక్షాశ్చ రాక్షసాః ||
70 అనంతాద్యాశ్చ నాగేంద్రా నాగైస్తత్తత్కులోద్భవైః | డాకినీభూతవేతాలప్రేతభైరవనాయకాః ||
71 పాతాలవాసినశ్చాన్యే నానాయోనిసముద్భవాః | నద్యస్సముద్రా గిరయః కాననాని సరాంసి చ ||
72 పశవః పక్షిణో వృక్షాః కీటాద్యాః క్షుద్రయోనయః | నరాశ్చ వివిధాకారా మృగాశ్చ క్షుద్రయోనయః ||
73 భువనాన్యంతరండస్య తతో బ్రహ్మండకోటయః | బహిరండాన్యసంఖ్యాని భువనాని సహాధిపైః ||
74 బ్రహ్మాండాధారకా రుద్రా దశదిక్షు వ్యవస్థితాః | యద్గౌణం యచ్చ మాయేయం యద్వా శాక్తం తతః పరమ్ ||
75 యత్కించిదస్తి శబ్దస్య వాచ్యం చిదచిదాత్మకమ్ | తత్సర్వం శివయోః పార్శ్వే బుద్ధ్వా సామాన్యతో యజేత్ ||
76 శోభాయుక్తమగు త్రిశూలమును ఈశాన్యమునందు, తూర్పునందు వజ్రమును, ఆగ్నేయమునందు పరశువును, దక్షిణమునందు బాణమును, నైరృతియందు కత్తిని, పశ్చిమమునందు పాశమును, వాయవ్యమునందు అంకుశమును, ఉత్తరమునందు పినాకమనే ధనస్సును పూజించవలెను (66,67). తరువాత పశ్చిమము వైపు తిరిగి కూర్చున్న భయంకరాకారుడగు క్షేత్రపాలకుని చక్కగా పూజించవలెను. ఈ విధముగా అయిదవ ఆవరణమును పూజించి, తరువాత దానికి బయట గాని (68), లేదా సకల-ఆవరణదేవతలకు బయట గాని, లేదా, అయిదవ ఆవరణము లోపలనే గాని, తూర్పు దిక్కునందు మాతృకలతో కూడియున్న నందీశ్వరుని పూజించవలెను (69). తరువాత చుట్టూ సకలదేవయోనులను, ఆకాశమునందు సంచరించే ఋషులను, సిద్ధులను, దైత్యులను, యక్షులను, రాక్షసులను (70). ఆయా వంశములలో జన్మించిన నాగులతో కూడియున్న అనంతుడు మొదలగు సర్పరాజులను, డాకినీలను, భూతములను, భేతాళులను, ప్రేతములను, భైరవనాయకులను (71), పాతాళములో నివసించే వివిధయోనులలో పుట్టిన ప్రాణులను, నదులను, సముద్రములను, పర్వతములను, అడవులను, సరస్సులను (72), పాతాళములో నివసించే వివిధయోనులలో పుట్టిన ప్రాణులను, నదులను, సముద్రములను, పర్వతములను, అడవులను, సరస్సులను (72), పశువులను, పక్షులను, చెట్లను, కీటకములు మొదలగు అల్పప్రాణులను, అనేకములగు ఆకారములు గల మానవులను, నీచయోనులలో జన్మించిన మృగములను (73), బ్రహ్మాండము లోపలనుండే భువనములను, తరువాత కోట్లాది బ్రహ్మాండములను, బ్రహ్మాండమునకు బయటనుండే అసంఖ్యాకములగు భువనములను, వాటి పాలకులను (74), పదిదిక్కులలో నున్నవారై బ్రహ్మండమును నిలబెట్టే రుద్రులను పూజించవలెను. ఏది సత్త్వరజస్తమోగుణముల నుండి పుట్టినదో, ఏది మాయాకార్యమో, ఏది శక్తికార్యమో, ఏది వీటికి అతీతమో (75), శబ్దములకు గోచరమయ్యే చేతనాచేతనాత్మకమగు ఏ సర్వపదార్థములు గలవో ఆ సర్వము పార్వతీపరమేశ్వరుల పార్శ్వముల యందు ఉన్నదానినిగా తెలుసుకొని, దానిని సామాన్యరూపముగా ఆరాధించవలెను (76). కృతాంజలిపుటాస్సర్వే చింత్యాస్స్మితముఖాస్తథా | ప్రీత్యా సంప్రేక్షమాణాశ్చ దేవం దేవీం చ సర్వదా ||
77 ఇత్థమావరణాభ్యర్చాం కృత్వా విక్షేపశాంతయే | పునరభ్యర్చ్య దేవేశం పంచాక్షరముదీరయేత్ ||
78 నివేదయేత్తతః పశ్చాచ్ఛివయోరమృతోపమమ్ | సువ్యంజనసమాయుక్తం శుద్ధం చారుమహాచరుమ్ ||
79 ద్వాత్రింశదాఢకైర్ముఖ్యమధమం త్వాఢకావరమ్ | సాధయిత్వా యథాసంపచ్ర్ఛద్ధయా వినివేదయేత్ ||
80 తతో నివేద్య పానీయం తాంబూలం చోపదంశ##కైః | నీరాజనాదికం కృత్వా పూజాశేషం సమాపయేత్ ||
81 భోగోపయోగ్యద్రవ్యాణి విశిష్టాన్యేవ సాధయేత్ | విత్తశాఠ్యం న కుర్వీత భక్తిమాన్ విభ##వే సతి ||
82 శరస్యోపేక్షకస్యాపి వ్యంగం చైవానుతిష్ఠతః | న ఫలంత్యేవ కర్మాణి కామ్యానీతి సతాం కథా ||
83 తస్మాత్సమ్యగుపేక్షాం చ త్యక్త్వా సర్వాంగయోగతః | కుర్యాత్కామ్యాని కర్మాణి ఫలసిద్ధిం యదీచ్ఛతి ||
84 ఇత్థం పూజాం సమాప్యాథ దేవం దేవీం ప్రణమ్య చ | భక్త్యా మనస్సమాధాయ పశ్చాత్ స్తోత్రముదీరయేత్ ||
85 తతః స్తోత్రముపాస్యాంతే త్వష్టోత్తరశతావరామ్ | జపేత్పంచాక్షరీం విద్యాం సహస్రోత్తరముత్సుకః ||86 వారందరు చేతులను జోడించి చిరునవ్వుతో కూడిన ముఖములు గలవారై, సర్వకాలములలో పార్వతీపరమేశ్వరులను ప్రీతియుక్తముగా చూచుచున్నట్లు భావన చేయవలెను (77). ఈ విధముగా ఆవరణపూజను చేసి, మనస్సులోని అలజడి తగ్గుట కొరకై మరల ఆ దేవదేవుని పూజించి, పంచాక్షరమంత్రమును జపించవలెను (78). ఆ తరువాత వివిధములగు కూరలతో పచ్చళ్లతో కూడియున్న సుందరమగు పరిశుద్ధమైన అమృతమువంటి అన్నముతో నిండిన కుంభమును పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యము పెట్టవలెను (79). ముప్పది రెండు తూము (నాలుగుకుంచములు) ల బియ్యముతో వండిన అన్నము ప్రథమపక్షము. కనీసము ఒక తూము బియ్యము అధమ పక్షము, సాధకుడు అన్నకుంభమును తన సంపదకు తగ్గట్లుగా తయారు చేసి శ్రద్ధతో నైవేద్యము పెట్టవలెను (80). తరువాత త్రాగు నీటిని, పరిమళద్రవ్యములతో కూడిన తాంబూలమును, నీరాజనము మొదలగు వాటిని సమర్పించి, మిగిలిన పూజను ముగించవలెను (81). ఈ పూజలో నాణ్యముగల పదార్థములను మాత్రమే వినియోగించవలెను. భక్తిగల సాధకుడు సంపద గలవాడైనచో, కక్కుర్తి పడి డబ్బు ఖర్చుకు వెనుకాడరాదు (82). డబ్బు ఉండి కూడ లోటు చేయువానికి, శ్రద్ధ లేనివానికి, లోపపూర్ణముగా కర్మను చేయువానికి కామ్యకర్మలు ఫలించవని మహాత్ములు చెప్పుచున్నారు (83). కావున, సాధకుడు ఫలసిద్ధిని కోరువాడైనచో, ఉపేక్ష చేసే స్వభావమును ప్రక్కన బెట్టి, కర్మాంగములనన్నింటినీ చక్కగా అనుష్ఠించవలెను (84). ఈ విధముగా పూజను పూర్తి చేసి, తరువాత పార్వతీపరమేశ్వరులకు భక్తితో నమస్కరించి, తరువాత ఏకాగ్రచిత్తముతో స్తోత్రమును పటించవలెను (85). స్తోత్రమును పఠించిన తరువాత ఉత్సాహవంతుడగు సాధకుడు పంచాక్షరమంత్రమును వెయ్యి నూట యెనిమిది సార్లు జపించవలెను (86). విద్యాపూజాం గురోః పూజాం కృత్వా పశ్చాద్యథాక్రమమ్ | యథోదయం యథాశ్రాద్ధం సదస్యానపి పూజయేత్ ||
87 తత ఉద్వాస్య దేవేశం సర్వైరావరణౖస్సహ | మండలం గురవే దద్యాద్యాగోపకరణౖస్సహ ||
88 శివాశ్రితేభ్యోవా దద్యాత్సర్వమేవానుపూర్వశః | అథవా తచ్ఛివాయైవ శివక్షేత్రే సమర్పయేత్ ||
89 శివాగ్నౌ వా యజేద్దవం హోమద్రవ్యైశ్చ సప్తభిః | సమభ్యర్చ్య యథాన్యాయం సర్వావరణదేవతాః ||
90 ఏష యోగేశ్వరో నామ త్రిష లోకేషు విశ్రుతః | న తస్మాదధికః కశ్చిద్యోగో%స్తి భువనే క్వచిత్ ||
91 న తదస్తి జగత్యస్మిన్నసాధ్యం యదనేన తు | ఐహికం వా ఫలం కించిదాముష్మికఫలం తు వా ||
92 ఇదమస్య ఫలం నేదమితి నైవ నియమ్యతే | శ్రేయోరూపస్య కృత్స్నస్య తదిదం శ్రేష్ఠసాధనమ్ ||
93 ఇదం హి శక్యతే వక్తుం పురుషేణ యదర్చ్యతే | చింతామణరివైతస్మాత్తత్తేన ప్రాప్యతే ఫలమ్ ||
94 తథాపి క్షుద్రముద్దిశ్య ఫలం నైతత్ర్పయోజయేత్ | లఘ్వర్థీ మహతో యస్మాత్స్వయం లఘుతరో భ##వేత్ ||
95 మహద్వా ఫలమల్పం వా కృతం చేత్కర్మ సిధ్యతి | మహాదేవం సముద్దిశ్యకృతం కర్మ ప్రయుజ్యతామ్ ||
96 తరువాత వరసగా విద్యను, గురువును క్రమము తప్పకుండగా పూజించి, సాధకుడు తన సంపదకు మరియు శ్రద్ధకు తగ్గట్లుగా సభాసదులను కూడ పూజించవలెను (87). తరువాత ఆవరణములన్నింటితో సహా దేవదేవుని ఉద్వాసన చెప్పి, పూజలో ఉపయోగించిన పదార్థములతో బాటు మండలమును గురువునకు ఈయవలెను (88). లేదా, ఆ సర్వమును ఒక వరుసలో శివభక్తులకు ఈయవలెను. లేదా, దానిని శివక్షేత్రమునందు శివునికే సమర్పించవచ్చును (89). ఈ పూజకు బదులుగా, ఆవరణదేవతలనందరినీ యథావిధిగా చక్కగా పూజించిన పిదప శివాగ్ని యందు ఆ పరమేశ్వరుని ఏడు రకముల హోమద్రవ్యములతో ఆరాధించవచ్చును (90). ఈ పూజ యోగేశ్వరము అను పేరిట ముల్లోకములలో ప్రసిద్ధిని బడసినది. ఈ లోకములో దీనిని మించిన యోగము ఏదీ ఎక్కడైననూ లేదు (91). ఈ జగత్తులో దీనిచే సాధింప శక్యము గానిది ఇహలోకఫలము గాని, పరలోకఫలము గాని, ఏదీ లేదు (92). ఇది దీనికి ఫలము, ఇది కాదు అనే వ్యవస్థను చేయుట సంభవము కాదు. సకలములగు హితములను పొందుటకు ఇది శ్రేష్ఠమైన సాధనము (93). మానవుడు ఏ ఫలమును ఉద్దేశించి ఈ విధముగా ఆరాధించునో, చింతామణి (సర్వకామములనీడేర్చే మణి లేక మంత్రము) వంటి దీనివలన వానికి ఆ సర్వము సిద్ధించునని నిశ్చితముగా చెప్పవచ్చును (94). అయినప్పటికీ, ఈ యోగమును అల్పమగు ఫలము కొరకు అనుష్ఠించ రాదు. ఏలయనగా, గొప్పదానినుండి తక్కువ ఫలమును కోరే వ్యక్తి తాను కూడ చాల చులకన యగును (95). మహాదేవుని ఉద్దేశించి చిన్న కర్మను చేసినా, పెద్ద కర్మను చేసినా, అది తప్పక ఫలించును. కావున, సాధకుడు కర్మలను మహాదేవుని ఉద్దేశించి చేయవలెను (96). తస్మాదనన్యలభ్యేషు శత్రుమృత్యుంజయాదిషు | ఫలేషు దృష్టాదృష్టేషు కుర్యాదేతద్విచక్షణః ||
97 మహత్స్వపి చ పాపేషు మహారోగభయాదిషు | దుర్భిక్షాదిషు శాంత్యర్థం శాంతిం కుర్యాదనేన తు ||
98 బహునా కిం ప్రలాపేన మహా వ్యాపన్నివారకమ్ | ఆత్మీయమస్త్రం శైవానామిదమాహ మహేశ్వరః ||
99 తస్మాదితః పరం నాస్తి పరిత్రాణమిహాత్మనః | ఇతి మత్వా ప్రయుంజానః కర్మేదం శుభమశ్నుతే ||
100 స్తోత్రమాత్రం శుచిర్భూత్వా యః పరేత్సుసమాహితః | సోప్యభీష్టతమాదర్థాదష్టాంశఫలమాప్నుయాత్ ||
101 అర్థం తస్యానుసంధాయ పర్వణ్యనశనః పఠేత్ | అష్టమ్యాం వా చతుర్దశ్యాం ఫలమర్ధం సమాప్నుయాత్ ||
102 యస్త్వర్థమనుసంధాయ పర్వాదిషు తథా వ్రతీ | మాసమేకం జపేత్ స్తోత్రం సకృత్స్న ఫలమాప్నుయాత్ ||
103 ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శైవానాం కామ్యకర్మవర్ణనం నామ త్రింశో%ధ్యాయః (30). కావున, శత్రువులను జయించుట, మృత్యువును జయించుట మొదలగు కంటికి కానవచ్చు ఫలముల కొరకు మాత్రమే గాక, కంటికి కానరాని (స్వర్గము మొదలగు) ఫలముల కొరకు, ఇతరములగు ఉపాయములచే లభించని ఫలముల కొరకు కూడ వివేకియగు సాధకుడు ఈ యోగమును అనుష్ఠించ వలెను (97). మహాపాపములనుండి, మహారోగము మొదలగు భయములనుండి విముక్తిని పొందుటకు, కరువు మొదలగునవి తొలగి పోవుటకు, ఈ యోగముతో శాంతిని చేయవలెను (98). ఇన్ని మాటలేల? ఇది శివభక్తులకు పెద్ద ఆపదలను నివారించే తన అస్త్రమని మహేశ్వరుడ చెప్పినాడు (99). కావున, మానవుడు తనను రక్షించుకొనుటకు ఇంతకు మించిన ఉపాయము లేదని తెలుసుకొని ఈ కర్మను ఆచరించు వ్యక్తి శుభమును పొందును (100). ఎవడైతే పరిశుద్ధుడై ఏకాగ్రమగు చిత్తముతో కేవలము స్తోత్రమును మాత్రమే పఠించునో, వాడు కూడ తనకు అత్యంతప్రియమగు వస్తువులో ఎనిమిదవ భాగమును పొందును (101). సాధకుడు పూర్ణిమ, అమావాస్య, చతుర్దశి, అష్టమి అను తిథులలో ఒకనాడు ఉపవాసమును చేసి అర్థముపై మనస్సును నిలిపి స్తోత్రమును పఠించినచో, వానికి సగము ఫలము లభించును (102). ఎవడైతే పూర్ణిమ మొదలగు తిథులలో వ్రతనియమమును పాటిస్తూ వరుసగా నెలరోజులు స్తోత్రమును అర్థముపై మనస్సును నిలిపి పఠించునో, వానికి పూర్ణఫలము లభించును (103). శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందలి ఉత్తరఖండములో శివభక్తులకు కామ్యకర్మలను నిరూపించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).