Siva Maha Puranam-4
Chapters
అథ ఏకత్రింశోధ్యాయః శివ మహా స్తోత్రము ఉపమన్యురువాచ | స్తోత్రం వక్ష్యామి తే కృష్ణ పంచావరణమార్గతః | యోగేశ్వరమిదం పుణ్యం కర్మ యేన సమాప్యతే ||
1 జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతిమనోహర నిత్యచిత్స్వభావ | అతిగతకలుషప్రపంచ వాచామపి మనసాం పదవీమతీతతత్త్వమ్ ||
2 స్వభావనిర్మలాభోగ జయ సుందరచేష్టిత | స్వాత్మతుల్యమహాశ##క్తే జయ శుద్ధగుణార్ణవ || 3 అనంతకాంతిసంపన్న జయాసదృశవిగ్రహ | అతర్క్యమహిమాధార జయానాకులమంగల || 4 నిరంజన నిరాధార జయ నిష్కారణోదయ | నిరంతరపరానంద జయ నిర్వృతికారణ || 5 జయాతిపరమైశ్వర్య జయాతికరుణాస్పద | జయ స్వతంత్రసర్వస్వ జయాసదృశ##వైభవ || 6 జయావృతమహావిశ్వ జయనావృత కేనచిత్ | జయోత్తర సమస్తస్య జయాత్యంత నిరుత్తర || 7 జయాద్భుత జయాక్షుద్ర జయాక్షత జయావ్యయ | జయామేయ జయామాయ జయాభావ జయామల || 8 మహాభుజ మహాసార మహాగుణ మహాకథ | త్వదధీనమిదం కృత్స్నం జగద్ధి ససురాసురమ్ || 9 నమః పరమదేవాయ నమః పరమహేతవే | నమశ్శివాయ శాంతాయ నమశ్శివతరాయ తే || 10 ఉపమన్యువు ఇట్లు పలికెను - ఓ శ్రీకృష్ణా! నేను నీకు పంచావరణమార్గముచే చేయబడే స్తోత్రమును చెప్పెదను. యోగేశ్వరము అనబడే (పైన చెప్పిన) ఈ కర్మ ఈ స్తోత్రముతో పరిసమాప్తమగును (1). జగత్తునకు అద్వితీయప్రభువగు ఓ శంభో! నీకు జయమగుగాక! స్వభావముచేతనే మనస్సును హరించువాడా! శాశ్వతచైతన్యమే స్వరూపముగా గలవాడా! సమస్తదోషములను అతిక్రమించినవాడా! నీ రూపము వాక్కులకు మాత్రమే గాక మనస్సునకు కూడ అందనిది. నీకు జయమగుగాక! (2) స్వభావముచే దోషరహితమగు రూపము గలవాడా! సుందరమగు లీలలు గలవాడా! నీ గొప్ప శక్తితో తులదూగేది నీవు మాత్రమే. సకలకల్యాణగుణములకు నిధానమైనవాడా! నీకు జయమగుగాక! (3) అంతు లేని కాంతితో సంపన్నమైనవాడా! సాటిలేని నిగ్రహము గలవాడా! ఊహకు అందని మహిమకు నిలయమైనవాడా! శాంతిరూపమగు మంగళములకు నివాసమైన వాడా! నీకు జయమగుగాక! (4) దోషములు లేని వాడా! ఆధారము లేనివాడా! (సర్వమునకు ఆధారమైనవాడా!) కారణము లేకుండగనే ప్రకటమగువాడా! ఏకరసమగు పరమానందమే స్వరూపముగా గలవాడా! మోక్షమునకు హేతువు అయిన వాడా! నీకు జయమగుగాక! (5) సర్వాతిశయమగు ఈశ్వరభావము గలవాడా! పరమదయానిధీ! సర్వము స్వాధీనమునందు గలవాడా! సాటిలేని వైభవము గలవాడా! నీకు జయమగుగాక! (6) విశాలమగు జగత్తునంతనూ విరాడ్రూపముగా వ్యాపించి యున్నవాడా! నిన్ను కప్పివేయునది ఏదీ లేదు. సర్వమునకు అతీతమైనవాడా! నిన్ను అతిక్రమించునది ఏదీ లేదు. నీకు జయమగుగాక! (7) ఆశ్చర్యమును గొల్పువాడా! అల్పత్వము లేనివాడా! వికారములు లేనివాడా! వినాశము లేనివాడా! ఇంద్రియగోచరము కానివాడా! మాయాశక్తికి అతీతమైనవాడా! పుట్టుక లేనివాడా! దోషములు లేనివాడా! నీకు జయమగుగాక! (8) గొప్ప భుజములు గలవాడా! గొప్ప సారస్వరూపము గలవాడా! గొప్ప గుణములు గలవాడా! గొప్ప గాథలు కలవాడా! గొప్ప బలము గలవాడా! గొప్ప మాయ గలవాడా! గొప్ప ఆనందస్వరూపము గలవాడా! నీవు గొప్ప యుద్ధవీరుడవు (9). ఓ శివా! పరమప్రకాశస్వరూపుడవు, సర్వకారణకారణుడవు, శాంత స్వరూపుడవు, పరమమంగళస్వరూపుడవు అగు నీకు నమస్కారము (10). త్వదధీనమిదం కృత్స్నం జగద్ధి ససురాసురమ్ | అతస్త్వద్విహితామాజ్ఞాం క్షమతే కో%తివర్తితుమ్ || 11 అయం పునర్జనో నిత్యం భవదేకసమాశ్రయః | భవానతో%నుగృహ్యాసై#్మ ప్రార్థితం సంప్రయచ్ఛతు || 12 జయాంబికే జగన్మాతర్జయ సర్వజగన్మయి | జయానవధికైశ్వర్యే జయానుపమవిగ్రహే || 13 జయ వాఙ్మనసాతీతే జయాచిద్ధ్వాంతభంజికే | జయ జన్మజరాహీనే జయ కాలోత్తరోత్తరే || 14 జయానేకవిధానస్థే జయ విశ్వేశ్వరప్రియే | జయ విశ్వసురారాధ్యే జయ విశ్వవిజృంభిణి || 15 జయ మంగలదివ్యాంగి జయ మంగలదీపికే | జయ మంగలచారిత్రే జయ మంగలదాయిని || 16 నమః పరమకల్యాణగుణసంచయమూర్తయే | త్వత్తః ఖలు సముత్పన్నం జగత్త్వయ్యేవ లీయతే || 17 త్వద్వినాతః ఫలం దాతుమీశ్వరోపి న శక్నుయాత్ | జన్మప్రభృతి దేవేశి జనోయం త్వదుపాశ్రితః || 18 అతో%స్య తవ భక్తస్య నిర్వర్తయ మనోరథమ్ | పంచవక్త్రో దశభుజశ్శుద్ధస్ఫటికసన్నిభః || 19 వర్ణబ్రహ్మకలాదేహో దేవస్సకలనిష్కలః | శివమూర్తిసమారూఢశ్శాంత్యతీతస్సదాశివః | భక్త్యా మయార్చితో మహ్యం ప్రార్థితం శం ప్రయచ్ఛతు || 20 దేవతలతో మరియు రాక్షసులతో కూడియున్న ఈ జగత్తు అంతయు నీ అధీనములో నున్నది. కావున, నీవు విధించిన ఆజ్ఞను అతిక్రమించే సామర్ధ్యము ఎవనికి గలదు? (11) ఈ జనుడు (నేను) సర్వకాలములలో నిన్ను మాత్రమే ఆశ్రయించుకొని ఉన్నాడు. కావున, నీవు వీనిని అనుగ్రహించి, వీడు కోరుదానిని ఇచ్చెదవుగాక! (12) జగత్తునకు తల్లియగు ఓ పార్వతీ దేవీ! నీకు జయమగుగాక! నీవే సకలజగద్రూపముగా ప్రకటమగుచున్నావు. నీ ఐశ్వర్యమునకు హద్దులు లేవు. నీ రూపమునకు సాటి లేదు. నీకు జయమగుగాక! (13) నీవు వాక్కునకు మరియు మనస్సునకు అతీతమైన దానవు. నీవు జడత్వము అనే చీకటిని పోగొట్టెదవు. నీకు పుట్టుక గాని, ముదుసలి తనము గాని లేవు. నీవు కాలమునకు అతీతులగు బ్రహ్మాదులకు కూడ అతీతమైనదానవు. నీకు జయమగుగాక! (14) అనేక ప్రకారములలో ప్రకటమగుదానా! విశ్వేశ్వరుని ప్రియురాలా! సకలదేవతలచే కొలువబడుదానా! జగద్రూపముగా విజృంభించుదానా! నీకు జయమగుగాక! (15) మంగళకరములు మరియు ప్రకాశమయములు అగు అవయవములు గల దానా! మంగళములను ప్రకాశింప జేయుదానా! మంగళకరమగు లీలలు గలదానా! మంగళములను ఇచ్చుదానా! నీకు జయమగుగాక! (16) పరమమంగళప్రదములగు గుణముల సముదాయమే స్వరూపముగా గల నీకు నమస్కారము. నీనుండి పుట్టిన ఈ జగత్తు నీయందే విలీనమగుచున్నది (17). కావున, నీవు లేనిదే ఈశ్వరుడైననూ ఫలముల నీయజాలడు. ఓ దేవదేవీ! ఈ జనుడు (నేను) పుట్టిన నాటినుండి నిన్ను ఆశ్రయించుకొని యున్నాడు (18). కావున, నీ భక్తుడగు వీని మనోరథము నీడేర్చుము. అయిదు ముఖములు గలవాడు, పది భుజముల వాడు, స్వచ్ఛమగు స్ఫటికమును పోలియున్నవాడు (19), వర్ణములు (అక్షరములు) అయిదుగురు బ్రహ్మలు మరియు కళ##తే దేహముగా గలవాడు, ప్రకాశస్వరూపుడు, సగుణుడు మరియు నిర్గుణుడు, శివరూపమును దాల్చినవాడు, శాంత్యతీతకళయందు విరాజిల్లువాడు అగు సదాశివుని నేను భక్తితో ఆరాధించి ప్రార్థించుచున్నాను. ఆయన నాకు సుఖమునిచ్చు గాక! (20). సదాశివాంకమారూఢా శక్తిరిచ్ఛా శివాహ్వయా | జననీ సర్వలోకానాం ప్రయచ్ఛతు మనోరథమ్ || 21 శివయోర్దయితౌ పుత్రౌ దేవౌ హేరంబషణ్ముఖౌ | శివానుభావౌ సర్వజ్ఞౌ శివజ్ఞానామృతాశినౌ || 22 తృప్తౌ పరస్పరం స్నిగ్ధౌ శివాభ్యాం నిత్యసత్కృతౌ | సత్కృతౌ చ సదా దేవౌ బ్రహ్మాద్యైస్త్రిదశైరపి || 23 సర్వలోకపరిత్రాణం కర్తుమభ్యుదితౌ సదా | స్వేచ్ఛావతారం కుర్వంతౌ స్వాంశ##భేదైరనేకశః || 24 తావిమౌ శివయోః పార్శ్వే నిత్యమిత్థం మయార్చితౌ | తయోరాజ్ఞాం పురస్కృత్య ప్రార్థితం మే ప్రయచ్ఛతామ్ || 25 శుద్ధస్ఫటికసంకాశమీశానాఖ్యం సదాశివమ్ | మూర్ధాభిమాననీ మూర్తిశ్శివస్య పరమాత్మనః || 26 శివార్చనరతం శాంతం శాంత్యతీతం ఖమాస్థితమ్ | పంచాక్షరాంతిమం బీజం కలాభిః పంచభిర్యుతమ్ || 27 ప్రథమావరణ పూర్వం శక్త్యా సహ సమర్చితమ్ | పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు || 28 బాలసూర్యప్రతీకాశం పురుషాఖ్యం పురాతనమ్ | పూర్వవక్త్రాభిమానం చ శివస్య పరమేష్ఠినః || 29 శాంత్యాత్మకం మరుత్సంస్థం శంభోః పాదార్చనే రతమ్ | ప్రథమం శివబీజేషు కలాసు చ చతుష్కలమ్ || 30 పూర్వభాగే మయా భక్త్యా శక్త్యా సహ సమర్చితమ్ | పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు || 31 సదాశివుని అంకమునధిష్ఠించి యుండునది, ఇచ్ఛాశక్తిస్వరూపిణి, శివా అను పేరు గలది, సర్వలోకములకు తల్లి అగు పార్వతి నా మనోరథమునీడేర్చు గాక! (21) పార్వతీపరమేశ్వరుల ముద్దుబిడ్డలు, ప్రకాశస్వరూపులు, శివునితో సమానమగు ప్రభావము గలవారు, సర్వమునెరింగిన వారు, శివజ్ఞానము అనే అమృతమునాస్వాదించి తృప్తిని చెందువారు, ఒకరినొకరు ప్రేమించువారు, పార్వతీపరమేశ్వరులచే సర్వదా ఆదరించ బడువారు, ఇంతేగాక సర్వకాలములలో బ్రహ్మ మొదలగు దేవతలచే గూడ ఆరాధింపబడే దేవులు, సర్వదా సర్వలోకములను రక్షించుటకు సంసిద్ధముగా నుండువారు, తమ అంశలలోని భేదములను బట్టి అనేకవిధములగు అవతారములను స్వేచ్ఛగా స్వీకరించువారు. నిత్యము పార్వతీపరమేశ్వరుల ప్రక్కన వెలుగొందువారు అగు ఈ గణపతి కుమారస్వాములను నేను ఈ విధముగా పూజించుచున్నాను. వారు ఆ పార్వతీపరమేశ్వరుల అజ్ఞాను పురస్కరించుకొని, నా మనోరథమునీడేర్చెదరు గాక! (22-25) స్వచ్ఛమగు స్ఫటికమువలె ప్రకాశించువాడు, ఈశానుడు అని ప్రసిద్దిని గాంచినవాడు అగు సదాశివుని ఆరాధించుచున్నాను. ఈ ఈశానుడు శివపరమాత్మయొక్క శిరస్సునకు అధిష్ఠాన దేవత (26). శివుని పూజించుటయందు ప్రీతి గలవాడు, శాంతస్వరూపుడు, శాంత్యతీతకళాస్వరూపుడై ఆకాశతత్త్వమునందు వెలుగొందువాడు, పంచాక్షరమంత్రముయొక్క ఆఖరి బీజాక్షరమే స్వరూపముగా గలవాడు, అయిదు కళలతో కూడియున్నవాడు (27), ముందుగా మొదటి ఆవరణములో శక్తితో సహా చక్కగా పూజించబడువాడు, పావనుడు అగు పరంబ్రహ్మ నా మనోరథమునీడేర్చు గాక! (28) ఉదయించే సూర్యుని వలె ప్రకాశించువాడు, తత్పురుషుడు అని ప్రసిద్ధిని గాంచిన ఆదిపురుషుడు, శివపరమాత్మయొక్క తూర్పు ముఖమునకు అధిష్ఠానదేవత (29), శాంతికళాస్వరూపుడై వాయుతత్త్వమునందు ఉండువాడు, శంభుని పాదములను పూజించుటయందు ప్రీతి గలవాడు, పంచాక్షరమంత్రములో మొదటి బీజము స్వరూపముగా గలవాడు, కళలలోని నాలుగు కళలతో కూడియున్నవాడు (30), తుర్పుదిక్కునందు శక్తితో సహా నాచే పూజించబడినవాడు, పావనుడు అగు పరంబ్రహ్మ నా మనోరథమునీడేర్చు గాక! (31) అంజనాద్రిప్రతీకాశమఘోరం ఘోరవిగ్రహమ్ | దేవస్య దక్షిణం వక్త్రం దేవదేవపదార్చకమ్ || 32 విద్యాపాదం సమారూఢం వహ్నిమండలమధ్యగమ్ | ద్వితీయం శివబీజేషు కలాస్వష్టకలాన్వితమ్ || 33 శంభోర్దక్షిణదిగ్భాగే శక్త్యా సహ సమర్చితమ్ | పవిత్రం మధ్యమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు || 34 కుంకుమక్షోదసంకాశం వామాఖ్యం పరవేషధృక్ | వక్త్రముత్తరమీశస్య ప్రతిష్ఠాయాం ప్రతిష్ఠితమ్ || 35 వారిమండలమధ్యస్థం మహాదేవార్చనే రతమ్ | తురీయం శివబీజేషు త్రయోదశకలాన్వితమ్ || 36 దేవస్యోత్తరదిగ్భాగే శక్త్యా సహ సమర్చితమ్ | పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్ఛతు || 37 శంఖకుందేందుధవళం సద్యాఖ్యం సౌమ్యలక్షణమ్ | శివస్య పశ్చిమం వక్త్రం శివపాదార్చనే రతమ్ || 38 నివృత్తిపదనిష్టం చ పృథివ్యాం సమవస్థితమ్ | తృతీయం శివబీజేషు కలాభిశ్చాష్టభిర్యుతమ్ || 39 దేవస్య పశ్చిమే భాగే శక్త్యా సహ సమర్చితమ్ | పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థతం మే ప్రయచ్ఛతు || 40 కాటుక కొండను పోలియుండువాడు, భయంకరాకారుడు, దేవదేవుని దక్షిణముఖము స్వరూపముగా గలవాడు, దేవదేవుని పాదములనర్చించువాడు, విద్యాకళను అధిష్ఠించి యుండువాడు, అగ్నిమండలమునకు మధ్యలో నుండువాడు, పంచాక్షరమంత్రబీజములలో రెండవ బీజము స్వరూపముగా గలవాడు, కళలలో ఎనిమిది కళలతో కూడియున్నవాడు, శంభునకు దక్షిణదిక్కునందు శక్తితో సహా చక్కగా పూజించబడిననాడు, పావనుడు, అయిదు బ్రహ్మలలో మధ్యముడు అగు అఘోరుడు నాకోరికను తీర్చుగాక! (32-34) కుంకుమ పొడివలె ప్రకాశించువాడు, వామదేవుడని ప్రసిద్ధిని గాంచినవాడు, గొప్ప వేషమును దాల్చినవాడు, శివుని ఉత్తరముఖము స్వరూపముగా గలవాడు, ప్రతిష్ఠాకళయందు ప్రతిష్ఠించబడి యుండువాడు(35), జలమండలమునకు మధ్యలో నుండువాడు, మహాదేవుని పూజించుటయందు ప్రీతి గలవాడు, పంచాక్షరమంత్రబీజములలో నాల్గవది స్వరూపముగా గలవాడు, పదమూడు కళలతో కూడియున్నవాడు (36), శివునకు ఉత్తరదిక్కునందు శక్తితో సహా చక్కగా పూజించబడినవాడు, పావనుడు అగు పరంబ్రహ్మనా అభీష్టమును ఇచ్చుగాక!(37) శంఖము మల్లెలు చంద్రుడు వలె తెల్లనివాడు, సద్యోజాతుడు అను పేరుతో ప్రసిద్ధిని బడసినవాడు, ప్రసన్నమగు లక్షణములు గలవాడు, శివుని పశ్చిమముఖము స్వరూపముగా గలవాడు, శివుని పాదములను కొలుచుటయందు ప్రీతి గలవాడు (38), నివృత్తికళను అధిష్ఠించి యుండువాడు, పృథివీతత్త్వమునందు ఉండువాడు, పంచాక్షరమంత్రము యొక్క మూడవ బీజము స్వరూపముగా గలవాడు, ఎనిమిది కళలతో కూడియుండు వాడు (39), శివుని పశ్చిమభాగములో శక్తితో సహా చక్కగా పూజించబడినవాడు, పావనుడు అగు పరబ్రహ్మ నా మనోరథమునీడేర్చు గాక! (40) శివస్య తు శివాయశ్చ హృన్మూర్తీ శివభావితే | తయోరాజ్ఞాం పురస్కృత్య తే మే కామం ప్రయచ్ఛతామ్ || 41 శివస్య చ శివాయాశ్చ శిఖామూర్తీ శివాశ్రితే | సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతామ్ || 42 శివస్య చ శివాయాశ్చ వర్మణీ శివభావితే | సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతామ్ || 43 శివస్య చ శివాయాశ్చ నేత్రమూర్తీ శివాశ్రితే | సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతామ్ || 44 అస్త్రమూర్తీ చ శివయోర్నిత్యమర్చనతత్పరే | సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం ప్రయచ్ఛతామ్ || 45 వామో జ్యేష్ఠస్తథా రుద్రః కాలో వికరణస్తథా | బలో వికరణశ్చైవ బలప్రమథనః పరః || 46 సర్వభూతస్య దమనస్తాదృశాశ్చాష్ట శక్తయః | ప్రార్థితం మే ప్రయచ్ఛంతు శివయోరేవ శాసనాత్ || 47 అథానంతశ్చ సూక్ష్మశ్చ శివశ్చాప్యేకనేత్రకః | ఏకరుద్రాఖ్యమూర్తిశ్చ శ్రీకంఠశ్చ శిఖండకః || 48 తథాష్టౌ శక్తయస్తేషాం ద్వితీయావరణ%ర్చితాః | తే మే కామం ప్రయచ్ఛంతు శివయోరేవ శాసనాత్ || 49 భవాద్యా మూర్తయశ్చాష్టౌ తాసామపి చ శక్తయః | మహాదేవాదయశ్చాన్యే తథైకాదశ మూర్తయః || 50 శక్తిభిస్సహితాస్సర్వే తృతీయావరణ స్థితాః | సత్కృత్య శివయోరాజ్ఞాం దిశంతు ఫలమీప్సితమ్ || 51 పార్వతీపరమేశ్వరుల హృదయమూర్తులు శివభావముతో కూడినవై వారిద్దరి ఆజ్ఞను పురస్కరించుకొని నా మనోరథమునీడేర్చు గాక! (41) పార్వతీపరమేశ్వరుల శిఖామూర్తులు శివుని ఆశ్రయించి ఉన్నవై వారిద్దరి ఆజ్ఞను ఆదరించి, నా మనోరథమునీడేర్చుగాక ! (42) పార్వతీపరమేశ్వ రుల కవచమూర్తులు శివభావముతో కూడియున్నవై వారిద్దరి ఆజ్ఞను ఆదరించి, నా మనోరథమునీడేర్చు గాక ! (43) పార్వతీపరమేశ్వరుల నేత్రమూర్తులు శివుని ఆశ్రయించి ఉన్నవై, వారిద్దరి ఆజ్ఞను ఆదరించి , నా మనోరథమునీడేర్చు గాక ! (44) పార్వతీపరమేశ్వరుల అస్త్రమూర్తులు నిత్యము వారిద్దరి పూజయందు ప్రీతి గలవై వారిద్దరి ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక ! (45) వామదేవుడు (సుందరుడగు దేవుడు) , జ్యేష్ఠుడు (ఆదిపురుషుడు), రుద్రుడు (దుఃఖములను పోగొట్టువాడు), కాలుడు (మృత్యుస్వరూపుడు), కలవికరణుడు (ఆనందస్వరూపుడు మరియు జగన్నిర్మాత), బలుడు (శక్తిస్వరూపుడు), బలవికరణుడు (శత్రుసైన్యములను హింసించువాడు), బలప్రమథనుడు (ప్రళయములో శక్తులను ఉపసంహరించువాడు) (46), సర్వభూతదమనుడు (సర్వప్రాణులను శిక్షించువాడు) అనే ఎనిమిది మూర్తులు, అటువంటి ఎనిమిది శక్తులు పార్వతీపరమేశ్వరుల శాసనముచే నా మనోరథమునీడేర్చు గాక! (47) తరువాత అనంతుడు, సూక్ష్ముడు, శివుడు, ఏకనేత్రుడు, ఏకరుద్రుడు, శ్రీకంఠుడు, శిఖండకుడు(48) అనే ఎనిమిది విద్యేశ్వరులు మరియు వారి ఎనిమిది శక్తులు రెండవ ఆవరణములో పూజించబడినవి. వారు పార్వతీపరమేశ్వరుల శాసనముచే మాత్రమే నా మనోరథమునీడేర్చుగాక ! (49) భవుడు మొదలగు ఎనిమిది మూర్తులు, వారి శక్తులు, మరియు మహాదేవుడు మొదలగు పదకొండు ఇతర మూర్తులు (50), మరియు వారి శక్తులు అందరు మూడవ ఆవరణములో నున్నారు. వారు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను ఆదరించి మనోరథమునీడేర్చు గాక! (51) వృషరాజో మహాతేజా మహామేఘసమస్వనః | మేరుమందర కైలాసహిమాద్రిశిఖరోపమః || 52 సితాభ్రశిఖరాకారః కకుదా పరిశోభితః | మహాభోగీంద్రకల్పేన వాలేన చ విరాజితః || 53 రక్తాస్యశృంగచరణో రక్తప్రాయవిలోచనః | పీవరోన్నతసర్వాంగస్సుచారుగమనోజ్జ్వలః || 54 ప్రశస్తలక్షణః శ్రీమాన్ ప్రజ్వలన్మణిభూషణః | శివప్రియశ్శివాసక్తశ్శివయోర్ధ్వజవాహనః || 55 తథా తచ్చరణన్యాసపావితాపరవిగ్రహః | గోరాజపురుషః శ్రీమాన్ శ్రీమచ్ఛూలవరాయుధః | తయోరాజ్ఞాం పురస్కృత్య స మే కామం ప్రయచ్ఛతు || 56 నందీశ్వరో మహాతేజా నగేంద్రతనయాత్మజః | సనారాయణకైర్దేవైర్నిత్యమభ్యర్చ్య వందితః || 57 శర్వస్యాంతః పురద్వారి సార్ధం పరిజనైః స్థితః | సర్వేశ్వరసమప్రఖ్యస్సర్వాసురవిమర్దనః || 58 సర్వేషాం శివధర్మాణామధ్యక్షత్వే%భిషేచితః | శివప్రియశ్శివాసక్తః శ్రీమాన్ శూలవరాయుధః || 59 శివాశ్రితేషు సంసక్తస్త్వనురక్తశ్చ తైరపి | సత్కృత్య శివయోరాజ్ఞాం స మే కామం ప్రయచ్ఛతు || 60 వృషభములకు రాజు, గొప్ప తేజస్సు గలవాడు, మేఘము వలె గంభీరమగు ధ్వనిని చేయువాడు, మేరువు మందరము కైలాసము హిమవత్పర్వతము అనే పర్వతముల శిఖరములను బోలియుండువాడు (52), తెల్లని మేఘముల అగ్రభాగమును పోలియుండువాడు, మూపురముతో ప్రకాశించువాడు, గొప్ప సర్పరాజును పోలియున్న తోకతో ప్రకాశించువాడు (53), ఎర్రని నోరు కొమ్మము పాదములు గలవాడు, ఇంచుమించు ఎర్రని కన్నులు గలవాడు, బలిసి ఎత్తుగానున్న సకల- అవయవములు గలవాడు, మిక్కిలి అందమైన నడకతో గొప్పగా ప్రకాశించువాడు (54), ప్రశస్తమగు లక్షణములు గలవాడు, శోభాయుతుడు, వెలిగిపోయే మణులు పొదిగిన అలంకారములు గలవాడు, శివునకు ప్రియమైనవాడు, పార్వతియందు భక్తి గలవాడు, పార్వతీపరమేశ్వరులకు పతాకమునందలి చిహ్నము మాత్రమే గాక వాహనము కూడా అయినవాడు (55), వారిద్దరు తమ పాదములను ఉంచుటచే పవిత్రమైన నడుము గలవాడు, గోవులకు రాజపురుషుని వంటివాడు, ప్రకాశించే గొప్ప శూలము ఆయుధముగా గలవాడు అగు నందీశ్వరుడు వారిద్దరి ఆజ్ఞను పురస్కరించుకొని నా మనోరథమునీడేర్చుగాక ! (56) గొప్ప తేజశ్శాలి, పార్వతిదేవికి పుత్రునితో సమానమైనవాడు, నిత్యము నారాయణుడు మొదలగు దేవతలచే చక్కగా పూజించి నమస్కరించ బడువాడు, శివుని అంతఃపురముయొక్క ద్వారము వద్ద తన అనుచరులతో కూడి నిలబడి యుండువాడు, సర్వేశ్వరుడగు శివునితో సమానమగు కాంతి గలవాడు, రాక్షసులనందరినీ సంహరించినవాడు, శివవ్రతమును పాటించే భక్తులందరికీ అధ్యక్షస్థానములో అభిషేకించబడినవాడు, శివుని శరణు పొందిన వారియందు ప్రీతి గలవాడు, వారిచే కూడ ప్రేమించుబడువాడు అగు నందీశ్వరుడు వారిద్దరి ఆజ్ఞను సత్కరించి,నాకు అభీష్టమునిచ్చుగాక! (57-60) మహాకాలో మహాబాహుర్మహాదేవ ఇవాపరః | మహాదేవాశ్రితానాం తు నిత్యమేవాభిరక్షతు || 61 శివప్రియశ్శివాసక్తశ్శివయోరర్చకస్సదా | సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు కాంక్షితమ్ || 62 సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞశ్శాస్తా విష్ణోః పరా తనుః | మహామోహాత్మతనయో మధుమాంసాసవప్రియః | తయోరాజ్ఞాం పురస్కృత్య స మే కామం ప్రయచ్ఛతు || 63 బ్రహ్మాణీ చైవ మాహేశీ కౌమారీ వైష్ణవీ తథా | వారాహీచైవ మాహేంద్రీ చాముండా చండవిక్రమా || 64 ఏతా వై మాతరస్సప్త సర్వలోకస్య మాతరః | ప్రార్థితం మే ప్రయచ్ఛంతు పరమేశ్వరశాసనాత్ || 65 మత్తమాతంగవదనో గంగోమాశంకరాత్మజః | ఆకాశ##దేహో దిగ్బాహుస్సోమసూర్యాగ్నిలోచనః || 66 ఐరావతాదిభిర్ది వ్యైర్దిగ్గజైర్నిత్యమర్చితః | శివజ్ఞానమదోద్భిన్నస్త్రి దశానామవిఘ్న కృత్ || 67 విఘ్నకృచ్చాసురాదీనాం విఘ్నేశశ్శివభావితః | సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు కాంక్షితమ్ || 68 షణ్ముఖశ్శివసంభూతశ్శక్తివజ్రధరః ప్రభుః | ఆగ్నేశ్చ తనయో దేవో హ్యపర్ణాతనయః పునః || 69 గంగాయాశ్చ గణాంబాయాః కృత్తికానాం తథైవ చ | విశాఖేన చ శాఖేన నైగమేయేన చావృతః || 70 ఇంద్రజిచ్చేంద్రసేనానీస్తారకాసురజిత్తథా | శైలానాం మేరుముఖ్యానాం వేధకశ్చ స్వతేజసా || 71 తప్తచామీకరప్రఖ్యశ్శతపత్రదలేక్షణః | కుమారస్సుకుమారాణాం రూపోదాహరణం మహత్ || 72 శివప్రియశ్శివాసక్తశ్శివపాదార్చకస్సదా | సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు కాంక్షితమ్ || 73 గొప్ప బాహువులు గలవాడు, రెండవ మహాదేవుని వలె నుండువాడు అగు మహాకాలుడు మహాదేవుని ఆశ్రయించుకొని యున్న భక్తులను సర్వదా సర్వత్ర రక్షించుగాక ! (61) శివునకు ప్రియుడు, పార్వతియందు భక్తి గలవాడు, నిత్యము పార్వతీపరమేశ్వరులను పూజించువాడు అగు ఆ మహాకాలుడు వారిద్దరి ఆదేశమును సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక ! (62) సకలశాస్త్రముల సారభూతమగు అర్థమునెరింగినవాడు, సర్వులను శాసించువాడు, విష్ణువుయొక్క రెండవ స్వరూపము, మహామోహస్వరూపిణియగు కద్రువయొక్క పుత్రుడు, మద్యము మాంసము మరియు ఆసవములను ఇష్టపడువాడు అగు శేషుడు వారిద్దరి ఆజ్ఞను పురస్కరించుకొని, నా మనోరథమునీడేర్చు గాక ! (63) బ్రహ్మాణి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, భయంకరమగు పరాక్రమముగల చాముండ (64) అనే ఈ ఏడ్గురు సర్వలోకములకు తల్లులు. వీరు పరమేశ్వరుని ఆదేశముచే నా మనోరథమునీడేర్చదరు గాక ! (65) మదించిన ఏనుగుయొక్క ముఖము గలవాడు, గంగ పార్వతి మరియు శివుల పుత్రుడు, ఆకాశ##మే దేహముగా గలవాడు, దిక్కులే భుజములుగా గలవాడు, చంద్రుడు సూర్యుడు మరియు అగ్ని కన్నులుగా గలవాడు (66), ఐరావతము మొదలగు దేవలోకమునకు సంబంధించిన దిగ్గజములచే నిత్యము పూజించబడువాడు, శివజ్ఞానమనే మదము స్రవించే కపోలము గలవాడు, దేవతలకు విఘ్నములను కలిగించనివాడు (67), రాక్షసులు మొదలగు వారికి విఘ్నములను కలిగించువాడు, శివభక్తి పూరితుడు అగు విఘ్నేశ్వరుడు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక ! (68) ఆరు మోములవాడు, శివుని పుత్రుడు, శక్తిని వజ్రమును ధరించువాడు, సర్వసమర్థుడు, అగ్నికి కూడ పుత్రుడు, ప్రకాశస్వరూపుడు, మరల పార్వతికి పుత్రుడు (69), గంగకు గణాంబకు మరియు కృత్తికలకు కూడ పుత్రుడు, విశాఖుడు శాఖుడు మరియు నైగమేయుడు అను వారిచే చుట్టువారబడి యుండువాడు (70), ఇంద్రుని జయించినవాడు, ఇంద్రుని సేనలను నడిపినవాడు, తారకాసురుని జయించినవాడు, తన బలముచే మేరువు మొదలగు పర్వతములను పగులగొట్టినవాడు (71), పుటము పెట్టిన బంగారమువలె ప్రకాశించువాడు, కలువ రేకులవంటి కన్నులవాడు, సుకుమారుల రూపమునకు గొప్ప దృష్టాంతము అయినవాడు, శివునకు ప్రియమైనవాడు, పార్వతియందు ప్రీతి గలవాడు, సర్వదా శివుని పాదములను పూజించువాడు అగు కుమారస్వామి పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక ! (72, 73) జ్యేష్ఠా వరిష్ఠా వరదా శివయోర్యజనే రతా | తయోరాజ్ఞాం పురస్కృత్య సా మే దిశతు కాంక్షితమ్ || 74 త్రైలోక్యవందితా సాక్షాదుల్కాకారా గణాంబికా | జగత్సృష్టివివృద్ధ్యర్థం బ్రహ్మణా%భ్యర్థితా శివాత్ || 75 శివాయాః ప్రవిభక్తాయా భ్రువోరంతరనిస్సృతా | దాక్షాయణీ సతీ మేనా తథా హైమవతీ హ్యుమా || 76 కౌశిక్యాశ్చైవ జననీ భద్రకాల్యాస్తథైవ చ | అపర్ణాయాశ్చ జననీ పాటలాయాస్తథైవ చ || 77 శివార్చనరతా నిత్యం రుద్రాణీ రుద్రవల్లభా | సత్కృత్య శివయోరాజ్ఞాం సా మే దిశతు కాంక్షితమ్ || 78 చండస్సర్వగణశానశ్శంభోర్వదనసంభవః | సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు కాంక్షితమ్ || 79 పింగలో గణపః శ్రీమాన్ శివాసక్తశ్శివప్రియః | ఆజ్ఞయా శివయోరేవ స మే కామం ప్రయచ్ఛతు || 80 భృంగీశో నామ గణపశ్శివారాధనతత్పరః | ప్రయచ్ఛతు స మే కామం పత్యురాజ్ఞాపురస్సరమ్ || 81 వీరభద్రో మహాతేజా హిమకుండేందుసన్నిభః | భద్రకాలీప్రియో నిత్యం మాతౄణాం చాభిరక్షితా || 82 యజ్ఞస్య చ శిరోహర్తా దక్షస్య చ దురాత్మనః | ఉపేంద్రేంద్రయమాదీనాం దేవానామంగలతక్షకః || 83 శివస్యానుచరః శ్రీమాన్ శివశాసన పాలకః | శివయోశ్శాసనాదేవ స మే దిశతు కాక్షితమ్ || 84 సర్వశ్రేష్ఠురాలు, వరములనిచ్చునది, పార్వతీపరమేశ్వరుల ఆరాధనయందు ప్రీతి గలది అగు జ్యేష్ఠాదేవి వారిద్దరి ఆజ్ఞను పురస్కరించుకొని నా మనోరథమునీడేర్చు గాక ! (74) ముల్లోకములలో నమస్కరించ బడునది, సాక్షాత్తుగా తోకచుక్కను పోలియుండునది, జగత్తులో ప్రజాసృష్టి వర్థిల్లుట కొరకై శివుని సకాశమునుండి బ్రహ్మచే అభ్యర్థించబడినది, శివుని నుండి వేరుపడిన పార్వతియొక్క కనుబొమల మధ్యనుండి బయటకు వచ్చినది, దాక్షాయణి సతీదేవి మేనాదేవి హైమవతి ఉమ అను రూపములలో ప్రసిద్ధిని గాంచినది, కౌశికి భద్రకాళి అపర్ణ మరియు పాటల అను దేవీమూర్తులకు తల్లి, నిత్యము శివుని పూజించుటయందు ప్రీతి గలది, రుద్రుని భార్య, రుద్రునకు ప్రియురాలు అగు ఆ గణాంబిక పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక ! (75-78) సకలగణములకు ప్రభువు, శంభుని ముఖమునుండి పుట్టినవాడు అగు చండుడు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చుగాక! (79) గణాధ్యక్షుడు, పార్వతియందు భక్తి గలవాడు, శివునకు ప్రియమైనవాడు అగు శ్రీమాన్ పింగళుడు వారిద్దరి ఆజ్ఞ చేతనే నా మనోరథమునీడేర్చు గాక ! (80) శివుని ఆరాధించుటయందు తత్పరత గల భృంగీశ్వరుడనే గణాధ్యక్షుడు తన ప్రభువగు శివుని ఆజ్ఞను పురస్కరించుకొని, నా మనోరథము నీడేర్చు గాక ! (81) గొప్ప తేజశ్శాలి, మంచును మల్లెలను చంద్రుని పోలి యుండువాడు, భద్రకాళికి ప్రియమైనవాడు, సర్వదా మాతృమూర్తులను అన్ని విధములుగా రక్షించువాడు, యజ్ఞపురుషునియొక్క మరియు దుర్బుద్ధియగు దక్షుని యొక్క తలలను దునిమినవాడు, విష్ణువు ఇంద్రుడు యముడు మొదలగు దేవతలకు దేహశుధ్ధిని చేసినవాడు, శివుని అనుచరుడు, శివుని ఆజ్ఞను పాలించువాడు అగు శ్రీమాన్ వీరభద్రుడు పార్వతీపరమేశ్వరుల శాసనముచే మాత్రమే నా మనోరథమునీడేర్చు గాక ! (82 -84) సరస్వతీ మహేశస్య వాక్సరోజసముద్భవా | శివయోః పూజనే సక్తా సా మే దిశతు కాంక్షితమ్ || 85 విష్ణోర్వక్షః స్థితా లక్ష్మీ శ్శివయోః పూజనే రతా | శివయోశ్శాసనాదేవ సా మే దిశతు కాంక్షితమ్ || 86 మహామోటీ మహాదేవ్యాః పాదపూజాపరాయణా | తస్యా ఏవ నియోగేన సా మే దిశతు కాంక్షితమ్ || 87 కౌశికీ సింహమారూఢా పార్వత్యాః పరమా సుతా | విష్ణోర్నిద్రా మహామాయా మహామహిషమర్దినీ || 88 నిశుంభశుంభసంహర్త్రీ మధుమాంసాసవప్రియా | సత్కృత్య శాసనం మాతుస్సా మే దిశతు కాంక్షితమ్ || 89 మహేశ్వరుని పద్మమువంటి ముఖమునుండి ఉద్భవించి, పార్వతీపరమేశ్వరుల ఆరాధనయందు ప్రీతిగల ఆ సరస్వతి నా మనోరథము నీడేర్చు గాక ! (85) విష్ణువు యొక్క వక్షః స్థలమునందు నివసిస్తూ పార్వతీపరమేశ్వరుల పూజయందు ప్రీతిగల లక్ష్మి వారిద్దరి ఆదేశముచే మాత్రమే నా మనోరథమునీడేర్చు గాక ! (86) మహాదేవియగు పార్వతి యొక్క పాదములను పూజించుటయే ఏకైకకర్తవ్యముగా గల ఆ మహామోటీదేవి, పార్వతీదేవి యొక్క ఆదేశము వలన మాత్రమే నా మనోరథమునీడేర్చు గాక ! (87) పార్వతీదేవియొక్క కుమార్తెలలో శ్రేష్ఠురాలు, సింహమునధిష్ఠించి యుండునది, విష్ణువును నిద్రారూపములో ఆవేశించి యున్నది, మహామాయ, మహిషుడనే మహారాక్షసుని సంహరించినది, శుంభనిశుంభులను సంహరించినది, మద్యము మాంసము మరియు ఆసవము అనువాటియందు ప్రీతిగలది అగు ఆ కౌశికీదేవి పార్వతీమాతయొక్క ఆదేశమును సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక! (88, 89) రుద్రా రుద్రసమప్రఖ్యాః ప్రమథాః ప్రథితౌజసః | భూతాఖ్యాశ్చ మహావీర్యా మహాదేవసమప్రభాః || 90 నిత్యమూక్తా నిరుపమా నిర్ద్వంద్వా నిరుపప్లవాః | సశక్తయస్సానుచరాస్సర్వలోకనమస్కృతాః || 91 సర్వేషామేవ లోకానాం సృష్టిసంహరణక్షమాః | పరస్పరానురక్తాశ్చ పరస్పరమనువ్రతాః || 92 పరస్పరమతిస్నిగ్ధాః పరస్పరనమస్కృతాః | శివప్రియతమా నిత్యం శివలక్షణలక్షితాః || 93 సౌమ్యా ఘోరాస్తథా మిశ్రాశ్చాంతరాలద్వయాత్మికాః | విరూపాశ్చ సురూపాశ్చ నానారూపధరాస్తథా || 94 సత్కృత్య శివయోరాజ్ఞాం తే మే కామం దిశంతు వై | దేవ్యాః ప్రియసఖీవర్గో దేవీలక్షణలక్షితః || 95 సహితో రుద్రకన్యాభిశ్శక్తిభిశ్చాప్యనేకశః | తృతీయావరణ శంభోర్భక్త్యా నిత్యం సమర్చితః || 96 సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు మంగలమ్ | దివాకరో మహేశస్య మూర్తిర్దీప్తసుమండలః || 97 నిర్గుణో గుణసంకీర్ణస్తథైవ గుణకేవలః | అవికారాత్మకశ్చాద్య ఏకస్సామాన్య విక్రియః || 98 అసాధారణకర్మాచ సృష్టిస్థితిలయక్రమాత్ | ఏవం త్రిధా చతుర్ధా చ విభక్తాః పంచధా పునః || 99 చతుర్థావరణ శంభోః పూజితస్సానుగైస్సహ | శివప్రియశ్శివాసక్తశ్శివపాదార్చనే రతః || 100 సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు మంగలమ్ | రుద్రదేవునితో సమానమగు కాంతి గల రుద్రగణములు, ప్రసిద్ధిని గాంచిన బలము గల ప్రమథగణములు మరియు మహాదేవునితో సమానమగు కాంతిగల భూతగణములు అను ఈ గణములు గొప్ప పరాక్రమము గలవి (90). సర్వకాలములలో ముక్తిని పొంది యుండువారు, సాటిలేని వారు, తమతో సమ ఉజ్జీ లేనివారు, ఆపదలనెరుంగని వారు, శక్తులతో మరియు అనుచరులతో కూడియున్నవారు, సర్వలోకములచే నమస్కరించ బడువారు (91), సకలలోకములను నిశ్చయముగా సృష్టించి సంహరించే సామర్థ్యము గలవారు అగు ఈ గణములలో ఒకరిపై నొకరికి ప్రేమ, స్నేహము మరియు భక్తి గలవు. కావుననే, వారు ఒకరినొకరు నమస్కరించెదరు. శివునకు అత్యంతప్రీతిపాత్రులగు వీరు నిత్యము శివుని లక్షణములచే చిహ్నించబడి యుందురు (92, 93). వీరిలో కొందరు ప్రసన్నమగు రూపమును కలిగియుండగా, మరికొందరు భయంకరమగు రూపమును కలిగియుందురు. మరికొందరు ఈ రెండింటి మిశ్రమరూపమును కలిగియుందురు. మరికొందరి రూపము ఈ రెండింటి మధ్యలో నుండును. కొందరు వికృతమగు రూపమును కలిగియుండగా, మరికొందరు చక్కని రూపమును కలిగియుందురు. ఇంతేగాక, వారు అనేక రూపములను దాల్చుచుందురు (94). వారు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చెదరు గాక ! పార్వతీదేవి యొక్క ప్రియసఖురాండ్ర వర్గము దేవీచిహ్నములతో కూడియుండును (95). వారికి రుద్రకన్యలు, అనేకశక్తులు తోడుగా నుందురు. వారు శంభుని మూడవ ఆవరణములో నిత్యము భక్తితో చక్కగా ఆరాధించ బడుదురు (96). ఈ వర్గము పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నా మనోరథమునీడేర్చు గాక ! మహేశ్వరుని మూర్తి, ప్రకాశించే చక్కని మండలము గలవాడు, నిర్గుణుడైననూ సకలగుణములతో నిండియుండువాడు, కేవలము సద్గుణస్వరూపుడు, వికారములు లేని స్వరూపము గలవాడు, ఆదిపురుషుడు, అద్వితీయుడు అగు సూర్యభగవానుని ప్రకటరూపమే ఈ సర్వప్రాణిసాధారణమగు జగత్తు (97, 98). ఆయన వరుసగా సృష్టి, స్థితి, మరియు లయము అనే అసాధారణమగు కర్మలను చేయుచుండును. ఈ విధముగా ఆయన మూడుగా, నాలుగు రూపములుగా, అయిదు రూపములుగా, మరల అసంఖ్యాకములగు రూపములలో తనను తాను విభజించుకొను చున్నాడు (99). ఆయన శంభుని నాల్గవ ఆవరణములో అనుచరులతో సహా పూజించ బడినాడు. శివునకు ప్రియుడు, పార్వతియందు భక్తి గలవాడు, శివుని పాదములను పూజించుటయందు ప్రీతి గలవాడు అగు ఆ సూర్యుడు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను శిరసా వహించి, నాకు కల్యాణకరమగు మార్గమును చూపుగాక ! (100) దివాకరషడం గాని దీప్తాద్యాశ్చాష్టశక్తయః || 101 ఆదిత్యో భాస్కరో భానూ రవిశ్చేత్యనుపూర్వశః | అర్కో బ్రహ్మా తథా రుద్రో విష్ణుశ్చాదిత్యమూర్తయః || 102 విస్తరా సుతరా బోధిన్యాప్యాయిన్యపరాః పునః | ఉషా ప్రభా తథా ప్రాజ్ఞా సంధ్యా చేత్యపి శక్తయః || 103 సోమాదికేతుపర్యంతా గ్రహాశ్చ శివభావితాః | శివయోరాజ్ఞయా నున్నా మంగలం ప్రదిశంతు మే || 104 అథవా ద్వాదశాదిత్యాస్తథా ద్వాదశ శక్తయః | ఋషయో దేవగంధర్వాః పన్నగాప్సరసాం గణాః || 105 గ్రామణ్యశ్చ తథా యక్షా రాక్షసాశ్చాసురాస్తథా | సప్తసప్తగణాశ్చైతే సప్తచ్ఛందోమయా హయాః || 106 వాలఖిల్యాదయశ్చైవ సర్వే శివపదార్చకాః | సత్కృత్య శివయోరాజ్ఞాం మంగలం ప్రదిశంతు మే || 107 బ్రహ్మాథ దేవదేవస్య మూర్తిర్భూమండలాధిపః | చతుష్షష్టిగుణౖశ్వర్యో బుద్ధితత్త్వే ప్రతిష్ఠితః || 108 నిర్గుణో గుణసంకీర్ణస్తథైవ గుణకేవలః | అవికారాత్మకో దేవస్తతస్సాధారణః పురః|| 109 అసాధారణకర్మాచ సృష్టిస్థితిలయక్రమాత్ | భువం త్రిధా చతుర్ధా చ విభక్తః పంచధా పునః || 110 చతుర్థావరణ శంభోః పూజితశ్చ సహానుగైః | శివప్రియశ్శివాసక్తశ్శివపాదార్చనే రతః || 111 సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు మంగలమ్ | సూర్యభగవానుని ఆరు అంగములు (ఋతువులు), దీప్త మొదలగు ఎనిమిది శక్తులు (101), క్రమముగా ఆదిత్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, అర్కుడు, బ్రహ్మ, రుద్రుడు మరియు విష్ణువు అనే ఈ ఆదిత్యమూర్తులు (102), విస్తర, సుతర, బోధిని, అప్యాయిని మరియు ఉష, ప్రభ, ప్రాజ్ఞ మరియు సంధ్య అనే శక్తులు (103), చంద్రునితో మొదలిడి కేతువు వరకు గల శివభక్తిపూర్ణులగు గ్రహములు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞచే ప్రేరితులై నాకు మంగళములనిచ్చెదరు గాక ! (104) ఈ వరుసను ఇంకో విధముగా పన్నెండుగురు ఆదిత్యులు, వారి పన్నెండుశక్తులు అనికూడా చెప్పవచ్చును. ఋషులు, దేవతలు, గంధర్వులు, నాగులు, అప్సరసల గణములు (105) , గ్రామదేవతలు, యక్షులు, రాక్షసులు, అసురులు, నలభై తొమ్మిది మరుత్తుల గణము, వేదరూపములగు ఏడు గుర్రములు (106), వాలఖిల్య మొదలగు ఋషిగణములు అందరు శివుని పాదములను పూజించువారే. వీరు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను సత్కరించి, నాకు మంగళమునిచ్చెదరు గాక! (107) భూమండలమునకు అధిపతియగు బ్రహ్మగారు ఆ దేవదేవుని మూర్తియే. అరువది నాలుగు గుణముల ఐశ్వర్యము గల ఆయన బుద్ధితత్త్వమునధిష్ఠించి యుండును (108). నిర్గుణడైననూ సకలగుణములతో నిండియుండువాడు, కేవలము సద్గుణ స్వరూపుడు, వికారములు లేని స్వరూపము గలవాడు అగు బ్రహ్మగారి యెదుట ఇతరులు సర్వులు సామాన్యులు మాత్రమే (109). ఆయన వరుసగా భూమియొక్క సృష్టి, స్థితి మరియు లయము అనే అసాధారణమగు కర్మలను చేయుచుండును. ఈ విధముగా ఆయన మూడుగా, నాలుగు రూపములుగా, అయిదు రూపములుగా, మరల అసంఖ్యాకములగు రూపములలో తనను తాను విభజించుకొను చున్నాడు (110). ఆయన శుంభని నాల్గవ ఆవరణములో తన అనుచరులతో కూడి పూజించబడినాడు. శివునకు ప్రియుడు, పార్వతియందు భక్తి గలవాడు, శివుని పాదములను పూజించుటయందు శ్రద్ధ గలవాడు అగు (111) ఆ బ్రహ్మ గారు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను శిరసావహించి, నాకు మంగళమునిచ్చును గాక! హిరణ్యగర్భో లోకేశో విరాట్ కాలశ్చ పూరుషః || 112 సనత్కుమారస్సనకస్సనందశ్చ సనాతనః | ప్రజానాం పతయశ్చైవ దక్షాద్యా బ్రహ్మసూనవః || 113 ఏకాదశ సపత్నీకా ధర్మస్సంకల్ప ఏవ చ | శివార్చనరతాశ్చైతే శివభక్తిపరాయణాః || 114 శివాజ్ఞావశగాస్సర్వే దిశంతు మమ మంగలమ్ | చత్వారశ్చ తథా వేదాస్సేతిహాసపురాణకాః || 115 ధర్మశాస్త్రాణి విద్యాభిర్వైదికీభిస్సమన్వితాః | పరస్పరావిరుద్ధార్థాశ్శివప్రకృతిపాదకాః || 116 సత్కృత్య శివయోరాజ్ఞాం మంగలం ప్రదిశంతు మే | అథ రుద్రో మహాదేవశ్శంభోర్మూర్తిర్గరీయసీ || 117 వాహ్నేయమండలాధీశః పౌరుషైశ్వర్యవాన్ ప్రభుః | శివాభిమానసంపన్నో నిర్గుణస్త్రి గుణాత్మకః || 118 కేవలం సాత్త్వికశ్చాపి రాజసశ్చైవ తామసః | అవికారరతః పూర్వం తతస్తు సమవిక్రియః || 119 అసాధారణకర్మాచ సృష్ట్యాదికరణాత్పృథక్ | బ్రహ్మణోపి శిరశ్ఛేత్తా జనకస్తస్య తత్సుతః || 120 జనకస్తనయశ్చాపి విష్ణోరపి నియామకః | బోధకశ్చ తయోర్నిత్యమనుగ్రహకరః ప్రభుః || 121 అండస్యాంతర్బిహిర్వర్తీ రుద్రో లోకద్వయాధిపః | శివప్రియశ్శివాసక్తశ్శివపాదార్చనే రతః || 122 శివస్యాజ్ఞాం పురస్కృత్య స మే దిశతు మంగలమ్ | లోకములకు ప్రభువగు హిరణ్యగర్భుడు, విరాట్ పురుషుడు, కాలపురుషుడు (112), సనత్కుమారుడు, సనకుడు, సనందుడు, సనాతనుడు, బ్రహ్మపుత్రులగు దక్షుడు మొదలగు పదకొండుగురు ప్రజాపతులు, వారి భార్యలు, ధర్ముడు, సంకల్పుడు అనే వీరందరు శివుని యందు ఏకాంతభక్తి గలవారై శివుని పూజించుటయందు ప్రీతి గలవారు (113, 114). శివుని ఆజ్ఞకు వశవర్తులై ఉండే వీరందరు నాకు మంగళమును కలిగించు గాక ! నాలుగు వేదములు, ఇతిహాసములు, పురాణములు (115), వైదికవిద్యలతో కూడిన ధర్మశాస్త్రములు అనునవి శివతత్త్వమును ప్రతిపాదించునవి అగుటచే వాటియందు ఒకదానితో మరియొక దానికి విరోధము లేదు (116). ఇవి శివుని ఆజ్ఞను మన్నించి నాకు మంగళమునిచ్చు గాక! మరియు మహాదేవుడగు రుద్రుడు శంభుని సర్వోత్తమమగు మూర్తి (117). సర్వసమర్థుడు, పౌరుషము మరియు ఐశ్వర్యము గలవాడు అగు ఆయన అగ్నిమండలమునకు అధ్యక్షుడు. ఆయనకు శివునియందు ఏకాంతమగు భక్తి గలదు. ఆయన నిర్గుణుడే అయిననూ సత్త్వరజస్తమో గుణముల ఉపాధులను స్వీకరించును (118). ఆయన కేవలసాత్త్వికోపాధిని మాత్రమే గాక, రాజసతామస ప్రధానములగు ఉపాధులను కూడ స్వీకరించును. ఆయన స్వరూపముచే వికారములు లేనివాడే అయిననూ, సృష్టికార్యమును బట్టి వికారమును పొందుచుండును. ఈ విధముగా పరమేశ్వరుడు సృష్టికి పూర్వము నందు ప్రకృతియొక్క సామ్యస్థితికి అధిష్టానము కాగా, సృష్టియందు ప్రకృతిలోని వికారమునకు అధిష్ఠానమగుచున్నాడు (119). సృష్టి మొదలగు జగత్కార్యములను చేయుట మాత్రమే గాక, ఆయన అసామాన్యమగు కర్మలను చేసినాడు. ఆయన బ్రహ్మకు తండ్రి అయిననూ, ఆయనకు పుత్రుడైనాడు(120). ఆయన విష్ణువునకు కూడ తండ్రి మరియు పుత్రుడు అయి ఆయనను శాసించుచున్నాడు. నిత్యము అనుగ్రహమును చేయువాడు, సర్వసమర్థుడు అగు ఆ రుద్రుడు వారిద్దరికి జ్ఞానమును కూడా బోధించినాడు (121). బ్రహ్మాండమునకు లోపల మరియు బయట కూడ ఉండే రుద్రుడు ఇహలోక పరలోకములకు రెండింటికి ప్రభువు. శివునకు ప్రియుడు, పార్వతి యందు భక్తి గలవాడు, శివుని పాదములను పూజించుటయందు శ్రద్ధ గలవాడు అగు ఆ రుద్రుడు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను పురస్కరించుకొని, నాకు మంగళమునిచ్చును గాక ! (122) తస్య బ్రహ్మ షడంగాని విద్యేశానాం తథాష్టకమ్ || 123 చత్వారో మూర్తిభేదాశ్చ శివపూర్వాశ్శివార్భకాః | శివో భవో హరశ్చైవ మృడశ్చైవ తథాపరః | శివస్యాజ్ఞాం పురస్కృత్య మంగలం ప్రదిశంతు మే || 124 అథ విష్ణుర్మ హేశస్య శివసై#్యవ పరా తనుః | వారితత్త్వాధిపస్సాక్షాదవ్యక్తపదసంస్థితః || 125 నిర్గుణస్సత్త్వ బహులస్తథైవ గుణకేవలః | ఆవికారాభిమానీ చ త్రిసాధారణ విక్రయః || 126 అసాధారణకర్మా చ సృష్ట్యాదికరణాత్పృథక్ | దక్షిణాంగభ##వేనాపి స్పర్ధమానస్స్వయంభువా || 127 ఆద్యేన బ్రహ్మణా సాక్షాత్సృష్టస్స్రష్టా చ తస్య తు | అండస్యాంతర్బహిర్వర్తీ విష్ణుర్లోకద్వయాధిపః || 128 అసురాంతకరశ్చ క్రీ శక్రస్యాపి తథానుజః | ప్రాదుర్భూతశ్చ దశధా భృగుశాపచ్ఛలాదిహ || 129 భూభారనిగ్రహార్థాయ స్వేచ్ఛయావాతరత్ క్షితౌ | అప్రమేయబలో మాయీ మాయయా మోహయన్ జగత్ || 130 మూర్తిం కృత్వా మహావిష్ణుం సదావిష్ణుమథాపి వా | వైష్ణవైః పూజితో నిత్యం మూర్తిత్రయమయాసనే || 131 శివప్రియశ్శివాసక్తశ్శివపాదార్చనే రతః | శివస్యాజ్ఞాం పురస్కృత్య స మే దిశతు మంగలమ్ || 132 ఆ శివుని యొక్క స్వరూపమే అయిన పంచబ్రహ్మలు, హృదయము మొదలగు ఆరు అంగములు, ఎనమండుగురు విద్యేశ్వరులు (123), శివుడు భవుడు హరుడు మరియు మృడుడు అనే నాలుగు రకముల మూర్తులు అనే వీరందరు శివుని నుండి ఉద్భవించి, శివుని పూజించెదరు. వీరు శివుని ఆజ్ఞను పురస్కరించుకొని, నాకు మంగళమునిచ్చెదరు గాక ! (124) తరువాత విష్ణువు సర్వేశ్వరుడగు శివుని ఉత్కృష్టమగు స్వరూపము. జలతత్త్వమునకు అధిపతియగు విష్ణువు సాక్షాత్తుగా అవ్యక్తపదమును అధిష్ఠించి యున్నాడు (125). ఆయన నిర్గుణుడే అయిననూ, సత్త్వగుణప్రధానమగు ఉపాధి గలవాడై కేవలము సద్గుణస్వరూపుడై ఉన్నాడు. ఆయనకు తాను వికారములు లేనివాడననే అభిమానము ఉన్ననూ, త్రిగుణాత్మకమగు అవ్యక్తములోని వికారములు ఆయనకు కూడ వర్తించును (126). సృష్టి మొదలగు జగత్కార్యములు మాత్రమే గాక, ఆయన అసామాన్యమగు కర్మలనాచరించినాడు. శివుని కుడి భాగమునుండి ఉదయించిన బ్రహ్మతో ఆయన పోటీ పడుచుండును (127). ప్రథమజీవుడగు బ్రహ్మ చే సృష్టించబడిన ఆయన బ్రహ్మకు తండ్రి కూడ అయినాడు. బ్రహ్మాండమునకు లోపల మరియు బయట కూడ ఉండే విష్ణువు ఇహలోక పరలోకములకు రెండింటికీ ప్రభువు (128). చక్రధారియగు విష్ణువు రాక్షసులను సంహరించును. ఆయన ఇంద్రునకు తమ్ముడు కూడా అయినాడు. భృగుమహర్షియొక్క శాపము అనే మిషతో ఆయన ఈ లోకములో పది రకములుగా అవతరించినాడు (129). ఆయన భూమియొక్క భారమును తొలగించుట కొరకై స్వీయసంకల్పముచే భూమియందు అవతరించినాడు. ఊహకు అందని బలము గల మాయావి యగు విష్ణువు తన మాయచే జగత్తును మోహింప జేయుచున్నాడు (130). వైష్ణవులు త్రిమూర్తుల స్వరూపమగు ఆసనమునందు మహావిష్ణువుయొక్క, లేదా సదావిష్ణువుయొక్క మూర్తిని ప్రతిష్ఠించి నిత్యము పూజించెదరు (131). శివున కు ప్రియుడు, పార్వతియందు భక్తి గలవాడు, శివుని పాదములను పూజించుటయందు శ్రద్ధ గలవాడు అగు ఆ విష్ణువు శివుని ఆజ్ఞను పురస్కరించుకొని, నాకు మంగళమునిచ్చును గాక ! (132). వాసుదోవో % నిరుద్ధశ్చ ప్రద్యుమ్నశ్చ తతః పరః | సంకర్షణస్సమాఖ్యాతాశ్చతస్రో మూర్తయో హరేః || 133 మత్య్సః కూర్మో వరాహశ్చ నారసింహో%థ వామనః | రామత్రయం తథా కృష్ణో విష్ణుస్తురగవక్త్రకః || 134 చక్రం నారాయణస్యాస్త్రం పాంచజన్యం చ శార్ ఙ్గకమ్ | సత్కృత్య శివయోరాజ్ఞాం మంగలం ప్రదిశంతు మే || 135 ప్రభా సరస్వతీ గౌరీ లక్ష్మీశ్చ శివభావితా | శివయోశ్శాసనాదేతా మంగలం ప్రదిశంతు మే || 136 ఇంద్రో%గ్నిశ్చ యమశ్చైవ నిరృతిర్వరుణస్తథా | వాయుస్సోమః కుబేరశ్చ తథేశానస్త్రిశూలధృక్ || 137 సర్వే శివార్చనరతాశ్శివసద్భావభావితాః | సత్కృత్య శివయోరాజ్ఞాం మంగలం ప్రదిశంతు మే || 138 త్రిశూలమథ వజ్రం చ తథా పరశుసాయకౌ | ఖడ్గపాశాంకుశాశ్చైవ పినాకశ్చాయుధోత్తమః || 139 దివ్యాయుధాని దేవస్య దేవ్యాశ్చైతాని నిత్యశః | సత్కృత్య శివయోరాజ్ఞాం రక్షాం కుర్వంతు మే సదా || 140 వృషరూపధరో దేవస్సౌరభేయో మహాబలః | వడవాఖ్యానలస్పర్ధీ పంచగోమాతృభిర్వృతః || 141 వాహనత్వమనుప్రాప్తస్తపసా పరమేశయోః | తయోరాజ్ఞాం పురస్కృత్య స మే కామం ప్రయచ్ఛతు || 142 వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు మరియు సంకర్షణుడు అను వారలు శ్రీహరి యొక్క నాలుగు మూర్తులు (వ్యూహములు) అని చెప్పబడుచున్నారు (133). మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, బలరామ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, హయగ్రీవ అనునవి విష్ణుని అవతారములు (134). వీరు మాత్రమే గాక, చక్రము, నారాయణాస్త్రము, పాంచజన్యము, శార్ ఙ్గము అనే ధనస్సు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను శిరసా వహించి, నాకు మంగళము నిచ్చు గాక! (135) ప్రభాదేవి, సరస్వతి, గౌరి మరియు శివభక్తురాలగు లక్ష్మి అనే ఈ తల్లులు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞచే నాకు శుభమునిచ్చెదరు గాక ! (136) ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, చంద్రుడు, కుబేరుడు మరియు త్రిశూలమును ధరించే ఈశానుడు (137) అనే వీరందరు శివుని పూజించుటయందు ప్రీతి గలవారే. శివునియందు సద్భక్తితో నిండిన హృదయములు గల వీరు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను శిరసా వహించి , నాకు మంగళమునిచ్చు గాక ! (138) త్రిశూలము, వజ్రము, పరశువు, బాణము, ఖడ్గము, పాశము, అంకుశము మరియు ఆయుధములలో శ్రేష్ఠమగు పినాకమనే ధనుస్సు (139) అనునవి ఆ శివుని దివ్యములగు ఆయుధములు. ఇవి నిత్యము ఆయనతో ఉండును. ఇవి మాత్రమే గాక, దేవి యొక్క ఆయుధములు కూడ పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞను శిరసా వహించి, సర్వకాలములలో నన్ను రక్షించు గాక ! (140) సురభి (కామధేనువు) యొక్క మహాబలిశాలియగు పుత్రుడు వృషభరూపములోనున్న దేవుడు. ఆయన బడబాగ్నితో కూడ పోటీ పడుచుండును. ఆయన చుట్టూ అయిదు గోమాతలు ఉండును (141). ఆయన తపస్సు చేసి పార్వతీపరమేశ్వరుల వాహనము అనే పదవిని పొందినాడు. ఆయన వారిద్దరి ఆజ్ఞను పురస్కరించుకొని నా మనోరథమునీడేర్చు గాక! (142) నందా సునందా సురభిస్సుశీలా సుమనాస్తథా | పంచ గోమాతరస్త్వేతాశ్శివలోకే వ్యవస్థితాః || 143 శివభక్తిపరా నిత్యం శివార్చనపరాయణాః | శివయోశ్శాసనాదేవ దిశంతు మమ వాంఛితమ్ || 144 క్షేత్రపాలో మహాతేజా నీలజీమూతసన్నిభః | దంష్ట్రాకరాలవదనస్స్పురద్రక్తాధరోజ్జ్వలః || 145 రక్తోర్ధ్వమూర్ధజః శ్రీమాన్ భ్రుకుటీకుటిలేక్షణః | రక్తవృత్తత్రినయనశ్శశిపన్నగభూషణః || 146 నగ్నస్త్రిశూలపాశాసికపాలోద్యతపాణికః | భైరవో భైరవైస్సిద్ధైర్యోగినీభిశ్చ సంవృతః || 147 క్షేత్రే క్షేత్రే సమాసీనః స్థితో యో రక్షకస్సతామ్ | శివప్రణామపరమశ్శివసద్భావభావితః || 148 శివాశ్రితాన్ విశేషేణ రక్షన్ పుత్రానివౌరసాన్ | సత్కృత్య శివయోరాజ్ఞాం స మే దిశతు మంగలమ్ || 149 తాలజంఘాదయస్తస్య ప్రథమావరణర్చితాః | సత్కృత్య శివయోరాజ్ఞాం చత్వారస్సమవంతు మామ్ || 150 భైరవాద్యాశ్చ యే చాన్యే సమంతాత్తస్య వేష్టితాః | తే%పి మామనుగృహ్ణంతు శివశాసనగౌరవాత్ || 151 నంద, సునంద, సురభి, సుశీల మరియు సుమనస్సు అనే ఈ అయిదుగురు గోమాతలు శివలోకములో స్థిరముగా నుండెదరు (143). శివభక్తిపరాయణులగు వీరు నిత్యము శివుని పూజించుటయందు తత్పరత గలవారు. వీరు పార్వతీపరమేశ్వరుల శాసనముచే మాత్రమే నాకు మనోరథమునీడేర్చెదరు గాక ! (144) క్షేత్రపాలుడు, గొప్ప తేజశ్శాలి, నల్లని మేఘమును పోలియుండువాడు, కోరలతో భయంకరమగు ముఖము గలవాడు, కంపించే ఎర్రని క్రింది పెదవితో ప్రకాశించువాడు (145), పైకి లేచియున్న ఎర్రని శిరోజములతో శోభిల్లువాడు, ముడివడిన కనుబొమలతో వక్రముగా చూచువాడు, ఎర్రిని గిరగిర తిరిగే మూడు కన్నులు గలవాడు, చంద్రవంక మరియు పాములు ఆభరణములుగా గలవాడు (146), దిగంబరుడు, చేతులలో త్రిశూలమును పాశమును కత్తిని మరియు కపాలమును ఎత్తి పట్టుకున్నవాడు, భైరవులతో సిద్ధులతో మరియు యోగినులతో చుట్టువారబడి యున్నవాడు, ప్రతి క్షేత్రమునందు కూర్చుని ఉండువాడు, నిలబడి సత్పురుషులను రక్షించువాడు, శివుని నమస్కరించుటయందు తత్పరుడు, శివుని యందలి సద్భక్తితో నిండిన హృదయము గలవాడు, శివభక్తులను విశేషించి కన్న కొడుకులను వలె రక్షించువాడు అగు ఆ భైరవుడు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను శిరసా వహించి నాకు మంగళమార్గమును చూపుగాక! (147-149) శివుని మొదలటి ఆవరణములో తాలజంఘుడు మొదలగు వారు పూజించ బడినారు. వారు నలుగురు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞను శిరసా వహించి నన్ను చక్కగా రక్షించెదరు గాక ! (150) శివుని చుట్టు వారియున్న భైరవుడు మొదలగు వారు అందరు కూడ శివుని ఆజ్ఞయందలి గౌరవముచే నన్ను అనుగ్రహించెదరు గాక ! (151) నారదాద్యాశ్చ మునయో దివ్యా దేవైశ్చ పూజితాః | సాధ్యా నాగాశ్చ యే దేవా జనలోకనివాసినః || 152 వినిర్వృత్తాధికారాశ్చ మహర్లోకనివాసినః | సప్తర్షయస్తథాన్యే వై వైమానికగణౖస్సహ || 153 సర్వే శివార్చనరతాశ్శివాజ్ఞావశవర్తినః | శివయోరాజ్ఞయా మహ్యం దిశంతు మమ కాంక్షితమ్ || 154 గంధర్వాద్యాః పిశాచాంతాశ్చతస్రో దేవయోనయః | సిద్ధా విద్యాధరాద్యాశ్చ యే%పి చాన్యే నభశ్చరాః || 155 అసురా రాక్షసాశ్చైవ పాతాలతలవాసినః | అనంతాద్యాశ్చ నాగేంద్రా వైనతేయాదయో ద్విజాః || 156 కూష్మాండాః ప్రేతవేతాలా గ్రహా భూతగణాః పరే | డాకిన్యశ్చాపి యోగిన్యశ్శాకిన్యశ్చాపి తాదృశాః || 157 క్షేత్రారామగృహాదీని తీర్థాన్యాయతనాని చ | ద్వీపాస్సముద్రా నద్యశ్చ నదాశ్చాన్యే సరాంసి చ || 158 గిరయశ్చ సుమేర్వాద్యాః కాననాని సమంతతః | పశవః పక్షిణో వృక్షాః కృమికీటాదయో మృగాః || 159 భువనాన్యపి సర్వాణి భువనానామధీశ్వరాః | అండాన్యావరణౖస్సార్థం మాసాశ్చ దశ దిగ్గజాః || 160 వర్ణాః పదాని మంత్రాశ్చ తత్త్వాన్యపి సహాధిపైః | బ్రహ్మాండాధారకా రుద్రా రుద్రాశ్చాన్యే సశక్తికాః || 161 యచ్చ కించిజ్జగత్యస్మిన్ దృష్టం చానుమితం శ్రుతమ్ | సర్వే కామం ప్రయచ్ఛంతు శివయోరేవ శాసనాత్ || 162 దేవతలచే కూడ పూజించబడే నారదుడు మొదలగు దేవర్షులు, సాధ్యులు, నాగులు, జనలోకమునందు నివసించే దేవతలు (152), చక్కగా నిర్వహించబడిన విశేషాధికారములు గల మహర్లోకమునందలి దేవతలు, సప్తర్షులు, ఇతరులు, మరియు విమానములలో సంచరించే దేవగణములు (153) అనే వీరందరు శివుని పూజించుటయందు ప్రీతి గలవారే. శివుని ఆజ్ఞకు లోబడి పని చేసే వీరు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞచే నాకు నా మనోరథమునీడేర్చెదరు గాక! (154) గంధర్వులతో మొదలిడి పిశాచముల వరకు గల నాలుగు దేవయోనులు, సిద్ధులు, విద్యాధరులు మొదలగు వారు, ఆకాశములో సంచరించే ఇతర దేవగణములు (155), అసురులు, రాక్షసులు, పాతాళలోకమునందు నివసించే అనంతుడు మొదలగు నాగరాజులు, గరుత్మంతుడు మొదలగు పక్షులు (156), కూష్మాండులు, ప్రేతములు, వేతాళులు, గ్రహములు, ఇతర భూతగణములు, డాకినులు, యోగినులు, శాకినులు, మరియు ఆ కోవకు చెందినవారు (157), పాలములు తోటలు ఇళ్లు మొదలగునవి, తీర్థములు, దేవాలయములు, ద్వీపములు, సముద్రములు, నదులు, నదములు, ఇతరములగు జలాశయములు (158), సుమేరువు మొదలగు పర్వతములు, అంతటా వ్యాపించియున్న అడవులు, పశువులు, పక్షులు, చెట్లు, క్రిములు, కీటకములు మొదలగునవి, మృగములు (159), సకలభువనములు, భువనేశ్వరులు, ఆవరణములతో (చుట్టువారియుండు నీరు మొదలైనవి) కూడియున్న బ్రహ్మాండములు, మాసములు, పది, దిగ్గజములు (160), అక్షరములు, పదములు, మంత్రములు, తత్త్వములు, వాటి అధిష్ఠాన దేవతలు, బ్రహ్మాండములను నిలబెట్టే రుద్రులు, ఇతరులగు రుద్రులు, వారి వారి శక్తులు మాత్రమే గాక (161), ఈ జగత్తులో ఏదైతే చూడబడునో ఊహించబడునో వినికిడికి వచ్చునో ఆ సర్వము పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞచే నాకు నా మనోరథమునీడేర్చెదరు గాక! (162). అథ విద్యా పరాశైవీ పశుపాశవిమోచినీ | పంచార్థసంజ్ఞితా దివ్యా పశువిద్యాబహిష్కృతా || 163 శాస్త్రం చ శివధర్మాఖ్యం ధర్మాఖ్యం చ తదుత్తరమ్ | శైవాఖ్యం శివధర్మాఖ్యం పురాణం శ్రుతిసంమితమ్ || 164 శైవాగమాశ్చ యే చాన్యే కామికాద్యశ్చతుర్విధాః | శివాభ్యామవిశేషేణ సత్కృత్యేహ సమర్చితాః || 165 తాభ్యామేవ సమాజ్ఞాతా మమాభిప్రేతసిద్ధయే | కర్మేదమనుమన్యంతాం సఫలం సాధ్వనుష్ఠితమ్ || 166 శ్వేతాద్యా నకులీశాంతాస్స శిష్యాశ్చాపి దేశికాః | తత్సంతతీయా గురవో విశేషాద్గురవో మమ || 167 శైవా మాహేశ్వరాశ్చైవ జ్ఞానకర్మపరాయణాః | కర్మేదమనుమన్యంతాం సఫలం సాధ్వనుష్ఠితమ్ || 168 లౌకికా బ్రహ్మణాస్సర్వే క్షత్రియాశ్చ విశః క్రమాత్ | వేదవేదాంగతత్త్వజ్ఞాస్సర్వశాస్త్రవిశారదాః || 169 సాంఖ్యా వైశేషికాశ్చైవ ¸°గానైయాయికా నరాః | సౌరా బ్రాహ్మాస్తథా రౌద్రా వైష్ణవాశ్చాపరే నరాః || 170 శిష్టాస్సర్వే విశిష్టాశ్చ శివశాసనయంత్రితాః | కర్మేదమనుమన్యంతాం మమాభిప్రేతసాధకమ్ || 171 శైవాస్సిద్ధాంతమార్గస్థాశ్శైవాః పాశుపతాస్తథా | శైవా మహావ్రతధరాశ్శైవాః కాపాలికాః పరే || 172 శివాజ్ఞాపాలకాః పూజ్యా మమాపి శివశాసనాత్ | సర్వే మామనుగృహ్ణంతు శంసంతు సఫలక్రియామ్ || 173 తరువాత శివునకు సంబంధించినది, జీవులకు సంసారబంధమునుండి విముక్తిని కలిగించునది, పంచార్థా అను పేరు గలది, దివ్యమైనది, అజ్ఞానరూపములగు విద్యలకు అతీతమైన ది అగు పరావిద్య (163), శివధర్మము అను పేరు గల శాస్త్రము, ధర్మశాస్త్రము, శివధర్మము అనే పేరు కలిగి వేదములతో సమానమగు స్థాయి గల శివపురాణము (164), ఇతరములగు శైవాగమములు, పార్వతీపరమేశ్వరులతో సమానముగా ఈ లోకములో సత్కారపూర్వకముగా ఆరాధించబడే ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థములు (165) అనునవి వారిద్దరిచే అనుమతించ బడినవై ,నా అభీష్టము సిద్ధించుట కొరకై ఈ కర్మను చక్కగా అనుష్టించ బడినదిగా ఆమోదించి సఫలము చేయు గాక! (166) శ్వేతునితో మొదలిడి నకులీశుని వరకు గల గురువులు, వారి సంతతికి చెందిన గురువులు, వారి శిష్యులు, విశేషించి నా గురువులు (167), శైవజ్ఞానమునందు మరియు కర్మయందు తత్పురులై ఉండే శైవులు, మహేశ్వరులు ఈ కర్మను చక్కగా అనుష్ఠించ బడినదిగా ఆమోదించి సఫలము చేయుదురు గాక! (168) ఈ లోకములోని జనులు అందరు, క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వేదముల మరియు వేదాంగముల సారమును తెలిసిన విద్వాంసులు, సర్శశాస్త్రపండితులు (169), సాంఖ్యులు, వైశేషికులు, యోగులు, తార్కికులగు జనులు, సూర్యుని బ్రహ్మను రుద్రుని మరియు విష్ణువును ఉపాసించువారు, ఇతర జనులు (170), శిష్టపురుషులు (ధర్మాత్ములు) , విశిష్ట (ఆధికారిక) పురుషులు అందరు శివుని శాసనముచే నియంత్రించ బడినవారై, నా అభిష్టమును నెరవేర్చే ఈ కర్మను అనుమోదించెదరు గాక! (171) సిద్ధాంతమార్గముననుసరించే శైవులు, పాశుపత శైవులు, మహావ్రతముననుష్ఠించే శైవులు, మరియు కాపాలికులగు ఇతరశైవులు (172) శివుని ఆజ్ఞను పాలించుచుందురు. వారు నాకు కూడ పూజ్యులు. వారందరు శివుని శాసనముచే నన్ను అనుగ్రహించి, నా కర్మ సఫలమగునని ఆశీర్వదించెదరు గాక! (173). దక్షిణజ్ఞాననిష్ఠాశ్చ దక్షిణోత్తరమార్గగాః | అవిరోధేన వర్తాంతాం మంత్రశ్రేయో%ర్థినో మమ || 174 నాస్తికాశ్చ శఠాశ్చైవ కృతఘ్నాశ్చైవ తామసాః | పాషండాశ్చాతిపాపాశ్చ వర్తంతాం దూరతో మమ || 175 బహుభిః కిం స్తుతైరత్ర యే %పి కే%పి చిదాస్తికాః | సర్వే మామనుగృహ్ణంతు సంతశ్శంసంతు మంగలమ్ || 176 నమశ్శివాయ సాంబాయ ససుతాయాది హేతవే | పంచావరణరూపేణ ప్రపంచేనావృతాయ తే || 177 ఇత్యుక్త్వా దండవద్భూమౌ ప్రణిపత్య శివం శివామ్ | జపేత్పంచాక్షరీం విద్యామష్టోత్తరశతావరామ్ || 178 తథైవ శక్తివిద్యాం చ జపిత్వా తత్సమర్పణమ్ | కృత్వా తం క్షమయిత్వేశం పూజా శేషం సమాపయేత్ || 179 ఏతత్పుణ్యతమం స్తోత్రం శివయోర్హృదయంగమమ్ | సర్వభీష్టప్రదం సాక్షాద్భుక్తిముక్త్యేక సాధనమ్ || 180 య ఇదం కీర్తయేన్నిత్యం శృణుయాద్వా సమాహితః | స విధూయాశు పాపాని శివసాయుజ్యమాప్నుయాత్ || 181 గోఘ్నశ్చైవ కృతఘ్నశ్చ వీరహా భ్రూణహాపి వా | శరణాగతఘాతీ చ మిత్రవిశ్రంభఘాతకః || 182 దుష్టపాపసమాచారో మాతృహా పితృహాపి వా | స్తవేనానేన జప్తేన తత్తత్పాపాత్ర్పముచ్యతే || 183 దక్షిణాచారమునందు నిష్ఠ గలవారు, దక్షిణాచారముకు అతీతమైన జ్ఞానమార్గము నందు పయనించువారు మంత్రము ద్వారా శ్రేయస్సును కోరే నాయందు విరోధభావము లేకుండగా నుండెదరు గాక! (174) నాస్తికులు, రహస్యముగా మోసము చేయువారు, కృతఘ్నులు, తమోగుణప్రధానులు, వేదబాహ్యులు మరియు మహాపాపాత్ములు నాకు దూరముగా నుందురు గాక ! (175) అనేకస్తోత్రములతో పని యేమి? ఎవరైతే ఆస్తికులు గలరో, అట్టి సత్పురుషులందరు నన్ను అనుగ్రహించి, నాకు మంగళాశీస్సులను పలికెదరు గాక! (176) జగన్మాతతో మరియు కుమారులతో కూడియున్నవాడు, ఆది కారణుడు, అయిదు ఆవరణముల రూపములో నున్న ప్రపంచముచే చుట్టువారబడి యున్నవాడు అగు ఓ శివా! నీకు నమస్కారము (177). ఇట్లు పలికి పార్వతీపరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారమును చేసి, కనీసము నూట యెనిమిది సార్లు పంచాక్షరమంత్రమును జపించవలెను (178). అదే విధముగా శక్తిమంత్రమును జపించి, ఆ జపమును ఈశ్వరునకు సమర్పించి, క్షమాపణను కోరి, మిగిలిన పూజను ముగించవలెను (179). పార్వతీపరమేశ్వరుల మనస్సునకు ఆహ్లాదమును కలిగించేఈ పరమపవిత్రమగు స్తోత్రము సకలములగు కామనలను ఈడేర్చును. ఇది భుక్తికి మాత్రమే గాక, ముక్తికి కూడ సాక్షాత్తుగా ఏకైక సాధనము (180). ఎవడైతే నిత్యము దీనిని కీర్తించునో, లేదా ఏకాగ్రచిత్తముతో వినునో, అట్టివాని పాపములు శీఘ్రమే పటాపంచలై శివుని సాయుజ్యమును పొందును (181). గోహత్యను చేసినవాడు, చేసిన మేలు మరచినవాడు, అన్యాయముగా వీరుని సంహరించినవాడు, గర్భస్థశిశువును చంపినవాడు, శరణు జొచ్చినవానిని చంపినవాడు, మిత్రునకు నమ్మకద్రోహమును చేసినవాడు (182), దుష్టుడై పాపములనాచరించినవాడు, తల్లిదండ్రులను హింసించినవాడు ఈ స్తోత్రమును పారాయణ చేసినచో, అయా పాపములనుండి విముక్తుడగును (183). దుఃస్వప్నాది మహానర్థసూచకేషు భ##యేషు చ | యది సంకీర్తయేదేతన్న తతో%నర్థభాగ్భవేత్ || 184 అయురారోగ్యమైశ్వర్యం యచ్చాన్యదపి వాంఛితమ్ | స్తోత్రస్యాస్య జపే తిష్టంస్తత్సర్వం లభ##తే నరః || 185 అసంపూజ్య శివం స్తోత్రజపాత్ఫలముదాహృతమ్ | సంపూజ్య చ జపే తస్య ఫలం వక్తుం న శక్యతే || 186 ఆస్తామియం ఫలావాప్తిరస్మిన్ సంకీర్తితే సతి | సార్థమంబికయా దేవః శ్రుత్వైవం దివి తిష్ఠతి || 187 తస్మాన్నభసి సంపూజ్య దేవదేవం సహోమయా | కృతాంజలిపుటస్తిష్ఠంస్తోత్రమేతదుదీరయేత్ || 188 ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివమహాస్తోత్ర వర్ణనం నామ ఏకత్రింశో %ధ్యాయః (31). దుస్స్వప్నము మొదలగునవి రాబోయే గొప్ప ఆపదను సూచించే సందర్భములలో మరియు భయమును కలిగించే సందర్భములలో దీనిని పఠించినచో, మానవుడు దాని ప్రభావము వలన అనర్థమును పొందుడు (184). ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలగు వాటిని వేటిని మానవుడు కోరునో, అవి అన్నీ ఈ స్తోత్రమును పారాయణ చేయుట వలన లభించును (185). శివుని పూజించకుండగా కేవలము స్తోత్రపారాయణ వలన లభించే ఫలము పైన చెప్పబడినది. శివుని చక్కగా పూజించి పారాయణ చేసినచో దాని ఫలమును చెప్పుట సంభవము కాదు (186). ఈ స్తోత్రమును పారాయణ చేయుటవలన లభించే ఫలమును గురించి చర్చను అటులనే ఉంచుడు. దీనిని వింటూనే శివుడు పార్వతితో కూడి వచ్చి ఆకాశములో నిలిచి యుండును (187). కావున, మానవుడు ఆకాశమునందు ఉమాదేవితో కూడియున్న ఆ దేవదేవుని చక్కగా పూజించి, చేతులను జోడించి నిలబడి, ఈ స్తోత్రమును పారాయణ చేయవలెను (188). శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివ మహాస్తోత్రమును వర్ణించే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).