Siva Maha Puranam-4    Chapters   

అథ పంచత్రింశోధ్యాయః

శివలింగము ఆవిర్భవించుట

ఉపమన్యురూవాచ |

అథావిరభవత్తత్ర సనాదం శబ్దలక్షణమ్‌ | ఓమిత్యేకాక్షరం బ్రహ్మ బ్రహ్మణః ప్రతిపాదకమ్‌ || 1

తదప్యవిదితం తావద్ర్బహ్మణా విష్ణునా తథా | రజసా తమసా చిత్తం తయోర్యస్మాత్తిరస్కృతమ్‌ || 2

తదా విభక్తమభవచ్చతుర్ధైకం తదక్షరమ్‌ | అ ఉ మేతి త్రిమాత్రాభిః పరస్తాచ్చార్ధమాత్రయా || 3

తత్రాకారః శ్రితో భాగే జ్వలల్లింగస్య దక్షిణ | ఉకారశ్చోత్తరే తద్వన్మకారస్తస్య మధ్యతః || 4

అర్ధమాత్రాత్మకో నాదః శ్రూయతే లింగమూర్ధని | విభ##క్తే% పి తదా తస్మిన్‌ ప్రణవే పరమాక్షరే || 5

విభాగార్థం చ తౌ దేవౌ న కించిదవజగ్మతుః | వేదాత్మనా తదావ్యక్తః ప్రణవో వికృతిం గతః || 6

తత్రాకారో ఋగభవదుకారో యజురవ్యయః | మకారస్సామ సంజాతో నాదస్త్వాథర్వణీ శ్రుతిః || 7

ఋగయం స్థాపయామాస సమాసాత్త్వర్థమాత్మనః | రజో గుణషు బ్రహ్మాణం మూర్తిష్వాద్యం క్రియాస్వపి || 8

సృష్టిం లోకేషు పృథివీం తత్త్వేష్వాత్మానమవ్యయమ్‌ | కలాధ్వని నివృత్తిం చ సద్యం బ్రహ్మసు పంచసు || 9

లింగభాగేష్వధోభాగం బీజాఖ్యం కారణత్రయే | చతుఃషష్టిగుణౖశ్వర్యం బౌద్ధం యదణిమాదిషు || 10

ఉమన్యుపు ఇట్లు పలికెను-

అపుడచట నాదముతో కూడిన శబ్దము అవిర్భవించెను. అదియే ఓంకారము. అది ఒకే అక్షరము గల పరబ్రహ్మప్రతిపాదకమంత్రము (1). బ్రహ్మవిష్ణువులిద్దరి మనస్సులు రజస్తమోగుణములచే పరాభూతములై ఉండుట వలన వారికి అది కూడ తెలియదాయెను (2). అపుడు ఆ ఒకే ఒక అక్షరము అ ఉ మ్‌ అనే మూడు మాత్రలు మరియు వాటిపై ఒక సగము మాత్ర అనే నాలుగు భాగములుగా విడిపోయెను (3). అప్పుడు మండుచున్న ఆ లింగము యొక్క దక్షిణభాగమును అకారము, ఉత్తరమును ఉకారము, మధ్యభాగమును మకారము ఆశ్రయించెను (4). లింగముయొక్క అగ్రభాగమునందు సగము మాత్ర రూపములోనుండే నాదము వినవచ్చుచుండెను. ఆ గొప్ప అక్షరమగు ఓంకారము ఈ విధముగా విడి పోయిననూ (5), ఆ బ్రహ్మవిష్ణువులిద్దరు ఈ విభాగముయొక్క అర్థమును కొంచెమైననూ తెలియ జాలకుండిరి. అపుడు అవ్యాకృత రూపమగు ఆ ఓంకారము వేదముల రూపముగా వ్యాకృతమయ్యెను (6). దానిలోని అకారము ఋగ్వేదము, ఉకారము వినాశము లేని యజుర్వేదము, మకారము సామవేదము, నాదము అథర్వణవేదము అయినవి (7). ఈ ఋగ్వేదము తన స్వరూపములో సంగ్రహముగా గుణములలో రజోగుణమును, త్రిమూర్తులలో మొదటి వాడగు బ్రహ్మను, జగత్కార్యములలో మొదటిది అగు సృష్టిని, లోకములలో పృథివీలోకమును, తత్త్వములలో అవినాశియగు ఆత్మతత్త్వమును, కళామార్గమునందు నివృత్తి కళను, పంచబ్రహ్మలయందు సద్యోజాతుని, లింగభాగముల యందు క్రింది భాగమును, మూడు కారణములలో బీజము అనే కారణమును, అణిమ మొదలగు అష్ట సిద్ధులయందు సమష్టిబుద్ధి శక్తికి సంబంధించిన అరువది నాలుగు గుణములతో కూడిన ఈశ్వరభావమును స్థాపించుకొనెను (8-10).

తదిత్థమర్థైరశభర్వ్యాప్తం విశ్వమృచా జగత్‌ | అథోపస్థాపయామాస స్వార్థం దశవిధం యజుః || 11

సత్త్వం గుణషు విష్ణుం చ మూర్తిష్వాద్యం క్రియాస్వపి | స్థితిం లోకేష్వంతరిక్షం విద్యాం తత్త్వేషు చ త్రిషు || 12

కలాధ్వసు ప్రతిష్ఠాం చ వామం బ్రహ్మసు పంచసు | మధ్యం తు లింగభాగేషు యోనిం చ త్రిషు హేతుషు || 13

ప్రాకృతం చ యథైశ్వర్యం తస్మాద్విశ్వం యజుర్మయమ్‌ | తతోపస్థాపయామాస సామార్థం దశధాత్మనః || 14

తమో గుణష్వథో రుద్రం మూర్తిష్వాద్యం క్రియాసు చ | సంహృతిం త్రిషు లోకేషు తత్త్వేషు శివముత్తమమ్‌ || 15

విద్యాకలాస్వఘోరం చ తథా బ్రహ్మసు పంచసు | లింగభాగేషు పీఠోర్ధ్వం బీజినం కారణత్రయే || 16

పౌరుషం చ తథైశ్వర్యమిత్థం సామ్నాతతం జగత్‌ | అథాథర్వాహ నైర్గుణ్యమర్థం ప్రథమమాత్మనః || 17

తతో మాహేశ్వరం సాక్షాన్మూర్తిష్వపి సదాశివమ్‌ || క్రియాసు నిష్ర్కియస్యాపి శివస్య పరమాత్మనః || 18

భూతానుగ్రహణం చైవ ముచ్యంతే యేన జంతవః | లోకేష్వపి యతో వాచో నివృత్తా మనసా సహ || 19

తదూర్ధ్వమున్మనా లోకాత్సోమలోకమలౌకికమ్‌ | సోమస్సహోమయా యత్ర నిత్యం నివసతీశ్వరః || 20

కావున ఈ విధముగా బుగ్వేదము పది అంశములతో జగత్తునంతనూ వ్యాపించినది. తరువాత యజుర్వేదము తన అర్థమును పది విధములుగా స్థాపించెను (11). గుణములలో సత్త్వగుణమును, త్రిమూర్తులలో మొదటివానినిగా విష్ణువును, జగత్కార్యములు మూడింటిలో రక్షణను, లోకములలో అంతరిక్షలోకమును, మూడు తత్త్వములలో విద్యాతత్త్వమును (12), కళామార్గములలో ప్రతిష్ఠాకళను, అయిదుగురు బ్రహ్మలలో వామదేవుని, లింగభాగములలో మధ్యభాగమును, మూడు కారణములలో యోనిని (13), ప్రకృతికి సంబంధించిన ఈశ్వరభావమును స్థాపించెను. కావున, జగత్తు యజుర్వేదముతో నిండి యున్నది. తరువాత సామవేదము తన అర్థమును పది విధములుగా స్థాపించెను (14). గుణములలో తమోగుణమును, త్రిమూర్తులలో మొదటి వానినిగా రుద్రుని, జగత్కార్యములలో సంహారక్రియను, మూడు లోకములలో స్వర్గమును, తత్త్వములలో ఉత్తమమగు శివతత్త్వమును (15), కళలలో విద్యాకళను, అయిదుగురు బ్రహ్మలలో అఘోరుని, లింగభాగములలో పీఠము యొక్క పైభాగమును, మూడు కారణములలో బీజ (బీజము గలవాడు) ని (16), పురుషునకు సంబంధించిన ఈశ్వరభావమును స్థాపించెను. ఈ విధముగా జగత్తు సామవేదముచే వ్యాప్తమై యున్నది. తరువాత అథర్వవేదము తన అర్థమును ఈ క్రింది విధముగా ప్రకటించి స్థాపించెను. మొదటి అర్థము గుణాతీతమగు పరమాత్మతత్త్వము. మూర్తులలో సాక్షాత్తు మహేశ్వరుడగు సదాశివుడు తరువాతిది. క్రియలు లేని శివపరమాత్మ ప్రాణుల సృష్టిని అనుగ్రహించుటయే క్రియలలో అథర్వవేదముయొక్క అర్థము. ఈ అనుగ్రహము వలననే ప్రాణులు మోక్షమును పొందును. లోకములకు అతీతముగా మనస్సునకు గాని, వాక్కునకు గాని గోచరము కాని ఉన్మనా లోకము గలదు. దానికి పైన దివ్యమగు సోమలోకము గలదు. అచట ఈశ్వరుడు చంద్రరూపములో పార్వతితో కలిసి నిత్యము నివసించును. అదియే లోకములలో అథర్వవేదముయొక్క అర్థము (17-20).

తదూర్ధ్వమున్మనా లోకాద్యం ప్రాప్తో న నివర్తతే | శాంతిం చ శాంత్యతీతాం చ వ్యాపికాంవై కలాస్వపి || 21

తత్పూరుషం తథేశానం బ్రహ్మ బ్రహ్మసు పంచసు | మూర్ధానమపి లింగస్య నా దభాగేష్వనుత్తమమ్‌ || 22

యత్రావాహ్య సమారాధ్యః కేవలో నిష్కలశ్శివః | తత్త్వేష్వపి తదా బిందోర్నాదాచ్ఛక్తేస్తతః పరాత్‌ || 23

తత్త్వాదపి పరం తత్త్వమతత్త్వం పరమార్థతః | కారణషు త్రయాతీతాన్మాయావిక్షోభకారణాత్‌ || 24

అనంతాచ్ఛుద్ధవిద్యాయాః పరస్తాచ్చ మహేశ్వరాత్‌ | సర్వవిద్యేశ్వరాధీశాన్న పరాచ్చ సదాశివాత్‌ || 25

సర్వమంత్రతనోర్దేవాచ్ఛక్తిత్రయసమన్వితాత్‌ | పంచవక్త్రాద్ధశభుజాత్సాక్షాత్సకలనిష్కలాత్‌ || 26

తస్మాదపి పరాద్బిందోరర్ధేందోశ్చ తతః పరాత్‌ | తతః పరాన్నిశాధీశాన్నాదాఖ్యాచ్చ తతః పరాత్‌ || 27

తతః పరాత్సుషుమ్నేశాద్ర్బహ్మరంధ్రేశ్వరాదపి | తతః పరస్మాచ్ఛక్తేశ్చ పరస్తాచ్ఛివతత్త్వతః || 28

పరమం కారణం సాక్షాత్స్వయం నిష్కారణం శివమ్‌ | కారణానాం చ ధాతారం ధ్యాతారం ధ్యేయమవ్యయమ్‌ || 29

పరమాకాశమధ్యస్థం పరమాత్మోపరి స్థితమ్‌ | సర్వైశ్వర్యేణ సంపన్నం సర్వేశ్వరమనీశ్వరమ్‌ || 30

ఉన్మనా లోకమునకు పైన ఉండే ఆ సోమలోకమును చేరినవారికి మరల జన్మ లేదు. కళలలో శాంతి కళ, సర్వకళలలో వ్యాపించి ఉండే శాంత్యతీత కళ అథర్వవేదమునకు సారభూతమగు అర్థములు (21). అయిదుగురు బ్రహ్మలలో తత్పురుషుడు మరియు ఈశానుడు, లింగముయొక్క భాగములలో శిరస్సు, ఓంకారములో సర్వోత్తమమగు నాదము అథర్వవేదమునకు అర్థములు (22). అద్వితీయుడు, నిర్గుణనిరాకారుడు అగు శివుని దానియందు (లింగమునకు ఊర్ధ్వ భాగమునందు, ఓంకారము యొక్క నాదమునందు) ఆవాహన చేసి చక్కగా ఆరాధించవలెను. తత్త్వములలో బిందువుకంటె, నాదము కంటె అతీతమగు శివతత్త్వము అధర్వవేదమునకు అర్థము. ఈ శివతత్త్వము తత్త్వములన్నింటికీ అతీతమైనది. మరియు తాను వాస్తవముగా ఒక తత్త్వము కాదు. మాయాశక్తిలో సంక్షోభము కలిగి ఈ సృష్టి జరుగును. దానికి మూలములో మూడు కారణములు గలవు. ఈ తత్త్వము ఆ మూడు కారణములకు కూడ అతీతమైనది (23-24). అది అనంతుడు, శుద్ధవిద్య, మహేశ్వర అను తత్త్వములకు కూడ అతీతమైనది. కాని, అది సకలవిద్యలకు అధీశ్వరుడగు సదాశివుని కంటె అతీతమైనది కాదు (25). ఈ సదాశివుడు సకలమంత్రములు దేహముగా గలవాడు. ఆయనయందు మూడు శక్తులు (ఇచ్ఛ, జ్ఞానము, క్రియ) కలిసి యున్నవి. ఆయన నిర్గుణ నిరాకారుడు మాత్రమే గాక, అయిదు ముఖములు పది చేతులు గల సగుణ సాకారుడు కూడా అగుచున్నాడు (26). ఓంకారములోని అకార ఉకార మకారములకు అతీతముగా బిందువు, దానికి అతీతముగా అర్ధచంద్రుడు, దానికి అతీతముగా నాదము అనబడే చంద్రతత్త్వము (27), దానికి పైన సుషుమ్నానాడికి అధిపతియగు ఈశ్వరుడు, దానికి పైన బ్రహ్మరంధ్రమునకు అధిపతియగు ఈశ్వరుడు, దానికి పైన శక్తి, దానికి పైన శివతత్త్వము గలవు (28). సర్వకారణమగు ఆ శివతత్త్వమే ఇతర కారణములను సృష్టించును. కాని పరమార్థ దృష్టికోణములో శివతత్త్వము స్వయముగా కారణము కాదు. దానికి మరియొక కారణము లేదు. వినాశము లేని ఆ శివతత్త్వము ధ్యాతృ - ధ్యైయముల సమాహార స్వరూపము. ఆ శివతత్త్వము భూతాకాశ చిత్తాకాశముల కంటె ఉత్కృష్టమగు హృదయాకాశమునకు మధ్యలో నుండును. సర్వమునకు అతీతముగా నుండే పరమాత్మ అదియే. సకలైశ్వర్యములతో గూడి సర్వమునకు అధీశ్వరమైన ఆ శివతత్త్వమునకు పైన మరియొక ఈశ్వరుడు లేడు (29,30).

ఐశ్వర్యాచ్చాపి మాయేయాదశుద్ధాన్మానుషాదికాత్‌ | అపరాచ్చ పరాత్త్యాజ్యాదధిశుద్ధాధ్వగోచరాత్‌ || 31

తత్పరాచ్ఛుద్ధవిద్యాద్యాదున్మనాంతాత్పరాత్పరాత్‌ | పరమం పరమైశ్వర్యమున్మనాద్యమనాది చ || 32

అపారమపరాధీనం నిరస్తాతిశయం స్థిరమ్‌ | ఇత్థమర్థైర్దశవిధైరియమాథర్వణీశ్రుతిః || 33

యస్మాద్గరీయసీ తస్మాద్విశ్వం వ్యాప్తమథర్వణాత్‌ | ఋగ్వేదః పునరాహేదం జాగ్రద్రూపం మయోచ్యతే || 34

యేనాహమాత్మతత్త్వస్య నిత్యమస్మ్యభిధాయకః | యజుర్వేదో%వదత్తద్వత్స్వప్నావస్థా మయోచ్యతే || 35

భోగ్యాత్మనా పరిణతా విద్యా వేద్యా యతో మయి | సామ చాహ సుషుప్త్యాఖ్యమేవం సర్వం మయోచ్యతే || 36

మమార్థేన శివేనేదం తామసేనాభిధీయతే | అథర్వాహ తురీయాఖ్యం తురీయాతీత మేవ చ || 37

మయాభిధీయతే తస్మాదధ్వాతీతపదోస్మ్యహమ్‌ | అధ్వాత్మకం తు త్రితయం శివవిద్యాత్మసంజ్ఞితమ్‌ || 38

తత్త్రైగుణ్యం త్రయీసాధ్యం సంశోధ్యం చ పదైషిణా | అధ్వాతీతం తురీయాఖ్యం నిర్వాణం పరమం పదమ్‌ || 39

తదతీతం చ నైర్గుణ్యాదధ్వనోస్య విశోధకమ్‌ | ద్వయోః ప్రమాపకో నాదో నాదాంతశ్చ మదాత్మకః || 40

మాయాసంబంధమగు ఐశ్వర్యము కంటె, మనుష్యలోకసంబంధి మొదలైన అపవిత్రమగు ఐశ్వర్యము కంటె, విడువదగిన తక్కువ స్థాయికి చెందిన ఐశ్వర్యము కంటె, శుద్ధమార్గము నందు ఉండే పరమ-ఐశ్వర్యము కంటె (31), శుద్ధవిద్య మొదలగువాటికంటె, అన్నింటికంటె గొప్పదియగు ఉన్మనా లోకము కంటె ఉత్కృష్టమైనది, ఆద్యంతములు లేనిది. పరాధీనత లేనిది, తనకంటె గొప్పది మరియొకటి లేనిది, స్థిరమైనది అగు పరమైశ్వర్యము అథర్వవేదమునకు అర్థము అగుచున్నది. ఈ విధముగా పది విధముల అర్థములతో ఈ అధర్వణవేదము ప్రకాశించు చున్నది (32,33). ఈ అధర్వణవేదము చాల గొప్పది. కావుననే, దీనిచే జగత్తు వ్యాపించబడి యున్నది. ఋగ్వేదము మరల ఇట్లు పలికెను: నేనే సర్వదా ఆత్మతత్త్వమును ప్రతిపాదించు చున్నాను గనుక, జాగ్రదవస్థయొక్క స్వరూపమును నేను బోధించుచున్నాను. అదే విధముగా యజుర్వేదము కూడ ఇట్లు పలికెను: నేను స్వప్నావస్థను బోధించుచున్నాను (34,35). ఏలయనగా నాయందు భోగ్యరూపముగా పరిణతిని చెందే విద్య (కర్మోపాసనలు) తెలియబడుచున్నది. అపుడు సామవేదము ఇట్లు పలికెను: నేను సుషుప్తి అనే అవస్థను పూర్ణముగా బోధించుచున్నాను (36). నాచే అర్థరూపముగా బోధించబడే తమోగుణప్రధానుడగు శివుని ద్వారా నేను ఈ అవస్థను బోధించుచున్నాను. అపుడు అథర్వవేదము ఇట్లు పలికెను; నేను తురీయము (జాగ్రత్‌-స్వప్న- సుషుప్తులకు అతీతమగు నాల్గవది) అనబడే ఆత్మతత్త్వమును, తురీయమునకు అతీతమగు శివతత్త్వమును (37) బోధించుచున్నాను. కావున, నేను అధ్వలకు అతీతమగు పదమునందున్నాను. శివుడు, విద్య, ఆత్మ అనబడే మూడు తత్త్వములు కలిసి అధ్వ (మార్గము) అనబడుచున్నవి (38). పరమపదము (మోక్షము) ను కోరువాడు ఆ త్రిగుణాత్మకము, వేదవిహితకర్మానుష్ఠానముచే పొందదగినది అగు స్వర్గాదిలక్ష్యములను శోధించవలెను (అనగా, వాటి స్వరూపమును పరిశీలించవలెను. తురీయము అనబడే పరమపదము ఈ అధ్వకు అతీతమైనది. మరియు మోక్షరూపమైనది (39). అధ్వకు అతీతమైన శివతత్త్వము గుణసంబంధము లేనిదగుటచే ఈ అధ్వను శోధన చేయును. నాదము రెండింటికి (విద్య, ఆత్మ) కొలబద్ద. నాదము అంతమైన చోట నా (అథర్వణముయొక్క) స్వరూపము గలదు (40).

తస్మాన్మమార్థస్స్వాతంత్ర్యాత్ర్పధానః పరమేశ్వర- | యదస్తి వస్తు తత్సర్వం గుణప్రాధాన్యయోగతః || 41

సమస్తం వ్యస్తమపి చ ప్రణవార్థం ప్రచక్షతే | సర్వార్థవాచకం తస్మాదేకం బ్రహ్మైతదక్షరమ్‌ || 42

తేనోమితి జగత్కృత్స్నం కురుతే ప్రథమం శివః | శివో హి ప్రణవో హ్యేష ప్రణవో హి శివస్స్మృతః || 43

వాచ్యవాచకయోర్ఛేదో నాత్యంతం విద్యతే యతః | చింతయా రహితో రుద్రో వాచో యన్మనసా సహ || 44

అప్రాప్య తన్నివర్తంతే వాచ్యస్త్వేకాక్షరేణ సః | ఏకాక్షరాదకారాఖ్యాదాత్మా బ్రహ్మాభిధీయతే || 45

ఏకాక్షరాదుకారాఖ్యాద్ద్విధా విష్ణురుదీర్యతే | ఏకాక్షరాన్మకారాఖ్యాచ్ఛివో రుద్ర ఉదాహృతః || 46

దక్షిణాంగాన్మహేశస్య జాతో బ్రహ్మాత్మసంజ్ఞికః | వామాంగాదభవద్విష్ణుస్తతో విద్యేతి సంజ్ఞితః || 47

హృదయాన్నీలరుద్రోభూచ్ఛివస్య శివసంజ్ఞికః | సృష్టేః ప్రవర్తకో బ్రహ్మా స్థి తేర్విష్ణుర్విమోహక- || 48

సంహారస్య తథా రుద్రస్తయోర్నిత్యం నియామకః || 49

తస్మాత్త్రయస్తే కథ్యంతే జగతః కారణాని చ | కారణత్రయ హేతుశ్చ శివః పరమకారణమ్‌ || 50

కావున, స్వతంత్రుడగుటచే తత్త్వములన్నింటిలో ప్రధానుడు పరమేశ్వరుడేనని నా తాత్పర్యము. సత్త్వరజస్తమోగుణముల హెచ్చుతగ్గుల పాళ్ల కలయికచేతనే ఈ జగత్తులోని సకలపదార్థములు నిర్మాణమైనవి (41). ఈ సర్వము కలిసి గాని, లేక విడివిడిగా గాని, ఓంకారము యొక్క అర్థమేనని పండితులు చెప్పుచున్నారు. ఓంకారము సకలములగు అర్థములను బోధించే శబ్దము. కావుననే, ఇది ఏకాక్షర పరంబ్రహ్మ (42). శివుడు ముందుగా ఓంకారమునుచ్చరించి, దాని ప్రభావముచే జగత్తునంతనూ సృష్టించును. ఈ ఓంకారమే శివుడు, శివుడే ఓంకారమని మహర్షులు చెప్పుచున్నారు. (43). ఏలయనగా, వాచ్యము (చెప్పబడునది), వాచకము (చెప్పే శబ్దము) అను వాటికి భేదము సుతరాము లేదు. సంకల్పవికల్పములు లేనివాడే రుద్రుడు, వాక్కులు మనస్సుతో సహా ఆ పరబ్రహ్మను బోధించగోరి, ఆ తత్త్వమును అందుకొన లేక వెనుకకు తిరిగినవి. కాని, ఆ శివుడు ఏకాక్షరమగు ఓంకారముచే బోధించబడుచున్నాడు. అకారము అనే ఒక అక్షరము ఆత్మ అనబడే బ్రహ్మను బోధించును (44,45). ఉకారము అనే రెండవ ఏకాక్షరము విష్ణువును, మకారమనే ఏకాక్షరము మంగళస్వరూపుడగు రుద్రుని బోధించును (46). మహేశ్వరుని కుడి భాగమునుండి ఆత్మ అనే పేరు గల బ్రహ్మ, ఎడమభాగము నుండి విద్య అనే పేరుగల విష్ణువు పుట్టినారు (47). శివుని హృదయమునుండి శివుడు అనే పేరుగల నల్లని రుద్రుడు ప్రకటమైనాడు. బ్రహ్మ సృష్టిని చేయగా, విష్ణువు దానికి స్థితిని కల్పించి మోహింపజేయును (48). రుద్రుడు సంహారమును చేయుటయే గాక, సర్వదా వారిద్దరినీ నియంత్రించుచుండును (49). కావుననే, వారు ముగ్గురు జగత్తునకు కారణమని చెప్పబడుచున్నారు. వారి ముగ్గురికి కారణుడగు శివుడు పరమకారణమగుచున్నాడు (50).

అర్థమేతమవిజ్ఞాయ రజసా బద్ధవైరయోః | యువయోః ప్రతిబోధాయ మధ్యే లింగముపస్థితమ్‌ || 51

ఏవమోమితి మాం ప్రాహుర్యదిహోక్తమథర్వణా | ఋచో యజూంషి సామాని శాఖాశ్చాన్యాస్సహస్రశః || 52

వేదేష్వేవం స్వయం వక్త్రైర్వ్యక్తమిత్యవదత్స్వపి | స్వప్నానుభూతమివ తత్తాభ్యాం నాధ్యవసీయతే || 53

తయోస్తత్ర ప్రబోధాయ తమోపనయనాయ చ | లింగేపి ముద్రితం సర్వం యథా వేదైరుదాహృతమ్‌ || 54

తద్దృష్ట్వా ముద్రితం లింగే ప్రసాదాల్లింగినస్తదా | ప్రశాంతమానసౌ దేవౌ ప్రబుద్ధౌ సంబభూవతుః || 55

ఉత్పత్తిం విలయం చైవ యాథాత్మ్యం చ షడధ్వనామ్‌ | తతః పరతరం ధామ ధామవంతం చ పూరుషమ్‌ || 56

నిరుత్తరతరం బ్రహ్మ నిష్కలం శివమీశ్వరమ్‌ | పశుపాశమయస్యాస్య ప్రపంచస్య సదా పతిమ్‌ || 57

అకుతోభయమత్యంతమవృద్ధిక్షయమవ్యయమ్‌ | బాహ్యమాభ్యంతరం వ్యాప్తం బాహ్యాభ్యంతరవర్జితమ్‌ || 58

నిరస్తాతిశయం శశ్వద్విశ్వలోకవిలక్షణమ్‌ | అలక్షణమనిర్దేశ్యమవాఙ్మనసగోచరమ్‌ || 59

ప్రకాశైకరసం శాంతం ప్రసన్నం సతతోదితమ్‌ | సర్వకల్యాణనిలయం శక్త్యాతాదృశయాన్వితమ్‌ || 60

జ్ఞాత్వా దేవం విరూపాక్షం బ్రహ్మనారాయణౌ తదా | రచాయిత్వాంజలిం మూర్ధ్ని భీతౌ తౌ వాచమూచతుః || 61

ఈ సత్యము నెరుంగక రజోగుణప్రభావముచే గట్టిగా వైరమును పూనియున్న వీరిద్దరికి జ్ఞానమును బోధించుట కొరకై మధ్యలో లింగము ఆవిర్భవించినది (51). ఈ విధముగా నన్ను ఓంకార స్వరూపముగా అభివర్ణించుచున్నారు అని అథర్వణ వేదము చెప్పెను. అథర్వణ వేదము చెప్పిన విషయమును ఋగ్యజుస్సామ వేదములలోని వేలాది శాఖలు మరియు ఇతర విజ్ఞాన శాఖలు కూడ సమర్థించినవి (52). వేదములు ఈ విధముగా రూపు దాల్చి స్వయముగా చెప్పుచున్ననూ, వారిద్దరు ఆ సత్యమును స్వప్నములో దర్శించబడిన పదార్థములను వలె నిశ్చయముగా తెలుసుకొన లేకపోయిరి (53). వారిద్దరి అజ్ఞానమును పొగొట్టి, జ్ఞానమును బోధించుట కొరకై వేదములలో చెప్పబడిన విధముగా సర్వము లింగమునందు కూడ ముద్రితమయ్యెను (54). అపుడు ఆ విధముగా శివుని అనుగ్రహముచే లింగమునందు ముద్రించబడిన సర్వజ్ఞానమును చూచి, వారిద్దరు దేవతలు జ్ఞానమును పొంది ప్రసన్నమగు మనస్సులు గలవారు అయిరి (55). ఉత్పత్తిప్రళయములను, ఆరు మార్గముల యథార్థస్వరూపమును, వాటికి అతీతముగానుండే పరమధామమును, ఆ ధామమును అధిష్ఠించి ఉండే పురుషుని వారు తెలుసుకొనిరి (56). సర్వాతిశాయి, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు, ఈశ్వరుడు, అజ్ఞానులగు జీవులకు మరియు సంసారబంధములో నిండియున్న ఈ ప్రపంచమునకు సర్వకాలములలో ప్రభువు, దేనివలనైననూ సుతరాము భయము లేనివాడు, పెరుగుదల తగ్గుదల లేనివాడు, వినాశము లేనివాడు, బయట లోపల వ్యాపించి యుండువాడు, లోపల బయట అనే భేదము లేనివాడు, తనకంటె అధికుడు లేనివాడు, శాశ్వతకాలము జగత్తుకంటె జీవులకంటె విలక్షణునిగా నుండువాడు, ఆకారము లేనివాడు, ఇదమిత్థముగా నిర్దేశించ శక్యము కానివాడు, వాక్కులకు మనస్సునకు కూడ గోచరించని వాడు, చైతన్యఘనుడు, శాంతస్వరూపుడు, ప్రకాశస్వరూపుడు, ముక్కంటి అగు శివుని అపుడు ఆ బ్రహ్మవిష్ణువులు గుర్తెరింగినవారై, తలపై చేతులను జోడించి, భయపడుతూ ఇట్లు పలికిరి (57-61).

బ్రహ్మోవాచ|

అజ్ఞోవాహమభిజ్ఞో వా త్వయాదౌ దేవ నిర్మితః | ఈదృశీం భ్రాంతిమాపన్న ఇతి కో%త్రాపరాధ్యతి || 62

ఆస్తాం మమేదమజ్ఞానం త్వయి సన్నిహితే ప్రభో | నిర్భయః కో%భిభాషేత కృత్యం స్వస్య పరస్య వా || 63

ఆవయోర్దేవదేవస్య వివాదో%పి హి శోభనః | పాదప్రణామఫలదో నాథస్య భవతో యతః || 64

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ దేవా! నేను అజ్ఞానినో, జ్ఞానినో! ముందుగా నన్ను సృష్టించినది నీవే. నాకు ఇట్టి భ్రాంతి గలిగినది. దీని తప్పు ఎవరిది? (62) నా అజ్ఞానమునటుండనిమ్ము. ఓ ప్రభూ! ఒక పనిని చేసినవాడు తానే గాని, మరియొకడు గాని అగు గాక! నీవు సన్నిధిలోనుండిగా భయమును విడనాడి ఎవడు మాటలాడగలడు? (63) మా ఇద్దరి వివాదము దేవదేవుడవగు నీకు శోభ##యే అగుచున్నది. దానివలన మాకు నాథుడవగు నీ పాదములకు మొక్కేఫలము లభించినది (64).

విష్ణురువాచ|

స్తోతుం దేవ న వాగస్తి మహిమ్నస్సదృశీ తవ | ప్రభోరగ్రే విధేయానాం తూష్ణీంభావో వ్యతిక్రమః || 65

కిమత్ర సంఘటేత్కృత్యమిత్యేవావసరోచితమ్‌ | అజానన్నపి యత్కించిత్ర్పలప్య త్వాం నతో%స్మ్యహమ్‌ || 66

కారణత్వం త్వయా దత్తం విస్మృతం తవ మాయయా | మోహితో%హంకృతశ్చాపి పునరేవాస్మి శాసితః || 67

విజ్ఞాపితైః కిం బహుభిర్భీతోస్మి భృశమీశ్వర | యతో%హమపరిచ్ఛేద్యం త్వాం పరిచ్ఛేత్తుముద్యతః || 68

త్వాముశంతి మహాదేవం భీతానామార్తినాశనమ్‌ | అతో వ్యతిక్రమం మే%ద్య క్షంతుమర్హసి శంకర || 69

ఇతి విజ్ఞాపితస్తాభ్యామీశ్వరాభ్యాం మహేశ్వరః | ప్రీతో%నుగృహ్య తౌ దేవౌ స్మితపూర్వమభాషత || 70

విష్ణువు ఇట్లు పలికెను -

ఓ దేవా! నీ మహిమకు తగ్గ విధముగా నిన్ను స్తుతించుటకు నోటినుండి మాట వచ్చుట లేదు. ప్రభువు యెదుట సేవకులు మిన్నకుండుట ఆపరాధమే యగును (65). ఇట్టి స్థితిలో కర్తవ్యమేమి? అను విషయము మాత్రమే ఈ సందర్భములో గమనించ తగియున్నది. నేను అజ్ఞానముచే ఏదో ఒకటి వాగినాను. నీకు నేను నమస్కరించుచున్నాను (66). నీవు నాకు జగత్కారణత్వము అనే స్థాయిని ఇచ్చినావు. కాని, నీ మాయచే నేను దానిని మరచి, మోహమును పొంది, అహంకారమును పొందినాను. అట్టి నన్ను మరల నీవు దారిలో పెట్టితివి (67). ఓ ప్రభూ! ఇన్ని విన్నపములతో పని యేమి? నాకు చాల భయము వేయుచున్నది. ఏలయనగా, నేను దేశకాలవస్తుపరిచ్ఛేదములు లేని నీ ప్రమాణమును నిర్ధారించుటకు సంసిద్ధుడనైనాను (68). నీవు మహాదేవుడవనియు, భయపడి యున్న వారి దుఃఖమును పోగొట్టెదవనియు నిన్ను వేదములు సుత్తించుచున్నవి. ఓ శంకరా! కావున, నీవు నా అపరాధమును మన్నించ తగుదువు (69). వారిద్దరు దేవనాయకులు ఈ విధముగా విన్నవించగా, మహేశ్వరుడు సంతసిల్లి. దేవతలగు వారిద్దరినీ అనుగ్రహించి, చిరునవ్వుతో నిట్లు పలికెను (70).

ఈశ్వర ఉవాచ |

వత్స వత్స విధే విష్ణో మాయయా మమ మోహితౌ | యువాం ప్రభుత్వే%హంకృత్య బద్ధవైరౌ పరస్పరమ్‌ || 71

వివాదం యుద్ధపర్యంతం కృత్వా నోపరతౌ కిల | తతశ్ఛిన్నా ప్రజాసృష్టిర్జగత్కారణభూతయోః || 72

అజ్ఞానమానప్రభవాద్వైమత్యాద్యువయోరపి | తన్నివర్తయితుం యుష్మద్దర్పమోహౌ మయైవ తు || 73

ఏవం నివారితావద్య లింగావిర్భావలీలయా | తస్మాద్భూయో వివాదం చ వ్రీడాం చోత్సృజ్య కృత్స్నశః || 74

యథాస్వం కర్మ కుర్యాతాం భవంతౌ వీతమత్సరౌ | పురా మమాజ్ఞయా సార్ధం సమస్త జ్ఞానసంహితాః || 75

యువాభ్యాం హి మయా దత్తా కారణత్వప్రసిద్ధయే | మంత్రరత్నం చ సూత్రాఖ్యం పంచాక్షరమయం పరమ్‌ || 76

యమోపదిష్టం సర్వం తద్యువయోరద్య విస్మృతమ్‌ | దదామి చ పునస్సర్వం యథాపూర్వం మమాజ్ఞయా || 77

యతో వినా యువాం తేన న క్షమౌ సృష్టిరక్షణ | ఏవముక్త్వా మహాదేవో నారాయణపితామహౌ || 78

మంత్రరాజం దదౌ తాభ్యాం జ్ఞానసంహితయా సహ | తౌ లబ్ధ్వా మహతీం దివ్యామాజ్ఞాం మాహేశ్వరీం పరామ్‌ || 79

మహార్థం మంత్రరత్నం చ తథైవ సకలాః కలాః | దండవత్ర్పణతిం కృత్వా దేవదేవస్య పాదయోః || 80

అతిష్ఠతాం వీతభయావానందాస్తిమితౌ తదా | ఏతస్మిన్నంతరే చిత్రమింద్రజాలవదైశ్వరమ్‌ || 81

ఈశ్వరుడిట్లు పలికెను-

ఓ కుమారా! బ్రహ్మా! కుమారా! విష్ణూ! మీరిద్దరు నా మాయచే మోహమును పొందితిరి. మీరిద్దరు అధికారమును పొంది దాని వలననే అహంకారమును పెంచుకొని, ఒకరితోనొకరు వైరమునకు పూనుకొనిరి (71). యుద్ధమును చేసే స్థాయి వరకు కలహమును పెంచుకొని, అప్పటికి కూడ మీరు విరమించ లేదు. మీరిద్దరు జగత్తునకు కారణమైనవారు. మీ వివాదము కారణముగా జగత్కార్యము భగ్నమైనది (72). మీ ఇద్దరి మధ్యలో అజ్ఞానము వలన మరియు అహంకారము వలన వివాదము చెలరేగినది. దానిని నివారించుటకు, మరియు మీ ఇద్దరి గర్వమును మోహమును అడంచుటకు నేను (73) ఈ విధముగా ఈనాడు లీలచే లింగరూపముగా ఆవిర్భవించి, మీ యుద్ధమును ఆపితిని. కావున, మీరు మరల వివాదమునకు ఒడిగట్టకుడు. ఆ విషయమై కలిగిన లజ్జను పూర్తిగా విడిచి పెట్టుడు (74). పరస్పరము మాత్సర్యమును విడనాడి మీరిద్దరు మీ మీ కర్తవ్యములను నెరవేర్చుడు. పూర్వము నేను మీకు మీ కార్యములను గురించి ఆజ్ఞలను జారీ చేయుటతో బాటు, మీలో జగత్కారణత్వము సక్రమముగా సిద్ధించుట కొరకై సకలజ్ఞానసంహితలను, సూత్రము అనబడే సకలమంత్రరాజమగు పంచాక్షరమంత్రమును కూడ మీకు ఇచ్చియుంటిని (75,76). కాని, నేను చేసిన ఉపదేశమునంతనూ మీరిద్దరు మరచితిరి. నేనే మరల పూర్వములో చేసిన విధముగానే నా ఆజ్ఞతో బాటు ఆ సర్వమును కూడ ఇచ్చెదను (77). అవి లేనిదే మీరిద్దరు సృష్టికార్యమును, స్థితికార్యమును చేయజాలరు. మహాదేవుడు బ్రహ్మవిష్ణువులతో ఈ విధముగా పలికి (78). వారిద్దరికి గొప్ప అర్థము గల మంత్రరాజమును జ్ఞానసంహితను ఇచ్చెను. వారిద్దరు గొప్పది, దివ్యమైనది, సర్వశ్రేష్ఠమైనది అగు మహేశ్వరుని ఆజ్ఞను, మహార్థము గల మంత్రరాజమును, అదే విధముగా సకలకళలను స్వీకరించి, ఆ దేవదేవుని పాదములకు సాష్టాంగనమస్కారమును చేసి (79,80), అప్పుడు తొలగిన భయము గలవారై, ఆనందముతో ప్రసన్నమైన మనస్సులు గలవారై నిలబడిరి. ఇంతలో ఈశ్వరుడు అచట ఇంద్రజాలమువంటి విచిత్రమునొక దానిని చేసెను (81).

లింగం క్వాపి తిరోభూతం న తాభ్యాముపలభ్యతే | తతో విలప్య హాహేతి సద్యః ప్రణయభంగతః || 82

కిమసత్యమిదం వృత్తమితి చోక్త్వా పరస్పరమ్‌ | అచింత్యవైభవం శంభోర్విచింత్య చ గతవ్యథౌ || 83

అభ్యుపేత్య పరాం మైత్రీమాలింగ్య చ పరస్పరమ్‌ | జగద్వ్యాపారముద్దిశ్య జగ్మతుర్దేవపుంగవౌ || 84

తతః ప్రభృతి శక్రాద్యాస్సర్వ ఏవ సురాసురాః | ఋషయశ్చనరా నాగా నార్యశ్చాపి విధానతః |

లింగప్రతిష్ఠాం కుర్వంతి లింగే తం పూజయంతి చ || 85

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివలింగావిర్భావవర్ణనం నామ పంచత్రింశో%ధ్యాయః (35).

ఆ లింగము ఎక్కడనో మాయమయ్యెను వారిద్దరికి అది దొరకలేదు. అపుడు వారు వెనువెంటనే వారి ప్రీతికి భంగము కలుగుట వలన, అయ్యో! అయో! అని విలపించిరి (82). ఎంతటి దురదృష్టము దాపురించినది! అని వారు ఒకరితో నొకరు చర్చించుకొనిరి. వారు ఊహుకు అందని శంభుని వైభవమును తలపోసి దుఃఖమును విడనాడిరి (83)| వారిద్దరు దేవనాయకులు పరమమైత్రిని పొందినవారై, ఒకరినొకరు కౌగిలించుకొని, జగత్కార్యమును చేయుట కొరకై వెళ్లిరి (84). ఆ నాటినుండియు ఇంద్రుడు మొదలగు దేవతలు, రాక్షసులు ఋషులు, మానవులు, నాగులు, స్త్రీలతో సహా అందరు యథావిధిగా లింగమును ప్రతిష్ఠించి, ఆ లింగమునందు శివుని ఆరాధించుచున్నారు (85).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివలింగావిర్భావమును వర్ణించే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

Siva Maha Puranam-4    Chapters