Siva Maha Puranam-4    Chapters   

అథ షట్త్రింశో%ధ్యాయః

శివలింగమును ప్రతిష్ఠించే విధానము

శ్రీకృష్ణ ఉవాచ |

భగవాన్‌ శ్రోతుమిచ్ఛామి ప్రతిష్ఠావిధిముత్తమమ్‌ | లింగస్యాపి చ బేరస్య శివేన విహితం యథా || 1

శ్రీకృష్టుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! లింగమును మరియు శివుని మూర్తిని ప్రతిష్ఠించే విధానమును శివుడు ఏ విధముగా విధించియున్నాడో, ఆ ఉత్తమమగు విధానమును గురించి నేను వినగోరుచున్నాను (1).

ఉపమన్యు రువాచ |

అనాత్మప్రతికూలే తు దివసే శుక్లపక్షకే | శివశాస్త్రోక్తమార్గేణ కుర్యాల్లింగం ప్రమాణవత్‌ || 2

స్వీకృత్యాథ శుభస్థానం భూపరీక్షాం విధాయ చ | దశోపచారాన్‌ కుర్వీత లక్షణోద్ధారపూర్వకాన్‌ || 3

తేషాం దశోపచారాణాం పూర్వం పూజ్య వినాయకమ్‌ | స్థానశుద్ధ్యాదికం కృత్వా లింగం స్నానాలయం నయేత్‌ || 4

శలాకయా కాంచనయా కుంకుమాది రసాక్తయా | లక్షితం లక్షణం శిల్పశాస్త్రేణ విలిఖేత్‌ తతః || 5

అష్టమృత్సలిలైర్వాథ పంచమృత్సలిలైస్తథా | లింగం పిండికయా సార్ధం పంచగవ్యైశ్చ శోధయేత్‌ || 6

సవేదికం సమభ్యర్చ్య దివ్యాద్యం తు జలాశయమ్‌ | నీత్వాధివాసయేత్తత్ర లింగం పిండికయా సహ || 7

అధివాసాలయే శుద్ధే సర్వశోభాసమన్వితే | సతోరణ సావరణ దర్భమాలాసమావృతే || 8

దిగ్గజాష్టకసంపన్నే దిక్పాలాష్టఘటాన్వితే | అష్టమంగలకైర్యుక్తే కృతదిక్పాలకార్చితే || 9

తైజసం దారవం వాపి కృత్వా పద్మాసనాంకితమ్‌ | విన్యసేన్మధ్యతస్తత్ర విపులం పీఠికాలయమ్‌ || 10

ద్వారపాలాన్‌ సమభ్యర్చ్య భద్రాదీంశ్చతురః క్రమాత్‌ | సముద్రశ్చ విభద్రశ్చ సునందశ్చ వినందకః || 11

ఉపమన్యుపు ఇట్లు పలికెను -

సాధకుడు శుక్లపక్షమునందు తనకు ప్రతికూలము కాని రోజున శివశాస్త్రములో చెప్పిన పద్ధతిలో సరియగు ప్రమాణముతో లింగమును చేయవలెను (2). తరువాత శుభమగు స్థలమును ఎంచుకొని భూమిని పరీక్షించి, భూమియందలి మంచి లక్షణములు ప్రకటమగునట్లు చేసే పది ఉపచరములను చేయవలెను (3). ఆ పది ఉపచారములకు పూర్వమునందే వినాయకుని పూజించి, స్థానశుద్ధి మొదలగు వాటిని చేసి, లింగమును స్నానమును చేయించే గదిలోనికి తీసుకు వెళ్లవలెను (4). తరువాత కుంకుమ మొదలగు చూర్ణములతో తయారు చేసిన ద్రవములో బంగరు పుల్లను ముంచి దానితో శిల్పశాస్త్రములో చెప్పిన విధముగా గుర్తులను పెట్టవలెను (5). ఎనిమిది లేక అయిదు రకముల మట్టిని కలిపిన నీళ్లతో మరియు పంచగవ్యములతో లింగమును పీఠముతో సహా శుద్ధి చేయవలెను. (6). లింగమును వేదికతో సహా చక్కగా పూజించి, దానిని వేదికతో సహా, సహజముగా ఏర్పడినది గాని, లేక ఇతరమగు జలాశయము వద్దకు తీసుకువెళ్లి, దానిలో అధివాసము (ముంచి ఉంచుట) ను చేయవలెను (7). పరిశుద్ధమైనది, సకలశోభలతో కూడినది, తోరణములు గలది, పై కప్పు మరియు తెరలు గలది, దర్భమాలలతో చుట్టువారబడి యున్నది. ఎనిమిది దిక్కులలో ఏనుగుల బొమ్మలతో అలంకరించ బడినది, ఎనిమిది దిక్పాలకుల కలశములతో కూడియున్నది, ఎనిమిది మంగళద్రవ్యములతో కూడియున్నది, చేయబడిన దిక్పాలకపూజ గలది అగు అధివాసపు గదియందు (8,9). పద్మపు ఆసనము చిత్రించబడిన విశాలమైన బంగరు లేక చెక్క పీటను చేసి, దాని మధ్యలో లింగపీఠమును ఉంచవలెను (10). సముద్రుడు, విభద్రుడు, సునందుడు, వినందకుడు అనే నలుగురు ద్వారపాలకులను, వీరభద్రుడు మొదలగు నలుగురిని వరుసగా చక్కగా పూజించవలెను (11).

స్నాపయిత్వా సమభ్యర్చ్య లింగం వేదికయా సహ | సకూర్చాభ్యాం తు వస్త్రాభ్యాం సమావేష్ట్య సమంతతః || 12

ప్రాపయ్య శనకైస్తోయం పీఠికోపరి శాయయేత్‌ | ప్రాక్శిరస్కమధస్సూత్రం పిండికాం చాస్య పశ్చిమే || 13

సర్వమంగలసంయుక్తం లింగం తత్రాధివాసయేత్‌ | పంచరాత్రం త్రిరాత్రం వాప్యేకరాత్రమథాపి వా || 14

విసృజ్య పూజితం తత్ర శోధయిత్వా చ పూర్వవత్‌ | సంపూజ్యోత్సవమార్గేణ శయనాలయమానయేత్‌ || 15

తత్రాపి శయనస్థానం కుర్యాన్మండలమధ్యతః | శుద్ధైర్జలైస్స్నాపయిత్వా లింగమభ్యర్చయేత్ర్కమాత్‌ || 16

ఐశాన్యాం పద్మమాలిఖ్య శుద్ధలిప్తే మహీతలే | శివకుంభం శోధయిత్వా తత్రావాహ్య శివం యజేత్‌ || 17

వేదిమధ్యే సితం పద్మం పరికల్ప్య విధానతః | తస్య పశ్చిమతశ్చాపి చండికాపద్మమాలిఖేత్‌ || 18

క్షౌమాద్యైర్వాహతైర్వసై#్త్రః పుషై#్పర్దర్భైరథాపి వా | ప్రకల్ప్య శయనం తస్మిన్‌ హేమపుష్పం వినిక్షిపేత్‌ || 19

తత్ర లింగం సమానీయ సర్వమంగలనిస్స్వనైః | రక్తేన వస్త్రయుగ్మేన సకూర్చేన సమంతతః || 20

సహ పిండికయావేష్ట్య శాయయేచ్చ యథా పురా | పురస్తాత్పద్మమాలిఖ్య తద్దలేషు యథాక్రమమ్‌ || 21

విద్యేశకలశాన్న్యస్యేన్మధ్యే శైవీం చ వర్ధనీమ్‌ | పరీత్య పద్మత్రితయం జుహుయుర్ద్విజసత్తమాః || 22

లింగమును వేదికతో సహా అభిషేకించి చక్కగా పూజించి, చుట్టూ దర్భ పిడికిళ్లతో కూడిన రెండు వస్త్రములతో అందముగా చుట్టి (12). మెల్లగా నీటిపాత్రలోని నీటిలో ఉంచి, పీటపై అధివాసము కొరకు ఉంచవలెను. లింగముయొక్క శిరస్సు తూర్పువైపు, దాని క్రింద సూత్రము, పీఠము పశ్చిమము వైపు ఉండునట్లుగా (13), సకలమంగళద్రవ్యములతో కూడియున్న లింగమును అచట అయిదు, లేక మూడు, లేక ఒక రాత్రి అధివాసము కొరకై ఉంచవలెను (14). నిర్మాల్యమును అక్కడనే విడిచి పెట్టి లింగమును పూర్వమునందు వలెనే శుద్ధి చేసి, చక్కగా పూజించి, ఊరేగింపు మార్గము గుండా శయనగృహమునకు తీసుకు రావలెను (15). అక్కడ మండలమునకు మధ్యలో శయనస్థానమును ఏర్పాటు చేయవలెను. లింగమును పరిశుద్ధమగు నీటితో అభిషేకించి, క్రమముగా పూజించవలెను (16). ఈశాన్యదిక్కునందు పరిశుద్ధమగు స్థానమును తుడిచి శుభ్రము చేసి, పద్మమును ముగ్గు వేసి, శివకలశమును శుద్ధి చేసి, దానియందు శివుని ఆవాహన చేసి పూజించవలెను (17). వేదిమధ్యలో యథావిధిగా తెల్లని పద్మమును ముగ్గు వేసి, దానికి పశ్చిమమునందు చండికాపద్మమును ముగ్గు వేయవలెను (18). పట్టు మొదలగు వస్త్రములతో గాని, లేక ఉతికిన వస్త్రములతో గాని, పుష్పములతో గాని, లేదా దర్భలతో గాని శయ్యను ఏర్పాటు చేసి, దానిపై బంగరు పుష్పమును ఉంచవలెను (19). అచటకు సకలమంగళవాద్యములతో లింగమును తీసుకువచ్చి, దర్భ పిడికిలితో గూడిన ఎర్రని వస్త్రములతో పీఠముతో సహా అంతటా చుట్టి, పూర్వమునందు వలెనే శయనింప జేయవలెను. తూర్పునందు పద్మమును ముగ్గు వేసి, దాని దళములయందు వరుసగా (20,21) విద్యేశ్వరుల కలశములను ఉంచి, మధ్యలో శివునకు సంబంధించిన వర్ధనీ అనే కలశమును ఉంచవలెను. బ్రాహ్మణోత్తములు మూడు పద్మముల చుట్టూ హోమములను చేయవలెను (22).

తే చాష్టమూర్తయః కల్ప్యాః పూర్వాదిపరతః స్థితాః | చత్వారశ్చాథ వా దిక్షు స్వధ్యేతారస్సుజాపకాః || 23

జుహుయుస్తే విరించ్యాద్యాశ్చతస్రో మూర్తయస్స్మృతాః | దైశికః ప్రథమం తేషామైశాన్యాం పశ్చిమే%థ వా || 24

ప్రధానహోమం కుర్వీత సప్తద్రవ్యైర్యథాక్రమమ్‌ | ఆచార్యాత్పాదమర్ధం వా జుహుయుశ్చాపరే ద్విజాః || 25

ప్రధానమేకమేవాత్ర జుహుయాదథ వా గురుః | పూర్ణం పూర్ణాహుతిం హుత్వా ఘృతేనాష్టోత్తరం శతమ్‌ || 26

మూర్ధ్ని మూలేన లింగస్య శివహస్తం ప్రవిన్యసేత్‌ | శతమర్ధం తదర్ధం వా క్రమాద్ద్రవ్యైశ్చ సప్తభిః || 27

హుత్వా హుత్వా స్పృశేల్లింగం వేదికాం చ పునః పునః | పూర్ణాహుతిం తతో హుత్వా క్రమాద్దద్యాచ్చ దక్షిణామ్‌ || 28

ఆచార్యాత్పాదమర్ధం వా హోతౄణాం స్థపతేరపి | తదర్ధం దేయమన్యేభ్యస్సదస్యేభ్యశ్చ శక్తితః || 29

తతశ్శ్వభ్రే వృషం హైమం కూర్చం వాపి నివేశ్య చ | మృదంభసా పంచగవ్యైః పునశ్శుద్ధజలేన చ || 30

శోధితాం చందనాలిప్తాం శ్వభ్రే బ్రహ్మశిలాం క్షిపేత్‌ | కరన్యాసం తతః కృత్వా నవభిశ్శక్తినామభిః || 31

హరితాలాది ధాతూంశ్చ బీజగంధౌషధైరపి | శివశాస్త్రోక్తవిధినా క్షిపేద్ర్బహ్మ శిలోపరి || 32

చక్కని వేదాధ్యయనసంపన్నులు, జపనిష్టాపరులు అగు ఋత్విక్కులను తూర్పుతో మొదలిడి వరుసగా అష్టమూర్తులుగా (పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి) కల్పించవలెను. లేదా, నాలుగు మూర్తులను నాలుగు దిక్కులయందు కల్పించ వలెను (23). ఆ మూర్తుల స్థానములోనున్న ఋత్విక్కులు హోమములను చేయుదురు. బ్రహ్మవిష్ణురుద్రులు మరియు సదాశివుడు నాలుగు మూర్తులు అగుదురు. వారిలో బ్రహ్మస్థానమునందు గురువు ఈశాన్యమునందు (ఎనిమిది మూర్తులు ఉన్నపుడు) గాని, లేదా పశ్చిమమునందు (నలుగురు మూర్తులు ఉన్నప్పుడు) ఉన్నవాడై (24), ఏడు ద్రవ్యములతో క్రమముగా ప్రధానహోమమును చేయవలెను. మిగిలిన ఋత్విక్కులు ఆచార్యుడు చేసిన హోమసంఖ్యలో సగము గాని, నాల్గవ వంతు గాని హోమము చేయవలెను (25). లేదా, గురువు కేవలము ప్రధానహోమమును చేసిన చాలును. ఆయన ముందుగా పూర్ణాహుతిని చేసి, తరువాత నేతితో నూట యెనిమిది పర్యాయములు హోమము చేయవలెను (26). లింగము యొక్క శిరస్సుపై మూలమంత్రమునుచ్చరిస్తూ శివహస్తము (గురువుయొక్క హస్తమే శివహస్తముగా భావన చేయబడును) ను ఉంచవలెను. ఆయన మరల వరుసగా ఏడు ద్రవ్యములతో వంద, లేక ఏభై, లేక ఇరవై అయిదు ఆహుతులను హోమము చేసి, హోమము చేసిన ప్రతి పర్యాయము మరల మరల లింగమును మరియు పీఠమును చేతితో స్పృశించుచుండవలెను. తరువాత పూర్ణాహుతిని చేసి, వరుసగా దక్షిణలనీయవలెను (27,28). ఆచార్యునకు ఇచ్చే దక్షిణలో సగము గాని, నాల్గవ వంతు గాని హోమమును చేసిన ఋత్విక్కులకు మరియు శిల్పికి ఈయవలెను. యథాశక్తిగా దానిలో సగమును ఇతరసభాసదులగు విద్వాంసులకు ఈయవలెను (29). తరువాత గోతిలో బంగారముతో గాని, దర్భలతో గాని చేసిన వృషభమును ఉంచి, మట్టినీటితో, పంచగవ్యములతో మరియు శుద్ధజలముతో దానిని (30) శుద్ధి చేసి, గంధమును పూసి, గోతిలో బ్రహ్మశిల (శివలింగమును ఉంచుటకు తగిన రాయి) ను ఉంచవలెను. తరువాత తొమ్మిది శక్తినామములతో కరన్యాసమును చేసి (31), పసుపు మొదలగు పవిత్రద్రవ్యములను, బంగారము మొదలగు లోహములను, నవధాన్యములను, సుగంధద్రవ్యములను శివశాస్త్రములో చెప్పబడిన విధముగా బ్రహ్మశిలపై వేయవలెను (32).

ప్రతిలింగం తు సంస్థాప్య క్షీరం వృక్షసముద్భవమ్‌ | స్థితం బుద్ధ్వా తదుత్సృజ్య లింగం బ్రహ్మశిలోపరి || 33

ప్రాగుదక్ర్పవరాం కించిత్‌ స్థాపయేన్మూలవిద్యయా | పిండికాం చాథ సంయోజ్య శాక్తం మూలమనుస్మరస్‌ || 34

బంధనం బంధకద్రవ్యైః కృత్వా స్థానం విశోధ్య చ | దత్త్వా చార్ఘ్యం చ పుష్పాణి కుర్యుర్యవనికాం పునః || 35

యథాయోగ్యం నిషేకాది లింగస్య పురతస్తదా | ఆనీయ శయనస్థానాత్కలశాన్విన్న్యసేత్ర్కమాత్‌ || 36

మహాపూజామథారభ్య సంపూజ్య కలశాన్‌ దశ | శివమంత్రమనుస్మృత్య శివకుంభజలాంతరే || 37

అంగుష్ఠానామికాయోగాదాదాయ తముదీరయేత్‌ | న్యసేదీశానభాగస్య మధ్యే లింగస్య మంత్రవిత్‌ || 38

శక్తిం న్యసేత్తథా విద్యాం విద్యేశాంశ్చ యథాక్రమమ్‌ | లింగమూలే శివజలైస్తతో లింగం నిషేచయేత్‌ || 39

వర్ధన్యాం పిండికాలింగం విద్యేశ కలశైః పునః | అభిషిచ్యాసనం పశ్చాదాధారాద్యం ప్రకల్పయేత్‌ || 40

కృత్వా పంచకలాన్యాసం దీప్తం లింగమనుస్మరన్‌ | ఆవాహయేచ్ఛివౌ సాక్షాత్ర్పాంజలిః ప్రాగుదఙ్ముఖః || 41

ఆ లింగముపై మర్రి మొదలగు చెట్ల పాలను చల్లి, దానియందు శివుడు స్థిరముగా నున్నాడని భావన చేసి, దానిని పైకి లేపి బ్రహ్మ శిలపై (33) ఈశాన్యము వైపునకు కొంచెము అధికముగా నుండునట్లు మూలమంత్రమునుచ్చరిస్తూ నిలబెట్టవలెను. తరువాత శక్తియొక్క మూలమంత్రమును జపిస్తూ పీఠమును జతగూర్చి (34), బిగించి ఉంచే ద్రవ్యము (సిమెంటు?)లతో వాటిని గట్టిగా తాపడము చేసి, ఆ స్థానమును శుద్ధి చేసి, అర్ఘ్యమును పుష్పములను సమర్పించి, తెరన మూసి, మరల (35) యథావిధిగా అభిషేకము మొదలగు ఉపచారములను చేసి, తరువాత అధివాసస్థానమునుండి కలశములను తీసుకువచ్చి, వరుసగా లింగమునకు ఎదుట పెట్టవలెను (36). తరువాత మంత్రవేత్తయగు బ్రహ్మ మహాపూజను ఆరంభించి, పది కలశములను చక్కగా పూజించి, శివమంత్రమును జపిస్తూ శివకలశము లోపల బొటనవ్రేలిని అనామికను కలిపి ముంచి జలమును ఆ వ్రేళ్ల ముద్రతో పైకి తీసి చల్లి, లింగమునకు ఈశాన్యమునందు మధ్యలో న్యాసమును చేయవలెను (అనగా, మంత్రమునుచ్చరిస్తూ స్పృశించవలెను) (37,38). అదే విధముగా లింగమునకు మూలమునందు శక్తిన్యాసమును విద్యాన్యాసమును, విద్యేశన్యాసమును వరుసగా చేయవలెను. తరువాత శివకలశము, వర్ధని మరియు విద్యేశకలశములలోని నీటితో లింగపీఠమును అభిషేకించి, తరువాత ఆసనము, ఆధారము మొదలగు వాటిన ఏర్పాటు చేయవలెను (39,40). అయిదు కళల న్యాసమును చేసి ప్రజ్వరిల్లుచున్న లింగమును భావన చేయవలెను. ఈశాన్యము వైపునకు తిరిగి చేతులను జోడించి, సాక్షాత్తుగా పార్వతీపరమేశ్వరలను ఆవాహన చేయవలెను (41).

వృషాధిరాజమారుహ్య విమానం వా నభస్థ్సలాత్‌ | అలంకృతం సహాయాంతం దేవ్యా దేవమనుస్మరన్‌ |

సర్వాభరణశోభాఢ్యం సర్వమంగలనిస్స్వనైః || 42

బ్రహ్మవిష్ణుమహేశార్క శక్రాద్యైర్దేవదానవైః | ఆనందక్లిన్నసర్వాం గైర్విన్యస్తాంజలిమస్తకైః || 43

స్తువద్భి రేవ నృత్యద్భిర్నమద్భిరభితో వృతమ్‌ | తతః పంచోపచారాంశ్చ కృత్వా పూజాం సమాపయేత్‌ || 44

నాతః పరతరః కశ్చిద్విధిః పంచోపచారకాత్‌ | ప్రతిష్ఠాం లింగవత్కుర్యాత్ర్పతిమాస్వపి సర్వతః || 45

లక్షణోద్ధారసమయే కార్యం నయనమోచనమ్‌ | జలాధివాసే శయనే శాయయేత్తాం త్వధోముఖీమ్‌ || 46

కుంభోదశాయితాం మంత్రైర్హృది తాం సన్నియోజయేత్‌ | కృతాలయాం పరామాహుః ప్రతిష్ఠామకృతాలయాత్‌ || 47

శక్తః కృతాలయః పశ్చాత్ర్పతిష్ఠావిధిమాచరేత్‌ | అశక్తశ్చేత్ర్పతిష్ఠాప్య లింగం బేరమథాపి వా || 48

శ##క్తేరనుగుణం పశ్చాత్ర్పకుర్వీత శివాలయమ్‌ | గృహార్చాం చ పునర్వక్ష్యే ప్రతిష్ఠావిధిముత్తమమ్‌ || 49

శివుడు పార్వతితో గూడి నందీశ్వరుని లేదా, విమానమును అధిష్ఠించి ఆకాశమునుండి వచ్చుచున్నాడు. ఆయన సకలాభరణములతో అలంకరించుకొని శోభిల్లుచున్నాడు. సకలమంగళవాద్యములు మ్రోగుచున్నవి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు, రాక్షసులు, ఆనందాశ్రువులతో తడిసిన సకలావయములు గలవారై, తలలపై చేతులను జోడించినవారై, స్తోత్రములను పఠిస్తూ, నాట్యమును చేస్తూ, నమస్కరిస్తూ చుట్టువారి నడువగా ఆయన వచ్చేసినాడు. ఈ విధముగా మనస్సులో భావన చేయవలెను. తరువాత అయిదు ఉపచారములను చేసి, పూజను ముగించవలెను (42044). అయిదు ఉపచారముల కంటె గొప్ప పూజావిధి మరియొకటి లేదు. ప్రతిమలను ప్రతిష్ఠించే సందర్భములో కూడ విధి పూర్తిగా లింగమునకు వలెనే యుండును (45). ప్రతిమకు లక్షణములను పైకి ప్రకటించే సమయములో కళ్లను విప్పవలెను. ప్రతిమను జలాధివాసమునందు శయనముపై ముఖము క్రిందకు ఉండునట్లుగా పరుండబెట్టవలెను (46). శివకలశమునందలి జలములో అధివాసము చేసియున్న ప్రతిమను హృదయమునందు మంత్రములనుచ్చరిస్తూ స్పృశించవలెను. ఆలయమును నిర్మించకుండగా ప్రతిష్ఠను చేయుట కంటె, ఆలయమును నిర్మించి ప్రతిష్ఠను చేయుట శ్రేష్ఠము (47). శక్తి గలవాడు ఆలయమును నిర్మించి, తరువాత ప్రతిష్ఠావిధిని నిర్వర్తించవలెను. శక్తి లేనివాడైనచో, లింగమును గాని, ప్రతిమను గాని ముందుగా ప్రతిష్ఠించి (48), తరువాత శక్తికి తగ్గట్లుగా శివాలయమును కట్టవలెను. మరల నేను ఇంటిలో చేసే పూజను, ఉత్తమమగు ప్రతిష్ఠావిధిని చెప్పెదను (49).

కృత్వా కనీయసం బేరం లింగం వా లక్షణాన్వితమ్‌ | అయనే చోత్తరే ప్రాప్తే శుక్లపక్షే శుభే దినే || 50

వేదిం కృత్వా శుభే దేశే తత్రాబ్జం పూర్వవల్లిఖేత్‌ | వికీర్య పత్రపుష్పాద్యైర్మధ్యే కుంభం నిధాయ చ || 51

పరితస్తస్య చతురః కలశాన్‌ దిక్షు విన్యసేత్‌ | పంచ బ్రహ్మాణి తద్బీజైస్తేషు పంచసు పంచభిః || 52

న్యస్య సంపూజ్య ముద్రాది దర్శయిత్వాభిరక్ష్య చ | విశోధ్య లింగం బేరం వా మృత్తోయాద్యైర్యథాపురా || 53

స్థాపయేత్పుష్పసంఛన్నముత్తరస్థే వరాసనే | నిధాయ పుష్పం శిరసి ప్రోక్షయేత్ర్పోక్షణీజలైః || 54

సమభ్యర్చ్య పునః పుషై#్పర్జయశబ్దాదిపూర్వకమ్‌ | కుంభైరీశానవిద్యాంతైస్న్నాపయేన్మూలవిద్యయా || 55

తతః పంచకలాన్యాసం కృత్వా పూజాం చ పూర్వవత్‌ | నిత్యమారాధయేత్తత్ర దేవ్యా దేవం త్రిలోచనమ్‌ || 56

ఏకమేవాథ వా కుంభం మూలమంత్రసమన్వితమ్‌ | న్యస్య పద్మాంతరే సర్వం శేషం పూర్వవదాచరేత్‌ || 57

అత్యంతోపహతం లింగం విశోధ్య స్థాపయేత్పునః | సంప్రోక్షయేదుపహతం మనాగుహపతం యజేత్‌ || 58

లింగాని బాణసంజ్ఞాని స్థాపనీయాని వా న వా | తాని పూర్వం శివేనైవ సంస్కృతాని యతస్తతః || 59

శేషాణి స్థాపనీయాని యాని దృష్టాని బాణవత్‌ | స్వయముద్భూతలింగే చ దివ్యే చార్షే తథైవ చ || 60

అపీఠే పీఠమావేశ్య కృత్వా సంప్రోక్షణం విధిమ్‌ | యజేత్తత్ర శివం తేషాం ప్రతిష్ఠా న విధీయతే || 61

చిన్న మూర్తిని చేసి, లేదా సకలలక్షణములతో కూడిన లింగమును ప్రతిష్ఠించవలెను. ఉత్తరాయణము రాగానే శుక్లపక్షములో శుభదినమునాడు (50), శుభస్థానమునందు వేదికను నిర్మించి, అచట ఇదివరలో చెప్పిన విధముగా పద్మమును ముగ్గు వేయవలెను. ఆకులు, పువ్వులు మొదలగువాటిని చల్లి, మధ్యలో కలశమును పెట్టి (51), దానికి చుట్టూ నాలుగు దిక్కులయందు నాలుగు కలశములను పెట్టవలెను. ఆ అయిదు కలశములయందు సద్యోజాత మొదలగు అయిదుగురు బ్రహ్మలను ఆయా అయిదు బీజాక్షరములతో (52) న్యాసము చేసి, చక్కగా పూజించి, ముద్రలు మొదలగు వాటిని ప్రదర్శించి, కవచమంత్రముతో చుట్టూ రక్షణను కల్పించి, లింగమును లేదా ప్రతిమను ఇదివరలో చెప్పిన విధముగా మట్టి కలిపిన నీరు మొదలగు వాటితో శుద్ధి చేసి (53), ఉత్తరమునందున్న, పుష్పములను దట్టముగా పేర్చిన శ్రేష్ఠమగు ఆసనము నందు స్థాపించవలెను. దాని శిరస్సుపై పుష్పమునుంచి, ప్రోక్షణీపాత్రయందలి నీటిని చల్లవలెను (54). మరల జయధ్వానములను చేయుచూ పుష్పములతో చక్కగా పూజించి, శివకలశముతో మొదలిడి విద్యేశకలశముల వరకు గల కలశములలోని నీటితో మూలమంత్రమునుచ్చరిస్తూ అభిషేకమును చేయవలెను (55). తరువాత అయిదు కళల న్యాసమును చేసి, ఇదివరలో చేసిన విధముగానే పూజను చేయవలెను. ఆ స్థానములో నిత్యము పార్వతితో కూడియున్న ముక్కంటి దైవమును ఆరాధించవలెను (56). ఈ ప్రయోగములో ఒక వికల్పము గలదు. మూలమంత్రముతో ఒకే కలశమును పద్మమునకు మధ్యలో పెట్టి, మిగిలిన విధానమునంతనూ పైన చెప్పిన విధముగా చేయవలెను (57). బాగా పాడైపోయిన లింగమును పైకి తీసి సరిచేసి మరల ప్రతిష్ఠించ వలెను. కొద్దిగా పాడైన లింగమునకు సంప్రోక్షణమును చేయవలెను. చాల తక్కువగా దెబ్బ తిన్న లింగమునకు పూజను చేసిన చాలును (58). బాణలింగములు పూర్వమే శివునిచే సంస్కరింపబడియున్నవి. కావున, వాటి ప్రతిష్ఠ విషయములో మనకు స్వేచ్ఛ గలదు. అనగా, ప్రతిష్ఠావిధిని చేసినా, మానినా పరవాలేదు (59). బాణలింగమును పోలియున్న ఇతర లింగములను ప్రతిష్ఠించవలెను. స్వయంభూలింగము, దేవతలచే మరియు ఋషులచే ప్రతిష్ఠించబడిన లింగముల విషయములో కూడ వ్యవస్థ ఇదియే (60). పీఠము లేనిచో, పీఠమునమర్చి, సంప్రోక్షణమును చేసి, వాటియందు శివుని ఆరాధించవలెను. వాటికి ప్రతిష్ఠ అక్కరలేదని శాస్త్రము (61).

దగ్ధం శ్లథం క్షతాంగం చ క్షిపేల్లింగం జలాశ##యే | సంధానయోగ్యం సంధాయ ప్రతిష్ఠావిధిమాచరేత్‌ || 62

బేరాద్వా వికాలాల్లింగాద్దేవం పూజాపురస్సరమ్‌ | ఉద్వాస్య హృది సంధానం త్యాగం వా యుక్తమాచరేత్‌ || 63

ఏకాహపూజావిహతౌ కుర్యాద్ద్విగుణమర్చనమ్‌ | ద్విరాత్రే చ మహాపూజాం సంప్రోక్షణమతః పరమ్‌ || 64

మాసాదూర్ధ్వమనేకాహం పూజా యది విహన్యతే | ప్రతిష్ఠా ప్రోచ్యతే కైశ్చిత్కైశ్చిత్సంప్రోక్షణక్రమః || 65

సంప్రోక్షణ తు లింగాదేర్దేవముద్వాస్య పూర్వవత్‌ | అష్టపంచక్రమేణౖవ స్నాపయిత్వా మృదంభసా || 66

గవాం రసైశ్చ సంస్నాప్య దర్భతోయైర్విశోధ్య చ | ప్రోక్షయేత్ర్పోక్షణీతోయైర్మూలేనాష్టోత్తరం శతమ్‌ || 67

సపుష్పం సకుశం పాణిం న్యస్య లింగస్య మస్తకే | పంచవారం జహేన్మూలమష్టోత్తరశతం తతః || 68

తతో మూలేన మూర్ధాదిపీఠాంతం సంస్పృశేదపి | పూజాం చ మహతీం కుర్యాద్దేవమావాహ్య పూర్వవత్‌ || 69

అలబ్ధే స్థాపితే లింగే శివస్థానే జలే% థ వా | వహ్నౌ రవౌ తథా వ్యోమ్మి భగవంతం శివం యజేత్‌ || 70

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివలింగ ప్రతిష్ఠావిధివర్ణనం నామ షట్త్రింశో%ధ్యాయః (36).

లింగము తగులబడినచో, లేదా శిధిలమై ముక్కలు విడిపోయినచో, దానిని చెరువులో పారవేయవలెను. మరల దానిని బాగుగా చేసే అవకాశమున్నచో బాగు చేసి, ప్రతిష్ఠావిధిని చేయవలెను (62). విరిగిపోయిన ప్రతిమనుండి గాని, లింగమునుండి గాని శివుని పూజ చేసిన తరువాత ఉద్వాసన చెప్పి, హృదయమునందు సంధానము చేసుకొనవలెను. లేదా, యోగ్యమగు విధానములో దానిని పారవేయవలెను (63). ఒక రోజు పూజ ఆగిపోయినచో రెట్టింపు పూజను, రెండు రోజులు ఆగిపోయినచో మహాపూజను, అంతకంటె ఎక్కువ కాలము ఆగిపోయినచో, సంప్రోక్షణమును చేయవలెను (64). ఒకనెల కంటె ఎక్కువ కాలము పూజ ఆగిపోయినచో, మరల ప్రతిష్ఠను చేయవలెనని కొందరు మహర్షులు చెప్పగా, మరికొందరు సంప్రోక్షణమును విధించిరి (65). లింగము మొదలగు వాటికి సంప్రోక్షణమును చేసే సందర్భములో, పైన చెప్పిన విధముగా దేవునకు ఉద్వాసనను చెప్పి, ఎనిమిది కలశముల క్రమములో గాని, అయిదు కలశముల క్రమములో గాని, మట్టిని కలిపిన నీటితో అభిషేకించి (66), పాలతో కూడ చక్కగా అభిషేకించి, దర్భజలముతో శుద్ధి చేసి, ప్రోక్షణీపాత్రయందలి నీటిని మూలమంత్రముతో నూటయెనిమిది సార్లు చల్లి (67), పుష్పములు దర్భలు గల చేతిని లింగముపై ఉంచి, మూలమంత్రమును ముందు అయిదు సార్లు, తరువాత నూట యెనిమిది సార్లు జపించవలెను (68). తరువాత శిరస్సుతో మొదలు పెట్టి పీఠము వరకు స్పృశించవలెను. తరువాత ఇదివరలో చెప్పిన విధముగా దేవుని ఆవాహన చేసి, మహాపూజను చేయవలెను (69). ప్రతిష్ఠ చేయబడిన లింగము లభించనిచో సాధకుడు శివుని స్థానములగు నీటియందు గాని, అగ్నియందు గాని, సూర్యునియందు గాని, ఆకాశమునందు గాని శివభగావానుని ఆరాధించవలెను (70).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో ఉత్తరఖండ యందు శివలింగ ప్రతిష్ఠావిధిని వర్ణించే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).

Siva Maha Puranam-4    Chapters