Siva Maha Puranam-4
Chapters
అథ సప్తత్రింశోధ్యాయః అష్టాంగ యోగము శ్రీకృష్మ ఉవాచ | జ్ఞానే క్రియాయాం చర్యాయాం సారముద్ధృత్య సంగ్రహాత్ | ఉక్తం భగవతా సర్వం శ్రుతం శ్రుతిసమం మయా ||
1 ఇదానీం శ్రోతుమిచ్ఛామి యోగం పరమదుర్లభమ్ | సాధికారం చ సాంగం చ సవిధిం సప్రయోజనమ్ || 2 యద్యస్తి మరణం పూర్వం యోగాద్యనుపమర్దతః | సద్యస్సాధయితుం శక్యం యేన స్యాన్నాత్మహా నరః || 3 తచ్చ తత్కారణం చైవ తత్కాలకరణాని చ | తద్భేదతారతమ్యం చ వక్తుమర్హసి తత్త్వతః || 4 శ్రీకృష్టుడు ఇట్లు పలికెను - పూజ్యులగు మరు జ్ఞానము, విహితకర్మలు, జీవితములోని ఇతరచర్యలు అనువాటి సారమును పైకి తీసి సంగ్రహముగా చెప్పితిరి. వేదముతో సమానమగు ఈ విషయమునంతనూ నేను వింటిని (1). ఇప్పుడు అధికారి, అంగములు, విధి, ఫలము అనువాటితో కూడిన మిక్కిలి దుర్లభమగు యోగమును నేను వినగోరుచున్నాను (2). యోగము మొదలగు వాటి అభ్యాసము పూర్తి కాకముందే మానవుడు మరణించ వచ్చును. కావున, ఆత్మఘాతి కాకుండా కాపాడే, శీఘ్రముగా సిద్ధించే యోగవిధానమును చెప్పుము (3). యోగము, దాని మూలము, దాని కాలము, సాధనము, వాటిలోని భేదములు, హెచ్చుతగ్గులు అనువాటిని యథాతథముగా చెప్ప తగుదువు (4). ఉపమన్యురువాచ | స్థానే పృష్టం త్వయా కృష్ణ సర్వప్రశ్నార్థవేదినా | తతః క్రమేణ తత్సర్వం వక్ష్యే శృణు సమాహితః || 5 నిరుద్ధవృత్త్యంతరస్య శివే చిత్తస్య నిశ్చలా | యా వృత్తిస్స సమాసేన యోగస్స ఖలు పంచధా || 6 మంత్రయోగస్స్పర్శయోగో భావయోగస్తతాపరః | ఆభావయోగస్సర్వేభ్యో మహాయోగః పరో మతః || 7 మంత్రాభ్యాసవశేనైవ మంత్రవాచ్యార్థగోచరా | అవ్యాక్షేపా మనోవృత్తిర్మంత్రయోగ ఉదాహృతః || 8 ప్రాణాయామముఖా సైవ స్పర్శయోగోభిధీయతే | సమంత్రస్పర్శనిర్ముక్తో భావయోగః ప్రకీర్తితః || 9 విలీనావయవం విశ్వం రూపం సంభావ్యతే యతః | అభావయోగస్సంప్రోక్తో% నాభాసాద్వస్తునస్సతః || 10 శివస్వభావ ఏవైకశ్చింత్యతే నిరుపాధికః | యయా శైవమనోవృత్తిర్మహాయోగ ఇహోచ్యతే || 11 దృష్టే తథానుశ్రవికే విరక్తం విషయే మనః | యస్య తస్యాధికారోస్తి యోగే నాన్యస్య కస్యచిత్ || 12 విషయద్వయదోషాణాం గుణానామీశ్వరస్య చ | దర్శనాదేవ సతతం విరక్తం జాయతే మనః || 13 ఉపమన్యువు ఇట్లు పలికెను - ఓ కృష్ణా! సకలప్రశ్నలసారము నెరింగిన నీవు చక్కగా ప్రశ్నించితివి. కావున, నేను వరుసగా ఆ సర్వమును చెప్పెదను. సావధానముగా వినుము (5). ఇతరములగు వృత్తులన్నియు నిరోధింపబడిన మనస్సు శివునియందు నిశ్చలముగా లగ్నమై యున్నప్పుడు, ఆ వృత్తికి యోగమని పేరు. ఇది సంగ్రహముగా యోగనిర్వచనము. అది మంత్రయోగము, స్పర్శయోగము, భావయోగము, అభావయోగము మరియు మహాయోగము అని అయిదు విధములుగా నున్నది. మహాయోగము ఇతరయోగములన్నింటి కంటె శ్రేష్ఠమైనదని ఋషులచే చెప్పబడినది (6,7). మంత్రమును అభ్యసించుట (జపించుట) వలన మంత్రముచే బోధించబడే వస్తువునందు మనోవృత్తి విక్షేపము (చలనము) లేకుండగా నిలిచియుండును. దానికి మంత్రయోగమని పేరు (8). ఇట్టి మనోవృత్తి ప్రాణాయామము ప్రధానముగా గలదైనచో, దానికే స్పర్శయోగమని పేరు. దానియందు మంత్రముయొక్క స్పర్శ లేనిచో, అదియే భావయోగమనబడును (9). జగత్తులోని సమస్తరూపము విలీనమై యున్న మనోవృత్తికి అభావయోగమని పేరు. దానియందు ఉనికి గల వస్తుమాత్రముయొక్క భావము ఉండదు గనుక, దానికి ఆ పేరు వచ్చినది (10). ఏ మనోవృత్తిచే నిర్గుణశివస్వరూపము భావన చేయబడునో, అట్టి శివమయమగు మనోవృత్తికి మహాయోగమని పేరు (11). ఎవని మనస్సు కంటికి కనబడే మరియు చెవులకు వినబడే విషయభోగములయందు వైరాగ్యమును కలిగియుండునో, వానికి మాత్రమే యోగమునందు అధికారము గలదు. ఇతరులెవ్వరికీ లేదు (12). ఈ రెండు రకముల విషయభోగములలోని దోషములను మరియు ఈశ్వరుని గుణములను సర్వకాలములలో దర్శించుట వలన మాత్రమే మనస్సునకు వైరాగ్యము కలుగును (13). అష్టాంగో వా షడంగో వా సర్వయోగస్సమాసతః | యమశ్చ నియమశ్చైవ స్వస్తికాద్యం తథాసనమ్ || 14 ప్రాణాయామః ప్రత్యాహారో ధారణా ధ్యానమేవ చ | సమాధిరితి యోగాంగాన్యష్టావుక్తాని సూరిభిః || 15 ఆసనం ప్రాణసంరోధః ప్రత్యాహారోథ ధారణా | ధ్యానం సమాధిర్యోగస్య షడంగాని సమాసతః || 16 పృథగ్లక్షణమేతేషాం శివశాస్త్రే సమీరితమ్ | శివాగమేషు చాన్యేషు విశేషాత్కామికాదిషు || 17 యోగశాస్త్రేష్వపి తథా పురాణష్వపి కేషు చ | అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహః | యమ ఇత్యుచ్యతే సద్భిః పంచావయవయోగతః || 18 శౌచం తుష్టిస్తపశ్చైవ జపః ప్రణిధిరేవ చ | ఇతి పంచ ప్రభేదస్స్యాన్నియమస్స్వాంశ##భేదతః || 19 స్వస్తికం పద్మమధ్యేందుం వీరం యోగం ప్రసాధితమ్ | పర్యంకం చ యథేష్టం చ ప్రోక్తమాసనమష్టధా || 20 ప్రాణస్స్వదేహజో వాయుస్తస్యాయామో నిరోధనమ్ | తద్రేచకం పూరకం చ కుంభకం చ త్రిధోచ్యతే || 21 నాసికాపుటమంగుల్యా పీడ్యైకమపరేణ తు | ఔదరం రేచయేద్వాయం తథాయం రేచకస్స్మృతః || 22 బాహ్యేన మరుతా దేహం దృతివత్పరిపూరయేత్ | నాసాపుటేనాపరేణ పూరణాత్పూరకం మతమ్ || 23 న ముంచతి న గృహ్ణాతి వాయుమంతర్బహిః స్థితమ్ | సంపూర్ణం కుంభవత్తిష్టేదచలస్స తు కుంభకమ్ || 24 సంపూర్ణయోగములో ఎనిమిది అంగములు గలవు. సంక్షేపముగా చెప్పాలంటే, ఆరు అంగములు ఉండును. యమములు, నియమములు, స్వస్తికము మొదలగు ఆసనములు (14), ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనే ఎనిమిది యోగమునకు అంగములని పండితులు చెప్పుచున్నారు (15). అసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనే ఆరు సంక్షేపముగా యోగమునకు అంగములు (16), వీటికి వేర్వురుగా లక్షణములు శివశాస్త్రములో, శివాగమములయందు, ఇతరములగు ఆగమములయందు, విశేషించి కామిక మొదలగువాటియందు, యోగశాస్త్రములయందు, మరియు కొన్ని పురాణములయందు చెప్పబడినవి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే అయిదు కలిసి యమము అనబడునని మహాత్ములు చెప్పుచున్నారు (17,18). శౌచము, సంతోషము, తపస్సు, జపము, ఈశ్వరశరణాగతి అనే అయిదు అంశములు కలిసి నియమమగును (19). స్వస్తిక, పద్మ, అర్ధచంద్ర, వీర, యోగ, ప్రసాధిత, పర్యంక మరియు యథేష్ట (తనకు నచ్చిన) అని ఆసనములు ఎనిమిది రకములు గలవు (20). స్వీయదేహము లోపల ఉండే వాయువునకు ప్రాణమని పేరు. ఆయామమనగా దానిని నియంత్రించుట. అది రేచకము, పూరకము, కుంభకము అని మూడు విధములుగా నున్నది (21). ఒక ముక్కు రంధ్రమును వ్రేలితో నొక్కిపెట్టి, మరియొక రంధ్రముతో ఉదరము (ఊపిరితిత్తులు) నందలి వాయువును బయటకు గెంటి వేయుట అను ప్రక్రియకు రేచకము అని పేరు (22). బయటనుండే గాలితో దేహము (ఊపిరితిత్తులు) ను గాలితిత్తిని వలె నిండుగా రెండవ ముక్కు రంధ్రముతో పూరించవలెను. ఇట్లు నింపుట వలన దీనికి పూరకము అని పేరు వచ్చినది (23). లోపలి వాయువును విడిచి పెట్టకుండగా, బయటి వాయువును లోపలికి పీల్చకుండగా, నిండుకుండవలె కదలిక లేకుండగా నుండే స్థితికి కుంభకమని పేరు (24). రేచకాద్యం త్రయమిదం న ద్రుతం న విలంబితమ్ | తద్యతః క్రమయోగేన త్వభ్యసేద్యోగసాధకః || 25 రేచకాదిషు యోభ్యాసో నాడీశోధనపూర్వకః | స్వేచ్ఛోత్ర్కమణపర్యంతః ప్రోక్తో యోగానుశాసనే || 26 కన్యకాదిక్రమవశాత్ర్పాణాయామనిరోధనమ్ | తచ్చతుర్ధోపదిష్టం స్యాన్మాత్రాగుణవిభాగతః || 27 కన్యకస్తు చతుర్ధా స్యాత్స చ ద్వాదశమాత్రకః | మధ్యమస్తు ద్విరుద్ఘాతశ్చతుర్వింశతిమాత్రకః || 28 ఉత్తమస్తు త్రిరుద్ఘాతష్షడ్వింశన్మాత్రకః పరః | స్వేదకంపాదిజనకః ప్రాణాయామస్తదుత్తరః || 29 ఆనందోద్భవరోమాంచనేత్రాశ్రూణాం విమోచనమ్ | జల్పభ్రమణమూర్ఛాద్యం జాయతే యోగినః పరమ్ || 30 జానుం ప్రదక్షిణీకృత్య న ద్రుతం న విలంబితమ్ | అంగులీస్ఫోటనం కుర్యాత్సా మాత్రేతి ప్రకీర్తితా || 31 మాత్రాక్రమేణ విజ్ఞేయాశ్చోద్ఘాతక్రమయోగతః | నాడీవిశుద్ధిపూర్వం తు ప్రాణాయామం సమాచరేత్ || 32 అగర్భశ్చ సగర్భశ్చ ప్రాణాయోమో ద్విధా స్మృతః | జపం ధ్యానం వినా%గర్భస్సగర్భస్తత్సమన్వయాత్ || 33 అగర్భాద్గర్భసంయుక్తః ప్రాణాయామశ్శతాధికః | తస్మాత్సగర్భం కుర్వంతి యోగినః ప్రాణసంయమమ్ || 34 యోగసాధకుడు రేచకము మొదలగు ఈ మూడింటిని వాటియందు మనస్సును నిలిపి క్రమముగా కంగారు లేకుండా, అధికమగు విలంబము కూడ లేకుండా, అభ్యసించవలెను (25). రేచకము మొదలగు వాటిలో నాడీశోధనముతో మొదలిడి యోగి తన ఇచ్ఛచే దేహమును విడిచిపెట్టే యోగము వరకు గల అభ్యాసమును యోగానుశాసనము (పతంజలివిరచితము) బోధించుచున్నది (26). మాత్ర (కాలము) మరియు గుణము అనే విభాగమును బట్టి ఆ ప్రాణాయామము అనే వాయు నిరోధము కన్యక మొదలైన నాలుగు రకములుగా ఉపదేశించబడినది (27). ఆ నాలుగింటిలో కన్యక (కనిష్ఠ) యందు పన్నెండు మాత్రలు ఉండును. మధ్యమప్రాణాయమామములో రెండు ఉద్ఘాతము (నాభినుండి ప్రేరితమైన వాయువు శిరస్సు వరకు తన్నుట) లు, ఇరవై నాలుగు మాత్రలు ఉండును (28). ఉత్తమప్రాణాయామమునందు మూడు ఉద్ఘాతములు, ఇరవై ఆరు మాత్రలు ఉండును. దానికంటె గొప్పదియగు నాల్గవ ప్రాణాయామము చెమట పట్టుట, శరీరములో వణుకు మొదలగు వాటిని కల్గించును (29). యోగికి పరమానందము కలుగుటచే గుగుర్పాటు, కన్నుల వెంబడి నీరు ప్రవహించుట, జల్పము (అధికభాషణము), తల తిరుగుడు, మూర్ఛ మొదలగునవి కలుగును (30). (గురుసాహాయ్యము లేకుండగా వీటిని చేయరాదు--- అనువాదకుడు). ముంజేతిని కంగారు లేకుండగా, మరియు అధికమగు విలంబము చేయకుండగా ఒక ప్రదక్షిణముగా తిప్పి చిటికెను వేయుటకు పట్టే సమయమునకు మాత్ర అని పేరు (31). ప్రాణయమములో మాత్రలను బట్టి మరియు ఉద్ఘాతములను బట్టి పై భేదములు కలిగినవి. వీటిని చేయుటకు ముందు నాడీశుద్ధి ప్రాణాయామమును చేయవలెను (32). అగర్భము, సగర్భము అని ప్రాణాయామము రెండు విధములుగా నున్నది. జపము ధ్యానము లేనిది అగర్భము. వాటితో సమన్వయమును చెందియున్నది సగర్భము (33). అగర్భము కంటె సగర్భప్రాణాయామము వంద రెట్లు గొప్పది. గావుననే, యోగులు సగర్భప్రాణాయామమును చేయుచుందురు (34). ప్రాణస్య విజయాదేవ జీయంతే దేహవాయవః | ప్రాణో%పానస్సమానశ్చ హ్యుదానో వ్యాన ఏవ చ || 35 నాగః కూర్మశ్చ కృకలో దేవదత్తో ధనంజయః | ప్రయాణం కురుతే యస్మాత్తస్మాత్ర్పాణో%భిధీయతే || 36 అర్వాజ్ నయత్యపానాఖ్యో యదాహారాది భుజ్యతే | వ్యానో వ్యానశయత్యంగాన్యశేషాణి వివర్ధయన్ || 37 ఉద్వేజయతి మర్మాణీత్యుదానో వాయురీరితః | సమం నయతి సర్వాంగం సమానస్తేన గీయతే || 38 ఉద్గారో నాగ ఆఖ్యాతః కూర్మ ఉన్మీలనే స్థితః | కృకలః క్షవథౌ జ్ఞేయో దేవదత్తో విజృంభ##ణ || 39 న జహాతి మృతం చాపి సర్వవ్యాపీ ధనంజయః | క్రమేణాభ్యస్యమానోయం ప్రాణాయామః ప్రమాణవాన్|| 40 నిర్దహత్యఖిలం దోషం కర్తుర్దేహం చ రక్షతి | ప్రాణ తు విజితే సమ్యక్ తచ్చిహ్నాన్యుపలక్షయేత్ || 41 విణ్మూత్రశ్లేష్మణాం తావదల్పభావః ప్రజాయతే | బహుభోజనసామర్థ్యం చిరాదుచ్ఛ్వాసనం తథా || 42 లఘుత్వం శీఘ్రగామిత్వముత్సాహస్స్వరసౌష్ఠవమ్ | సర్వరోగక్షయశ్చైవ బలం తేజస్సురూపతా || 43 ధృతిర్మేధా యువత్వం చ స్థిరతా చ ప్రసన్నతా | తపాంసి పాపక్షయతా యజ్ఞదానవ్రతాదయః || 44 ప్రాణాయామస్య తసై#్యతే కలాం నార్హంతి షోడశీమ్ | ప్రాణాయామమును చేయు వ్యక్తి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయములనే దేహమునందలి వాయువులపై విజయమును పొందును. సర్వదా ప్రయాణమును చేయుచుండుటచే ప్రాణవృత్తికి ఆ పేరు వచ్చినది (35,36). మనము తినే ఆహారము మొదలగు వాటిని అపానము అనే వాయువు క్రిందకు నెట్టును. అన్ని అవయవములయందు వ్యాపించియుండి వాటిని వర్ధిల్లజేయునది వ్యానము (37). మర్మస్థానములకు ఉద్వేగమును కలిగించు వాయువునకు ఉదానమని పేరు. అవయవములన్నింటియందు సమానముగా సంచరించే వాయువు సమానము అనబడుచున్నది (38). లోపలినుండి పదార్థములు నోటిద్వారా బయటకు వచ్చునట్లు చేయు వాయువు నాగము అనబడును. కళ్లను తెరిచే వ్యాపారమునకు మూలములో గల వాయువు కూర్మము. తుమ్ముటకు, దగ్గుటకు హేతువు అగు వాయువు కృకలము. ఆవులించుటకు హేతువు దేవదత్తము (39). ధనంజయము అనే వాయువు శరీరమునంతనూ వ్యాపించియుండును. మానవుడు మరణించిననూ అది దేహమును విడువదు. అభ్యాసము చేయుచున్నచో, కాలక్రమములో ఈ ప్రాణాయామమునకు ఒక విశిష్టమగు కాలము వరకు చేసే స్థాయి కలుగును (40). అది అపుడు సాధకుని సకలదోషములను దహించివేసి, దేహమును రక్షించును. ప్రాణముపై విజయమును పొందిన సాధకునియందు ఆ చిహ్నములను చూడదగును (41). మలమూత్రములు, శ్లేష్మము తగ్గిపోవును. అధికమగు ఆహారమును తినే సామర్థ్యము కలుగును. శ్వాస మెల్లగా సాగుచుండును (42). శరీరము తేలిక యగును. సాధకుడు వేగముగా నడచును. అతనిలో ఉత్సాహశక్తి పెరుగును. ఆతని మాటలో మాధుర్యము ఒలుకుచుండును. రోగములన్నియు దూరమగును. బలము, బ్రహ్మవర్చస్సు, చక్కని అందమగు రూపము (43), ధైర్యము, జ్ఞాపకశక్తి, ¸°వనము, స్థైర్యము, మనస్సు ప్రసన్నముగా నుండుట అను లక్షణములు కలుగును. తపస్సులు, ప్రాయశ్చిత్తములు, యజ్ఞములు, దానములు వ్రతములు మొదలగునవి (44) అట్టి ప్రాణాయామముయొక్క పదునారవ కళను కూడ చేరుకోలేవు. ఇంద్రియాణి ప్రసక్తాని యథాస్వం విషయేష్విహ || 45 ఆహత్య యన్నిగృహ్ణాతి స ప్రత్యాహార ఉచ్యతే | మనః పూర్వాణీంద్రియాణి స్వర్గం నరకమేవ చ || 46 నిగృహీతాని సృష్టాని స్వర్గాయ నరకాయ చ | తస్మాత్సుఖార్థీ మతిమాన్ జ్ఞానవైరాగ్యమాస్థితః || 47 ఇంద్రియాశ్వాన్నిగృహ్యాశు స్వాత్మనాత్మానముద్ధరేత్ | ధారణా నామ చిత్తస్య స్థానబంధస్సమాసతః || 48 స్థానం చ శివ ఏవైకో నాన్యద్దోషత్రయం యతః | కాలం కం చావదీకృత్య స్థానే%వస్థాపితం మనః || 49 న తు ప్రచ్యవతే లక్ష్యాద్ధారణా స్యాన్న చాన్యథా | మనసః ప్రథమం స్థైర్యం ధారణాతః ప్రజాయతే || 50 తస్మాద్ధీరం మనః కుర్యాద్ధారణాభ్యాసయోగతః | ధ్యై చింతాయాం స్మృతో ధాతుశ్శివచింతా ముహుర్ముహుః || 51 అవ్యాక్షిప్తేన మనసా ధ్యానం నామ తదుచ్యతే | ధ్యేయావస్థితచిత్తస్య సదృశః ప్రత్యయశ్చ యః || 52 ప్రత్యయాంతరనిర్ముక్తః ప్రవాహో ధ్యానముచ్యతే | సర్వమన్యత్పరిత్యజ్య శివ ఏవ శివంకరః || 53 పరో ధ్యేయో% ధిదేవేశస్సమాప్తాథర్వణీ శ్రుతిః | తథా శివా పరా ధ్యేయా సర్వభూతగతౌ శివౌ || 54 ఇంద్రియములు తమ ఇచ్చవచ్చిన తీరున ఈ లోకములోని విషయభోగములయందు పూర్తిగా తగుల్కొని యుండును (45). వాటిని వెనుకకు లాగి నిగ్రహించుట ప్రత్యాహారమనబడును. మనస్సును పురస్కరించుకొని మాత్రమే ప్రవర్తిల్లే ఈ ఇంద్రియములు మనకు స్వర్గమును గాని, నరకమును గాని ఈయగలవు (46). వాటిని నియంత్రించినచో స్వర్గము, నిగ్రహించనిచో నరకము లభించును. కావున, సుఖమును కోరే బుద్ధిమంతుడగు మానవుడు జ్ఞానవైరాగ్యముల యందు స్థిరముగా నున్నవాడై (47), ఇంద్రియములనే గుర్రములను నిగ్రహించి, తన మనస్సుచే తనను శీఘ్రముగా ఉద్ధరించుకొనవలెను. సంక్షేపముగా చెప్పాలంటే, మనస్సును ఒకానొక స్థానమునకు కట్టవేయుటయే ధారణ అనబడును (48). ఆ స్థానము కూడ ఒక్క శివుడు మాత్రమే. మరియొకటి కాదు. ఏలయనగా, ఇతరములయందు మూడు దోషముల గలవు. ఒక నియమితకాలమును హద్దుగా పెట్టుకొని, మనస్సును ఒక స్థానమునకు కట్టివేసి (49), తన లక్ష్యమునుండి అది జారిపోని విధముగా దానిని నిలబెట్టినచో, అది ధారణ సిద్ధించినట్లగును. అట్లు నిలబడనిచో, ధారణ ఇంకనూ సిద్ధించ లేదు. మనస్సులో ముందుగా స్థిరత్వము ధారణ వలన కలుగును (50). కావున, ధారణను అభ్యసించుట ద్వారా యోగసాధకుడు మనస్సును ధీరము చేయవలెను. ధ్యైచింతాయామ్ అని పాణిని మహర్షి ధాతుపాఠములో చెప్పినాడు. ఇటునటు చెదరిపోని మనస్సుతో మరల మరల శివుని గురించి ఆలోచించుట ధ్యానమనబడును. ధ్యేయమగు వస్తువునకు కట్టివేయబడిన మనస్సుయొక్క సమానమగు ఏ వృత్తి గలదో (51,52), అట్టి ఏ వృత్తియందు ఇతరప్రత్యయములు (ఆలోచనలు) అడ్డు రావో, అట్టి సమానప్రత్యయప్రవాహమునకు ధ్యానమని పేరు. ఇతరమును సర్వమును విడిచి పెట్టి, కేవలము మంగళకరుడు మరియు దేవదేవుడు అగు పరమశివుని మాత్రమే ధ్యానము చేయవలెనని చెప్పి అథర్వణవేదము సమాప్తమైనది. అనగా, అది ఆ వేదము యొక్క పరమనిర్ణయము. అదే విధముగా పరాశక్తియగు పార్వతిని కూడ ధ్యానము చేయవలెను. పార్వతీపరమేశ్వరులు సర్వభూతముల యందు ఉన్నారు (53,54). తౌ శ్రుతౌ స్మృతిశాస్త్రేభ్యస్సర్వగౌ సర్వదోదితౌ | సర్వజ్ఞా సతతం ధ్యే¸° నానారూపవిభేదతః || 55 విముక్తిః ప్రత్యయః పూర్వః ప్రత్యయశ్చాణిమాదికమ్ | ఇత్యేతద్ద్వివిధం జ్ఞేయం ధ్యానస్యాస్య ప్రయోజనమ్ || 56 ధ్యాతా ధ్యానం తథా ధ్యేయం యచ్చ ధ్యానప్రయోజనమ్ | ఏతచ్చతుష్టయం జ్ఞాత్వా యోగం యుంజీత యోగవిత్ || 57 జ్ఞానవైరాగ్యసంపన్నః శ్రద్దధానః క్షమాన్వితః | నిర్మమశ్చ సదోత్సాహీ ధ్యాతేత్థంపురుషస్స్మృతః || 58 జపాచ్ఛ్రాంతః పునర్ధ్యాయేద్ధ్యానాచ్ర్ఛాంతః పునర్జపేత్ | జపధ్యానాభియుక్తస్యక్షిప్రం యోగః ప్రసిద్ధ్యతి || 59 ధారణా ద్వాదశాయామా ధ్యానం ద్వాదశధారణమ్ | ధ్యానద్వాదశకం యావత్సమాధిరభిధీయతే || 60 సమాధిర్నామ యోగాంగమంతిమం పరికీర్తితమ్ | సమాధినా చ సర్వత్ర ప్రజ్ఞాలోకః ప్రవర్తతే || 61 యదర్థమాత్రనిర్భాసం స్తిమితోదధివత్ స్థితమ్ | స్వరూపశూన్యవద్భానం సమాధిరభిధీయతే || 62 ధ్యేయే మనస్సమావేశ్య పశ్యేదపి చ సుస్థిరమ్ | నిర్వాణానలవద్యోగీ సమాధిస్థః ప్రగీయతే || 63 న శృణోతి న చాఘ్రాతి న జల్పతి న పశ్యతి | న చ స్పర్శం విజానాతి న సంకల్పయతే మనః || 64 న వాభిమన్యతే కించిద్బుధ్యతే న చ కాష్ఠవత్ | ఏవం శివే విలీనాత్మా సమాధిస్థ ఇహోచ్యతే || 65 యథా దీపో నివాతస్థస్స్పందతే న కదాచన | తథా సమాధినిష్ఠో%పి తస్మాన్న విచలేత్సుధీః || 66 ఏవమభ్యసతశ్చారం యోగినో యోగముత్తమమ్ | తదంతరాయా నశ్యంతి విఘ్నాస్సర్వే శ##నైశ్శనైః || 67 ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే అష్టాంగ యోగవర్ణనం నామ సప్తత్రింశో%ధ్యాయః (37). పార్వతీపరమేశ్వరులు సర్వవ్యాపకులు, సర్వకాలములలో చేతనస్వరూపులు, సర్వమును తెలిసినవారు, అనేకరూపముల భేదమును బట్టి సర్వకాలములలో ధ్యానము చేయదగిన వారు అని వేదములు మరియు స్మృతులు ఘోషించుచున్నవి (55). ఈ ధ్యానమునకు రెండు ప్రయోజనములు గలవని తెలియవలెను. వాటిలో మొదటిది మోక్షము కాగా, రెండవది అణిమ మొదలగు సిద్ధులు (56). ధ్యానమును చేయువాడు, ధ్యానము, ధ్యానములో విషయము అగు వస్తువు, ధ్యానము యొక్క ప్రయోజనము అనే నాలుగింటిని తెలుసుకొని యోగము తెలిసిన సాధుకుడు యోగమును అభ్యసించవలెను (57). జ్ఞానము వైరాగ్యము అనునవి సమృద్ధముగా గలవాడు, శ్రద్ధావంతుడు, సహనశక్తి గలవాడు, మమకారము లేనివాడు, సర్వకాలములలో ఉత్పాహముగా నుండువాడు అగు వ్యక్తి సరియగు ధ్యాత (ధ్యానమును చేయువాడు) అని మహర్షులు చెప్పుచున్నారు (58). సాధకుడు జపమును చేసి అలసినప్పుడు ధ్యానమును, ధ్యానమును చేసి అలసినప్పుడు జపమును చేయవలెను. జపము మరియు ధ్యానము అను రెండింటిలో నిష్ణాతుడైన వ్యక్తికి యోగము శీఘ్రముగా సిద్ధించును (59). పన్నెండు ప్రాణాయామములు (అంత సమయము మనస్సుయొక్క ఏకాగ్రత) ధారణ అగును. పన్నెండు ధారణలు ధ్యానము, పన్నెండు ధ్యానములు సమాధి అగును (60). యోగాంగములో ఆఖరుది సమాధి. సమాధిచే యోగికి సర్వత్రా ప్రజ్ఞాదృష్టి ప్రసరించును (61). ధ్యేయవస్తువు మాత్రమే భాసిస్తూ, అనగా పరిచ్ఛిన్నుడగు ధ్యాత విలీనమై, చేతనపురుషుడు నిశ్చలమగు మహాసముద్రము వలె నుండి, ధ్యానక్రియయొక్క స్వరూపము కూడ లేదా యన్నట్లు భాసించే స్థితికి సమాధి అని పేరు (62). సాధకుడు మనస్సును ధ్యేయవస్తువునందు లగ్నము చేసి, సుస్థిరముగా దానిని దర్శించవలెను. యోగి సమాధియందు ఆరిపోయిన నిప్పువలె (నిరుద్ధమైన చిత్తవృత్తులు గల వాడై) ఉండునని కీర్తించబడినది (63). ఆయన వినడు, మూర్కొనడు, మాటలాడడు, చూడడు, ఆయనకు స్పర్శజ్ఞానము ఉండదు. ఆయన మనస్సులో సంకల్పములు ఉండవు (64). ఆయన యందు ఏ విధమైన అభిమానము ఉండదు. ఆయన బుద్ధి ద్వారా దేనినీ తెలియకుండగా, కట్టెవలె స్థిరముగా నుండును. ఈ విధముగా శివునియందు విలీనమైన మనస్సు గలవాడు సమాధి యందున్నవాడని ఈ ప్రకరణములో చెప్పబడినది (65). గాలి లేనిచోట ఉండే దీపములో కదలిక లేశ##మైననూ ఉండదు. అదే విధముగా యోగనిష్ఠుడగు వ్యక్తి కూడ సమాధిలో నుండగా మనస్సు ఆ స్థితి నుండి కొంచెమైననూ చలించరాదు (66). ఈ విధముగా యోగమును అభ్యసించు యోగికి శీఘ్రముగా ఉత్తమమగు యోగము సిద్ధించును యోగసిద్ధికి గల అటంకములు, విఘ్నములు అన్నీ మెల్లమెల్లగా నశించును (67). శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో అష్టాంగ యోగమును వర్ణించే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది (37).